శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం-

మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం 

-కొండేపూడి నిర్మల

ప్రధానంగా నేను కె. వరలక్ష్మి కధలకు  అభిమాన పాఠకురాలిని. ఆమె వేళ్ళు కధలోనే ఎక్కువ దూరం వెళ్ళాయి. వరలక్ష్మి నిర్లక్ష్యం చేసిన ఇంకో మొక్క ఆమె కవిత్వం . సరే ప్రక్రియ ఏమయినా ఒక సాహిత్య వేత్తని ఆమె మూలాల్లోంచి వేరుచేసి నేను చూడలేను. ఏమిటా మూలాలు ఆంటే ఆమె నేపధ్యం, నైసర్గికత , దృక్పధం , స్వభావం ఇది కూడా ముఖ్యమని నేను అనుకుంటాను. కవితా సృజనకి ఇవేవీ పరిమితులు కాకపోయినా కవిని అభిమానించే నాలాంటి పాఠకురాలికి  ఆమెని సరిగా అధ్యయనం చెయ్యడానికి ఇవి కావాలి. వరలక్ష్మితో నాకున్న స్నేహం నాకు ఆవకాశం ఇచ్చింది .  

ఈ పుస్తకంలో 1980 నుంచి 2006 వరకు రాసినవి నాకు కనిపించాయి. 

పుస్తకంగా వచ్చినవి 43 కవితలు అయితే రానివి 11 కవితలు నాకు అందాయి. .ఇంత విస్తృత జీవితంలో .ఈ సంఖ్య తక్కువగా అనిపించినా చాలా సీరియస్ కాంట్రిబ్యూషన్ ఆమె ఇచ్చారు.  ఈ తరం వాళ్ళకి ఆమె కధా రచయిత్రిగా బాగా తెలుసు. నాతరం వాళ్ళకి కవయిత్రిగా కూడా తెలుసు., అస్తిత్వ ఉద్యమాల్లో ఒకటయిన స్త్రీవాదం వచ్చాక కొత్త వస్తువులు , వ్యక్తీకరణలు వచ్చాయి . జీవితం కంటే వ్యక్తం చేయదగ్గ గొప్ప వస్తువు ఇంకోటి లేదు అనే ఎరుక కలిగింది. వరలక్ష్మి లో నాకు అది కనిపిస్తుంది. 

ఎవరి కవిత్వాన్ని అయినా నేను మూడు గా  వర్గీకరిస్తాను 

  1. వ్యక్తిగతం , 2 . సామాజిక౦, ౩ దృక్పధం. ఇప్పుడు వ్యక్తిగతం అనేది లేదు. ఇవాళ ఒక పిల్లవాడు సెల్ఫోన్ లో బ్లూ సినిమా చూస్తే అది వ్యక్తిగతం కాదు. అది దొరికేలా చేసే సామాజిక తప్పిదం , కంట్రోల్ చేయలేని రాజకీయ వైఫల్యం ఇవన్నీ వుంటాయి. దాని ప్రభావంతో అతను రేప్ చేస్తే ఈ అన్నిటి గురించి మాట్లాడాల్సి వుంటుంది . కాబట్టి ఇప్పుడు కవిత్వ౦ ఆత్మాశ్రయం కాదు. ఆత్మాశ్రయం అని అనుకున్నదానిలో కూడా సామాజిక రాజకీయ కోణాలు వుంటాయి . 

. ప్రఖ్యాత విమర్శకుడు చేకూరి రామారావు గారు వరలక్ష్మి రాసిన ‘ఆ ఇంట్లోనే’ అని చెప్పిన కవిత  గురించి బాగా వ్యాఖ్యానించారు. 

