చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

ఆర్టిస్ట్ అన్వర్ 

ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ అయిపోయింది. వెళ్ళినా ఒక రోజు కు పైగా ఎక్కువ ఉండటం కూడా కష్టమే అయిపోయింది. కానీ ఆ తెల్లారు జామున నడుస్తుంటే ఎన్ని జ్ఞాపకాలో! నిజానికి ఊరు చాలా మారిపోయింది. అయినా బుర్ర మారలా అటూగా ఇటూగా అన్నీ జ్ఞాపకం ఉన్నై “కుచ్ సుస్త్ కదం రస్తే! కుచ్ తేజ్ కదం రాహే” అన్నీ పలుకుతున్నై. 

సంజీవ్ నగర్ రామాలయం ఎదురుగా సందులో దూరి రైట్కు కొట్టి లెఫ్ట్ కు మళ్ళితే తగిలే ఇళ్ళ మధ్య ఒక శెట్టి గారి మేడ మీద మా డిగ్రీ క్లాస్మెట్స్ తో కలిసి అద్దెకు ఉండే వాళ్ళం. ఆ రోజుల్లో రోజుకు ఐదు రూపాయల కూలి కింద పని చేస్తున్నా. అప్పుడు రామకృష్ణ డిగ్రీ కాలేజిలో రెండో సంవత్సరం లో చదువు లాగిస్తున్నా. ఆ మేడ మీద నాలుగు గోడల కాన్వాస్ పై నిలువెత్తు లైఫ్ సైజ్ లో  ఇంతింత కళ్ళు వేసుకుని చూసున్న బీదా బిక్కి బక్క చిక్కిన ఇండియన్ ఇంక్ బొమ్మలు గుర్తుకు వచ్చాయి. బొమ్మ వేసి దాని కింద “అంతేలే పేదల కన్నులు , వినమ్రములు వెతల వ్రణమ్ములు తుఫాను లో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు ! అంతేలే పేదల బ్రతుకులు తిరిపెమునకు పిడికెడు మెతుకులు తరువెరుగని దీర్ఘ రాతిరి లో తల పగిలెడి తలపుల అతుకులు అని వ్రాసిన జ్ఞాపకం. పిచ్చా నాకేమైనా అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు. కాలేజీ లైబ్రరీలో మహ ప్రస్థానం తీసుకుని నోట్బుక్ లో తిరగ వ్రాసుకున్న జ్నాపకం కూడా వస్తుంది . ఆ నోట్బుక్ ఈ క్షణం దొరికితే బావుణ్ణు. మా అద్దె రూం పక్కని మరో కోమట్ల ఫ్యామిలి, మా కాలేజ్ లోనే చదివే సైన్స్ గ్రూప్ అమ్మాయి , మీరు బొమ్మలు బాగా వేస్తారు. నా సైన్స్ రికార్డ్ వేసిస్తారా ప్లీజ్! అంటే నాలుగు డబ్బులు వస్తాయికదాని రికార్డ్ అంతా నింపిన రాత్రులు. దొంగ మోహంది! సాలి కమీనీ! నయా పైసా కూడా ఇవ్వలా ,  ఆ అమ్మాయి తలపుకు వస్తే ఇప్పటికీ బూతులు వస్తాయ్. “అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు శ్మశాన శిశిర కాంతులలో చలి బారిన వెలి రాబండలు ” అనికూడా రాసుకోబుద్ది వేస్తుంది.

