రమణీయం

విపశ్యన -3

-సి.రమణ 

ఇప్పుడు అర్థమయింది. గడచిన మూడు రోజులు, మనలను మనం సిద్ధం చేసుకుంటున్నాము; విపశ్యన సాధనకు అనువుగా. మన చేయి పట్టి ప్రాధమిక అడుగులు వేయించారు, ఇక్కడి ఆచార్యులు, ఇప్పటిదాకా. మనం ఎటువంటి సామాజిక, ఆర్థిక నేపథ్యం నుండి వచ్చినా, ఇక్కడ నియమాలకూ, నిబంధనలకు, జీవన శైలికి అలవాటు పడటానికి, ఈ మాత్రం సమయం కావాలి.  

ధ్యాన సమయంలో, సత్యనారాయణ గోయంకా గారు చెబుతున్న ధ్యానవిధానం, ఆడియో టేప్ ద్వారా వినిపిస్తారు. ఆయన సూచనలు అనుసరించి ధ్యానం చేయడం ఎలాగో తెలుసుకుంటాము. ఆయన హిందీలోను, ఇంగ్లీష్ లోను, మరొకరు తెలుగులోనూ చెప్తుంటారు. గోయంకా గారు పాళీ భాషలో మరియు హిందీలో పాటలు పాడుతుంటారు; అప్పుడప్పుడు. ఆ భాష కొంచెం అర్థఅయ్యి, అవ్వనట్లు ఉంటుంది.

అర్థమైన భావం, ఆర్ద్రతతో మనసుని కదిలిస్తుంది. అసలు వీళ్ళు ఎవరు? మన గురించి మనం తెలుసుకునేటట్లు , మన కష్టాలను, దుఃఖాలను, బాధలను నివారించే, మార్గాలు చూపించే బాధ్యత తీసుకుని, ప్రేమను పంచుతూ, సంఘం గురించి, ధర్మం గురించి మనకు తెలియని జ్ఞానాన్ని తెలుసుకునేటట్లు చేస్తారు. బుద్ధుని బోధనలను సున్నితంగా చెప్పినా, ఖచ్చితంగా మన హృదయాలలోకి చొచ్చుకునేలా చెప్తారు. నిజంగా మన అదృష్టం; ఇటువంటి ఒక శిబిరానికి రావడం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటారు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలని అంటారు.  

ఆ రోజు ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఏదో తెలియని ఉత్సాహం తొంగిచూస్తుంది నాలో. కొత్త విషయం నేర్చుకోబోతున్నందుకో,  నాకిష్టమైనటువంటి ధ్యానంచేయడం నేర్చుకోబోతున్నందుకో తెలియరాలేదు. గోయంకా గారు ఎప్పటిలాగానే గంభీర స్వరంతో వివరిస్తున్నారు. మన తల మీద ఉన్న బ్రహ్మ స్థానం నుండి మొదలుకొని అరిపాదం వరకు ప్రతి సెంటీమీటరు, ఇంకా చెప్పాలంటే ప్రతి మిల్లీమీటరు శోధిస్తూ  పోవాలి. ఏమి శోధించాలి? ఎక్కడైనా నొప్పి ఉందా, బాధ ఉందా, దురదగా ఉందా, చెమట పోస్తుందా మరి ఏ విధమైన ఇతర స్పందనలు ఏమైనా ఉన్నాయా అని శరీరం అంతటా శోధించాలి. ఎక్కడైనా నొప్పి అని అనిపిస్తే అక్కడ ఆగి, ఒక  సాక్షి వలె చూచి, ఇది అనిత్యం అని అనుకొని, ముందుకు కదలాలి. అంతేగాని బాధను, మనసు లోనికి తీసుకొని బాధపడటం, ఇంకా బాధను పెంచుకోవడం చేయరాదు. చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు, ఈ ప్రక్రియ.  

నిన్నటి వరకూ కేవలం ముక్కు వద్ద మాత్రమే మనసు నిలిపి పరిశీలనగా చూస్తూ ఉన్నాము. మన మనస్సును ఒకచోట కేంద్రీకరించ గలుగుతున్నాము. ఇప్పుడు అదే పద్ధతిలో శరీరమంతా శోధన చేయాలి; తటస్థ భావనతో.  

కోట్లాది కణజాలం తో నిర్మితమైన ఈ దేహం అనిత్యమైనది. ఇందులో కలిగే స్పందనలు, బాధలు, దుఖాలు, జబ్బులు అన్ని అనిత్యమైనవే. వేల కణాలు నిత్యం పుడుతూ, గిడుతూ  ఉంటాయి. అంటే నిన్న ఉన్న కణం ఈరోజు ఉండదు. ఈరోజు ఉన్న కణం రేపు ఉండకపోవచ్చు. అలా అని అన్ని కణాలు  నశించిపోవు. పోయినవాటి  స్థానంలో కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉండే మార్పు. అంటే మార్పు ఒక్కటే నిత్యమైనది. ప్రత్యేకంగా గమనించం కానీ మన శరీరంతో పాటు మన చుట్టూ ఉన్న అన్ని ప్రాణుల లోనూ మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలోని చెట్టు, చేమ, ఆ మాటకొస్తే విశ్వమంతా నిరంతర చలనంతో మార్పు చెందుతూనే ఉంటుంది. 

