ఉనికి పాట

-చంద్ర లత 

      (అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట)

చెలీ సెలవ్…! సెలవ్  సెలవ్ !

  ***

ఇక మనం మేలు కోవాలి

 ఇక మనం తెలుసుకోవాలి

   ఇక మనం మనకళ్ళు తెరిచిచూడాలి

  ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే !

          మనం మేలైన రేపటిని నిర్మించుకోవాలి

      ఆ పనిని మనం ఇప్పుడే మొదలుపెట్టాలి                        

       ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే!                                                                         

 (14.12.17  తెలుగు సేత, చంద్రలత)

“ Do it now…now now…!” అంటూ,బెల్జియం కు చెందిన 60 మంది ఫ్లెమిష్ కళాకారులు చిత్రించిన ఈ పాటతో ,సుమారు 180 దేశాలలో లక్షలాది మంది కళాకారులు ,పర్యావరణవాదులు, ప్రకృతి ప్రేమికులు ,పిల్లలు,పెద్దలు  గొంతు కలిపిన ఉత్తేజం, అది కలిగించిన ఉద్యమ స్పూర్తి , ఒక ప్రముఖ చారిత్రక ఒప్పందానికి దారి చూపాయి. అది ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం(2012). 22-23 ,సెప్టెంబర్,2012 వ తేదీన, ఐక్యరాజ్య సమితి UNFCCC వాతావరణ మార్పులపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న  సంధర్భం అది. అట్టుడికి పోతున్న భూమిని,అంతరించి పోతున్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో, “పర్యావరణం కోసం పాడండి” అన్న నినాదం తో 11.11.11 న ప్రారంభమైన ఈ ప్రయత్నానికి, స్పందించిన ఫ్లెమిష్ కళాకారుల పాట ఇదీ. ఒక్క సారిగా ప్రపంచమంతా గొంతెత్తి పాడిన ఈ పాట ను రచించిన వారు   స్టెఫ్ కామిల్ కార్లెన్స్ మరియు నిక్ బాల్తాజార్. స్వరపరిచినది మాత్రం ఆల్ఫ్స్ పర్వత సానువుల్లోని వరిపొలాలల్లో ! స్వరపరిచిన వారెవరో ఎవరికీ తెలియదు. పందొమ్మిదో శతాబ్దం ఆఖరున ఆ అనామక స్వరకర్తల హృదయాల్లోంచి పుట్టిన ఈ ఇటాలియన్ పొలంపాట పండించిన ఉత్తేజపు పంట, అజరామరమై ఈ నాటికీ ప్రపంచమంతా ప్రకంపనాలను సృష్టిస్తోంది. ప్రభంజనాలను పుట్టిస్తోంది. ప్రయోజనాలని సాధిస్తోంది.

    ఈ ఇటాలియన్ పొలంపాటను అంది పుచ్చుకొని,  ఈ పాటను సామాన్యుల గళం చేసు కొన్నది , ఇటాలియన్ అంతర్యుద్ధ యోధులయితే, ఇటలీ జాతీయ ప్రాచుర్యంలోకి తెచ్చింది, 1943-48 సంవత్సరాల కాలంలో ఇటలీ లో ఫాసిస్ట్ నియంతృత్వాన్ని  ఎదురొడ్డి నిలిచిన పార్టిజాన్ లు అని పిలవబడే ,స్వేచ్చావాదులు. ఈ పాటను ప్రపంచ వ్యాప్తం చేసింది, మొదట వామపక్ష ఉద్యమకారులు, వెనువెంటనే, వివిధ దేశ భాష కాలాలకు చెందిన అనేనేకానేక చైతన్య స్వేచ్ఛా స్వరాలు.                                   

  1.       పార్టిజాన్ ల పాట (1943 -48)

 

ఒక పొద్దుటి పూట, నిద్రలేచానో లేదో

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ !

ఒక పొద్దుటి పూట, నిద్రలేచానో లేదో

చొచ్చుకు వచ్చిన, దురాక్రమదారుణ్ణి చూశా.

 

ఓ స్వేచ్చావాదీ ,నన్ను నీతో తీసుకెళ్ళు

చెలీ సెలవ్   చెలీ సెలవ్ చెలీ సెలవ్   సెలవ్

ఓ స్వేచ్చావాదీ, నన్ను నీతో తీసుకెళ్ళు.

ఇక్కడే ఉంటే, నా ఊపిరి ఆగి పోదా మరి?

 

ఒకవేళ ఉద్యమకారుడిగా, నా ఆయువు మీరితే,

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ !

