ట్రావెల్ డైరీస్ -3

రే రేలా రేలా రెలా

 

-నందకిషోర్

 
తూర్పు కనుమతో ప్రేమలో పడి ఎనిమిది నెలలు. కార్తీకమాసంలో ఎప్పుడో మోదకొండమ్మ పాదాలదగ్గర మొదలైన ప్రేమ, గోస్తనీ తీరంలో పంచభూతాల సాక్షిగా నన్ను వశం చేసుకుంది. వలిసెలు పూసిన కాలంనుండి వరదలు పారే కాలందాక ఏమీ మారలేదు.  మనసు ఘాటీలు ఎక్కిదిగి అలసిపోతూనే ఉంది. హృదయం సీలేరులో పడి కొట్టుకుపోతూనే ఉంది. మాలబొట్టె గంగుగారికోసం సంజీవరాజు నేనైనట్టు ప్రపంచం ఊహలో తేలిపోతూనే ఉంది. 
 
మృగశిరకార్తెకి అనుకున్న. ఒక చినుకు రాగానే చిత్రకూట్ జలపాతానికి పోదామని. ఆ రోజు దాటినాక మళ్లీ వర్షం పిలిచింది లేదు.అలక. ప్రియమైన వాళ్ళు పిలిస్తేనే పోవాలా అన్నట్టు అడుగు వేస్తిని కదా. దారి దారంతా వాన తుంపర. 
 
శుక్రవారం రాత్రి భద్రాచలంలో ఉండి పొద్దున్నెలేసి బయలుదేరాను. నన్ను భరించేందుకు ఇంకో ముగ్గురు మిత్రులు వెంటవొచ్చారు. తెలతెలవారుతుండగ గోదావరి దాటాం. కాస్త వెలుతురొచ్చినాక కార్ వేగం పెరిగింది.  నెల్లిపాక, లక్ష్మీపురం నాల్గు పాటల దూరం. కళ్ళని ఆకుపచ్చని అడవికి వొదిలి కాసేపు నిద్రతీసాను. 
 
కాటుకపల్లి రాగానే మెలకువ. ఏడుగుర్రాలపల్లి దాటినాక ఎడమ పక్కన, కుడిపక్కన, ఎదురుగా కొండ. ముందుకుపోయేకొద్దీ అడవి మరింత చిగురు పచ్చగా కనిపిస్తోంది. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు. సరివెల్ల, గంగనమెట్టు, చట్టి, చింతూరు.. ఆ ఊరిపేర్లు ఎంత ముద్దుగా అనిపించాయో ఆ గుడిసెలు అంతే ముద్దు. ఎదురొచ్చే బుజ్జిమేకలు ఇంకా ముద్దు.
 
చింతూరు ఇంకాస్త దూరం ఉండగానే శబరి పారే వంతెన ఒకటి కనిపించింది. వంతెనమీదికి నీళ్ళమీదకి  గిరికీలు కొట్టే పిట్టలు, పొద్దునే బడి గంట మోగుతుంటే బళ్ళోకి పరిగెత్తే పిల్లల్లా హడావిడిగా ఉన్నాయి. చింతూరు దాటితే పొంతనపల్లి, దబ్బగూడెం. చిగురుపచ్చాటి చింతలు, కోడిపుంజులు, బోరింగులు వాడుతున్న గూడెం ఇల్లు కనబడ్డాయి. తూలుగొండదగ్గర్లో దేవుడు ఓ కొండని గీశాడు. ఎద కొండ అని పేరు పెట్టుకున్నా.  నుకుమామిడి దాటుతుంటే సీతాకోకలు కార్ అద్దం మీదికి ఎగురుతూ వొచ్చాయి. ఆపైన మోతుగూడెం-డొంకరాయి దారంతా తుంపర. అనాదిగా ప్రపంచం మనిషితో పలకరిస్తున్న భాషలో మొదటి శబ్దం తుంపర శబ్దమేనేమో. ప్రియమైన మనిషెవరో చేయి పైకెత్తి గాలిలో వేళ్ళని ఊపి చిర్నవ్వినంత సుతారమైన పలకరింపు ఆ తుంపర. 
 
