రమణీయం

విపశ్యన -2

-సి.రమణ 

నా స్నేహితురాలు నుండి వెబ్ సైట్ అడ్రస్ తీసుకుని,  www.dhamma.org లో వివరాలు తెలుసుకుని, దరఖాస్తు చేసాను. దాదాపు 12 గంటలు కూర్చుని ఉండవలసింది ఉంటుంది. పదిన్నర గంటలు ధ్యానం, ఒకటిన్నర గంట ప్రవచనం లోనూ కూర్చుని ఉండాలి. గంటకు ఒకసారి ఐదు నిమిషాల విరామం ఉంటుంది. అదికాక, ఉపాహార, భోజనం, అల్పాహారం విరామాలు ఉంటాయి. మనం అసలు బాసింపట్టు వేసుకుని కూర్చోవడం మర్చిపోయాం కదా ఇప్పుడెలా అని అనుకోవద్దు . దానికోసం నేనొక పని చేసాను. దరఖాస్తు చేసుకున్న రోజు నుండి ఇంకా 20 రోజులు సమయం ఉంది; నా కోర్స్ మొదలవడానికి. అందువల్ల కూర్చోవడం సాధన చేయడానికి మంచి అవకాశం కలిగింది, అని అనుకొని, ఇంటి వద్ద రోజు బాసింపట్టు వేసుకుని కూర్చోవడం సాధన చేశాను. మొదట్లో అరగంట కంటే ఎక్కువ కూర్చో లేక పోయాను; అలా ఏ పని లేకుండా కూర్చోవడం, చాలా బాధాకరంగా ఉండేది. కాళ్లు తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. సాధన చేయగా చేయగా, చివరి రోజుకు రెండు గంటల వరకు కూర్చోగలిగేను. అందువలన అక్కడ అందరిలో ఇబ్బంది పడకుండా జరిగిపోయింది.  

ధ్యానం చేయడం నేర్చుకోవాలని, చాలా కాలంగా అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ప్రయత్నాలు చేశాను; యూట్యూబ్ లో చూసి, టీవీలో చూసి. కానీ అస్సలు కుదరలేదు. ధ్యానం చేస్తే, మనసు, శరీరం తేలిక అవుతాయని, ఆత్మానందం కలుగుతుందని విన్నప్పుడు, నేను ధ్యానం నేర్చుకుని, ఆ ఆనందమేదో పొందాలని, ఆ దివ్య అనుభూతి నాకూ కలగాలని వేచి చూస్తూ ఉన్నాను. అందువలన ఎంతో ఉత్సుకతతో, ఈ ధ్యాన శిబిరం ప్రారంభం కోసం ఎదురు చూసాను.

మొదటిరోజు రానే వచ్చింది. మా ఇంటికి 32 కిలోమీటర్ల దూరంలో, సాగర్ రోడ్ లోఉన్న, అంతర్జాతీయ విపశ్యన కేంద్రము ధమ్మకేత్  కి బయలుదేరాను. 32 కిలోమీటర్ల ప్రయాణం తరువాత, మెయిన్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ లోనికి వెళ్ళాలి. ఆ ప్రాంతం ఒకప్పుడు, అడవిలాంటిదే అయి ఉంటుంది. కానీ పట్టణీకరణం లో భాగంగా, చుట్టూ  అక్కడక్కడ, ఇళ్ళు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకోగానే భోజనం చేయండి, అని చెప్పారు. కానీ సభ్యులు, వారిని విడిచి వెళ్లడానికి వచ్చినవారు, చాలా దూర ప్రాంతాల నుండి వస్తారు; మనం ఊర్లో వాళ్ళమే కదా, ఇంటి వద్దే భోజనం చేసి వెళ్దామని అనుకుని, అలాగే చేశాను.

