కనక నారాయణీయం -10

పుట్టపర్తి నాగపద్మిని

 

   ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా??

    శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు తీరిన కాశీ పండితులని ముందే చెప్పుకున్నాం కదా!! ఆ నోటా యీ నోటా విన్న మరో సంగతి, వీరికి వనపర్తిలో గజారోహణ సన్మానం జరిగినప్పుడు, ఐదువందల రూపాయి నాణాలు కూడా బహూకరిస్తే,   అవన్నీ వారు సంతోషంగా పైకి వెదజల్లగా, అక్కడున్నవారందరూ ఏరుకోవటానికి పోటీ పడ్డారట!! అంటే, డబ్బు కన్నా విద్వత్తుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారా రోజుల్లో అని స్పష్టమౌతున్నది కదా!!

    అంతే కాదు రాఘవాచార్యులవారి తమ్ముడు గోపాలాచార్యులవారు కూడ సంస్కృతాంధ్రాల్లో గొప్ప పండితులట!! వీరుకూడా  అన్నగారితోపాటూ  పదునాలుగేళ్ళు  కాశీలో విద్యాభ్యాసం చేసి వచ్చారట!!  వీరు గొప్ప వ్యాకరణ పండితులట!! చమత్కార భాషణలకు అన్నదమ్ములిద్దరూ పేరెన్నిక గన్నవారట కూడా !!

     అంత పండిత కుటుంబానికి చెందిన భర్తకు యింత అమాయకత్వం, బుద్ధి మాంద్యం  ఎలా వచ్చాయో అర్థమయ్యేది కాదామెకు !! కానీ, అప్పటి సంప్రదాయాలకు ఎదురుపలికే పద్ధతి కలలోనైనా ఊహించని విషయం. మూర్తీభవించిన సహనమే శేషమ్మగారు. అందుకే, పల్లెత్తు మాట లేకుండా, భర్త తెచ్చిచ్చే నామ మాత్ర సంపాదనతోనే, బంధువుల ముందు కూడ కాపురానికి సంబంధించి ఒక చిన్న పాటి ఫిర్యాదూ లేకుండా, కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొచ్చిన తెలుగింటి ఇల్లాలు, మా అమ్మమ్మ శేషమ్మగారు.

   ఆడ పిల్లలకు సంబంధాలు చూడటం విషయంలో కూడా భర్త నుండి ఎటువంటి సహాయమూ ఉండేది కాదు. శేషమ్మగారే, అటు పుట్టిల్లో, అత్తిల్లో, లేదా తమ బంధువర్గం వారి సహాయంతోనో, సంబంధాలు చూడటం మొదలెట్టి, మొదటి కుమార్తె కనకవల్లి పెళ్ళినిలా చేయగలిగారు. భర్త దేశికాచార్యుల   పాత్ర ,   కేవలం పెళ్ళి పీటలమీద కూర్చోవటం మాత్రమే!!

   కుమార్తె కనకవల్లికి తమ వంశ సంప్రదాయాల ప్రకారం తిరుమల వంశం నుండే సంబంధం కుదరటం, అదీ  

  పుట్టపర్తి తిరుమలవారి సంబంధం ,  గండికోట   వైష్ణవ  పండిత కుటుంబం నుండే కుదరటం తమ అదృష్టంగానే తోచింది శేషమ్మకు!!

    ఇంతకూ, గండికోట వైష్ణవులంటే ఎవరు??  

     రాయలసీమ వైష్ణవులను గండికోట వైష్ణవులని పిలవటం అలవాటు. కారణం, విజయనగర రాజులు శ్రీ వైష్ణవ సంప్రదాయానుయాయులవటం వల్ల, శ్రీరంగం, మైసూరు ప్రాంతాలనుండీ, తిరుమల, చక్రవర్తుల, కందాడై వంటి కొన్ని వంశాల వైస్ణవ కుటుంబాలను కడప జిల్లా, జమ్మలమడుగు దగ్గరి గండికోట ప్రాంతాలలోకి రప్పించి, వారికి కొన్ని పొలాలూ, వైష్ణవ దేవాలయాలూ అప్పజెప్పి, యీ ప్రాంతాలలో వైష్ణవ సంప్రదాయ వ్యాప్తి కై తోడ్పడమని చెప్పారట!! గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధానమైన దుర్గం. అసలు పల్లవుల,   కల్యాణీ చాళుక్యుల  కాలం నుండీ కూడ, యీ ప్రదేశానికి గొప్ప చరిత్ర ఉందట!ఆ గండికోట దగ్గరే బుక్కపట్నం అనే ఊరు ఉంది. బుక్కపట్ణానికి దత్తాపురం చాలా దగ్గర. అది ఒకప్పుడు పెద్ద పట్టణమట!! వైష్ణవులకు ప్రధాన క్షేత్రం కూడా!! అందువల్ల ఇప్పటికి కూడా రాయలసీమ వైష్ణవులను గండికోట వైష్ణవులనటం కద్దు. అందువలనే అప్పట్లో రాయలసీమలో ప్రవేశించిన తిరుమల, చక్రవర్తుల, కందాడై వంటి వంశాల మధ్యే  వధూవరులను ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం కూడా ఉండేది.  