నా దృష్టిలో ఇది నాస్టాల్జియా కాదు . ఇందులో చరిత్ర వుంది. జ్నాపక౦ అంటే జరిగిపోయినది కదా,  అంటే చరిత్ర కిందికి వస్తుంది. మరి కల ఆంటే భావిష్యత్ కి సంబధించినది . కొన్ని సందర్భాల్లో వర్తమానం , భవిష్యత్ రెండు ఒకేసారి మన కళ్ళకి కనిపిస్తాయి. మీ అమ్మాయో అబ్బాయో అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు . అయితే వాడు నిన్నలోంచి మాట్లాడతాడు , మీరు ఇవాల్టిలోంచి పలుకుతారు. ఒకే తీగమీద రెండు కాలాలు ప్రయాణిస్తాయి. 

నిర్మాణ పర౦గా చెప్పాలంటే ఈమెది కధనాత్మక కవిత్వం 

 “ఆమూల నా బాల్యం దాక్కుని వుంది \ ఆ పునాది రాళ్లలో నాతండ్రి రెక్కల కష్టం నిక్షిప్తమై వుంది , ఆ పడిమీద క్రుంగిన  గదిలో మా నాయనమ్మ పూజా సామగ్రి \ పారిపోయిన పాతాళ దేవుళ్ళకోసం ఇంకా ఎదురు చూస్తోంది \ ఆ తూర్పు వైపు వంట గదిలో కట్టెల పొగ కార్చే కన్నీళ్లతో ఉప్పు కోసమో ఊరగాయకోసమో అటక మీదికి చేయిచాచి \ మా అమ్మ గుంజిళ్ళు తీస్తున్నట్టే వుంది \ ఆ మధ్య గది గోడకి    వీపుని చేరేసి \ పట్టపగలే నిద్రలో కునికే బామ్మ \అల్లరికోసం నే వేసిన రెండు జడల్ని \ అందంగా తీర్చి దిద్దిన పెళ్లి బొట్టుని అద్దంలో చూసుకుని \రాని కోపాన్ని కళ్ళతో నవ్వుతున్నట్టే వుంది \రెపరెపలాడే రెప్పల సాక్షిగా ఆనాటి కొంటెతన౦ ఆ యింట్లోనే వుండిపోయింది \

బాల్యం చాలామదికి ఒక ఆబ్సెషన్ . అది రాయని కవి వుండరు . స్త్రీలు రాసే బాల్యంలో ఒక వేదన వుంటుంది

ఆడపిల్ల ఆడపిల్ల అంటు పెంచుతారు కదా ఈడపిల్ల కాదు అని చెప్పినట్టుగా వుంటుంది , పెద్దయి అత్తారింటికి వెళ్లిపోగానే టెక్నికల్ గా రెండు ఇళ్లూ ఆమెవి కావాలి. కానీ అత్తింటివారు , “మీ పుట్టింటివారు అలా వుంటారు ఇలా వుంటారు” అంటారు. పుట్టింటి వారయితే “ఏమో బాబు మీ వాళ్ళతో మేం వేగలేమ్”  అంటూ వుంటారు. ఆడ ఇల్లా కాక ఈడపిల్ల కాక మరి నేను ఎడపిల్లల్ని అని అడగాలనిపిస్తుంది . వరలక్ష్మి రాసిన ఈకవితలో గతమే కాదు వేదన కూడా వుంది. 

ఆశ్చర్యానికి గురిచేసే వస్తువుల ఎంపిక 

కార్సినోమా  కవిత చూస్తే ,, అది ఇలా మొదలవుతుంది “ కార్సినోమా మైడియర్ ఫ్రెండ్ \ బతుకు మౌయలేనంత భారమైపుడు నువ్వు నావైపు కన్నెత్తయినా చూడలేదు \ బరువులన్నీ దించుకుని ఆనందాన్ని అరువు తెచ్చుకునైనా జీవించాలని నిర్ణయానికొచ్చినపుడు అనుకోని అతిధిలా నా ఎద తలుపు తట్టావు కార్సినోమా నా ప్రియమైన నేస్తం. \నీ వేలందుకుని మృత్యు గహ్వర౦ లోకి నడవక తప్పనిసరయితే నా లోపలి ధైర్యం నీరై పోవద్దని వేడుకుంటాను. యుద్దంలో వెన్ను చూపని వీరత్వాన్ని అణువణువు ని౦పుకుంటాను అంటుంది . కాన్సరు ని కవితా వస్తువుగా తీసుకోవడమే కాకుండా  దానిపట్ల పాజిటివ్ టోన్ తో సంభాషించడానికి చాలా తాత్వితక్త కావాలి అది వరలక్ష్మి కవిత్వంలో కనిపిస్తుంది .

