వెనుతిరగని వెన్నెల(భాగం-15)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-15)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన ఆరు నెలల్లోనే  తన్మయి  గర్భవతి అవుతుంది. డెలివరీకి అమ్మగారింటికి వస్తుంది.

***

ఇంటి ముందు రిక్షా దిగగానే ఓపికంతా అయిపోయినట్లయ్యింది తన్మయికి. ఎక్కడివక్కడ వదిలేసి తన గదిలోకి వెళ్లి ముసుగు పెట్టింది. నిద్రపోయి లేచేక ప్రయాణపు బడలిక తీరినట్లయ్యి  హాయిగా గాలి పీల్చుకుంది. గది కిటికీ దగ్గర ఎత్తైన బంతి చెట్లు తలలూపుతూ ఉన్నాయి. మనసంతా ఎంతో ఆహ్లాదం నిండింది. 

“హమ్మయ్య, మళ్లీ ఇన్నాళ్ళకి ఇలా తన విశాలమైన గదిలో పచ్చని చెట్ల మధ్యకి వచ్చింది.  మరి కొద్ది రోజుల్లో తన జీవితంలో అద్భుతం జరగబోతూంది. తనిన్నాళ్లూ కబుర్లు చెప్పుకుంటూన్న చిన్నిబిడ్డ తన కళ్ల ముందుకి రాబోతూంది.” 

పుట్టబోయేది అబ్బాయని తెలిసి అంతా తెగ సంతోషిస్తున్నారు.

“మా అమ్మకి మనవరాలి బిడ్డనెత్తుకునే యోగం లేదు, మగబిడ్డ పుట్టబోతున్నందుకు ఎంత సంతోషించేదో!” అంటూ జ్యోతి కళ్ళు తుడుచుకుంది.

“అందరికీ మగ పిల్లలంటే ఎందుకు మోజు? నా మట్టుకు నాకు అమ్మాయిలంటేనే ఇష్టం. ఇంట్లో ఒక్కతే పిల్లగా గారాబంగా పెరగడం వల్లనేమో” అనుకుంది తన్మయి. 

తల్లిని ఎన్నో సార్లు అడిగింది. తనకు అన్నా, చెల్లీ ఎందుకు లేరని? సమాధానంగా నవ్వి ఊరుకునేది గానీ ఎప్పుడూ చెప్పలేదు. 

అదే ప్రశ్న ఇప్పుడు మళ్లీ అడిగింది. దగ్గిరికి వచ్చి తల నిమిరి “ఏమోనమ్మా, నీ తర్వాత ఇంక నాకు మళ్లీ పిల్లలే పుట్టలేదు. అమ్మమ్మకీ అందరం ఆడపిల్లలమే. నీకు తొలిచూలు మగబిడ్డ అని తెలిస్తే ఎంత సంతోషించేదో” అంది మళ్లీ జ్యోతి.  

కారణాలేవైనా తన్మయి మాత్రం ముందు తనకి అమ్మాయి పుడితే బావుణ్ణని ఎంతో కోరుకుంది. శేఖర్ ప్రవర్తన వల్ల విసిగిపోయో, ఎందుకో గానీ పుట్టబోయేది అబ్బాయని తెలిసినపుడు కాస్త నిరుత్సాహపడింది కూడా. కానీ కడుపులో ఉన్న బిడ్డ ఆడైనా, మగైనా తల్లిప్రేమలో తేడా ఉండదని తన్మయికీ తొమ్మిది నెలల్లో అర్థమయ్యింది. 

తొమ్మిదో నెల నిండే సమయానికి బాగా భారం కాసాగింది. ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అని ఎదురుచూపులు చూడసాగింది తన్మయి. రోజు ఉదయం నించి రాత్రి కావడమే అతి కష్టంగా జరుగుతోంది.

కంటి నిండా నిద్రపోయి ఎన్నో  రోజులయ్యింది. ఎటు ఒత్తిగిలినా కడుపులో బిడ్డ కాళ్లూ చేతులూ గుచ్చుకుంటున్నాయి. నెలలు పూర్తయ్యే కొలదీ కదలికలు తక్కువగా వున్నా,  ఇలా నిద్రపడుతుందనగా అలా కడుపులో తడుతున్న కదలికలకి నిద్ర రావడం లేదు. పైగా పైన ఊపిరి తిత్తుల దగ్గర్నించీ నడుం వరకూ సాగి ఉన్న పొట్ట వల్ల ఊపిరి సలపనట్లు, ఏవిటో గాభరాగా అనిపించసాగింది. 

