ఉనికి పాట 

“త్వరత్వరగా అమ్మా,  త్వర త్వరగా!”

‘మమ్మా ఆఫ్రికా ’  మిరియం మకీబ

-చంద్ర లత

“మా లయ కుదరగానే

అన్నాను “చూసుకోండిక!”

మరి ఇదేగా   పట పట!

 అదంతే , యువతీ

ఇదే పట పట !”

 పట పట ఒక నాట్యం పేరు

జొహెనెస్ బర్గ్ శివార్లలో మేం చేసే నాట్యం

అందరం కదలడం మొదలు పెడతామో లేదో

పట పట రాగం మొదలుతుంది

 

“ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి.

అది  పట పట సమయం.

నాట్యం రాత్రంతా కొనసాగుతుంది,

సూరీడు పొద్దున్నే వచ్చి పలకరించేదాకా. ”  

(ఖ్సోసా పాట,  మకీబ 1967, తెలుగుసేత , చంద్ర లత)

             సొంపుగా సొబగుగా సొగసుగా,అడుగులో అడుగు వేస్తూ, అడుగుకో పదంవేస్తూ, ఆ నాజూకు నడకల్లోనే , మమ్మాఆఫ్రికా ,మకీబా గుండె లయ తప్పింది. పొద్దున్నే సూరీడు వచ్చి  పలకరించేలోగానే, ఆఫ్రికా ఆకాశాల్లో, అనంతవాయువుల్లో ,ఆమె ఊపిరిపాట కలిసిపోయింది.

    అది  11 నవంబరు 2008. అది ఇటలీ మాఫియా నేరప్రపంచ అధికారదౌష్ట్యానికి వ్యతిరేకంగా గళమెత్తిన  రెబెర్టో సావీయానోకు మద్దతుగా, సుప్రసిద్ధ ఆఫ్రికన్ గాయనీమణి, మకీబ, గళమెత్తిన స్వేచ్చావేదిక.

         తన 76వ ఏట  పాడుతూఆడుతూనే , ఆడుతూ పాడుతూనే “ పట పట ” ప్రదర్షిస్తోన్న స్వే చ్ఛావేదిక   మీదనే,

తన సుధీర్ఘ సంగీత ప్రయాణాన్ని ముగించింది, “మమ్మాఆఫ్రికా”, మిరియం మకీబ.          

       తరతరాల సంగీతప్రియుల హృదయాలలో, స్వే చ్ఛా వాదుల ఆలోచనల్లో, చీకటి నిండిన జీవితాల్లో,

 ఒక వెలుగుపాటను రచించింది. ఒక గొప్ప మానవ స్పృహను రగిల్చింది. ఒక కమ్మని జ్ఞాపకాన్ని మిగిల్చింది.

 ఖ్సోసా భాషలో “పట పట” అంటే స్పృశించడం.

ఎందెరెందరో హృదయాలను,ఆలోచనలను,జీవితాలను స్పృశించి ,

 తరతరాల అఖండ ఆఫ్రికావాసుల ముందు, సమస్త మానవాళి ముందు,

తననే ఒక ఉదాహరణగా నిలబెట్టింది, మమ్మాఆఫ్రికా, మిరియం మకీబ.

*

“  మీ పదాలు నిర్మాణాత్మకంగా ఉండాలి. మనుషులను చేరువ చేయాలి.

వాళ్ళను చిన్నాభిన్నం చేసి, దూరదూరంగా  విసిరిపడేయకూడదు.” మిరియం మకీబ.

మిరియం మకీబ

       నాలుక,పెదాలు,నోటితో ఒలికే చిత్ర విచిత్ర ధ్వనులతో కలగలిపిన  పదాలతో , ఒక అర్థవంతమైన, ఒక లయబద్దమైన పాటలా ఎలా రూపొందుతుందో, ఆ మర్మమెరిగిన ఆదిమ గాయకులు వాళ్ళు. మౌఖిక సాంప్రదాయాల్లో వేళ్ళూకున్న పాటలు అవి. అడుగుల సవ్వడి, చేతులచప్పుళ్ళతో పాటు, ప్రకృతిలోంచి సహజంగా మలుచుకొన్న అనేకానేక సంగీత పరికరాల నేపథ్యంగా, పాటే జీవితంగా గడిపే అనాది సమాజాల్లోంచి పుట్టిన గళాలవి.