తరువాత దరఖాస్తు ఇచ్చి నింపి, టీచర్ ని కలవమన్నారు. ఆవిడ దరఖాస్తు చదివి, సౌమ్యంగా అడిగారు. మోకాళ్ళ నొప్పి అని వ్రాశారు, ఎలా కూర్చుంటారు క్రింద?  మీకు కావాలంటే, ఎత్తుగా ఉండే సీటు గాని, కుర్చీ గాని ఇస్తాము అన్నారు. నాకు వీపుకు ఆధారం వుండేటటువంటి నేల మీద సీటు సరిపోతుంది అని అన్నాను. నియమాలు అన్నిటికీ కట్టుబడి ఉంటారా, వివరాలు అన్నీ చదివారా, అని అడిగారు. చదివాను అని చెప్పాను. తర్వాత నా దగ్గర ఉన్న సెల్ ఫోన్, డబ్బు మొదలైన వస్తువులు తీసుకుని కవర్లో పెట్టి భద్రపరిచి నాకు రసీదు ఇచ్చారు. నాకు మరొకరికి కలిపి, ఒక గది ఇచ్చారు. నా రూమ్మేట్ పేరు మొబీన. తను బళ్లారి నుంచి వచ్చారు. నేను నా సూట్ కేస్ తో గదిలోకి అడుగు పెట్టాను. అక్కడ రెండు మంచాలు, వాటిమీద పరుపులు వేసి ఉన్నాయి. స్టోర్ రూమ్ కి వెళ్లి, దుప్పట్లు దిండ్లు  తీసుకోమని చెప్పారు. నేను ఇంటి నుండే రెండు దుప్పట్లు తీసుకు వెళ్లడం వలన, అవి మంచం మీద పరచి, అలమర లో టాయిలెట్ సామాను, ఇతర అవసరమైన వస్తువులు సర్దేసి, అందంగా అమర్చుకున్న గదిని, పరిశుభ్రంగా వున్న స్నానాల గదిని చూసి, తృప్తిగా బయటకు వచ్చాను. బయట పెద్ద పెద్ద వేప, రావి చెట్లు మరియు కొన్ని పేరు తెలియని అడవి వృక్షాలు నిండుగా ఉన్నాయి. సాయంకాలం ఐదు గంటలకు, అందరిని హాలు దగ్గరకు రమ్మన్నారు. ఇంకా చాలా సమయం ఉంది అని విశ్రాంతిగా మేను వాల్చాను మంచం మీద. బయట ఉన్న చెట్ల మీద, పక్షుల రకరకాల కూతలు వినిపిస్తున్నాయి ఇంపుగా. ఈ గది, బయట చెట్లు , పువ్వులు, పక్షులు ఇష్టంగా అనిపిస్తున్నాయి. గదికి తాళం వేయనవసరం లేదు; చేతిలో సెల్ ఫోన్ లేదు; పర్స్ లేదు; డబ్బు  బాదరబందీ అసలే లేదు. పెద్ద బరువు దించు కున్నట్లు అనిపించింది. పది రోజులు నాలో నేను, నాకోసం నేనుగా ఉంటాను. ఏ బంధాలు, బాధ్యతలు లేని స్వేచ్ఛ అనుభవించటానికి సిద్ధంగా ఉన్నది మనసు.

