జగదానందతరంగాలు-6

హెల్మెట్ లేని ప్రయాణం

-జగదీశ్ కొచ్చెర్లకోట

‘అయిపోయింది సార్, మీరిక బయల్దేరండి! స్కిన్ ఒకటేగా? వేసేస్తాను. మీకు మళ్లీ లేటవుతుంది!’ డాక్టరమ్మ ఉదారవాదానికి ఉప్పొంగిపోతూ డ్రెస్ మార్చుకోడానికి గదిలోకొచ్చాను.

తెల్లారే వచ్చేశా హాస్పిటల్‌కి. ఎమర్జన్సీ అన్నాక తప్పదుగా! ఆపరేషన్ చివర్లో ఓ రెండు మూడు కుట్లుండగా పేషెంట్ పరిస్థితి బానేవుందని రూఢీ చేసుకుని ఇంటికి బయల్దేరడం మాకు మామూలే!

బట్టలు మార్చుకుని అద్దం ముందు నిలబడి చూసుకున్నాను. ‘పొట్టైపోయావు కాబట్టి సరిపోయింది. ఇంకొక్క రెండంగుళాలు హైట్ ఉండుంటే నిన్నసలు పట్టుకోలేకపోయేవాళ్లం!’

పెళ్లైన నెలరోజుల తరవాత ‘ఇక ఫరవాలేదు. వీణ్ణి ఏదైనా అనొచ్చు!’ అని నిర్ణయించుకున్న తరవాత తను మొట్టమొదటి సారిగా కొట్టిన డైలాగది!

అప్పట్నుంచి గడిచిన పాతికేళ్లుగా రోజూ వింటున్నా ఆ డైలాగ్. తనందని కాదుగానీ, మగాళ్లన్నాక కాస్త ఐదున్నరైనా ఉండాలబ్బా! పై గూళ్లలో పెట్టిన పుస్తకాల కోసం ప్రతిసారీ చిన్న స్టూలొకటి తెచ్చుకోవడం, మర్నాడుదయం తను ఇల్లంతా తిరుగుతూ ఆ బల్ల కోసం వెతుక్కోవడం ఒలింపిక్ ఆటైపోయింది మాయింట్లో!

ఆమధ్య రీడర్స్ డైజెస్ట్ లో చదివాను, పొడుగ్గా ఉన్నవాళ్లు రోడ్డుమీద చాలా నిర్లక్ష్యంగా బండి నడుపుతార్ట! అది చదివిన రోజునుంచీ స్పీడుగా వెళ్లే వాళ్లందర్నీ గమనించడం మొదలెట్టాను. దాదాపుగా అందరూ నాకన్నా పొడవైనవాళ్లే! ఈమాటే తనతో చెప్పాను. తను నావైపు జాలిగా చూసి ‘నువ్వేమన్నా స్టాండర్డా హైటుకి? నీతో పోల్చుకుంటావేంటి?’ అని మన హైకోర్టులా ఇట్టే కొట్టిపడేసింది.

నా అభిమాన నటుడు చంద్రమోహనని; గోపీచంద్, వినోద్ కుమార్, మహేష్ బాబు, వేణు… ఇలా పొడుగ్గా ఉండేవాళ్లెవరూ నాకు నచ్చరనీ మీకీపాటికే అర్ధమైపోయిందనుకుంటా! అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం అటువంటి తేడాలు పాటించలేకపోయేవాణ్ణి. మరీ పూర్ణిమ, సంయుక్త లాంటివాళ్లతో సరిపెట్టుకొమ్మంటే కష్టం కదా?

అయినా ఇలా నలుపు, తెలుపు, పొట్టీ పొట్టా…సారీ.. పొట్టీ పొడుగూ.. ఇటువంటి శారీరకమైన లక్షణాల గురించి మాటాడుకోకూడదు. ఎవరికుండేది వాళ్లకుంటుంది అనుకుని మళ్లీ అద్దంలోకి చూసుకున్నాను.

ఈ సర్జరీలకి క్యాప్ పెట్టుకున్న ప్రతీసారీ మొత్తం జుట్టంతా మంటపెట్టడానికి పేర్చిన చెరుకుపిప్పిలా ఒక మూలకెళిపోతుంది. అరచేతిని దువ్వెనగా మార్చి జుట్టుని రెండు భాగాలుగా విభజించాను. ఒకవైపు ముప్పావు, మరోవైపు పావూ సర్ది, మాస్టర్ రామూలా తయారై బయటికొచ్చాను.

