యాత్రాగీతం(మెక్సికో)

కాన్ కూన్ 

-డా||కె.గీత

భాగం-3

కాన్ కూన్  ఎయిర్పోర్టు  అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు  హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. 

అప్పటికే మేం బయటికెళ్లే ముందు పక్కకి ఆగి మా పాకేజీలో భాగమైన పికప్ టాక్సీ కి ఫోను చెయ్యడానికి నంబరు కోసం రిసీట్ లో చూడాలని అనుకుంటూ నడుస్తున్నాం.

ఇంతలో ఈమె కనబడి పలకరించడంతో  “మేం ఫోను చెయ్యకుండా ఈమెనే టాక్సీ స్టాండ్ వివరాలు అడిగితే సరిపోతుంది కదా!” అనుకుని “పోనీలే ఈమెవరో బానే అడిగిందని” దగ్గిరికెళ్లాం.

ముందుగా నేనామెని అడిగేను “కాస్ట్కో పాకేజీ లో హోటల్ టాక్సీ పికప్ కి ఎక్కడికి వెళ్లాలి?” అని.

ఆమె చెపుతాను ఇలా నా డెస్కు దగ్గిరికి రండి అంటూ తీసుకెళ్లి, “ఇదేనా మొదటిసారి రావడం?” అని స్పానిషు యాసలోని ఇంగ్లీషులో అడిగింది.

అవునని మేం తలూపగానే “వెల్ కమ్ టు కాన్కూ న్”  అని కొన్ని సరదా కబుర్లు చెప్పి, “రేపు ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు?” అంది.  

“మేం ఇంకా ఏమీ అనుకోలేదు” అన్నాం.

అయితే మీకు చాలా చవకగా మూడు టూర్లు కలిపి  తక్కువ ప్రైస్ లో ఇస్తాను వివరాలు చూడండి అంటూ  చార్టు మా ముందు పెట్టి, స్కెచ్ పెన్నుతో గీతలు చుడుతూ ఏవో చూపించసాగింది.

అప్పటికప్పుడు తీసుకుంటేనే ఆఫర్ ఉంటుంది అంది పైగా. ఆన్ లైనులో మేం చూసిన కంటే బాగా తక్కువకి ఆమె ఆఫర్ చేస్తూ ఉంది, పైగా అప్పుడే కొనుక్కుంటే ఇక ఉదయం టూరుకి వెళ్లొచ్చనే ఉద్దేశ్యంతో తీసుకుందామనుకున్నాం. కానీ ఎందుకైనా మంచిదని ఒక టూరు చాలని చెప్పేం. 

ఇక టూరు టిక్కెట్ల పేమెంటు కార్డు కాకుండా కాష్ గానీ, చెక్ గానీ ఇమ్మంది. నాకు కొంచెం అనుమానం వచ్చి, “మా దగ్గిర కాష్ ఎక్కువ లేదు” అని యాభై డాలర్లు ఇచ్చి, “మిగతాది రేపు టూరు దగ్గిర పే చేస్తాం” అని చెప్పేను గొప్ప తెలివిగా. ఆమె వెంటనే ఒప్పుకుంది. 

“కానీ ఒక మాట, మీరు బాలెన్సు కట్టేకనే టూరు టిక్కెట్లు ఇస్తారు మీకు, ఇక పొద్దున్నే మిమ్మల్ని మా డ్రైవరు పికప్ చేసుకుని మా రిసార్టు కి తీసుకెళ్తాడు, అక్కడ మీరు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చెయ్యొచ్చు. అక్కడే బ్యాలన్సు కట్టి టిక్కెట్లు తీసుకోవచ్చు” అంది. 

“మీ రిసార్టు ఎక్కడుంది?” అనడిగేం.  

మాప్ తీసి, “ఇదిగో ఇది మీ హోటలు, ఇక్కడ మా రిసార్టు ” అని చిన్న గీత గీసింది. 

చాలా చిన్న మేప్ కావడంతో అందులో చూస్తే పక్క వీధిలా కనిపించింది. 

రిసీటు ఇస్తూ “అయితే చివరగా ఒక మాట, మీరు ఎక్కడికి వెళ్లేదీ ఎవరితో చెప్పకండి” అంది. 

దాంతో సత్యకి అనుమానం వచ్చి ఇదేమైనా “టైం షేరింగ్ విషయమా” అన్నాడు. 

