కనక నారాయణీయం -4

-పుట్టపర్తి నాగపద్మిని 

 

నా చిన్నప్పటి నుండీ కథలు కథలుగా విన్న మా అయ్యగారి జీవన నేపథ్యం చెబుతున్నాను కదా!! ‘అననగననగ  రాగ మతిశయిల్లుచునుండు.’ .అన్నట్టు, యీ కథలు ఎప్పటికప్పుడు శ్రవణ పేయాలే మా కుటుంబానికంతా!! ఇంతకూ, యెక్కడున్నాం??     

      అయ్యగారి బాల్య క్రీడల్లో వారికి తోడు, సమ వయస్కులైన పాముదుర్తి నారాయణ, హెచ్.ఎస్.నారాయణ, వానవెల్లి నారాయణలు!! వీళ్ళను దుష్ట చతుష్టయమనేవాళ్ళట, ఇరుగుపొరుగుల వాళ్ళు!!

     పెనుగొండ కొండలలో కొండ చిలువలూ, నెమళ్ళూ కూడా ఎక్కువే!! ఈ దుష్ట చతుష్టయానికి ఆ కొండలే ఆటల నెలవులు. జింకలనూ పట్టుకునే వాళ్ళు. శరీర దార్ఢ్యం మీద కూడా దృష్టి మళ్ళించేవాళ్ళు అప్పుడప్పుడూ!! సాము గరిడీలు, కుస్తీలు, దండీలు..ఇవన్నీ కూడా ఓ పట్టు పట్టేవాళ్ళట!! వైవిధ్య భరితమైన యీ అల్లరి, పుట్టపర్తి వారి తండ్రికి తలనొప్పులుగా మారాయి. ఇరుగు పొరుగు వాళ్ళ ఫిర్యాదులు, తెగ కోపం తెప్పించేవి. ఫలితం, బాల  నారాయణునికి బడితె పూజ!! “తిరుమల తాతాచార్యుల వంశంలో పుట్టి, యీ చిల్లర వేషాలేమిటని తిట్లూ శాపనార్థాలు కూడా!! ఇంతకీ యెవరీ తిరుమల తాతాచార్యులవారు?? వారి ప్రతిష్ట యేమిటి??

    శ్రీకృష్ణ దేవరాయల గురువు  శ్రీమత్తిరుమల తాతాచార్యుల వారు. ఈ తాతాచార్యులవారు, మొట్టమొదటి అహోబిల మఠ గురువైన ఆదివన్ శఠగోప స్వామి వారి మేనల్లుడు.  వారికి ‘పంచమత భంజన’ అన్న బిరుదు కూడా ఉండేదట!!

  ఆదివన్ శఠగోప స్వామి ఎవరో కాదు.అన్నమాచార్యులవారికి విశిష్టాద్వైత తత్వాన్ని బోధించి, శ్రీవైష్ణవునిగా దీక్షనిచ్చిన మహానుభావుడు. పూర్వాశ్రమంలో శ్రీనివాస నామధేయులైన వీరిని, వీరి పుణ్య విశేషం వల్ల , అహోబిల నారసిం హుడు, ఏరి కోరి,  కలలో సాక్షాత్కరించి, మేల్కోటై నుంచీ అహోబిలానికి రమ్మని ఆదేశించారట!! ఆ పుణ్య క్షేత్రానికి ప్రాభవం రావాలంటే, అది యీ శ్రీనివాసుని వల్లే సాధ్యమని నారసిం హుని ధైర్యం.

