నారిసారించిన నవల 

-కాత్యాయనీ విద్మహే 

   7

1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల నాటికి దూరపు కొండలు, యుగసంధి, రామప్ప గుడి, త్రివర్ణపతాక, నవలలు వచ్చాయి. యుగ సంధి, రామప్ప గుడి నవలలు  ప్రధమ ముద్రణ ప్రతులలో సంవత్సరమేదో ప్రచురించబడలేదు. యుగ సంధి నవల కవర్ పేజీ వెనుక భాగంలో రచయిత్రి ఇతరరచనలు అనే శీర్షిక కింద దూరపుకొండలు, తంజావూరు పతనము,సప్తపర్ణి, రామప్పగుడి నవలల తో పాటు అచ్చులో ఉన్న నవలలుగా త్రివర్ణ పతాక, వంకర గీతలు, అనంగలేఖ పేర్కొనబడ్డాయి. పాటలి నవలకు రచయిత వ్రాసుకొన్న ముందుమాటలో త్రివర్ణ పతాకం ప్రస్తావన కూడా ఉంది కాబట్టి వంకర గీతలు, అనంగలేఖ తప్ప మిగిలిన నవలలు అన్నీ  1973 లోపలే అచ్చు అయినట్లు భావించాలి. , నరమేధము నవల తొలి ప్రచురణ ఎప్పుడో తెలియదు కానీ 1979 లో దాని ద్వితీయ ముద్రణ వచ్చింది. పాటలి నవల ముందు మాటను బట్టి ఆమె ‘పాంచాలి’ అనే పౌరాణిక నవల వ్రాయటానికి సమాచారం అంతా సేకరించి పెట్టుకొన్నట్లు తెలుస్తుంది. 

వసుంధర తెలుగు ఎమ్మె చేసింది. గాఢమైన సంస్కృతాంధ్ర ప్రబంధపరిజ్ఞానం ఆమె నవలలో కనబడుతుంది.  విశ్వనాథ సత్యనారాయణకు ప్రత్యక్ష శిష్యురాలు. నవలా రచనకు ఆమెకు ప్రేరక శక్తి ఆయనే. పాటలి నవలకు వ్రాసిన పీఠిక లో అధ్యాయాల విభజన, ప్రారంభ ఉపసంహారాలు, పాత్రల శీల చిత్రణము, ఏది వ్రాయాలి, ఏది పాఠకుల స్ఫూర్తికి వదలాలి? మొదలైన బహువిషయాలు విశ్వనాథ ఉపన్యాసాలనుండి గ్రహించానని చెప్పుకొన్నది. గ్రాంధికభాషలో రచన, ప్రబంధ రచనా శైలి,  వాక్యరచనా పద్ధతి మొదలైన వాటిలో విశ్వనాథ ప్రభావం ఈమె నవలలపై ఉంది. వసుంధర నవలలు ఎక్కువ ఆంధ్ర విశ్వ విద్యాలయం (ఆంధ్రవిశ్వకళా పరిషత్) పోటీలకు వ్రాయబడి బహుమతులు పొందాయి. 1934 లో తొలిసారి ఈ సంస్థ పెట్టిన నవలల పోటీలో విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు, అడవి బాపిరాజు నారాయణ రావు నవలలు బహుమతులను పొందాయి. ఆ తరువాత ఆ సంస్థ ఇంటెర్మీడియేట్ విద్యార్థులకు ఉపవాచకాలుగా బోధించటానికి చారిత్రక  నవలల పోటీలు నిర్వహించింది. అట్లా వసుంధర వ్రాసిన తంజావూరు పతనము నవల 1952 సంవత్సరపు బహుమతి పొందింది. ఆ క్రమంలో సప్తపర్ణి, పాటలి నవలలు కూడా బహుమతి పొందిన నవలలే.