ఒకవేళ ఉద్యమకారుడిగా, నా ఆయువు మీరితే,

నువ్వు నాకు, ఆఖరి వీడ్కోలు ఇస్తావుగా ?

 

నన్ను ఆ పక్కన  ఉన్న పర్వతం మీద సమాధి చేయి.

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ !

నన్ను ఆ పక్కన ఉన్న, పర్వతం  మీద సమాధి చేయి.

మొలకెత్తిన అందమైన పువ్వు నీడలో, నన్ను పాతివేయి.

 

ఆ దారిన నడిచివెళ్ళే వాళ్ళంతా

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ !

ఆ దారిన  నడిచివెళ్ళే వాళ్ళంతా, అంటారు

“ఎంత అందంగా విప్పారిందీ పువ్వు!” అని.

 

ఇంత అందమైన పువ్వు, ఆ స్వేచ్ఛావాది గుండెల్లోంచి పూసింది

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ !

ఇంత అందమైన పువ్వు, 

ఆ స్వేచ్ఛావాది గుండెల్లోంచి పూసింది

మన స్వేచ్చ కోసం ఊపిరి వదిలాడు చూడు,  అతడు !

(తెలుగు సేత, చంద్రలత 17.10.17) 

***

” పని చేసేటప్పుడు మాట్లాడొద్దు, డామిట్ !” గట్టు మీది పెత్తందారు పొలికేక.

“ఇక్కడ పనిలో ఉన్నప్పుడు,మాట్లాడకూడదు.నువ్వేదయినా చెప్పాలనుకొంటున్నావా,పాట పాడు. ఇక్కడంతా అలాగే జరుగుతుంది !” 

చిన్న బుచ్చుకొన్న సిల్వానా(యువ మొండీనా) కి  అక్కడి వ్యవహారశైలి అలవడిన ఓ పెద్ద మొండీనా, పొలంలోంచి నడుం ఎత్తకుండానే, గుసగుసలుగా ఇచ్చిన సలహా.                 (“రీసో అమారో” ఇటాలియన్ చిత్రం నుంచి .24:58)

అందమైన పాలరాతి గ్రేసియన్ కలశం మీద వినిపించని రాగాలే ,అంత శ్రావ్యంగా ఉంటే(ఓడ్  టు ఎ గ్రేసీయన్ అర్న్,జాన్ కీట్స్, 1819.), గ్రేసియన్ పొలాల్లో చెమట తో తడిచి, ఆ శ్రమైక జీవనంలో  మొలకెత్తిన ఆ పాట ఇంకెంత మధురంగా ఉండాలి !

అది ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో , “ పో ” నదీ పరివాహక “పీడ్ మౌంట్” ప్రాంతం. “పో” నది కి, దాని ఉపనది అయిన “సెజియా” నది కి మధ్యన గల సారవంతమైన డెల్టా మాగాణుల భూమి. సాధారణంగా , వరిపొలాలంటే,భారత దేశం, ,చైనా,థాయ్ ల్యాండ్ మొదలయిన దక్షిణాసియా  గుర్తుకువస్తాయి. అనాదిగా ఇటాలియన్లకు అన్నం పెట్టిందీ, జయించిన గ్రీకు రోమన్ మహాసామ్రాజ్యాలకూ, సంస్కృతులకూ కడుపునింపిందీ , ఈ పీడ్ మౌంట్ వరిపొలాలే. 

ఇటలీ అనగానే , ఈ నాటి తరానికి వెంటనే గుర్తొచ్చేవి వారి వంటకాలు, వస్త్రాలు. నోరూరించే పాస్తా, పిజ్జా,సేమిలోనా (సేమియా) ఇప్పుడు ప్రపంచవ్యాప్తమై పోయాయి. ఇటాలియన్ వంటకాల్లో సుప్రసిద్ధమైన వంటకం, ఇటాలియన్ రిసాట్టో. ఇది మన బిరియానీ, పలావ్ తరహా వంటకం. మన బిరియానీ, పలావ్ లకు ప్రాణం అన్నదగ్గది మన ప్రాంతాల్లో పండే బాసుమతి బియ్యం అయినట్టుగానే, ఇటాలియన్ రిసాట్టో కి ప్రాణం పీడ్ మౌంట్ పర్వతసానువుల్లో పండే కార్నరోలి మరియు ఆర్బరియో రకపు వరిబియ్యం. సలాడ్ లలో వాడే బ్లాక్ రిసో వెరిన్ ,సామన్ చేపల వంటకాని రుచిని ఇచ్చే ,రెడ్ రిసో ఎర్మ్స్ వంటి వరి వంగడాలను తరతరాలుగా పండించేది కూడా ఇక్కడే.   