ఏంచేస్తాం, మనకేమో జేబుల్లో దువ్వెనలవీ పెట్టుకుతిరిగే అలవాట్లేవీ లేవు. మావాడొకడైతే ఏకంగా పౌడర్ డబ్బాలు, ఫెయిరండ్ లవ్లీలూ మోసుకు తిరుగుతూ ఉంటాడు. ఎవడి బాధ వాడిది. వాడసలు ఫోన్ ఛార్జరే తేడు. నేను ఇంటిదగ్గర బయల్దేరేముందు ఛార్జర్ పెట్టుకోకపోతే లోపల ‘ఏదో’ వేసుకోకుండా బయటికొచ్చేసినట్టు అసౌకర్యంగా ఫీలవుతాను.

బూట్లేసుకుని సరిగ్గా బయల్దేరబోతూ ఉండగా ఫోన్ మోగింది. ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసుందనీ, వీలైనంత త్వరగా వచ్చెయ్యమనీ!

ఇపుడెలా? సాధారణంగా ఇంటికెళ్లి బండి పెట్టేసి, కార్ తీసుకుని వెళతాను ఆ హాస్పిటల్‌కి. ఇప్పుడంత టైమ్ లేదు. సరే, ఏదైతే అదే అయిందని బండి మీదే బయల్దేరాను. ఇదే ఈ కథకు మొదలు!

మనకొక చిన్న ఇబ్బందుందిలెండి. అదేంటో తరవాత చెప్తాను.

తెల్లవారుజామున ఈరోడ్లో కారుమీద ప్రయాణం చాలా ఆహ్లాదకరమైన అనుభూతి. చుట్టూ కొండలు, గుబురుగా బోల్డన్ని చెట్లు, దారంతా పచ్చగా ఉంటుంది. కానీ ఇవాళ బండిమీద కాస్త కంగారుగా అనిపిస్తోంది. లారీల వాళ్లు లాక్కెళిపోయేలా ఉన్నారు. అచ్చోసిన ఆర్టీసి బస్సులైతే సరేసరి, మీదమీదకొచ్చేస్తున్నాయి.

ఎలాగూ నేను హైట్ ఉండను కాబట్టి నెమ్మదిగానే వెళ్తున్నాను. రెండు కిలోమీటర్లు వెళ్లిన తరవాత ఒకదగ్గర పోలీసులు అందర్నీ ఆపుతూ ఫొటోలు తీసుకుంటున్నారు. నన్ను ఆపరనే అనుకుంటూ ‘గువ్వలా ఎగిరిపోవాలీ!’ పాట విజిలేసుకుంటూ వెళిపోతున్నాను.

కానీ నన్నూ ఆపారు. ఏదైతే అడక్కూడదో అదే అడిగారు.

హెల్మెట్!

‘హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లడం తప్పని తెలీదా? ఎక్కడికి బయల్దేరారు?’ అంటూ చాలా రొటీన్ డైలాగ్ కొట్టాడతను. కొంచెం కంగారులో ఉండడంవల్ల పెట్టుకోలేదని చెప్పాను. దాంతో మరింత రొటీన్లోకి దిగిపోయి అడగాల్సిన రెండు ప్రశ్నలూ అడిగేశాడు.. ఏంటో తెలుసుగా?

‘కంగారులో ఏది మానేశారు?

అన్నం తినడం మానేస్తారా?

నీళ్లు తాగడం మానేస్తారా?’

చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇంతే, హోమ్ వర్క్ చెయ్యకపోతే ఎప్పుడూ ఇవే ప్రశ్నలు, ఇదే సాధింపు…. అన్నం మానేశావా, నీళ్లు మానేశావా అంటూ! కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉండే టీచర్ ఒక్కరంటే ఒక్కరూ తగల్లేదు నాకు.

ఆయన వినేట్టులేడని అర్ధమైంది. జేబులోంచి సెల్ తీస్తున్నాడు ఫొటో తీసుకుందామని. ఫొటో కదా అని నేను మళ్లీ తల దువ్వుకోడం మొదలెట్టాను. కానీ అతని మొహం చూసి ఆపేశాను. ఇక లాభంలేదని అప్పటివరకూ అవసరానికై అంగోస్త్రంలో దాచుంచిన అణ్వాస్త్రాన్ని బయటికి తీశాను…

‘నేను ఘోషా హాస్పిటల్ డాక్టర్నండీ, తెలుసా?’ అన్నాను.

ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం. ఎగురుతున్న పక్షులన్నీ ఒక్క క్షణం ఆగినట్టు, రోడ్డుమీద వెళ్లే వాళ్లందరూ ఆగిపోయి నావైపు చూస్తున్నట్టూ, అక్కడున్న పోలీసులందరూ భూమి దద్దరిల్లేలా కాలు కిందకొట్టి సెల్యూట్ చేసినట్టు.. ఒక అద్వితీయమైన భావన. కానీ వెంటనే ఆ దృశ్యం కాస్తా భళ్లుమంటూ బద్దలైపోయింది.

