ఉనికి మాట -1

కొండ అద్దమందు

– చంద్రలత

(విక్టర్ హ్యూగో “లే మిజరబుల్స్” తెలుగుసేతకు ముందుమాట)

ఇంతకీ, ఏ నవలయినా ఏం చెబుతుంది? ఏదో ఒక కథ చెబుతుంది. మరి,గొప్పనవల ఏదో ఒక గొప్పకథ చెప్పేసి ఊరుకోదు.ఎప్పటి కథ చెప్పినా,ఎక్కడి కథ చెప్పినా,ఎవరి కథ చెప్పినా, ఆ నవల మన కథే చెబుతుంది!

అసలు అందుకేగా ఆ నవల గొప్ప నవల అయ్యిందీ! స్థల,కాలాల అవధులు దాటి పదికాలాలు పదిలంగా నిలిచిందీ!

ఇదుగోండి, ఈ లే మిజరబుల్స్” నవల అలాంటి ఒక సజీవ ఉదాహరణ! 

ఒక సాహితీ ప్రక్రియగా, నవల పురుడుపోసుకొన్నది,ఆధునిక రూపురేఖలతోనే. ఆయా సాహితీసాంప్రదాయాలలో వేళ్ళూనుకు పోయిన, సాహితీ ప్రక్రియలన్నిటినీ ఒక పక్క తోసిరాజంటూనే, మరో పక్క, ఆయా సాహితీ స్వరూప స్వభావాలన్నిటినీ  తనలో సమ్మిళితం చేసుకొన్నఅద్భుత చమత్కారం నవలది.

ఆధునిక నవలమూలాలు, నెగళ్ళ చుట్టూ చేరి,కథలల్లుకొన్న ఆదిమ సమాజాల దాకా వెళ్ళినా, ఈనాటి అక్షరబద్ద పాశ్చాత్య నవలారూప మూలాలు, బొకాషియో ఇటాలియన్ రచన,  డెకా మెరాన్ (1348-53),   లో కనబడతాయి.ఇన్నేళ్ళ నవల ప్రస్థానంలో,ఆచి తూచి అరడజను నవలల పేర్లు చెప్పమంటే, వాటిలో, విక్టర్ హ్యూగో  ఫ్రెంచ్ నవల , లే మిజరబుల్స్ (1862) ఖచ్చితంగా ఉంటుంది.నవలాచరిత్రలోనే అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ నవల, ఒక చారిత్రక నవల!   

అయితే, ఇది ఎవరి చరిత్ర చెపుతుంది? సామ్రాజ్య స్థాపనలదా? అజేయ చక్రవర్తులదా? సంపన్న సంస్కృతులదా?     అవేవీ కాదు కానీ, వాటన్నిటితో ముడిపడిన మన చరిత్ర చెపుతుంది.కడుబీద జీవితాల గురించి, అతిసామాన్య జీవనపోరాటాల గురించి, సామాన్యుల అగచాట్ల గురించి,పేదల పాట్ల గురించీ,అట్టడుగు బతుకుల కడగండ్ల గురించి,  ఆ బాధామయ సుడిగుండాల్లో, ఉవ్వెత్తున లేచిన ఉత్తేజ కెరటాల గురించి,ఊపిరిపోసుకొన్న స్వేచ్ఛాస్వతంత్ర భావనల గురించి, చెబుతూ చెబుతూ…విక్టర్ హ్యూగో అన్నట్లుగా,”బానిసత్వానికి ఆశ్రయమిచ్చే గణతంత్రాలను, దాసానుదాసులను సృష్టించే సామ్రాజ్యాలను” ఎండకడుతుంది. 

లే మిజరబుల్స్ ఒక బృహత్నవల.ఫ్రెంచ్ మూలప్రతి అయిదు సంపుటలాలో, 48 సంచికలలో,365అధ్యాయాలలో 655,478 పదాలతో,వ్రాయబడిన సుధీర్ఘనవల. కథన నిర్మాణ దృష్ట్యా, పటిష్టంగా అల్లిన కథనం కాదనే చెప్పాలి. కథ నడకను ముందుకు సాగనివ్వని అనేక అడ్డంకులు, ఇందులో ఉన్నాయి.కథ ఎక్కడిక్కడ చతికిలబడుతుంది. 2783 పేజీలలో సుమారు 955 పేజీలు ,నైతిక విలువల గురించిన చర్చ, వివరణలతో నిండి ఉంటాయి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అన్న ఆధ్యాత్మక భావనలతో కూడిన నైతిక విలువల పరంపర అది. వాటర్ లూ యుద్ధవిశేషాల నుంచి, ప్యారిస్ మురుగుకాల్వల నిర్మాణాల వరకు అనేకానేక వివరాలు – ఇందులో హ్యూగో  వివరంగా పొందుపరిచారు.