తన్మయికి అలా కాస్సేపు డాబా మిదకి వెళ్లి కాస్త గాలి పీల్చాలని అనిపించింది. అతి మైల్లగా రైలింగు పట్టుకుని ఎక్కుతున్న తనను చూసుకుని తనే ఆశ్చర్యపోయింది. ముందంతా డాబా మీదికి వెళ్లడమంటే పరుగులు పెట్టడమే. ఒక్కోసారి రెండు మెట్లు ఒకే సారి ఎక్కి దిగడమూ జ్ఞాపకం వచ్చింది. ఎంతలో శరీరం అంతా ఎలా మారిపోయింది! కేజీల రాయిని కడుపుకి కట్టుకున్నట్లు భుజాలు భూమిలోకి గుంజేస్తున్నాయి మెట్లు ఎక్కుతుంటే. వనజ జ్ఞాపకం వచ్చింది. ఎన్నో సాయంత్రాలు డాబా మీద కూర్చుని చెప్పుకున్న కబుర్లు జ్ఞాపకం వచ్చాయి. 

“క్షమించు వనా! ఉత్తరం రాయలేని ఈ అశక్తురాలిని క్షమించు.” అని పైకే అనేసింది. 

 సన్న జాజి పందిరి గూడు వైపు చూసింది. తను వెళ్లాక ఇంట్లో అంతగా పట్టించుకోక అనుకుంటాను సన్న జాజి లతలు గూడంతా అల్లుకుపోయి మొత్తం దారి మూసుకుపోయింది. అయినా పూల వాసన తనకి పడడం లేదు దగ్గరికి వెళ్లగానే వికారం మొదలయ్యింది. పూల వికారం ఎంత దారుణంగా ఉందంటే దూరం నించి ఎవరైనా జడలో పూల మాల పెట్టుకుని వెళ్తూ కనిపించినా ఇక్కడ తనకు కడుపులో తిప్పుతుంది.

డాబా నాలుగు మూలలా నెమ్మదిగా నడుస్తూ కిందికి చూసింది. పెరట్లో  అరటి చెట్లు బారుగా పెరిగేయి. గెల బరువుతో  పెద్ద అరటి చెట్టు తనలాగే  వొంగి నిలబడి ఉంది. గులాబీ మొక్కలు ఒకటీ అరా మిగిలేయి. బంతి చెట్లు బాగా విరగ బూసేయి. కనకాంబరం మొక్కలు జీబురుగా విస్తరించేయి. 

తన్మయికి మొక్కలన్నా, మొక్కల మధ్య గడపడం అన్నా బాగా ఇష్టం. వంగనారు వేసి కేజీల కొలదీ వంకాయలు పండించేది. చిక్కుడు పాదులు, బీర పాదులు పందిళ్ళు వేసి చక్కగా సంరంక్షించేది. వైజాగు లో గాలి లేని తమ చిన్న గదుల ఇల్లు గుర్తుకు వచ్చి ఒక నిట్టూర్పు విడిచింది. 

“ఇక్కడిలాంటి ఇల్లు అక్కడ ఉంటేనా! ఎన్నెన్నిపూల మొక్కలు పెంచేదో!! అయినా ఇప్పుడు అవన్నీ సాధ్యం కావులే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగలేదు కూడా.” 

ఒక వైపు సాయం సంధ్య నారింజ రంగుల తళుకులు చిమ్ముతూ ఆకాశమంతా మెరిసిపోతూ ఉంది. దూరంగా రోడ్ల మీద ధూళి రేపుకుంటూ పశువులు ఇళ్ళకి చేరుతున్నాయి. పక్షులు ఉదయపు ఉద్యోగాల్నించి గూటికి చేరి కిలకిలా శబ్దాలు చేస్తున్నాయి. ఆహ్లాదంగా వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ తన కోసమే వేసిన పడక కుర్చీలో విశ్రాంతిగా కూచుంది తన్మయి.

నారింజ ఆకాశంలో అక్కడక్కడా  బూడిద రంగు కుంచెతో అద్దినట్లున్నాయి మబ్బులు. తన మనస్సులో ఆనందం  కనిపెట్టేసినట్లు ఒక్కసారి కాళ్లూ, చేతులూ సాచింది కడుపులో బిడ్డ.

తన్మయి ఆప్యాయంగా పొట్ట తడుముకుంది. “బంగారూ, అలా చూడు నాన్నా … ఆకాశం ఎంత బావుందో…. అవిగో మబ్బుల్లో.. అవి లేళ్ళు, ఇవి నెమళ్ళు….   తొందరగా వచ్చెయ్యి మరి అన్నీ చూపిస్తాను” అని కబుర్లు చెప్పసాగింది.

