యాత్రాగీతం(మెక్సికో)-9

కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3

-డా||కె.గీత

భాగం-11

 

 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరం. ఇది తులుమ్ నగరానికి పూర్తిగా విభిన్నమైనది. 

క్రీ.శ 600 నుండి క్రీ.శ 900 మధ్యలోతులుమ్ నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ మాయా సంస్కృతికి చెందిన గొప్ప నగరం ఇది.

ఒకప్పుడు వంద మైళ్ల విస్తీర్ణంలో  విలసిల్లిన ఈ నగరంలో దాదాపు యాభై వేల మంది నివసించేవారట.

ఇప్పటికీ ఇదే పేరుతో దగ్గర్లో ఉన్ననగరంలో కేవలం పదమూడు వందల మంది మాత్రమే నివసిస్తున్నారు.

స్పానిషు దురాక్రమణల వల్ల కనుమరుగై పోయిన సంస్కృతిలో మిగిలిన శిథిలాలు మూగ సాక్ష్యాలుగా ఇక్కడ దర్శనమిస్తాయి.

కోబా నగరం కోబా సరస్సు ( Lake Coba) , మెకానోక్ సరస్సు (Lake Macanxoc) ల మధ్య ఉన్న సారవంతమైన భూభాగంలో నిర్మితమైంది.

ఈ యూకతాన్  ద్వీపకల్పంలో  ప్రతీ చోటా కనబడే సున్నపురాతితోనే ఇక్కడ కూడా ఇళ్లతో మొదలుకుని అతిపెద్ద దేవాలయాల వరకు నిర్మించబడ్డాయి.

ఈ శిథిల నగరాన్ని  పరిరక్షించడం కోసం ఇప్పుడు ఈ ప్రాంతాన్నంతా రక్షిత ప్రాచీన సంస్కృతీ కేంద్రంగా గుర్తించారు. 

టూరిస్టుబస్సులు, వాహనాలు దాదాపు  రెండు, మూడు మైళ్ల అవతలే ఆపి, శిథిల నగరం మొత్తం కాలినడకన కానీ అద్దెకు తీసుకున్న సైకిళ్ల మీద గానీ తిరగాల్సిందే. బహుకొద్ది సంఖ్యలో రిక్షాలు ఉన్నాయి. 

సైకిళ్లకు లాగానే రిక్షాకు కూడా టిక్కెట్టు తీసుకోవడమే. ఒక సైకిలుకి 60 పేసోలు, రిక్షాకు 100 పేసోలు అద్దె. అంటే అమెరికన్ డాలర్లలో దాదాపు 3 డాలర్లు, 5 డాలర్లన్న మాట. అందులో పార్కు నిర్వాహకులకు కొంత, రిక్షాల ఓనర్లకు కొంత భాగం పోగా, రిక్షాలు తొక్కే సామాన్యులకు మిగిలేది అతి కొద్ది భాగం మాత్రమే. 

అదృష్టం కొద్దీ మేం అడుగుపెట్టిన సమయానికి ఒకేఒక్క రిక్షా ఉందక్కడ. నేను బేరం కూడా ఆడకుండా సిరిని తీసుకుని వెళ్లి, ఎక్కి కూచున్నాను. 

సత్య, వరు చెరో సైకిలు అద్దెకు తీసుకున్నారు.  

ఇక్కడి  రిక్షాలో మనుషులు కూచునే సీటు వీపు వెనక వైపు తొక్కే మనిషి ఉండడంతో ముందుకు ఎక్కడ పడతామో అనిపిస్తూ  ఉంటుంది. 

సిరి ముందు కూచోనని పేచీ పెట్టినా రెండు నిమిషాల్లో “హుర్రే” అని సరదాగా చుట్టూ చూడసాగింది. 

కొద్దో గొప్పో ఇంగ్లీషు, స్పానిషు కలిపి మాట్లాడుతున్న రిక్షా అబ్బాయి మాయా సంతతికి చెందిన వాడినని చెప్పటంతో నేను అతనితో ఉత్సాహంగా కబుర్లలో పడ్డాను. 