 ఇటలీ వాయువ్య ప్రాంతంలో అనాదిగా పండే,ఈ రుచికరమైన కమ్మని వరి పంటను నాటిందెవరు? కలుపు తీసిందెవరు? కోత కోసిందెవరు? నూర్పిళ్ళు చేసింది ఎవరు?

ఇంకెవరు ? ఆయా తరాల ఆడవారు!

“మొండీనా” అని పిలిచే ఈ మహిళా వ్యవసాయశ్రామికులే ఆ వరి పంటకు ,ఆ పై “రిసాట్టో” లాంటి వంటకు మూలం.

ఇప్పుడంటే, యంత్రాలు పని చేసి పెడుతున్నాయి కానీ,ఇరవై శతాబ్దపు చివరి దశకం దాకా , ఆ పనికి నడుం వంచింది,ఇటాలియన్ స్త్రీలే. వీరు అన్ని వర్గాల నుంచీ, అన్ని చోట్ల నుంచీ పంటకాలంలో పీడ్ మౌంట్ కు వచ్చే వారు. ఆ పంట కాలం అంతా  అక్కడే ఉండి, నాట్లు,కలుపు,కోతలు అవ్వగానే , మరో పంట కోసం ఎదురుచూస్తూ, వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళే వారు.

మొండీనాలు పొలంలోని మోకాళ్ళ లోతు నీళ్ళల్లోకి దిగడానికి ముందు అందుకొనేది, ఎండను తట్టుకొనే విశాలమైన పీడ్ మౌంట్  గడ్డి టోపీ, మెడలో చుట్టుకోవడానికి ఒక స్కార్ఫ్.

పీడ్ మౌంట్ ప్రాంతానికి చెందిన ,ప్రఖ్యాత రచయిత ,ఉంబర్తో ఈకో , ఎంతో ఆప్యాయంగా తమ పీడ్ మౌంట్ హ్యాట్ ల గురించి పరిచయం చేస్తారు. అక్కడి జీవన విధానంలో భాగమై పోయిన, హ్యాట్ , స్కార్ఫ్ లతో పార్టీజాన్లు కూడా ఎలా గుర్తించ బడ్డారో ,ఈకో తన రచనలలో వివరిస్తారు. 

పార్టీజాన్లు అంటే పార్టీ కి చెందిన వారు అర్ధం. స్వేచ్చ, సమత,సౌభ్రాత్వత్వం  మూల సూత్రంగా ,ఇటాలియన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా నిలబడిన అందరూ కేవలం ఎర్ర స్కార్ఫ్లు ధరించిన వారు మాత్రమే కాదనీ, ఎన్నెన్నో రంగుల స్కార్ఫ్లు ధరించైన పార్టీజాన్లను తమ ఇంటీలోనే కలిసినట్టుగా ఉంబర్తో ఈకో ప్రస్తావిస్తారు. ఈకో తాతయ్య స్వయాన సోషలిస్ట్, పార్టీజాన్ల పక్షపాతి. పీడ్ మౌంట్ ప్రాంతంలోని  ఉంబర్తో ఈకో తాతయ్య గారి ఇంట్లో వివిధ స్కార్ఫ్ లు ధరించిన పార్టీజాన్లకు తరచూ వసతి కల్పించే వారు. అనుకూలమైన సమయాన ఆ కొండల్లో కోనల్లో రహస్యదారుల ద్వారా ,ఆ ప్రాంతం నుండి వారిని క్షేమంగా పంపించే వారు.ఎక్కడికక్కడ చిన్న చిన్న బృందాలుగా ఈ స్వేచ్చాపోరాటాలు జరిగాయనీ, ఎవరికి వారు తమ ప్రణాళికలను రచించుకొన్నారనీ ఉంబర్తో ఈకో రాస్తారు.  స్వేచ్ఛాస్వరాలకు పుట్టినిల్లు అయిన పీడ్ మౌంట్ ప్రాంతం పార్టిజాన్లకు స్థావరం కావడం సహజం.