అలాంటిదే ఇంకో కవిత ‘చేసేదేముంది” అవును గాయాలు మనిషిని బతికిస్తాయి గాయపడి బతకడం మనిషికే సాధ్య౦ అయింది ఎవరు మాత్రం కొత్తగా నేర్చునేదేముంది ? యుద్ధాన్ని తప్ప అంటుంది .చిత్రించి చిత్రించి  విసుగేట్టినప్పుడు పికాసోలు , ఎమ్మెఫ్ హుస్సేన్ లు కావడం తప్ప \ఎవరు మాత్రం కొత్త కళ్ళనతికించుకుని చూసేదేముంది \ నీలి చిత్రాల నిర్లజ్జ తప్ప \ ఆకలి కడుపుల౦టుకు పోయిన అన్నార్తుల డొక్కలు తప్ప \ సలాం బాంబే చూసేసి ఒక్క సలాం కొట్టేస్తే పోలా \ పుట్ పాత్ లో గోనెసంచుల్లో వేలాడే ప్రేవుల గోల మనకెందుకు?\ఎవరు మాత్రం దేశాన్ని ముందుకు నడిపేదేముంది ?\ వెనక్కి వెనక్కి తిరోగమించి \అశ్వమేధాలు –నరమేధాలు మళ్ళీ మొదలు పెట్టేశాక \ మేఘాలు మెరవడ౦ తప్ప కురవకపోయినా అధికారానికి ఆకలి తప్ప\  అంకిత భావం లేకపోయినా ఎవరు మాత్రం చేసేదేముంది ?

భావ సారూప్యాలకి దేశ విదేశాల దూరం వుండదు 

పై కవిత చదివాక ఎక్కడో ఎమిలీ డికిన్సన్, అనే  అమెరికను కవయిత్రి రాసిన కవిత గుర్తొచ్చింది. ఇది నౌడూరి మూర్తిగారు అనువాదం చేశారు.  

“ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి\ నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. \ ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు…\ త్వరగా! అది సరిపోతుంది.\ నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు\అప్పుడు నేను పడిపోయే అవకాశం ఉండదు.\ మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి\ అది నా అభిమతమూ, నీ అభిమతమూ.   \ నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు\ సముద్ర తీరమైనా ఫర్వా లేదు\ ఎడతెగని\ పరుగుపందెంలో చిక్కుకున్నా\ నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ\ ఇన్నాళ్ళూ బ్రతికిన నా జీవితానికీ\ ఈ ప్రపంచానికి వీడ్కోలు\ నా తరఫున ఆ కొండల్ని ఒకసారి  ముద్దాడండి,\  ఇపుడు నేను సర్వసన్నద్ధం.

దృక్పధాన్ని పట్టిచ్చిన కవిత్వం 

కళ్ళు అనే కవిత ని ప్రత్యేకంగా చెప్పాలి, హృదయానికి సరాసరి వాకిళ్ళు కళ్ళు \ ఏ ఆత్మ అభిరుచిని బట్టి అలా చూస్తూ వుండిపోతాయి \ భూమి మీద ఆవిర్భవించింది మొదలు \నిరంతరం సంచలనం మొదలు పెడతాయి కళ్ళు\  తల్లి గర్భంలోంచి బయల్పడటానికి చేయి అందించిన నర్సుని సునిశితంగా చూస్తాయి , అనంతర కాలంలో \ ఆ కళ్లే ఆమె మీద రాళ్లేస్తాయి అంటుంది 

