ఇట్లు  మీ వసుధా రాణి 

ఆనందాంబరం మా నాన్న

-వసుధారాణి 

సహనసముద్రం మా అమ్మ గురించి ముందు కథలలో చెప్పుకున్నాం కదా.ఇక మా నాన్న గురించి కొన్ని కథలు చెప్పుకుందాం.

మా నాన్న కూతుర్ని అని ఒక విషయంలో చాలా సగర్వంగా చెప్పుకుంటాను నేను, అదేమిటంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు.నాకూ అదే వచ్చింది.మా నాన్న గురించి చెప్పుకోవాలంటే మొదట మా పితామహుల దగ్గరి నుంచి రావాలి.మా తాతగారి పేరు రూపెనగుంట్ల పిచ్చయ్య గారు ,మా నాయనమ్మ పేరు పర్వతవర్ధని.రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ స్వామి  రామనాధస్వామి,అమ్మవారు పర్వతవర్ధని అని తెలుసుకుని నాయనమ్మా! అనుకున్నాను.

మా తాత గారికి ఆరుగురు అక్కయ్యలు అందరిలోనూ  పెద్ద అక్కయ్య గారైన కావమ్మ గారికి పెళ్లి జరిగినప్పుడు ఆవిడ కాపురానికి వెళ్ళేటప్పుడు ఆవిడ  వెంట ఈ తమ్ముడు కూడా జంగారెడ్డిగూడెం వెళ్లాడట. బావాబావమరిది సినిమాలో హీరోయిన్ జయసుధ వెంట సుమన్ వెళ్తాడే అలా.

అక్కగారి అత్తవారిల్లు ఓ చిన్న సైజు జమీందారీ ఇల్లులా ఉండేదట.పాడి, పంట బోలెడు వ్యవహారం ఇదంతా.మా తాతగారు అక్కతో పాటు బోనస్ గా వెళ్ళింది కాక ఆ ఇంటి వ్యవహారాలలో బావగారికి కుడిభుజంలామారి బోలెడు చాకిరీ చేస్తూ ఉండే వారట.ఏదో సామెత ఉందికదా అలా ‘బావమరిది బతకగోరతాడు,దాయాదులు చావు కోరతారు ‘అని అలా అక్కగారి మీద ప్రేమతో ఆయన తన జీవితం గురించి కూడా ఆలోచించుకోకుండా ఆ జమీందారికి దివాన్ జీ టైపులో అక్కడే సెటిల్ అయ్యారు.

ఇక ఆయనకు పెళ్లిచేసే వయసు రాగానే గుంటూరు జిల్లా సాతులూరు చెందిన చెరువు సుబ్బయ్యగారు,వెంకాయమ్మ దంపతుల పెద్ద కుమార్తె పర్వతవర్ధనిని ఇచ్చి తాతగారికి పెళ్లి చేశారు.ఇది ఇంకా మహా ఆనందకరమైన విషయం అయ్యింది ఆ జంగారెడ్డిగూడెం వారికి ఎందుకంటే తాతగారితో పాటు మా నాయనమ్మ కూడా వారికి సేవలు అందించటానికి దొరికింది కదా.ఇదంతా సుమారుగా  1924 అప్పటి మాట .అమాయకత్వం,నిజాయతీ, ప్రేమాభిమానాలు నిండిన మనుషులు ఉన్న రోజులు.మా తాతగారు ఆ రోజుల్లో అప్పటి కాలానికి ఉన్నవారందరి కంటే ఇంకా మంచితనం,నిస్వార్థంగా ,నిజాయితీగా ఉండటం ఇంకొంచెం ఎక్కువ పాళ్లు కల వ్యక్తి.1926 లో అనుకుంటా నాకు కరెక్టుగా సంవత్సరం తెలీదు మా నాన్న పుట్టారు.

 చాలా అందమైన రూపం ఉంగరాల జుట్టుతో మానాన్న చిన్నప్పుడు చాలా బాగుండేవాడని మా నాయనమ్మ చెప్పింది.ఆవిడ చెప్పకపోయినా మా నాన్నను చూసిన  ఎవరైనా సమ్మోహనం అవ్వాల్సిందే,కనుక చిన్నప్పుడు ఆయన చాలా చక్కగా ఉండి ఉంటారనే అనిపిస్తుంది ఎవరికైనా.ఆయనలో ఇంకో ఆకర్షణీయమైన విషయం నవ్వుమొహం .