ముందుగా చూసింది ఫోర్ బే గ్రామం. (Fore bay-artificial pool of water in front of a larger body of water) చిలకపచ్చ దారిలో (*జలాశయాన్ని చుట్టూతా తడిమి చూడాలంటే ఎక్కడ ఎడమపక్కకి తిరగాలో కొత్తవాళ్ళకి తెలీకపోవొచ్చు) ఎడమపక్క డొంక తిరిగాము.. అలా  తిరగ్గానే ప్రపంచం మారిపోయింది. చినుకుల్లో, చిగురుల్లో సీలేరు విశ్వమోహనంగా కనిపించడం మొదలైంది
 
 ఆ జలాశయానికి ఎన్ని దిక్కులో అన్ని దిక్కులు తిరిగి చూడాలనుకున్నాము. కార్ ముందుకు పోయింది. ఎదురునుండి వస్తోన్న నీళ్ళన్ని  పవర్ కెనాల్ దగ్గరనుండి వస్తున్నట్టు అర్ధమైంది. ఆ వంతెన దగ్గర నీళ్లు మేఘం పగిలినట్టు పారడం చూసాను. అక్కడినుండి మలుపు. ఆ నీళ్ళమీద మనసు. 
 
మలుపు తిరిగి (౧) వెళ్తే  ఎత్తైన అశోక చెట్లున్న ఒంపు ఒక వ్యూ పాయింట్. అదీ దాటితే  ఫోర్ బే జలాశయం ఆనకట్ట. అక్కడ కిందికి దిగే దారి ఉంది. నీళ్లలోకి పోతే నీళ్లింకా వెచ్చగానే ఉన్నాయి. అదే మొదటి జల్లేమో బహుశా. కాసేపు నీళ్లు చల్లుకుని, చిన్న రాళ్లతో కప్ప గెంతులాడి కట్టమీదికి ఎక్కాం.
 
ముందైతే రిజర్వాయర్ వరకు చేరితే చాలనుకున్నాంగానీ, ఆ మట్టి కట్ట చివరకంటూ నడిచిపోతే అడవి కనబడింది. ఒక పక్క లోయ ఒక పక్క అడవి ఒక పక్క నీళ్లు. అరిస్తే లోయలో ప్రతిధ్వని వినిపిస్తోంది. ఇష్టమైన ఓ మనిషి పేరు అరిచి చూసాను. నా పిచ్చికి నాకే నవ్వొచ్చింది.
 
అడవిలోంచి Intake structure కి దారి ఉంది. ఒక మైలు దూరం నడవాలి. గుర్తు తెలీని పక్షుల అరుపుల అడవి ఒక పక్కన, ఆకాశం నేల మీద నిద్రపోతుందన్నంత నిర్మలమైన నీటి జలాశయం ఇంకో పక్కన…
 
దారిలో రాళ్ళని చెక్కి కట్టిన చెక్ పాయింట్స్ ఉన్నాయి. పచ్చటి చెట్ల తీరం నీళ్లలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఎండిమోడైన చెట్లు, వాటిపై నిల్చున్న పక్షి పాట ఎక్కణ్ణుంచి చూసినా లాగేసుకుంటుంది. చివరిదాకా పోతే  ఇరుపక్కల మెలికలు తిరిగిన దట్టమైన తీగచెట్లు. కూలిన వెదురుచెట్ల గడప. మరింత దట్టమైన అడవేమో అది. దానిపై నిల్చిపోయిన వాన చుక్కలన్నీ గడపమీది బొట్లలాగా ఉన్నాయి.
 
నడుస్తూ బోలెడు పాటలు పాడాను. అప్పటిదాకా కొండకి అటుపక్కన తిరుగుతున్న మేఘాలు వెనక్కి నడుస్తుంటే కొండమీదికి ఎగరడం చూసాను. అదంతా మబ్బుపుంత. దాన్ని పట్టుకోవాలని మనసు ఎగుర్తుంది. రెక్కలకింత సత్తువ రాగానే ఎగిరి చూద్దామనుకునే పక్షిపిల్లలా అంతులేని సంతోషం నన్ను ఆవరిస్తోంది. కొండరాలిన పసుపు ఎరుపు వర్ణాల పూధూళి, కాంతి జల్లెడపట్టినట్టు ఏర్పడే నదీచారికలు చేతులు పట్టి ఆపుతున్నాయి.
 
