రమణీయం

సఖులతో సరదాగా 

-సి.రమణ

 

సాయంకాలం సమయం నాలుగు గంటలు. పెరటిలో కాఫీ బల్ల దగ్గర కూర్చొని తేనీరు సేవిస్తుంటే ఫోన్ మోగింది. ఆయన తీసి, నీకే ఫోన్, పద్మ చేసింది, అన్నారు. “నేను చేస్తాను, ఒక్క పది నిమిషాలలో అని చెప్పండి” బయటినుంచి అరిచాను. ఉదయం నుండి పనులే, పనులు. మూడు రోజులపాటు నీళ్ళు రావని, మంజీరా పైపులు బాగుచేస్తున్నారని, సందేశం వచ్చింది, కాలని నిర్వహణ సముదాయం నుంచి. అటకెక్కించిన గంగాళాలు, గుండిగలు  క్రిందికి దింపి, శుభ్రం చేసి నీళ్ళు నింపి ఇదిగో ఇలా తీరికగా తేనీరు తాగుదామని కూర్చున్నా. ఎంత పనిచేసినా, మనకోసం మనం, కొంత సమయం కేటాయించుకుంటే, ఆ ఆనందమే వేరు. 

 

పద్మకు ఫోన్ చేసాను. ఎక్కడికైనా వెళ్దాం, ఒక వారం రోజులు, ఇంట్లో ఏం తోచటం లేదు, అంది. 

మణిని, రాజ్యలక్ష్మిని కనుక్కుందాం, ఇప్పుడు రావటానికి వీలవుతుందేమో; వాళ్ళింతకు ముందు, మధురై. కొడైకెనాల్ వెళ్దాం, ప్లాన్ చెయ్యమని అడిగివున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసాను. నువ్వెప్పుడంటే, అప్పుడు సిద్ధం అని ఇద్దరి నుండి సమాధానం వచ్చింది. ఇకనే, ప్రణాళిక చెయ్యటం మొదలెట్టాను. ఎక్కడెక్కడికి, ఎన్ని రోజులు, ఎలా? మధురై, కొడైకెనాల్ చూసుకొని, తిరుగు ప్రయాణంలో కోయంబత్తూర్ వెళ్ళి అక్కడనుండి హైదరాబాదు రావాలి అని నిర్ణయించుకున్నాము. ఈ సారి అన్ని పనులు, మేమే చేసుకోవాలని అనుకున్నాం. అంటే, ప్రయాణం, బస, యాత్రా ప్రదేశాల దర్శనలకు సంబంధించి అన్ని రిజర్వేషన్స్ మేమే చేసుకోవాలి. 

 

ముందుగా MakeMyTrip వెబ్ సైట్ కి వెళ్ళి, హైదరాబాదు నుండి మధురై వెళ్ళటానికి, ఏ రోజుకి తక్కువ ధర వుందో చూసాను. సరిగ్గా వారం రోజులలో, టికెట్ దొరికింది. తిరుగు ప్రయాణం కోసం బయలుదేరిన ఎనిమిదో రోజు రాత్రికి చూసాను. అది వేరే విమానయాన కంపనీలో, లభించింది. వెంటనే రాను, పోను టికెట్స్ నలుగురికి కొన్నాము. ఎక్కడ ఎన్నిరోజులుండాలి, ఏమేం చూడాలి అని ఆలోచించాము. అందరికీ, ప్రశాంతంగా, విశ్రాంతిగా గడపాలనే కోరిక. మధురై లో ఒక రాత్రి, కొడైకెనాల్ లో నాలుగు రాత్రులు ఇంకా కొయంబత్తూర్ లో రెండు రాత్రులు వుండాలని నిశ్చయించుకున్నాము. MakeMyTrip, Trivago మొదలైన వెబ్సైట్ లలో మాకు కావలసిన సౌకర్యాలతో వున్న హోటల్స్ చూసాను. అవి ఒక్కో వెబ్సైట్లో ఒక్కో ధరలో వున్నాయి. సెలవులు, పండుగలు లేని కారణంగా, పైగా అన్సీజన్ అవటం వలన, అన్ని హోటల్స్, రిసార్ట్స్ దాదాపు సగం ధరకే అందుబాటులోకి వచ్చాయి. హోటల్ గదులు బుక్ చేసి, ఆయా హోటల్ యొక్క రిలేషన్‌షిప్ మేనేజర్ తో మాట్లాడి, మేము ఏ రోజు, ఏ సమయానికి వచ్చేది, మా గదులు ఎలా వుండాలి అనే విషయాలు వాళ్ళతో చెప్పాము.  