మా తాతగారి ముందే తెలుసో అలా పేర్లు పెట్టుకుంటూ పోయారో తెలీదు కానీ మా నాన్నగారి తరువాత నలుగురు కొడుకులు పుట్టారు .మా నాన్ననుంచి మొదలు పెట్టి ఒక్కొక్కరి పేర్లు ఇలా ఉన్నాయి చూడండి.రామదాసు మానాన్న,కృష్ణదాసు మా పెద్ద బాబాయి,తరవాత వరుసగా మోహనదాసు,గోపాలదాసు,చివరగా శ్రీధరదాసు(హరిదాసు).ఇలా దాససాంప్రదాయానికి ప్రతీకల్లాంటి పేర్లు పెట్టుకున్నారు అయిదుగురు కొడుకులకు.మొత్తం మొగపిల్లలే అవ్వటం తో మాకు మేనత్తలే లేకుండా పోయారు.

మొత్తానికి మా నాయనమ్మ ఆడపడుచు కనుసన్నల్లో ఆ ఇంటెడు చాకిరీ చేస్తూ ఈ పిల్లల్ని పెంచుకుంటూ సత్తెకాలపు సత్తెయ్య లాంటి మా తాతగారితో కాపురం వెళ్లబుచ్చుతూ ఉండగా. కావమ్మగారి భర్త అదే మా తాతగారి బావగారు కాలంచేశారు.మా తాతగారు ఇంకా మరిన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని మేనల్లుళ్ళకి నొప్పి తగలకుండా సకల కార్యాలూ ఆయనే చూసుకుంటుండే వారట.చిన్నగా మేనల్లుళ్లు ఎదిగి వారికి పెళ్లిళ్లు అయ్యి సంసారం సాఫీగా సాగుతుండగా.

పొలంలోఈ ఏడు  ఏమి పంట వేయాలి అని చర్చ వచ్చినప్పుడు మా తాతగారు ఈ పంట  వేద్దామురా అని పెద్ద మేనల్లుడికి సలహా ఇచ్చారట.సరే ఆయన సలహామేరకే పంట వేశారు. ఎన్నో ఏళ్లుగా ఎప్పుడూ లేనిది మా తాతగారి అంచనా తప్పి పంట సరిగా పండక నష్టం వచ్చిందట.

ఓ సందె వేళ అందరూ మంచాలు ఆరుబయట వేసుకుని కూర్చుని కబుర్లాడుకునే సమయాన పెద్ద మేనల్లుడు మామయ్యా నీ సలహా విని పంట వేస్తే నష్టం వచ్చింది చూడు అన్నాడట.అంతే మా తాతగారు ఇన్నేళ్లగా అక్క కుటుంబానికి చేసిన సేవ ,ఒనగూర్చిన లాభాలూ అన్నీ మర్చిపోయి.నా పొరపాటు నిర్ణయం వలన మేనల్లుడికి నష్టం జరిగింది అని తెగ విచారపడిపోయి తన జీవితం,పెళ్ళాం పిల్లలు ఇవేమీ ఆలోచించ కుండా.

మేనల్లుడితో ఒరేయ్ ! మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మీ నిర్ణయాలు మీరు తీసుకోగలరు ఇంక నేను అక్కతో పాటు ఇక్కడికి వచ్చిన పని అయిపోయిందిరా అని ఎవరేమి చెప్పినా వినకుండా తెల్లారి కట్టుబట్టలతో పెళ్ళాం పిల్లలతో జంగారెడ్డిగూడెం వదిలి విజయవాడ వచ్చేసారట.

ఒక మనిషి చిన్నతనం నుంచి తన తెలివి,సమయం ,శ్రమ నిస్వార్థంగా ఒక కుటుంబానికి ధారపోసి ఒక చిన్నమాట పట్టింపుతో అన్నీ వదిలేసుకొని వచ్చేయటం పిచ్చితనంలా అనిపించింది నాకు చిన్నప్పుడు మా నాయనమ్మ,మా తాతగారి  చిన్నఅక్క దగ్గర ఆయన కథ విన్నప్పుడు. జరిగిన పొరపాటుకు బాధ్యత వహించడం,ఎదిగిన మేనల్లుళ్ళ దగ్గరనుండి గౌరవంగా తప్పుకోవటం ఆయన నిజాయితీ,మంచితనం అని ఇప్పుడు అనిపిస్తుంది.

