రమణీయం

బుద్ధుని జీవితం-ధర్మం-2

-సి.రమణ 

బుద్ధ గయలో, నెరంజరా నది ఒడ్డున, ఒక రావి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగింది  సిద్ధార్థు డికి. ప్రజల వేదనలకు, బాధలకు హేతువు కనుగొన్నాడు. వాటికి మూల కారణం తెలుసుకున్నాడు. దాని నివారణ మార్గం ఆవిష్కృతమైన తరువాత, తాను తెలుసుకున్న సత్యాలను, ప్రజలకు బోధించి, వారి  బాధలను తొలగించి, వారికి ముక్తిమార్గం  చూపించాలని అనుకున్నాడు. కానీ  అవి  సామాన్య ప్రజలకు అర్థం అవుతాయా, అని సందేహం కలిగింది. ఈ సత్యాలు ముక్తికి సోపానాలు అయినప్పటికీ, ప్రాపంచిక రాగద్వేషాలలో మునిగి ఉన్న జనులు, అవిద్య, అజ్ఞానం అనే వలలో చిక్కుకుని ఉన్నారు. అటువంటి తరుణంలో, వారి జీవన విధానానికి వ్యతిరేకదిశలో పయనించే, తన బోధనలు ఎలా అర్థం చేసుకోగలరు? వారికి అర్థమయ్యేలా బోధించాలా, లేక తనకు తెలిసింది చెప్పాలా? తన దగ్గరికి వచ్చిన వారికి బోధించాలా, లేక తానే వారి వద్దకు వెళ్లి బోధించవలెనా? (ఆ కాలంలో గురువులు అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మించుకుని, తమ వద్దకు వచ్చిన వారికి  విద్య బోధించే వారు) అన్న సంశయాత్మక  ప్రశ్నలతో, కొద్దికాలం పాటు ఆలోచించాడు. ఎన్నో కష్టాలు అధిగమించి కనుగొన్న మహా సత్యాలు, ఎంతో విలువైనవి అయినప్పటికీ, సామాన్యులు అర్థం చేసుకోవటం అంత సులభం కాదు .అలాగే కార్య, కారణ సిద్ధాంతాలతో కూడిన నూతన ధర్మాన్ని ప్రజలకు వివరించడమూ అంతా సులభం కాదు.  ఈ కార్యసాధనలో ఒకవేళ తాను విఫలమైతే, మిగిలేది నిరాశ, నిస్పృహలే. 

స్వార్ద చింతన లేని మహోన్నత మానవీయ గుణ సంపన్నుడైన బుద్ధుని మనసులో, మానవాళి పట్ల అపారమైన కరుణ జనించింది. పలు దుఃఖాలలో ఉన్న జనులకు ముక్తి మార్గాన్ని బోధించడమే  సర్వోత్తమమని తలచి, సమస్త మానవాళికి తను కనుగొన్న ధర్మాన్ని  వారి భాషలోనే (ఆ కాలంలో ధార్మిక భాష సంస్కృతం. ప్రజల వాడుక భాష పాళీ అని, చారిత్రక, పురాతత్వ శాస్త్ర ఆధారాలనుబట్టి తెలుస్తుంది) బోధించాలని నిర్ణయించుకుని, కాశీ నగరానికి కాలి నడకన  బయలుదేరాడు. 

కాశీ నగర  సమీపాన,  ఋషిపట్టణంలోని (నేటి సారనాథ్) జింకల వనంలో,  తన పూర్వ సహచరులైన పంచ వర్గీయులకు, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, మొదటి  ధర్మోపదేశం “ధర్మచక్ర ప్రవర్తన” (ధర్మం అనే చక్రాన్ని ముందుకు నడిపించడం) సూత్రాన్ని బోధించాడు. అందులో వారికి చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గాన్ని వివరించి, వారిని తొలి శిష్యులుగా స్వీకరించాడు. దీనితో బౌద్ధ సంఘానికి అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో 55 మంది సంఘంలో చేరారు. తథాగతుడు సుశిక్షితులైన అరవై మంది శిష్యులను, ధర్మ బోధకులుగా, వివిధ ప్రాంతాలకు వెళ్లి, ధర్మబోధ చేయమని ఆదేశించాడు.

