త్రిపుర కథలు

పుస్తకం:- త్రిపుర కథలు

రచయిత:- త్రిపుర

-వసుధా రాణి 

పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు.ఐతే అన్నప్రాశనరోజే ఆవకాయలా త్రిపుర గారి కథ ‘భగవంతం కోసం’ ఆవిడే స్వయంగా చదివి వినిపించి కథని ఇలా చదువుకోవాలి,రచయిత రచనలోని గొప్పతనాన్ని ఇలా ఆస్వాదించాలి,అప్పుడు రచయిత అనుభవాలు కూడా మనవి అవుతాయి అని ఓ పాఠంలా కథ చెప్పారు.దీని వెనుక సాహిత్యం ఆదరించబడాలి, ఆ సాహిత్య ప్రయోజనాన్ని మనం పొందాలి అన్న ఆవిడ తీవ్రమైన లక్ష్యం నన్ను ఈ కథలు చదివే దిశగా నడిపించింది.

మొత్తం పదమూడు కథల సమాహారం.భగవద్గీతకు ఎన్ని భాష్యాలు ఉన్నాయో త్రిపుర కథలకు అన్ని భాష్యాలు రాయవచ్చు.చదివిన ప్రతి ఒక్కరికీ వారి స్థాయిని బట్టి ఒక కోణం కనిపిస్తుంది అనిపించింది.ఇంత సంక్లిష్టమైన,స్పష్టమైన,అస్పష్టమైన, సమగ్రమైన,నిగూఢమైన జీవితాల కథలను నేను ఇది వరకు ఎప్పుడూ చదువలేదు.

రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు “త్రిపుర”.ఈయన పేరు ఎత్తాలంటేనే పాఠకునిగా కొన్ని అర్హతలు సాధించి ఉండాలని ‘త్రిపుర కథలు’ పట్టుకోగానే అర్ధం అయ్యింది.కఠినమైన కసరత్తు చేసే ముందు శరీరాన్ని సమాయత్తం చేసుకోవటానికి  కదలికలు వదులు చేసే కసరత్తు చేసినట్లు ముందు ‘త్రిపుర ఓ జ్ఞాపకం ‘ చదివాను.

గొప్ప గొప్ప వాళ్ళు,ఆయన్ని చదివి ఆకళింపు చేసుకున్నవాళ్ళు ఏమంటున్నారో తెలిస్తే నాకు కాస్త దారీతెన్నూ దొరుకుతాయని.పని కొంచెం సులువుగా,కొంచెం సంక్లిష్టంగా అయినట్లు అనిపించింది.అంటే కథలు చదువుతున్న కొద్దీ కొందరితో ఏకీభవించేలా,కొందరితో కలవని అభిప్రాయాలు కలిగాయి.

మొదటి కథే మెదడుకు పట్టిన బూజు వదిలించే కథ ‘పాము’.1963 లో భారతి మాసపత్రికలో వచ్చిన ఈ కథ’ భమిడిపాటి జగన్నాథరావు’ గారినుంచి త్రిపుర మొదటి ఫాన్ మెయిల్ అందుకునేలా చేసింది. జగన్నాథరావుగారి మాటల్లో ఈ కథ గురించి

’ఈ మీ పాము కథలో మీరు చూపించిన ప్రతిభకు ముగ్ధుణ్ణి అయ్యాను.

సూటిగా చెప్పేనేర్పు,సంభాషణలు నడపటంలో చాతుర్యం,మీకున్న విస్తృతమైన విజ్ఞానాన్ని మనిషి నడవడికలో ఇమడ్చటం-అన్నీ,అన్నీ అద్భుతం.’

ఈ మాటలు పట్టుకుని ఆ ‘పాము’ను పడదామని కథ చదవటం మొదలు పెడితే ఒక్కో వాక్యం ముందుకు వెళ్లే కొద్దీ ఏదో తెలియని ఉత్కంఠ,ఒక సంభ్రమం ,ఓ ఆశ్చర్యం .కథ పక్కకి వెళ్లి, ఇలా ఈ కథని చెక్కిన శిల్పి త్రిపుర ఓ అద్భుతంలా అనిపించారు.ఎక్కడా ఒక పదం ఎక్కువ లేదు.అందుకే చదవడంలో ఒక పదం  తప్పినా కథ అర్ధం కాదు ,శ్రద్ధగా ,మనకున్న బుద్దికుశలత అంతా ఉపయోగించి ఆ పదాల మాయలో పడకుండా చదవాలి.