అలాగే ఏకాంత శ్రోతస్విని అనే కవితలో ఇలా వుంటుంది 

. నేను పెంచిన చిన్ని పక్షులు రెక్కలొచ్చి ఎగిరివెళ్ళాయి\ తలుపులు మూసిన గదిలో ఒ౦రిగా మిగిలాను \ అని రాస్తూ చివర్లో అంటుంది 

ఎవరేనా పలకరించడానికి వచ్చినప్పుడు ఎప్పటిలాగే మూత పెట్టి దాచిన మూసి ముసి నవ్వుల్ని ముఖానికి సరిపోయేలా అతికించుకుని తలుపు గడియ తీశాను\ మౌన శ్రోతస్వానిలో మరో రోజుని సాగనంపడానికి \ 

ఒంటరితనం తాలూకు డెప్త్ కి అద్దం పట్టిన కవిత ఇది . ఒంటరితనం ఎంత యాంత్రికంగా వుంటుందో చెప్పిన కవిత ఒకటి ఈ మధ్య చదివాను / 

విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి ఏమన్నాదంటే, 

రోజులు మనదగ్గరికి\ కడగని సీసాల్లా\ ఖాళీగా, మురికిగా వస్తాయి.\ వాటి అంచులకి\ ‘నిన్న’ మసకగా\ పొరలా కమ్మి ఉంటుంది.\ మనం వాటిని ఉంచుకోలేం.\ మన బాధ్యత వాటిని నింపి\ వెనక్కి పంపెయ్యడమే.\ దానికి కూలి ఏమీ ఉండదు.\ దానికి ప్రతిఫలం:\ చేసిన పనే. అంతే! దీన్ని మనం ప్రశ్నిస్తే\ వాచీల్లా గుండ్రటి ముఖాల్తో\ వాళ్లు కోపంతో అరుస్తారు.\ పోనీ అద్దం పగులగొడదామని అనుకుంటే\ మనల్ని మనమే గాయపరచుకుంటాం.\ రోజుల్లో ఏమీ మార్పు ఉండదు.\ అవి పొద్దు పొడుస్తూనే\ వెలుతురుతో మనల్ని నిద్రలేపుతాయి.\ పొద్దుపోగానే, చీకట్లో వదిలి పోతాయి.\ చీకటి వాటి బలహీనత కాదు;\  మృత్యువు గురించి\ ఆలోచించనలతో మనల్ని పెట్టే బాధ.\ రోజులకి అంతం లేదు.\ పంజరం మీద\ గుడ్డ ఎప్పుడో కప్పి ఉంది.

.

తల్లికి కూతురుతో ఒక ప్రత్యేక బంధం వుంటుంది , అది వేర్వేరు పడవల్లో వున్న ఇద్దరు యాత్రికుల ప్రేమలాంటిది . వలసపోయిన పిట్టల జాబితా అని నేను ఒక కవితరాశాను. 

వరలక్ష్మి ఒక కవిత రాసింది కుడికాలు ముందు౦చి నువ్వు గడప దాటినప్పుడు \ నేను మ౦చులా గడ్డ కట్టుకు పోయాను\ చివరి మెట్టు మీద వెనక్కి తిరిగి అమ్మా ఆర్తిగా నువన్నప్పుడు \ కన్నీరు మున్నీరయ్యాను \ నువు పుట్టినప్పుడే తెలుసు \ రెక్కలు రాగానే వలస వెళ్తావవని\  తప్పటడుగుల తీపి ముద్రలింకా \నా గుండే గుమ్మలో చెరిగిపోలేదు \నీ అల్లరి నవ్వుల ఆకతాయితనం \ వీధి తలుపుతడుతున్న భ్రాంతి \ అమ్మా అని ఒక్క గెంతులో వచ్చి కౌగిలించుకునే నీ చేతుల స్పర్శ\ నన్నెప్పటికి వీడని సుమధుర శాంతి \ ఆరారగా ఆరగించే వాళ్ళులేక అరటి పళ్ళు మగ్గిపోతున్నాయి కదా \ నోరారగా అలకించే వాళ్లు లేక వీణ విచారంలో మగ్గిప్తోంది సదా \ అమ్మగా నేనిక్కడ \ ఆలిగా నువ్వక్కడ 

అని రాసింది . 