ఊరక వ్రాయరు మహానుభావులు అన్నట్లుగా, కథనపరంగా అనవసరం అనిపించే , ఈ వివరాలన్నీ, ఆయా పాత్రల ప్రవర్తనలను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.  ఉదాహరణకు థెనార్డియార్ కుటుంబ యొక్క స్వార్థపూరిత నీచత్వం. ఒక అభాగ్య స్త్రీ పట్లా , పసిబిడ్డ పట్లా వారు క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన తీరు, అందుకు గల సామాజిక నేపథ్యం ,   భవిష్యత్తులో అమెరికాలో బానిసవ్యాపారం చేయబోయే వ్యక్తుల పతనమైన నైతిక నేపథ్యం అర్థం అవుతుంది. ఇలాంటి అనేకానేక విషయాల వివరణ మనకు నవలలోనే లభిస్తుంది. అందుచేతనే, అనివార్యంగా ఈ బృహత్నవల బలహీనతలే బలంగా, పాఠకులు స్వీకరించాల్సి వస్తుంది.  

స్థూలంగాను, సూక్ష్మంగాను, సున్నితంగాను, ఛెళ్ళుమనిపించేలాగాను,ఎలా చెప్పినా, ఈ నవల చెప్పేది ఒకటే. చుట్టూ జరుగుతోన్న పరిణామాలలో తమ బాధ్యతను గుర్తించి, తదనుగుణంగా పరిష్కారాల మార్గాలను అన్వేషించేదిశగా దారితీయమని.

ఈ నవల ప్రధానంగా, ఒకరితో ఒకరు ముడిపడిన ముగ్గురి జీవితాలు.

జీన్ వాల్ జీన్ , ఫాంటైన్, జావెర్ట్.

వాల్ జీన్ ఒక పాతఖైదీ.అక్కబిడ్డల ఆకలి తీర్చడం కోసం, ఒక బ్రెడ్ రొట్టెను దొంగలించిన నేరానికి పంతొమ్మిదిఏళ్ళు జైల్లో మగ్గి వస్తాడు.పాతఖైదీ అంటూ ముద్రవేసిన, పసుప్పచ్చ పాస్ పోర్ట్- అతని తదనంతర జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.కొసెట్టో కు తాతయ్య, పెంపుడు తండ్రి.

ఫాంటైన్,అందమైన అమాయకపు పల్లెపడుచు. నిరక్షరాస్యురాలు. తొలియవ్వనపు ఆకర్షణ, తన తండ్రి వయస్సున్న పట్టణ వ్యక్తి మెరమెరల ఉచ్చులో, అవివాహితగానే తల్లి అవుతుంది. ఆమె బిడ్డ కొసెట్టో పెంపకం కోసం, ఆ కొద్దిపాటి జీవితమూ,పరితపిస్తుంది. ఏ బిడ్డకోసం తపిస్తుందో ,ఆ బిడ్డను కళ్ళారా చూడ కుండానే,అర్థాంతరంగా ఫాంటైన్ కన్నుమూస్తుంది.

 జావెర్ట్ తండ్రి ఒక ఖైదీ.తల్లి భవిష్యత్తు చెప్పే వ్యక్తి.జావెర్ట్  జైల్లోనే పుట్టి,పెరుగుతాడు.ఆ జైల్లోనే కాపాలాఉద్యోగిగా పారంభించి, పోలీసు అధికారిగా పరిణమిస్తాడు.చట్టాన్నితు. చ. తప్పక అమలుచేయాన్న అతని ప్రయత్నాలు, మొండివైఖరిలా పరిణమిస్తాయి.చివరికి,ఆ చట్టాలలోని,బోలుతనం,అమానవీయత అర్థమైనక్షణాన,సియాన్నే నదిలో  దూకి, బలవన్మరణం పొందుతాడు.