ఆమె “అబ్బే, అలాంటిదేమీ లేదు” అని తేలిగ్గా నవ్వి “మీకు టూరు వద్దనుకుంటే మీ డబ్బులు వాపసు రేపైనా కూడా తీసుకోవచ్చు” అని,

 “మీరిద్దరూ హనీమూన్ జంటలా ఉన్నారు కానీ, పిల్లలు ఉన్నట్లే లేరు” అంటూ  మాటమార్చి మమ్మల్ని అయిసు చేసేసింది. 

ఇక కాస్ట్కో పికప్ బయటికి వెళ్లేక దగ్గర్లోనే ఉంటుందని చెప్పింది.

నేను “సరేలే ఆమె చెప్పేదేవిటో కూడా చూద్దాం. మరో రిసార్టు చూసినట్టూ  ఉంటుంది. పైగా ఒక్కటే టూరు కొన్నాం, ఎక్కువ అడ్వాన్సు కూడా ఏవీ కట్టలేదు కదా!” అని తేలిగ్గా తీసుకోమని సత్యకి సర్ది చెప్పేను.

ఇంతకీ బయటికి రాగానే అర్థమైన విషయం ఏవిటంటే అది చాలా చిన్న ఎయిర్ పోర్టని. మేం ఇంటర్నేషల్ ఎయిర్పోర్టుల లెవెల్లో ఊహించుకుని, బయట వెతుక్కోవడం కష్టమని అప్పటివరకు ఆయాసపడ్డాం. 

తీరా చూస్తే చిన్న బస్టాండు బయటికి వచ్చినట్లు ఒక పొడవైన ప్లాట్ ఫారమ్మీద నడిచి ఎదురుగా “కాస్ట్కో” అని రాసి ఉన్న యూనీఫారం మనుషులిద్దర్ని చూడగానే “అనవసరంగా ఆమె దగ్గిర ఆగి సమయం వృథా చేసుకున్నాం” అని అనుకున్నాం. వాళ్లిద్దరూ తప్ప అక్కడ పిట్టమనిషి లేడు. 

ఎయిర్పోర్టు బయటకి అడుగుపెట్టగానే వాతావరణం అచ్చం హైదరాబాదులో దిగినట్లు ఉంది వెచ్చగా. 

కాలిఫోర్నియాలో చలి దుస్తులు తీసేసి, హాయిగా తిరగగలిగే వెచ్చదనాన్ని చూడగానే పిల్లలు కేరింతలు కొట్టేరు.

అచ్చు ఇండియాలో దిగినట్లు ఉందని మురిసిపోయాం. కాకపోతే జనమే లేరు, అంతే.

అక్కణ్ణించి హోటలుకి దాదాపు గంటన్నర  పాటు ప్రయాణం చేసేం. బీచ్ రోడ్డులో ఉన్న హోటలు జోన్ లో మా “బీచ్ పాలెస్” హోటల్లో రాత్రి పన్నెండుగంటల వేళ చెకిన్ అయ్యేం.

అప్పటికి అన్నీ మూసేసి ఉండడం వల్ల మాకు తినడానికి ఏమీ దొరకలేదు.

నిజానికి కాలిఫోర్నియా టైములో అది రాత్రి తొమ్మిది గంటల వేళ కావడంతో అందరికీ బాగా ఆకలేస్తూ ఉంది. 

దార్లో డాలస్ ఎయిర్పోర్టులో కొన్న తినుబండారాలు, ఇంటి నుంచి తెచ్చిన బిస్కెట్లు అప్పుడు పనికొచ్చేయి. 

ఇక మా గది “సూట్” కావడం వల్ల మంచాల పక్కనే గదిలో మూడో వంతు భాగంలో  స్పా- టబ్ ఉంది. అద్దాల పార్టీషను, ఓపెన్ సింక్స్, బాల్కనీ తెరవగానే ఎనిమిదో అంతస్థులోంచి కింద ఎదురుగా వెన్నెల పరుచుకున్న అందమైన కెరటాల అనంత జలధి. 

ఓహ్, అత్యద్భుతంగా ఉందక్కడ! అయితే ఉదయం ఎనిమిది కల్లా బయటికెళ్లాల్సి ఉండడంతో ఆస్వాదనని మర్నాటికి వాయిదా వేసి నిద్రకుపక్రమించాం. 