      ఇంతకూ ఆ అహోబిల ప్రాశస్త్యం ఏమిటి?? ఓ చిన్న కథ!! అప్పట్లో (1291-1322) తెలంగాణాలోని రాజు ప్రతాప రుద్ర దేవుడు పరమ శివ భక్తుడు. ప్రతి రోజూ, శివలింగ ముద్ర ఉన్న ఒక బంగారు నాణాన్ని దానం చేసిన తరువాతే, ఆహారం తీసుకునేవాడట! ఓ సారి అతను అహోబిల ప్రాంతాలలో పర్యటిస్తున్నాడు. తన నియమం ప్రకారం, శివలింగ ముద్ర ఉన్న నాణాన్ని దానం చేయటం కోసం చేతిలోకి తీసుకున్నాడు!! ఆశ్చర్యం!! అందులో, అప్పటిదాకా ఉన్న శివలింగ ముద్ర  మాయమై నరసిం హ మూర్తి ప్రత్యక్షమైందట!! ఇదేమిటనుకుని, మరో నాణెం తెప్పిస్తే, అందులోనూ, నారసిం హుడే!! ఇదేమిటని వాకబు చెస్తే, ఈ ప్రాంతమంతా నరసింహ ఉపాసనా క్షేత్రమే కావటం వల్ల మరే ఇతర మూర్తీ కనిపించదన్నారట!! అదీ ఆ క్షేత్ర మహిమ!! ఆ రాజుకూ యీ సత్యం అవగతమై, స్వామికి మ్రొక్కులిడి, ఆ దేవాలయానికి బంగారు

 నారసింహ ప్రభువు విగ్రహన్ని ప్రదానం చేశాడట కూడా!! (ఆ విగ్రహం ఇప్పటికీ పూజలందుకుంటూ ఉందట అక్కడ!!) 

    శ్రీనివాసునికి కర్ణాకర్ణిగా యీ సంగతి తెలుసు!! స్వామి ఆదేశమూ తననక్కడికి తీసుకు వెళ్ళటమే!! ప్రయాణమై వెళ్ళాడు.  అక్కడి రాజు ముకుంద దేవరాయలు తక్కిన వాళ్ళంతా వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారట!! ఆశ్చర్యమేమిటంటే, వారికి కూడా నారసింహుడు కలలో కనిపించి, ఫలానా శ్రీనివాసులవారు మేల్కోటై నుచీ నా ఆదేశం మేరకు అహోబిలం వస్తున్నాడు, అతని సంరక్షణ బాధ్యత నీదే..’ అని!!కొన్ని రోజుల తరువాత, ఒక యతి రూపంలో నారసింహుడు ప్రత్యక్షమై, శ్రీనివాసునికి ‘ఆదివన్ శఠగోప స్వామి..’ గా పేరిది,అహోబిల మఠ స్థాపన కై అదేశించారట!!   అంతే కాదు ‘..నీ పేరు శఠగోప ముని.అహోబిల మఠానికి నీవే పీఠాధిపతివి..’గ్రామే గ్రామే చ గత్వా..పదచరణయో మాం గృహీత్వ…’అని చెప్పి, నరసిం హస్వామి ఉత్సవాలను ప్రతి ఏటా చేయించమని ఆదేశించి మాయమై పోయాడట, యతి రూపంలో వచ్చిన అహోబిల నారసింహుడు!! 

  అప్పటినుంచీ, ప్రతి ఏటా, నరసింహ స్వామి మఠ నిర్వహణ, విశిష్టాద్వైత ప్రచారం, శ్రీవైష్ణవ వ్యాప్తి వంటి కార్యక్రమాలన్నీ శఠగోపయతి అధ్వర్యంలో వైభవోపేతంగా జరగటం మొదలైంది.