జ్యోతి సగం మెట్లెక్కి ఆగి  “తన్మయీ! పొద్దు పోతూంది కదమ్మా, కాస్త పెందరాళే ఏదైనా తినకూడదూ” అని పిలిచింది. 

పళ్లెంలో నల్లగా మాడిన తీపి అట్లు అమృతంలా కనిపించాయి తన్మయికి. తన ప్లేటు చూసి తనకే నవ్వొచ్చింది తన్మయికి. తన ఆహారపుటలవాట్లు ఈ తొమ్మిది నెలలుగా నెలకొక కొత్త విచిత్రంగా మారిపోతూ వచ్చాయి. అంతకు ముందు ఉన్న అలవాట్లన్నీ మారిపోయి కొత్తవి వచ్చాయి. ఇదొక విచిత్రమైన శారీరకావస్థ. అంతకు ముందు నచ్చనివెన్నో నచ్చుతున్నాయిప్పుడు. నచ్చేవెన్నో నచ్చడం లేదు శేఖర్ తో సహా. 

ఇంతకు ముందు తను వంట మాడితే అసలు ముట్టుకునేది కాదు. అలాంటిది అట్లు నల్లగా అయితే చూడడానికి అందంగానూ,  తింటుంటే అమృతంగానూ ఉంటున్నాయి.

“ఇది సరిగా మాడలేదు” అంది అట్టు పైకి తీసి చూపిస్తూ.

“చాల్లే తల్లీ, నీ కొడుకు నల్ల చింతగింజలా పుడతాడు నువ్వు తినే తిండికి.” అంది జ్యోతి నవ్వుతూ.

ఆ మర్నాడు దేవి ఫోను చేసింది. “శేఖర్ ఫోను చేసేడమ్మా.  నిన్ను మనింటి దగ్గర్లో  ఉన్న డాక్టరుకి చూపించమని చెప్పేడు. రేపో ఎల్లుండో ఓ సారి రారాదూ. డెలివరీ ఆ పల్లెటూళ్లో వద్దే వద్దని పట్టుబట్టాడు. ఎంత ప్రేమో వాడికి నువ్వంటే.” అంది.

“ఇదేం చోద్యం, మేమందరం కనలేదా” అంటూ జ్యోతి వెనకే రాగం తీసింది.

తన్మయి ముఖం చూసి, “వాళ్ళకెలా ఇష్టమో అలా చేసుకోనివ్వరాదూ” అన్నాడు భానుమూర్తి. 

“డెలివరీ అక్కడెక్కడో అత్తగారింటికి దగ్గర్లో పెట్టుకుంటే, పిల్లకి మూడు రోజులు ఆసుపత్రిలో పత్యం భోజనం ఇబ్బంది కాదూ?అయినా మీతండ్రీ కూతుళ్లకెలా ఇష్టమైతే అలా చెయ్యండి. నాకేవిటీ మధ్యలో. మీ అత్తగారినే అడిగి కనుక్కోమ్మా.  మూడు పూటలా కేరేజీ పట్టుకుని వస్తాదేమో” అంది ముక్కు చీదుతూ జ్యోతి. 

తన్మయికి ఎటూ అర్థం గాని సందిగ్ధం పట్టుకుంది. అసలు డెలివరీ అంటే తెలీని భయంగా ఉంది మొదట్నించీ. నెలలు నిండుతున్న కొలదీ బిడ్డ ఎలా బయటికి  వస్తాడో అని గాభరాగా ఉంది. అత్తగారింటికి దగ్గర్లో డెలివరీ చేసుకోవడం అంతగా ఇష్టం లేకపోయినా,  మంచి డాక్టర్ దగ్గిరికి వెళ్తే భయం తగ్గుతుందనే ఆలోచన వల్ల వెళ్లడానికే నిర్ణయించుకుంది.

“మీ ఆయన నీకే ఫోను చెయ్యొచ్చుగా అంత ప్రేమ ఉన్నవాడైతే. అన్నీ అమ్మకి చెప్పుకుంటాడు చంటి కూచిలాగా” అంది జ్యోతి.

కొన్ని విషయాలు ఇలా ఎత్తి చూపితే గానీ అర్థం కావు. శేఖర్  గురించిన ఆలోచన రాగానే తన్మయి మనస్సంతా దిగులు అలుముకుంది.

నిశ్శబ్దంగా గోడకి జేరబడి కూచుంది. కూతురి కళ్లలో నీళ్లు చూసి, “నేనిప్పుడేమన్నానని?” అంది ఉక్రోషంగా జ్యోతి.