శిబిరంలో, దాదాపు వందమంది స్త్రీలు మరియు 120 మంది పురుషులు, అన్ని వయసుల వాళ్లు, అంటే 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ప్రధాన ధ్యానమందిరం లో స్త్రీలు ఒక వైపు, పురుషులు మరొక వైపు కూర్చుని ధ్యానం చేస్తారు. ఎవరి ప్రవేశ ద్వారం వారిదే. ధ్యానమందిరంలో తప్ప మరెక్కడా స్త్రీ, పురుషులు తారసపడరు. ఈ నియమం చాల ఖచ్ఛితంగా అమలు చేస్తారు. మేము స్త్రీలందరం 5 గంటలకల్లా, పగోడా దగ్గర ఉన్న చెట్ల కిందకు చేరుకున్నాము. ఒకరికొకరం పరిచయం చేసుకుని, మాట్లాడుకుంటూ ఉండగా, ధమ్మ సేవిక లు నలుగురు, ఒక టీచరు వచ్చి మాతో కలిశారు.  అక్కడి పద్ధతులు, నియమాలు గురించి వివరించి, వివిధ ధ్యాన మందిరాలను చూపించారు. మాకు ఐడి కార్డు ఇచ్చారు. ఇక ఇప్పటి నుండి మాట్లాడకూడదు అంతా ఆర్య మౌనమే. ఆర్య మౌనం అంటే తర్వాత చెప్తాను. ఆ సాయంత్రం ఉపాహారం తీసుకున్నాము. కొన్ని పండ్ల ముక్కలు, కిచిడి, పేలాలు మరియు తేనీరు ఇచ్చారు. అదే రాత్రి భోజనం కూడాను. ఆ తర్వాత అందరం ధ్యాన మందిరం కి చేరుకున్నాము. మాకందరికీ సీట్లు కేటాయించారు. ఈ పది రోజులు అవే స్థానాల లో కూర్చోవాలి. విపశ్యన ప్రారంభించిన గురువు సత్యనారాయణ గోయంకా గారి ఆడియో ఉపన్యాసంతో కార్యక్రమం మొదలైంది. ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం కనుగొనబడిన ఈ ధ్యాన పద్ధతి కొత్తగా నేర్చుకోవడం కొంచెం ఉద్వేగంగా అనిపించింది. ఒక గంట ధ్యానం తర్వాత, ప్రవచనం గంటన్నర నడిచింది. తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం 30 నిమిషాలు జరిగింది. ఆ తర్వాత గదికి వచ్చి స్నానం చేసి పడుకుంటే, హాయిగా నిద్ర పట్టింది.  ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాలి, అనే ఆలోచనతో, పడుకోవడం మూలాన, నాలుగు గంటల కంటే ముందే మెలకువ వచ్చింది. గది బయటకు వచ్చి చూస్తే, కాంతివంతంగా ప్రకాశిస్తుంది, దశమి నాటి వెన్నెల. చల్లని గాలి మెత్తగా తాకింది మేనికి. ప్రశాంతమైన ఆ వాతావరణం, ఏదో జీవన సత్యంనేర్పుతున్నట్లు అనిపించింది. 

నాలుగు గంటలు కాగానే ధమ్మ సేవిక ఒకరు మా గది ముందు ఉన్న వరండాలో, చిన్నగా గంట శబ్దం చేస్తూ వెళ్లారు; అందరిని నిద్ర లేపుతున్నట్లుగా. అంతకు రెండు నిమిషాల ముందు ఒక బెల్ కూడా మ్రోగింది; చిన్న శబ్దంతో. ఆ ప్రాతః కాలం 4:30 కి మొదటి సెషన్ మొదలైంది. శ్వాస మీద ధ్యాస ఉంచాలి అని చెప్పారు. గాలి ఎలా లోనికి వెళుతుంది, ఎలా బయటకు వస్తుందో గమనించాలి; ముక్కు పుటాల దగ్గర మనసుని కేంద్రీకరించి. గోయంకా గారు హిందీ, ఇంగ్లీష్ లో మరొకరు తెలుగులో చెబుతున్నది ఆడియో టేప్ నుండి వినిపిస్తుంది. వేరే పనేమీ లేదు; శ్వాసను గమనిస్తూ ఉండాలి. బాసింపీఠం వేసుకుని కూర్చోవడం అలవాటు ముందే చేసుకున్నాను కాబట్టి అంత బాధ అనిపించలేదు కానీ, మనసు కొద్ది క్షణాలకే శ్వాస మీద నుండి పారిపోతుంది; ఎక్కడెక్కడో తిరుగుతుంది. చేయవలసిన పనులు గుర్తుకొస్తున్నాయి. జరిగిపోయిన సంఘటనలు గుర్తువస్తాయి. అవును ఇదేమిటి నేను ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అని మనసును లాక్కొచ్చి ముక్కు మీద నిలబెట్టడం, మరి కొద్దిసేపటికే అది ఎక్కడెక్కడికో వెళ్లడం జరుగుతుంది. మళ్లీ లాక్కొచ్చి శ్వాసను గమనించు అని హుకుం జారీ చేస్తాము. ఎప్పుడైతే మనసు నిలకడగా ఉంటుందో, అప్పుడు శ్వాసను చూడగలుగుతాం. అమ్మయ్య కాస్త కుదురుతుంది అని అనుకునేంతలో, మనసు ఇంకా ఎక్కడికో పోతుంది. ఒక్కోసారి దూర ప్రాంతంలో ఉన్న పిల్లలతో మాట్లాడతాం; మరోసారి చిన్ననాటి ఆటలు పాటలు గుర్తుకొస్తాయి. మొదటిరోజు అంతా, ఇలా పారిపోతున్న మనసుని పట్టుకు రావడమే సరిపోయింది. అసలు ఆలోచనలు రాకుండా ఆపడం సాధ్యం కాని పని; ఈ పది రోజుల్లో ఎంత సాధ్యమవుతుందో చూడాలి 

