క’వన’ కోకిలలు – 2  

-నాగరాజు రామస్వామి

సరోజినీ నాయుడు

        ( ఫిబ్రవరి 13, 1879 – మార్చ్ 2, 1949 )         

 “Life is a prism of My light, And Death the shadow of My face.” – Sarojini Naidu

        The Nightingale of India ! 

          భారత నైటింగేల్ గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు అలనాటి క’వన’ కోకిల. హైదరాబాద్ లో జన్మించింది.  శ్రోత్రియ బ్రాహ్మణ బెంగాలీ. కవయిత్రి గానే కాక, స్వాతంత్ర సమర యోద్ధగా కూడా ఆమె ప్రసిద్ధికెక్కింది. బెంగాల్ విభజన సందర్భంలో జాతీయ ఉద్యమంలో చేరి, 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతను చేపట్టిన తొలి మహిళ ఆమె. 1917 లో భారత మహిళా సమాఖ్యను (Women’s Indian Association ) స్థాపించడంలో ఇతోధిక సహకారాన్ని అందించింది. 1915-1918 లలో పలు ప్రాంతాలలో పర్యటించి సాంఘిక సంక్షేమం పై, జాతీయ స్థాయిలో మహిళలను బలోపేతం చేసే మహిళాభ్యుదయం పై ప్రసంగించింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని జేలు కెళ్ళింది. ఆమె శుద్ధ జాతీయవాది. దేశ సమగ్ర ప్రగతికి మహిళాభ్యున్నతి అనివార్యమని ఆనాడే నమ్మిన మానవతావాది. హైదెరాబాద్ లో, చెన్నైలో, లండన్ లో, కాంబ్రిడ్జ్ లో చదివింది. తెలుగు వాడైన గోవిందరాజులు నాయుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్  లో స్థిరపడింది. Golden Threshold ఆమె తొలి కవితా సంకలనం. ఆమె తండ్రి అఘోర్ నాథ్ చటోపాధ్యాయ్ ( హైదరాబాద్ నిజామ్ కాలేజ్ తొలి ప్రిన్సిపాల్ ) నివసించిన గృహం ఇప్పుడు గోల్డెన్ త్రెషోల్డ్ పేరున హైదరాబాద్ విశ్వవిద్యాలయ అనుబంధ గృహంగా ఉంటున్నది. నేటికీ అక్కడ అనేక సభలు, సమావేశాలు, సాహిత్య సమ్మేళనాలు జరుగుతుంటవి. 

        ఆమె కవితా జీవనం కొనసాగింది భారత పునరుజ్జీవన సంధి కాలంలో. గాంధేయవాదం ఆమెను కొత్త పుంతలు తొక్కించింది. రొమాంటిక్ కవులైన  షెల్లీ, కీట్స్ లు ఆమెను అమితంగా ప్రభావితం చేశారు. భారతీయ తాత్వికతను, కృష్ణ ప్రణయ తత్వాన్ని ఆంగ్లం లోకి తేవాలని యత్నించింది.       

          ” Sarojini Naidu is a lyricist of delicate fancy and poignant melody ” – P.E.Dustoor.

         ఆమె కవితలలో ప్రణయం, మరణం, ఎడబాటు, తృష్ణ, జీవన రహస్య సమాలోచనం వంటి వైవిధ్య దృక్పథాలు భావ చిత్రాలుగా ప్రతిబింబించాయి;  కవితాత్మక , లయాత్మక , గాన యోగ్యమైన అభివ్యక్తి ఆమెను “భారత కోకిల”ను చేశాయి. ఆమెది మౌలికంగా పకృతి కవిత్వం. వాస్తవ దైవీయ భావ సమతుల్యంతో సాగే Wordsworth కవిత్వమూ కాదు, వైశ్విక దృక్కోణంలో దృష్టి సారించే రవీంద్రుని కవనమూ కాదు. ఆమె కవిత్వం బాల్యదృష్టితో పరిసరాలను వీక్షించి స్పందించిన భావుక స్పందనం. ప్రకృతిలోని సప్త వర్ణాలు ఆమె పంచప్రాణాలు. రంగులు రాగాలై ఆమె కవిత నిండా పరచుకున్నవి. ఆమెకు  “మావి పూల మకరందాన్ని దొంగిలిస్తున్న మధుప ఝ౦కారాలు, గాలి అలల మీద తేలుతున్న మిణుగురు గుంపులు ప్రేమదేవుని తంత్రీ వాద్యంపై రెపరెపలాడుతూ ఎగిసిపడుతున్న పసిడి తళుకుల్లా” కనిపిస్తవి. కొలను కమలాల చరణాలలో పైడి కింకిణులు, వెదురు పొదలలో వంశీ కృష్ణుని వేణుగానాలు వినిపిస్తవి. 

        ఆమె కవితలలో సున్నితమైన గుప్తత దాగి ఉంటుంది. కవితలో చొప్పించరాని భావాన్ని శీర్షికలో పొదుగుతుంది. రాత్రి అనే కవితకు శీర్షిక Leili అనే పర్షియన్ పదం. రాత్రి కేవలం రాత్రి కాదు, అది ప్రకృతి కొనసాగించే కళాత్మక కార్యం( Nocturne ) అని సూచన. ఇలా కవన సూక్ష్మాలు కోకొల్లలు. 

ఇవి ఆమె కొన్ని కవితలకు నా అనువాదాలు :  

  1.   శిశిర గీతం  

     ( Autumn Song )

విషాదం ఎద మీద ఒదిగిన

ఆనందంలా  

మబ్బుకు వేలాడుతున్నది 

మలిసంజ, 

శుష్కపత్రాల పసిడి ప్రోవును 

వణికిస్తున్న తుఫానులా 

మేఘం గుండెలో వీస్తున్నది

దురుసు దుమారం.