తల్లికి సమాధానం చెప్పే ఓపిక లేక అలాగే గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ ఉండిపోయింది. అయినా తల్లి అన్నదాంట్లో తప్పేముంది? 

“వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఫోను చెయ్యని పెద్ద మనిషికి డెలివరీ విషయంలో ఇంత శ్రద్ధ దేనికి? ప్రేమ తన మీదా? పుట్టబోయే కొడుకు మీదా?” ఇవన్నీ ఆలోచిస్తూంటే మనస్సుకి  ఇంకా కష్టం తప్ప మరేమీ లేదు.

అతనికి తను అమ్మగారింట్లో ఉండడమే ఇష్టం లేదన్నట్లు  ప్రవర్తిసాడు. ఒక ఫోను చెయ్యడు. ఉత్తరం రాయడు. అన్నిటికీ వాళ్లమ్మతోనే రాయబారాలు.  ఎప్పుడో పెళ్ళిలో జరిగిన విషయాలకి ఇన్నాళ్లు కక్ష సాధింపేవిటో అర్థం కాదు తన్మయికి. 

అదే అడిగితే “మీ అమ్మా, బాబూ ఏం దోచి పెట్టేస్తున్నారని వాళ్ల మీద ప్రేమ ఒలక బొయ్యాలి?” అన్నాడొకసారి.

ఇవన్నీ తల్లికి చెప్పి తన మనసు నొప్పించడం ఇష్టం లేదు తన్మయికి. “ఇదంతా తన దురదృష్టం. అంతే. ఏం చెయ్యగలదు తను?”  అని లోపల్లోపల బాధ పడసాగింది.

***

“రేపో ఎల్లుండో  డాక్టరు దగ్గరికి వెళ్దామా” అంది తన్మయి మర్నాడు తల్లితో.

అప్పటికి కాస్త కుదుట పడి “వెళ్లేది డాక్టరు దగ్గిరికైనా ముందు మీ అత్తగారింటికి వెళ్లాలి కదా, మంచి రోజు చూసుకుని వెళ్దాంలే ” అంది జ్యోతి.

వైజాగులో చూపించుకున్న డాక్టరు చెప్పిన ప్రకారం ఇంకా పదిహేను రోజులు ఉంది డెలివరీ డేటు.

రెండో రోజు ఉదయం నిద్ర లేస్తూనే ఏదో తేడాగా అనిపించింది. నడుములో కొద్దిగా నొప్పి మొదలయ్యింది. ఏదో చుక్క చుక్కగా నీళ్లలాగా పోతున్నట్లు అనిపించసాగింది.

క్షణం ఆలస్యం చెయ్యకుండా భాను మూర్తి టాక్సీ కోసం పరుగెత్తేడు.

దారి పొడవునా తన్మయికి ఎలా ఉందో అని గాభరా పడ్తూ అడగసాగింది జ్యోతి.

 శేఖర్ తల్లీ, తండ్రీ  ఇంటి ముందు టాక్సీ ఆపగానే ఎక్కేరు. 

ఆసుపత్రి ముందు హాలులో అన్ని దేవుళ్ల  పటాలు వేళ్ళాడుతున్నాయి. లోపల కన్సల్టింగు గదిలో ఎటు చూసినా సాయిబాబా పటాలు. డాక్టరు పెద్ద ఎర్ర బొట్టు పెట్టుకుని, ఆ పైన తెల్ల అడ్డబొట్టు పెట్టుకుని బాగా దైవ భక్తురాలిలా కనిపించింది. 

“ఆ చెయ్యిలా ఇవ్వు” అంది తన్మయిని చూసి.  చాలా కరుకుగా ఉన్న ఆవిడ మాట తీరు చూసి  “ఇలాంటి వాళ్లు డాక్టర్లెందుకు అవుతారో?!” అనుకుంది తన్మయి. 

రెండు నిమిషాల్లో పరీక్ష చేసి, “కంగారేం లేదు. ఇంకా వారం వరకూ పట్టొచ్చు.” అని డాక్టరు అన్నాక, అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తన్మయికెందుకో నమ్మకం కలగడం లేదు. కడుపులో కాళ్లు పైకి, తల కిందికి స్పష్టంగా తెలుస్తున్నాయి. ముందులాగా ఎక్కువగా కదలడం లేదు. అక్కడక్కడే ఇరుకుగా కాళ్లూ చేతులూ కొంచెం చాపుతున్నట్లు తెలుస్తూంది.

ఎందుకో అన్నాళ్లు పట్టదేమో అనిపించ సాగింది. ఎందుకైనా మంచిది. అత్తగారింట్లోనే ఉంటే మంచిదనిపించింది. అదే చెప్పింది తల్ల్లితో. 