గౌతమ బుద్ధుడు తన అంతః మనసుతో స్వయంగా తెలుసుకున్న నాలుగు ఆర్య సత్యాలు (“అరియ సచ్చాని” అంటారు పాళీ భాషలో) బౌద్ధ ధర్మానికి మూలస్తంభాలు. వాటిని ఆర్య సత్యాలు అని ఎందుకు అన్నారంటే, గొప్ప అరియ (శ్రేష్టుడు) వాటిని కనుగొన్నాడు కాబట్టి.

ఒకటవ ఆర్య సత్యం:     దుఃఖం

 రెండవఆర్య సత్యం:      దుఃఖ సముదయ (దుఃఖ కారణం)

 మూడవ ఆర్య సత్యం:    దుఃఖ విచ్ఛేద (దుఃఖ నివారణ)

 నాల్గవ ఆర్య సత్యం:       దుఃఖ విచ్ఛేద మార్గం (దుఃఖ నివారణ మార్గం)

మొదటి  ఆర్య సత్యం: దుఃఖం ఉంది. (దు= కష్టం, ఖ= సహించటం) దుఃఖం అంటే సహించడం కష్టమైనదని అర్థం. పుట్టుక, వ్యాధి, వార్ధక్యము, మరణమువంటివి అనివార్య దుఃఖాలు. ఏ మానవుడు అనివార్యమైన ఈ దుఃఖాలకు అతీతుడు కాదు. సామాన్యులు సుఖ దుఃఖాల ఉపరితలాన్ని మాత్రమే చూస్తారు. ధర్మోపాసకులు జీవితాన్ని యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. వారు శారీరక కామ సుఖాన్ని తుచ్ఛమైనదిగా భావిస్తారు. మానవాళిని మోసగించే, అనిత్యమైన భౌతిక సుఖాలలో, వారికి నిజమైన సుఖం కనబడదు. భౌతికమైన సుఖంలో ఏదో ఒక వాంఛ కలగటం, సంతృప్తి చెందటం, మరో వాంఛ కలగటం పరిపాటి. కోరిక తీరకపోతే దుఃఖం. కోరిక తీరితే ఇంకా దుఃఖం. ఎలా అంటే, కోరిక తీరితే పొందే సుఖ సంతోషాలు, ఎప్పటికీ ఉండాలని మరో కోరిక. కలిగిన సుఖ సంతోషాలు పోతాయేమోనని భయం, పోకుండా ఏం చేయాలి అనే ఆందోళన దుఃఖం కలిగిస్తాయి. మనం ప్రేమించే వారికి దూరంగా ఉండాలంటే, దుఃఖం వస్తుంది. మనసులో కలిగే కోరికలు అన్ని వేళలా తీరవు. కొన్నిసార్లు మనకు ఇష్టం లేనివి, మనం అనుకోని, ఆశించని  అసంతోషకర పరిస్థితులు ఎదురవుతాయి. భరించరాని దుఃఖం ఉత్పన్నమౌతుంది. 

సామాన్య  మానవునికి, ఇంద్రియ సుఖాలే పరమసుఖం. భౌతికమైన సుఖాలను కోరి, అనుభవించి, తృప్తి  చెంది ఆనందం పొందుతాడు. కానీ అవి క్షణికాలే. అనిత్యమైన భౌతిక సుఖాల అధిగమనం ఇంకా గొప్ప ఆనందాన్నిస్తుంది. జీవితంలో సుఖసంతోషాలు లేవు అనలేదు బౌద్ధం. గృహస్థులకు, భిక్షువులకు భిన్నమైన రూపాలలో, భౌతిక, ధార్మిక సుఖాలు ఉంటాయి. కాని, కుటుంబ జీవితములో పొందే రాగ సుఖం, సంచార శ్రమణ (బిక్షువు) జీవితంలో కలిగే విరాగ సుఖం, భౌతిక, మానసిక సుఖాలు, అన్నీ దుఃఖం లోని భాగాలే. జీవితము యొక్క అన్ని అంశాల మీద ప్రసరించే, దుఃఖమనే మొదటి ఆర్య సత్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించి, పరీక్షించి, వాస్తవం గమనిస్తే, అనిత్యమయినవన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయని తెలుస్తుంది. 