రూం ఎదురుగా పేద జనం, పూర్తిస్తాయి నాటు మనుషులు. ఒక మధ్యాన్నం తల్లీ కూతుళ్ళ మధ్య సంభాషణ ఇలా వుంది మర్యాదస్తులు నన్ను క్షమించాలి నిజంగా ఆ తల్లి కూతురితో ఇట్లే మాట్లాడింది, ఇది ఆ జనం సెక్స్ ఎడ్యుకేషన్ లో భాగం కాబోలు. పిల్ల కు మహా అయితే 10 లెదా 12 సంవత్సరాలు. తల్లి అరటి పండ్లు తెమ్మని పంపింది. కూతురు తెచ్చింది అవి చూసి చిరాకు పడ్డ అమ్మ ” ఇదేందే ఇట్టంటివి తెచ్చినావ్? పడుకున్న బెల్లం అంత చిన్నిగా వుండాయ్” అని ఆ యమ్మిని కసురుకుంది . ఆ చిన్న పిల్ల బుర్రలో పడుకున్న మరియూ నిదుర లేచిన పురుషత్వం తాలూకు  జ్ఞానం విత్తనం వేసింది అమ్మ తల్లి, తప్పేం లేదు. నిజానికి నేను ఇక్కడ వ్రాసింది చాలా మర్యాదస్తుల భాష క్రింద లెక్క. ఆవిడ ఏంచెప్పిందో వున్నదున్నట్టు వ్రాయడానికి ఇంకా ఆనాటి బిడియం తాలూకు ఎర్రబడ్డ మోహం అలాగే ఏడిచాయ్. మేమున్న సందులోంచి బయట పడి రెండు మూడు అల్లి బిల్లి నడకల వంకరలు నడిస్తే వచ్చేదే రోజాకుంట. అక్కడే డైలీ అనబడే ధనలక్ష్మి ఇల్లు. ఇప్పుడు ఆయమ్మాయ్ ఎట్లా వుందో? ఎక్కడ వుందో? తన ఇల్లు తెలుసు కానీ తనక్కడ ఎప్పుడు కనబడిన పాపాన పోలా. ఈ సారి బెన్సన్ కనబడితే అడగాలి, ఇంకా రామ్ కళావతి అనే చిత్రమయిన పేరు ఉన్న మా క్లాస్మెంట్  గురించి కూడా . ధనలక్ష్మి అమ్మాయికి కను బొమ మీద కత్తి గాటు. ఎందుకో? అపుడు అమ్మాయిలతో మాట్లాడాలంటే జంకు! ఇప్పుడు కనబడితే అడుగుతానేమో.

రోజాకుంట దాటగానే నంద్యాల మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్. అక్కడే మా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ . క్లాస్లో కూచున్నా ఎదురుగా వున్న సర్కస్ గుడారాల్లోంచి “ప్యార్ హువా! ఎక్ రార్ హువా హై! ప్యార్ సే ఫిర్ క్యూ డర్ తా హై దిల్? అనే పాట పియానో పై పదే పదే వినిపించేది. క్లాస్ అయిపోయి బయటికి రాగానే కారిడార్ లో ఆ జూనియర్ అమ్మాయి కనిపించేది” ఆ అమ్మయిని అలా చూస్తుంటే “రాహోమే ఉన్సే ములాకాత్ హోగయి జిస్ సె డర్ తేథె వొహి బాత్ హొగయి! అనే పాట ఎందుకు వినిపించేది కాదో? సర్కస్ లొంచి అని బలే బెంగగా అనిపించేది. లైప్ స్కెచింగ్ అనేది తెలీని నేను ఆ పిల్లను చూడటానికి వాల్ల మిద్దే ముందు నిలబడి ఆ బిల్డింగ్ బొమ్మ వేసిన జ్ఞాపకం కూడా వస్తుంది ఖర్మ!

అక్కడే ఆ రామకృష్ణ డిగ్రీ కాలేజీ  రోజుల్లోనే ఇంతోటి జులపాలు పెంచుకున్న మురళి,   భలే స్టయిలైజ్డ్ మురళి గుర్తుకు వస్తున్నాడు. మురళి వాళ్ళ అన్న భాస్కర్ రెడ్డి సర్ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా పాఠాలు చెప్పేవాడు, నాకు హీరో ఆయన. మురళి కి క్లోజ్ ప్రెండ్,  రాహుల్ రాయ్ లా హెయిర్ స్టైల్ మెయిన్టైన్ చేసే జమ్మలమడుగు మోహన్ కూడా మతికి వస్తున్నాడు . ఆ అందమైన జుట్టు !! తను ఎంత అందంగా లెటరింగ్ చేసేవాడో. నోటీస్ బోర్డ్లో తన పోస్టర్లు !! దాంతో పాటే వాళ్ళకు పోటీగా  ఫ్రెషర్స్ డే రొజున నేను వ్రాసిన లంబా చౌడా సైజ్ వెల్కం టూ ఫ్రెషర్స్ అనే బ్యానర్. రంగీల సినిమా టైటిల్ స్టైల్లో. ఫ్లోర్సోసెంట్ రంగులు, ఎనామిల్ రెండూ కలవకపోతే మిక్సీలో వేసి గిర్రున తిప్పిన చప్పుడు కూడా గుర్తుకు వస్తున్నది.