          వైవిధ్యాన్ని,భిన్నత్వాన్ని,అనేకతను  కలగలుపుకొన్న ఆఫ్రికాఖండ స్వరాలు అవి. భిన్నత్వంలో అస్తిత్వం అంటే, ముక్కలుముక్కలు చేయడం కాదు. ఏ ముక్కకు ఆ ముక్కను ఎత్తి చూపడం కాదు. వైవిధ్యాన్ని అభిమానిస్తూ, అనేకతను పదిలపరుస్తూ,  భిన్నత్వపు కలనేత అఖండ ఆఫ్రికా అన్న అందమైనకల కనిన స్వేచ్చాపిపాసి, మిరియం మకీబ.

          జెంజైల్ మిరియం మకీబ (4 మార్చి1932 – 9 నవంబరు 2008), దక్షిణాఫ్రికా గాయనీమణి, పాటల రచయిత ,నటి, ఐక్యరాజ్య సమితి సుహృద్భావ రాయబారి. గామీ అవార్డు గ్రహీత.

    మానవహక్కుల ప్రతిష్టాపనకై  మకీబ చేసిన కృషికి గాను 1986 లో, ప్రతిష్టాత్మక “దాగ్ హామర్స్ జోల్డ్ శాంతి బహుమతి” పురస్కృతురాలయినంది. 1999లో, నెల్సన్ మండేలా చేతుల మీదుగా  దక్షిణాఫ్రికా సర్వోన్నత పురస్కారం “రాష్ట్రపతి పతకం” పొందింది.

         మకీబ తల్లి, క్రిస్టీనా మకీబ,  స్వాజీ తెగకు చెందినది. ఒక పనిమనిషి. ఒక స్యాంగోమా, సాంప్రదాయ వైద్యురాలు.

         మకీబ తండ్రి, కాస్వెల్ మకీబ, ఖ్సోసా తెగవాడు. ఒక బడిపంతులు. ఒక చిన్న గాయక బృందం నడిపిన వాడు. 

       ఆరవ బిడ్డగా మకీబ తల్లి కడుపునపడకముందే, వైద్యులు ‘ఇక పై గర్భందాలిస్తే, తల్లికీ బిడ్డకు ప్రాణాంతకం’ అని హెచ్చరించారట.మకీబతల్లి, క్రిస్టీనా, ప్రాణాలకు తెగించి,పురుడు పోసుకొంది. ఆ కష్ట సమయంలో, క్రిస్టీనాకి తోడుగా ఉన్న మకీబ అమ్మమ్మ తరుచు గొణుగుతూ ఉండేదట, “ఉజెంజైల్ “,అంటూ.

      ఖ్సోసాభాషలో  “ఉజెంజైల్ “, అంటే   “నీకై నువ్వు తెచ్చిపెట్టుకొన్నావ్!”,  అని. ఆవిడ ఎంత తరుచుగ ఆ మాట అనేదంటే, పురుడు పోసుగానే, మకీబ తల్లి ఆ మాటనే బిడ్డ పేరుగా పెట్టేసింది. ‘జెంజైల్’ అని. 

       మకీబ 18రోజుల బిడ్డగా ఉన్నప్పుడు, ఆమె తల్లిని అరెస్టుచేసి జైల్లో పెట్టారు. ఆమెతో పాటు,పసిబిడ్డ మకీబాను. మాల్ట్, మొక్కజొన్నలతో ఇంట్లో తయారుచేసిన నాటుసారా, అంకియొంబోథి, పట్టుబడడంతో , మకీబ తల్లి ఈ శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. బదులుగా కట్టడానికి , వాళ్లు వేసిన చిన్నపాటి జరిమానా డబ్బు అప్పట్లో, వారి వద్ద లేదు.  మకీబ తన జీవితంలోని మొదటి ఆరునెలలను జైలులో గడిపింది.

