ఉత్తరం-8

నీ చర్యలు రాక్షసంగా వున్నాయి

రచయిత: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

 

నేపథ్యం:

గాంధీ ….. హిట్లర్ కు రాసిన ఉత్తరంలో ఇది రెండవది. ఆయన రాసిన ఈ రెండు ఉత్తరాలు హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు అడ్డుపడ్డారు.

నాయకుడుగా ఎదుగుతున్న దశలో హిట్లర్ కు ఆదర్శం ….. అప్పటి ఇటలి ప్రధానమంత్రి, ముస్సోలిని!
ముస్సోలిని ఫాసిస్ట్ చర్యలు హిట్లర్ కు ఎంతగానో నచ్చాయి!
హిట్లర్, ముస్సోలిని …… ఇద్దరూ దురాక్రమణదారులే!
అభిప్రాయభేదాలు వున్నప్పటికీ ఇద్దరూ స్నేహితులుగా వున్నారు!
ఇద్దరూ నియంతలుగా చరిత్రలో నిలిచిపోయారు!

ఈ ఉత్తరం ….. కొద్ది మార్పులతో ముస్సోలినికి కూడా రాసినట్లే అని గాంధీ ఇదే ఉత్తరం చివరలో పేర్కొన్నాడు.

1939 మార్చ్ నెలలో జేకోస్లావాకియాను, సెప్టెంబర్లో పోలాండ్ ను, 1940 ఏప్రిల్లో డెన్మార్క్
హిట్లర్ ఆక్రమించాడు. పోలాండ్ ఆక్రమణలో జర్మనీకి సోవియట్ యూనియన్ సహాయం చేసింది. ఈ ఉదాహరణలను గాంధీజీ ఇదే ఉత్తరంలో ప్రస్తావించాడు.

(ఇంగ్లీష్ లోని you అనే పదానికి తెలుగులో “నీవు, మీరు” అనే రెండర్థాలు వున్నాయి. అయితే ….. నేను ఈ ఉత్తరమంతటా ….. “నీవు” అనే పదాన్ని మాత్రమే వాడాను. గాంధీ గారి అభిప్రాయం కూడా “నీవు” అనే అయివుండవచ్చని నా విశ్వాసం. అది కాకపోయినా ….. కోపంతో రాసే ఉత్తరంలో …… అందునా హిట్లర్ లాంటి వ్యక్తికి బహువచనపు సంభోదన సరి కాదేమో అని కూడా మరో భావన.)

***

భారతదేశం
వార్దా నుండి
డిసెంబర్ 24, 1940


ప్రియ మిత్రమా,

నేను నిన్ను మిత్రమా అని సంభోదించడం కేవలం మర్యాదగా కాదు…నాకు శత్రువులు లేరు. జాతి, మత, వర్ణబేధం పాటించకుండా మానవాళి మొత్తాన్ని నా స్నేహితుల జాబితాలో చేర్చుకోవడమే నేను గత ౩౩ సంవత్సరాలుగా చేస్తున్న పని. సర్వమానవ సౌభాతృత్వ సిద్ధాంతం వల్ల ప్రభావితమైన చాలామంది నీ చర్యలను ఎలా పరిశిలిస్తున్నారో తెలుసుకొనే సమయం, కోరిక మీకు వుందనే నేను ఆశిస్తున్నాను. నీ ధైర్యసాహసాలు , దేశభక్తి పట్ల మాకు ఇసుమంతైనా అనుమానం లేదు. నిన్ను రక్కసుడిగా వర్ణిస్తున్న నీ విరోధుల మాటల్ని కూడా మేము నమ్మడం లేదు. కానీ…. నీ, నీ అనుయాయుల, అభిమానుల రాతలు, ప్రకటనలు, చర్యలు మాత్రం రాక్షసంగా …… మానుషహోదాకు తగని విధంగా వున్నాయని ….. సర్వమానవ సౌభాతృత్వాన్ని కోరుకునే నాలాంటి వారికి అనిపిస్తున్నది. జేకొస్లావియాకు నీవు చేసిన అవమానం, పోలాండ్ పై మానభంగం, డెన్మార్క్ మింగివేత ….. ఆ విధంగా వున్నాయి. నీవు చేసిన దురాక్రమణలు ధర్మమే అని నీవు అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు. కానీ, అట్లాంటి పనులు మానవత్వాన్ని భ్రష్టుపట్టించడమే అని మాకు చిన్నతనంనుండి భోదించారు. కాబట్టి, నీ ఆయుధాలకు విజయం చేకూరాలని బహుశా మేము శుభాకాంక్షలు చెప్పలేము.