 

మా ప్రయాణం, విశ్రాంతిగా గడపటానికే కాబట్టి, దర్శనీయ స్థలాలకు ఎక్కువ సమయం కేటాయించలేదు. వర్షాకాల ప్రయాణం మరియు కొడైకెనాల్ వంటి చల్లని ప్రదేశానికి వెళ్తున్నాము కనుక, గొడుగు, రైన్ కోట్,  తేలికపాటి స్వెట్టర్, శాలువ, తడిచినా పాడుకానటువంటి నడక బూట్లు మరియు మేజోళ్ళు మా పెట్టెలలో సర్దుకున్నాము. స్వదేశి ప్రయాణం లో, 15 కిలోలు ఇంకా 7 కిలోల బరువుగల పెట్టెలు తీసుకెళ్ళవచ్చు. 

 

ఆ రోజు రానే వచ్చింది. ప్రయాణం మొదటి రోజు ఉదయం 10 గంటలకు మా విమానం మధురై కి బయలు దేరింది. అంతకు ముందు ఏం జరిగిందంటే, మేము అనుకున్నట్లుగానే, అందరం 8 గంటలకు రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాము. సామాను అంతా విమాన సిబ్బందికి అప్పగించి, మా చేతి సంచి సెక్యూరిటీ చెక్ లో ఇచ్చి మేము లోపలికి వెళ్ళాము. రాజ్యలక్ష్మి చేతి సంచిలో ఏదో పదునైన ఆయుధం వున్నదని screening వద్ద ఆపారు. తరువాత సంచిలో వెతికి, జడకు బిగించుకునే clip బయటకు తీసి మరలా screening చేసారు. ఎంత జాగ్రత్తగా వున్నా కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. అక్కడినుండి కదిలి, విమానాశ్రయం లోపల వున్న దుకాణాలు చూసుకుంటూ, చివరనున్న food court కు చేరుకున్నాము. అక్కడ నలుగురం వుదయపు వుపాహారం తిన్నాము. ఖర్చులు పంచుకోవటం మొదలెట్టాము; అక్కడినుండే. తలా ఒక ఐదు వేల రూపాయలు, పద్మకు ఇచ్చి, ఖర్చుపెట్టమన్నాము. ఆ పని తనే చేస్తుంది, మా అన్ని tours లోను, సమర్ధవంతంగా. 

 

మా విమానం మధ్యాహ్నం 12 గంటలకు మదురై చేరింది. మేము విమానాశ్రయం నుండి, నేరుగా, hotel కు వెళ్ళి, fresh అయి, భోజనం చేసి, కొంచం సేపు విశ్రాంతి తీసుకున్నాము. మదురై లో, ప్రసిద్ధ తిరుమల నాయక్కర్ పాలస్ చూడటానికి బయలుదేరాము; సాయంత్రం 4 గంటలకు. 16వ శతాబ్దంలో నిర్మించిన, ఆ రాజభవనం 240 అతి భారీ స్తంభాలతో, విశాలమైన దర్బారు హాలు తో, నేటికి చెక్కు చెదరకుండా, ఠీవిగా నిలిచి వుంది. ఇది కేవలం మిగిలివున్న నాలుగోవంతు మాత్రమే.

 

తిరుమల నాయక్కర్ పాలస్ లో, భారీ స్తంభాల విన్యాసం చిత్రం: సి.వి. రమణ  

 ద్రవిడ, ఇస్లామిక్ సాంప్రదాయాలను అద్భుతంగా జోడించి, నిర్మించిన, ఈ కట్టడానికి రూపశిల్పి, ఒక ఇటలీ దేశస్తుడట. వివరంగా, అన్నీ guide ను అడిగి తెలుసుకున్నాము. రాజభవనంలో వున్న ప్రదర్శనశాలలో ఒక శిలాపలకం చూసాను. దాని మీద లిపి తెలుగువలె కనపడింది. చదవబోతే ఒక్క అక్షరం కూడా, అర్థం కాలేదు. పాలస్ చూడటానికి ఒక గంట సమయం పట్టింది. పాలస్ నుంచి బయలుదేరి, దారిలో, ప్రసిద్ధ మదురై చీరలు కొనుక్కుని, hotel కు వెళ్ళాము.

