#మీటూ -(కథలు)

మిట్టమధ్యాన్నపు నీడ (కథ)

 

-సి.బి.రావు 

ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం, తన బలం, బలహీనతా అంటారు. మహి ‘మ్యూజింగ్స్’ బ్లాగ్, సారంగా, B.B.C. Telugu, నమస్తే, వగైరా websites ల లో పెక్కు వ్యాసాలు వ్రాసారు. పుస్తకాలంటే ప్రాణం ఐన ఉమ పలు పుస్తక సమీక్షలు చేశారు. జననం: 1972, నివాసం: మంగళగిరి. 

రచయిత్రి, కవి కుప్పిలి పద్మ సంపాదకత్వంలో వెలువడిన కొత్త కధా సంపుటం #Me Too లోని 12 వ కధను  (ఈ సంపుటం లో కథలకు పేర్లు లేవు) ఉమ నూతక్కి వ్రాసారు. ఏ కథకైనా ప్రారంభం, ముగింపు బలంగా వుంటేనే కథకు జవసత్వాలుంటాయి. అసంబద్ధమైన, ఆకస్మిక ముగింపు, అంతగా ఆకట్టుకోని ప్రారంభం ఈ కథను బలహీనపరిచాయి. ఈ కథలో కథానాయిక మిథున,  బాల్యంలో, తన మామయ్య లైంగికవేధింపులకు గురవుతుంది. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పినా తనకు మద్ధతు లభిస్తుందో లేదో అనే సందిగ్ధత ఆమెను కలవరపెడ్తాయి. వివాహమయ్యాక కూడా తన తండ్రి వయస్సున్న మామయ్య వేధింపుల స్మృతులు, ఆమెను వెంటాడుతూనే వుంటాయి. ఇదీ కథలోని ముఖ్య సారాంశం.  ఈ కథ చదివాక పాఠకుడు మీమాంశలో పడ్తాడు. చక్కటి పుస్తక సమీక్షలు, వ్యాసాలు వ్రాసే ఉమా నూతక్కి, కథ చెప్పటం లో ఇలా, ఎలా విఫలమయిందనే ఆలోచనలో పడతాడు.   

పాఠకుడి మీమాంశకు ఇప్పుడు సమాధానం దొరికింది. మొదటగా సంపాదకుడి కత్తెర, కథను ఎలా చిందరవందర చేసిందో వివరిస్తూ, నరేష్ నున్నా, ఉమ నూతక్కి, కొండవీటి సత్యవతి, శాయి పద్మ  తమ face book posts ద్వారా వివరిస్తూ విపులంగా వ్యాసాలు వ్రాసారు. అంతే కాదు, సాయి పద్మ, నరెష్ నున్నా “ మిట్ట మధ్యాహ్నపు నీడ” కథ, పూర్తి కథను ప్రచురించారు. పాఠకుడికి అసలు కథ లభ్యమయిమంది. మెడ విరిగి, రెక్కలు తెగి, నెత్తురోడుతున్న పావురంలా ఉన్న తన కథని చూసి ఉమా నూతక్కి తల్లడిల్లిపోయారు. “కథ బాగుందని మెచ్చుకున్న ఎడిటర్ కుప్పిలి పద్మ గారు, ఎందుకు అన్నిచోట్ల కట్ చేశారు? కట్ చేయడానికి అనుసరించిన పద్ధతులేమిటి?” అని వేదన చెందుతున్నారు ఉమ నూతక్కి.   

ఈ కథను ప్రచురణకు ముందే చదివిన మిత్రుడు వెంకట్ సిద్ధారెడ్డి ఇది చాల ఉత్తమ కథ అని ప్రశంసించారు అని తెలుస్తుంది. అంతే కాక, ఖర్చుకు వెనుకాడక, ఉమ నూతక్కి పూర్తి కథను ఒక ప్రత్యేక చిన్న పుస్తకంగా ప్రచురించి, #Me Too పుస్తకం తో పాటుగా అందచేస్తామన్నారు. ఈ వార్త ఉమ నూతక్కి కి కొంత ఉపశమనం కలుగ చేస్తుందని ఆశిద్దాము. ఇక్కడ మనము సంపాదకుడి బాధ్యత గురించి తెలుసుకుందాము. తమిళ్ నాడు హోసూర్ లో జరిగిన తెలుగువారి సభగురించిన నా వ్యాసం సారంగ పత్రిక కు పంపినపుడు, సంపాదకుడు అఫ్సర్, వ్యాసం పొడవు తగ్గించటానికి నా అనుమతి కోరుతూ సందేశం పంపారు. వెంటనే అనుమతించాను. దాసరి అమరేంద్ర “అండమాన్ డైరీ” పుస్తకానికి నేను వ్రాసిన ముందుమాటలో వుంచిన భారతదేశ పటం తొలగింపునకు నా అనుమతి తీసుకున్నారు. ఇది సత్సాంప్రదాయం. విపుల, చతుర సంపాదకులు చలసాని ప్రసాదరావు కూడా తమ వద్దకు వచ్చిన నవలలను బాగా edit చేసేవారు. అయితే ఆ కత్తిరింపులవలన నవల ప్రచురణకు కావలసిన నిడివిలో వస్తూ , చురుకుగా, స్పష్టంగా, రచయిత భావాన్ని మార్చకుండా వుండేదని రచయితలు అభిప్రాయపడేవారు. 