 ఫాంటైన్ అవివాహిత తల్లితనానికి ఆదరణలేని సమాజంలో,బిడ్డను అపరిచితుల సంరక్షణలో వదులుతుంది.బిడ్డను అడ్డంగా పెట్టుకొని, వారి దురాశకు బలి పశువవుతుంది.అనామకంగా బతుకుతూ, గాజుపూసల ఫ్యాక్టరీలో,చిన్నపాటి కార్మీకురాలిగా మారుతుంది.బిడ్డ సంగతి బయట బడగానే, ఉద్యోగం కోల్పోతుంది.తన నిడుపాటి  జుట్టును, చక్కటిపలువరసలోని ముందు పళ్ళను,ఆ పై, తన శరీరాన్నే అమ్ముకోవలసివస్తుంది.జబ్బుల బారిన పడి, మరణిస్తూ, ,ఆ పట్టణ మేయర్, పెద్దమనిషి అయిన,ఆ గాజుపూసల ఫ్యాక్టరీ యజమాని మాడెలీన్ ను , తన దుర్భర పరిస్థితికి మూలకారణంగా నిందిస్తుంది.అతనే,అజ్ఞాతంగా జీవిస్తున్న,వాల్ జీన్.

తన ప్రమేయం లేకుండా తమ సంస్థలో జరిగిన ఈ ఘోర తప్పిదం,దాని పర్యవసానాలు వాల్ జీన్ ని కుదిపివేస్తాయి. జరిగిన తప్పును సరిదిద్దుకొనే క్రమంలో,తల్లీ బిడ్డలను ఒకచోటికి చేర్చి,వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని అతను తాపత్రయపడతాడు. 

ఆ పట్టణంలోని అందరి ఆదరాభిమానలకు గౌరవమర్యాదలకు పాత్రుడైన వాల్ జీన్, గత జీవితపు నీడలా వెన్నాడుతాడు జావెర్ట్. వాల్ జీన్ ప్రయత్నాలన్నిటినీ అడ్డుపడుతూ ఉంటాడు. అడుగడుగునా. వాల్ జీన్ ప్రస్తుత ఉదాత్త జీవితం నుంచి దూరంగా నెట్టివేసి, ఒక పాత ఖైదీ గా నిరూపించి,వాల్ జీన్ ను తిరిగి జైలు పాలు చేయడమే జావెర్ట్ లక్ష్యం అవుతుంది. 

 వీరిద్దరి దోబూచులాటలో, ఆనాటి ప్యారిస్ నగరపు మురికివాడల్లోని మంచీ చెడు వాల్ జీన్ తో పాటు, పాఠకుల కళ్ళకు కడతాయి. సర్వత్రా వ్యాపించిన ద్వేషాన్ని,మోసాన్ని,వంచనను,కుట్రని తోసిరాజంటూ, వికసించే ప్రేమను,విశ్వాసాన్ని వాల్ జీన్ తో పాటు మనమూ చూస్తాం. కరడుకట్టిన నేరస్తులనుంచి, సేచ్చా,సమతా, సౌభ్రాతృత్వ్వాలను ఊపిరిగా చేసుకొన్న ఉద్యమకారులను మనం చూస్తాం. “జూన్ తిరుగుబాటు”కు దారితీసిన దుర్భర పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా విస్పోటమవుతాయి. యువ ప్యారిస్ నవశకానికి శంఖాన్ని పూరిస్తుంది.

 నిజమే కానీ, ఇదేదో ఫ్రాన్స్ దేశ చరిత్ర. అన్ని దేశాల చరిత్రల్లో లాగానే, ఇది కూడా,అణిచివేత- తిరుగుబాటుల కథ. మనకేమిటి సంబంధం? 

 ప్రపంచీకరణ అన్నమాట , ఈ మధ్య కాలంలో  పుట్టవచ్చు. కానీ, ప్రపంచీకరణ లేనిదెన్నడు? 