శిశిర కంఠ రవమేదో 

నా ఎదను 

గాలి గొంతుకతో పిలుస్తున్నది; 

అలసిసొలసి ఒంటరిదయింది 

నా బాధామయ హృదయం. 

రాలిన రెపరెపలాడే ఆకుల్లా 

నా కలలు నిష్క్రమించాయి;

మరి నా కెందుకు వెనుకంజ ?

        2 . రాత్రి 

           ( Leili ) 

ఇది నిశీథిని ! 

సర్పాలు 

గంజాయి మొక్కల మధ్య నిద్రిస్తున్నవి !

మిణుగురులు

చిరుతల నీరవ దారులను వెలిగిస్తున్నవి !

లేడి కూనలు మెలికల త్రోవలలో 

యథేచ్ఛగా సంచరిస్తున్నవి !

రంగు రంగు ఈకల రాచిలుక గూళ్లు

సాయంసంజకు కెంజలను అలదుతున్నవి ! 

సెలయేటి అలల మీద కోమల పద్మ కోరకాలు

తేనె కలలు కంటున్న కన్నె పిల్లల్లా వున్నవి !

నీలాల నింగి భృకుటి మీద

కుల సంకేతాల బంగారు చంద్ర తిలకం !

రేయి చరణాల మీద వాలిపోతూ 

వన దేవళంలో నర్తిస్తున్నది పవనం !

ఈ నిశ్చల నిశ్శబ్ద నిశిలో వినిపిస్తున్నది 

దీప ధూప ఆరాధనా నైవేద్య స్తోత్రం ! 

  1.        స్వప్నరాగం 

      ( Song of a Dream ) 

ఓసారి నేను 

ఒక రాత్రి కంటున్న కలలో 

ఒంటరిగా నిల్చొని ఉన్నాను; 

మంత్రారణ్యపు వెలుగులో.

నాలో పెల్లుబికాయి 

ఉన్మత్త ఆత్మదఘ్న దర్శనాలు ;

నిద్రాణ భూమిలోని ఆ మంత్ర వనిలో

సత్య చేతనలు పక్షి పాటలై, 

ప్రేమ చైతన్యాలు నక్షత్ర దీప్తులై, 

శాంత చలనాలు స్వచ్ఛ స్రవంతులై

ప్రవహించాయి.  

ఆ మాంత్రిక కాననాల కాంతిలో 

ఒంటిగా నేను! 

ఆ ప్రేమ తారకల చెతన్య దీధితులు 

నా లలిత యవ్వనం చుట్టూ గుమిగూడి నట్టు, 

ఆ సత్య చైతన్య గీతాలు నాలో నదించినట్టు, 

ఆ శాంత స్రవంతీ చేతనా ప్రవాహాలు 

నా దప్పిక తీర్చేందుకు నన్ను కిందికి దింపినట్టు 

ఆ నిద్రాణ భూమిలోని ఆ మంత్ర వనిలో

అనుభవమేదో అవుతున్నది నాకు.

  1.      కవయిత్రి వలపు పాట 

          ( The Poet’s Love Song )

ప్రియా! 

పగటి అలలు పొగిలే ఈ మిట్టమధ్యాహ్న వేళ

నీ అవసరమేమీ లేదు నాకు; 

నేను నిక్షేపంగానే వున్నాను.

నా పగటి కలలు నాకున్నవి;

నా కోర్కెలతో 

ఈ లోకాన్ని అనుసంధించేందుకు, 

నా జయ గీతికలతో 

మౌన పవనాలను బంధించేందుకు.

అర్ణవాల అవతల 

నీ ఆత్మ నిశ్శబ్దాన్ని నిలుపుకుంటే చాలు.

కాని, 

నక్షత్రాల పరవశ నిశ్శబ్దాలు నిదురలోకి జారిన 

నడిరేతిరి నీరవ నిశిలోనేను ఒంటిమై ఉన్న వేళ

నీ మాటకై నా ఆత్మ తపిస్తుంటుంది. 

ఓ నా ప్రియా ! 

అప్పుడు మాత్రం  

చెలరేగే చలితరాగ మాంత్రికతలా 

పంపించు 

నా వలపు పిలుపుకు నీ సరస సమాధానాన్ని,

సముద్రాల మీదుగా .

  1.      బృందావన వైణకుడు 

   ( The Flute-player of Brindaban )

కదంబ వృక్ష ఛాయల కింద 

వేణువు నూదుతున్న ఓ వైణవికా! 

నీ నిశిత కఠోర నిరుపమాన వంశీగానంతో 

నా ఆలస స్వప్న సంచార ఎదను 

ఎందుకు ఇలా గాయపరుస్తావు ?

ఓ బృందావన వైణకుడా !  

నీవు ఎటు వెళ్లినా 

నేను నిన్ను అనుసరించాల్సిందే కదా? 

నా జీవితాన్ని వశపరచుకున్న 

ఈ ఇహలోక మరులను, 

మురిపించే ఈ సిరులను వదలిపెట్టి, 

గూడులేని పిట్టలా

నీ మాంత్రిక వేణువు పిలుపు వెంట 

పరుగెత్తక తప్పదుకదా ఓ మురళీధరా ! 

***

భారత ప్రమదావనంలో అక్షర శ్రావ్యతను పలికించిన పలుకు కోకిల సరోజినీ నాయుడు.

మహిళాలోక గర్వకారణం సరోజినీ నాయుడు.  

 ” భారత కోకిల ” సరోజినీ నాయుడు.

*****

                                 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.