పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2

-వసుధారాణి 

హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’

తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి

 

సమీక్ష రెండవ భాగం
 
పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా చేయటం అన్న యోచనకు బద్ధమై ఉంది.
అనుక్షణం అతని నోటినుంచి వెలువడే పదం ‘వయం రక్షామః’ .
 
శూర్పణక భర్త విద్యుజ్జిహ్వుని రక్ష సంస్కృతిలోకి రాలేదు అన్న కారణంగా అతన్ని చంపివేయటం,చెల్లెల్లు ఎంత ప్రియమైనప్పటికీ వయం రక్షామః పట్ల రావణుడు ఎంత నిబద్ధతతో ఉన్నాడో తెలుపుతుంది.అలాగే శూర్పణకను ఆమె భర్త అనునాయులైన కాలికేయుల సహితంగా దండకారణ్య తన సేనగా ఉంచటం, చెల్లెలిని నాయకురాలిని చేసి వారందరినీ తన రక్షలోకి తెచ్చుకుని ,లంక నుంచి దండకారణ్యానికి తన బలాన్ని విస్తరింప చేయటం రావణుని రాజకీయ చతురతకు మచ్చుతునక. 
 
తనకంటే బలవంతుడైన కార్తవీర్యార్జుని దగ్గరకు వెళ్ళి పరశువుకు యుద్ధ భిక్ష పెట్టమని అడిగిన రావణుడు వెన్నుచూపని యోధుడు.కార్తవీర్యుని చేతిలో ఓడిపోయి తనకన్నా బలవంతునితో చెలిమి ఏర్పరుచుకోవటం (కార్తవీర్యుడు రక్షా దీక్ష పొందకపోయినప్పటికీ) రావణుని చతురతకు నిదర్శనం.
 
రావణుడు దండకారణ్యం దాటుకుని, నర్మదా నదిని దాటి వన,పర్వత నదీ నదాలు దాటుతూ నేటి మధుర నాటి మధుపురిని చేరతాడు. భయపడుతూనే రావణుని సేనతో  మధుపురీ రాజు మధువు పోరాడతాడు.దుర్గాన్ని దిగ్బంధం చేసిన రావణుడు మధువును బంధించటానికి అంతఃపురానికి వెళతాడు.మధువు భార్య కుంభీనసి ఆర్ఘ్య పాద్యాలతో రావణుని సత్కరించి , సేవించి సోదరా! పతి భిక్ష పెట్టమని కోరుకుంటుంది.
 
రావణుడు కుంభీనసిని ఆదరించి మధువును రక్షా బద్ధుడను చేసి రాజ్యాన్ని వదిలి వేయటం, రావణునికి రాజ్యకాంక్ష కన్నా రక్షా సంస్కృతి స్ధాపించటం పట్ల ఆసక్తి అన్న విషయాన్ని తెలుపుతుంది.
 
అక్కడి నుంచి రావణుడు నైమిశారణ్యాన మారిచ, సుబాహులతో తను ఏర్పరచిన స్థావరానికి చేరటం ఈ కావ్యాన కీలకఘట్టం. 
 
స్థావరం అంతా నాశనం చేయబడి ఉండటం,దెబ్బలతో మారీచుడు గుహలో దాక్కుని ఉండటం, దుస్థితికి కారణం విశ్వామిత్రునితో వచ్చిన దశరథ కుమారులు అని తెలుసుకోవటం.మనకు తెలిసిన రామ , రావణ రామాయణమే కొత్త రూపంలో ఆవిష్కృతం అవుతుంది.
 
అయోధ్యాధిపతి దశరథుని పరాక్రమం గురించి  రావణునుడు ఇది వరకే  శంబరుడితో దశరథుడొనర్చిన యుద్ధం వలన ఎరిగున్నవాడు.దశరథ వీర కుమారులను రావణుడు చూడాలి అనుకున్నాడు.సీతా స్వయంవరం గురించి తెలుసుకుని మిథిలకు వెళ్ళాడు.
 
