ప్రాప్తం

– కన్నెగంటి అనసూయ

అడవి అంతా జంతువుల అరుపులు , కేకలతో గందరగోళంగా ఉంది.  ఆకలితో ఆహారాన్ని వెదుక్కుంటూ తోటి ప్రాణుల వెంట పరుగులు పెట్టే జంతువులు కొన్ని అయితే , ప్రాణభయంతో పరుగులు పెట్టేవి మరికొన్ని.

వేటి అవసరం  వాటిదే.

ఆ రోజు ఆహారం వెదుకులాటలో నక్కకు తినటానికి ఏమీ దొరకలేదు. కాసేపటికి వీర, ధీర అనే రెండు మిత్రులైన ఉడతలు దాని కంటపడ్డాయి.  మామూలుగా అయితే దానికి అవి ఏ మాత్రం సరిపోవు. కానీ ఆ రోజు ఏమీ దొరకకపోవటంతో..

ఎంతోకొంతలే అని ఆ ఉడుతలను తరమటం మొదలు పెట్టింది నక్క.

దాంతో భయం వేసిన ఉడతలు పరుగు పెట్తటం  మొదలు పెట్టాయి. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ  అయాసం వచ్చి రొప్పుతూనే దగ్గర్లో ఉన్న చెట్టు ఎక్కేశాయి.

ఉడతలు   చెట్టు ఎక్కెయ్యటంతో కాసేపు చెట్టు చుట్టూ తిరిగి చేసేదేం లేక నిరాశగా వెనుదిరిగింది నక్క.

అది చూసి “ హమ్మయ్యా” అనుకున్నాయి ఉడతలు  మనసులో.

అలసట తీరాకా..” వంట్లో సత్తువ ఉండబట్టి  బ్రతికి బయట పడ్డాము. లేదంటే నక్కకి ఈ రోజు ఆహారం అయిపోయే వాళ్లమే..” అంది వీర ధీరతో.

“ అవును. నిజమే. కానీ ఇవ్వాళ కాకపోతే రేపైనా మనం ఎవరికో ఒకరికి ఆహారం అయిపోతాము అలా కిందకు వెళ్ళామంటే. నాకు అదే భయం. మన కళ్ల ముందు ఎంతమంది మన ఉడతలు  పెద్ద ప్రాణులకు ఆహారం కాగా చూడలేదు మనం? మనమూ అంతే. “నిరాశగా అంది ధీర.

“ ..నాకూ అదే భయం. ఎప్పుడు ఏ జంతువు ఎటు నుండి వచ్చి తినేస్తుందో, ఏ పక్షి ఎటు నుండి వచ్చి ఎత్తుకుపోతుందో  తెలియదు. క్షణ క్షణం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి” అంది వీర.

“  ఎప్పుడూ ప్రాణభయమే మనకు. ఏమిటో వెధవ జీవితం.  అయినా ఇంత చిన్న ప్రాణిగా పుట్టకూడదు. పుడితే పెద్ద ప్రాణిగా పుట్తాలి. లేదంటే అసలు పుట్టకూడదు..అంతే..” అంది ధీర ఆయాసంతో రొప్పుతూ.

“ ఎందుకు పుట్తకూడదు?  పుట్టాలి. కాకపోతే ఇలా ఉడతలా పుట్తకూడదు.  ఏ చెట్టులాగానో పుట్తాలి. ఈ చెట్టుచూడు. చక్కగా దీనికి ఏ ప్రమాదమూ లేదు. ఎప్పుడూ ఉన్న చోటనే ఉంటుంది. ఆహారం కూడా వెతుక్కోనక్కరలేదు. పుడితే  ఈ చెట్టులా పుట్తాలి..” అంది వీర. అది విని ధీర ఏదో అనబోతున్నంతలో..

“మాకున్న కష్టాలు మాకూ ఉన్నాయి మిత్రులారా!  “ అన్న మాట వినపడి ఎవరా అని చుట్టూ చూశాయి ఉడతలు. ఎవ్వరూ కనిపించలేదు. ఇంతలో

“నేనే మిత్రులారా..! మీరు ఉన్నారే..ఆ చెట్టును మాట్లాడుతున్నా. మేమేదో అదృష్టవంతులమని కదా మీరు అనుకుంటున్నది. అది తప్పు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు..” అంది చెట్టు.

“ఏమిటది..?” అన్నాయి ఉడతలు ఆశ్చర్యంగా  చెట్టునే చూస్తూ.

“ మిమ్మల్ని ఆహారంగా భావించి  ఏ జంతువు అయినా మిమ్మల్ని తరిమితే మీరు పరుగులు పెడుతూ వచ్చి ఏ చెట్టెక్కి అయినా ప్రాణాలు కాపాడుకోగలరు..ఇదిగో ఇప్పుడు నక్క తరమగా  నా మీదకు ఎక్కి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు. మీకు అలా పారిపోగల అవకాశం ఉంది. కానీ నాకు ఆ అవకాశం లేదు కదా? గాలి వీచినా నాకే కష్టం. పైగా  ఏ మనిషి అయినా గొడ్దలితో వచ్చి నన్ను నరకబోతే మౌనంగా నేల పైకి ఒరిగిపోవటం తప్ప ఎక్కడికీ పారిపోలేను, ఎవరితోనూ చెప్పుకోలేను. కాబట్టి నాకంటే మీ జీవితాలే నయం.ఒప్పుకుంటారా? “ అంది చెట్టు.

“  నిజమే! నిజమే ! ఒప్పుకుంటాం” అరిచాయి ఉడతలు.

“ కాబట్టి.. ఏ ప్రాణి కష్టం ఆ ప్రాణిదే. ప్రాణం ఉన్నవాటికే కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే మన తెలివి తేటలతో వాటిని ఎదుర్కోవాలి. అంతేకానీ వాళ్లల్లా పుట్తలేదు, వీళ్ళలా పుట్తలేదు అని వేరే వాళ్ల జీవితాలతో పోల్చుకోవటం సరి అయినది కాదు.   జీవితం ఏదైనా సుఖాలు వస్తే ఆనందపడాలి. కష్టం వస్తే ఆ కష్టం నుండి బయట పడటానికి ప్రయత్నించాలి. అలా ఆ జన్మలో ఉన్న ఆనందాన్ని అనుభవించటమే జీవితం. నేనైతే ఈ చెట్టు జీవితం అదృష్టంగా భావిస్తున్నా..ఎందుకంటే రోజూ ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇస్తాను. ఇదిగో మీలా ప్రాణభయంతో పరుగులు తీసేవారికి రక్షణ  ఇస్తాను…ఇదేగా సుఖం , సంతోషం అంటే. ఇంతకంటే ఆనందం ఉందా? కాబట్టి మీ ఈ పుట్టుకను మరింత ఆనందంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించండి.”

అనేసరికి..చెట్టు మాటల్లోని నిజాన్ని గుర్తించిన ఉడతలు  అలాగే అన్నట్టు ఆనందంతో చెట్టు కొమ్మను వాటేసుకున్నాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.