పవర్ కెనాల్ పక్కదారిలో డొంకరాయికి బయల్దేరాం. ఆ దారంతా నీళ్లవేగంతో పాటు మనసు చలిస్తుంది. దారిలో సరిగా పూర్తికాని ఒక స్టీల్ బ్రిడ్జ్ ఎక్కాను. ఇటునుండటు దాటాలని దాని మధ్యలోకి పోయినాక కళ్ళు తిరిగాయి. రైళ్లోపోతూ బయటికి చూస్తే భూమి వెనక్కిపోతున్నట్టు వొచ్చే ఫీలింగ్ అది. కిందకి చూడకుండా ఎదురుగా కొండని మాత్రమే చూస్తూ ఎలాగో వెనక్కి వొచ్చాను.  పవర్ కెనాల్ దారిలో ఒక లోయదగ్గర ఆ కాలువ ఎంత ఎత్తులో ప్రవహిస్తున్నదీ తెల్సింది. అక్కడే ఓ చిన్న ఊరు, మేఘం లాలపోస్తున్న కొండ ఒకటి కనిపించింది. ఫోర్ బే నుండి పవర్ కెనాల్ దారిలో డొంకరాయి చేరాం. ఒడియా కాంప్, సింధువాడ, గంగవాడ ఇంకేవో గూడేలు ఉన్నాయి. డొంకరాయి  దగ్గరలో ఉండగానే పైనుంచి దూకే పాలధార కనిపించింది. దాన్ని చూద్దామని మనసు ఉరకలు వేసింది.
 
టీ కోసం డొంకరాయి సెంటర్లో  ఆగాం. అక్కడి ప్రభుత్వ పాఠశాల భలే అందం. బడి అట్లా ఉంటే పిల్లలెవరు మానేయరుగావొచ్చు. ఇంకా పైకిపోతే కనిపించింది పాల నురగల సీలేరు. పూలమీదికి ఆదాటున వొచ్చిన తేనెపిట్ట తీరు ఒడుపుగా కిందకి దిగుతోంతది.   వంతెన మీద నడుస్తూ అటుపక్కకి పోయాం.అక్కణ్ణుంచి వ్యూ ఇంకా బాగుంది. రిజర్వాయర్ ఉన్నవైపు చినుకలవల్ల నీళ్ళలో రకాల రకాల ఆకారాలు ఏర్పడటం బాగుండింది. నీళ్ల మీద చినుకులు బుడగలు చేస్తుండటం, గాలి పట్టుమని పగలగొట్టడం చిన్నపిల్లల ఆటలా ఉంది.  చిన్న చిన్న దీవులు చూడముచ్చటగా ఉన్నాయి. కార్ ఎక్కబోతుంటే చెంగలువ దొరికింది.  ఆమె గుర్తొచ్చింది. 
 
దూకేనీళ్ళని కిందనుండి చూడాలంటే పాఠశాల ఎదురుగా ఉన్న దారిలో పోవాలి. వెనక్కి వొచ్చి ఆ దారిలో కిందకి దిగాం. నల నల్లని రాళ్ళమీద తెల తెల్లని నురగ. ఒకటే గేటు ఎత్తి ఉండటంతో బేస్మెంట్ పట్టుకుని సరిగ్గా నీళ్లు పైనుండి కిందకి దిగే చోటు దాకా పోయి ఆ శబ్దం , పైనుండి పడే నీళ్లు పూలుపూలుగా విచ్చుకోవడంచూసాను. భూమ్మీదనుండి ఆకాశంపైకి ఎగురుతున్న రాకాసి కొంగలాగా ఉందా తుంపర దృశ్యం. 
 
తిరుగుదారిలో మోతుగూడెం శివానందం హోటల్లో మంచి భోజనం చేసాం. అక్కడ ఇళ్ల తడికల్లో గోరింట పూలు పూసి ఉండటం చూసాను. ఆషాడ ఛాయ సంతరించుకున్న ఆకుని చూసాను. పాలుతాగే వయసుదాటినా ఇంకా అమ్మని వదలని చంటిపిల్లల్లా కొన్ని పచ్చి మామిడిపళ్ళు చెట్టుకు కరుచుకుని ఉండటం చూసాను. 
 