 

భాగం-4

అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయం ఏడున్నరకే మేం హోటలు లాబీలోకి వచ్చి హడావిడిగా బ్రేక్ ఫాస్టు కానిచ్చేం.  

ముందు రోజు ఆమె ” మీ హోటలు బయట 8 గంటల కల్ల మా వ్యాను మీ కోసం వేచి ఉంటుంది, ఎవరు అడిగినా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకండి” అని చెప్పింది. 

“ఎందుకు?” అని సత్య వెంటనే అడిగేడు.

ఆమె తేలిగ్గా నవ్వి, “ఇక్కడంతా కాంపిటీషను కదా” అన్న విషయం జ్ఞాపకం వచ్చింది. 

ఇక లాబీలో మమ్మల్ని చూస్తూనే అక్కడే లోకల్ టూరిజం బూత్ లో ఉన్న వ్యక్తి మా దగ్గిరికి వచ్చి “ఎక్కడికి వెళ్తున్నారు?” అన్నాడు.

అందులో దాచాల్సింది మాకేమీ కనబడలేదు. మా దగ్గిర ముందు రోజు ఆమె మా దగ్గిర యాభై డాలర్లు పుచ్చుకుని ఇచ్చిన రిసీటు చూపించేం.  

అతను వెంటనే నాతో రండి, “మీకు ఇంత కంటే మంచి ఆఫరు నేను చూపిస్తాను” అని పై అంతస్థులోకి తీసుకెళ్లేడు. 

అరగంట కూచోబెట్టేక మరొకతను వచ్చి మొట్టమొదటగా “మీరు అమెరికాలో ఎందుకు ఉంటున్నారు? అనడిగేడు.

“ఉద్యోగరీత్యా” అన్న మా సమాధానం విని ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లిపోయి మొదటి అతన్ని పంపించేడు.

ఇదంతా మాకు విసుగ్గా అనిపించసాగింది.

ఇంతలో ఆమె మాకు ఫోన్ల మీద ఫోన్లు చెయ్యసాగింది.

మేం “మాకు మరి కాస్త సమయం పడుతుంది” అని చెప్పసాగేం.

మొత్తానికి మొదటి వాడు వచ్చి మా రిసీటు చేతిలో పెట్టి, “సారీ, మీకు మేం ఏమీ ఆఫర్లు ఇవ్వలేం. మీరు ఆమె చెప్పిన చోటికే వెళ్లండి” అని చెప్పేడు.

ఇక అప్పటికే సత్యకి విషయం అర్థమయ్యినట్లు, “పోతే పోయాయిలే యాభై డాలర్లు. మనం ఇక అటు కూడా వెళ్లొద్దు” అన్నాడు.

కానీ మేం అప్పటికి ఏమీ ప్లాను చేసుకోనందున ఆ రోజు ఏం చెయ్యాలో పాలుపోలేదు కాసేపు.

ఇక నేనే “అసలు డబ్బులు గురించి కాకపోయినా ఆమె టూర్లలో తగ్గింపు ఇస్తానని చెప్పింది కదా, పైగా నచ్చక పోతే మన యాభై మనకి వాపసు ఇస్తామని కూడా చెప్పింది, ఒక సారి వెళ్లొస్తే పోయేదేముంది” అని బయలుదేరదీసేను.

హోటలు డ్రైవ్ వే బయట రోడ్డుని ఆనుకుని ఉన్న బస్టాపుకి వచ్చి, ఆమెకి ఫోను చేసేం “మేం వచ్చాం, వెహికిల్ పంప”మని  

“పది నిమిషాల్లో ఒకతను వచ్చి దారిన పోయే టాక్సీ ఆపి, “మమ్మల్ని ఎక్కించుకుని ఫలానా చోటికి తీసుకు  వెళ్లమని, డబ్బులు మా దగ్గిర తీసుకోవద్దని” అతనితో స్పానిషులో చెప్పి మాతో అదే విషయం ఇంగ్లీషులో చెప్పేడు.

ఆమె ముందు రోజు మాకు చూపించిన మ్యాపులో ఈ రెండు ప్రదేశాల మధ్య దాదాపు పది నిమిషాల దూరం ఉన్నట్లు చూపించింది.

మేం ఉన్న హోటలు జోను లోనే ఆ రిసార్టు ఉన్నట్లు అనుకున్నాం. 

తీరా టాక్సీ ఎక్కి గంటైనా మేం దిగాల్సిన ప్రదేశం రాదే.

