“నెచ్చెలి”మాట 

“కరోనాకాలం”

-డా|| కె.గీత 

“కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? 

ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. 

బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!?

అసలు “కరోనాకాలం” ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు!

ఇళ్లని ఎంతకాలం అంటిపెట్టుక్కూచోవాలో, పోయిన ఉద్యోగాల్ని ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాని పరిస్థితి.

రెండు వారాలు ఎవరి నెవరు ముట్టుకోకుండా ఉంటే 

అంతా “తూచ్చి” అన్నట్టు మాయమై పోతుందని తేలిగ్గా తీసుకుని

ఆరు వారాలు దాటింది!

మరో నాలుగు వారాలు ముందుకు పొడిగింపైంది!!

మొదటి వారం “వింతగా, ఇదేదో బావుందన్న” ట్టుంది

రెండో వారం “సరే ఇంకో వారమే కదా” అని సర్దుకున్నాం

మూడో వారం “సరుకులు నిండుకుంటే అన్న గాభరా తోనూ”,

 నాలుగో వారం “మాస్కులు కుట్టుకుంటూను”  గడిపేసేం

అయిదో వారం “గడపదాటక విసుగెత్తి పోతే”,

ఆరో వారం “భయభ్రాంతులతో”  మొదలయ్యింది

ఇక ఇప్పుడు

“ఇంకెన్నాళ్ళురా భగవంతుడా” అని తప్ప మరో మాటే గుర్తు రావడం లేదు!

కడుపు నిండా తిండి, కాస్తో కూస్తో బ్యాంకు బాలెన్సున్న వారి పరిస్థితే ఇలా ఉంటే

రెక్కాడితే గానీ డొక్కాడని వారి మాటేంటి?

కరోనా మట్టుబెట్టే దాకా బతకడానికి దారి లేని వారి సంగతేంటి?

ఏదో ఒక మారుమూల గ్రామం నుంచి వలసొచ్చిన బతుకుల మాటేంటి?

అయినా మనకెందుకులే-

నెట్ ఫ్లిక్స్ లోనో

అమెజాన్ లోనో

 నోట్ల కట్టలు సొంతంగా ముద్రించుకుని కోట్లు  దొంగతనం చేసిన ముఠా ఎలా తప్పించుకుంది?

దొంగే పోలీసుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది?

కాలంలో వెనక్కి , ముందుకి  ప్రయాణం చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమైపోతే!… 

లాంటి సీరియల్సు చూసుకుంటూ 

ఏ రోజుకారోజు  బతికేస్తే పోలా?

కరోనా కాలం ఎన్నాళ్ళుంటే మనకెందుకు? 

ఎవరికి  గడ్డు  రోజులు  దాపురిస్తే మనకెందుకు?

గప్ చిప్ న ఎవరిళ్లలో వాళ్లు సరుకులు నిండుకునే వరకు రోజుకో పిండి వంట వండుకు తింటే పోలా? 

పాల పేకెట్టుకో, నీళ్ల టాంకర్ దగ్గిరో క్యూ కట్టినట్టు

తెరుచుకున్న మద్యం దుకాణాల దగ్గిరా  క్యూకడితే పోలా?

హమ్మయ్య! ఇన్నాళ్ళకి కరోనాకి “మందు” దొరికింది!!


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.