శేషాచలపతిరావు ఈయన కథల్లో మాటికీ వచ్చే పాత్ర. ‘శేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ ఇవాళ నీ పేరు “అలఖ్ నిరంజన్”అని చెప్పాడు అద్దంలోని శేషాచలపతిరావ్ తో’.ఇది కథలో మొదటి వాక్యం. ‘రేపు నీ పేరు సాల్వడార్ డాలీ.ఏం చేస్తావో’ అని అద్దంలో శేషాచలపతి విషపు నవ్వు ఒకటి మధురంగా నవ్వాడు.’ ఇది కథలో ఆఖరి వాక్యం.

కథంతా చదివి మళ్లీ మొదటి వాక్యానికి వెళితే కానీ కథ లోని ఆంతర్యం అర్ధం కాదు .మొదటి వాక్యంలోనే కథలో ఏముందో చెప్పేయటం త్రిపురగారి స్పెషాలిటీ అనుకుంటా.పాము అందులో శేషు పడగ కలిగిన నాగుపాము దాని లక్షణాలు అందంగా,ఆకర్షణీయంగా , చురుకుగా ఉండటం,తన వ్యూహా రచన చేసుకోవటం,ఎదుటి వాని కదలికలను అంచనా వేసి కాటు వేయటం.

శేషాచలపతిలో ఈ లక్షణాలన్నీ పదాల్లో కాకుండా అతని కదలికల్లో,వ్యవహరించే తీరులో చూస్తాము.

లైబ్రరీ ఎదురుగా చెట్టుకింద క్యాంటీన్ లో కూర్చుని ఉమాడే బయటికి రావటానికి ఐదు నిమిషాల ముందు రిస్టు వాచ్ ని చేతలో పట్టుకుని నిలబడి సెకండ్స్ లెక్కబెట్టే శేషాచలపతి మనల్ని భయపెట్టడు. అతను ఎదుటి మనిషిని అంచనా వేసే తీరు ఆశ్చర్య పరుస్తుంది.

ఐతే బ్రోచా హాస్టల్ దగ్గర బస్ ఎక్కి గోడోలియాకు రెండు టిక్కెట్లు అడిగి  కండక్టర్ ఒక్కడికి రెండు టిక్కెట్లు ఎందుకు అన్నప్పుడు’ అది నీకు అవసరం లేదు .ఒకటి నాకూ,రెండవది నా స్పిరిట్ కి ‘ అన్న అలఖ్ భయపెడతాడు.ఒక ఈజ్ తో సునాయాసంగా మనుషులని మోసగించుకుంటూ పోవటం ఆ లక్షణాన్ని స్పిరిట్ గా ఫీలయి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం ,మనిషిలోని ఆ నెగెటివ్ లక్షణాలు భయం గొలుపుతాయి.

ఫారిన్ జంటని చూడగానే కలుగులో ఎలుకని కనిపెట్టిన ఆకలిగొన్న పామై పోయిన అలఖ్ ఫారిన్ లేడీని చూసి లైక్ ఏ క్వీన్ అనుకోవటంలోనే వేటని అంచనా వేసే అతని తెలివి,వారిని నమ్మించి మోసం చేసే పద్ధతి కళ్ళముందు బెనారస్ గల్లీల దృశ్యాలు చక చకా సాగిపోతాయి.

జిన్ కైపు ఎక్కిన శేషాచలపతి కుడి జేబులో ఆరు వందల రూపాయలు,ఎడమ జేబులో ఉమా డేకి జాగా ..