దేవి నవ్వుతూ “నా మనసులో మాట నువ్వే చెప్పేవు. ఇక్కడుంటే ఏ రాత్రి పూట హడావిడి ఐనా డాక్టరు అందుబాటులో ఉంటుంది. తన్మయిని వదిలేసి వెళ్లండి వదినా. ఏదైనా అర్జంటు అయితే ఫోను చేస్తాంలే ” అంది జ్యోతితో.

రాత్రి వరకూ ఉండి జ్యోతి, భాను మూర్తి కూతుర్ని అత్తగారింట్లో వదిలెళ్లారు.

మర్నాడు శేఖర్ ఫోను చేసేడు. “ఎప్పుడూ ఇలా చెప్పిన మాట వినొచ్చు కదా, పోనీలే. ఈ విషయంలోనైనా బుద్ధిగా విన్నావు. మా అమ్మ చెప్పినట్లు విని నా కొడుకుని నాకు జాగ్రత్తగా కనివ్వు. అన్నట్లు నేనీ వారంలో ఊరెళ్తున్నాను. నాలుగు డబ్బులు సంపాదించడానికి ఇది మంచి సమయం. డెలివరీ సమయానికి నేను రాలేకపోవచ్చు. మా అమ్మా, నాన్నా ఉన్నారుగా.” అన్నాడు.

తన్మయికి దు:ఖంతో గొంతు పూడుకు పోయింది. “నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా దగ్గిర ఉండవా డెలివరీకి?” అంది కంగారుగా. 

“అబ్బా, ఊరికే చిరాకు తెప్పించక. పిల్లల్ని కనడం ఆడదాని బాధ్యత. అయినా పిచ్చి మొహవా, విను. హాస్పిటల్ గదిలో ఆడోళ్లు కనేటప్పుడు మగోళ్లని రానివ్వరు. ప్రసవం అయ్యేక వైరాగ్యం వస్తాదంటారు.  నీకు ప్రసవం కాకుండానే వైరాగ్యం పట్టుకున్నట్లు ఆ ఏడుపేంటి? మా అమ్మ ఉంది కదా! భయం దేనికి? నేనొచ్చి ఏం చేస్తానూ? విషయం తెలుసుకోవడానికి రోజు విడిచి రోజు ఫోను చేస్తానులే మా అమ్మకి ” అన్నాడు.

నాలుగో రోజు ఉదయం అప్పటి వరకూ చుక్క చుక్కగా ఉన్న నీళ్ల లాంటి స్రావం హఠాత్తుగా ఆగకుండా మొదలయ్యింది.

“వారం వరకూ ఏం ఫర్వాలేదందిగా  డాక్టరు, కంగారెందుకూ?” అని రాగం తీసింది దేవి చెమట్లు పట్టిన తన్మయి ముఖం వైపు చూడకుండానే.

మరో గంటలో “నా పరిస్థితి ఏమీ బాగో లేదు. పైగా కడుపులో అంతగా కదలడం లేదత్తమ్మా.” దేవితో మళ్లీ చెప్పింది తన్మయి. 

“ఎందుకైనా మంచిది ఓ సారి డాక్టరు దగ్గిరికి తీసుకెళ్లరాదూ” అన్నాడు శేఖర్ తండ్రి.

డాక్టరు  పరీక్ష చేస్తూనే జాయిన్ అవ్వండి “వెంటనే డెలివరీ చెయ్యాలి, ఉమ్మనీరు బాగా పోయింది. బిడ్డకి ప్రమాదం” అన్నాక గానీ దేవికి కోడలి పరిస్థితి అర్థం కాలేదు. 

మరో రెండు గంటల్లో జ్యోతి, భాను మూర్తి వచ్చేరు.

శేఖర్  ఎలాగూ రానన్నాడు. బిడ్డని ముందుగా చూడడానికి కనీసం తల్లైనా పక్కన ఉంటే బావుణ్ణని కోరుకుంది తన్మయి. 

చాలా చిన్న ఆసుపత్రి అది. డాక్టరు కన్సల్టింగు గది వెనక డెలివరీ గది, దాని పక్కనే మరో మూడు గదులు.  

డెలివరీ గది మధ్యలో ఒక పక్కన అర్థ చంద్రాకారంలో  కత్తిరించిన బల్ల మీద రెండు వైపులా తాళ్లు కట్టిన ఊసలున్నాయి. అదొక వధ్యపలకలా కనిపించి భయం రెండింతలైంది తన్మయికి.