 ఇక్కడి సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. ఉదయం 4:30 నుండి 6:30 వరకు ధ్యానం  చేసి వచ్చేసరికి, బాయిలర్లో వేడి నీళ్లు సిద్ధంగా ఉంటాయి. స్నానం ముగించి భోజనశాల కు వెళితే, వేడివేడిగా, రాగి జావ, ఇడ్లీ, పొంగల్, చెట్ని, పండ్లు  మరియు తేనీరు సిద్ధంగా ఉంటాయి. వేరే మనుషులే కనబడరు. ఎవరు చేస్తున్నారో తెలీదు ఈ పనులన్నీ. విశాలమైన భోజన శాలలో, పంఖా శబ్దం ఒక్కటే వినబడుతుంది. భోజనం ప్లేటు, గ్లాసు, చిన్న గిన్నె మరియు స్పూను ఒక సెట్టు గా ప్రతి ఒక్కరికీ ఇస్తారు. భోజనం అయిన తర్వాత సబ్బుతో శుభ్రంగా కడిగి టవల్తో తుడిచి, మనకు కేటాయించిన అరమరలోని అరలో ఉంచాలి.  పది రోజులు అవే వాడు కుంటాము. వసతి, సౌకర్యాలలో ఇబ్బంది ఉంటే, ఒక స్లిప్ మీద రాసి, కంప్లైంట్ బాక్స్ లో వేయాలి. డైనింగ్ హాల్ లో ఈ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ లాండ్రీ సౌకర్యం కూడా ఉంది. మొదటిరోజు ఉపయోగించు కున్నాను. మన పనులు మనమే చేసుకుందాం అనే ఆలోచనతో, దాదాపు అందరం సొంతగా ఉతుక్కోవడం మొదలెట్టాము. ఎవరి గదులు వారే శుభ్రం చేసుకోవాలి; ముందు ఉన్న వరండా, లోపల ఉన్న టాయిలెట్ తో సహా.

 రాత్రి ప్రవచనంలో గోయంకా గారు చెప్పిన విషయం, మనసులో కదులుతుంది. మన ఆలోచనలననుసరించి మన శ్వాస లో మార్పులు వస్తాయి. ఆనందంగా ఉన్నప్పుడు, మనసు తేలిక గా ఉండి, గాలి ధారాళంగా లోపలికి వెళుతుంది. మనకు నచ్చని విషయం ఎదురైనా, కోపం ఉద్రేకం కలిగినా,  శ్వాస బరువెక్కి, గాలి ధారాళంగా లోపలకి వెళ్లలేక పోతుంది. ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి, భవిష్యత్తులో జరగవలసిన వాటి గురించి ఆలోచిస్తూ , వర్తమానాన్ని ఆస్వాదించం. మనం ఉన్న నిమిషాన్ని, క్షణాన్ని, చేస్తున్న పనిని ఆస్వాదించటం, ఆనందించటం చేయాలి. ఇదే ఈరోజు నేర్చుకున్న విషయం. 