అలా ఏమీ లేకుండా నిరాధారంగా బయటికి వచ్చిన ఆయన తిరిగి మా ఊరు రూపెనగుంట్ల కూడా వెళ్ల లేదు.విజయవాడలో ఓ చిన్న పాక ఇల్లు అద్దెకు తీసుకుని.ఎక్కడో లెక్కలు రాయటానికి ఉద్యోగం కుదుర్చుకుని,పిల్లలను బళ్ళలో చేర్పించుకుని కొత్త. జీవితాన్ని ప్రారంభించారు.

అయితే లోపల ఎటువంటి మానసిక సంఘర్షణకు గురిఅయ్యారో కానీ మా నాన్నగారి పధ్నాలుగవ ఏటనే తాతగారు కాలంచేశారు.మా నాయనమ్మ పాపం ఈ అయిదుగురు చేతికి ఇంకా అందిరాని  కొడుకులతో ఎన్ని కష్టాలు పడిందో ఎలా పిల్లల్ని ఎక్కతీసిందో కానీ మా నాన్న పదహారు ఏళ్ళు వచ్చేసరికి sslc, puc అలాంటి చదువు వరకు చదివి మొత్తానికి ఓ ఉద్యోగంలో చేరి సంపాదనా పరుడు అయ్యాడు.

ధనార్జనావకాశాలు తక్కువగా ఉన్న కాలం అది పైగా ఈ పిచ్చయ్యగారికి కొడుకేగా మా నాన్న కూడా ఎవరి దగ్గరికీ వెళ్లటం అర్ధించటం అలాంటివి లేవు.పైగా ఆరోజుల్లో యువతను జీవితంలో ముందుకుపోనీయకుండా పక్కదారి పట్టించిన నాటకాలు లాంటి కళాపోషణ కూడా మా నాన్నకి అబ్బింది.ఇంకేముంది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం ఆ తర్వాత మిత్రులతో నాటకాలు,రిహార్సిల్సు ఇలా సినీ నటి సావిత్రి తో కలిసి ఒక నాటకం వేసినట్లు చెప్పాడు నాన్న నాకు చిన్నప్పుడు.

మా నాయనమ్మకి కూడా అమాయకత్వం కొంత ,ఆ కాలంలో గల సామాజిక ప్రాధాన్యత మొగపిల్లల తల్లిని అని మూర్ఖత్వం కొంత ఉండటం చేత మా నాన్నగారిని సరిగ్గా బాధ్యతాబధ్ధుణ్డి  చేయటంలో ఆవిడ విఫలం అయింది.

ఇక ఇలాంటి సన్నివేశం జరుగుతుండగా మా  పెద్ద అమ్మమ్మ ఎలా మా అమ్మని నాన్నకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది.ఆవిడని ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏమిటి అన్న కథ వచ్చే నెలలో .

అప్పటిదాకా ఇట్లు మీ వసుధారాణి.

*****

 
Please follow and like us:

One thought on “ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న”

  1. వంశవృక్షం బొమ్మ గీస్తున్నారా ? ఇంకా మొక్క చిగుర్లు పెట్టకుండానే పూల వాసన తగులుతుంది. జీవితంలో అన్నిటికంటే విలువైనవి పూర్వీకుల అడుగుల్ని గుర్తించటం …ఆ నడకల్ని పరిశీలించటం .ఆ జ్ఞాపకాల్ని అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుని గుండె తడిని అలానే ఉంచుకోవటం … తాతయ్య అలా వచ్చేయటంలో మంచి చెడ్డ ఎంచటం అనవసరం ..ఎందుకంటే కథ ముందుకు వెళ్తుంది …ఎవరి నడక వాళ్ళే నడవాలి ..ఇప్పుడు ఆశక్తి పెరిగింది …వసుధ గారు ఎప్పుడు ప్రవేశిస్తారా అని ……

Leave a Reply

Your email address will not be published.