వసుంధర నవలలు ప్రధానంగా చారిత్రకాలు. తంజావూరు పతనము వాటిలో మొదటిది. 16, 17 శతాబ్దులలో తమిళ దేశాన్నిపరిపాలించిన తెలుగు రాజులు తంజావూరు నాయక రాజులు. 14 వ శతాబ్దిలో విజయనగర రాజులు తమిళ దేశాన్ని మధుర, తంజావూరు, చెంజి అని మూడు ప్రాంతాలుగా విభజించి, నియమించిన  ప్రొవిన్సియల్ గవర్నర్లు16 వ శతాబ్ది మధ్యభాగానికి విజయనగర రాజులకు కప్పం కట్టే స్వతంత్ర శక్తులుగా అవతరించారు.1532 లో చెవ్వప్ప నాయకుడితో ప్రారంభమైన తంజావూరు నాయక రాజ్యం 1673 లోమధుర రాజైన చొక్కనాథ నాయకుడితో జరిగిన యుద్ధంలోవిజయరాఘవనాయకుడి పరాజయంతో ముగిసింది. విజయరాఘవనాయకుడు తన కూతురిని చొక్కనాథనాయకుడికి ఇచ్చి పెండ్లి చేయటానికి నిరాకరించినందువలన జరిగిన ఈ యుద్ధం తంజావూరు నాయక రాజ్య పతనానికి కారణమైంది. 

ఇది తక్షణ కారణమయినప్పటికీ దీనికి నేపథ్యంలో పనిచేసిన ఇతరేతర ధార్మిక నైతిక కారణాలను కల్పిస్తూ  అభివృద్ధి చేయబడిన ఇతివృత్తంతో నిర్మాణమైన నవల తంజావూరు పతనం. ఆ కారణాలలో విజయరాఘవ నాయకుడికి రంగాజమ్మ తో ఏర్పడిన సంబంధ పరిణామాలు ఒక అంశం. నవల కథ మొదలు కావటమే పదిహేనేళ్ల క్రితమే  విజయ రాఘవ నాయకుడు రంగాజమ్మను తెచ్చి ఆశ్రయమిచ్చినట్లు, ఫలితంగా అప్పటినుండి భోజనం వద్ద తప్ప మహారాజుగారి దర్శనం దుర్లభమై మహారాణి మనోవేదనకు గురి అవుతున్నట్లు దానిని తన పుట్టింటి అరణపు బ్రాహ్మడు సోమయాజులు తో  చెప్పుకొనటం దగ్గర మొదలు అవుతుంది. మహారాణికి వచ్చిన కష్టాన్ని తొలగించటం ఎట్లాగా అని అతను ఆలోచనలలో పడటం కథా గమనాన్ని నిర్దేశించే అంశం.   

విజయరాఘవ నాయకుడి కాలానికి పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యానికి కొనసాగింపుగా అధికారం లో ఉన్న అరవిద్ వంశపు మూడవ శ్రీరంగ రాయల  పాలన కొనసాగుతున్నది. మధుర, తంజావూరు,చెంజి నాయకరాజులు ఒక్కటై విజయనగర ఆధిపత్యాన్ని కూలదోసే ప్రయత్నంలో ఉన్నారని పసిగట్టి విభజించి పాలించు పద్ధతిలో ఆ సమస్యను ఎదుర్కొని  శ్రీరంగరాయల అధికారాన్ని నిలబెట్టటానికి దండనాధుడు రామరాజు వ్యూహం పన్నటానికి అవకాశం ఇచ్చింది కూడా విజయరాఘవనాయకుడి ఆ సౌందర్య లోలుపత్వమే. ఆ సాహిత్య కళా ప్రియత్వమే నని నవల ఇతివృత్తపు అల్లికలో దానిని ఒక పోగు గా చేసింది వసుంధర. ఈ వ్యూహాన్ని అమలుచేసే వ్యక్తి  ఈ నవలలోని నియోగి వెంకన్నపాత్ర. రంగరాయల ఆస్థాన నర్తకి చంద్రరేఖ ను ఎరగా వేసి విజయ రాఘవ నాయకుడిని వేరు చేసి మధుర చెంజి నాయక రాజులను యుద్ధంలో ఓడించటంతో ఈ వ్యూహం విజయవంతం అయింది. 

తండ్రి భోగలాలసత, అందువల్ల తల్లికి జరుగుతున్న అవమానం గురించిన చింతన  కొడుకు మన్నారుదాసుది. అదినెపంగా అతనిపట్ల రాజద్రోహం ఆరోపించి విజయరాఘవనాయకుడిని రెచ్చగొట్టటం,సవతి సోదరులలో కూడా మన్నారుదాసు పట్ల వైషమ్యాన్ని కల్పించట, తద్వారా అంతః కల్లోలాన్ని సృష్టించి తంజావూరు పై పట్టు సాధించటం దానికి అనుబంధ వ్యూహం. ఇది కూడా వెంకన్నవ్యూహమే. ఫలితం విజయరాఘవనాయకుడు కొడుకును బంధించి చెరసాలలో పెట్టటం. 