మేమొక అద్వితీయ స్థానంలో వున్నాము. మేము బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని…. అలాగే నాజిజాన్ని ఒకేలాగ ప్రతిఘటిస్తున్నాము. ఒకవేళ తేడా ఏమైనా వుంటే….అది హెచ్చు తగ్గుల్లోనే. ఏ విధమైన ఆధారాలకు చిక్కకుండా, మానవజాతిలో ఐదవవంతు బ్రిటిష్ పాదాలకింద చేర్చబడింది. మా ప్రతిఘటన బ్రిటిష్ ప్రజలకు ఎంతమాత్రము హాని చేయదు. మేము వారిని యుద్దంలో ఓడించకుండా, వారిని మార్చాలని చూస్తున్నాము. మాది బ్రిటిష్ పాలన పట్ల ఆయుధాలు లేని తిరుగుబాటు. మేము వారిని మార్చినా, మార్చలేకపోయినా….అహింస సహాయనిరాకరణతో వారి పాలన కొనసాగకుండా చేయాలనే కృతనిశ్చయముతోవున్నాము. ఇలాంటి పద్దతుల వల్ల వారు ఎలాంటి రక్షణ పొందలేరు. తప్పనిసరి పరిస్థితిలో గాని అంగీకారంతో కాని….బలికి గురయే వ్యక్తి యొక్క సహకారం ఎంతోకొంత లేనిదే ఏ దురాక్రమణదారుడు తనకు కావలిసిన దానిని పొందలేడు అనే జ్ఞానం మీద ఆ కార్యక్రమం రూపొందింది. మా పాలకులు మా భూమిని, శరీరాలను ఆక్రమించుకొన్నారు కాని మా ఆత్మలను కాదు. పిల్లలతో సహా భారతీయ స్త్రీ పురుషులందరినీ నాశనం చేసిన తర్వాతనే వారికి మా భూమి దక్కుతుంది. అందరూ ఒకేరకమైన ధీరోదాత్తతను ప్రదర్శించలేకపోవచ్చు. కొంత భయం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గి తిరుగుబాటును బలహీనం చేయవచ్చు. కాని ఆ వాదనను పక్కకు నెడదాం. కానీ, ఒకవేళ సరిపోయినంతమంది భారతీయులు ఎలాంటి చెడు భావన లేకుండా…. దురాక్రమణదారుల ముందు మోకరిల్లే బదులు …. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టేటట్ట్లైతే …. ఈ హింసాత్మక నిరంకుశ పాలననుండి స్వేచ్చాస్వాతంత్ర్యాలను మాకు చవిచూపేవారు. అలాంటి స్త్రీ పురుషులు భారతదేశంలో ఉహించలేనంతమంది నీకు కనపడతారు అని చెపితే …. ఆ విషయం నీవు నమ్మాలని చెపుతున్నాను. గత 20 సంవత్సరాలుగా వారికి అలాంటి శిక్షణ ఇవ్వబడుతున్నది.