‘ బాల్యం ,..బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది.ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారి లాంటి యదార్ధం గుండెల్లో బలమైన వ్రేళ్ళతో పాతుకుపోయి స్థిరపద్దకొలదీ,..నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్ధం లేదు ,అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ ,నా పూర్ణ శక్తితో వెనక్కి వెనక్కి పరుగెడుదామనుకుంటాను …తిరిగీ ,నా బాల్యంలోకి..క్షణానికీ,క్షణానికీ, క్రియకీ ,క్రియకీ సంబంధం లేకుండా బ్రతకడం…..”త్రిపుర మాటల్లో శేషు స్వగతం.

ఇదీ పాము లాంటి శేషాచలపతి  వెనక్కి వెళ్లలేని నడిచి వచ్చిన దూరం.అతను ప్రతిరోజూ కుబుసం విడిచే పాము ,మళ్లీ చురుకుగా తయారవ్వటం ,వేటాడటం తప్పించుకోలేని పాము.

     ‘హోటల్లో ‘ కథ  “ఉదయం ఎనిమిది చితచితగా వాన. లోపల తడి .” అన్న వాక్యంతో మొదలు పెడతారు త్రిపుర .  “ఉదయం తొమ్మిదీ నలభై. పైన చితచితగా వాన .లోపల తడి , ఉక్క “అనే వాక్యంతో కథ అంతమవుతుంది .ఈ గంటా నలభై నిమిషాల్లో ఆ నాటి సమాజంలో కల ఆర్థిక ,రాజకీయ పరిస్థితులు, ఆయా రకాల మనుషులు ,వారి మనస్తత్వాలు తెలిసేలా ,గట్టిగా అయిదు వందల పదాలున్న కథలో తీర్చి దిద్దారు రచయిత. హోటల్లో ఉదయం వ్యాపార సమయాన్ని వర్ణనలు మనలో మనకు తెలిసేలా రాయడం మాటలమాంత్రికుడైన ఒక త్రిపురకే సాధ్యం .మహా ఐతే ఎనిమిది హోటల్ టేబుల్స్ ,వాటి ముందు కూర్చున్న మనుషుల సంభాషణల మధ్య తిరుగుతుంది కథ .ఒకసారి టేబుల్స్ చుట్టూ సంభాషణలు తిరిగినప్పుడు  ,సంభాషణల ద్వారా పాత్రలు మనకు పరిచయమవుతారు .రెండవ రౌండ్ సంభాషణలు తిరిగేసరికి కథలోని సారాంశం ,అంశం అన్నీ అర్థం అయిపోతాయి. రచయిత కలానికి ఉన్న పవర్ ఏమిటో అర్థం ఔతుంది ఆ క్షణం .

     కథలోని ఒక పాత్రని వివిధ దశల్లో పరిచయం చేసే మూడు వాక్యాల్ని చూడండి :

   ” ఒక మూలగా ,దిబ్బగా ,టమోటాలాగా ఎర్రటి ముఖం కుర్రాడు నాలుగిడ్లీల ప్లేటు తింటున్నాడు అటూఇటూ చూడకుండా “.

     ఇంకొకసారి అతని గురించే : ” టర్నిప్ లాగా ఉన్న టమోటా ముఖం దిబ్బబ్బాయి ఇడ్లీలప్లేటు పక్కకు నెట్టి ,ఒరిగిన తిమింగలం లాగా ప్లేటు మీద పడి ఉన్న మసాలా దోసెని చిత్రవధ చేయడానికి మొదలు పెట్టాడు “

    ఈ దిబ్బ కుర్రాడి మీద త్రిపురగారికి ప్రేమ ఎక్కువ అనుకుంటా ,ఇతడిపైన మూడవ రౌండ్ కూడా వేశారు : “మాంచి సారవంతమైన నేలలో పెరిగిన బీట్ రూట్ లా ఉన్న దిబ్బ కుర్రాడు దోసెని తినేసి ,అప్పుడే సర్వర్ టేబుల్ మీద పెట్టిన పెసరట్ ని ముదిరిన బెండకాయలాంటి వేళ్ళతో ఆప్యాయంగా నిమురుతున్నాడు  ,మేకను నరకబోయే కసాయి వాడిలా .” 

