కనక నారాయణీయం-3

-పుట్టపర్తి నాగపద్మిని

అలా, ఎన్నెన్నో నా పుణ్యాల ఫలంగా, విజయ నామ సంవత్సరం (1953), ఆషాఢ శుద్ధ అష్టమి, (రేపు అష్టమి అనగా) ఆదివారం తెల్లవారుఝామున 3.10 నిముషాలకు, నేను కడపలో మా అమ్మ,అయ్యల సంతానంగా పుట్టగలిగాను. (ఈ విషయం  అయ్యగారి వ్రాతలోనే చూసినప్పుడు, ఎంత ఉద్వేగానికి గురయ్యానో తెలుసా?) హమ్మయ్య…నా పేరు వెనుక నేపథ్యం అదండీ!! ఆ మాట కొస్తే, మా తోబుట్టువుల పేర్లకూ ఒక్కొక్క నేపథ్యం ఉంది.

  మామూలుగా, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు, వాళ్ళ పెద్దల పేర్లే పెట్టే పద్ధతి పాతకాలంలో  ఎక్కువగా ఉండేది కదా!! రోజులు మారి, తాము అభిమానించేవారి పేర్లు కూడా పెట్టే పద్ధతి కూడా ప్రాచుర్యానికి వచ్చింది.ఇప్పట్లో కొత్తదనం కోసం అన్వేషించి మరీ పెడుతున్నారు. మన భాషలో దొరక్కపోతే, వేరే భాషలలోని పేర్లనూ పెడుతున్నారు కూడా కదా!!  ఇప్పుడా మాట అటుంచి, ప్రస్తుతంలోకి వచ్చేద్దాం.

మా పెద్దక్కయ్య (జననం : 18-12-1939) పుట్టినప్పుడు, మా అయ్య భవభూతి ఆరాధనలో మైమరచిపోతుండేవాళ్ళట!!   ‘ఏకో రస: కరుణ యేవ!! ఇంకేముంది? ఆమె పేరు ‘కరుణ’. రెండో అక్కయ్య (జననం : 11-9-1942) పేరు ‘తరులత’. లేత వయస్సులోనే పరిణత భావాలతో కవితా మాలికలల్లిన బెంగాలీకవయిత్రి తోరుదత్ పేరే స్ఫూర్తి – యీ పేరుకు!! అటు తరువాత, ఒక కుమారుడు కలిగాడు. (సంవత్సరం రికార్డ్ కాలేదు మరి..) కృష్ణచైతన్య సంప్రదాయం, అయ్యలో గూడు కట్టుకుని పోయిన ఆ రోజుల్లో ఆ చిన్నారి ‘కృష్ణ చైతన్య’ అయ్యాడు. (ఆరేడునెలలకే ఆ శిశువు కన్నుమూశాడట!!)  1948 ప్రాంతాల్లో అయ్య, మరాఠీ సాహిత్య ప్రభావంలో ఉన్నారు. ఆ ప్రభావంతో, ఆ రోజుల్లో పుట్టిన మా మూడో అక్కయ్య పేరు ‘తులజ’ అయింది.(జననం:1-1-1948) మా అన్నయ్య పేరు ‘అరవింద్’ కావటానికి కారణం, అయ్య మనసులో స్థిరంగా నెలకొన్న అరవింద యోగులవారు. (జననం : 3/4.5.1949) అష్టగ్రహ కూటమి వేళలో పుట్టిన మా చిన్నారి చెల్లి (జననం: 4-3-1962) అయ్య శ్రీరాధాదేవి ఉపాసన కారణంగా ‘అనూరాధ’ అయింది. ఈ విధంగా, మా తోబుట్టువుల నామకరణలాల వెనుక అయ్య జీవన క్రమమూ తెలుస్తున్నది కదా!! అసలు, మా అందరి  పుణ్యఫలమైన జన్మలకు కారకులైన మా అమ్మా అయ్యల పుణ్య దాంపత్య నేపథ్యం కూడా మీకు తెలియాలి గదా!!!