       వీరి విస్తృత పర్యటనల్లో ఒక సారి ఆల్వార్ తిరునగరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి పాండ్య రాజు, శైవ ధర్మావలంబి. అక్కడి ఆదినాధ  కోవెలలోని నమ్మాళ్వార్ విగ్రహాన్ని తీయించి రుద్రుణ్ణి ప్రతిష్టించాడట.. ఆ పాండ్య రాజు వీరు వెళ్ళె ముందు!! సరే!! శఠగోపులవారు వాదోపవాదాలు చేయక, తన కార్యక్రమాల్లో తానున్నారు. అనుకోకుండా పాండ్యరాజుకు విపత్కాలం రావటం, శఠగోప ముని ద్వారా అది తొలగటం వల్ల ఆ పాండ్యరాజు వీరి వల్ల ప్రభావితుడై, మళ్ళీ నమ్మాళ్వార్ విగ్రహాన్నీ, దానితోపాటూ వేదాంత దేశికుల వారి విగ్రహాన్నీ కూడా ప్రతిష్టించాడట!! ఈ పరిణామానికి తృప్తి చెందిన నమ్మాళ్వార్ (6వ శతాబ్దం) వేదాంత దేశికులవారు (1268-1369 క్రీ.శ) ప్రత్యక్షమై, నీవిక ‘వన్..’ (సమర్థుడైన) మహాదేశికన్..’అన్నారట!! అలా ఆదివన్ మహాదేశిక శఠగోప స్వామి (1398-1458 క్రీ.శ.)  అయ్యారు వారు!! (ఇవన్నీ అయ్య మాటల్లో విన్నవిషయాలేనని మనవి..)       

   ఆ  కాలంలో శ్రీవైష్ణవం ప్రాభవం ఎక్కువగా ఉండేది.  అనేకులు ఆ ధర్మం పట్ల ఆకర్షితులవుతూ, స్వీకరించేందుకు వరుసలు కడుతున్నారు. వైష్ణవం స్వీకరించేవారికి సమాశ్రయణం (భుజాలపై కాల్చిన బంగారు, వెండి లెదా రాగి కడ్డీలతో శంఖు చక్రాల ముద్రలు వేయటం, శ్రీమన్నాయారాయణ తిరుమంత్రాన్ని ఉపదేశించటం, శ్రీవైష్ణవ ధర్మానుయాయిగా ఇకపై దీక్షతో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేయించటం వంటి పద్ధతులు) నామతీర్థం మొదలైనవి ఇవ్వవలసిన బాధ్యత ఆదివన్ శఠగోప స్వామి వారిది!! దీనివల్ల తమ అనుష్టానానికి తగిన సమయం ఉండేది కాదట వారికి!! మేనల్లుడు  తాతాచార్యులు యువకుడు. ఉత్సాహవంతుడు. శ్రీవైష్ణవాచారాలన్నీ పవిత్రంగా ఒంటబట్టించుకున్నవాడూ, ముఖ్యంగా సమాశ్రయణ పద్ధతుల గురించి ఆకళింపు ఉన్నవాడవటం తాను గమనిస్తున్నాడు. అందుకే అతణ్ణి పిలిచి,’నీవు నా బాధ్యతను కొంత స్వీకరించు. ఈ పనికి ప్రతిఫలంగా, శ్రీవైష్ణవ దివ్య తిరుపతులలో ధర్మకర్తృత్వ సేవలు ఇప్పిస్తాను..’ అన్నారు. ఆ కాలంలో పెద్దల మాటలకు తిరుగేముంది?? అలా తాతాచార్యుల వారిని ఆ గౌరవం కోరి వరించింది!! అంటే, అర్హతలున్నప్పుడు ఆదరణ ఆశించకుండానే లభిస్తుందనే కదా అర్థం!!

  అప్పటినుంచీ చాలా సమర్థవంతంగా మేనమామ (పూర్వాశ్రమంలో) ఆదివన్ శఠగోప స్వామివారందించిన  బాధ్యతను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు తిరుమల తాతాచార్యులవారు. (శఠమర్షణ గోత్రం)  కృష్ణదేవరాయల కాలానికి వారు బహుశా కురు వృధ్హులై ఉండవచ్చు. కృష్ణదేవ రాయలు (1471-1529) విజయనగరాధీశుడయ్యాడు. అతడు విశిష్టాద్వైతి.  (రాజ్యకాలం 1509 నుంది 1529 వరకు) తాతాచార్యులవారిని కృష్ణదేవరాయలు, గురువుగా స్వీకరించి, రాజ సభలో, తనకన్నా ఉన్నత స్థానంలో ఆసీనులను చేసేవాడు.