బ్రిటిష్ పాలనను తోసివేయడానికి గత అర్ధశతాబ్ది కాలంగా మేము ప్రయత్నిస్తున్నాము. స్వాతంత్ర్య పోరాటం ఇప్పుడున్నంత బలంగా ముందెన్నడూ లేదు. అత్యంత బలమైన రాజకీయ సంస్థ ….. భారత జాతీయ కాంగ్రెస్ ….. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. అహింసా మార్గంలో…. మేము ఎంతో విజయవంతమైనాము. ఈ విషయంలో ….. ప్రపంచంలోనే వ్యవస్థీకృత హింసకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటిష్ బలంతో పోరాడడానికి అనువైన మార్గాలకోసం మేము వెతుకుతున్నాము. నీవు దాన్ని సవాలు చేసావు. ఇక మిగిలింది ఏది ఎక్కువ వ్యవస్థీకృత మైనది అనే విషయం….బ్రిటిష్ వారా లేక జర్మన్లా. మరియు బ్రిటిష్ వారు ఎలాంటివారో మాకు తెలుసు. అలాగే యూరోపియన్ జాతుల గురించి మాకు తెలుసు. కానీ ….. జర్మని సహాయంతో బ్రిటిష్ పాలనను అంతమొందించాలని మేము ఎన్నడూ అనుకోము. వ్యవస్థీకృతం చేసినట్లయితే ….. ప్రపంచంలోని హింసాత్మక శక్తులు అన్నిటినీ కట్టుగలిపినా …. అహింసకు సాటిరావు అనే విషయం మేము కనుగొన్నాము. నేను చెప్పినట్లుగా అహింసా మార్గంలో ఓటమి అనేది లేదు. కొట్టకుండా, చంపకుండా …. రణమో, మరణమో అది తేలుస్తుంది. డబ్బు అవసరం లేకుండా దానిని వినియోగించవచ్చు. నీవు సమగ్రత సాధించి తెచ్చిన వినాశకరమైన శాస్త్రీయ విజ్ఞానపు అవసరం కూడా లేదు. అది ఎవరి సొంతం కాదన్న విషయం నీవు గ్రహించకపోవడం నాకు విడ్డూరంగా వుంది. బ్రిటిష్ వారు కాకపోతే మరొకరు ….. నీ పద్దతులను మరింత అభివృద్ధిచేసి నిన్ను నీ ఆయుధంతోనే తప్పకుండా నాశనం చేస్తారు. మీ జాతి గర్వపడేలా వుండే సంపదను ఏమి వారికి నీవు సమకూర్చడం లేదు. నీది ఎంతటి వ్యుహత్మకమైన పథకరచన అయినా సరే హింసాగానాలను పాడుతూ అందులో వారు గర్వపడలేరు.

అందువల్ల, యుద్దాన్ని ఆపివేయమని మానవాళి తరఫున నేను నిన్ను అభ్యర్తిస్తున్నాను. నీకు గ్రేట్ బ్రిటన్ కు మధ్య వున్న వివాదాంశాలపై ఉమ్మడిగా మీరు ఉభయులు నచ్చిన ఓ అంతర్జాతీయ న్యాయస్థానికి విన్నవించుకోవడంలో నీవు నష్టపడేది ఏమి వుండదు. ఒకవేళ నీవు విజయం సాధించినా ….. నీవు చేసినది సరైనదే అని రుజువుచేయలేవు. అది కేవలం నీ శక్తి ఎంత ఎక్కువ వినాశనకరమైనదో అని మాత్రమే తెలియజేస్తుంది. మానవుని శక్తి కొద్ది ఏ పక్షపు వాదన సరియైనది అని నిష్పాక్షకమైన న్యాయస్థానమే తేటతెల్లం చేయగలదు. ప్రతి బ్రిటిష్ జాతియుడికి నా అహింసామార్గపు ప్రతిఘటనను అంగీకరించమని కొద్దికాలం క్రితం నేను చేసిన విన్నపం గురించి నీకు తెలుసు. నేను తిరుగుబాటుదారునైనా వాళ్ళ స్నేహితుడినేననే విషయం వాళ్లకు తెలుసు కాబట్టే ….. నేను ఆ విజ్ఞప్తి చేశాను. నేను నీకు నీ ప్రజలకు కొత్తవాణ్ని. బ్రిటిష్ వారికి చేసినంత శక్తివంతంగా ….. మీకు విజ్ఞప్తి చేసే ధైర్యం నాకు లేదు. బ్రిటిష్ వారికి అన్వయించినంత శక్తివంతంగా మీకు అన్వయించదు అని నేను చెప్పడంలేదు. కానీ, నేను చేస్తున్న ప్రస్తుత ప్రతిపాదన చాలా సులువైనది. ఎందుకంటే …… అది అందరకీ తెలిసినది, ఆచరణయోగ్యమైనది. యూరపులోని ప్రజల హృదయాలు శాంతిని కోరుతున్న ఈ సమయంలో ….. శాంతియుతంగా చేస్తున్నదైనా సరే ….. మా పోరాటాన్ని ఆపివేశాము. కోట్లాది మూగ ప్రజల గొంతుక ధ్వనుల్ని వినడం అలవాటైన నా చెవులకు ….. శాంతిని కోరుతూ అరుస్తున్న కోట్లాది యూరోపియన్ల మూగ ధ్వనులు నేను ఇప్పుడు వినగలుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో ….. శాంతి కోసం ప్రయత్నించమని నీకు చెప్పడం చాలా ఎక్కువ అవుతుందా? అది నీకు లెక్కలేకపోవచ్చు. కానీ ….. ఇంగ్లండ్ లో రౌండ్ టేబుల్ సమావేశం సందర్బంగా ….. (దారిలో) నేను రోమ్ ను సందర్శించినపుడు, నాకు నిన్నూ, ముస్సోలినిని కలుసుకునే భాగ్యం కలిగింది. అప్పుడే మీ ఇద్దరికీ కలిపి ఈ విన్నపం చేయాలని అనుకొన్నాను. కొన్ని మార్పులతో ఈ లేఖ తనకు కూడా రాసినట్టుగా అతను భావిస్తాడని ఆశిస్తున్నాను.