     లెక్క ప్రకారం, యీ ధారావాహికలో. ఇప్పుడే నా జన్మ వృత్తాంతం చదివారు కదా!! అంటే, అమ్మ పొత్తిళ్ళనుంచీ బైటికి వచ్చి,అడుగులు, మాటలూ నేర్చి, నా చుట్టూ అల్లుకున్న నా  ప్రపంచాన్ని చూస్తూ నా భావాలను మాటల్లో పొదగటానికి సమయం పడుతుంది మరి!! ఈ లోగా, పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు, ధన్నవాడ కిడాంబి కనకవల్లిల నేపథ్యం, ,వీరిరువురి మూడుముళ్ళ బంధం లో ముప్పేటల అల్లుకున్న రాగాల పందిరి గురించి (నేను విన్న) విశేషాలు మీ కోసం!!   

 మా అమ్మా అయ్యల కల్యాణ నేపథ్యమూ ఎంత ఆసక్తిదాయకమో, మా అమ్మమ్మ శ్రీమతి కిడాంబి శేషమ్మగారి ద్వారానే విన్నాను. అప్పటి పెద్దల కోపతాపాల ముచ్చట్లూ, పెళ్ళిళ్ళు కుదిర్చే పద్ధతుల కబుర్లూ  కూడా తెలిసే ఆ ఆసక్తిదాయకమైన సంగతులు, ఇదుగో !!!

    ఆ నేపథ్యానికో నేపథ్యం ఉంది మరి!! ఇదేదో గొలుసు కథలా ఉందే అనుకుంటున్నారా!! మన పూర్వ కథాసాహిత్యమంతా గొలుసు కథల మయమే కదా మరి!! వాల్మీకి రామాయణ అయోధ్యకాండలో  జాబాలితో వాగ్వివాదం తరువాత, వశిష్టుడు, రామచంద్రునికి చెప్పే, వంశవృక్ష వర్ణనలో దశరథుని తాత ముత్తాతల వివరాలన్నీ పూసగుచ్చి చెప్పిన సంగతి మీకు తెలుసు కదా!! అది చదువుతూ నేనూ ఆశ్చర్యపోయాను, ఎందరో రాజుల గురించి తెలిసి ఆనందించాను కూడా మరి!! ఇప్పుడు నేను చెప్పబోయే ఉదంతం, విషయాంతరమైనా విలువైనదే అని నా అభిప్రాయం. చదివేద్దురూ ఓపికతో!!

  మా తాతగారిపేరు శ్రీనివాసాచార్యులు. కల్యాణదుర్గంలోనూ,పెనుగొండలోనూ తెలుగు పండితులుగా వారు పనిచేశారు. మా అయ్యగారి మాతృమూర్తి పేరు మెండమ్మ.  అలమేలు మంగమ్మకు అచ్చతెలుగు పేరు మెండమ్మ. వారిరువురిదీ పెద్దలు మెచ్చిన ప్రేమ వివాహంకావటం వల్ల, ఇద్దరూ చిలకా గోరింకల్లా చూచెడువారలకు చూడముచ్చటగా, కాపురం చేసుకునేవారట!! మా అవ్వగారు (మెండమ్మగారు) అప్పటికే సంస్కృతాంధ్ర పంచకావ్య పఠనం చేసి ఉన్న పండితురాలు. మా తాతగారేమో అంతగా చదువుకోలేదు. ఎప్పుడైనా వాదోపవాదాల్లో తాతగారికి ఓటమి తప్పేది కాదు మరి!! మెండమ్మగారు భర్తను ఆటపట్టించేవారు. కొన్ని రోజులు ఓర్చుకున్నా, తాతగారు భరించలేకపోయారు. ఓసారి ఏదో మాటామాటా వచ్చి, మా తాతగారు, ‘పంచకావ్యపఠనం చేసిగానీ, ఇంటి గడప తొక్కనని’  మైసూరు పరకాలమఠానికి వెళ్ళి, అక్కడ గురుకుల పద్ధతిలో, విద్యాపారీణునిగా రూపొంది ఇంటి గడప తొక్కారట!! అదీ కదా పట్టుదలంటే!! చూశారా, అప్పటి పట్టుదలల పసందైన ముచ్చట!!