ఆరోజు మధ్యాహ్న భోజనంలో, చాలా వెరైటీ లు ఉన్నాయి; స్వీట్ తో సహా.  మితాహారం తీసుకుంటే ధ్యానం బాగా చేయగలను అని అనుకుని అలాగే చేశాను. ఆహారం ఎక్కువ తిన్న వాళ్ళు కొందరు, ఇబ్బందులు పడటం చూశాను. అక్కడ  ప్రాతః కాలం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వేడిగా అల్లం టీ, 20 లీటర్లు పట్టే అంత పెద్ద  ఫ్లాస్క్ లో ఉంటుంది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎంతైనా తాగవచ్చు. నా రూమ్మేట్  మోబీనా కడుపు నొప్పితొ బాధ పడటం చూసి, ఒక పెద్ద గ్లాసు అల్లం టీ తీసుకొచ్చి ఆమె మంచం దగ్గర పెట్టి  తాగమని సైగ చేశాను. ఈ నాలుగు రోజుల్లో మొదటిసారి నియమ ఉల్లంఘన జరిగింది.

సాయంకాలం ధ్యాన సమయంలో,  ఆచార్యులు అందరిని (అంటే స్త్రీలను) 7, 8 గుంపులుగా విభజించి ఏ బి సి డి పేర్లు పెట్టారు. అదే విధంగా పురుష ఆచార్యులు, పురుషులను సముదాయాలుగా విభజించి పేర్లు పెట్టారు. ఒక్కొక్క  గుంపు ని పిలచి తగ్గు స్వరంలో, ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఈ ధ్యాన పద్ధతి అర్థం అయినదో, లేదో తెలుసుకుని ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో కనుక్కొని, తగిన సలహాలు ఇస్తూ , ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు; ఆచార్యులు. ఇలా చేయడం వల్ల, అర్థం చేసుకుని అందరూ బాగా  ధ్యానం చేయగలుగుతున్నారు. నెమ్మది నెమ్మదిగా  ధ్యానం లోకి అడుగు పెడుతున్నాము. అంటే ప్రతిక్షణం మనలోనికి తొంగి చూస్తూ అంతర్నేత్రంతో  కణం కణం పరిశీలిస్తూ, సూక్ష్మ మైనటువంటి సంవేదనలు కూడా గుర్తిస్తూ అవి అనిత్యమని, మార్పు మాత్రమే నిత్యమని తెలుసుకుంటూ ముందుకు సాగుతాము.  

రాత్రి ప్రవచన సమయంలో, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి అనువుగా, మంచి చెడు, న్యాయం అన్యాయం, మొదలైన విషయాల గురించి హేతుబద్ధంగా, చాలా ఆసక్తికరంగా చెప్తారు.  మధ్యలో హాస్యస్ఫోరకంగా, అప్పుడప్పుడు మనకు అర్ధం కానంత  సటిల్ గా, వ్యంగ్యంగా మాట్లాడతారు. మనకు విశ్లేషణ చేయడం, వివేకం గా ఆలోచించడం అలవాటవుతుంది. సత్యం, ధర్మం వంటి విశేష గుణాలు, సాధారణ  గుణాలుగా మారి, మనలో జీర్ణించుకుపోతాయి; మనకు తెలియకుండానే.  

ఆరోజు రాత్రి, ప్రధాన  ధ్యాన  మందిరానికి, మా నివాసాలకి మధ్యలో ఉన్న వృక్షాల కింద నడుస్తూ, అక్కడ ఆవరించి ఉన్న ప్రశాంతత లోనికి లయమౌతూ చాలాసేపు గడిపాను. ఎంత ప్రశాంతం, ఎంత తన్మయత్వం, ఎంత ఆనందం అని అబ్బుర పడ్డాను. ప్రకృతి, ప్రేమగా, స్నేహ హస్తం చాపి, నన్ను తనలోనికి ఆహ్వానిస్తున్నట్లు గా, చల్లని గాలి నా మేనును కౌగలించుకుంది, పారిజాత సుమ సౌరభాలతో. మెత్తని గాలిలో తేలుతూ, నా  గదికి చేరుకుని, ధ్యానం చేయడం లోని సౌమ్యతను ఆస్వాదిస్తూ  నిద్రలోకి జారుకున్నాను.  

తరవాత రోజు, ధ్యానం చేస్తుంటే, వివిధ విషయాలు, ఏనాడో మరచిపోయినవి, సుషుప్త అవస్థలో, మనసు అట్టడుగున దాగున్న సంగతులు చాల బయటకొచ్చాయి. అలాగే చిన్న చిన్న శారీరక రుగ్మతలు కొన్ని తలెత్తవచ్చు. అవి కూడా అనిత్యమే! అప్పుడుకూడా ద్రష్ట గా ఉండటమే  చేయాలి. త్వరలోనే వాటంతట అవే సమసిపోతాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొన్నాళ్లపాటు ధ్యానం చేస్తూ ఉంటే, మనలోని శారీరక, మానసిక రుగ్మతలు తగ్గటం గమనిస్తాము. అయితే వాటికోసం ధ్యానం చేయము. మన గమ్యం వేరు. మార్గమధ్యంలో ఇటువంటి చిన్న చిన్న అనుభవాలు పొందుతాము.

