పునాది రాళ్ళు-5

-డా|| గోగు శ్యామల 

 రాజవ్వ 

  ఉత్తర తెలంగాణా ప్రజల పోరాటాలతో అట్టుడికిపోతోంది. 1970 వ దశకంలోని హిందూ ఆధునిక దొరల అధికారపు గడీలలో, పొలాలలో కుదురుపాకలోని ప్రతి మాదిగ ఇంటినుండి వెట్టి చేయడానికి వెళ్లేవారు.  అంతే కాక పేదలు , సన్నకారు రైతుల భూములను, దళితుల దేవుని మాణ్యాలను, పోరంబోకు వంటి వివిధ రకాల పేదల భూములను చట్టవిరుద్దoగా దొరలు తమ ఆధీనం లోకి తీసుకున్నారు. ఇదే తీరు సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతాల్లో భూములు కాజేయబడ్డాయి.  బలవంతంగా, చట్టవిరుద్ధంగా భూములను ఆక్రమించిన వారు, వెట్టి విధానం చేయించే వారు. ఇదే ‘లాండెడ్ జెంట్రీ, అచ్చమ్ వీరే 70 వ దశకంలో సివిల్ కాంట్రాక్టార్లుగా, వడ్డీవ్యాపారులుగా , సారా కాంట్రాక్టర్లుగా కూడా వీరే వ్యాపారం చేశారు ‘  అని వినుకొండ తిరుమళి తన రచనలో పేర్కొన్నడు. ఈ రకంగా సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ప్రజా ప్రతినిధులుగా, రేషన్ షాప్ డీలర్లుగా , పోలిష్ అధికారులుగా కూడా దొరలే కొనసాగుతున్న పరిస్థితి. వీరందరూ వెట్టి దోపిడీని, కుల పితృస్వామ్య హింసలను మరింత పెంచేవిగానే పని చేశారు. అందుకొరకే దళితులతో సహా గ్రామంలోని ప్రజలంతా ఎంఎల్ పార్టీ మద్దతు తీసుకొని  పోరాటానికి సిద్దమైండ్రు. ఆ విధంగా వెలివాడల మరియూ ఊరులో నుండి రాజవ్వతో సహా ఆడోళ్లు మొగోళ్ళ పోరాటానికి సిద్దమైండ్రు.

 ఐతే , ఇక్కడ  భూమికోసం పోరాడిన రాజవ్వ కథను గమనిస్తే మనకు 1940 దశకం లో తన భూమికోసం  విసునూరిదొరకు వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ యాదికొస్తుంది. కాలం, జిల్లా అనే మార్పులున్నా వ్యవసాయ  శ్రామిక స్త్రీ తన భూమి కోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన  పోరాటం అనే పోలిక మాత్రం ఒక్కటే . మరోవైపు భూమికై నడిచిన ఉద్యమాలకు మరియు  స్త్రీల ఉద్యమాలకి 40 వ దశాబ్దపు ఐలమ్మ పోరాటం మలుపు తిప్పిందనే చెప్పాలి . అయితే 70 దశాబ్దపు భూమిప్రతాలను  రాజవ్వ పోరాటం మలుపు తిప్పిందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య తులనాత్మక పరిశోధన జరగాల్సిన అవసరం ఇంకా మిగిలే ఉన్నది.  

1978- 1980 కాలంలో కాంగ్రెస్ హాయాంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి కొనసాగుతున్నపుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటిoచింది. వెలమ కుల దొరలకు భూసంపన్న నాయకులను వారి భూములను రక్షించే గురుతర భాద్యతను నాటి ప్రభుత్వం చేపట్టిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.  కనుకనే కుదురుపాకతో సహా అన్ని గ్రామాల ప్రజలు కనీసపు మానవ హక్కులను కొల్పోయారనే చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలైన అసెంబ్లీ, జుడీషియరీ ,పాలనా వ్యవస్థలు తమ కనీస బాధ్యతలకు నిర్వహించ కోలేక పోయాయి. కేవలం వెలమ దొరల ఆస్తులను సంపదలను కాపాడే బాధ్యతను మాత్రమే నిర్వహించారని. నాడు ప్రజలు తమ ఉనికి భూమి కోసం వివిధ సంఘాల ఆధ్వర్యంలో అనివార్యంగా ఉద్యమించారనే చెప్పాలి.

