వెనుతిరగని వెన్నెల(భాగం-16)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-16)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన ఆరు నెలల్లోనే  తన్మయి  గర్భవతి అవుతుంది. డెలివరీకి అమ్మగారింటికి వస్తుంది.

***

శేఖర్ మర్నాడు తెల్లారగట్ల కి వచ్చేడు. ఏదో పెట్రోలు వాసనలా వస్తే ఉలిక్కిపడి లేచింది తన్మయి. కళ్లు తెరవగానే ఎప్పటినించో స్నానం చెయ్యనట్లు మకిలిపట్టి ఉన్న శేఖర్ కనిపించేడు.  పక్కనున్న హాయిగా నిద్రపోతున్న పసివాడి మీదికి వాలి, కళ్ల నిండా గొప్ప సంతోషంతో చూడసాగేడు. 

అంతలోనే “రారా, నాన్నా. ఈ నాన్న దగ్గిరికి వచ్చేయి.” అంటూ అమాంతంగా నిద్రపోతున్న వాణ్ణి చేతుల్లోకి తీసుకుని భుజాన వేసుకున్నాడు. 

అరగంట దాటినా కొడుకుతోనే కబుర్లు చెప్తూన్న శేఖర్ వైపు చూస్తూ “నేనెలా ఉన్నానో అడిగేవా?” అంది తన్మయి ఉక్రోషంగా.

“నీకేవే, తొమ్మిది నెల్లు పందిలా తిని ఎలా ఊరేవో చూడు. నా కొడుక్కి నువ్వు తిన్న దాంట్లో పదో వంతు వచ్చినా బావుణ్ణు. చూడు, వీడి కాళ్లూ చేతులూ ఎలా బలహీనంగా ఉన్నాయో. అసలే మగోడు.” అని వెకిలిగా నవ్వేడు.

ఆ మాటలకి అదే గదిలో మరో వైపు పడుకున్న జ్యోతికి మెలకువ వచ్చినట్లుంది. “అసలే నిన్నంతా పురిటి నెప్పులు పడీ పడీ మొఖం పీక్కుపోయి ఉందది. అవేం మాటలు బాబూ!” అంది.

“మీ అమ్మని కాస్సేపు నోరుమూసుకుని ఉండమంటావా?” గద్దిస్తూ గట్టిగా అన్నాడు. 

“ఏం, నేనెందుకు నోరు మూసుకోవాలి? నువ్వేవైనా నాడెంగా మాట్లాడతన్నావా?” అందుకుంది జ్యోతి.

“నా పెళ్ళాం, నా ఇష్టం. ఛీ..ఛీ.. పెళ్లాంతో వేళాకోళం ఆడుకోవడానికి కూడా లేదు. మీ వాళ్లింకెప్పటికీ  మారరు. ఇదిగో ముందే చెప్తున్నాను. నెల రోజులలో నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఇదే వంక పెట్టుకుని అమ్మగారింట్లో నెలల తరబడి మకాం వేయడం కాదు.” అంటూ బయటికి వెళ్లిపోయాడు.

ఏ మాటా వినే ఓపిక లేని తన్మయి నిస్తేజంగా  కళ్లు మూసుకుంది. ‘అతనెందుకు వచ్చాడో, ఎందుకు వెళ్లిపోయాడో’ ఏదీ ఆలోచించాలని లేదు. 

పక్కన చిన్న గొంతుతో “కీచు కీచు” మని ఏడుస్తున్న  పసి వాడిని దగ్గరకు లాక్కుని తల నిమిరింది.

 “ఇవేవీ పట్టించుకోకు నాన్నా! హాయిగా పాలు తాగి బజ్జో.”  అని వాడి చెవిలో గుసగుసలాడింది.

ఏదో అర్థమైనట్లు కళ్లు విప్పి తనకేసి చూస్తున్న బుడతడి వైపు ఆశ్చర్యంగా చూసింది.

“వీడు నిన్నే ఈ భూమి మీది కొచ్చి అంతలోనే ఏదో ప్రపంచమంతా అర్థమయ్యినట్లు ఎలా చూస్తున్నాడో!” అంది పైకి అప్రయత్నంగా.

జ్యోతి అటు వైపు తిరిగి పడుకుంది. ఏడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తూంది.