   తాతాచార్యుల వంశం వారికి (మా తాతగారు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారు ఆ వంశం వారే ) ఈ కారణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకత్వం కూడా ఉండేదట!! దక్షిణ భారతంలోని శ్రీవైష్ణవ క్షేత్రాలలో మొదటి తీర్థ ప్రసాదాలు కూడా ఉండేవట!! అంతే కాదు, శిష్యార్జనా, ఆచార్య పురుషత్వమూ కూడా సంక్రమించాయట!!

  తాతాచార్యులవారి కుటుంబం వారికి కృష్ణదేవరాయలవారు, గౌరవ పురస్సరంగా ఐదు ఊళ్ళు కూడ ఇచ్చాడట!! పుట్టపర్తి (అనంతపురం జిల్లా) ప్రాంతాల్లో చాలా పొలాలు మా తాతగారి వారసత్వపు వాటా కింద ఉండేవట అప్పట్లో!! అందువల్లే మా పుట్టింటి  ఇంటి పేరు పుట్టపర్తి తిరుమల. తన చిన్న తనాన ఇంట్లో లక్ష్మీ కాసులు కుండల నిండా పొంగి పొరలుతూ ఉండేవని అయ్య గుర్తు చేసుకునేవారెప్పుడూ!!

    ఇంతటి వైభవోపేతమైన వారసత్వమున్న పుట్టపర్తి తిరుమల వంశోద్ధారకుడు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటూ యే తండ్రికైనా బాధ కాదూ మరి??? 

  అందుకే తప్పు చేసి దొరికినప్పుడల్లా తండ్రి చేతిలో దండన తప్పటం లేదు బాల నారాయణునికి!! అల్లరి మాట అటుంచితే, ఆ బాల నారాయణునికి ఇష్టమైన  మరో పని, అక్కడి శిధిలాలలో తెగ తిరుగుతూ, గతించిపోయిన విజయ నగర వైభవ కాంతులను, తన భావుక నేత్రాలతో అన్వేషించటం!! వారి అల్లరి పనుల మాటున దాగిఉన్న కవితాత్మ, ఊళ్ళో జరిగే సాహిత్య సమావేశాలలో శ్రవణానందంగా వినిపిస్తూ ఉండే భువన విజయ  విభవ వీక్షణంలో మైమరచి పోతుండేది!! విజయ నగర రాజుల వేసవి విడిది కావటం వల్ల, పెనుగొండలోనూ రాజ భవనాలూ, ఆయా కాలాల శాసనాలూ కుప్పలు తెప్పలే మరి!! 15,16వ శతాబ్ది అవశేషాలు చూస్తూ పుట్టపర్తి కంట సుళ్ళు తిరుగుతూ కన్నీరు!!

    పురాణ ప్రవచనంలో, భారతం చదివే బాధ్యతను యీ అల్లరి పిల్లడికి అప్పగించారు వీరి తండ్రిగారు (శ్రీనివాసాచార్యులవారు) – ఆ నియమంతోనైనా కుమారుడి అల్లరి మరో మంచి మార్గాన పడుతుందనుకున్నారేమో వారు మరి! లేత గొంతుతో స్పష్టంగా  వీరి భారతం పఠనం – తండ్రి గారి పటిష్టమైన వ్యాఖ్యానం – రెండింటి మేళవింపు పరమాద్భుతమట!