కడుపు మీద చెయ్యి పెట్టుకుని కళ్లు మూసుకుని ప్రార్థించింది. “భగవంతుడా, నేనేమైపోయినా ఫర్వాలేదు. నా బిడ్డని రక్షించు.”

తన్మయిని బల్ల మీద పడుకోబెట్టి  నర్సు వచ్చి ఏవో ఇంజషన్లు ఇచ్చింది. మెల్లగా కడుపంతా కలయదిప్పుతూ నొప్పి మొదలయ్యింది. రెండు కాళ్లూ మోకాళ్ల వరకూ పైకి మడత బెట్టి గుంజలకి జేరబెట్టి తాళ్ళతో కట్టేరు. చేతులకు  తాళ్ళు ఆధారంగా  చుట్టి, చప్పున మూలుగుతూ నొప్పులివ్వమని డాక్టరు గట్టిగా చెప్పడం మొదలెట్టింది.

నొప్పులు పడ్తూనే తల్లి కోసం గదంతా కలయజూస్తూ ఉంది తన్మయి. 

దేవి గదిలో ఒక పక్కగా ఉన్న బల్ల మీద కూచుని నవ్వుతూ చూస్తూందిదంతా. మధ్య మధ్య “ఊరుకోవే తల్లీ, డాక్టరు చెప్పినట్లు నొప్పులియ్యి. తొందరగా ఆయిపోతుంది” అంటూంది. 

“అమ్మా, అమ్మా” అని గోల పెట్ట సాగింది తన్మయి. 

బైట కూచున్న జ్యోతిని నర్సు పిలుచుకొచ్చింది. తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని  ఏడవడం మొదలెట్టింది తన్మయి. అప్రయత్నంగా “అమ్మా! ఇంకెప్పుడూ నీ మాట వినకుండా తప్పు పనులు చెయ్యను. ఇక నన్ను అతని దగ్గిరికి పంపకు.” అనసాగింది. 

“మధ్యలో నాకొడుకేం చేసేడమ్మా” అని గట్టిగా అనసాగింది దేవి. 

“నీ బాధ చూడలేనమ్మా. నాకంత ధైర్యం లేదు. బయట కూచుంటాను. మీ అత్తగారు ఉంటుందిలే ఇక్కడ” అంది జ్యోతి చెయ్యి నెమ్మదిగా వదిలించుకుంటూ. 

తన్మయికి ఎటూ దిక్కు తోచడం లేదు. ఏం జరుగుతూందో కూడా తెలియడం లేదు. కళ్ళు తేలిపోతున్నాయి.  ఒకే విధంగా పెట్టి ఉంచడంవల్ల కాళ్ళు తెగ గుంజేస్తున్నాయి.  తుంటి ఎముకలు విరిగిపోతున్న నెప్పులొక పక్క, కింద రంధ్రాల నించి ఏవేవో బయటికి  పోతున్న తడి తడి చికాకు స్పర్శ ఒక పక్క. ఎంతగా డాక్టరు చెప్పినట్లు చేస్తూన్నా  కడుపులోంచి బిడ్డ బయటికి రావడం లేదు.

నాలుగైదు గంటలు గడిచిపోయినా ఇదే పరిస్థితి.

“ఏవిటమ్మా ఈ పిల్ల, అస్సలు నొప్పులివ్వదు. తెల్లార్లూ ఇలా నిలబెడ్తదా మమ్మల్ని ఇప్పటికే అర్థ రాత్రి  అయ్యింది” అని డాక్టరు విసుక్కోవడం మొదలెట్టింది.

“మరేమనుకున్నారు డాక్టర్, ఈ మొండి పిల్ల చెప్పిన మాట వినడం లేదని నాకొడుకు అస్తమానూ బాధ పడ్తున్నాడు.” అని దేవి వంత పాడ సాగింది. 

తన్మయికి  మాటల వల్ల బాధ రెట్టింపు అయ్యింది.  “భగవంతుడా! నన్ను చంపెయ్యి. నాకొడుకుని రక్షించు”  అని మూగగా ప్రార్థించింది. 

పది నిమిషాల తర్వాత ఉన్నట్టుండి అంతా తనని వదిలేసి బయటకు వెళ్ళిపోవడం గమనించింది తన్మయి. ఆయమ్మని అడిగి కాళ్లు బారజాపుకుంది తన్మయి. ఒక్క సారిగా హాయిగా అనిపించింది. కడుపులో నొప్పి కూడా మందగించింది. అలిసిపోయినట్లు కడుపులో ఎటువంటి కదలికా లేదు.