“దేశం కాని దేశంలో ఎక్కడికెళ్తున్నామో” అర్థం కాని పరిస్థితిలో ప్రయాణం చేస్తుండగా చెప్పకపోవడవేం, నాకు కాస్త భయం కూడా వేసింది. 

మొత్తానికి ఒక పెద్ద రిసార్టు మలుపు తిరిగింది కారు.

అప్పుడు కాస్త స్థిమితంగా అనిపించింది మాకు.

కారు రిసార్టు లోపల టాక్సీ స్టాండులో ఆగంగానే అక్కడున్న రెండు మూడు కౌంటర్లలో ఉన్న రిసెప్షను వారు “మరెవరితోనో ఫోనులో మాట్లాడి, మాకు వివరాలు చెప్పడానికి మరెవరో వస్తారు, వేచి ఉండండి” అని చెప్పేరు. 

దాదాపు అరగంట తర్వాత ఒకతను వచ్చి రిసార్టంతా తిప్పే చిన్న ట్రాము బండి ఎక్కించేడు మమ్మల్ని.

అప్పటికే ఎండ ప్రతాపం చూపిస్తున్నందున కౌంటర్లో ఇచ్చిన వాటర్ బాటిల్సు అన్నీ తాగేసేం.

సిరి పేచీ మొదలుపెట్టేసింది. ట్రాము ఎక్కేక కాస్త ఊరుకుంది.

మాతో బాటూ వచ్చిన గైడు మమ్మల్ని ఒక చోట దించి “రండి ముందు బ్రేక్ ఫాస్టు చేద్దురు” అన్నాడు.

అప్పటికే పదయ్యింది. అందరికీ ఆకలేస్తూంది. అతని కూడా మారు మాట్లాడకుండా నడిచేం. 

బ్రేక్ ఫాస్టు ఏరియా మేమున్న రిసార్టులాగే దాదాపు యాభై అరవై రకాల స్పెషల్ ఐటంస్ తో టేస్టు బావున్నట్టనిపించింది. బహుశా: అప్పటికి సరిగ్గా అందరం ఆకలితో ఉన్నందువల్లనేమో.

ఇది కాగానే రిసార్టు అంతా తిప్పి చూపిస్తాను ముందుగా అన్నాడతను.

ఎండ తీవ్రంగా కాస్తూంది. పైగా సముద్రతీరం అది. ఒకపక్క  సిరి అడుగు తీసి అడుగు వెయ్యటానికి పేచీ పెట్టేస్తూంది.

రిసార్టు అంతా తిరిగి చూడలేమనీ, ముఖ్యమైనవేవో చూపించమని చెప్పేం.

సరే కాటేజీలు చూపిస్తాను అని పక్క బిల్డింగు లోకి దారితీసేడు.

కింది అంతస్థులోనే డబల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము కాటేజీలు చూపించేడు. అవీ ఒక మోస్తరు గానే ఉన్నాయి.

దానికానుకుని ఎదురుగా ఉన్న స్విమ్మింగు పూల్ దాటి సముద్రం ఒడ్డుకి దారితీసేడు.

ఇక అక్కడ కనబడ్డ మొదటి కుర్చీలో ఎక్కి కూచుని సిరి కదలని భీష్మించడంతో చేసేదేం లేక వరుని కాపలా పెట్టి మేమిద్దరం అతని వెంట నడిచేం.

కొబ్బరి, పాం వృక్షాలతో తీరంలో పరిచిన బీచ్ కుర్చీలతో తీరం అందంగా ఉంది. 

నీళ్లలోకి కట్టిన చిన్న బ్రిడ్జిలు, చివర కూర్చుని చూసేందుకు కట్టిన పందిర్లతో ఇంకా సుందరంగా ఉంది. 

మా గైడు మమ్మల్ని ఒక  బ్రిడ్జి మీదికి ఎక్కించి కింద నీట్లోకి చూడమన్నాడు.

అడుగు, రెండడుగుల లోతులో అత్యంత శుభ్రంగా, తేటగా ఉన్న నీళ్ల కింద గుండ్రని రాళ్లు, తెల్లని ఇసుకతో అందమైన తీరం అది. సహజసిద్ధంగానే అలలు లేని సముద్రతీరం కావడంతో పిల్లలు కూడా భయ పడకుండా ఆడుకోవడానికి అనువుగా ఉంది. 