  ఆ తర్వాతి రోజు పగోడాలలో, ఒక గంట ధ్యానం చేయడానికి, కొందరికి అవకాశం కలిగింది. పగోడ అంటే 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉన్న, చీకటి గది. కూర్చోవడానికి చిన్న చాప మరియు  కుషన్ సీటు ఉంటాయి. వలయాకారంగా  ఉన్న హాలులో, అలాంటి  గదులు వరుసగా ఉంటాయి. ప్రతి గదికి తలుపు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి, అనుభవం కలుగుతాయి ఆ పగోడా గదిలో. నాకు కూడా చాలా అద్భుతమైన అనుభవం కలిగింది. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ  , కూర్చున్నది చిన్న చీకటి  గది అయినా, ప్రకృతిలో విలీనమై, ఈ విశాల విశ్వంలో అంతర్భాగమైనట్లు  , నేనంటూ ఉనికి లేని స్థితికి చేరుకున్నాను. ఒక ప్రేమమయ, ఆనందమయ భావనలో ఉండిపోయాను. విశ్వప్రేమను పొందినట్లు అనుభూతి కలిగింది. అయితే, ఎంత ఆనందకరమైన భావన అయినా అనిత్యమే. దానినే తలచుకుంటూ, మరల మరల అటువంటి సంతోషకర భావన కలగాలని కోరుకో కూడదు .అదేవిధంగా బాధాకరమైన విషయాలు కలగకూడదు, వద్దు అని అనుకోకూడదు. సంతోషకరమైన విషయాలను ప్రేమిస్తూ కావాలనుకోవడం, దుఃఖకరమైన విషయాలను ద్వేషిస్తూ వద్దు అనుకోవడం  రెండూ సరికాదు. అన్నీ అనిత్యమే అన్న ఎరుకతో, తటస్థంగా ఉండాలి. సమస్థితి చేరుకోవడానికి మనసు నెమ్మదిగా అలవాటు పడుతుంది. 

శిరస్సు పై నుండి క్రిందికి పాదాలవరకు, పాదాల నుండి పైకి నడి నెత్తి మీదకు నిలువుగా, మన అంతర్నేత్రంతో చేసే ప్రయాణం, నెమ్మదిగా,పరిశీలనగా , పరిశోధిస్తూ జరుగుతుంది. కొన్నిసార్లు అడ్డంగా, కొన్నిసార్లు నిలువుగా, మరికొన్నిసార్లు చుట్టూ వలయాలుగా, శరీరంలోని అన్ని భాగాలను  తాకుతూ , కణ కణాన్ని ప్రశ్నిస్తుంటే, అచేతన మనసులో, నిక్షిప్తమైన ప్రేమలు, ద్వేషాలు, బాధలు,, జ్ఞాపకాలు, ఎవరికీ చెప్పుకోలేని దుఃఖపు గాధలు, ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న వ్యధల మూటలు, బయట పడతాయి. నాకు ఎవరిమీద కోపం, ద్వేష భావం అంతగా లేకపోవడం వల్ల, పెద్ద ఇబ్బంది కలగలేదు.  కానీ, కొన్ని నొక్కి పెట్టిన  వ్యధలు బయటకొచ్చాయి కన్నీళ్ళ రూపంలో. ఆ తరువాత మనసు ఎంత తేలిక అయిపోయిందో వర్ణించనలవి కాదు. మనం చాలా సందర్భాలలో బాధ  కలిగినా, కష్టం కలిగినా, నష్టం జరిగినా, అతిగా విచారించక  అణిచి వేస్తాము. సంయమనం తో ప్రవర్తించామని భావిస్తాము. కొన్నాళ్ళకు మర్చిపోతాం. కానీ, అసూయ, కోపం, ద్వేషం, వ్యధలు ఎక్కడికీ పోవు. అవి, మనసు అంతర్భాగంలో పేరుకుపొతాయి. తరువాత సంవత్సరాలలో, శరీరం మీద దుష్ప్రభావం చూపిస్తాయి; అనారోగ్య రూపంలో. ఇప్పుడు చేస్తున్న ఈ ధ్యాన ప్రభావం తో అటువంటి  సమస్యల ప్రక్షాళన జరిగి, నిర్మలమైన మనసు మిగులుతుంది,  చివరకు.   

మిగతా విషయాలు వచ్చే సంచికలో-


*****

Please follow and like us:
error

One thought on “రమణీయం- విపశ్యన -3”

  1. Ramana garu andariki avasaram aina amsamu enchukoni chaalaa vivaram gaa chepthunnaaru.jeevitham lo prabha okkaru as anubhootn Ponda valasinade.dhanyavaadamulu.

Leave a Reply

Your email address will not be published.