కడుపు మీద మెల్లగా చెయ్యి పెట్టుకుని “నాన్నా, నిద్రపోతున్నావా? నీకేం భయం లేదు. అమ్మ ఉంది. నేను నిన్ను సురక్షితంగా బయటకు తీసుకు వస్తాను.” అంది లోపల్లోపల.

మనస్సులో ఉన్న పిరితనాన్ని  ఇక తీసి వెయ్యాలి. ధైర్యంగా ఈ బిడ్డను  బయటకు తీసుకురావాలి…..ధైర్యంగా… ” తనలో తను గొణుక్కుంటున్నట్లు గట్టిగా అనసాగింది. అర్థమయీ కాని  తన్మయి మాటలు విని ఆయమ్మడాక్టరుని పిలుచుకు రావడానికి వెళ్లింది. గుండె చప్పుడుతో బాటూ గడియారం చప్పుడు మహాగట్టిగా వినిపిస్తూంది. 

“ధైర్యంగా ఈ బిడ్డను  బయటకు తీసుకురావాలి” పది సార్లు అనుకున్న తర్వాత  స్థిరంగా నిర్ణయించుకుంది. “డాక్టరుతో చెప్పాలి. “తన బిడ్డ తనకి ముఖ్యం.  తను కాదు. ఆపరేషను చేసైనా  బయటకు తియ్యమని డాక్టరుతో చెప్పాలి”.

ఇంతలో జ్యోతి ఏడుస్తూ లోపలికి వచ్చింది.” ఏవిటమ్మా, ఇదంతా” అంటూ చుట్టూ ఉన్న దేవుడి పటాల  వైపు చూస్తూ మొక్కసాగింది. 

“ఏవైంది?” అంది తన్మయి. “డాక్టరు ‘నా వల్ల కాదు. మీ అమ్మాయిని మరో డాక్టరు దగ్గిరికి  తీసుకెళ్ల’మని చెప్తూంది” అంది ఏడుస్తూ.

“ఒకసారి నేను మాట్లాడతాను”  అంది తన్మయి ఓపిక లేకున్నా, తెగింపుగా.

దేవి వెనకే డాక్టరు వచ్చింది. “ఆపరేషను చేసైనా నా బిడ్డని బతికించండి” రెండు చేతులూ  ఎత్తి డాక్టరుకి దణ్ణం పెట్టింది తన్మయి.

“ఆపరేషను చెయ్యగలిగితే చెయ్యమా? బిడ్డ తల మధ్యలో ఇరుక్కుపోయింది. నువ్వు ఎంత గట్టిగా నొప్పులిస్తే అంత త్వరగా బిడ్డ ప్రమాదం లేకుండా బయటకు రాగలుగుతాడు. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇదొక్కటే మార్గం” అంది.

తన్మయికి గుండె వేగం హెచ్చింది. డాక్టర్  నాకు నొప్పులు రావడం లేదు అంది గాభరాగా. “ఇదిగో మళ్లీ నొప్పులకి  ఇంజక్షను  ఇస్తాను. నువ్వు సహకరించి ముందుకు తొయ్యి. ఇది సాయిబాబా విభూది ఏదీ నోరు తెరు” అంటూ కాస్త నోట్లో వేసి,  కాస్త పొట్టకి రాసింది. “ఆ పైన భగవంతుడున్నాడు” అంది.

తన్మయికి ఒక్కటే దృశ్యం కళ్ల ముందు. కడుపులో బిడ్డ ఊపిరి సలపకుండా తల తిప్పుతున్న దృశ్యం. “భగవంతుడా రక్షించు, భగవంతుడా రక్షించు” అనుకుంటూ పళ్ళు గిట్ట కరిచి శక్తిని కూడదీసుకుని నొప్పులివ్వసాగింది. 

ఫోర్  సెప్స్ చప్పుడు,  శబ్దం చేసే వాక్యూం మెషినుతో బిడ్డ తలని లాగడం వంటివి తెలుస్తున్నాయి. 

పక్కనున్న ఆయమ్మ తన్మయి చెయ్యి గట్టిగా పట్టుకుని “ఏసయ్యా” ఏసయ్యా” అంటూ ఉంది. 

తెల్లవారుతుండగా ఒక్కసారిగా వరద కట్టలు తెంచుకున్నట్లు, ఏదో తెగి దభాలున భూమి మీద పడ్డట్లు,  కడుపులోంచి ఒక తూటా హఠాత్తుగా బయటకు వచ్చినట్లు జర్రున ఒక స్పర్శ, వెనకే చంటి బిడ్డ ఏడుపు వినిపించాయి తన్మయికి. ఆనందంతో  నవ్వడానికీ, శరీరపు బాధతో దు:ఖించడానికీ ఓపిక లేదు తన్మయికి. 