     విజయ నగర రాజులు చిత్రావతి నది తీరాల వెంబడి    కూడా   వైష్ణవులకు అనేక అగ్రహారాలిచ్చారట!! పెన్నా నది పొడవునా    శైవాగ్రహారాలుండేవట!! పెనుగొండ    తాలూకా లోని    చోగాపురం, వెంకటగారి పల్లె యీ రెండు గ్రామాలూ  పుట్టపర్తి  వారి కుటుంబానికి అగ్రహారాలుగా ఉండేవట కూడా! అందువల్ల    ఓ రకంగా పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారిది, పెట్టిపుట్టిన వంశమనే చెప్పుకునేవారు   అప్పట్లో!! బుక్కపట్నం, కొత్తచెరువు, మొదలైన గ్రామాల్లో విజయనగర రాజులిచ్చిన కొన్ని పొలాలను శ్రీనివాసాచార్యులవారు అమ్మివేసినా, ఎవో కొన్ని పుట్టపర్తి వారి వివాహం నాటికి ఇంకా వీరికే చెంది    ఉండేవట!!

శ్రీనివాసాచార్యులవారికి శిష్యార్జన కూడా ఉండేది అప్పట్లో!! రెడ్లు, కమ్మవారు, చాకలి, మంగలి వంటి కులాలవారికి శ్రీవైష్ణవ ధర్మాన్నిచ్చి, తిరుమంత్రం ఉపదేశం   చేసి,    సమాశ్రయణం (భుజాలపైన శంఖు చక్ర ముద్రలు వేయటం) చేయటం వంటివి చేసేవారన్నమాట!! ఇలా వీరి వద్ద    శ్రీ వైష్ణవం   తీసుకున్నవారిని అప్పట్లో    శ్రీ వైష్ణవ   నామధారులు అనేవారు!! ఇప్పటికీ, వైష్ణవ   ధర్మాన్ని అనుసరించే రెడ్డి, కమ్మ తదితర కుటుంబాలున్నాయి కదా!!

  శి ష్యార్జన ఉండటం అంటే, శ్రీకృష్ణదేవ రాయలవారి గురువైన శ్రీమత్తిరుమల తాతాచార్యుల వారి కాలం నుండే తిరుమల కుటుంబానికి సంక్రమించిన గొప్ప గౌరవమన్నమాటే కదా!! అందుకే శ్రీనివాసాచార్యులవారి ఇంట పగటి దివ్విటీలు కూడా ఉండేవట!! ఇంతటి గొప్ప కుటుంబం తమతో వియ్యమందటం వల్ల  .. ఈ నేపథ్యంలో పెద్ద కుమార్తె వివాహం, శేషమ్మ, దేశికాచార్యుల దంపతులకు తృప్తినిచ్చింది.

     పుట్టపర్తిని విపరీతమైన దగ్గు చాలాకాలంగా పీడిస్తున్న కారణంగా, ప్రొద్దుటూరిలోనే వైద్యం ఉండటం వల్లా, పెళ్ళైన తరువాత కొన్నిరోజులక్కడే ఉండిపోవలసి వచ్చిందని చెప్పుకున్నాం కదా!!  పైగా శిరోమణి కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది కూడా!! కానీ మదరాసు ఆకాశవాణికి ప్రసంగాలిచ్చేందుకు అప్పుడప్పుడూ వెళుతూనే ఉన్నారు పుట్టపర్తి.

సాహిత్యకారునిగా పుట్టపర్తికి ప్రొద్దుటూరు బాగా గుర్తింపునిచ్చింది. అప్పటికే అక్కడ, శివభారత కర్త శ్రీమాన్ గడియారం వెంకట శేష శాస్త్రిగారూ, రాణప్రతాప సింహ చరిత్ర కర్త దుర్భాక రాజశేఖర శతావధాని గారూ, ఇంకా జనమంచి శేషాద్రి కవి వంటి రాయలసీమ పద్య కవుల సాహిత్య పరిమళాలు ఎల్లెడలా గుబాళిస్తున్న వేళ కూడా కావటంతో, వయసులో వారికన్నా పిన్నవాడైన పుట్టపర్తికి కూడా కవిగానే కాక, అన్య్భాషా సాహిత్య ప్రవేశామున్న అరుదైన రచయితగా కూడా చక్కటి గుర్తింపు వచ్చింది త్వరగానే  రాయలసీమలో!! 

   అప్పట్లో, యీ కాలంలో వలె, ఎక్కువగా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ బైట ఉండేది కాదు కాబట్టి, రేడియో ప్రసారాలకు ఎక్కువ ప్రాచుర్యం ఉండేది. పైగా అప్పట్లో చెన్నైలో మాత్రమే ఆకాశవాణి   ఉండేది. దత్త మండలాలుగా తమిళనాడులో భాగంగా ఉన్నందున అక్కడ తెలుగు ప్రసంగాలలో పాల్గొనటం చాలా అపురూపమైన విషయం. అలా పుట్టపర్తి ప్రసంగాలను మదరాసు రేడియోలో

విన్నారు, అప్పటి ప్రొద్దుటూరు స్థానిక ఉన్నత పాఠశాల మేనేజరు కొప్పరపు సుబ్బారావు గారు!!           