రంగాజమ్మ వచ్చినది మొదలు ఈ పదిహేనేళ్లుగా భర్త ప్రేమకు నోచని బాధ గుండెలలో కొలిమివలె మండుతుంటే రాజు కొడుకును కారాగృహం లో బంధించిన వార్త మహారాణిని కోపోద్రిక్తురాలిని చేయటం, ఆమె మౌన ధిక్కారం, పట్టమహిషిగా తనకు ఉన్న అధికారాలను వినియోగించే చైతన్యం పొందటం దాని పరిణామాలు నవలలో కథను పరాకాష్ట స్థితికి చేరుస్తాయి. ఒకవైపు వెంకన్న కదలికలపై నియంత్రణ, మరొక వైపు రంగాజమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించిన అన్వేషణ… చివరకు రంగాజమ్మ రాఘునాథ నాయకునికి ఒక వారాంగన వల్ల పుట్టిన కూతురు అనితెలియటం, తానిన్నాళ్ళు సోదరిపట్ల మోహ ప్రవృత్తి తో ఉన్న విషయానికి విజయరాఘవనాయకుడు కుమిలిపోవటం. ఈ వాస్తవాలను వెలికి తీసినందుకు రాణిపైనా, ఆమెకు తోడ్పడినందున సోమయాజులుపైన, ఆమె పట్ల సానుభూతి గౌరవమూ గల పెద్దిదాసు పైనా అసహనం, అనవసర క్రోధం, ప్రతీకారేచ్ఛ, సోదరి తో ఇన్నాళ్ల తన అధర్మ సంబంధంపట్ల అంతరంగ వేదన – ఇవన్నీ విజయరాఘవనాయకుడిని సంఘర్షణకు లోను చేసి అనుచిత చర్యలకు దిగేట్లు చేస్తాయి. మహారాణి గౌరవించే పెద్ది దాసు ను సభలో చర్చలలోకి దించి అవమానించాలని చూడటం, అది సాధ్యం కాకపోయేసరికి గాడిదకు అలంకారం చేసి పెద్దిదాసుకు సన్మానమని వూళ్ళో ఊరేగించడం జరిగాయి. పెద్ది దాసుకు వచ్చిన కల రూపంలో విజయరాఘవ నాయకుడి పతనాన్ని సూచించటంతో ఈ నవల ముగుస్తుంది. 

విజయరాఘవ నాయకుడి అష్టమహిషులలో జ్ఞానాంబిక ఒకతె. ఆమె కూతురు అచ్యుతాంబిక. నవల లో ఆమె కూతురి పెళ్లి విషయం భర్తకు గుర్తు చేయటం, వెంకన్నకు ఆవిషయం చెప్పటం అది పట్టుకొని మధుర చొక్కనాథ నాయకుడితో సంబంధం కుదర్చటం గురించి వెంకన్న తలపెట్టటం ప్రస్తావనకు వస్తాయి. పెద్దిదాసు కల లో ఆ పెళ్లి సంప్రదింపుల వైఫల్యం యుద్ధం దృగ్గోచరం అయ్యాయి. విజయరాఘవనాయకుడు తన  కూతురిని చొక్కనాథుడికి ఎందుకు పెళ్లి చేయనన్నాడు ? అతని అక్కను పెళ్లాడిన తిరుమలశౌరి తాను కట్టించిన కోట గురించి ఆమె అభిప్రాయమడిగి అందంగానే ఉంది కానీ మా తండ్రిగారి కోటలో శిల్ప చాతుర్యం ఎక్కువ అని చెప్పిన సమాధానానికి కినిసి ఆమెను పొడిచి చంపేశాడు. అక్కను పొట్టనపెట్టుకున్న వారి ఇంటికి బిడ్డను పంలేను అన్నది అతని నిశ్చయం. అది యుద్ధకారణం. సర్వ వంశ వినాశ కారణం. తంజావూరు పథాన కారణం. వీటికి తోడు విష్ణుభక్తుడైన పెద్దిదాసును అవమానించటం అని అతని కల సూచిస్తుంది. 