ప్రపంచాధిపత్యపు కల ఎంత పురాతనమైనదో, ప్రపంచీకరణ అంతే పురాతనమైనది. అర్థాంతరంగా ముగిసిన అలెగ్జాండర్ ప్రపంచాధిపత్య కల మనకు తెలియంది కాదు.  యూరోప్ లోని ఆర్ధిక అవసరాలు, అంతర్గత ఆధిపత్య పోరు, ప్రచ్ఛన్నయుద్ధాలు, ప్రపంచాన్ని ఏనాడో  ఒక రణరంగాన్ని చేసాయి.ఎక్కడెక్కడికి వారి నావలు చేరాయో,వారికన్నముందే,వారి వైరి బేధాలు, వైషమ్యాలు అక్కడికి చేరాయి. చిరకాల శత్రువుల యుద్ధభేరీలు ఖండఖండాన మోగాయి. ప్రత్యక్షంగా.పరోక్షంగా.అది, వ్యాపారమైనా.వ్యవహారమైనా. నేలమీదైనా,నీటి మీదయినా.

 స్థానికుల నడుమనున్న శతృత్వాలను అడ్డంపెట్టుకొని, వారి అసంతృప్తులకు ఆజ్యం పోస్తూ, ఆగ్రహాలను రెచ్చగెడుతూ తమ వ్యాపారాలతో పాటు వ్యవహారాలనూ చక్కబెట్టుకొంటూ వచ్చాయి.  

 కర్ణాటక యుద్ధాలలో ఫ్రెంచ్ ఓటమికి కారణమైన ఆంగ్లేయులకు,దక్కను నైజాము సర్కారుజిల్లాలు ఇనాముగా ఇచ్చాడు.ఈనాటి తెలుగు వారి జీవితాలు అక్కడే లిఖించబడ్డాయి.విభజించి పాలించబడ్డాయి. ఇది, మన చరిత్ర.

 ఈ నవల మూలాలు సరిగ్గా, మన నేలపై,ఆనాటి ఫ్రెంచ్ ఓటమిలో వేళ్ళూనికొని ఉన్నాయి.ఆంగ్లేయులకు అటు వ్యాపారంలోను, ఇటు వ్యవహారంలోనూ సమ ఉజ్జీ అయిన ఫ్రెంచ్ వారు,యుద్ధాల చివరిదశలోకి వచ్చే సరికి,సైనికుల పోషణభారం భరించలేని స్థితిలో పడ్డారు.సరిగ్గా,ఇలాంటి, ప్రత్యక్ష,పరోక్ష యుధ్ధాలఓటమి, ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. ప్రధాన వ్యాపారకేంద్రమైన భారతదేశాన్ని ఫ్రాన్స్ కోల్పోయింది.ఆ తరువాత, కెనడా ఆంగ్లేయులపరమైంది. ఈ నేపథ్యంలో, స్వతంత్ర పోరాటం చేస్తోన్న అమెరికాకు ఫ్రాన్స్ వెన్నుదన్నై నిలపడమే కాక, ఆర్ధికబలమై నిలిచింది. అమెరికా స్వతంత్రురాలయ్యింది. ఫ్రాన్స్ ను తోసిరాజన్నది. 

 అమెరికా బ్రిటన్ ఆర్థిక భాండాగారం.దానిని దెబ్బతీయాలన్న రాజకీయ కారణం ఒకవైపు. ప్రకృతివనరుల సమృద్ధి, విస్తృత వ్యాపార అవకాశాలు అమెరికాలో ఉన్న కారణం మరోవైపు. స్వతంత్రఅమెరికా వైఖరి ఫ్రాన్స్ ను రెండిందాలా దెబ్బ కొట్టింది.  దానితో, సుసంపన్న అమెరికా దేశాన వ్యాపార అవకాశాలను కోల్పోడంతో పాటు, ఫ్రాన్స్ పీకలోతు అప్పుల్లో పడిపోయింది.ఫ్రాన్స్ ఆర్ధికవ్యవస్థ అతలాకుతలం అయిపోయింది.వీటీకి తోడు, .ఫ్రాన్స్ వ్యవసాయం దెబ్బతింది.కరువు కాటేసింది.పై నుoచి, విజృభించిన కలరా అంటువ్యాధి  ఫ్రాన్స్ ను ఛిన్నాభిన్నం చేసింది.మానవవిలువలు అడుగంటాయి. ప్రపంచ వ్యాప్తంగా, ఫ్రెంచ్ వారు చేసిన యుద్ధాలభారాలు, విఫలవ్యాపారాల సంక్షోభాలు, సామాన్య ఫ్రెంచ్ ప్రజానీకం భుజస్కందాలపై పడ్డాయి. ఈ అనిశ్చత, అభద్రత, అశాంతి లోనుంచి, “జూన్ తిరుగుబాటు”,మొలకెత్తింది. 

