బాలబాబు-బుజ్జి అత్త

-యశస్వి

ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారి
ఇప్పుడు అంపశయ్య ఎక్కి 
బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది
 
నిన్నటి వరకూ 
నిలిచోడం ఆమె యుద్ధం,  
పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..
పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,
కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే
 
మంచాన పడ్డ పెనిమిటిని  
పసిపిల్లాడిలా సాకిన గట్టిమనిషే
కట్టుకున్నోడ్ని కాటికి అప్పజెప్పాక 
పట్టు వదిలేసిన ఒళ్లాయే; ఆపై తలతిరిగి   కూలబడి పోతుండేది 
ఎముక లేనట్టు వండి వడ్డించిన చేయి 
వందల సార్లు జారి కిందపడ్డందుకు జబ్బ జారిపోయింది
 
కొడుకులు పురిట్లోనే పోయినా 
అడుగు దూరం నుంచి ప్రేమించే కూతుళ్ళున్నారు;
అత్తను  ఆడిపోసుకునే ఈ అల్లుడ్ని ఒప్పించి 
ఇంటికి  పెంచుకుందామని బొమ్మలా వెంట తెచ్చుకున్నారు
 
ఒకప్పుడు ఆమె ఒంటి బంగారం వెలవెలపోయే పసి నిమ్మపండు ;
ఇప్పుడు పెందలకడనే  వడిలిపోయిన  తోటకూర కాడ, 
ఆ చేతిముద్ద తిన్నవారి కంచం, గిన్నెలు  కడిగిన ఆనవాళ్ళు 
అడుగు అడుగు కి పడగొట్టేసే అరిగిన మోకాళ్ళు, మడమలు..
 
ఆవిడంటే నాకు ఇప్పటికీ కినుకే;
కన్న నలుసుల్ని నయగారంగా  పెంచి పాడు చేసిందని,
ఎన్నెన్ని  రుసరుసలని మోసిందో, కాసిందో గుట్టుగా..
పాపల్ని  పల్లెత్తుమాట  పడ నివ్వని ఈ పొడపాము..
బుస మానేసి నా మాటమాటకీ నాగస్వరం విన్నదానిలా ఊ!కొడుతుందిప్పుడు..
 
ఇప్పుడు నేను ఆమెకు గుప్పెడు బువ్వను నోటికి అందించే చంచాని,
దాహానికి నాలుక తడిపే గ్లాసుని, 
 స్నానానికి ఒంటిన అరిగే సబ్బుని, తడి తుడిచే తువ్వాలునీ.. 
వేసే అడుగులకు పడిపోకుండా  నిలబెట్టే నడుంకట్టుని.
ఆమె అవసరాలను తీర్చలేని అమ్మాయిల పాలిట ఓ బండతిట్టుని
 
ఆమె నా అమ్మ కాదు; అయినా తిట్లు భరిస్తుంది
నా కూతురు కాదు; మొట్టినా సహిస్తుంది
అవసాన బాధలు భరించలేక  అరకొరగా అరుస్తుంది.. ఎవరన్నా వింటే
తలవంపులు; అరవకండీ!!  అంటే 
ఏం చేయను!! అన్నట్టు తేరిపార చూస్తుంది
 
ఏ పనిలోనో, నిద్రలోనో ఉన్నప్పుడు ఏదో చెప్పాలనిపించి బాలబాబుని  పిలుస్తుంది.  
నా అసలు పేరు మరిచేట్టు  నామ జపం చేస్తుంది. 
ఏంటని! అడిగితే.. మంచినీళ్ళనో, మరేదో అడగాలని  
మర్చిపోయాననో.. అంటుంది
 
ఆమె అప్పుడప్పుడు పక్క తడిపే పసిపిల్ల..
నేను ఆమె పళ్ళుతోమే పందుంపుల్ల,
తెరవని నోటిని విసిగించే నాలిక బద్ద,
ఆమె నే అన్నం తింటుంటే నోట్లో పెట్టమనే పచ్చడిముద్ద
 
జుట్టు చేతికిచ్చి, నే కత్తిరిస్తున్నా కదలని   బొమ్మ 
నా గడ్డంలో చేయిపెట్టి  బుగ్గ నిమిరే బామ్మ
నా ఒళ్ళు వెచ్చగా ఉంటే తల్లడిల్లే తల్లి
 
ఎందుకే బుజ్జీ!! అస్తమానం నన్నెందుకు కలవరిస్తావు! అంటే ..
నాకూ, కూతుళ్ళకి నువ్వే కదా దిక్కూ!! అని ఆలకించమంటుంది
ఏమి చెయ్యలేని నిస్సహాయతే కదా ఇది!! అంటే 
అంత మాటనకు బాబూ; నీ తరువాతే నాకెవరన్నా 
అంటుంది  నైటీ కూడా తొడుక్కోలేని  టైటానిక్ సుందరి
 
నిన్ను ఏడిపిస్తున్నా కదా! దేవుడి సంగతి వదిలేయ్,
ఏనాటికన్నా నన్ను క్షమిస్తావా!! – అడిగాను బుగ్గమీద ఒక్కటిచ్చి.. 
చచ్చిపుట్టినా నువ్వే అల్లుడై రావాలని  కోరుకుంటా.. అంటుంది 
బుగ్గ రుద్దుకుంటూ  పిచ్చితల్లి
 
ఎంత ఆశే బుజ్జీ! మీకే సేవలు చేయాలా!!
మా అమ్మకు నే వద్దా! అంటే;
ఆవిడకి ఏనాడు   చేయించుకునే అవసరం 
రాకూడదమ్మా! అనుకుంటుంది
 
మా అమ్మ మోకాళ్ళు చల్లగుండ అనుకున్నా నాబుజ్జికో దండంపెట్టి
ఈ రాతనంతా వినిపించా బుజ్జికి.. 
అంతే కదా, అంతే కదా అంటుంది కాంతి తగ్గిన కళ్ళని మూసుకుంటూ

*****

Please follow and like us:

One thought on “బాలబాబు-బుజ్జి అత్త (కవిత)”

  1. నెచ్చెలి కి కృతజ్ఞతలు
    అబల మీద సబల కవిత ప్రచురించినందుకు..

Leave a Reply

Your email address will not be published.