***

ముగింపు:
========

“తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలు,
నిర్మించిన కృత్రిమచట్టాల్‌
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై”

అని శ్రీశ్రీ గారు అన్నట్టు …… వారిద్దరి జీవితాలు దారుణంగా ముగిసినాయి.

1945 లో ముస్సోలినిని చనిపోయిన జంతు కళేబరాలు వేలాడదీసే కొక్కేలకు తగిలించి ….. రాళ్ళతో కొట్టి, హింసించి చంపారు! హిట్లర్ మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడు.

***

ఉపన్యాసం-8

అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు

వక్త:షేక్స్పియర్ “హామ్లెట్” నాటకంలో “పోలోనియస్” పాత్ర

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం:

షేక్స్పియర్ రచనలన్నిటిలో తలమానికమైనిది, మహత్తరమైనది ….. “హామ్లెట్” నాటకం.

ఆ నాటకం మొదటి అంకంలోని మూడవ సీనులో …… లారెటీజ్ అనే యువకుడికి తండ్రి (పొలోనియస్) చెప్పే మాటలు ఇవి.

నిజానికి ఇది ఉపన్యాసం కాదుగాని ….. నాలుగు శతాబ్దాలు పైగా సమయం గడచిపోయినా ….. ఈనాటికీ ….. ఓ తండ్రి కొడుక్కి చెప్పాల్సిన మాటలు ఇంచుమించుగా ఇలాగే వుంటాయి అని అనుకొని వుండడం వల్ల ….. నేను దీని అనువాదానికి పూనుకున్నాను.

డెన్మార్క్ రాజు క్లాడియస్ వద్ద పోలోనియస్ ప్రధాన సలహాదారు. పోలోనియస్ కు ఇద్దరు పిల్లలు….. లారెటీజ్, ఒఫీలియా (అమ్మాయి).

పారిస్ (ఫ్రాన్స్) లోని సోర్ బోర్న్ యూనివర్సిటీలో చదువుకుంటున్న లారెటీజ్ ఓడ ప్రయాణానికి సిద్దంగా వుండి, వెళ్లేముందు చెల్లాయి ఒఫిలియా నుండి వీడ్కోలు తీసుకుంటూ వుంటాడు. వెళ్ళడానికి ఆలస్యమవుతుందని తండ్రికి కోపం వస్తుంది.

***

ఉపన్యాసం

లారెటీజ్! నువ్వు ఇంకా ఇక్కడే వున్నావు…..సిగ్గు పడాలి!
నీ ఓడ వెళ్ళడానికి సిద్దమయింది, నువ్వేమో ఇక్కడే వున్నావు.
వెళ్ళు; నా ఆశీస్సులు నీకు ఎప్పుడు వుంటాయి!