కఃలీల్ జీబ్రా కవిత తప్ప మనల్ని ఓదెర్చే వాళ్ళు ఎవరూ లేరు  , ఆకవిత ఇలా వుంటుంది 

, “మీ పిల్లలు మీ పిల్లలు కాదు\ వారు తనకోసం తపించే జీవితం వున్న కొడుకులు కూతుళ్ళు\ వాళ్ళు మీలోంచి వస్తారు కానీ మీ వలన రారు\ వాళ్ళకి మీరు ప్రేమనివ్వగలరేమో\ కానీ ఆలోచనలివ్వలేరు \ ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్లకుంటాయి \ మీపిల్లలు మీ వింటినారి నుంచి వదలబడ్డారు\ ఎందుకంటే దూసుకుపోయే బాణాన్ని ఎంతగా ప్రేమించాలో \ నిలకడగా వున్న ధనువు ను అంతే ప్రేమించాలి. 

వలస జీవిత నేపధ్యాల అల్లిక 

ఆదివాసులకి అడవిలో కూడా చోటు లేకుండా  చేస్తోంది రాజ్యం. కానీ వాళ్ళ జీవితం వేదన, ఆహార్యం అన్నీ కళాత్మక అభిరుచికి అద్దం పట్టేలా ఎగ్జిబిషన్స్ లో పెట్టుకుంటాం , ఇళ్లలోనూ పెట్టుకుంటా౦, లంబాడీ యువతి అంటే అద్దాల జాకీట్టే అయినట్టు ఆమె వేదన, సంచార జీవితం ఇవేవీ పట్టవు, లంబాడీ చుట్టరికం అనే మాట వెక్కిరింపు ధోరణిలో మన చలామణీలో వుంది. అందులో వున్న వలసజీవితం ఏరోజు ఎక్కడ వుంటారో తెలియని  తనం లోంచి ఆవేదన వస్తుందని మనం అంచనా వెయ్యలేకపోతా౦. నడు౦పట్టుకుని నాట్యం చేస్తూ ఫోటోలు తీసుకోవడానికి మాత్రం అందరు ఉత్సాహపడతారు. మనలాంటి సపన్నవర్గాలుశ్రమని గ్లోరిఫై చేసినట్టు ఇంకేవరూ చేయలేరు   

ఆదివాసీ ఆత్మని వరలక్ష్మి ఎలా పట్టుకుందో చూడండి “ గిరిజన మ్యూజియంలో కాలూనగానే పూర్వీకుల రక్తం నాలోకి \పరకాయ ప్రవేశం చేసిన అనుభూతి \ గడపలు లేని కుటీరాలు \ నులకనేసిన మ౦చాలు నాగరిక ప్రపంచ వదిలేసిన పరికరాలు\  ధింసా నృత్యపు లయలోంచి కొమ్ముబురాల శ్రుతిలోంచి \ నా స్మృతి పధంలోకి చొచ్చుకుపోయాయి” . అంటూ చివర్లో ఒక మాట అంటుంది “ ఉదయం నుంచి ప్రకృతి హరితాన్ని ఆస్వాదించిన కళ్ళు కాంక్రీటు ప్రపంచంలోకి అడుగిడగానే అనాశక్తిగా  రెప్పలు వాల్చుకున్నాయి’ ఈ ఒక్క పాదం దృక్పధానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది . కవి కష్టజీవి వవైపు వున్నాడా లేదా అనేది తెలుస్తుంది . . 

ఎత్తుగడ (టెక్నిక్) తెలిసిన కవయిత్రి 

వరలక్ష్మి ఒక వస్తువును  రాయాలని అనుకుని ఆ ఆలోచనా క్రమలో తనకి కావలసిన కవితా వాతావరణ౦కోసం ఎక్కడికో వెళ్ళదు. నుంచున్నచోటే వెతుక్కుంటుంది.అప్పుడు అది దాని రూపాన్ని అదే నిర్ణయించుకుంటుంది . దానివల్ల చదువరికి కవి చెప్పదల్చుకున్నది సినిమా చూస్తున్నట్టుగా వుంటుంది .