       మకీబతండ్రి మకీబ ఆరేళ్ళవయస్సులో చనిపోయాడు. ఆ వంటరితల్లి, తన ఆరుగురు బిడ్డలను  తన తల్లి వద్ద వదిలి , సంపన్నుల ఇళ్ళల్లో పనికి చేరింది. మకీబ ఇళ్ళల్లో పాచిపనుల్లో, పిల్లలను పెంచేపనుల్లో కుదరవలసి వచ్చింది.

           భిన్నతెగల, భిన్నభాషల, భిన్నసాంస్కృతిక నేపథ్యాల పాటలు,సంగీతం, వారి కుటుంబంలో అంతర్భాగం. మకీబ తల్లి సాంప్రదాయ సంగీతవాయిద్యాలను వాయించేది. తండ్రి పియానో వాయించేవాడు. మకీబ పెద్దన్న, జోసెఫ్, మకీబకు అమెరికన్ జాజ్ పరిచయం చేశాడు. ఇంగ్లీషు పాటలుపాడడం నేర్పించాడు.

 

          నల్లవారికే ప్రత్యేకించిన మెథడిస్ట్ ప్రాథమికపాఠశాలలో మకీబ ఎనిమిదేళ్ళపాటు చదివింది. ప్రిటోరియాలోని ,కిల్నర్టన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్  వారి సంగీత బృందంలో శిక్షణ పొందేటప్పుడు, మకీబ ప్రతిభ గుర్తించి, ప్రోత్సహించబడింది. మకీబ ప్రొటెస్టంట్ గా బాప్టైజ్ చేయబడింది. చర్చ్ సంగీతబృందంలో ఇంగ్లీష్, ఖోసా,సోథో, జులూ భాషల్లో ప్రార్థనాగీతాలు పాడేది. మకీబాకు ఇంగ్లీషు భాష రావడం కన్నా ముందే, ఇంగ్లీషు పాటలు పాడడం వచ్చింది.

కింగ్ జార్జ్  దక్షిణాఫ్రికా పర్యటన సంధర్భంలొ , పాటలు పాడిన బడిపిల్లల బృందంలో మకీబ ఉంది. పదమూడేళ్ళ వయస్సులో , మకీబ  ప్రధాన గాయని (సోలో) గా గీతాలు పాడడం మొదలు పెట్టింది. 

పదహారేళ్ళ వయస్సులో, 1949 లో , అప్పుడు పోలీసుగా శిక్షణ పొందుతున్న , జేమ్స్ కూబేను పెళ్ళి చేసుకొంది. 1950 లో, వారికి “బోంగి” అన్న పాప పుట్టింది. బిడ్డపుట్టిన ,కొన్నాళ్ళకు మకీబకు ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్ బయటపడింది.   ఈ వివాహ జీవితం ఆద్యంతమూ , జేమ్స్ కూబె తరుచు కొట్టే దెబ్బలతో గడిచింది. క్యాన్సర్ అన్న సంగతి తెలియగానే, జేమ్స్ కూబే, మకీబను, బిడ్డను విడిచివెళ్ళాడు.క్యాన్సర్ నయం చేసుకొంటూ,బిడ్డ పోషణకై,ఒంటరితల్లి , మకీబ పాటలప్రపంచంలో, గళం విప్పింది. అందరూ మగవాళ్ళే ఉండే, క్యూబన్ బ్రదర్స్ బృందంలో 1950లో గాయనిగా చేరింది. ఆ తరువాత, మాన్ హట్టన్ బ్రదర్స్ బృందంతోనూ పాడడం మొదలు పెట్టింది.  1953 లో మకీబ మొదటి ప్రసిద్ధ గీతం, ” లాకు షోని ఇలాంగా” పాట ను మాన్ హట్టన్ బ్రదర్స్ విడుదల చేసారు.