కళ్ల ముందు బిడ్డని చూపించింది నర్సు. “హమ్మయ్య తల్లీ, ఇదిగో నీ కొడుకు” అంటూ. 

ఒళ్లు తుడవ గానే దేవి పక్కనే ఉండి ముందుగా బిడ్డని చేతిలోకి తీసుకుంది.”నా మనవడు” అంటూ.

మరో అరగంటలో తన్మయిని జబ్బలు పుచ్చుకుని లేపేరు. పదిహేను కుట్లు వెయ్యడం వల్ల ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు అడుగు  పడడం లేదు తన్మయికి. 

ఆ పక్కనే వెల్తురు సరిగా లేని గదిలో నేలకి కాస్త ఎత్తులో ఉన్న ఇనప మంచమ్మీద పడుకోబెట్టారు తన్మయిని. జ్యోతి కూతురి మాట మర్చిపోయి  అపురూపంగా మనవడిని చూసుకో సాగింది. “మీ అమ్మని ఎన్ని కష్టాలు పెట్టేసేవు నాయనా” అంది నవ్వుతూ. 

తల్లి ఒళ్ళో  పొత్తిళ్ళలో ఉన్న బిడ్డని చూసి అప్పటి వరకు ఉన్న బాధంతా ఎగిరిపోయింది తన్మయికి. బాబుని పక్కన వెయ్యమని అడిగింది. 

 అప్పుడే పుట్టినా రెండు నెలల పిల్లాడిలా పొడవైన శరీరం, పాల నురుగులాంటి మంచి రంగు,  చక్కగా విప్పారి గుండ్రంగా తిప్పుతూన్న చిన్ని కళ్లు, చిన్న ఉంగరాల జుట్టు, అదే పనిగా జుముక్కుంటూన్న అరచెయ్యి వెనక చిన్ని అందమైన బుల్లి నోరు. 

తన్మయి కళ్ళల్లోంచి సంతోషంతో నిండిన నీళ్లు జారి బుగ్గల్ని తడిపేసేయి. 

ప్రపంచంలో అంత వరకూ ఇంత అందమైన పసి బిడ్డని ఎప్పుడూ చూడలేదు తన్మయి. కడుపులో నుంచి తెలీని ఆనందం కలగసాగింది. 

దగ్గరకు తీసుకోవాలని అనుకుంది.  ఇన్నాళ్లూ రోజూ కబుర్లాడుతూ ఉన్నా,  గబుక్కున ముట్టుకోవడానికి ఏదో ఒక విచిత్రమైన అపరిచిత భావన కలిగింది. పక్కన పడుకున్న పసి వాడి  బుగ్గ మీద  చూపుడు వేలి తో నెమ్మదిగా రాసింది. మరు నిమిషంలో దగ్గరకు తీసుకుని హత్తుకుంది, ఒక్క సారిగా గుండె  ఉప్పొంగినట్లయ్యింది. 

“ఎవరీ బుడతడు? నా కడుపు నించి ఉద్భవించి నన్ను పాల తల్లిని చేసిన వాడెవడీ బుడతడు?” అప్రయత్నంగా తన్మయి పెదాల వెనక మాటలు కదిలి, పెదవుల మీద చిర్నవ్వు మొలిచింది.

“శేఖర్! నువ్వు నా కష్టం చూడకపోయినా ఫర్వాలేదు. ఈ చిర్నవ్వు చూసి ఉంటే  ఎంత  బావుండేది?!” అప్రయత్నంగా అనుకుంది.

తన్మయికి  జీవితంలో మొదటి సారి గెలిచిన భావన కలిగింది. “బహుశా: తను చావుని జయించింది. మరణం అంచు వరకూ వెళ్లి రావడం కంటే కష్టం ఏవుంటుంది?” ఇక మీదట దేనికీ భయపడకూడదని నిర్ణయించుకుంది. 

తన్మయికి ఒకటి మాత్రం బాగా  అర్థం అయ్యింది. “మరణం దగ్గిర ఎవరూ తోడురారు. అమ్మయినా,  భర్తయినా. దీనితో పోలిస్తే మిగతా కష్టాలన్నీ ఏ పాటి?” 

ఇంటికెళ్లొచ్చి అప్పుడే గదిలోకి వచ్చిన దేవి “శేఖర్ రేపు ఉదయం వస్తున్నాడు.” ” ఒరేయ్ నాన్నా, మీ నాన్నొస్తున్నాడురా ”  అంది  నవ్వుతూ. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.