        రెండు ప్రపంచ యుద్ధాలు నడుమ ,ఇటలీ ఫాసిస్టు పాలనలో నలిగిన ఇటలీ, తన గాయాలను మానుపుకొనే క్రమంలో ,ప్రపంచానికి అందించిన నిబద్ద కళారూపం “నియో రియలిజం సినిమా”. నయా వాస్తవవాద సినిమా అసలుసిసలు కథాప్రాంతాల్లోకి వెళ్ళి,అక్కడివారి నిజ జీవితాన్ని ,వాస్తవపరిస్థితులను చిత్రించే ప్రయత్నం చేసింది. స్థానికులతో కొద్ది మంది కాల్పనిక పాత్రలు నటీనటులు , కలిసిపోయి , సినిమా మొత్తం ఒక నిజమే అన్నంత నిజాయితీగా, సహజంగా సినిమాలు తీసే ప్రయత్నం చేసారు. ఈ కోవలో సుప్రసిద్ధమైన సినిమా, “బైసికిల్ థీవ్స్”(1948).  ఈ నయా వాస్తవ వాద సినిమా,”రీసో అమారో(1949)” చిత్రంలో, పీడ్ మౌంట్ వరిపొలాలను ,అక్కడి జీవన సరళినీ, ఇటలీనీ నిశ్శబ్దంగా ఆక్రమిస్తోన్న అమెరికన్ సంస్కృతినీ యథాతథం గా సృజించే ప్రయత్నం జరిగింది.                      

https://www.youtube.com/watch?v=sP-7kECZ6Ow

“రీసో అమారో(1949)” చిత్రంలో జనాకర్షణ రూపంగాప్రధాన పాత్రధారి, యువ మొండీనా, “సిల్వానా” ని చిత్రించడం, కథ ముగింపులో నాటకీయత , నయా వాస్తవవాదాన్నుంచి పక్కకు జరిగినట్లుగా , విమర్షకులు భావించారు.అయితే, చొచ్చుకు వస్తోన్న అమెరికన్ క్యాపిటల్ సంస్కృతి ప్రభావితురాలైన,సిల్వానా , తన ఇటాలియన్ సహజస్వభావానికి భిన్నంగా ప్రవర్తించి ఎలా పతనమయ్యిందో చెప్పదలిచానన్నాడు దర్షకుడు, గుసెప్పె డి సాంతిస.  , ” రీసో అమారో” అటు వాస్తవ పరిస్థితినీ, ఇటు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచించే మొండీనా జీవితశకలం. ఈ పాట అర్ధం కావాలంటే తప్పక “రీసో అమారో “చూడవలిసిందే.

ఇలాంటి నేపథ్యంతో తీసిన మరో ఇటాలియన్ సినిమా ,”వరి అమ్మాయి” (లా రీసైయ ),రఫ్ఫేల్లొ మాటారజ్జో(1956)” ఫక్తు నాటకీయ సినిమా అయినప్పటికి,  ఆనాటి వరి పొలాల్లో మహిళా శ్రామికుల పరిస్థితులను పరిచయం చేస్తుంది.

“తెలుగు తూర్పు ఇటాలియన్” అని, ఇటాలియన్ లాగానే తెలుగు అజంత భాష అని , మనం మురిసి పోతుంటాం. ఇటాలియన్ భాష కూడా తెలుగు లాగానే, ప్రతి పదాన్ని బహుళార్ధాలతో వాడే భాష. తెలుగు లాగానే, ప్రతి పదం వాడుక లోనూ శ్లేషార్ధాలు ఇటాలియన్ భాషకూ అందం చందం. “రీసో అమారో” అన్న శీర్షీకలోనే చూద్దాం. బిట్టర్ రైస్, బిట్టర్ లాఫ్టర్  అని ఆంగ్లానువాదం చేసిన, ఈ శీర్షికకు రెండు అర్ధాలున్నాయి. చేదు బియ్యం మరియు చేదు నవ్వు. రీసో అంటే వరి ,నవ్వు అని.

పండిన పంటలా నవ్వడం అన్న మాట మనమూ వాడతాం.   వరిపొలాల్లో పండిన విషాదపు చేదునవ్వుల పంటను గురించి చెప్పేదే, ఈ “రీసో అమారో”.  

ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర సిల్వానా స్నేహితుడు, సైనికుడు, మార్కో ( రాఫ్ వాల్లోన్ ) యుద్ధానికి వెళ్ళ బోతూ , గోడ మీద ఈ పాటలోని మాటని రాస్తాడు,” బెల్లా చ్ఛావ్!” (చెలీ సెలవ్…!)  అని. పొలంలో ఈ ఇటాలియన్ పాట సినిమాలో నాట్లేసే వారి నోట  “ఆల్ల మట్టినా, అప్పెనా అల్జాట..”సుదూరంగా వినిపిస్తుంది. పీడ్ మౌంట్ టోపీ లాగానే, మెడలోని స్కార్ఫ్ లాగానే, ఈ “ఆల్ల మట్టినా…” పాట అప్పటి వారి జీవితాల్లో ఎంతగా మమేకమయ్యిందో అర్ధమవుతుంది.                                        

 అలనాటి పంటపొలాల పాట పంతొమ్మిదో శతాబ్దపు ఆఖరులో పుట్టిందని భావిస్తున్నప్పటికీ, ఈ పాటను పదిలపరిచింది మాత్రం అర్ధశతాబ్ది కిందనే.