       మిగిలిన పాత్రలు అన్నింటినీ వదిలేసి ,ఈ ఒక్క టమోటా దిబ్బ అబ్బాయిని తీసుకుంటే ,కేవలం మూడు వాక్యాల్లో వాడి ఆర్థిక పరిస్థితి, కేంద్రీకృతమైన సంపద గురించిన మొత్తం సమాచారం తెలిసిపోతుంది  . ధనవంతుల బిడ్డ అలా అచ్చంగా గొడ్డులా తింటూంటే కౌంటర్ దగ్గర నిలబడి :

     “సరోజినమ్మగారికి కావలసిన దోసెలకోసం వచ్చిన రాములు ఖాళీ కళ్ళలో చూస్తుంది .ఇంట్లో గుడిసెలో చిన్న కొడుకు సింవాచలంకి మందెవరు తెస్తారు ? “

     నిజంగానే మనకూ లోపల తడీ ఉక్కపోస్తాయి .

      మొత్తం ఈ సంకలనంలోని కథలు అన్నిట్లో నేరుగా వున్న కథ ఇది. 

        “చీకటి గదులు “కథను మూడవసారి చదువుతున్నప్పుడు కానీ అర్థం చేసుకోలేకపోయాను .కొంచెం పెద్ద కథ ,కానీ మనుషుల అంతఃచిత్రాన్ని సమగ్రంగా , సింబాలిక్ గా చూపిన కథ .కథలో ఎన్ని ఒడుపులు ,మలుపులు ఉన్నాయో !

‘భగవంతం కోసం’ కథ:

    అంపశయ్య నవీన్ గారి అభిప్రాయంలో :” త్రిపురకు సామ్యూల్ బెకెట్ రచనలు అన్నా ,కాఫ్కా రచనలు అన్నా ,కేమూ రచనలు అన్నా చాలా ఇష్టం .ఆ తరహా రచనల్నే త్రిపుర చేసాడు “. సామ్యూల్ బెకెట్ రచించిన “వెయిటింగ్ ఫర్ గోడో ” అన్న నాటకాన్ని1952 లో ప్యారిస్ లో ప్రదర్శించినప్పుడు అది చాలా గొప్ప సంచలనాన్ని సృష్టించింది .”వెయిటింగ్ ఫర్ గోడో ” నాటకంలో ఏముంది అని ప్రశ్నిస్తే “ఏమీ లేదు ” అనేదే సమాధానం .అస్తిత్వ వాదం (existentialism ) ,అసంబద్ధ వాదం (absurdism ) తత్వధోరణులు కలిగిన నాటకం ఇది . ‘ నాలుగూ నలభైఆరు ,ఇక్కడే ఉండమన్నాడు ,నలభైఆరు నిమిషాలు అయిపోయింది నియమితకాలం దాటి .భగవంతం ఇంకా రాలేదు .వస్తాడా ఈరోజు ?అసలు ఎపుడైనా వస్తాడా ?”.ఈ కథను గురించి.

ఒక సందిగ్ధంతో కథ మొదలై “ఆకాశంలో నక్షత్రాల జల్లు .భగవంతం రాడు ,అట్నుంచీ ఏడో నంబర్లోనూ రాడు ,ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు….నా పిచ్చిగాని  ‘వాక్యంతో అర్దంతరంగా ఆగిపోయింది .

    ఏడు ,పదమూడు నంబర్లు విషాదానికి సూచనలు, భగవంతం అంటే భగవంతుడు ,మృత్యువు ఇలా రకరకాల ఆలోచనలు రేకెత్తించే విధంగా కథ వుంటుంది .అసంబద్ధ వాదం అనిపిస్తూనే ,ఉన్నది చూపిస్తూ లేనిది కనిపించేలా చేస్తూ ఓ తార్కికతకు తెర తీసిన కథ అనిపిస్తుంది . సర్వర్ ‘ఉన్నిథన్ ‘ పేరు వెనుక కేరళను గుర్తు చేయడం ఎంత ఆశావాదం .ఒక్క కేరళకు చెందిన వాడు అనడం వలన అతడిని ప్రేమగా ఉన్నీ అని పిలవడం ,అసలు భగవంతం ఇటువంటి చోటికి ఎందుకు వస్తాడు అనిపిస్తుంది .భగవంతం కోసం ఎదురు చూస్తున్న అతనిచుట్టూ ఉన్న ఇలాంటి మనుషుల మధ్యకి చూడండి .”నా డెస్టినీలైన్ లో అన్నీ లేవు ” 