కవి నేపధ్యం పట్టివ్వడానికి ఈ సమాచారం కూడా పనికొస్తుంది  బహుశా కధలు రాసే వాళ్ళకి వుండే సౌలభ్యం ఇది. అంటే ప్రక్రియరీత్యా కాన్వాసు  పెద్దది వుంటుంది . .నిర్మాణం మీద రూపం మీద అదుపు లేకపోతే అది మ౦చి కవిత కాలేదు,సాధారణంగా కధలు రాసేవాళ్ళు పెద్దకవితలు రాస్తారు , కానీ ఈ కవయిత్రి  అలా చేయ్యలేదు. ఎక్కడ మొదలుపెట్టాలో ఆపాలో కూడా తెలిసి వుండటం కవితా గుణాన్ని మెరుగుపరుస్తుంది. ఎక్కువ కవితలు . ఉత్తమ పురుషలో వుంటాయి ఈమె కధలో లాగానే కవిత్వంలో కూడా దిగువ మధ్యతరగతి స్త్రీల జీవిత౦ కనిపిస్తుంది . 

వరలక్ష్మి కవిత్వంలో అయినా కధల్లో అయినా కల్పన కంటే వాస్తవిక చిత్రణ బాగా వుంటుంది కొన్ని ప్రాతాలు వ్యక్తులు పదే పదే కనిపిస్తారు.. అవి డైరీ పేజీలేమో అనిపిస్తాయి. అందులో ఒకటి ఇల్లు, రెండు మానవసంబధాలు, సంఘటనలమీదరాసిన కవిత్వంలో కారంచేడు , మామ౦డూర్ అడవుల్లో, వివాహ దృశ్యం లాంటివి వున్నాయి.  

వరలక్ష్మి ఇమేజరీలు కొన్ని చోట్ల గొప్పగా వుంటాయి. 

కాకినాడ కడలి తీరం అనే కవితలో 

 “అలల ఉయ్యాలలుగుతున్న ఒ౦టరి పసిపాప ఓడ’   అంటుంది . 

అలాగే “ పెదవుల్తో భూమిని కత్తిరిస్తూ గొర్రెల మంద”  అంటుంది నిజానికి గడ్డి మేస్తున్న గొర్రెల మంద అనచ్చు కానీ అప్పుడు  అది శుద్ధ వచనం అయ్యేది భూమిని కత్తిరిస్తున్న గొర్రెలమంద అనడంతో ఒక సంభ్రమం దొరుకుతుంది.

అంటే ఇక్కడ నేల ఉపరితలం మీద గడ్డి మేయడాన్ని కత్తిరించడంతో పోల్చింది. .అంటే  ఉపమానం ఉపమేయం రెండు కలిసి పోయాయి , చాలా గొప్ప ప్రయోగం .దీన్ని గురించి ఎంతసేపయినా చెప్పొచ్చు . చూడగానే అర్ధ౦కాదు అనిపించెంత క్లిష్టత ఇందులో వుంది. ఈ మాత్రం గాఢత నాకు బాగా ఇష్టం. 

ఇది   ఇది మ౦చి కవితకు లక్షణం , 

ఇల్లు మానవ సంబధాలు ఆమె ఆబ్సెషనల్ సబ్జక్ట్స్ 

నేను మొదటి పుస్తకం వేసినప్పుడు మచ్చల బల్లి అనే పదం అరుసార్లు రాశానని ఒక విమర్శకుడు చెప్పాడు. బహుశా భయానికి జలదరింపుకి, కొన్నిచోట్ల సోమరితనానికి కూడా దాన్ని పోలికగా వాది వుంటాను. . అలాగే ఈమెకి ఎంతో ఇష్టాన్ని అలసతని కలిగించే ఏకైక వస్తువు ఇల్లు. ఆమె ఇంటిని మానవీకరించిన తీరు ఇలా వుంటుంది . 