అలా అలా నడుస్తూ రాజ్ థియేటర్ దగ్గరికి చేరుకోగానే సంజీవ గాడి చిన్న హోటల్ ఉండేది అక్కడ. నాకు ఒక సంవత్సరంపాటు టిఫిన్ పెట్టిన మనిషి వాడు. ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు రోజూ పూరీనే తినే వాణ్ణీ . మధ్యాన్నం అకలి వేసినా మోహమాటం, పైగా సిగ్గుతో అటు వెళ్ళే వాణ్ణీ కాదు. మధ్యాన్నం అంతా పస్తే. రాత్రికి షాపు ఓనరు గారికి గుర్తు వుంటే దయ వుంటే అయిదు రూపాయలు ఇచ్చేవాడు, మళ్ళీ సంజీవ్ నగర్ సెంటర్ లో బస్టాండ్ వెళ్ళే దారిలో అరటి పండ్ల బండ్లో పండ్లు బేరం చేసి ఆ రాత్రి భోజనం గడిచి పోయేది. చాలా రాత్రిల్లు నిద్ర పట్టేది కాదు. బస్తాండ్లో కూచుని జనాన్ని గమనించే వాణ్ణీ. సంజీవ ఏమయ్యాడో? వాడి రుణం ఎప్పటికి తీర్చుకునేదో?

కొద్దిగా ముందుకు నడిస్తే ఎస్పీవై రెడ్డి వుమన్స్ కాలేజ్. దాని్కి కాస్త ముందు ఉన్న ఒక కాంప్లెక్స్ లో ఒకరోజు సైన్ బోర్ద్ వ్రాస్తున్నాం . పై నుండి చూస్తే కాలేజి అమ్మాయిలు కనబడుతున్నారు. ఎందుకో ఊరికే “దొంగలంజ కొడుకులసలే మసలే ఈ ధూర్త లోకంలో” అని కవిత ఎత్తుకున్నా. ఊరికే అంతే! కానీ ప్రవీణ్ అదే సమయానికి అక్కడ కాలేజీ  అమ్మాయిల వైపు చూస్తున్నాడు అమ్మ తోడుగా అతని చూపుకు నా కవితకు ఏమాత్రం సంబంధం లేదు. కానీ అపార్థమయ్యింది. మనిషి మనసు నొచ్చుకున్నాడు.

సరే అక్కడినుండి కొద్దిగా ముందుకు రాగనే లిబాస్ టైలర్స్. దానికి ప్రభాకరన్న వ్రాసిన బోర్డ్. అలా అలా చివరికి  రాగానే బాబూ ఫోటో స్టూడియో దానికి ఆ పక్కని గోడమీద నేను గీసిన ఎనిమిది అడుగుల పైగా ఈశ్వరుని బొమ్మ స్కెచ్. ఎట్లా వేసేవాళ్ళం అంతంత బొమ్మలు!! తిరుమల ఆర్ట్స్ లో కూచుని వచ్చిన గిరాకీల కోసం నేను నిముషాల మీద ఫ్రీహాండ్ స్కెచ్ లు గీస్తోంటే అబ్బురంగా చూసే అలి చూపులు. “అన్నా!! అదేం స్పీడన్నా నీ హేండ్”   అని కనపడిన ప్రతి ఆర్టిస్ట్ కు నా స్ట్రోక్ గురించి చెప్పేవాడు. నాదే వుందిలే గానీ కర్నూల్ నుండి వచ్చే ఒక ఆర్టిస్ట్ పేరు గుర్తు లేదు లాంగ్ హెయిర్ రౌండ్ బ్రష్ పట్టుకుని కొణమాని కూడా సిగ్గు పడేలా సర్కిల్ గీసేవాడు ఒకే ఒక ఊపుతో. ఇట్లాంటి హేండ్ ముందు బాపు కూడా బలాదూరే అని జేజేలు కొట్టేవాళ్లం. ” అలాంటి రోజుల్లో బండ మీద నేను వేసిన ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి అప్పట్లో కొత్తపల్లి రోడ్డు తోవలో వెలిసింది, జనం దానికి కొబ్బరి కాయలు కొట్టి దండాలు పెట్టుకునేవారు. ఆ రోజుల్లోనే  కళారాజ్ అని ఒక ఆర్టిస్ట్ కర్నూల్లో ఏదో గొడవ అయితే పారిపోయి వచ్చి ఇక్కడ వుండే వాడు. చూడచక్కని నవ్వు, మంచి ఫిజిక్, గుండీలు విప్పి చాతీ అంతా చూపిస్తొ తిరిగేవాడు, మెళ్ళో శిలువ. మనిషి కూడా జీసస్ వలే ఉండేవాడు……

సశేషం ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.