జియోవాన్నిడాఫ్ఫిని (1914 -1969) జనరంజక జానపదగాయని. స్వయాన ఒక మొండీనా. వరిపొలాల్లో పనిచేస్తూ ,నేర్చుకొన్న పల్లె పాటలను, విరామ కాలంలో పల్లెపండుగల్లో, పెళ్ళిళ్ళ వేదికల మీదా పాడేది. “ఆల్ల మట్టినా..” పాటను ఆమె ప్రతి వేదిక మీదా ప్రముఖంగా పాడేది.

   1960 లలో ఇటలీలో , ఒక సంగీత పునరుద్ధరణ ఉద్యమం వేళ్ళూనుకొంది. “నియో కాంజారియో ఇటాలినో ” పేరిట,జనరంజకమైన బహుళప్రాచుర్యంలో ఉన్న పాటలను,సంగీతాన్ని సేకరించి పదిలపరచసాగారు. జియాన్ని బోసినో (1923-1971) చరిత్రకారుడు, ఎథ్నో మ్యూజికాలజిస్ట్,సోషలిస్ట్. ప్రపంచయుద్ధాల అనంతరం, యుద్ధకాలం నాటి తిరుగుబాటు పాటలను, పల్లెపదాలను పదిల పరిచాడు. ఆ క్రమంలోనే, డాఫ్ఫిని  ” ఆల్ల మట్టినా, అప్పెనా అల్జాట / ఓ బెల్లా చ్ఛావ్ ,బెల్లా చ్ఛావ్, బెల్లా చ్ఛావ్, చ్ఛావ్, చ్ఛావ్…” పాటను బోసినో రికార్డ్ చేశాడు.

  అలా , ఆ పల్లెపదం ” ఆల్ల మట్టినా, అప్పెనా అల్జాట… ”పదిలపరచబడింది. డాఫ్ఫిని స్వరంలో.

ఇంతకు మునుపు ప్రస్తావించినట్లుగా, ‘చ్ఛావ్’ అన్న పదానికి కూడా రెండు అర్ధాలు ఉన్నాయి. పలకరింపు, వీడ్కోలు రెండు సంధర్భాల్లోనూ ఇటాలియన్లు ఈ పదాన్ని వాడతారు. ‘చ్ఛావ్’ అంటే హల్లో అనీ గుడ్ బై అనీ అర్ధం. సంధర్భాన్ని బట్టి  అర్ధం చేసుకోవాలి. మనం అయినా అంతే కదా, ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు గానీ, వీడ్కోలు పలికేటప్పుడు గానీ, నమస్కారం లేదా నమస్తే అంటాం. “చ్ఛావ్” అన్న పదం ఇటాలియన్ సంస్కారం. నమస్కారం. అత్మీయ భావం. స్నేహహస్తం. పలకరింపు పదం.

కాలాలను దాటుకొని దేశాలన్నిటిలోనూ విస్తరించిన ఈ పాట, దాని స్వరం, అది కదిలించిన మెదళ్ళు, కుదిపివేసిన గుండెలూ ,ఆనాటీకీ ఈ నాటికీ , ఆ పాటను అజరామరం చేసాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మొండీనాల జీవితాలు కాలానుగతంగా మారిపోయాయి.  ఇప్పుడు ,నాట్లు, కలుపుతీతలు, పంటకోతలు, నూర్పిళ్ళు అన్నీ యంత్రాల సాయంతో చేస్తున్నారు. “రైస్ రూట్” (వరి రహదారి ) గా పిలవబడే ఈ పీడ్ మౌంట్ ప్రాంతంలోని బియెల్లా పట్టణం నుండి పావియా పట్టణం వరకు ఉన్న రహదారిని, ఆహ్లాదకర పర్యాటక నడకలు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తుంటారు.

 ఈ పాట పుట్టిన నాటి పరిస్థితులు, పీడ్ మౌంట్ మారడం ముదావహం. కానీ, ఈ పాట మళ్ళీ మళ్ళీ అవసరం రావడమే విషాదం.

***

స్త్రీ పురుష సాహచర్యబంధం అన్నది మానవ సంబంధాలలో, అందమైనదీ.అపురూపమైనదీ.మనోహరమైనదీ.