“మాసిన మొహాల్తో నిరామయంగా గోడలు తలుపులు \పటాలు తీసేసిన మాయని గుర్తుల్తో మౌనంగా బారులు తీరిన మేకుల వరసలు , నిన్నటితో ఫుల్ స్టాప్  పెట్టిన పెద్దమ్మాయి ప్రేమకి , పక్కింటాబ్బాయి దొంగచూపులకి సాక్షిగా సగం తెరచుకున్న కిటికీ రెక్క\ నడిమివాడి రైలు బస్సు ప్రయాణాలకి బలి అయిపోయి రంగులు వెలిసిపోయిన రెయిలింగ్ \ నడ్డి విరిగిన క్రికెట్ బ్యాట్ \చంటిదాని బొమ్మల పెళ్ళికి ఆకుల్లో అన్నంగా చేరిన  బెల్లం ముక్క చింతగింజ \ చీమల సామ్రాజ్యంగా మారిన అటుకుల పప్పు\ తలా తోక తెగిపడి వరండాలో ఒంటరిగా మిగిలిపోయిన తాతగారి చేతి కర్ర\ వ౦టింటి కాల్వ దగ్గర వదిలివెళ్ళిపోయిన రుబ్బురోలు \అయినవారందరిని కోల్పోయి అనాధగా మిగిలిన మధ్యతరగతి గృహిణిలా వుందా ఇల్లు\ మళ్ళీ ఎవరొస్తారో \ఆ గదికి పచ్చ తోరణం కట్టి \ఆ గోడలకి ప్రాణం పోస్తారో \ – 

అంటుంది . ఇంటికి జండర్ వుంటుంది . 

ఓగ్డెన్ నాష్ అనే అమెరికను కవి“ ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది\ ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను.\ అయినా, ఆ రసప్రవాహంలో  ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు.\ ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం\ అంత మైమరపించే సంగీతంలోనూ\ ఇన్నేళ్ళవుతున్నా ఒక్క అపస్వరమూ\ దొర్లకుండా ఎలా కొనసాగించగలుగుతున్నదన్నదే!… ఓహ్! పాడుతున్న పిట్ట మాత్రం ‘ఒక్కటి ‘ కాదు.\ అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది.\ ఇది ఆదేలాంటి ఇంకో పిట్ట 

-అనడంతో ముగుస్తుంది కవిత. 

ఆహ్లాదకరమైన పోలికలు 

వరలక్ష్మి అక్షరంలో మట్టి వాసన కనిపిస్తుంది .  వరద గోదావరి పైన వాన అనే కవితలో 

“కడియపు లంకలో పూసిన విరజాజులన్నీ కోసితెచ్చి ఆకాశంలోంచి అలవోకగా ఆగి ఆగి చల్లినట్టు వరద గోదారి మీద తెల్లతెల్లని  వాన వీపున చరిచి ముఖాని నిమిరి , వన్నెచిన్నెలవాన పాపికొండల్ని చూసి పరవశించనీకుండా మబ్బువస్తాల్ని కప్పి మరీ మరీ కురిసిన వాన …..మనిషి,  తోటి మనిషికి చేసే మార్మిక గాయాలకి మ౦దుపూత పూసింది , మౌనంగా తరలింది \ విబేదాలు చూపని విశ్వ ప్రేమ వాన. “ 

బాల్యం ఎవరికయినా మధురమే కానీ, పల్లెలో  గడిచిన బాల్యాం మరీ మధురంగా వుంటుంది. ముఖ్యంగా నీళ్ళకి,  రాళ్ళకి మొహంవాచిన నాలాంటి అర్బన్ పట్టణపు జీవితాలకి చాలా మిస్సయిపోయిన బాధ కలుగుతుంది . మా వూళ్ళో మబ్బు మెరిసిపోతుంది కురిసిపోదు అమటాడొకచోట రాయలసీమ కవి . 