 “సూరీడు సముద్రాన కుంగేటప్పుడు,

   నీ గురించే ఆలోచించా.

   జాబిల్లి పైపైకి వచ్చినపుడు,

  పశువులు ఇళ్లకు మళ్లినప్పుడు,

  నీ గురించే ఆలోచించా .

  ఇంకా ఇంటికి తిరిగిరాని నీకోసం,

  వీధుల్లో వెతికా.

   ఆసుపత్రులు, జైళ్ళు ఉన్న వీధుల్లో,

   వెతుకుతూనే ఉన్నా!”

“వెతుకుతూనే ఉన్నా,” అంటూ సాగే ఈ  ఖ్సోసా పాటతో దక్షిణాఫ్రికా దేశవ్యాప్తంగా మకీబ గాయని గా ప్రాచుర్యంలోకి వచ్చింది.  

“అందమైన అబద్దాలు” (1956), మాన్ హట్టన్ బ్రదర్స్ బృందం

 “నీ అందమైన కళ్ళతో అందమైన అబద్దాలు చెపుతావ్” అన్న ఖ్సోసా పాట,”అందమైన అబద్దాలు” (1956) బిల్ బోర్డ్ టాప్ 100 లో చోటు చేసుకొంది.”డ్రం” పత్రిక ముఖపత్రం పై మకీబ చిత్రం  మొదటిసారిగా ప్రచురించబడింది.

మాన్ హట్టన్ బ్రదర్స్ బృందంలో ఉన్నప్పుడు,  1955లో యువ న్యాయవాది నెల్సన్ మండేలాను మొదటిసారి కలిసింది.

1956 లో  ఆఫ్రికాలో మొట్టమొదటి ప్రత్యేక గాయనీమణుల బృందం “ది స్కైలార్క్స్”లో చేరింది. డొరోతీ మసుకా, ఆల్లన్ సిలింగర్ ప్రభృతులతో కలిసి పాడేది. ఆఫ్రికా సంగీత చరిత్రలో ఈ మహిళాగాయనీబృందం విజయం విశేషమైనది.

        

ది స్కైలార్క్స్ ,1956

1959లో భారతీయ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా గాయకుడు, షన్నా సన్నీ పిళ్ళై ని వివాహం చేసుకొంది

 బ్రాడ్-వే స్పూర్తితో నిర్మించిన,  ఆఫ్రికన్ జాజ్ ఒపేరా,”కింగ్ కాంగ్ (1959)“లో , ఆమె నేపథ్యగానం చేసింది. హారీ బెలెఫాంటే ఆమె సహగాయకుడు. జాతిబేధం లేకుండా, అందరిలోనూ అభిమానులను సంపాదించుకొంది.

కింగ్ కాంగ్ (1959)

లియోనిల్ రొజెనిల్ నిరంచిన ఆఫ్రికన్ సినిమా, “కం బ్యాక్, ఆఫ్రికా” (1959) లో ఒక చిన్నపాత్ర పోషించింది. ఆనాటి దక్షిణాఫ్రికా సమాజంలోని ఏ దుర్భర  పరిస్థితులు యువతను నేరచరితులను చేస్తున్నాయో ఈ సినిమా చర్చిస్తుంది. రొజెనిల్ ఈ సినిమా ను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్షించడానికి మకీబను పిలిపించాడు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ఇటాలియన్ క్రిటిక్స్ అవార్డ్ ను అందుకోవడం తో పాటు, మకీబాను గాయని గా స్థిరపరిచింది.

రొజెనెల్ మకీబకు బ్రిటన్, అమెరికా పర్యటనలు ఏర్పాటు చేసాడు. సహగాయకుడు హారీ బెలెఫాంటే తో వృత్తిపరమైన ఒప్పందం కుదిరింది. ఈ గాయక జంట విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందారు. 1962  లో జాన్ ఫ్. కెన్నెడీ ముందు ప్రదర్షన చేసారు. వారిద్దరి ఆల్బం, “బెలెఫాంటే మకీబ లతో ఒక సాయంకాలం (1965)”, గామీ అవార్డును అందుకొంది. 1966 లో.