తమ జీవితంలో ఎన్నో చూసిన అనుభవంతో, బాధాతప్తహృదయంతో ఉమ నూతక్కి వ్రాసిన “మిట్టమధ్యాన్నపు నీడ!”, ఉత్తమ కథల జాబితాలోకి చేరుతుంది. ఈ కథను ఇప్పటికే శాయి పద్మ, నరేష్ నున్నా ప్రచురించివున్నారు కావున మీరూ చదవవొచ్చు. అసలు పూర్తి కథ పాఠకుడికి చేరటమే, రచయిత్రికి న్యాయం. 

నరేష్ నున్నా కథనంలో, కథలో, ఏ ఏ భాగాలు, సంపాదకుడి కత్తెరకు బలైనది, వివరంగా తెలుస్తుంది.

# Me Too పుస్తకం లో రచయిత్రి పరిచయం అర కొరగా ఇచ్చి, వయస్సు 10 సంవత్సరాలు పెంచి ప్రచురించారు. రచయిత్రుల పరిచయాలలో వారి e-mail ఇవ్వలేదు. ఐతే, ఐదవ కథ రచయిత్రి, సంపాదకరాలు ఐన కుప్పిలి పద్మ పరిచయంలో తన  e-mail ఇవ్వటం జరిగింది. 

#Me Too పుస్తకావిష్కరణ జరిగాక, తిరుగు ప్రయాణంలో, తన కథ కత్తిరింపులకు గురయ్యిందని ఉమ తెలుసుకున్నారు. ఆ ఖేదం లో తన బాధను మిత్రులతో పంచుకున్నారు. అన్విక్షికీ ప్రచురణకర్త వెంకట్ సిద్దారెడ్ది కి విషయం తెలిసి, 200 పుస్తకాలు అమ్ముడు పోగా మిగిలిన 800 #Me Too పుస్తక ప్రతులు నాశనం చేసి, ఉమ నూతక్కి పూర్తి కథతో #Me Too ను పునఃప్రచురణ చేద్దామని నిర్ణయించారు. అయితే face book posts తో, విషయం  రచ్చ అయ్యాక, ఉమ నూతక్కి కథను పూర్తిగా ఒక పుస్తకంగా వేసి, #Me Too పుస్తకం తో అనుబంధంగా ఉచిత పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఉమ నూతక్కి తమ ఆమోదాన్ని తెలిపారు.To err is human. పొరబాటు జరిగిందని సిద్దారెడ్డి ఒప్పుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాక, విషయం సద్దుమణగాలి. కాని ఉమ నూతక్కి 27 డిసెంబర్ 2019 నాడు తన face book post లో ఈ విషయాన్ని, తన బాధను మళ్ళా ఎందుకు వెలిబుచ్చారో అర్థం కాదు. 

తన మీద ఇన్ని విమర్శలు చెలరేగుతున్నా, సంపాదకురాలు నిండుకుండలా చలించక, తన golden silence ను కొనసాగించటం, ముదావహం. ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగితే ప్రమోదం. కాని #Me Too కథలు ఎప్పుడూ సంఘటన జరిగిన 5, 10 ఏళ్ళ తరువాతే కదా మనకు ఎక్కువగా వినిపించేవి. మరో ఐదేళ్ళ తరువాత తనకథ, సంపాదకురాలి దాష్టిక కత్తెర కు బలయ్యిందని, ఇంకో రచయిత్రి మరో #Me Too కథ తో మన ముందుకొస్తే, #Me Too అనే పదాల అర్థం, రూపాంతరం చెందుతుందేమో!  

ఈ కథా సంపుటంలో ఒళ్ళు జలదరించే మరెన్నో #Me Too కథలున్నాయి. Recommended for your reading. 

#మీటూ 

సంపాదకత్వం: కుప్పిలి పద్మ 

పుటలు 128, డెమి పరిమాణంలో,

ధర ₹165/-

ప్రాప్తిస్థలం

Navodaya Book House,

Kachiguda X Roads, 

Hyderabad

మరియు

amazon.in 

 *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.