అతను కళ్లజోడు తీసి సుతారంగా తుడుచుకుంటూ ‘డాక్టర్ అయుండీ ఒకరికి చెప్పాల్సిందిపోయి మీరే హెల్మెట్ పెట్టుకోకుండా వస్తే ఎలాసార్?’ అంటూ ఇంకా రొటీన్లోకి దిగిపోయాడు. నాకసలు ఎప్పటికీ నచ్చని ఏకైక పదం.. రొటీన్!

మా డాక్టర్లు కూడా అంతే! ‘రొటీన్ టెస్టులన్నీ చేయించేద్దాం!’ అంటారు. రొటీనేంటసలు? కాస్త ‘తేడా’గా ఉండొద్దూ మనిషన్నాక?

ఇక ఇతగాడు వదిలేలా లేడని నాకర్ధమైపోయింది. ఎన్నాళ్లనుంచో దాచిన రహస్యం, ఎవరితోనూ పంచుకోలేని ఖేదం ఇతను నాచేత బయటపెట్టించేందుకే ఇవాళిలా మాటువేసి, మాటాడించాలని చూస్తున్నాడని తెలిసిపోయింది.

ఇప్పుడు నా నోటివెంట ఏ సమాధానం వస్తుందా అని అతను చూస్తోంటే మెల్లిగా చెప్పాను…

‘నాకు హెల్మెట్ పట్టదండీ!’

‘ఏంటీ?’ అన్నాడు జూమ్ చేస్తున్న ఫోన్ని కిందకు దించి.

‘అవును. నాకు హెల్మెట్ పట్టదు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.’ అన్నాను ఛాలెంజింగా!

‘రేయ్, అదిటివ్వరా!’ అని పక్కనున్న ఇంకో కానిస్టేబుల్ హెల్మెట్ తీసుకుని నాకు పెట్టబోయాడు.

‘సార్, పెట్టాక తియ్యడం కుదరదు. దాంతోనే వెళిపోతాను. ఆనక మీరే బాధపడతారు!’ అని హెచ్చరించాను.

‘ఊర్కోండి సార్! ఇది ఎక్స్‌ట్రా లార్జ్ సైజు హెల్మెట్టు. ఎందుకు పట్టదో నేచూస్తాగా? మీరుండండి!’ అంటూ చనువుగా పెట్టబోయాడు. చుట్టూ ముగ్గురు కానిస్టేబుల్స్ మావూరి పైడితల్లి సిరిమానోత్సవం చూస్తున్నట్టు ఆసక్తిగా చూస్తున్నారు.

‘సిచ్యువేషన్ మీకర్ధం కావట్లేదు. చిన్నప్పుడు స్కూల్లో నాటకాలవీ వేసినప్పుడు కూడా అజ్ఞాతవాసం చేసే పాండవులు, అరణ్యవాసం చేసే రాముడు, అప్పుల పాలైపోయిన హరిశ్చంద్రుడు.. ఇలా కిరీటం లేని వేషాలే వేసేవాణ్ణి! నామాట విని ఈ ఆట ఇక్కడితో ఆపేద్దాం!’ అని బుజ్జగించాను.

అయినా వాళ్లు హెల్మెట్ పెట్టడం మానలా!

అదంత సులువుగా దిగిపోతే ఈ కథంతా ఎందుకు? ఆ శిరస్త్రాణం నా శిరస్సుతో రణం ప్రకటించింది. ‘దిగనంటే దిగనంతే!’ అని మొండిగా నెత్తినెక్కి కూచుంది.

అప్పటికీ అతనికి అనుమానం రాలేదు. ఇంకొకతన్ని సాయం తెచ్చుకుని ఎలాగైతేనేం బలవంతంగా దింపేశాడు. పట్టేసింది. అక్కడున్నవాళ్లంతా పొడుగ్గా ఉన్నారన్న విషయం అప్పుడు గమనించాను. అందుకే అంతంత పొగర్లు.

‘ఏంసార్, పట్టదన్నారూ? ఇప్పుడేమంటారు, ఎలావుందంటారు?’ అంటూ మళ్లీ రొటీన్ డైలాగొకటి కొట్టాడు.

నేనేమీ మాటాడలేదు. మాటాడేలా లేదక్కడ. శాపవశాత్తూ బండరాయిగా మారిన అహల్యలా ఉంది నా పరిస్థితి. తల అటూఇటూ కదలట్లా! ఎటు చూడాలన్నా మొత్తం మనిషినే తిరగాల్సొస్తోంది.