         అందులోభాగంగానే ఒక ప్రత్యేకమైన సంఘటన ఇక్కడ చేసుకోవాలి . అది 1978  సం,,రం. రైతుకూలి సంఘo ఆధ్వర్యంలో కుదురుపాక గ్రామంలోలని దొర గడి ముందు నిర్వహించబడుతున్న పెద్ద బహిరంగ సభలోరాజవ్వ ప్రసంగిస్తున్నది.  భూమి తమ జీవితంలో ముఖ్యమైంది. మాభూమి మాకు వచ్చేంత వరకు పోరాడుతాము, మేము మా తాతల కాలం నుండి మీకు ఊడిగం చేస్తున్నాo. మాకు ఇప్పుడు మా భూమి మాకు దక్కేంత వరకు ” మీకు  పని చేయం. నీ వాకిట్లోకి, మీ గడీలకు అడుగు పెట్టను” పోరాటం చేస్తామని ప్రమాణం చేసింది రాజవ్వ. ఆమె నోటా ఆ మాటలు విన్న సభలోని వారు ఉద్వేగంతో నినాదాలు ఇచ్చారు ” దొరల గడీలను గడ గడ లాడించిన రాజవ్వ పోరాటాలు  ” వర్ధిల్లాలి. భూమి పోరాటాలు వర్ధిల్లాలి’. ‘ రాజవ్వ నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలు మిన్నంటాయి. ఈ మీటింగులో చుట్టు పక్కల గ్రామాల చిన్న సన్న కారు రైతులు, వెట్టిలో మగ్గే కులాలు, యువత, పిల్లలు అందరూ ఉన్నారు.  సొంత ఊరులో ఉన్నదొర గడికి ఎదురుగా నిలబడి ‘మా భూమిని మాకు పంచు దొరా, పంచేంత వరకు వెట్టి కాదు కదా నీ వాకిట్లకు కాలు కూడా వెట్టం. ఈ సభలో నిలవడి చెపుతున్నాం ‘ అని దాదాపు ఒట్టేసి చెపుతున్నట్లు చెప్పింది. నాయకురాలు కాబట్టే రాజవ్వ ఆరకంగా మాట్లాడగలిగింది. కానీ కుదురుపాక గ్రామంపై దాడులు, రాజవ్వాఫై అత్యాచారం జరిగిన తరువాత పార్టీ ఆమెను నాయకురాలిగా కాకుండా బాధితురాలిగానే ఎక్కువ ప్రచారం చేసిందని గమనించాలి.    

