జానకి జలధితరంగం-10

-జానకి చామర్తి

శూర్పణఖ

పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము  మంచి పని చేస్తున్నామన్న తృప్తి  భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము  కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. 

గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు

 “ భగవద్గీత” తీసి , అందులో ఏదొక శ్లోకం చదివేవాడినని, ఆ శ్లోక సారాంశం  తనకు పరిష్కారం తోపింపచేసేదని, ముందుకు నడిపించేదని , మనశ్శాంతి కలిగించేదని వ్రాసుకున్నారు. నిజానికి ఆ ఉద్గ్రంధం చాలా మందిని అలాగే చెయ్యి పట్టుకు నడిపించింది , నడిపిస్తోంది .

మన జీవితాలలో పెనవేసుకు పోయిన గ్రంధాలలో రామాయణం మొట్టమొదటిది ముఖ్యమైనది అనిపిస్తుంది నాకు. “ రామ “ అనే రెండక్షరాలు హరియించును పాతకములు అని నమ్ముతాము , ఇక ‘ రాముడు నడిచిన దారి’ నే నడవాలని అనుకుంటూ ఉంటాము. ఆ రామాయణం “ రాముడి ప్రయాణం  “   అంటే అందరకీ ఎంతో మక్కువే. చెప్పక్కరలేదు కాని , “ రామ” లో దాగున్న ఆ “రమ” కథ కూడా అదే ఆ రామాయణం . “సీత ప్రయాణించిన దారి “.

పండితులు ,పెద్దలు, మేధావులు , జ్ఞానవంతులు , కవులు  ఉన్నతవర్గం వారెందరెందరో  .. వ్యాఖ్యానాలు అర్ధాలు అనువాదాలు నానార్ధాలు వర్ణనలు అందులోని మర్మములు ఎన్నో ఎలాగో రక రకాలుగా విశదీకరించారు ఆ రమణీయ కావ్యం రామాయణంని.

కాని ఒక సాధారణ స్థాయిగా ఆలోచించగల స్త్రీ గా  నన్ను, రామాయణంలోని ఒక స్త్రీ  నిల వేస్తుంటుంది. 

కథనే మలుపు తిప్పిన స్త్రీ. ఆమెను తలచుకుంటూనే మనకు కోపం కలిగించే స్త్రీ, చిరాకు కలిగించే స్త్రీ. ఆడజాతికే అవమానం కలిగించే రాక్షసి కదా అనుకుంటాము మనము ఆమెను తలచుకొని.

రామాయణంలోని ఆ స్త్రీ యే శూర్పణఖ. రావాణాసురుడి చెల్లెలు. పంచవటిలో భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ వనవాసముంటున్న రామచంద్రుని, నీలివెన్నెల  వంటి అతని సొగసు చూసి వలచింది. పొందాలనుకుంది. ఆమె కామవాంఛ ఎంతలా ఉందంటే అన్న కాకుంటే తమ్ముడు లక్ష్మణుడైనా సిద్ధమనేటంత.  సీతను తనకు అడ్డుగా ఉన్న సాధారణ ఆడదానిగా తలచి చంపి వేయాలనుకునేటంత కక్ష కల రక్కసి.

అసూయ కోపము ద్వేషము పరపురుషులపట్ల మోహభావము జారతనము జాణతనము , తన పంతం చెల్లించుకోవడానికి తోటి స్త్రీని చంపి వేయమని కూడా చెప్పగల తెంపరితనం ఇన్ని లక్షణాల రాశి ఆమె, ఆ రావణుడి చెల్లెలు. ఏఏ లక్షణాలు స్త్రీలో , రాక్షసజాతి స్త్రీలలో కూడా ఉండకూడదనుకుంటామో అటువంటి లక్షణాలు కల స్త్రీ. 

ముక్కు చెవులు కోసి తగిన శాస్తి చేయబడినా, తిరిగి పగ తీర్చుకోవడానికి కుట్రలు పన్నినది, రాముని కుటుంబానికి అన్నగారి చేత తగిన శాస్తి చేయించాలని పధకాలు రచించిన కుటిలురాలు. 

అంతమాత్రమే రామాయణంలో ఆమె పాత్ర  ,  కాని గడగడలాడించే ఆమె దుష్ట స్వభావానికి మనం హడిలిపోతాము. సుకుమారియైనా ధీరత్వం కలిగి మానవత్వం మాతృత్వ భావన కరుణ క్షమ శీలసంపద కలిగిన సీతమ్మ వంటి స్త్రీరత్నం సరసన శూర్పణఖను తలచుకుని చింతపడతాము. 

కాని, నేటి సమాజంలో దురదృష్టవశాత్తూ శూర్పణఖలూ బయలుదేరుతున్నారు. ఆదర్శమైన రామాయణ గ్రంథంలో , అనుసరించ తగ్గ ఆదరించతగ్గ పాత్ర కానేకాని శూర్పణఖ వంటి వారు తలెత్తుతున్నారు. 

పరపురుష వ్యామోహం కాపురాలను భగ్నం చేసుకోవడం ఆకర్షణలు ఉన్మాదాల వలలో చిక్కుకోవడం , దానివల్ల కుటుంబాలు  వ్యక్తుల జీవితాలు నాశనమవడం వింటున్నాము. 

ఇల్లాటి వాటి పర్యవసానంగా పసిపిల్లలు అనాధలు కావడం , బాలలు చెడుదారులు త్రొక్కడం , నేరవాతావరణానికి మళ్ళడం ఇవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపుతాయి.

దుష్టస్వభావం ని సంబాళించుకోలేక, వక్రమార్గాల దారి పడితే పర్యవసానం ఎంతకైనా దారితీయవచ్చు. శూర్పణఖ కు జరిగిన అవమానాల వంటివే , ఇంకా అంతకు మించి జరగవచ్చు . ఒక తప్పు ను కప్పి పుచ్చుకోవడానికి

మరియొక తప్పులాగ , చివరకు ప్రాణాలు తీసుకునే ఆత్మహత్యల లాగ , ప్రాణాలు తీసే హత్యల కింద పరణమించవచ్చు..

మనకు పరంపరగా అందించబడిన  ఉత్తమ గ్రంధాలలోని విషయాలూ మనుషులూ , మనకు మన జీవితానికి ఉపయోగపడే విధంగానూ , మనలనూ సమాజాన్ని తీర్చిదిద్దుకోవడం కోసమూనూ.  వాటిలోని కొన్ని పాత్రలుమనం  ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో చెపితే, శూర్పణఖ లాటి స్త్రీలు ఎలా ఉండకూడదో చెప్పేందుకు ఉదాహరణలు. 

రామాయణం వంటి గ్రంధాన్ని ఆదర్శంగా తీసుకుని  జీవిత ప్రయాణాన్ని కొనసాగించుతూ ఉంటే  శూర్పణఖ లక్షణాలు మాత్రంఅలవరచుకోకూడదు. మనకు ఎప్పుడూ అటువంటి

అభినవ శూర్పణఖలు తారసపడకూడదు.  

మన నవ సమాజం  శూర్పణఖలు లేని రామాయణం కావాలని కోరుకుందాము. *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.