ఎంతమంది భార్యలు ఉన్నారో కూడా తెలియనంతగా పెరిగిన రాజుల భోగలాలసత, స్త్రీ వ్యామోహం వాళ్ళ  నైతిక పతన హేతువు కాగా, అధికార వికార ఫలితమైన బ్రాహ్మణ భక్త జన నిర్లక్ష్యం ధార్మిక పతనహేతువు. సామ్రాజ్యాల పతనానికి రాజకీయ ఆర్ధిక కారణాలు ఎన్ని ఉన్నా వాటికి మూలమైనదిగానైతిక ధార్మిక పతనలక్షణాన్ని ప్రతిపాదించటం ఈ నవలలో వసుంధర జీవిత దృక్పథానికి నిదర్శనం. బహుభార్యత్వ వ్యవస్థలో స్త్రీల ఊపిరిఆడని తనాన్ని,  భర్త ప్రేమను, ఆదరమును నోచుకోలేని స్త్రీల దైన్యాన్ని, సూక్ష్మ స్థాయిలో చూపిస్తూనే ఆ విధమైన జీవన సంఘర్షణ నుండి ఆత్మాభిమాన చైతన్యంతో స్త్రీలు సాధికార ప్రకటన చేయగల స్థాయికి ఎలా ఎదుగుతారో రాజగోపాలాంబిక పాత్ర పరిణామం ద్వారా నిరూపించింది వసుంధరాదేవి. 

కాకతీయ గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రసేనానిములుగు కు సమీపంలోని పాలంపేటలో నిర్మింపచేసిన దేవాలయం రామప్ప. ఈ గుడిలో శివుడు  రామలింగేశ్వరుడు. ఇది కాకతీయ శిల్పకళావైభవానికి ప్రబల నిదర్శనం. గుడి నిర్మాణంలో పాల్గొన్న ప్రధాన శిల్పి రామప్ప పేరుమీద ఈ గుడి ప్రసిధ్ధికిఎక్కింది. శిల్పి రామప్పను కేంద్రంగా చేసి వసుంధర వ్రాసిన నవల రామప్ప గుడి. శిల్ప విద్యలో ప్రావీణ్యం గల బ్రాహ్మణుడైన రుద్రప్ప కొడుకు రామప్ప ,వారసత్వంగా తండ్రి నుండి ఆ విద్యను పుణికి పుచుకున్నాడు. తండ్రి మరణానంతరం అతని చిరకాలవాంఛ అయిన శివాలయ నిర్మాణ బాధ్యత కొడుకుది అయింది. మిత్రుడు మృత్యుంజయుడు కృష్ణభక్తుడు . విష్ణుదేవుని ఆలయ నిర్మాణం అతని కోరిక. ఈ రెండింటి మధ్య వైరుధ్యం తో సంఘర్షణకు లోనవుతున్న కాలంలో ఓరుగల్లు నుండి కాటయ భాండయ సేనాపతులు వచ్చి రుద్రేశ్వరాలయ నిర్మాణ బాధ్యత అతనికి అప్పగించటం, తన విష్ణుదేవాలయ నిర్మాణ వాంఛ నెరవేరదని   మిత్రుడు నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకొనటం అనంతశర్మ బోధవల్ల ఆ సంక్షోభాన్ని తట్టుకొని అతను దేవాలయ నిర్మాణానికి సంసిద్ధుడు కావటం ఇందులో కథ.  