     కరీంనగర్  పోరాట చరిత్రలో  ఈ సభ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది.  కారణం రాజవ్వ దృష్టి అంతా కూడా తమకు, తనకు రావాల్సిన భూమి మీదున్నది. ఇంకా ఆ భూమి తమకు  రావడంలో ఎదురౌతున్న దొర పెత్తనంలో కలగలసిన కులం పితృస్వామ్యం భూసంపన్నుల ఆధిపత్యం అనే వివిధ పెత్తనాలూ ఉన్నాయి.   ఎం ఎల్ పార్టీ లక్ష్యానికి రాజవ్వ అవసరానికి మధ్య స్పష్టమైన తేడా పొడచూపిందని ప్రత్యేకంగా చెప్పాలి. రాజవ్వ అవసరం   భూమి దక్కాలి. దొర అణచివేత పోవాలి అనేది. ఐతే పార్టీ లక్ష్యం విప్లవంను సాదించాలి, దానికోసం సాయుధ పోరాటాన్ని చేయాలి. సాయుధ పోరాటం కోసం సైన్యాన్ని తయారు చేయాలి.  కాబట్టి వివిధ అనుబంధ సంస్థలను పెట్టి స్త్రీలను యువతను, రైతులను, కూలీలను, విద్యార్థులను, కార్మికుల్నివారి వారి సమస్యల చుట్టూ కూడగట్టి సైన్యం ను తయారు చేయడం. రాజవ్వ అవసరం పరిమితమైంది, పార్టి లక్ష్యం విస్తృతమైంది. అయినప్పటికీ రాజవ్వఫై అమలవుతున్న కుల పితృస్వామ్యం అంటరానితనం,   పార్టీ మేనిఫెస్టోలో, ఎజెండాలో లేవు అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాలి. అంతేకాక కుదురుపాక మరియూ చుట్టు ఉన్న గ్రామాల స్త్రీలకు, యువతకు రాజవ్వ ప్రసంగం స్ఫూర్తిని ధైర్యాన్నిచింది. ‘రాజవ్వనే నిలవడంగా మనదేముంది’ అని చాలామంది పోరాటంలోకి వచ్చారు.. ప్రజలపై గొప్ప ప్రభావం చూపిన రాజవ్వ కేవలం బాధితురాలిగానే ఎందుకు ప్రచారం చేయబడింది. అనే ప్రశ్నల నేపత్యం నుండి   చారిత్రాత్మక రాజకీయ పోరాటాలను, అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ యొక్క అధికారాలను, మరియు పోరాటాలలో రాజవ్వ పాత్ర తదితర అంశాలను, వర్గ కుల జెండర్ మరియూ పితృ స్వామ్య దృక్కోణం నుండి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

  ఆధునిక భూస్వామ్యంలో  కుల వ్యవస్థ. సిరిసిల్ల  జగిత్యాల ప్రాంతంలోని దొరల వ్యవస్థ   పుట్టుపూర్యోత్తరాలని, వారి పని విధానాన్ని విశ్లేషించుకోవాలి. 

రాజవ్వ పుట్టి పెరిగిన ప్రాంతం సిరిసిల్ల జగిత్యాలలో  భూస్వామ్య వ్యవస్థ ఒక ప్రత్యేక స్వభావాన్నికలిగి ఉన్నదనే చెప్పాలి. ఈ భూస్వాములది  మనుషులను మనుషులుగా గుర్తించలేని స్వభావం. ఈ దొరల ప్రవర్తనలను చూస్తే మహారాష్ట్ర లోని పీష్వాలు జ్ఞ్యప్తికి వస్తారు అని చరిత్రకారుల అభిప్రాయం.  ఈ దొరల్లోని అత్యధిక మంది వెలమ రెడ్డి కులాల నుండి ఉన్నవారే. ఈ ప్రాంతంలో భూస్వాములు వేళ్లూనుకోవడం గురించి పలు విధాలా అభిప్రాయాలున్నాయి. మూడు వందల   సంవత్సరాల క్రితం వీరు బయటి నుండి వలస వచ్చిన వారని అభిప్రాయం. వలస కూలీలుగా, వ్యాపారస్తులుగా, అందులో కొంతమంది దొంగల ముఠాలుగా కూడా లేకపోలేదు. అంతేకాక హాసన్ తన పుస్తకం లోపేర్కొన్న ప్రకారం వీరు  ఉత్తర ప్రాంతంలోని నర్మదా నది తీరం నుండి వలస వచ్చారని, కాకతీయుల కాలంలో వీరు సైనికులుగా, స్థానిక ప్రధాన్ లుగా పని చేశారని తానూ రాసిన కాస్ట్ అండ్ ట్రైబ్ రచనలో పేర్కొన్నాడు. తదుపరి క్రమంలో వీరు అక్రమ దారుల్లోభూమిని  అర్జించి, అమానవీయంగా, చట్ట విరుద్దంగా ప్రజలపై తీవ్రమైన వెట్టి దోపిడీని, అణిచివేతను ప్రయోగించడం ద్వారా సంపన్న భూస్వామ్య అధికారాన్నిపొందారు.