ఈ నవల స్థూలంగా , ‘వాటర్ లూ(1815)’ యుద్ధ కాలం నుంచి ‘జూన్ పోరాటం /ప్యారిస్ తిరుగు బాటు (1832)’ వరకూ విస్తరిస్తుంది. విఫలమైన నెపోలియన్ కల ‘అఖండ ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపన’ లోని శకలాలు, ఈ నవలలోని జీవితాలను ప్రభావితం చేసాయి. 

 సరిగ్గా, ఆనాటి లండన్, ప్యారిస్ నగరాల నేపథ్యంగా , చారిత్రక రచన చేసిన ఛార్లెస్ డికెన్స్ నవల”రెండు మహానగరాల కథ (1859)” లోని  సుప్రసిధ్ద ప్రారంభవాక్యాలు గుర్తుకు రాకమానవు. “అవి కాలాలలోకెల్లా అద్భుతమైన కాలాలు. అవి కాలాలలోకెల్లా నికృష్టమైన కాలాలు.” అని.

అన్నిందాల కుదేలయిన ఆనాటి ఫ్రెంచ్ సమాజంలో, సామాన్యులు ఎలా జీవించారు? మేథోమధనం ఎలా సాగింది?నవతరం పంథా ఏమిటి? మధ్యేవాదులు ఎలా ఆలోచించారు? మానవవిలువలు ఎలా చిగురులెత్తాయి? ఇలాంటి అనేక సందేహాల అన్వేషణే ఈ లే మిజరబుల్స్ నవల.

పల్లెటూరి పై బెంగటిల్లుతూ,పట్టణవాసానికి,బడి వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నాలలో, మూడవ తరగతి చదువుతున్న రోజులవి. పాలమూరులోని, భారతీయ విద్యానికేతన్ బడి స్థాపకురాలు, శ్రీమతి దుర్గాభవానీ భక్తవత్సలం గారు. దుర్గాభవానీ గారు ప్రతి శనివారం పిల్లలందరినీ తన చుట్టూ కూర్చుండ బెట్టుకొని, కథలు చెప్పేవారు. 

వారు చెప్పిన కథల్లో, ఆకొన్నప్పుడు ఆతిథ్యం  ఇచ్చిన ఫాదర్ ఇంటి వాసాలు లెక్క పెట్టిన దొంగ కథ, నాకు స్పష్టం గా గుర్తుంది. కారుణ్యభావనకు,ఉదాత్తతకు ప్రతిరూపమైన బిషప్ గారు ఎంతగా గుర్తున్నారో, పరివర్తన చెందిన ఆ దొంగ అంతగానే గుర్తుండి పోయాడు. కారుణ్యభావన ఎంత గొప్పదో, పరివర్తన చెందగలిగిన వివేచన,వాటి పర్యవసానాలను ఎదురొడ్డి నిలబడగల గుండెనిబ్బరం అంతే ముఖ్యం కదా! క్షమ ఎంతటి ఉత్తమ భావనో, వివేచన అంతటి ఉత్తమ గుణం అన్నది తెలిసింది. కొవ్వొత్తులను చూడడమే నాకు కొత్త.దుర్గాభవాని గారు వెండి కొవ్వొత్తుల దిమ్మెల గురించి  ఎంత వివరంగా చెప్పారంటే, ఇప్పటికీ ఆ కథ తలుచుకొంటే,ఆ కొవ్వొత్తుల దిమ్మెల చెక్కుళ్ళు,వాటి నగిషీలు కళ్ళ ముందు బొమ్మ కడతాయి.  

 ఇది మరొక పంచతంత్ర కథ కాదనీ, ఆ తరువాత రెండు దశాబ్దాలకు  గానీ నాకు తెలియ లేదు. మొదటి సారి “లే మిజరబుల్స్” చదివినప్పుడు, దుర్గాభవాని గారి కంఠం ఆ వాక్యాలలో ధ్వనించింది.