పైన చెప్పిన దుఃఖాలే కాకుండా మరొకటి సంఖార దుఃఖం. దీనిని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన తాత్విక అంశం. బౌద్ధ తత్వం ప్రకారం మనం దేన్నయితే జీవి, వ్యక్తి లేక నేను అంటామో అది నిరంతరం మార్పుచెందే భౌతిక, మానసిక శక్తుల సమ్మేళనం. దీనిని పంచస్కందాలుగా విభజింపవచ్చు. అవి రూప స్కందం, వేదనా స్కందం, సంజ్ఞా స్కందం, సంస్కార స్కందం మరియు విజ్ఞాన స్కందం. 

రూపం 

పంచేంద్రియాలు మరియు మనసు ద్వారా గ్రహించబడిన బాహ్య ప్రపంచపు రూపాలు, శబ్దాలు, వాసనలు, రుచులు,స్పర్శలు, ఆలోచనలు ఇంకా భావాలు రూపస్కందంలోని భాగాలు.

వేదన.  

మానసిక, భౌతిక అంగాలు, బాహ్య ప్రపంచంతో సంపర్కంలోనికొచ్చినప్పుడు, తన్మాత్రల (చూపు, శబ్దం, వాసన, రుచి మరియు స్పర్శ) ద్వారా అనుభవంలోకి వచ్చే సుఖ, అసుఖ అనుభూతులే వేదన.

సంఙ్ఞ 

ఇంద్రియాలు భౌతిక ప్రపంచంతో సంపర్కంలోకి వచ్చినప్పుడు గుర్తించిన, మానసిక, భౌతిక విషయాలను వర్గీకరించి, క్రమ పద్ధతిలో భద్రపరచడమే సంజ్ఞ.

సంస్కారం

మనం చేతన (సంకల్పం లేక చెసే పని వెనుకగల ఉద్దేశ్యం) తో మనో వాక్కాయ కర్మలు (మనసు, మాట, చేతలు) చేస్తాము. మన మానసిక ప్రవృత్తిని, దృక్పథాన్ని చేతన, సంస్కారాలే నడిపిస్తాయి.

విజ్ఞాన 

పైన తెలిపిన స్కందాల మీద, సంబంధిత పరిస్థితుల మీద ఆధార పడి వుంటుంది విజ్ఞానం. జ్ఞానేంద్రియాలు మనసుతో కలిసి పొందే సుఖ, అసుఖ వేదనానుభూతులే విజ్ఞానం.    

బౌద్ధం ప్రకారం మనసు ఆరవ జ్ఞానేంద్రియం. ఇంద్రియాలు, భౌతిక ప్రపంచంతో జరిపే సంపర్కం ద్వారా వుత్పన్నమయే వేదనలు, మనసు ద్వారా గ్రహించబడతాయి. శరీరానికి సంబంధించి రూపాలు, వాసనలు, రుచులు, శబ్దాలు, స్పర్శ మరియు మనసుకు సంబంధించినవి భావనలు, ఆలొచనలు, అంటే మానసిక, శారీరక స్కందాలు కలగలిసి యేర్పడిన మనో భౌతిక యంత్రాన్నే “నేను” అని చెప్పవచ్చు. మనం అంటిపెట్టుకుని వుండే ఈ పంచస్కందాలే దుఃఖం అంటే.