అనంతశర్మ రామప్ప కు బోధించింది అద్వైతం. హరిహరాభేదం. శైవ వైష్ణవాలను సమన్వయించుకొని దేవాలయ నిర్మాణానికి పూనుకోగలగటం అందువల్ల సాధ్యమైంది. శివుని ఆలయంలో క్షీరసాగర మథనం వంటి దృశ్యాల  శిల్పీకరణను సమర్ధించటానికి ఈ కల్పన పనికి వచ్చింది. శిల్పం ఒక కళ. సౌందర్య దృష్టి దానికి అతి ప్రధానం. రామప్ప దేవాలయంలో శిల్ప సౌందర్యానికి కారణ భూత సంస్కారాన్ని ఒక దానిని కల్పించటానికి రామప్పకు అనంతశర్మ ఒకానొక లోకోత్తరమైన మహా సౌందర్యవతి అయిన స్త్రీమూర్తిని ప్రేమించటం అవసరమని చెప్తాడు. అయితే అది ఆ స్త్రీ ని వదిలిపెట్టి ఒక నిరవధికమైన సౌందర్య భావనగా అభివృద్ధి చెందేట్లు సాధన చెయ్యాలని షరతు పెడతాడు. ఆ సాధనలో, సంఘర్షణలో రాటుదేలిన సౌందర్య భావన రామప్ప శిల్పాలలోకి ప్రవహించినట్లు కథ నడుపబడింది. ఆసౌందర్యానికి ఆలవాలమైన స్త్రీ మూర్తి రుద్రమ దేవి కావటం, ఆమె పట్టాభిషేకం అన్నీనవల ఇతివృత్త నిర్మాణంలో భాగమయ్యాయి. తాను బ్రాహ్మడై ఉండి శూద్ర స్త్రీపై మనసు లగ్నంకావటం లోని అధార్మికతను గురించిన అతని చింతన బ్రాహ్మడై ఉండి శిల్పవిద్యలోకి వచ్చిన తనపూర్వీకుల దోషగుణ ఫలితమే అన్నతవరకు సాగి తుదకు సన్యసించతమ్ వరకు అతనిని నడిపింది. ఇక్కడ కూడా  సంప్రదాయ వర్ణధర్మం పట్ల రచయిత్రి అభినివేశమే కనబడుతుంది. 

ములుగు అడవులను, రామప్ప శిల్ప విశేషాలను వర్ణించటంలో రచయిత్రి ప్రతిభ కనబడుతుంది. దేశీయ చారిత్రక శిల్ప సంపద, మతం, జీవన సంస్కృతి ఈ నవలను జాతీయ భావ సంపూర్ణం చేశాయి. ఈ నవల అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎ. ఎల్. నారాయణ గారికి అంకితం చేయబడింది. 

యుగసంధి 11 వ శతాబ్దిలో ఆంధ్రదేశాన్ని పాలించిన చాళుక్యరాజుల చరిత్ర కు సంబంధించినది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే  రాజరాజనరేంద్రుని కాలం నాటిది. ఆయన భార్య అమ్మంగీదేవి భాగవత బ్రాహ్మణ భక్తి ప్రపత్తులతో పాటు రాజ్య రక్షణకు అవసరమైన శక్తియుక్తులను కేంద్రంగా చేసి ఆ నాటి స్త్రీశక్తి సామర్ధ్యాలను నిరూపించే ఇతివృత్తం తో సాగుతుంది ఈ నవల.  మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కూడా ఇందులో ఒక ప్రధాన పాత్ర. నారాయణ భట్టుతో ఆయన స్నేహం, పెంచుకున్న కూతురు గౌతమి భారత రచనలో ఆమె పాత్ర కూడా ఇతివృత్త నిర్మాణంలో భాగంగా ఇమిడిపోయాయి. నన్నయభట్టు మరణంతో ఈ నవలలో కథ ముగుస్తుంది. ఈ నవలను వసుంధర తనతల్లి మల్లాది అలివేలు మంగమ్మ పవిత్రాత్మకు అంకితం ఇచ్చింది.  

నరమేధము నవల 1979-80 విద్యాసంవత్సరంలో ఇంటెర్మీడియట్ విద్యార్థులకు ఉపవాచకంగా నిర్ణయించబడింది. ఇది 5,6 శతాబ్దాలలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన రాజుల చరిత్ర ఆధారంగా రచించబడింది. విష్ణుకుండినులలో నరమేధం చేసిన రెండవ మాధవవర్మ క్రీస్తు శకం 456 నుండి 503 వరకు పాలించాడు. ఈ నవలకు నాయకుడైన మాధవవర్మ చంద్రగుప్త చక్రవర్తి కూతురు చంద్రావతిని తన శౌర్య పరాక్రమాలు ఉంకువ పెట్టి పెళ్లి చేసుకున్న నాలుగవ మాధవవర్మ. 573నుండి 623 వరకు పరిపాలించినవాడు. రచయిత్రి రెండవవర్మ చేసిన నరమేధమును ఈ నాలుగవ మాధవ వర్మ చేసినట్లుగా కథను నడిపింది. యజ్ఞయాగాదులైనా, పరస్పర విజిగీషా కాంక్షతో చేసే యుద్ధాలలో నైనా జరిగేది నరమేధమే. ఆ నరమేధం లో మానవ సంబంధాలు అన్నీ ఆహుతి అయ్యేవే. అయినా యజ్ఞం వైదిక ధర్మమని స్థాపించి సమర్ధించటం ఇందులో చూస్తాం. రాజ్యం కోసం, అధికారం కోసం అన్నదమ్ముల మధ్య, రాజ కుటుంబాలలో జరిగే కుట్రల పై విమర్శనాత్మక చర్చ పెడుతూనే ఆ క్రమంలో అంతఃకరణ సంఘర్షణలకు లోనయ్యే మనుషుల ఉద్విగ్నతలు, ఉద్రేకాలు, ద్వైదీభావాలు  ఈ నవలలో చిత్రించబడ్డాయి.    