  కుమారుడి గొంతులో, గతించిన తన మొదటి అర్ధాంగి కమ్మని గొంతు కూడా ప్రతిధ్వనించేదేమో, ఆ సంగీత లక్షణాన్ని కాపాడుకునేందుకు, తమ తనయునికి కర్ణాటక సంగీతం చెప్పించాలనుకున్నారు శ్రీనివాసాచార్యులవారు!!  అప్పటికే పెనుగొండలోనే, సంగీత విద్యలో ఆరితేరిన పక్కా హనుమంతాచార్యులవారి వద్ద అంతులేని శిష్య గణముండేది. వారివద్ద సంగీతం నేర్చుకునేందుకు కుమారుణ్ణి పంపటం మొదలు పెట్టారు తండ్రి గారు!!ఆ లేత వయసులో పుట్టపర్తి కంఠాన  కొలువు దీరిన స్వర కన్యకలు..ఎంత పుణ్యం చేసుకున్నాయో !! రాబోయే రోజుల అదృష్ట క్షణాల కోసం వారి నిరీక్షణ అప్పుడే మొదలైంది మరి!! ఇంకేముంది!! అయ్య సంగీత పాఠాలు మొదలయ్యాయి.. సంధ్యావందనం శ్రీనివాస రావు అనే అబ్బాయి కూడా అయ్యతో పోటాపోటీగా పక్కా హనుమంతాచార్యులవారివద్ద సంగీతం నేర్చుకునేవాడట!! (వారే పెరిగి పెద్దై సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులుగా సుప్రసిద్ధులయ్యారు కూడా!!)      

  ఒక సారి బాల నారాయణుడు – ఒక వీధిలో వెళ్తుంటే, ఓ ఇంటిలోనుండీ లయబద్ధమైన గజ్జెల శబ్దం వినిపించింది!! అప్పటికే సంగీతం తో వీరి దోస్తీ మొదలైంది కదా!! ఆ లయ కు అలవాటుపడిన వారి మనసూ,కాళ్ళూ – ఆ గజ్జెల శబ్దం వచ్చిన వైపు పరుగులు పెట్టాయి. ఇప్పుడు గజ్జెల శబ్దంతో పాటూ..వాటికి అనుగుణమైన జతులు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి!!  మనసు ఆగటం లేదు బాల నారాయణునికి!! ఆ ఇల్లు సమీపించింది!! జతులు పలికే స్త్రీ గొంతు – చక్కటి ఉచ్చారణ, పట్టూ – అంతకు మించి శిక్షకురాలిగా ఆమె నేర్పు – ఇవన్నీ ఆకర్షించాయి బాగా!! వీధి వైపు ఒక కిటికీ ఉండటం గమనించిన బాల నారాయణుడా కిటికీ దగ్గరికి చేరి..లోపల నాట్యాభ్యాస పద్ధతిని ఆసక్తిగా గమనిస్తున్నారు. చాలా సమయమే నిల్చున్నారలా !! లోపల నాట్యాభ్యాసం చేయిస్తున్న స్త్రీ  మూర్తి – యీ అబ్బాయినీ, అంతసేపూ కదలకుండా నిల్చునే వున్న ఆ కళ్ళలో పట్టుదలనూ పట్టేసింది. అభ్యాసం ముగిసింది. ఆ స్త్రీ మూర్తి కిటికీ దగ్గరికొచ్చి, యీ అబ్బాయిని పలుకరించి లోపలికి రమ్మంది. జంకూ గొంకూ లేకుండా వెళ్ళాడు లోపలికి!!

ఆమె : ఎవరు నాయనా  నువ్వు?

బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి.

అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు?

బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు.

ఆమె : నాట్యం నచ్చిందా?

బాల: బాగా..!!

ఆమె: నేర్చుకుంటావా??

బాల: నేర్పిస్తే…!!

ఆమె: మీ తండ్రిగారి అనుమతిస్తారా??

బాల: నేనే అడుగుతాను!!

ఆమె : అలాగైతే..రేపటినుంచే రా మరి!!

ఇంకేముంది?? మా అయ్య గారి జీవితంలో మరో  కొత్త అధ్యాయం మొదలౌతున్నదన్నమాట!!

(సశేషం..)

*****

ఫోటో :- తరుణ నారాయణ వర్య

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.