చిత్రం-5

గణేశ్వరరావు 

ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ ధర్మమా అని అది ఎంత మారిపోయిందో!

ఎవరైనా చెబుతారు – ఫోటోగ్రఫీ ప్రక్రియలలో underwater ఫోటోగ్రఫీ ఎంత కష్టమైనదో అని. కారణాలు ఊహించగలరు. ముందు మీకు ఒక ఆరితేరిన మోడల్ దొరకాలి, నీళ్ళలో మునిగినప్పుడు మేక్ అప్ చెదరకుండా చూసుకోవాలి, ధరించిన దుస్తులు మోడల్నీ ను ళ్ళలో ముంచేయకూడదు.. అంతకన్నా ముందు ఆమె చలిని తట్టుకోవాలి, శరీరం గడ్డకట్టుకొని పోకుండా చూసుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి.

అన్నట్టు ఒక పాత సినిమా కబురు చెప్పనా? ’60 వ దశకంలో వొచ్చిన ఒక సినిమా లో అరడజను మంది నాయికల జలకాలాటల సన్నివేశం వుంది, తీరా షూటింగ్ మొదలు పెడతారనగానే – వాళ్ళ లోని అప్పటికే పేరు పొందిన ఒక హీరోయిన్ నీట్లోంచి బయటి కొచ్చేసి, ‘ఈ చన్నీళ్ళ లో స్నానం నా వలన కాదు బాబూ!’ అని మొండి కేసింది, అంత పెద్ద దర్శకుడూ ఆమె మాట వినక తప్పింది కాదు, స్టూడియో లో వేసిన తటాకం సెట్ లో నీళ్ళు బయటకి తోడించి, వేడి నీళ్ళతో దాన్ని నింపాకే కెమెరా ‘ఆన్ ‘ అయింది!

అమెరికన్ ఫోటోగ్రాఫర్ జెనా మార్టిన్ మొదటినుంచీ తనను తాను ఒక జల కన్యగా ఊహించుకుంటూ వచ్చింది, వృత్తి జీవితం మొదట్లో ఆమె తీసిన చాలా ఫోటో లలో మోడల్స్ గాలి లో ఎగురుతూ కనిపించే వారు, మొట్ట మొదటి నీట్లో ఫోటోను ఒక నీళ్ళ టబ్ లో షూట్ చేసింది. double exposures.తీసుకుంది.. ఇంటికి వెళ్లి ఫలితాలు చూసాక, ఆమె ఆనందానికి అవధులు లేవు, అంతే, ఇక వెనక్కి తిరిగి చూడలేదు, underwater photographer గా స్థిరపడిపోయింది. ఆమె అదృష్టవంతురాలు కూడా , మోంటానా ప్రాంతంలో ఆమె మాట వినే మోడల్స్ దొరికారు. ‘కలను కలగనడం ‘ అనే శీర్షిక తో ఎన్నో సీరీస్ షూట్ చేసింది. ఆలోచన ఆమెది, ఆచరణ మోడల్స్ ది, వాళ్ళకి నీట్లో ఎలా ఊపిరి తీసుకోవాలో ఆమె శిక్షణ ఇస్తుంది, ఎటు వంటి హావ భావాలు కనబరచాలో నేర్పుతుంది, తనదైన శైలిలో ముందు ఎన్నో ఫోటోలను విడి విడిగా షూట్ చేస్తుంది, ఒక్కో సారి అవి వందల్లో ఉంటాయి, చివరికి వాటి నన్నిటినీ ఒక దానిగా రూపొందిస్తుంది. ఇది చెప్పినంత సులభం కాదు, కావాలంటే నేను పోస్ట్ చేసిన ఫొటోనే చూడండి,అందులో జెనా కళాత్మకంగా సృష్టించిన మాయాజాలం అనితరసాధ్యం కాదూ! ‘బాహుబలి’లో తమన్నా జ్ఞాపకం వస్తోంది కదూ ? అయినా .. దేనికదే సాటి!

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.