కానీ…..కొన్ని ధర్మ సూత్రాలు గుర్తుపెట్టుకో!
నీ ప్రవర్తన బాగా ఉండేట్టు చూసుకో!
ఏది తోస్తే అది మాట్లాడకు. అట్లాగే…..
ఏది చేయాలనిపిస్తే అది ఆలోచించకుండా చేయవద్దు.
అందరితో స్నేహంగా వుండు. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించకు.
నీకున్న స్నేహితుల్లో…..విశ్వాసపాత్రులను
ఉక్కు సంకెళ్ళతో నీ హృదయానికి కట్టిపడేయ్!
కానీ….. కొత్త స్నేహితులతో ఇష్టం వచ్చినట్టు తిరిగి
నీ ఉనికిని చెడగొట్టుకోవద్దు!
ఎప్పుడైనా పోట్లాటకు సిద్దమైతే…..ముందే ఆలోచించు!
కానీ, సిద్దమైన తర్వాత ….. ఎదుటివాడు కూడా నీ గురించి అంచనా వేస్తాడని గ్రహించు!
ఎవరు చెప్పినా విను….. కానీ అందరికి సలహాలు ఇవ్వకు!
అందరి విమర్శలు విను…..కాని నీ నిర్ణయాన్ని అట్టిపెట్టుకో!
నీ తాహతుకు తగిన దుస్తులు కొనుక్కో …. .ఖరీదైనా పరవాలేదు,
కానీ, డాంబికం వద్దు ….. తళుకులు వద్దు.
ఎందుకంటే ….. మనిషి ఏమిటో దుస్తులు తెలియజేస్తాయి!
ఆ విషయంలో మంచి హోదాలో వున్న ఫ్రెంచ్ వాళ్ళు మార్గదర్శకులు!
అప్పు తీసుకోవద్దు ….. ఇవ్వవద్దు!
ఎందుకంటే ఆ డబ్బుతో పాటు ….. స్నేహితులనూ కోల్పోతాము!
అప్పు ….. విచక్షణ మరిపించి ….. విలాసాలకు దారి తీయిస్తుంది!
అన్నిటికన్నా ముఖ్యంగా…..నీ పట్ల నీవు నిజాయితిగా వుండు;
….. దాన్నే అనుసరించు!
పగలు తర్వాత రేయిలాగ …..
అప్పుడు ….. నీవు ఉదాత్తంగా కనపడుతావు.
నిన్ను ఆశీర్వదిస్తున్నాను, సెలవు!

***

ముగింపు:
————-

షేక్స్పియర్ మహాకవిగా కీర్తించబడ్డాడు. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ….. తాను రాసిన నాటకాల్లోనే ….. కవిత్వం కూడా జొప్పించాడు.

“neither a lender, nor a borrower be” అనే కొటేషన్ ఈ పద్యభాగంలోనిదే. అప్పటి ఆ మాటలు ….. ముఖ్యంగా అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు అనే మాటలు ఎంత ఆచరణీయమైనవో అందరకూ తెలిసిన విషయమే! ఉన్నదాంట్లో బతకడం, అవసరం లేకున్నా అప్పులు ఇచ్చే ….. లేదా ప్రలోభాలకు గురిచేసే ….. వర్తక, వ్యాపార సంస్థలు ఈరోజు కొల్లలుకొల్లలుగా జనాలను కొల్లగొడుతున్నాయి. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో …… అప్పు కోసం ఎవరి దగ్గరకు వెళ్ళాలన్నా ….. వారిని అడగాలన్నా ….. ఏదో తలతీసేసినట్టుగా ఉండేది. కానీ …… ఇప్పుడో … ఓ క్రెడిట్ కార్డ్ కావాలంటే, మన గుమ్మంలోకి వచ్చి వాలిపోతుంది. అప్పులు ఇస్తాము …అంటూ ప్రకటనలే గాకుండా, రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, మనల్ని బ్యాంకులు కూడా ప్రలోభ పెడుతున్నాయి. అట్లా ….. అప్పుల ఊబిలోకి లాగుతున్న వ్యవస్థకు ఎదురీదాల్సిన పరిస్థితిలో మనం ఉండడం విచారకరం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.