పునాది రాళ్లు-10

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక రాజవ్వ కథ

రాజవ్వ ఫై  జరిగిన లైoగిక దాడిని  మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ   పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు  రాజవ్వ కుటుంబం మరియూ ఎమ్ఎల్ పార్టీ భావించింది. మరో విధంగా చెప్పాలంటే మనువాద కుల పితృ స్వామ్య  రాజ్యం మోపిన నిర్బంధపు హింసలో భాగంగా ఈ అణిచివేత జరిగిందని చెప్పాలి. ఇదిలా ఉంటె, దక్కన్ చరిత్రలో వివిధ మైలురాల్లుగా నిలిచిన ఉద్యమాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకోవాలి.  వాటన్నిటి తరువాతనే వచ్చిన గోదావరి లోయ ఉద్యమంఫై, ఈ స్త్రీల ఫై జరిగిన దాడుల నేపధ్యాన్ని చూడాలి . ఇందులో భాగంగానే 1940 కి ముందు మరియూ ఆ తరువాత సాగిన జాతీయోద్యమం ఆంగ్లేయుల పాలననుండి  స్వాతంత్య్రాన్ని కోరుతూ ముందుకొచ్చినది . 1940సం,, కాలంలో భూస్వామ్య పాలనా విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ముందుకొచ్చిoది .1969 లో విశాలాంధ్ర పాలనను వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం  ముందుకొచ్చి0ది. 1970లో ఎమర్జెన్సికి వ్యతిరేకంగా పోరాటం సాగింది. ఆ తరువాత అతికొద్ది కాలానికే ముందుకొచ్చిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం, దానిపై జరిగిన అణిచివేత, రాజవ్వఫై జరిగిన దాడి పరంపర వరకు ఇందులో భాగమే. అంతే  కాక దక్కన్ పీఠభూమిలో చోటు చేసుకున్న భౌగోళిక మార్పులనూ చూడాలి. హైదరాబాద్ సంస్థానదేశంగా , రాష్ట్రంగా , ఉమ్మడి ఆంద్రప్రదేశ్గా వంటి పరిణామాలు ఇందులో భాగమే. పాలకులుగా చేరి ఫై అన్ని మార్పుల వల్ల ఒనగూడిన సానుకూల ఫలాలను అనుభవించి లబ్ది పొంది అదికార  ఆధిపత్య కులాలు వర్గాలే నన్నది ఒక వాస్తవం. వారు భూమి యజమానులైనా , పోరాటాల్లో త్యాగాలు చేయకపోయినా పాలనా పరమైన సర్వం లాభాలను పొందింది ఆధిపత్య కులాలు వార్గాలవారే. కానీ గత అన్నిపోరాటాల్లో త్యాగాలు చేసి జైలు కేసుల పాలు అయిoది, మాత్రం అణగారిన వర్గాల కులాల బహుజనులేనన్నది కాదనలేనిది. కనుకనే  దేశంలో రాష్ట్రంలో జిల్లాలో తాలూకాలో గ్రామం లన్నిటి లో రాజకీయ ఆర్థిక సామజిక సర్వo అధికారాలను నెరిపింది నేటికీ నెరుపుతున్నది వారే. ఆ రకంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో సిరిసిల్ల తాలూకాలో కుదురుపాక గ్రామంలో కూడా అన్నీపెత్తనాలు వీరివే. వీరి పెత్తనాన్ని ప్రశ్నించినందుకే ప్రజలపై అందునా స్త్రీలపై క్రూరమైన దాడులకు పాల్పడ్డారు.  ప్రజల ఆకాంక్షలను అణిచివేసే చట్టాలను కూడా తీసుకురావడం ఈ ప్రాంత ప్రత్యేకత. అందుకే 1978సం.లో కాంగ్రెస్ పార్టీ నుండి మర్రిచెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి తీవ్రమైన హింసను ప్రయోగించడమైంది. అందులో భాగంగానే 1978 సం, అక్టోబర్ 4 వ తేదీనాడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిస్ట్రపెడ్ యాక్ట్ ను తీసుకొచ్చింది. సిరిసిల్లా జగిత్యాల తాలూకాలను కల్లోలిత  ప్రాంతాలుగా ప్రకటించింది. ఉత్తర తెలంగాణాకు చీకటి చరిత్రను మిగిల్చిందని చెప్పాలి. ఈ చరిత్రను రాసింది అంతంత మాత్రమే. ప్రభుత్వ రికార్డుల్లో కానీ, విద్యా సిలబస్ లోకానీ చివరకు