రెండవ ఆర్య సత్యం: దుఃఖ కారణం. దుఃఖానికి  హేతువు తృష్ణ (ఆరాటం, తపన, దాహం). తృష్ణ అంటే సంతృప్తి లేకపోవడం. పాళీ మూల గ్రంథాలు, తృష్ణ తో పాటు ఇతర  క్లేశాలు, మానసిక మలినాలు మరియు మానసిక బలహీనతలు కూడా  దుఃఖ హేతువంటున్నాయి. స్వార్థపూరితమైన కోరికలు, మోహపూరితమైన సుఖాల కోసం పడే ఆరాటం, దుఃఖానికి మూల కారణం. అదేవిధంగా పదవుల కోసం, పేరు ప్రతిష్ఠల కోసం, సంపద కోసం పడే తపన కూడా దుఃఖ కారణమే. చిన్న చిన్న కుటుంబ తగవులు నుండి, దేశ దేశాల మధ్య జరిగే యుద్ధాల వరకు, స్వార్ధంతో కూడిన దురాశల వల్లే జరుగుతాయి. ఈ ప్రపంచమంతా ఆరాటపడుతుంది; ఆరాటాలకు దాసోహం అంటుంది అని బుద్ధుడు అంటాడు. 

మూడవ ఆర్య సత్యం: దుఃఖ నిరోధం.  దుఃఖం అనే దురవస్థ నుండి విముక్తి ఉంది అని చెప్తుంది మూడవ ఆర్య సత్యం. ఆ విముక్తే నిర్వాణమంటే (అంతిమ దుఃఖ విముక్తి). దుఃఖాన్ని ఆమూలాగ్రం నశింప చేయాలంటే తృష్ణను నిరోధించాలి. దుఃఖం నుండి సంపూర్ణ విమోచన పొందాలంటే, మనసులోని మాలిన్యాలను, క్లేశాలను నశింప చేయాలి. స్వార్థపూరితమైన ఆరాటాన్ని, అంతులేని దాహాన్ని అంతమొందించాలి. రాగద్వేషాలను, అవిద్యను (అజ్ఞానం) విడనాడాలి. 

పైన చెప్పిన మూడు సత్యాలను ఇంకా లోతుగా, హేతుబద్ధంగా, తాత్విక కోణంలో దర్శించవచ్చు. అధ్యయనం చేయాలంటే, అనేక బౌద్ధ గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. గంభీరమైన సంక్లిష్టమైన, తత్వచింతన తో కూడిన బుద్ధుని బోధనలు, సాధారణ మానవులు అర్థం చేసుకొని, ఆచరించటానికి అనువుగా ఉంటుంది నాలుగవ ఆర్య సత్యం.

నాలుగవ ఆర్య సత్యం: దుఃఖ నిరోధ మార్గం. దుఃఖ నిరోధానికి, బుద్ధుడు స్వయంగా  ప్రయత్నించి, నిరుపయోగమైనవని తెలుసుకున్న  అంత్యాలు (విపరీత ధోరణులు) రెండు. మొదటిది ఇంద్రియ  భోగాలలో, విలాసాలలో లీనమయి ఉండటం, రెండవది శరీరాన్ని కఠోరంగా నియంత్రిస్తూ చేసే ఆత్మపీడనాయోగం. మొదటి అంత్యము తుచ్ఛమైన, నిరర్ధక మార్గం. రెండవ అంత్యము బాధాకరమైన, నిష్ప్రయోజన మార్గం. ఈ రెండు  ధోరణులు త్యజించి, మధ్యమ మార్గం ( మజ్జిమా పటిపదా) కనుగొన్నాడు. అదే మహోన్నత అష్టాంగమార్గం. దుఃఖం నుండి సంపూర్ణ స్వేచ్ఛ పొందటానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్పాడు. అనుసరణ ద్వారా శాంతి, అభిజ్ఞానం, సంబోధి, నిర్వాణం ప్రాప్తిస్తాయి. మహోన్నత అష్టాంగమార్గంగురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.