హెల్మెట్ మీద టింగ్ టింగ్ అంటూ కొట్టి తియ్యమని చెప్పాను. వాళ్లు ఒక్కచేత్తో లాగాలని ప్రయత్నించారు. అదంత సులువుగా వచ్చేస్తుందా? మళ్లీ ఆ విష్ణుమూర్తి రామావతారమెత్తి తాకితే తప్ప అది ఊడొచ్చేలా లేదు. వాళ్లు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి చెరోవైపూ నిలబడి ‘గట్టిగలాగూ హైస్సా.. జోరుగలాగూ హైస్సా!’ అంటూ పాటందుకుని ఉత్సాహంగా లాగబోయారు.

ఎంతసేపూ రొటీన్ గా కేసులు రాయడం, ఫొటోలు తియ్యడంతో విసుగెత్తి ఉన్న వాళ్లందరికీ ఇదంతా చాలా సరదాగా ఉంది. నవ్వుతూ లాగుతున్నారు. అయినా రాలా!

అప్పుడు జరిగింది. నేనేదైతే జరక్కూడదని అనుకుంటున్నానో అదే జరిగింది…

నా ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచి. ‘ఇంకా రారేం? పిలుపు తక్కువైందా?’ అనడుగుతున్నారు!

జరిగిందంతా ఏడుపుగొంతుతో చెప్తున్నాను. నేను వాళ్లు పెట్టని బాధలు కూడా కల్పించి చెప్తోంటే నావైపు కోపంగా చూస్తున్నారు. మొత్తానికి వాళ్లకి నా పరిస్థితి అర్ధమైందనుకుంటాను. ఈసారి కాస్త శ్రద్ధ వహించి ప్రయత్నం చేసి హెల్మెట్ తీసేశారు.

‘నేనే గెలిచాను రామ్మోహన్రావ్!’ అంటూ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిలా పక్కనే కనబడుతున్న చిన్నపాటి కొండమీదకెక్కి సూట్ కేసు విసిరేద్దామనుకున్నాను కానీ అందులో అన్నీ ఛార్జర్లు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఉంటాయని గుర్తొచ్చి ఆగిపోయాను.

వాళ్లందరూ నావైపు చూస్తున్న చూపులకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత, అగత్యం, నా తలకాయ ఉందన్న విషయం గుర్తొచ్చి చెప్పడం మొదలెట్టాను.

‘మాయింట్లో అందరికన్నా నా హెడ్డుకి వెయిటెక్కువ! మా హాస్పిటల్లో అందరికీ పెద్దతలకాయని నేనే!’ అని నవ్వేశాను.

‘సార్! ఈసారి మీరొక సర్టిఫికెట్ జేబులో పెట్టుకుని తిరగండి! అంతేగానీ ఇలా ఆపిన ప్రతిసారీ ఇంత టెన్షన్ నే భరించలేను. మీకేఁవన్నా అయితే నా గతేంకాను?’ అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు.

‘ఛ, ఊరుకోండి! చిన్నపిల్లాళ్లా ఏంటది? అలాగే, ఈమారు డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని బండిలో పెట్టుకుంటా!’ అని ఊరుకోబెట్టా!

’అసలు నాకు యవ్వనంలో ఉన్నప్పుడు తరచుగా వస్తూండే కల గురించి చెప్పాలి మీ అందరికీ. పేద్ద మోటర్ సైకిల్ మీద నల్లగా నిగనిగలాడే హెల్మెటొకటి పెట్టుకుని ఎవరూలేని రోడ్డుమీద ఎనభై స్పీడులో వెళిపోతున్నట్టు కలొచ్చేది. మళ్లీ బండి దిగాక ఆ హెల్మెట్ చేత్తో పట్టుకుని నడుస్తున్నట్టు, ఎవరింటికో వెళ్లి అక్కడ మర్చిపోయి వచ్చేసినట్టు కూడా కలలొచ్చేవి. దీన్దుంపతెగ! ఎవడికైనా వయసులో ఉండగా తన సోల్మేట్ గురించి కలలొస్తాయి. కానీ నాకుమాత్రం ఈ హెల్మెట్ల హెల్ ఏఁవిటో!’ అంటూ బండి స్టార్ట్ చేశాను.

వాళ్లందరూ ఇంకా అలా అవాక్కై చూస్తుండగానే ‘ఎదురే నాకులేదు.. నన్నెవరూ ఆపలేరు!’ అని పాడుకుంటూ ముందుకెళిపోయాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.