ఇరువురి మనసులతో ముడి పడినది. ఇరువురి జీవితాలతో పెనవేసుకొన్నది.

 ఒక అందమైన యువతి (బెల్లా) ని సహచరి గా కలిగిన ఒక యువకుడు, యుద్ధానికి సన్నద్ధుడై, జంట బాయడానికి ముందు,  ఆమెకు పాడిన వీడ్కోలు పాట ఈ “బెల్లా చ్ఛావ్!”( చెలీ సెలవ్…!) పాట.

  ఇటు ఇంటి శతృవైన ఇటలీ ఫాసిస్ట్ నియంతృత్వం , అటు  చొచ్చుకు వస్తోన్న జర్మన్ దురాక్రమణదార్లు. ముందూవెనుకా ,ఏకంగా పర్వతాలనే ఢీ కొనడానికి, తన వంటి మరెందరో యువతీ యువకులతో కలిసి,ఒక స్వేచ్ఛావాదిగా,ఒక పార్టీజాన్ గా ముందుకు నడవాలని నిశ్చయించుకొని, వెళ్ళబోయే ముందు , అతని మనోహరి కోసం పాడిన వీడ్కోలు పాట ఈ పార్టీజాన్ పాట.ఆమె అతని భార్య,  ప్రేయసి, ప్రాణస్నేహితురాలు …ఎవరైనా కావచ్చు. అన్నీ ఆమే కావచ్చు. ఆమె అందమైన యువతి అన్నది మాత్రమే ఈ పాట చెపుతుంది మనకు.

  యుద్ధం ఆన్నాక ఫలితం ఏదైనా కావచ్చు.ఊపిరి ని పణంగా పెట్టి, రణానికి వెళుతూ, “నేను యుద్ధానికి వెళుతున్నాను.నువ్వు చితిలో దూకు!”అని చెప్పి వెళ్లలేదు అతను. తన ఆశయాన్ని చేరుకొనే క్రమంలో తన ఆయుస్సు తీరితే, ఎలా స్పందించాలో , తన ఆఖరి వీడ్కోలు ఎలా ఉండాలో చెప్పి వెళ్లాడు.

వంటరి కాబోతున్న ఆమెకు , స్వేచ్ఛగా ఆమె జీవితాన్ని కొనసాగించాలని ఎంత అందంగా… ఎంత స్పష్టంగా …చెప్పాడో.

తన ప్రాణసఖికి వీడ్కోలు ఎంత అందంగా పలికాడో. ఎంత ధైర్యాన్ని నింపాడో.

ఒక మొక్కను నాటడం ,అది తన ఆయువును పోసుకొని,ఒక అందమైన పూవులా విప్పారడం , దారిన వెళ్ళే వారిని విరిసిన పువ్వులా పలకరించడం, అన్న అనుభూతిలో ఎంత జీవన కాంక్ష ఉన్నదో.తన సహచరి క్షేమాన్ని శ్రేయాన్ని ,ఆమె జీవితం పట్ల  ప్రేమను అనురక్తినీ కొనసాగించమన్న అతని కోరిక ఉన్నది. అందరి స్వేచ్ఛ కోసం ఊపిరి వదిలిన స్వేచ్ఛావాదిగా మాత్రమే తనను తలుచుకోమంటాడు. తనను ఒక అందంగా విప్పారిన పువ్వులా , ఒక సంతోషంలా, ఒక సజీవ స్మృతిలా జ్ఞాపకం పెట్టుకో మన్నాడు. అతని ఆదర్షంలోని  ఔన్నత్యమే అతని ఆలోచనల్లో ప్రతిఫలిస్తోంది. అతని పాటలో ధ్వనిస్తోంది.

కొండ వాలున పూచిన  ఏ పూవును యధాలాపంగా చూసినా, ఈ పాట జ్ఞాపకం రాకుండా ఉంటుందా? మనసు కలుక్కుమనకుండా ఉంటుందా?

ఇక, పీడ్ మౌంట్ లో మొలకెత్తిన పల్లె పాట .

“   ఓ అమ్మా, ఎంత దారుణమైన హింస !

     నిన్ను తలుచుకోని రోజు, లేనే లేదమ్మా! ”

ఈ ఒక్క వాక్యంలోనే, ఇంకా అమ్మ సాన్నిహిత్యాన్ని కోరుకొంటొన్న, ఆ ఎదిగీఎదగని, కౌమార్యాన్ని దాటీ దాటని  యువతి,మొండీనా , జీవితం ఎలా ఉండేదో ,తెలుస్తోంది.