   మా తాతగారిది చక్కటి శ్రావ్యమైన కంఠం. పెనుగొండలో జరిగే సభల్లో, తప్పనిసరిగా మా తాతగారి కవితా పఠనం ఉండవలసిందేనట!! ఆశువుగా వందలకొద్దీ పద్యాలు ధారాప్రవాహ సదృశంగా చెప్పేసేవారట వారు!!

పరదారలు, పరధనములు,

పర సుఖముల  తెరవులేని పరమ పవిత్రున్

డరుదెంచున, పరికించున,

కరుణించున నన్నటంచు, గంగ దలంచున్!!

ఇలా అన్నమాట!! కానీ, ‘వ్యాస వాల్మీకాదులు, భారవి, భవభూతులముందు తామేపాటి?’అన్న వినయసంపన్నతతో, వారు తమ రచనలనేమాత్రం భద్రపరచుకోనేలేదట!!

  ఇదిలా వుండగా,  28-3-1914 లో మా అయ్య, తరువాత రెండేళ్ళకు మరో పుత్రుడు.నరసిమ్హాచార్యులని పేరు పెట్టారు ఆ కుమారునికి!!మా నాన్నమ్మగారుకూడా కావ్యపఠనం చేశారన్నాను కదా!!మా అయ్యగారితో  చిన్న చిన్న శ్లోకాలూ, పద్యాలూ వల్లె వేయించేవారట ఆమె!! ముద్దుముద్దుగా వాటిని బాల నారాయణులు పలుకుతూంటే, మురిసిపోయేవారట, ఆ తల్లీతండ్రీ!! మా తాతగారు ఊరికెక్కడైనా వెళ్తే, భార్యాభర్తలిద్దరికీ, పద్యాల మాధ్యమంగానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవట!! (ఇప్పుడే దంపతులైనా కవితల మాధ్యమంగా ఉత్తరాలు వ్రాసుకుంటున్నారా మీరే చెప్పండి?? అసలు లేఖారచనకే కాలం చెల్లిపోయింది కదా, మనం చూస్తుండగానే…ప్చ్…)

      అలా,  మెండమ్మగారు, మా అయ్య చిన్నారి చిలిపి చేష్టలను పద్యరూపంలో ఉత్తరంలో వ్రాసినట్టు తన చిన్నప్పటి జ్ఞాపకాల్లో అయ్య వివరించారు, లత మాసపత్రికలో ఓసారి !! (మోహనవంశి లతగారి సంపాదకత్వంలో,1967 ప్రాంతాల్లో, కొన్ని నెలలపాటు గుంటూరునుండీ వెలువడి, అర్ధాంతరంగా ఆగిపోయిన మాసపత్రిక)

సీ.  అన్న రారా చల్ది ఆరగింతువటన్న

 రాను రానంచు మరాము సేయు,

అన్నంబులోనొక్క గడివెట్టినంత నా

 కలి లేదటంచు మొగాన నుమియు,

 నీలాల కనులలో నిల్వనుత్సాహంబు

బుడి బుడి నడల యెత్తుకొమ్మని చేతులెత్తు పైకి,

తే.  కురులు ఫాలస్థలంబున గుణిసియాడ,

 కాళ్ళ గజ్జెలు ఘలు ఘల్లు ఘల్లుమనగ,

 తాను నర్తించు థయి థయ్యి థయ్యియంచు,

 చిన్నపాపడు సుఖముగ నున్నవాడు.