గామీ  అవార్డు తో బెలఫాంటే, మకీబ  (1966)

అయితే, ఆ తరువాతి సంవత్సరమే , వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తి, ఇద్దరు విడిపోయారు. ఎవరికి వారు  స్వతంత్రంగా పాడడం మొదలెట్టారు. 

సన్ని పిళ్ళైతో మకీబ వివాహం 1960 లో ముగిసింది. అదే ఏడాది,మకీబ తల్లి  దక్షిణాఫ్రికాలో మరణించింది. ఆ వార్త తెలియగానే, అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న  మకీబ , తల్లి అంత్యక్రియలలో పాల్గోవడానికి దక్షిణాఫ్రికా వెళ్ళాలని ప్రయత్నించినపుడు, మకీబ దక్షిణాఫ్రికా పాస్ పోర్ట్ రద్దయిన విషయం తెలిసింది. మకీబ పై ఆనాటి దేశబహిష్కరణ దాదాపు మూడుదశాబ్దాలు కొనసాగింది. 1990 లో నెల్సన్ మండేలా ఆహ్వానం పై తిరిగి స్వదేశాన అడుగు పెట్టింది. అదీ, ఫ్రెంచ్ పాస్ పోర్ట్ తో. 1992 లో దక్షిణాఫ్రికా పౌరసత్వం తో పాటుగా, ప్రతిష్టాత్మకమైన దక్షిణాఫ్రికా సర్వోన్నత పురస్కారం, నెల్సన్ మండేలా చేతుల మీదుగా, రాష్ట్రపతి పతకం అందుకొంది.

    తల్లి మరణం తరువాత, ఏకైక సంతానం బోంగి మకీబ ను  అమెరికా కు పిలిపించుకొంది. 1963 నుండి 68 వరకు గాయకుడు, “సొవెటొ నీలాలు” గేయరచయిత “హ్యూ మసకెలా”తో  వివాహ జీవితం గడిపింది.     

అప్పటి అమెరికాలోని అత్యంత ప్రజాదారణ పొందిన ఆఫ్రికన్ గాయనీమణిగా ప్రసిద్ధికెక్కింది. జాతివివక్షతో సంబందంలేకుండా, అన్ని వర్గాల్లోనూ ఆమె గానానికి అభిమానులు ఉన్నారు.మార్లీన్ బ్రాండో,లారెన్ బకాల్, లూయీ ఆం స్ట్రాంగ్ ,రే చార్లెస్, నీనా సైమన్ తదితరులతో సన్నిహితసంబంధాలు ఉండేవి. ఎల్లా ఫిట్జ్ గార్డ్ , ఫ్రాంక్ సినట్రా వరసలో ఆమెను పరిగణించేవారు. మకీబ ఆనాటి న్యూయార్క్ నల్ల జాతి కళాకారులలో,ఉద్యమ కారులలో,మేధావులలో ముఖ్యురాలిగా గుర్తించబడింది.

1968 లో, బ్లాక్ పాంథర్ పార్టీకి చెందిన కార్మైకెల్ ను పెళ్ళి చేసుకొంది. ఒక్కసారిగా అమెరికాలో ఆమెపట్ల చూపిన ఆదరణ, అభిమానం తలకిందులయ్యింది. సాంప్రదాయవాదులు ఆమె పెళ్ళిని,  ఆమెను, ఆమె పాటలను బహిరంగంగానే బహిష్కరించారు. అమెరికాలో జాతివివక్షను తీవ్ర స్థాయిలో చవిచూసింది మకీబ. 

ఆమె వివాహం రాజకీయాతీతమని మకీబ భావించినా, ఆమె అభిమానులు భావించలేదు.రేయింబవళ్ళు వారిపై నిఘావేశారు.  చివరికి, బహమా లో పర్యటన లో ఉన్న భార్యాభర్తలను అమెరికాలోకి తిరిగి రానివ్వకుండా, నిలిపివేసారు. ఒక్కసారిగా, మకీబ అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయింది. వారిరువురినీ, అమెరికానుంచి బహిష్కరించారు. మకీబ , భర్తతో పాటు గినియా దేశానికి వెళ్ళింది.