సారూప్య , వైరుధ్యాల్ని పసిగట్టగల నేర్పు ఆమె సొంతం 

‘పల్లెలోని ఉక్కంటే నాకిష్టం. వాకిలి బైట నిల్చుంటానా \ దూరంగా వీధి చివరి మలుపు తిరిగి ఆడుగులో అడుగు వేసుకుంటూ భారంగా చేతిసంచీని మోసుకుంటూ అమ్మ నడిచి వచ్చిన దృశ్యం కనుపాపల్లో కదలాడుతుంది , అమ్మలాగే నడకలో నడతలో గమనించేవాళ్ళకి ఎన్నో విషయాల్లో వేగం కొల్పోయిన తనానికి ఎగతాళికి లోనవుతూ బహుశా అమ్మలాగే నేనూ అదృశ్యమయ్యాక అందరికీ అర్ధమవుతానా / 

ఏమో వాళ్ళ ఇళ్ల బైట వీధులు లేవు , మలుపులు లేవు \ ఆహ్వానించే ద్వారాలే లేవు. “ 

తల్లి జీవితాంతము తనని వదిలేసుకుని సంసార౦ కోసం బతుకుతుంది అంటే జీవితాన్ని పారేసుకుంటుంది , తర్వాత తనను తను పట్టించుకునే సమయం దొరుకుతుంది కానీ జీవితమే దొరకదు 

పీట్ హైన్ అనే కవి డచ్చి భాషలో రాసిన కవితా మన జీవితాలకు బాగా వర్తిస్తుంది 

“ ఒక చెప్పు పనికిరాదని విసిరెయ్యడం అందరూ చేస్తారు , కానీ విషాదం ఏమిటి అంటే ఆ ఒక్కటి పారేసుకున్నాక రెండోది దొరకడం “ ఇది స్త్రీల జీవితాలకు బాగా వర్తిస్తుంది  . 

ఫుట్ సోట్స్ లేకుండానే అర్ధమైపోయే కవిత్వం 

సరళ భాషలో చక్కటి కవిత్వం రాసిన కవయిత్రి వరలక్ష్మికి అబినందనలు . కొంకాలం పాటు కధలు వాయిదా వేసి అయినా సరే కవిత రాయాలని కోరుతున్నా , ఈకోరిక ఎలా వుందటే విల్సన్ గిప్సన్ కవిత లా వుంది అనుకున్నా సరే . ఏమిటా కవిత అంటే ‘

“ ఆటోలో ఇద్దరం ఎంత భారంగా ఇరుక్కుని కూచున్నప్పటికీ\ అతను జోకు వెయ్యడం మానలేదు,\ అందువల్ల మరొక కొత్తజోకు వెయ్యడానికి\ ప్రయత్నించినపుడు పగలబడి నవ్వుతుండగా\ ప్రమాదవశాత్తూ అతని తల బయటకి కనిపించింది.\ అతను జోకు వేస్తుండగానే తుపాకీ పేలింది…\ మిగతాది ఎపుడు వింటానో అని నేనింకా ఎదురు చూస్తూనే వున్నాను “ . అని ముగుస్తుంది .

చూడ్డానికి ఇది క్రూరంగా కనిపిస్తుంది కానీ ఇందులో ఒక జీవితం కోస౦ ఎదురుచూడ్డం వుంది, అతను తిరిగి వస్తే బావు౦టుంది.  అనే బదులు అతను జోక్ వేస్తే బావుండును అని కోరడ౦ అంటే వెనుకటి స్థితిని మళ్ళీ కొరడమే. 

కె. వరలక్ష్మికి అభినందనలు- 

*****

Please follow and like us:

2 thoughts on “మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం”

  1. వరలక్ష్మి గారి కవితలు అన్నీ చదివిన చక్కని అనుభూతినిచ్చారమ్మా! ధన్యవాదములు 🙏

Leave a Reply

Your email address will not be published.