‘ఇంతటి మహత్తర నవలలోని, ముఖ్య ఘట్టాన్నా, వారు చిన్న పిల్లలకు కథలా చెప్పారు!’ అని ఆశ్చర్యంతోనూ, ఆనందంతో నూ ఉక్కిరిబిక్కిరి అయ్యాను.పిల్లలకైనా చేరగలిగే విలువలతో రాయడంలో  నిబిడీకృతమై ఉంది, విక్టర్ హ్యూగో రచనా చమత్కృతి. మీరూ, ఆ సంఘటనను చదవవచ్చు.అనుభూతించవచ్చు. అదే, ఈ నవల ప్రారంభ అధ్యాయం.కీలకాధ్యాయం. 

 1862 లో నవల మూలప్రతి ఫ్రెంచ్ లో విడుదలయిన వెంటనే, ప్రధాన యూరోపియన్ భాషలన్నిటిలోకి అనువదించబడింది. అటూ ఫ్రెంచ్ ఆలోచనా వ్యవహారాలకే కాక, యూరోపియన్ పునరుజ్జీవ చేతనకు ఈ నవల ఒక ముఖ్య భూమిక పోషించింది. ఒక రొట్టెముక్క దొంగ, ఒక వంఛిత స్త్రీ, ఒక అనాథ బిడ్డ…ఆనాటి సమాజాన్ని సవాలుచేసారు.సరిదిద్దుకోవాల్సిన అనేక మౌలిక భావనలను ఎత్తి చూపారు.  

స్వేచ్ఛా,సమత,సౌభ్రాతృత్వాల సమాహారమైన ఫ్రెంఛ్ ఉత్తేజభరిత ఆలోచనలు ప్రపంచాన్నే ప్రభావితంచేయడం , ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు పునాది కావడం తెలిసిందే. ప్రపంచ చరిత్రలోని నిరంకుశ సామ్రాజ్య కాంక్షల నికృష్ట పర్యవసానాలను , అర్థం చేసుకోవాలంటే,ఆ జీవితాలన్నీ ప్యారిస్ మురికివాడల్లో కాక మరెక్కడ లభ్యమవుతాయి?

యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో , IHEU అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి 2005 లో ప్యారిస్ వెళ్ళినప్పుడు, సియాన్నే నది ఒడ్డున నడిచి వెళ్ళి, నార్త్ డాం కెథెడ్రాల్ లోని మార్మిక గూనివాణ్ణి పలకరించి,  పాంథియాన్ లో విశ్రమించిన విక్టర్ హ్యూగోను సందర్షించి, తనివి తీరా స్పూర్తిని నింపుకొన్నాను. సోర్ బాన్ యూనివర్సిటీ ఆవరణలో, నిండుగా, హూందాగా, ఎత్తైన పీఠం మీద, ధీర్ఘాలోచనలో మునిగిఉన్న హ్యూగోను కళ్ళారా చూసుకొన్నాను. 

ఎందుకంటే, పాలమూరులో నాకు పరిచయమయిన మొదటి మహత్తర నవల ,లే మిజరబుల్సే గా. హ్యూగో చేతిరాతలో జాలువారిన ఆణిముత్యాలన్నీ,అభూత కల్పన కాదనీ , సచేతనా అద్భుతమనీ – ఆ గంభీరమైన  హ్యూగో నొసటి ముడి చెప్పకనే చెప్పింది  హ్యూగో పక్కనే, ఆసీనుడై ఉన్నాడు , జీవ శాస్త్రజ్ఞుడు, లూయీ పాశ్చర్. అటు సృజన. ఇటు శాస్త్రీయత. హృద్యత, విజ్ఞత లకు సమగౌరవం ఇచ్చిన ఫ్రెంచ్ సంస్కృతికి ముచ్చట పడుతూ, వారిద్దరి వెలుగులో కాసేపు గడిపివచ్చాను. వారిసమక్షాన గడిపిన, ఉత్తేజాన్ని మూటగట్టుకొచ్చుకొన్నాను. ఆ అపురూపక్షణాలను మాటల్లో చెప్పతరమా?  