ఎంఎల్ పార్టీరాసిన పుస్తకాల్లో కాని ఈ చరిత్ర అంతగా కనపడదు. కొంత మంది ప్రగతి శీల చరిత్రకారులు, రచయితలు రాసిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నది. అదికూడా వర్గ దృక్కోణంలోనూ, నాటి పాలకులు ప్రయోగించిన నిర్బంధానికి బలైన  బాధితుల సంఖ్యను ఇతరత్రా సమాచారాన్నిఇవ్వడం వరకె పరిమితమైనది . కానీ స్త్రీల దళిత దళిత స్త్రీ బహుజన స్త్రీ దృక్కోణంలో చరిత్రని,జీవిత చరిత్ర ఇప్పటివరకు రాయబడలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటంలో స్త్రీల అనుభవాలను అద్బుతంగా అందించిన ”మనకు తెలియని మన చరిత్ర” తరహాలో స్త్రీల చరిత్రను 1970 లలో వచ్చిన ఎం ఎల్ ఉద్యమ స్త్రీల చరిత్ర ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. ఈ రాయబడని కల్లోలాల చీకటి  చరిత్రలో నుండే వచ్చిన ఆత్మ గౌరవ చరిత్రనే ఈ కుదురుపాక రాజవ్వ కథ. 1980 సం. తరువాత వచ్చిన ఆత్మ గౌరవ రాజకీయాలకు పోరాటాలకు జీవన సరళికి చెరగని ముద్రవేసిన యోధురాలుగా రాజవ్వ నిలిచింది. 1990 సం. లోని సారావ్యతిరేక ఉద్యమంలోగాని, నిరంతరం కొనసాగే బీడీ కార్మిక పోరాటాల్లో గాని, తెలంగాణరాష్ట్ర మలి దశ ఉద్యమంలో కానీ చురుకుగా పనిచేసే నాయకులు కార్యకర్తలను ఎవరిని అడిగినా ” రాజవ్వ మాకు స్ఫూర్తి” అని చెపుతారు. ఈ మాటను చెప్పి గతం లోని తమ జ్ఞ్యాపకాన్ని  చెపుతారు. ఉద్యమం నిర్బంధం రెండూ ఉదృతంగా నడుస్తున్న కాలంలో ”ఓ … దొరా… నీవెంత గొప్పోడివైనా ఎంత బెదిరించినా నీ వాకిట్లకు కాలు గూడా పెట్టను పో అని బహిరంగ సభలో ప్రకటించింది రాజవ్వ” అని యాదికి తెచ్చుకుంటారు.”అన్నట్లే తన చివరి గడియలదాకా బతికి చూపింది, అందుకే మాకు స్ఫూర్తి” అని కూడా అంటారు. ఎంఎల్ పార్టీ విషయానికొస్తే, రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా రాజవ్వను రేప్ విక్టిమ్ గా , రాజ్యహింస బాధితురాలిగానే ఎక్కువ మోతాదులో నిలబెట్టింది. కానీ ఒక నాయకురాలిగా  నిలబెట్టింది ఎంత మోతాదు అనేది ప్రశ్న. బాధితురాలిగా నిలబెట్టిందే ఎక్కువని స్పష్టంగా అర్థమౌతుంది. విషయమెమంటే రాజవ్వకు అస్సలు రేప్ విక్టిమ్ గా ప్రచారం కావడం, అలా చిత్రించ బడడం, అంగీకారమేనా అనేది ఆమె కన్సెన్ట్ సమ్మతి తీసుకున్నారా ? కనీసం తీసుకునే ప్రయత్నం చేశారా ? లేక ఆమెకు నాయకురాలిగా నిలబడడం ఇష్టమా? ఆమెనుండి తెలుసుకునే ప్రయత్నం చేసిందా పార్టి ? ఆమెను రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిగే సభ కాడల్లా వేదికపై బాధితురాలిగా మాత్రమే నిలబెట్టారా? ఎందుకంటే భూస్వాముల గుండాలు ఆమెను అత్యాచారం చేసింది కేవలం స్త్రీ అని మాత్రమే కాదు.  ఒక ధైర్యవంతురాలైన నాయకురాలని ఆమెఫై దాడికి పాల్పడ్డారు. పార్టీ మాత్రం ఆమెను బాధితురాలిగా మాత్రమే నిలబెట్టింది. రాజవ్వ ప్రజా నాయకురాలు కానీ ఎస్సి మాదిగ కాబట్టే ఆమె సమ్మతి అంగీకారం తీసుకోవాల్సిన పని లేదన్నట్లు, ఆమె కేవలం బాధితురాలిగా నిలబడడానికి మాత్రమే అర్హురాలన్నట్లు ప్రవర్తించారా ? రాజవ్వ స్థానంలో ఒక అగ్రకులాల స్త్రీ ఉంటె ఇట్లాగే ఉండేదా ? అనే ప్రశ్నలు ఉదయించక మానవు. అందుకే రాజవ్వ చరిత్ర కొత్త తరాలకు ఎంతో అవసరం.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.