ఎక్కడెక్కడి నుంచో ,ఊరుకాని ఊరు వచ్చి , అరకొర సౌకర్యాల మధ్య, అంతంత మాత్రం భోజన వసతుల మధ్య,  అనిశ్చత, అభద్రతల మధ్య పని చేయాల్సిన ఆ నాటి దుర్భర పరిస్థితులు, ఒక్కసారిగా కళ్ల ముందు కట్టినట్లవుతాయి.

ఆ ఎదిగీఎదగని యువ మొండీనా, ఎంతటి ఆకలి దప్పులకు ఓర్చిందో, ఎలాంటి కష్టనష్టాలకు ఓర్చిందో, ఎలాంటి అవమానాలకు గురయ్యిందో, ఎలాంటి అనారోగ్యాల పాలన బడిందో, ఎలాంటి లైంగిక దాడులకు గురయ్యిందో ,ఊహించనలవి కాదు.

ఒక పంట కాలం అంతా, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నిలబడి,వంచిన నడుమ ఎత్తకుండా పనిచేసినా , ఆఖరికి   దక్కే అర కొర సంపాదన ,అర బస్తా వడ్లు. (రీసో అమారో)ఆ వడ్లను భుజాన వేసుకొని, బండ్లెక్కి వారి వారి స్వంత ఊళ్ళకు ప్రయాణమయ్యే లోగా , ఏమేమి అనుభవాలను వారు దాటి వచ్చేవారో.ఆనాటి ఇటలీ లోని కటిక దారిద్యానికి, దుర్భర ఆర్ధిక ,సామాజిక, రాజకీయ పరిస్థితులకు ఈ మొండీనా జీవితాలు ఒకానొక చిత్రిక. సౌకుమార్యమూ సౌందర్యమూ మూర్తీభవించిన గ్రీకు రోమన్ కళాకృతులకు వీరేగా నడిచే నమూనాలు !

పంట కాలాల మధ్య పొట్టకూటి కోసం ఎన్నెన్ని తిప్పలు పడే వారో. వారిలో డాఫ్ఫిని ఒకరు. పంట కాలాల మధ్య, పొలంలో పాడుకొన్న పాటలను పాడి పొట్టపోసుకొనేది. పల్లెపండుగల్లో,పెళ్ళివేడుకల్లో. అలాంటి ఒక వేదిక మీదే, ఆమె బోసిని కంట పడింది. ఈ పాట మనకు మిగిలింది.

నోటి మాటను కూడా నియంత్రించి ,ఇనుపచువ్వను చేతబట్టుకొని, గట్టు మీద నిలబడ్డ పెత్తందార్ల నుంచి , వారిని కాపాడింది. వారి పాటే.

ఇక, “నిజము మరిచి నిదరపోకుమా” అని హెచ్చరించిన మన తెలుగు సినిమా పాటల దృష్టీలోంచి, ఈ సుప్రసిద్ధ బాణీ వాణీ తప్పించుకోలేదు. అయితే, ” కల కానిదీ, విలువైనదీ, బతుకు”  అని పాడిన చోటే , తన కోరికను కోరిన మరుక్షణాన వప్పుకోని అమ్మాయిని “పిల్లా చావు చావు చావ్వే ! ” అంటూ శాపనార్ధాలు పెట్టే సంధర్భంలో వాడడమే విషాదం. పై నుంచి, అదొక వినోద భరిత వేడుక పాటలా చిత్రించడం మరింత ఘోరం.

  జీవితం పట్ల గాఢానురక్తిని, నమ్మకాన్ని ,గౌరవాన్ని కలిగించాల్సిన ” ఆల్ల మట్టినా, అప్పెనా అల్జాట… బెల్లా చ్ఛావ్, చ్ఛావ్, చ్ఛావ్ ” పాట, అనేకానేక ఉద్యమాలకు ఊపిరై , ఉత్తేజమై నిలిచిన పాటను, ఈ రకమైన దిగజారుడు తిట్టుపాటలా తీర్చిదిద్దడం మన తెలుగు సినిమాకే దక్కింది. అన్నట్టు , ఆ తిరోగమన తిట్టుపాట కూడా సుప్రసిద్ధమే!

ఈ “చెలీ సెలవ్..!” పాట నేపథ్యం పట్ల, ఏ కించిత్ గౌరవం ఉన్న వారైనా, ఆవగింజంత అవగాహన ఉన్నవారైనా, సిగ్గుతో తల దించుకోకుండా ఎలా ఉంటాం? ఏదైనా  ఒక పాటను అనుసరించేటప్పుడు, అనుకరించేటప్పుడు, ఆ పాట ఆత్మను వంచించకుండా వుండే రోజులు ఎప్పుడు వస్తాయో !