వీరే ఆధునికంలో  తాలూకా ,గ్రామా పాలనా ఆర్థిక  వ్యవస్థలో కీలకమైన స్థానాలైన తహశీల్ధార్ , పోలీసుపటేల్, కర్ణం పటేళ్లు గా  ఫై వ్యవస్థలను నడిపారు. ఆ రకంగా వ్యవసాయంలో ఉన్న వ్యవసాయ దారులని, చేతి వృత్తుల్లో ఉన్న సబ్బండ పని బాటోళ్లని వెట్టి గాయిదాలుగా  వ్యవసాయ మాలా మాదిగలని , చేతి వృత్తినైపుణ్య కమ్యూనిటీస్ వాళ్ళని వెట్టి పనోళ్ళుగా మార్చే విధానాన్ని అవలంబించారు.      

 ఆ తదుపరి నిజాం పరిపాలనలోని రైత్వారీ విధానం ద్వారా అక్రమంగా సంపాదించిన వేలాది ఎకరాల భూమూలకు  ఇదే దొరలు అధిపతులైండ్రు. రైత్వారీ విధానం ప్రకారం అక్రమ ఆస్తులకు దొరలు చట్ట బద్ధత పొందారు అని చెప్పవచ్చు.  రెడ్డి వెలమ భూస్వాములు దేశముఖ్, దేష్పాండే, మఖాద్ధమ్ లుగా కూడా వ్యవహరించారు. ఇదే అంశాన్నిభూక్యా తన వ్యాసంలో  స్పష్టంగా పేర్కొనడాన్ని గమనించాలి ”ఇదే అవకాశంగా మిగితా గ్రామీణ వ్యవస్థలోని పన్ను, శిస్తు వంటి రాబడుల ద్వారా పెద్దమొత్తంలో భూములను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకా ప్రజలు సాగుచేసుకుంటున్న కామన్ ల్యాండ్,  పోరంబోకు, దేవుని మాణ్యాలు, పంచమ భూములు మరియు సాగులో ఉన్న భూములు పెద్ద మొత్తంలో తమ ఖాతాలోకి వేసుకున్నారు. అదే సమయంలో అంతకు ముందు ఉనికిలో ఉన్న సంప్రదాయ పరమైన వతన్దార్ విధానము రద్దు చేయబడింది. సర్వం భూమి లెక్కలు పత్రాలు  గ్రామాధికారులైన పోలిష్ పటేల్ మరియూ కర్ణం పటేల్ నియంత్రణలో ఉండి , ప్రజలంతా విధేయతతో వీరి అధీనంలో ఉండే పద్దతిని ఏర్పరిచారు”. ఈ కాలం భూస్వామ్య కుటుంబాలనుండి వారసత్వoగా వచ్చిన 70వ దశకం నాటి పేరెళ్ళిన భూస్వాములు ఉదాహారణకు  నిమ్మపల్లి భాస్కరారావు, పట్వారి వెంకట రెడ్డి, చెక్కపల్లి భగవంతరావు, బాకా వెంకట రావు, కొండా చిన్న వెంకట రెడ్డి ,పొలసాని గోవిందరావు, సాగి భాస్కరరావు, చిన్నాడి భగవంతరావు, జోగిపల్లి వెంకట రామారావు ,జోగిలేటి భీమారావులు వివిధ గ్రామాల్లో ప్రజలని భయబ్రాంతులని చేసి, హింసను ప్రయోగించి, బాలవంతంగా వెట్టి చేయించడం , వారి దగ్గర డబ్బులు , భూములు గుంజు కోవడం  ద్వారా తమ దొరతనాన్ని నిలుపుకున్నారనేది గమనించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.