కానీ నెత్తిమాడే ఎండ వల్ల, పైగా సిరిని, వరుని వదిలి రావడం వల్ల ఎక్కడా నిమిషం నిలబడలేక వెనక్కి వచ్చేసేం. 

మా పరిస్థితి చూసి పిల్లల దగ్గరే మమ్మల్నీ కూచోబెట్టి అతనెవర్నో పిలుచుకొస్తానని వెళ్లిపోయేడు.

ఇక అప్పటికి మాకు అర్థమైన విషయం ఏవిటంటే మేం బయటకు వెళ్లాలన్నా కూడా అతని సహాయం అవసరం అయినంత లోపలికెక్కడికో వచ్చేసామని.

సత్య బాధ చూడాలి. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నామని, సమయం అంతా ఇక్కడే వృథా అవుతూ ఉందని ఎంతో బాధ పడసాగేడు.

ఇదంతా టైం షేరింగు వ్యవహారమని అప్పటికే అర్థమైంది మాకు.

కానీ చేసేదేమీ లేక నీడన కూచుని చల్లని నీళ్లు తాగుతూ అతను తిరిగొచ్చే వరకూ కాలక్షేపం చేసేం.

మొత్తానికి అతను కొన్ని తెల్ల కాగితాలు పెన్ను పట్టుకొచ్చి రిసార్టు  మెంబర్ షిప్పు తీసుకుంటే ఏమేమి ఉచితమో చెప్పసాగేడు.

అందులో ఎంచుకున్న కాటేజీ సైజుని బట్టి మెంబర్ షిప్పు ఉంటుంది.

అరగంట మాట్లాడేక గానీ మధ్యలో ఎన్ని సార్లు అడిగినా మెంబరు షిప్పు ఎంతో చెప్పలేదు.

చిట్ట చివరికి అసలు చిన్న అంచనా అయినా చెప్పమని మేం పట్టుబట్టడంతో “నాతో రండి” అని కాస్త దూరంలో ఉన్న పెద్ద హాలులోకి తీసుకెళ్లేడు.

హాలు నిండా గుండ్రని బల్లలు, ప్రతి బల్లకు ఒక వైపు మాలాంటి యాత్రికులు మరో వైపు ఏజెంట్లతో రణగొణగా ఉందక్కడ.

ఒక పక్కగా ఉన్న పిల్లలు ఆడుకునే  ప్లే ఏరియా, పుస్తకాల దగ్గిరికి వరు, సిరి వెళ్లడం కాస్త ఉపశమనంగా అనిపించినా మాకు బొత్తిగా ఇష్టం లేని ఈ వ్యవహారం చికాకుగానే ఉంది. 

ఎవరేం చెప్పినా మేం మాత్రం అవసరం లేనివి కొనకూడదని ముందే నిర్ణయించుకోవడం వల్ల అతనికి తెగేసి చెప్పేసేం “రేటు ఎంతైనా మేం మెంబరు షిప్పుల వంటివి తీసుకోదల్చుకోలేదని” అయినా అతను మరొకతన్ని వెంట బెట్టుకొచ్చేడు.

అతను వస్తూనే మీకు ఉన్న ఆఫర్లు చెపుతాను బలవంతమేమీ లేదు అని మళ్లీ కాగితాల మీద బొమ్మలు గీస్తూ మొదలు పెట్టేడు. 

మళ్లీ అరగంట గడిచేక రేటు వరకూ రావడం మళ్లీ ఇంకొకతను రావడం ఇలా భలే విసుగు పుట్టించసాగేరు.

మొత్తానికి తేల్చిన విషయమేమిటంటే ఇది నెలకు $2000 డాలర్ల చొ||న ఒక సంత్సరం పాటు కడుతూ పోవాలి. 

లేదా ఒక్కసారే మొత్తం ఇరవై నాలుగు వేలు కట్టొచ్చు. దానిద్వారా రిసార్టుని పదేళ్ల పాటు నిర్దేశిత దినాల పాటు వాడుకోవచ్చు. 

ఇక లైఫ్ టైము షేరు అయితే తక్కువ, పది సంత్సరాలకైతే ఎక్కువ ఇలా ఏవేవో వివరాలు ఉన్నాయి. 