(జీవితం అనుభవాలు, లత సెప్టెంబర్ 1967)

     ముచ్చటగా మూడవ   కానుపులో ఆడపిల్ల, ఇందిర జననం.ఆ తరువాత, తీవ్ర అనారోగ్యంతో, మా అవ్వ, మెండమ్మ, అకాల మరణంపాలయ్యారు.  తాను అమితంగా ప్రేమించే సహధర్మచారిణి అకాల మరణం, పుట్టపర్తి వారి అయ్యగారిని (మా అయ్యగారు కూడా, వాళ్ళ తండ్రిగారిని ‘అయ్య..’ అనే సంబోధించేవారు మరి..)  కృంగదీసింది. వియోగబాధలో, పిచ్చివాడై, ఇంటినీ, పిల్లలనూ, అశ్రద్ధ చేస్తున్న వైనం చూసి, పిల్లలను పుట్టపర్తివారి పెద్దమ్మ (అమ్మగారి అక్కయ్య) లక్ష్మీదేవమ్మ తనతో చియ్యేడుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ పెద్దమ్మ ‘తల్లిలేని పిల్లలు..’ అని గారాబం చేయటం వల్ల, బాలనారాయణునిలో పెకెతనం, మొండితనం, అల్లరి కూడా పెరిగిపోయాయి. అక్కడి బావుల్లో ఈతలు, అల్లరి మూకతో ఆటలూ,ఊర్లోని వేణుగోపాల స్వామి గుడిలో బాలకృష్ణునితో మంతనాలూ,  ఊరికి దగ్గరి దుర్గం కొండమీద కాటమయ్య గుడికి వెళ్ళీనప్పుడు అక్కడ పాత శాసనాలతో ముచ్చట్లూ.. .ఇలా ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచిపోతున్నాయి రోజులు!!   

       చియ్యేడుకు దగ్గరగా చిన్న చిగుళ్ళరేవులో నివాసమున్న మరో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ చిత్రావతి నది అందాలు బాలనారాయణుణ్ణి తెగ ఆకర్షించేవట!! అక్కడి సైకత తీరాల్లో కూర్చుని అల్లిబిల్లి కవితలల్లుకునేవారట వారు!! 

   భార్యావియోగం తరువాత, దాదాపు పదేళ్ళు ఒంటరి జీవితం గడిపిన శ్రీనివాసాచార్యులవారు,  పిల్లలను పరాయి వారిపై వదిలివేయటం భావ్యం కాదని, బంధువులు చేసే ఒత్తిడి మేరకు, 1926లో పునర్వివాహం చేసుకున్నారు. పుట్టపర్తికి అప్పుడు, పన్నెండేళ్ళ వయసు.  అప్పటినుంచీ, పుట్టపర్తి నివాసం పెనుగొండే!! తండ్రిగారూ గొప్ప పండితులవటం వల్ల,రాళ్ళపల్లి సోదరులూ, అణ్ణంగరాచార్యులు – వంటి పండితోత్తములెందరో తరచు ఇంటికి వచ్చివెళ్తుండటం వల్ల, ఆ పండిత చర్చల ప్రభావం బాగానే పడుతున్నా, వయసు ప్రభావమూ పుట్టపర్తితో చాలా అల్లరిపనులే చేయించింది.  