ఆ “చెలీ సెలవ్..!” పాటలో బలమైన జీవన కాంక్ష, తమ జీవితాల్లో గొప్పమార్పురావాలన్న అమాయకపు ఆశ, ఆ ఆశయసాధనకు కలిసికట్టుగా పనిచేయాలన్న ఆదర్షమూ ఉన్నాయి. ఆ ఆదర్షాన్ని ఈ పాట అన్నిందాలా సాధించగలగడమే, ఈ పాట చరిత్ర. వర్తమానం!

పొలంపాటై పుట్టి ,పార్టీజాన్ల పాటై ఎదిగి, పరిపరివిధాలుగా,పలు కాలాల్లో పలకరిస్తూనే ఉంది.

ఆదమరుపు వేళ ఆయువుపాటై ,అదిలిస్తూనే ఉంటుంది. అజరామరమై నిలిచి ఉంటుంది!

 ***

 జియోవాన్ని డాఫ్ఫిని స్వరంలో… జియాన్ని బోసినో పదిల పరిచిన పల్లెపదం, ” ఆల్ల మట్టినా, అప్పెనా అల్జాట… ” (1964)

 ***

తొలి పొద్దుటి పూట, నిద్రలేచానో లేదో,

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ సెలవ్!

తొలి పొద్దుటి పూట, నిద్రలేచానో లేదో,

వరి పొలానికి, నేను వెళ్ళాలిక.

 

పురుగూపుట్రా, కంపాకర్రల నడుమ,

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ సెలవ్!

పురుగూపుట్రా, కంపాకర్రల నడుమ,

అష్టకష్టాలకోర్చి, పనిచెయ్యాలిక.

 

ఆసామి గట్టున నిలబడతాడు,(ఇనుప)చువ్వను చేత బట్టి

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ సెలవ్!

ఆసామి గట్టున నిలబడతాడు,(ఇనుప)చువ్వను చేత బట్టి

నడుం బిగించి మేము, పొలం పనిచేస్తూ ఉంటే.

 

ఓ అమ్మా, ఎంత దారుణమైన హింస.

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ సెలవ్!

ఓ అమ్మా, ఎంత దారుణమైన హింస.

నిన్ను తలుచుకోని రోజు, లేనే లేదమ్మా!

 

కానీ, ఏదో ఒక రోజు వస్తుంది,అప్పుడు కలిసి కట్టుగా

చెలీ సెలవ్… చెలీ సెలవ్… చెలీ సెలవ్   సెలవ్ సెలవ్!

కానీ, ఏదో ఒక రోజు వస్తుంది,అప్పుడు కలిసి కట్టుగా

మనందరి స్వేచ్చ కోసం, పోరాడుదాం అందరం.

 

(తెలుగు సేత, చంద్రలత   17.10.17)

 *** 

References:

పార్టిజాన్ల పాట (1943-48)

https://www.youtube.com/watch?v=4CI3lhyNKf

జియోవాన్ని డాఫ్ఫిని (1964)

https://www.youtube.com/watch?v=sP-7kECZ6Ow

జియోవాన్ని డాఫ్ఫిని image : http://www.albertoballetti.com/?p=3471)

Mondina images  https://www.youtube.com/watch?v=sP-7kECZ6Ow

Riso Amaro , Italian Film

https://www.youtube.com/watch?v=Ds8Zq_X_IMQ

Do it now 

https://www.youtube.com/watch?v=XGgBtHoIO4g

 Heard melodies are sweet, but those unheard Are sweeter; therefore, ye soft pipes, play on;

 ఓడ్  టు ఎ గ్రేసీయన్ అర్న్,జాన్ కీట్స్, 1819.

కల కానిదీ, విలువైనదీ,బతుకు, రచన: శ్రీ శ్రీ చిత్రం :వెలుగు నీడలు(1961)

https://www.youtube.com/watch?v=kIEz9AtpqwI

ఎవరో వస్తారని…నిజము మరిచి … రచన:శ్రీ శ్రీ చిత్రం :భూమి కోసం (1974)

https://www.youtube.com/watch?v=p7nGPkF8c2g

పిల్లా చావ్వే …! రచన::  భాస్కర్ భట్ల చిత్రం: బిజినెస్ మాన్  ( 2012)

 https://www.youtube.com/watch?v=pRELczCPeA4

 

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.