ముందుగా కొంత కట్టి బుక్ చేసుకుంటే మిగతాది ఇన్ స్టాల్మెంట్లలో కట్టొచ్చు. ఇక అందుకుగాను లోన్లు వగైరాలు వాళ్లే చూసి పెట్టడం వంటివి సరేసరి. ఇలా మెంబరుషిప్పు కడుతున్నందుకు గాను కట్టిన వారే గాక, వాళ్లు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా, ఎందరైనా రిసార్టు లో సంవత్సరానికి వారం పది రోజులు ఉచితంగా ఉండడమే కాక రిసార్టు సౌకర్యాలన్నిటినీ వాడుకోవచ్చు. భోజనాదులు ఉచితం. 

ఇలా చెప్పుకుపోతూంటే మొట్టమొదట వినడానికి చాలా బాగా అనిపిస్తుంది కానీ నెల నెలా కట్టాల్సింది తల్చుకుంటే గుండె గుభేల్ మంటుంది. అంతేకాక వాడినా వాడకపోయినా మెయింట్ నెన్సు ఛార్జీల వడ్డన. 

ఇంతకీ ఈ రిసార్టు ఉన్నది అమెరికాలో కాదు, మెక్సికోలో. ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి ఛార్జీలు, వీసాలు అంటూ పెద్ద కథ. 

అసలిక్కడ కొనడం మా లాంటి వారికి కుదరని పని అని చెప్పినా వదలరేం. 

ఒకరి తర్వాత మరొకరు వచ్చి మమ్మల్ని వేధించసాగేరు. 

చివరగా ఆ హాలు దాటి మేం వచ్చేస్తూ “హమ్మయ్య” అనుకుని వెనక వరండా వంటి ప్రదేశానికి రాగానే మరో పెద్ద మనిషి వచ్చి మళ్లీ “దయచేసి ఒక్క అయిదు నిమిషాలు నేను చెప్పేది వినండి, మీకు నచ్చకపోయినా నేనేమీ అనుకోను” అని అతను ఇటీవలే ఇండియా చూసొచ్చాడని, అతనికి మన దేశ సంస్కృతి అంటే 

చాలా ఇష్టమనీ ఏదేదో చెప్పి పరిచయం చేసుకున్నాడు. 

తర్వాత “మీరు రేటు చూసి భయపడుతున్నట్లున్నారు కాబట్టి మీ కోసం ఇవేళ సగానికి సగం తగ్గించేస్తున్నా” అన్నాడు. అంటే నెలకి వెయ్యి డాలర్లలన్నమాట.

మేం అయినా “వద్దు ఈ దేశంలో మేం కొనలేం” అని చెప్పినా వినిపించుకోకుండా పోనీ మరో సగం , మరో సగం అంటూ కనీసం నెలకు రెండు వందల యాభై డాలర్లు కట్టండి మీ కోసం 90% తగ్గించేను అనే సరికి సత్యకి ఇక బాగా చికాకు వచ్చేసింది. “అసలు మీరు చెప్పేదేవైనా అర్థం ఉందా? మాకు మీరు ఉచితంగా ఇచ్చినా వద్దు “ అంటూ చప్పున లేచి, “నడవండి” అని మమ్మల్ని తీసుకుని ముందుకు నడిచేడు. 

ఇక వెనక్కి చూడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్న మాకు వెనకే పరుగున ఒకతను వచ్చి లాబీకి తీసుకుని వచ్చేడు.  

నేను “మేం నిన్న కట్టిన యాభై ఎక్కడ తీసుకోవాలి?” అని అడిగేను. 

అతను లాబీ కౌంటరు చూపించి వెళ్లిపోయేడు. 

అక్కడ లైనులో నిలబడి మరో అరగంటకి యాభై డాలర్లు తీసుకుని రిసార్టు నుంచి మా హోటలుకు దించే  షటిల్ తీసుకుని మేం వెనక్కి వచ్చేసరికి మధ్యాహ్నం రెండయ్యింది.

అలా ఎయిర్పోర్టు లో బయటకు వచ్చేటప్పుడు పలకరించిన అమ్మాయి దగ్గిర ఆగడం అనే చిన్న తప్పు వల్ల మాకు ఒక రోజంతా వృథా అయిపోయింది.

ఇలా ఇంకెప్పుడూ కొత్త ప్రదేశానికి వెళ్లినా టైం షేరింగు బారిన పడకుండాఉండాలంటే ఎవరితోనూ మాట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం.

*****

(ఇంకా ఉంది) 

 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 



Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.