అట్టే ఎత్తులేని పొట్టి సరుగుడు చెట్ల లాంటి చెట్లు, బాట కిరుపక్కల దట్టంగా అల్లుకున్న తీగలతో పెద్ద పెద్ద ఆకుల మొక్కల మధ్య సన్నని మట్టి దారిలో దాదాపు అరగంట పాటు ప్రయాణంలో ముఖ్యమైన కట్టడాల దగ్గిర దిగుతూ, మళ్లీ ఎక్కుతూ ప్రధాన కట్టడమైన లొమాహా (Ixmoja) దేవాలయానికి చేరుకునేలోగా దారిలో ఆకులతో బూరలు తయారుచేసే మొక్క నుంచి, గాయాలకు ఔషధంగా ఉపయోగించే మొక్క వరకు అనేక విశేషాలు చెప్పేడతను. బహుశా: పాతికేళ్ళు ఉంటాయేమో. అక్కడ ఉన్న స్థానికులందరిలాగానే అతనికి కూడా టూరిజమే ప్రధాన జీవనోపాధి. అతని తాత ముత్తాతలందరూ చిన్న చిన్న కమతాల మొక్కజొన్నపంటలతోను, అటవీ సంపదతోనూ జీవనాన్ని సాగించేవారని, నాగరిక ప్రపంచానికి దూరంగా అతని పూర్వీకులు నివసించిన చోటే ఇలా జీవించడంలో ఎంతో ఆనందం ఉందనీ చెప్తున్న ఆ యువకుణ్ణి అభినందించాల్సిందే. ఇతనిలా ఎందరు ఆలోచిస్తున్నారు అనిపించింది.

రిక్షాని కావలసిన చోటల్లా ఆపుతూ, నేను అటూ ఇటూ చూడడానికి వెళ్లినపుడల్లా సిరిని కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్న అతనికి దిగేటప్పుడు 20 డాలర్లు ఇచ్చేను.

అతని ఆనందానికి అవధులు లేవు. వారమంతా పనిచేసినా ఇంత రాదని అతను ఎంతో సంతోషించేడు.

మాతో వెనకే వస్తున్న సత్య, వరు మాతోబాటూ ఆగుతూ వచ్చేరు.

దారంతా సిరి “డాడీ! కమాన్, క్విక్…”  అంటూ వెనక్కి చూస్తూ హుషారుగా నవ్వుతూ అరుస్తూనే ఉంది.

దారిలో చిన్నవీ, పెద్దవీ ఎత్తున నలుచదరంగా  కట్టిన అనేక కట్టడాలున్నాయి.

కొన్ని సమావేశస్థలాలు, కొన్ని దేవాలయాలు, కొన్ని సామూహిక నివాసస్థలాలు.

చిట్ట చివరిదైన లొమాహా దేవాలయానికి చేరుకునే సరికి ఆశ్చర్యంతో మతిపోయింది. ఆ కట్టడం ఇప్పటివరకు చూసిన అన్ని కట్టడాల కంటే, చిచెన్ ఇట్జా కంటే అత్యంత ఎత్తైనది. అంత గొప్ప ఎత్తైన కట్టడాన్ని  ఇటీవల ఎక్కడా చూసినట్టు జ్ఞాపకం లేదు. 

నలుచదరాకారంలో రాళ్ళు పేర్చుకుంటూ వెళ్లి పోయారు. క్రింద అతిపెద్ద చదరం నుంచి పైకి వెళ్ళే కొలదీ చిన్న చదరంగా ఆకాశంలోకి విస్తరించిన ఆ కట్టడాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేను.

అన్ని ఇతర చోట్లలా కాకుండా దీనిమీదికి అధిరోహించనివ్వడం విశేషం. అయితే మోకాలి పర్వతంలా ఒక్కో మెట్టుకి, మెట్టుకీ మధ్య ఎత్తు చాలా ఉండడంతోను, మధ్య మధ్య విరిగిపోయిన రాతి ముక్కలతో జారుతూ ఉండడం వల్ల పై నుంచి కింద వరకూ వేళ్ళాడుతున్న తాళ్ల సహాయంతో పైకి ఎక్కాలి.

సత్య, వరు చకచకా ఎక్కేసినా,  సిరితో కష్టమని నేను పదో మెట్టు లోనే ఆగిపోయేను.

అంత ఎత్తులో కట్టిన ఆ దేవాలయానికి అర్థం ఏవిటో పైకెక్కి తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంగా అనిపించినా, రాళ్ల మధ్య మెట్ల మీద దెబ్బలు తగిలించుకుంటూ కిందికి వస్తున్న తోటి సందర్శకులని చూసి విరమించుకున్నాను.

దాదాపు వంద మంది ఔత్సాహికులు పైకెక్క సాగేరు.

కిందన కబుర్లు చెప్పుకుంటున్న పది మంది రిక్షాల వాళ్లు, మా లాగే ఎక్కలేని ఐదారుగురు తప్ప ఎవరూ లేరు.

మంచి ఎండ సమయంలో ఆ కట్టడం పైకెక్కి కిందకి దిగడానికి గంట పైనే పడుతూ ఉంది.

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.