తండ్రిగారి పునర్వివాహమయ్యేనాటికి పుట్టపర్తి వయసు పన్నెండేళ్ళు. ఆ వయసుకు తగ్గట్టే, ఇరుగు పొరుగు పిల్లలతో కొట్లాటలు, పినతల్లి మాట ఏ మాత్రం లక్ష్యపెట్టక, ఇంట్లోని ఇనుప బీరువాలోని లక్ష్మీ కాసులు దొరికినన్ని జేబుల్లో వేసుకుని దగ్గరలోని బెంగలూరుకు స్నేహితులతో ఉడాయించి, అక్కడ ఇష్టం వచ్చినట్టు వాటిని ఖర్చు పెట్టి, ఐపోయిన తరువాత అమాయకులవలె ఇంటికి వచ్చి, వారి అయ్యగారి చేతిలో చావు దెబ్బలు తినటం వారి లీలల్లో ఒకటి. రంగు రంగుల సోడాలు తెగ తాగుతూ, దానికి తోడు, రంగుల కళ్ళద్దాలు పెట్టుకుని, విలాసంగా బీడీ పొగ రింగులు రింగులుగా వదులుతూ, పోజులు కొట్టటం రెండో లీల. పావురాలు పెంచటం మరో క్రీడ!! సునకాలను పట్టుకుని, వాటికి శిక్షణ ఇవ్వటంలో సిద్ధహస్తులట వారు అప్పట్లో!! ఇంటికి దగ్గర్లోని వకీలు ఇంటికి కేసుల కోసం వచ్చినప్పుడు సరిగ్గా కుక్కలకు శిక్షణ మొదలు పెట్టేవాళ్ళట, ఆ కుక్కల కఠిన శిక్షణలోని అరుపులకు, లోపల వకీలు గారికి వచ్చిన వాళ్ళేమి మాట్లాడుతున్నారో అస్సలు వినబడకుండా!! ఈ దెబ్బకి ఆ వకీలుగారు, బ్రతిమాలి, బామాలి, డబ్బులిచ్చి, ఆ శునక శిక్షకుడైన బాల నారాయణుణ్ణి అప్పటికి వదిలించుకునేవాళ్ళట!! మళ్ళీ ఎవరైనా వస్తే, షరా మామూలే!! వరుసకు పెద్దయ్య ఐన బంధువు ఇంట్లో గుర్రబ్బండీ ఉండేదట!! ఆ రోజుల్లో సొంత గుర్రబ్బండీ ఉండటం ఒక హోదా!! ఆ గుర్రం పై సవారి చేయాలని పుట్టపర్తికి తగ ఉబలాటం. దానికి నీళ్ళు తాగించే మిషతో బైటికి తీసుకెళ్ళీ, స్వారీ చేయటానికి ప్రయత్నం, కింద పడి దెబ్బలు తగిలించుకోవటమూ..ఇవన్నీ సదా ఉండేవే!! ఇవే కాదు. అప్పట్లో పెనుగొండ చుట్టూ, ద్రాక్ష, దానిమ్మ, అంజూర వనాలు చాలా ఉండేవట!! (ఇప్పుడేవీ లేవుగా, అక్కడ కూడా కాంక్రీటు వనాలే ఇప్పుడు..) ఆ తోటల్లో పళ్ళు దొంగిలించి అమ్ముకోవటం కూడా!! అప్పట్లో బొగ్గు ఇంజను రైళ్ళూ గొప్ప ఆకర్షణ కదా మరి!! తికెట్టు కొనకుండా ప్రయాణించటం మరీ గొప్ప ఆకర్షణ బాల నారాయణునికి!! వారి యీ బాల్య క్రీడల్లో వారికి తోడు, సమ వయస్కులైన పాముదుర్తి నారాయణ, హెచ్.ఎస్.నారాయణ, వానవెల్లి నారాయణలు!! వీళ్ళను దుష్ట చతుష్టయమనేవాళ్ళట, ఇరుగుపొరుగుల వాళ్ళు!!

     పెనుగొండ కొండలలో కొండ చిలువలూ, నెమళ్ళూ కూడా ఎక్కువే!! ఈ దుష్ట చతుష్టయానికి ఆ కొండలే ఆటల నెలవులు. జింకలనూ పట్టుకునే వాళ్ళు. శరీర దార్ఢ్యం మీద కూడా దృష్టి మళ్ళించేవాళ్ళు అప్పుడప్పుడూ!! సాము గరిడీలు, కుస్తీలు, దండీలు..ఇవన్నీ కూడా ఓ పట్టు పట్టేవాళ్ళట!! వైవిధ్య భరితమైన యీ అల్లరి, పుట్టపర్తి వారి తండ్రికి తలనొప్పులుగా మారాయి. ఇరుగు పొరుగు వాళ్ళ ఫిర్యాదులు, తెగ కోపం తెప్పించేవి. ఫలితం, బాల  నారాయణునికి బడితె పూజ!! 

*****

(ఫోటో – మా అయ్య (పుట్టపర్తి )చేతి వ్రాత లో..నా పుట్టినరోజు వివరాలు.)

 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.