   పుట్టపర్తి ప్రసంగాలతో ప్రభావితులైన కొప్పరపు సుబ్బయ్యగారు, వారిని ఆ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమించారు. ఆ పాఠశాల ప్రొద్దుటూరులోని రామేశ్వరం ప్రాంతంలో ఉండటం వల్ల, పుట్టపర్తి, అత్తవారిల్లు వదలి, రామేశ్వరంలో కాపురం పెట్టారు. అప్పట్లో వీరి జీతం నెలకు పదహైదు రూపాయలట!! ఆశ్చర్యం కదా!! ఆ జీతంలోనే సంసారం గడిపేవారట వారి శ్రీమతి కనకమ్మ గారు!! అప్పటి రోజులలో ధరలు తక్కువగా ఉండేవి. ఆడంబరాలకు తావులేని సామాన్య జీవితాలు కావటంతో, ఆ పదహైదు రూపాయలలోనే, ప్రతి నెలా తన జీతంలో ఒక రూపాయిని అదే పాఠశాలలో చదువుకునే ఒక బీద విద్యార్థికి పుస్తకాలకోసం ఇచ్చేవారట కూడా!! అంతే కాదు, ప్రతిరోజూ ఒక బీద విద్యార్థికి, ఇంట్లో భోజనం కూడా పెట్టేవారట!!

   తిరుపతిలో శ్రీకారం చుట్టబడిన షాజీ కావ్యం, పూర్తై, 1936 వ సంవత్సరంలో ముద్రింపబడటం, ఆ కావ్యం మదరాసు విశ్వవిద్యాలయం వారి ఇంటర్ మీడియట్ కు పాఠ్యాంశంగా ఎన్నుకోబడటం ఒక గొప్ప గుర్తింపునిచ్చింది పుట్టపర్తికి!! ఇప్పుడు కనకవల్లీ సమేత పుట్టపర్తి నారాయణాచార్యవర్యునికి కి యీ గౌరవం దక్కటం, వారి భావి జీవన యాత్రకు ఒక శుభ సూచకమనే చెప్పాలి కదా!!

   ఇలా అటు సాంసారిక జీవితం, ఇటు ఉద్యోగ జీవితం తో పాటూ, సాహిత్యోపాసనలోనూ సంతోషకర జీవితం గడుపుతున్న తరుణంలో ప్రొద్దుటూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరీ స్థానికోన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ రామాచార్యులవారు మరణించారు. ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. అప్పుడు శ్రీ కొప్పరపు సుబ్బయ్యగారు, శ్రీ పుట్టపర్తిని ఆ పోస్టులో నియమించారు – ఒక షరతు మీద!! త్వరలో యీ పోస్టుకు వలసిన విద్వాన్ పరీక్షలో మీరు ఉత్తీర్ణులవ్వాలన్నదే ఆ షరతు!!  

   పుట్టపర్తి వారు మదరాసు విశ్వవిద్యాలయానికి దరఖాస్తు పెట్టుకున్నారు – విద్వాన్ పరీక్ష వ్రాసేందుకు !! పాఠ్యాంశాల వివరాలు చూస్తే ఏముంది!! ఆశ్చర్యం!! అద్భుతం కూడా!! వీరు రచించిన ‘పెనుగొండలక్ష్మి ‘ కావ్యం, ఒకానొక పాఠ్యాంశం ఆ విద్వాన్ పరీక్షలో!!

 తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య లోకంలో పాకి పోయింది. ఏమిటేమిటీ?? పుట్టపర్తి నారాయణాచార్యులనే యువ కవి వ్రాసిన కావ్యం, విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? అతడు ప్రొద్దుటూరు వాసి కావడమేమిటి?? పైగా అతడే విద్వాన్ పరీక్షలు హాజరుకాబోతుండటమేమిటి?? అన్నీ ఉత్కంఠభరితమైన ప్రశ్నలే!! ప్రశ్నలమీద ప్రశ్నలు!! ఈ వార్త, తక్కినవారి వలె, పుట్టపర్తికీ కొత్త వార్తే!! కారణం, కావ్య రచన మాత్రమే తమ పని అనీ, దాని భావిని నిర్ణయించేది, ఆ కావ్య ప్రమాణాలేనన్న దృఢ విశ్వాసం గలవారు పుట్టపర్తి కావటమే!!  కాకపోతే, వారికి ఇది భగవంతుని లీల వలె మాత్రమే తోచింది!! వారి పెదవులపై ఒక సన్నని చిరునవ్వు మా త్రమే తొంగిచూసింది!! ఆ తరువాత??

(సశేషం)

****

ఫోటో వివరాలు :

చారిత్రక ప్రసిద్ధినొందిన గండికోట క్షేత్ర శిధిలాలు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.