      అప్పుడే, దక్షిణాఫ్రికాలో తప్ప ,ఆఫ్రికా ఖండమంతా విస్తృతంగా  పర్యటించింది. ఈ విస్తృత పర్యటనా కాలంలో ఆమె రెండు పాటలు తప్పక పాడేది.   “పట పట” ” దేవుడు ఆఫ్రికాను ఆశీర్వదించుకాక !” ఈ రెండో గీతం ఆయా దేశాలలో జాతీయ గీతం అయ్యింది. దక్షిణాఫ్రికాతో సహా.

కెన్యా, అంగోలా, జాంబియా, టాంజేనియా, మొజాంబిక్ , ఘనా, నైజీరియా, బోత్స్వానా ఇలా ఒక్కొక్క దేశం స్వతంత్రం పొందగానే, వారి మొదటి   స్వాతంత్ర్య వేదికపై ప్రారంభగీతం పాడింది.ఆయా దేశాలకు సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించింది. గినియాదేశం తరుపున ఐక్యరాజ్యసమితికి రాయబారి  అయ్యింది. ఈ క్రమంలోనే, ఆఫ్రికావాసులు మకీబాను “మమ్మా ఆఫ్రికా” అని పిలవడం మొదలు పెట్టారు.

1978లో కార్ మైకైల్ తో  ఆమె వివాహ జీవితం ముగిసింది. కానీ, అమెరికా ఆమెపై విధించిన నిషేదం 1987 వరకు కొనసాగింది. 1980లో బాగిఎట్ బా ని  వివాహం చేసుకొంది.

ప్రదర్షనకళా ప్రపంచం మిరుమిట్లు గొలిపే అలంకరణల ప్రపంచం, అప్పటి ఆఫ్రికన్ యువ కళాకారులకు భిన్నంగా, మకీబ తన అలంకరణను తనలాగానే అట్టిపెట్టుకుంది. ముఖ్యంగా, కేశాలంకరణ, చర్మాన్ని తెల్లగా మెరిపించే మేకప్పుల ను ఆమె పూర్తిగా నిరాకరించింది. ఆయా అలంకరణసామాగ్రి ప్రకటనలలో పాల్గొనడానికి  నిర్ద్వందంగా ఖండించింది.దుస్తులు, నగలు తన సంస్కృతికి ప్రబింబించేలా ధరించేది. తనదైనవంటి రంగు, జుట్టు,అలంకరణలతో శైలితో “ఆఫ్రో లుక్” ని నిర్వచించింది.ఆఫ్రికన్ అందానికి ఒక ప్రతీకను సృష్టించింది. 

జాతివివక్ష, స్త్రీవాదము, ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు మొదలయినవి  విడివిడిగా చేయవలసిన ఆలోచనలు కాదనీ, కలిసి సాధించవలసిన లక్ష్యాలుగా ఆమె భావించింది.

   జాతివివక్ష వ్యతిరేక పౌర హక్కుల నాయకుడిగా ఎంతో అభిమానించే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ , దక్షిణాఫ్రికా వ్యవహార శైలి లోని పరిమితులను నిగ్గ దీయడానికి, కింగ్ తో విభేదించడానికి కూడా మకీబా ఏమాత్రం వెనకాడలేదు. 

  మొదటి దేశబహిష్కరణ, తన పుట్టింటిమీద బెంగను కలిగిస్తే, రెండోఇంటి నుంచి బహిష్కరణ, మకీబ కార్యాచరణలో స్పష్టత తీసుకొచ్చింది.