 

 మీనాక్షి అమ్మవారిని దర్శించటానికి, రాత్రి 8 గంటలకు, మాకు  సమయం కేటాయించారు. తిరుమల నాయక్కర్ పాలస్ లో 7 గంటలకు, ఆంగ్ల వ్యాఖ్యానం తో, 40 నిమిషాలు సాగే, Light & Sound Show కు వెళ్ళాము. అందులో, నాయక్కర్ రాజుల వంశ చరిత్ర, వారి ధీరత్వం, వీరత్వం, కళాపోషణ, శత్రువులతో యుద్ధాలు మొదలైనవి క్లుప్తంగా చెప్పారు. ఆ show నేను మొదటిసారి, దాదాపు 36 సంవత్సరాల క్రితం చూసినప్పుడు, చాల విస్మయం చెందాను. అక్కడినుండి show అవగానే, మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాము. అతి పెద్ద గుడి, విపరీతమైన రద్దీ వున్నా, ప్రత్యేక దర్శనం కాబట్టి సులభంగా గుడిలోకి ప్రవేశించాము. అక్కడ వున్న పూజారితో, కుంకుమ పూజ చేయించాము. కళ కళ లాడే, అమ్మవారిని చూస్తేనే, కడుపు నిండుతుంది. ఆ ముఖంలో వున్న వర్ఛస్సు, కళ్ళల్లో కరుణ, చిరునవ్వులో లాలిత్యం, కన్నార్పకుండా చూడాలనిపించే దివ్యత్వం, మనలను కట్టిపడేస్తుంది. అమ్మవారిని చూస్తూ , అలాగే నిలబడిపోయాను. కదలాలని అనిపించలేదు. నా కళ్ళ నుండి, నీరు జాలువారుతోంది. మనసంతా ఆనందమయమైంది. అమరత్వం సిద్ధించినట్లు  అనిపించింది.

 

అలా ఎంతసేపున్నామో తెలియలేదు. అక్కడినుండి నెమ్మదిగా కదిలి, గుడి మొత్తం కలయ తిరిగాము. 45 ఎకరాల, విశాలమైన ప్రాంగణంలో, అందమైన శిల్పాలతో, తీర్చిదిద్దిన స్థంబాలు కల, పొడవాటి నడవలు (Corridors), అద్భుతమైన పురాతన నిర్మాణ విన్యాసాలకు తార్కాణంగా, 14 శతాబ్దాలుగా నిలిచి వుంది ఈ దేవాలయం. మీనాక్షి, సుందరేశ్వరులు కొలువై వున్న ఈ ఆలయం నాటి రాజుల దైవభక్తికి, కళా హృదయానికి, వైభవానికి చిహ్నం గా, నేటికీ వెలుగొందుతుంది. 
వేయి స్థంభాల మండపం, నాలుగు పక్కలా క్రిందికి మెట్లతో, పెద్ద కోనేరు, ఎత్తైన గాలిగోపురాలతో, భారీ ద్వారబంధాలతో నిర్మించిన ఈ కోవెల, దక్షిణ భారతానికే తలమానికం. 

 

తమిళనాడులో చాల దేవాలయాలు విశాలమైన ప్రాంగణంలో, భారీగా, అత్యంత భారీగా నిర్మించబడి వుంటాయి. అపూర్వమైన శిల్ప సంపదతో అలరారుతుంటాయి. అంత పెద్ద పెద్ద దేవలయాలు కట్టడంలో, ఆ నాటి రాజుల ఆంతర్యం ఏమయ్యుంటుంది? ఎంతమంది శిల్పులు, మరెంతో మంది పనివారు, ఎన్నో సంవత్సరాలు శ్రమించి, ఎంతో ధనం వెచ్చించి, నిర్మించి వుంటారో కదా! కులశేఖర పాండ్యన్ ఆరో శతాబ్దంలో నిర్మించిన, ఈ కోవెల కూడా మొగలుల చేతిలో విధ్వంసానికి గురయ్యింది. 16 నుండి 18 శతాబ్దాలలో పరిపాలించిన నాయక్కర్ రాజులు, పునర్నిర్మించి, అభివృద్ధి చేసి, కొత్త వైభవం తెచ్చారు. ఏది ఏమైనా, ఆ కాలంలో పరిఢవిల్లిన జ్ఞానసంపద, వారి సంగీత, సాహిత్య, శిల్పకళలు, గణిత, ఖగోళ, నిర్మాణ శాస్త్ర విజ్ఞానం గురించి మనకు, దేవాలయాలు, వాటి వద్దనున్న శిలాఫలకాలే కొంత తెలియచేస్తాయి. ఆ కాలంలో, వారు అనుసరించిన నిర్మాణ శాస్త్రం కాని, నైపుణ్యాలు కాని, మనకు అందకుండానే చాలావరకు కాలగర్భంలో కలిసిపోయాయి. 