స్వయంవరం కోసం సిద్ధపడిన మిథిలాపురి వర్ణన అద్భుతం. అసలు మొత్తం స్వయంవరం ఘట్టం అంతా చాలా కొత్తగా ఉంది. రావణుడి వైపు నుంచి చూపటం వలననేమో!
 
రాముడిని చూసి లయతప్పిన రావణుని గుండె ,సీతను చూసి వేగంగా కొట్టుకుంటుంది.ఇక్కడ ఓ ఘట్టం యధాతధంగా ఉంచుతున్నాను 
 
” రాముని కిశోరప్రాయం,అతని లావణ్యం,అతని రూపం,అతని విక్రమం చూచి రావణుడు ఆశ్చర్యచకితుడైనాడు.ధనువు విరిగినప్పుడు ఒకానొక అద్భుతదృశ్యం చూసిన ఆనందానుభూతికి లోనైనాడు.జనకుడు వీర్యశుల్కయైన సీతను రామునికి ప్రదానం చేసినప్పుడు మాత్రం,అతడు కొంత వికలచిత్తుడైనాడు.ఒకానొక అజ్ఞాతవేదనకు గురియైనాడు.”
పురాణాలలో స్వయంవరాలెంత కీలకమో !
అనిపించింది ద్రౌపదీ స్వయంవరం కూడా గుర్తుకువచ్చి.
 
 సీతా స్వయంవరం నుంచి పరశువు భుజాన ధరించి నిష్క్రమించిన రావణుడు మళ్ళీ రామునితో యుద్ధం వరకూ ఎక్కడా ఆగలేదు. తను ఏర్పరుచుకున్న లక్ష్యం దిశగా సాగుతూనే వచ్చాడు.
 
కుబేరునిపై విజయం,పుష్పకవిమాన కైవసం ,అది పొందిన వెంటనే కైలాసయానం ,శివుడు మేఘనాథుడికి ఇచ్చిన వరాల వృత్తాంతం ఎక్కడా మనమూ ఆగలేము.
 
ఈ గాథలో నాయక, ప్రతినాయకులు అయిన రామ, రావణులు ఒకళ్ళవైపు మరొకళ్ళు ప్రయాణం చేయటం ,వారిరువురి ప్రతి చేష్ట వెనుక అంతర్లీనంగా  ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు కలిగి ఉండటం,ఈ కావ్యాన్ని చదువుతున్నంత సేపూ చరిత్రని చదువుతున్నట్లు అనిపించింది.
 
సీతాపహరణం , జటాయువు, శబరి వీరి వృత్తాంతాలు, చివరకి  రాముని విజయం అన్నీ తెలిసినవే అయినా వాటిని కొత్త కోణంలో చూపటంలో చతుర్ సేన్ గారి అధ్యయనం కృషి తెలుస్తున్నాయి.
 
రామాయణ , భాగవతాలు ఎలా తప్పక చదవాలో ఈ ‘పౌలస్త్యహృదయం దాశరథి విజయం‘ కూడా తప్పకుండా చదవాల్సిన కావ్యం.
 
అనుసృజన ద్వారా ఈ గొప్ప పుస్తకాన్ని తెలుగువారికి కరతలామలకం చేసిన శోభిరాల బాలా త్రిపురసుందరి గారికి అభినందనలు,వందనాలు తెలుపుతున్నాను.
 
ఈ అరుదైన పుస్తకం ప్రతులకు:
శ్రీమతి శోభిరాల బాలా త్రిపురసుందరి
విజయవాడ.
ph : 8897177409.


*****

Please follow and like us:

One thought on “పౌలస్త్యహృదయం దాశరథి విజయం – 2”

  1. చాల బాగా బాగ చేశారు అభినందనలు రాణి గారు

Leave a Reply

Your email address will not be published.