   “సమస్యల పుట్ట “

“పని చేస్తూ ఆవులింతలు ,ఏం ఉద్యోగమో …”

  “మా బుజ్జిగాడు గొంగళి పురుగులు కనిపిస్తే చాలు ,చేత్తో అలా నలిపి ….” 

  “మిల్ ఫీల్డ్ లో రిఫరీని పట్టుకు తన్నేరుట ….”

    “చూసుకోలేదుట .గన్ క్లీన్ చేస్తూంటే తూటా గుండెలోంచి …..”

    “మా వాడికి ముణుకు ఎందుకు  విరిగిందో ,ధనాధిపతి దశ కూడాను ….”

    “పిచ్చెత్తిందట .కత్తిపీటతో పెళ్ళాన్ని పిల్లల్ని నరికి….”

     “ప్రమోషన్ ఎందుకు ఆగిపోయిందో  , శనిగాడు కాబోలు ….”

    ముక్కలు ముక్కలుగా మనుషుల గురించి చెప్పే ఈ వాక్యాలు హోటల్ లోని వాతావరణాన్ని ,మనుషుల్లో వున్న రకరకాల వికారాలని తెలుపుతూంటాయి .కథ అంతా అయ్యేసరికి భగవంతం రాడని మనకు అర్థం అవుతుంది .అంతేకాదు ఇలాంటి మనుషుల మధ్యకి రాకపోవడమే మంచిది అనిపిస్తుంది .

     మొత్తం కథలు కూడా13 .ఇది కాకతాళీయమో ,కావాలని ఆ అంకెతో ఆపేశారా అనిపిస్తుంది .కేసరివలె కీడు ,జర్కన్ కథలు కూడా నాకు చాలా నచ్చాయి .

       మొత్తంమీద త్రిపురను చదవడం ఓ పూర్తి జీవితావలోకనం అనిపించింది నాకైతే .ఓ అనుభవం ,ఆశ్చర్యం మాత్రం తప్పక కలుగుతాయి. ఇది అని చెప్పలేని ,ములుకుల్లా గుచ్చుకునే కథలు .ఐతే అర్థంకాలేదు  అని తీసి పక్కన పెట్టడం మాత్రం సబబు కాదు .

      తల్లావజ్జుల పతంజలి శాస్త్రిగారి మాటల్లో త్రిపుర కథల ప్రస్తావన ఇక్కడ తప్పక తేవాల్సి ఉంది .:” అర్థం కావడానికి ,విశ్లేషణకు అతీతమైన కథల్లో త్రిపుర కథలు చేరతాయి .ఆయన కథలు అర్థం కాకపోయినా ,లోపలికి ప్రవేశించి కొత్త చూపు ప్రసాదిస్తాయి .”

   “జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం .”

    “కలవడం ,విడిపోవడం, పోగొట్టుకోవడం ,నిరీక్షించడం అనే నాలుగు బింధువుల మధ్య జీవితం నిర్విరామంగా తిరుగుతూ ఉంటుంది ” 

     పతంజలి శాస్త్రిగారి మాటనే నేనూ సమర్థిస్తాను  .తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత బంగారు గని త్రిపుర కథలు .జీవితాన్ని మించిన గొప్పతనం ఇంక దేనికి వుంటుంది ?

      ఇలా వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారితో మొదలుపెట్టి పతంజలి శాస్త్రిగారి వరకూ చూపిన మార్గంలో నేనూ పయనించి త్రిపుర కథల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను .తప్పక ,ఒకసారి కాదు ,మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన కథలు త్రిపుర కథలు. పరిచయం చేసే సాహసం పెద్దల సాయం వలన చేశాను .

                      *****                        

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.