 

మేము బస చేసిన hotel పట్టణం మధ్యలో వుండటం వలన ఎటు వెళ్ళాలన్నా పది నిమిషాలు సరిపోతుంది. నలుగురు కూర్చోగలిగిన పెద్ద autoల లోనే ఆ పూట మా ప్రయాణం అంతా. రాత్రి భోజనం (ఉపాహారం),  మదురై లో పేరుపొందిన మురుగన్ ఇడ్లీ షాప్ లో తిన్నాము. మాకు ఉపాహారాలు అందించిన అమ్మాయి మణికి దగ్గరగా వచ్చి అక్కా, నీ జడ చాల బావుంది అన్నది. మణికి ఈ అభినందనలు ఎప్పుడూ వస్తూనే వుంటాయి. అక్కడ నుండి hotel గదికి చేరేసరికి, పగలంతా ఎంత ఆహ్లాదంగా గడిపినా, రాత్రయేసరికి అలిసిపోయాము. పడుకున్నవెంటనే నిద్ర పట్టేసింది.    

 

రెండవరోజు చాల ప్రశాంతంగా నిద్ర లేచాము. ప్రాతఃకాల కార్యక్రమాలు పూర్తిచేసుకుని, hotel లో వారిచ్చిన ఉదయపు ఉపాహారం సేవించి బయటకు వచ్చాము. ఈ ఉదయం రెండు దేవాలయాలు చూడటానికి taxi మాట్లాడుకున్నాము, క్రితం రోజే. ముందు సవారి.కామ్ వారిని సంప్రదించాను. వారివద్ద సగంరోజుకు బాడుగ సదుపాయం లేదు. మాకు మధ్యాహ్నం 12 గంటలవరకే అవసరం, అందుకని hotel వారి Travel Desk ను సంప్రదిస్తే చాల ఎక్కువధర చెప్పారు. వెరే web site ద్వారా సగం రోజు ప్రయాణానికి taxi ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడే సవారి.కాం లో కొడైకెనాల్ ప్రయాణానికి కూడా taxi మాట్లాడి పెట్టుకున్నాము. హైదరాబాదులో వున్నప్పుడే మాకు అవసరమైన applications నా ఫోన్ లోకి download చేసుకోవటం వలన మా పని సులువయింది. 

 

Hotel ముందు మా కోసం సిద్ధంగా వున్న taxi లో మదురై కి 25 కిమీ దూరంలో వున్న పళముదిర్ చోలై గుడికి బయలు దేరాము. వత్తైన అడవిగుండా ప్రయాణించాలి, కొండపైన గుడికి.  అసలు దేవుళ్ళంతా ఇలా కొండెక్కి కూర్చుంటారేమిటి అని అనుకుంటాం కాని, మన ఈతి బాధలు ఇంటివద్దనే వదిలి, వనాలు, గుట్టలు దాటుకుంటూ, కష్టపడి కొండెక్కినప్పుడే, దైవదర్శన ఫలితం దక్కుతుందేమో! కొండ కింద అళహర్ కొయిల్ అనే విష్ణు దేవాలయం వుంది. కొండ పైన తిరుమల్ నాయక్కర్ నిర్మించిన మురుగన్ దేవాలయము వుంది. తమిళ్నాడు లో ప్రాముఖ్యత కలిగిన ఆరు మురుగన్ దేవాలయాలలో ఇది ఒకటి. 

 

అక్కడినుండి తిరుప్పురంకుండ్రం బయలుదేరాము. ఇది కూడా ప్రసిద్ధిచెందిన మురుగన్ దేవాలయాలలో రెండవది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక గుహాలయం. ఆరవ శతాబ్దంలో పాండ్యరాజుల పాలనలో, కొండను తొలచుకొంటూ నిర్మించిన ఈ ఆలయం మదురై లో ఎంతో ప్రసిద్ధమైనది. తిరుమల నాయకర్ పాలనలో అందమైన శిల్పాలు చెక్కిన స్థంభాలతో కొన్ని మండపాలు మరియు శివుడు, విష్ణువు, వినాయకుడు, దుర్గ మొదలైన ఇతర దేవతలను చేర్చి పెద్ద దేవాలయంగా మార్చటం జరిగింది. మూడు పెద్ద పెద్ద మండపాలతో, మూడు అంతస్తులుగా విభజించి, నిర్మించిన అద్భుత గుహాలయం తిరుప్పురంకుండ్రం.  

 

మురుగన్ దేవాలయాల సందర్శనాననంతరం hotel కు చేరుకున్నాము. కొంచం fresh అయ్యి, సామాను సర్దుకుని, గదులు ఖాళి చేసి, ఒంటి గంటకు సవారి.కాం వారి taxi లో కొడైకెనాల్ బయలుదేరాము. దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన మదురైలో సరిగ్గా 24 గంటలు గడిపి, 1.30 కి అమ్మా మెస్ లో తమిళ భోజనం చేసి, ప్రయాణం కొనసాగించాము.

(ఇంకా ఉంది)  

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.