దిగేప్పుడు పుల్లూరు జలపాతం వెళదామని ఉన్నా దారితప్పడం వల్ల వెళ్లలేకపోయాం.  వెనకదారిలో భూదేవి పండగ జరుపుకుంటున్న గిరిజన స్త్రీలు దారికడ్డంగా నిల్చున్నారు. పాట పాడి తోచింది ఇచ్చిపొమ్మని అడుగుతున్నారు. ఇంతలూరువాగు, సుకుమామిడి, వాలుమారిగొంది…ఊరు ఊరికి ఒకసారి వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు. పాడుతున్నారు. అన్నలారా అని నవ్వుతున్నారు. భూమికన్నా ప్రాచీనమైన పాట ఏదో వాళ్ల గొంతులో వినిపిస్తుంది. భూదేవి పండగ  ఆఖరిరోజులు. పాలిపూలతో వాళ్ళ తలలు. పాట మాధుర్యంతో వాళ్ళ గొంతునిండిపోయాయి. రే రేలా  రేలా రెలా .. అన్న మూలధ్వని వాళ్ళ కంఠాల్లో అడవి జలపాతాన్ని తలపిస్తోంది. 
 
ఛట్టిదాక వెనక్కొచ్చి వొచ్చి కుంట దారిలో చత్తీస్గడ్ ప్రయాణమయ్యాము. కుంట ఆంధ్రాకి, ఛత్తీస్గడ్ సరిహద్దు. తారురోడ్డు మారి సిమెంట్ రోడ్ మొదలయే చోటు. హిందీ బోర్డులు, CRPF శిబిరాలు ఛత్తీస్ఘడ్ అని చెప్తా ఉన్నాయి. చకిల్ గూడా, మిస్మా, ధృవాపారా, దిక్పాల్, గగన్ పల్లి, మయూరాస్ కొని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి. దారి పొడుగూతా వాన. దారిలో ఓ చోట శబరిపక్కనే ఆగాము. స్నానం చేద్దామనుకున్న మనసొప్పలేదు. నీళ్లలోకి పోతా అంటే తోటివాళ్ళకి భయం వేసింది. అల్లనేరేడు పళ్ళని చూసి నాకు ఆనందమేసింది. సుక్మా దాకా పోయాం.  ఒకప్పడది దంతేవాడలో ఓ తాలూకా. ఇప్పుడు జిల్లా. టౌన్ అంత పెద్దదేం కాదు. అక్కడే రాత్రికి బస.  రాత్రి దారిపొడుగుతా దండకారణ్యం రారమ్మని నన్ను ఎత్తుకుపోవడం గుర్తొచ్చింది.  సీతాకోకలు కార్ మీదికి ఎగురుతూ వొచ్చిన దృశ్యం గుర్తొచ్చింది. తెలీకుండానే నిద్ర. నిద్రలో కనుమ.

***

దిక్తంత్రమిది ఆడు దివికి భువికీ మధ్య
భూతమై నువ్ పంచభూతమయ్యి

దిక్తంత్రులివి పాడు దివికి భువికీ మధ్య
లీనమై నువ్వాయులీనమయ్యి

దిజ్ఞ్నేత్రమిది చూడు దివికి భువికీ మధ్య
పాతమై నువ్వశనిపాతమయ్యి

ధారవై నువ్వాన
ధారవయ్యి

ప్రియసఖీ!
దిగ్మండలానివయ్యి

*****

Please follow and like us:

2 thoughts on “ట్రావెల్ డైరీస్ -3 (రే రేలా రేలా రెలా)”

  1. కథనం ఆసక్తికరంగా ఉంది. ఛత్తీస్ గఢ్ యాత్రకై ఎదురుచూస్తాము.

  2. సీలేరు,డొంకరాయి చూసిన ప్రదేశాలే.. వ్యాసం చదువుతూంటే మళ్ళీ పాతరోజులు గుర్తుకొచ్చాయి.
    చాలా బాగారాశారు.

Leave a Reply

Your email address will not be published.