పట్టుమని పది వాక్యాలు చదవడానికి ఓపిక, తీరిక లేని మనతరం పాఠకులు, అంతటి బృహత్నవలను చదవ గలరా? అనిపిస్తుంది.నిజానికి, ఈ ప్రశ్న ఈ పుస్తకమంత పురాతనమైంది.    

“ఈ పుస్తకం అందరు చదువుతారో లేదో తెలియదు.కానీ, ఇది అందరి కోసం రాసిన పుస్తకం.” తన ఇటాలియన్ ప్రచురణకర్తకు సమధానమిస్తూ, స్వయాన విక్టర్ హ్యూగో,ఈ సందేహ నివృత్తి చేశాడు.”ఎక్కడెక్కడ పురుషులు అజ్ఞానంలో, నిరాశానిస్పృహల్లో మునిగిఉంటారో, ఎక్కడెక్కడ పిడికెడుమెతుకుల కోసం స్త్రీలు తమను తాము అమ్ముకోవలసి వస్తుందో, ఎక్కడెక్కడ పిల్లలు చదవడానికి పుస్తకం కరువవుతుందో ,వారికి వెచ్చని లోగిళ్ళు ఉండవో…ఆ ఇంటి తలుపులను ‘లే మిజరబుల్స్’ తడుతుంది. ‘తలుపులు తెరవండి. మీ కోసం నేనున్నాను.’ అని! “

 నిజమండి. సరిగ్గా, అలా తలుపు తట్టి మన ముంగిటికి వచ్చి నిల్చుంది, ఈ సంక్షిప్త నవల. మూల ప్రతిలోని సారాన్ని ఒడిసి పట్టి, పాఠకులకు అరటి పండులా ఒలిచిపెట్టిన , ఈ అనుసృజనను చదవడమేగా మనం చేయాల్సింది!

 కొండను అద్దంలో చూపించే ఈ ప్రయత్నం లోని విశేషం ఏమిటంటే, కథాప్రధానంగా సాగుతుంది. మాటవరసకి, మొదటి అధ్యాయంలో బిషప్ పరిచయానికి, వాల్ జీన్ కథాప్రవేశానికి మధ్య , మూల ప్రతిలో 16 అధ్యాయాల సుధీర్ఘ రచన ఉన్నది. ఈ అనుసృజన, పన్నెండు పేజీలలోనే కథలోకి సూటి గా సాగిపోతుంది.  ఈనాటి తెలుగు పాఠకులను, ముఖ్యంగా,పిల్లలు కూడా చదవగలిగేలా,కథనశైలి వేగంగా, సులువుగా సాగుతుంది.చకచకా.

 చారిత్రక రచనను పూర్తిగా చదవాలన్న పఠనాసక్తిని పాఠకులలో కలిగించడమే,ఈ సంక్షిప్త రచన ద్వారా, చెలంచర్ల భాస్కర రెడ్డి గారి ప్రయత్నం.ఏ ఒక్క పాఠకుడైనా,అందుకు స్పూర్తిపొందితే, వారి ఈ ప్రయత్నం, కృషి ఫలించినట్లే.

మాతృభాషా ఉద్యమ సారథిగా, చిరకాలంగా, పలుకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, డెబ్భై ఏళ్ళ పండువయస్సులో, ఈ అనుసృజనకు  పూనుకొన్న భాస్కర్ రెడ్డి గారు, అదే స్పూర్తితో మరెన్నో మంచి రచనలను, ఈ తరం పాఠకుల కొరకై ఇంకెన్నో అనుసృజనలు చేయాలని కోరుకొంటున్నాను. 

మళ్ళీ మా బడిలో కథలు వినిన కాలాలలోనికి, ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళినందుకు, ఆ బృహత్నవల వాకిట్లోంచి, మరొకసారి చరిత్రలోకి తొంగిచూసే సందర్భాన్ని కలిగించినందుకు,చెలంచర్ల భాస్కర్ రెడ్డి గారికి  ధన్యవాదాలు. జేజేలు.

 అలనాడు ఈ కథ చెప్పిన శ్రీమతి దుర్గాభవాని భక్తవత్సలం గారికి వందనాలు.ఆత్మీయంగా.గౌరవంగా. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.