 అప్పటివరకు, ఆఫ్రికా జానపదగాయని గా , సాంస్కృతిక రాయబారిగా తన జీవితాన్ని  కొనసాగించిన మకీబా, రాజకీయస్పష్టతతో ముందుకు సాగింది.ఆమె కార్యాచరణ, ఆయా దేశాలు  స్వతంత్రం పొందడంవరకే పరిమితం కాలేదు. ఆయాదేశాలు కొత్తగా పొందిన స్వేచ్చను కాపాడుకోవడం గురించి, అక్కడినుంచి ప్రగతిమార్గాన ముందుకు సాగడం గురించి, మానవదృక్పథంతో ఎదగడం గురించి గురించి కూడా ఆమె దృష్టి నిలిపింది.

   “పోరాటం కొనసాగుతుంది (అ ల్యూటా కంటిన్యూవా) ” అంటూ , ఆయాదేశాల పునర్నిర్మాణంలో మానవహక్కుల సాధన కోసం, మానవ విలువల  స్థాపనకోసం, శాంతి, సుహృద్భావన కోసం పరితపించింది.

  “అ ల్యూటా కంటిన్యూవా”(1980)  గేయరచయిత బోంగి మకీబ, ఆమె ఏకైక సంతానం, గాయని. మకీబకు పునర్నిర్మాణదశలో స్పూర్తిదాయకం అయ్యింది. అయితే, 1985 లో బోంగి  తన బిడ్డకు జన్మనిస్తూ,ప్రసూతి సమయాన కన్ను మూసింది.

   ఎన్నెన్నో ఆటుపోట్లను దాటివచ్చిన మకీబ, కన్నబిడ్డ ఆకస్మిక మరణం మిగిల్చిన గర్భశోకం నుంచి బయటపడలేక పోయింది. స్త్రీల ఆరోగ్యం, బాలికా ఆరోగ్యం పై అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.

  ఆఫ్రికాను పట్టి పీడిస్తున్న, ఎయిడ్స్,  స్త్రీలపై వివక్ష, గృహహింస, సాయుధపోరాటాల్లో చిన్నపిల్లలను వాడడం, పిల్లల చేతుల్లో ఆయుధాలుఉంచడం, మాదకద్రవ్యాల వాడకం, వంటి తీవ్ర సామాజికరుగ్మతలపై పోరాడుతూనే,

 బాలికావిద్య, ఆరోగ్యం, వైద్యం, స్వాలంబన, వికలాంగుల సంక్షేమం, వంటి అనేక సానుకూల సమాజ నిర్మాణ కార్యకలాపాలను వృద్ధిచేసింది.

ఆఫ్రికా సంస్కృతిని, రాజకీయాలను ,సామాజిక స్పృహను సమపాళ్ళలో, ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన వ్యక్తి ,  మకీబాను ఆఫ్రికాఖండవాసులు ఎంతగా అభిమానిస్తారో, అంతగా గౌరవిస్తారు. “మమ్మా ఆఫ్రికా” అంటూ.

***

          జానపదంలో ఉండే నాజూకుతనాన్ని, అమాయకత్వాన్ని,సున్నితస్వభావాన్ని, లాలిత్యాన్ని, సంతోషాన్ని  ప్రోదిచేసినట్టుగా ఉండే సొంపైన స్వరం మకీబాది. జానపదాల్లోని వేడుక, వినోదం, లౌక్యం,సరసం, చాతుర్యం, హాస్యం,కొంటెతనం,జాణతనం ఆమె పాడే పాటల్లో కూడా ధ్వనిస్తాయి.     ఖ్సోసా, ఝులూ, సొథూ,స్వాహాలి, స్వాజీ అనేక మొదలయిన స్థానిక ఆఫ్రికన్ భాషలతో పాటుగా, మధ్య యూరోప్ కు చెందిన యూదుల భాష ‘యిడ్డిష్’ లోనూ, ఆఫ్రికన్ డచ్ భాష ,’ఆఫ్రికాన్స్’ , పోర్చుగీస్ మొదలయిన వాటిలోనూ,ఇంగ్లీషు భాషలోనూ ఆమె పాడింది. ఏ భాషలో పాడినా, ఆయాభాషలోని జీవాన్ని ఆమె తనలో నింపుకొనేది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.