మంచి పోషక విలువలున్న ఆహారం, ఉదయం –  మధ్యాహ్నమూ, సాయంత్రం తేలికపాటి ఆహారం ఉంటాయి. ఎంత హాయిగా ఉంటుందో, రాత్రి పడుకోగానే నిద్ర పడుతుంది. ఉదయం ధ్యాన సమయంలో, పక్షుల కూతలు, నెమలి అరుపులు, కోయిల గానం మధురం గా వినిపిస్తుంటాయి. గాలి వీచినప్పుడు అడవి పూల సుగంధం అలలు అలలుగా తేలియాడుతూ మనసును ఆహ్లాద పరుస్తుంది. రెండో రోజు, మూడో రోజు కూడా శ్వాస మీద ధ్యాస ఉంచడమే చేయాలి. ఇప్పుడు ముక్కు లోనికి వెళ్లే గాలి చల్లగానూ, బయటకు వచ్చే గాలి వేడిగానూ ఉండటం తెలుసుకుంటాము. శ్వాసను గమనించటం తప్ప మరి ఏమి చేయనవసరం  లేదు. గాలి చల్లగా ఉంటే చల్లగా ఉంది అనుకుంటాం, వేడిగా ఉంటే వేడిగా ఉంది అనుకుంటాం. ఇలా ఎందుకు ఉంది అలా ఎందుకు లేదు అనే ఆలోచనలు అక్కరలేదు; ఏదైనా గమనించడమే మన పని. సాయంకాలంఏడు గంటలకు జరిగే ప్రవచనాలు నాకు చాలా నచ్చుతున్నాయి. మానవీయ విలువలతో, హేతుబద్దమైన జీవనం గురించి, ధర్మం గురించి వివరిస్తారు. అయితే ఆ సమయానికి బాగా అలసి పోతాము; పగలంతా ధ్యానంలో కూర్చోవడం వలన. 

ఆర్యమౌనం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఆర్య మౌనంలో,  మన మనసు మాట్లాడదు; నోరు మాట్లాడదు; శరీరం మాట్లాడదు; భంగిమలతో, సంజ్ఞలతో. ఆఖరికి కనుసైగ లు కూడా చేయకూడదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూడరు. దాదాపు నేల మీదే ఉంటాయి చూపులు. దానివలన ఒక సమాధి స్థితిలో  ఉండి, చేసే పని మీద, సర్వశక్తులూ కేంద్రీకరించి, మంచి ఫలితాలను పొందుతాము.

 మూడవ రోజు మధ్యాహ్న భోజనం విందుభోజనంలా ఉండి కొంచెం ఎక్కువ తినే సరికి ఆ పూట ధ్యానం సరిగా చేయలేకపోయాను.  ఒక్కోసారి కాళ్లు తిమ్మిర్లెక్కి, అసౌకర్యంగా కదులుదాము. అటువంటప్పుడు ధమ్మ సేవిక వచ్చి, ఆచార్యుని వైపు కాకుండా, కొంచెం పక్కకి కాళ్లు చాపుకుని కూర్చుని, సరి అయినాక, పీఠం వేసుకుని కూర్చోవచ్చు అని అతి నెమ్మది స్వరంలో మనకు మాత్రమే వినిపించేలా చెప్పి వెళ్తారు. విపశ్యన అంటే ఇంతేనా? ఇంకేదో వుంది అని అనుకుంటున్నంతలో, రేపు నాలుగో రోజు విపస్సన  నేర్చుకుంటాము అని తెలిసింది.

 ఇక్కడ నాకు నచ్చని విషయం ఒకటుంది. బుద్ధుడిని భగవాన్ అనడం మరియు మోక్ష ప్రాప్తి గురించి మాట్లాడటం. బుద్ధుడు స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, బోధి పొందినవారు బుద్ధుడు (లు) అవుతాడని తనకంటే ముందు బుద్ధులు ఉన్నారని తన తర్వాత కూడా బుద్ధులు వస్తారని. మనం, దైవ లక్షణాలు ఉన్న వారిని దేవుడు అంటాం కదా అదేవిధంగా గా బుద్ధుడిని దేవుడు అనే బదులు భగవాన్ అన్నారేమో మరి నాకు తెలియదు. తరువాతి విశేషాలు వచ్చే సంచికలో. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.