గజల్-ఎదురుచూసి

-జ్యోతిర్మయి మళ్ళ 

ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను

ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను

సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను

సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను  

సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను 

మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను 

తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యెను

విరహబాధకోర్వలేని హ్రుదయమింక బరువయ్యెను 

వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యెను

ప్రియుని రాక కానరాక గుండెకిపుడు గుబులయ్యెను 

ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యెను

ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యెను 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.