పాటలి నవల శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవితం ఇతివృత్తంగా గల నవల. శాతవాహన సంచిక మొదలైన గ్రంధాలు చదివి అప్పటి సాంఘిక రాజకీయ పరిస్థితులు, గ్రామీణజీవితం, భాషావిశేషాలు తెలుసుకొని ఈ నవల వ్రాశానంటుంది వసుంధర. ఆ నాటి గ్రామీణజీవితం గురించి తెలుసుకొనటానికి గాధాసప్తశతిని మించిన గ్రంధం లేదు. పాటలి నవలలో ప్రతి అధ్యాయానికి ముందు గాధాసప్తశతి లోని ఒక శ్లోకం తాత్పర్యమూ ఇచ్చి కథను నడపటం ఈ నవలలోని ప్రత్యేకత. ఈ నవల  నాయికా నాయకులు మరణించి ప్రతినాయకుడు మిగలడంతో ముగుస్తుంది. ఇది రసహీనత అని తెలిసి కూడా అలా వ్రాయటానికి కారణం కావ్యమునందు రసమునకున్నంత ప్రాధాన్యము నవలలో అక్కరలేదు అన్న అభిప్రాయం వల్లనే అంటుంది వసుంధర. కథానాయిక పాటలి ని మహాప్రతిభావంతురాలిగా తీర్చి దిద్దిన రచయిత్రి స్త్రీగా తాను అటువంటి స్త్రీ ని సృష్టిచేయటం మానవ సహజ లక్షణం అని సమర్ధించుకొన్నది.

దూరపు కొండలు, త్రివర్ణపతాక వంటి సాంఘిక నవలలు వ్రాసినప్పటికీ వసుంధరాదేవి కి  చారిత్రక నవలారచయిత్రిగానే గుర్తింపు ఎక్కువ. ఆమె వ్రాసిన త్రివర్ణపతాక నవల సాంఘిక సంస్కరణ వస్తువుగా రావటం విశేషం. బ్రాహ్మణ యువతులలో ఒకరు ముస్లిం ను, ఒకరు హరిజనుడిని పెళ్లాడటం, వారి జీవితంలో ఎదురైన సంఘర్షణలు, సంఘటనలు వస్తువుగా వచ్చిన నవల ఇది. వాళ్ళు జీవితాన్ని ఎదుర్కొని నిలిచిన రీతి మరొక ఇద్దరు యువతుల కుల మతాంతర వివాహాలకు ప్రోద్బలమైనట్లు కథను నడిపింది  రచయిత్రి. హిందూ మతంలోని కులాలమధ్య ఉన్న విభేదాలను తగ్గించటంవల్లనే జాతీయ సమైక్యత సాధించవచ్చని జాతీయవాదులు ప్రయత్నిస్తున్న విషయం ప్రస్తావన ను బట్టి ఈ నవలలో కథ జాతీయోద్యమ నేపధ్యం నుండి అభివృద్ధి చేయబడినదని భావించవచ్చు.( తెలుగునవల , అస్పృశ్యతా సమస్య – ననుమాస స్వామి, 1990,పుట,154-160 ) 

ఏమైనప్పటికీ వసుంధర నవలలో ఆధునిక స్త్రీ స్వతంత్ర స్వరం, సాధికార ప్రవృత్తి వినబడుతుంది, కనబడుతుంది. 

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.