“శేఖర్ మాటలు పట్టించుకోకమ్మా” అంది నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని తల్లితో.

అతని మీద ఉన్న కోపమంతా ఒక్కసారిగా పెల్లుబుకుతూన్న గొంతుతో “అవునమ్మా, నువ్వూ నాకే చెప్పు. మొగుడికేమీ చెప్పుకోకు. అయినా నేను నీలా దద్దమ్మని కాను. నోరు మూసుకుని ఉండడానికి. పెళ్లయిన కొత్తలో నిన్ను “కుక్కా!” ఇలా రావే” అని పిలిచినప్పుడే వాడి పళ్లు రాల గొట్టి ఉండాల్సింది. అదేదో గొప్పన్నట్లు , ఆ రోజు వాడది ‘జోకన్నప్పుడు’ నువ్వూ తలూపేవు. ఇప్పుడు చూడు, పురిటి మంచంలో ఉన్న నిన్ను పట్టుకుని అంతంత మాటలంటాడా? నేనెందుకు ఓర్చుకోవాలి?”  అంది గట్టిగా.

“ఎందుకు ఓర్చుకోవాలి?” ఆ ప్రశ్నకి సమాధానం తన్మయికి కూడా తెలీదు.

“అతన్ని ఇష్టపడినందుకో, ఎవరు కాదన్నా పెళ్లి చేసుకున్నందుకో…నిజంగా తను దద్దమ్మ అయినందుకో …  సమాధానం నాకే తెలీదు” అనుకుంది మనసులో.

కానీ ఇప్పుడిక ఏవన్నా, అతన్ని తను వెనకేసుకొస్తున్నానని తన మీద కోప్పడుతుంది తల్లి. 

అందుకే మౌనంగా కళ్లుమూసుకుంది.

“నిన్న రోజంతా బల్ల మీద అనుభవించిన నరకం, మరణపు చివరి మెట్టు మీద కాలు మోపి వచ్చిన క్షణం ముందు ఇవన్నీ ఎంత? మాటలదేముంది, ఇవేళుంటాయి. రేపు మర్చిపోతాం. 

అయినా తనకు తన బిడ్డ ముఖ్యం. వీళ్లెవరూ కారు. బాబు కోసమైనా తను సంతోషంగా ఉండాలి.” అని దృఢంగా అనుకుంది మనసులో.  

పిల్లాడికి పాలిద్దామని దగ్గరకు తీసుకుంది.  

దగ్గరకు తీసుకోవడమే తడవుగా పాల కోసం అలమటించినట్లు హడావిడిగా ముఖాన్ని గబగబా తిప్పేయసాగేడు బాబు. 

“నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నా పాలు పట్టుకోవడం రావడం లేదు, హడావిడి మాత్రం చాలా ఎక్కువ. ఏంటిరా నాన్నా! నాకూ కొత్తేరా. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.” అంది మురిపెంగా.

పక్కన పడుకుని కాస్సేపూ, కూర్చుని కాస్సేపూ ప్రయత్నించసాగింది.

ఒళ్లో వేసుకోగానే బాబు కళ్లు కాస్త పచ్చగా కనిపించాయి.

తల్లిని పిలిచి చూపించింది. “ఏం ఫర్వాలేదులే, పిల్లలకి మొదటి మూడు రోజులు ఇలాగే ఉంటాయి కళ్లు. అయినా ఇందాకా డాక్టరమ్మ వచ్చి చూసిందిగా.ఏవీ చెప్పలేదు.” అంది జ్యోతి. 

మర్నాడు డాక్టరు రౌండ్లకి వచ్చే వేళకి దట్టమైన పచ్చదనం అలుముకుంది బాబు కళ్లకి.

“రండి డాక్టర్, ముందా కళ్లు చూడండి” అంది తన్మయి.  

“ఊ.. పిల్లాడు బాగా నలిగి పోయేడు కదా కాన్పులో. కామెర్లు  వచ్చాయి. మా దగ్గర పిల్లలకు ఇందుకు వైద్యం చేసే ఫెసిలిటీ లేదు. రెండు వీథుల అవతల హాస్పిటల్ కు రాసిస్తాను. మీ అత్తగారికి తెలుసులే. తీసుకెళ్లండి. అయినా నిన్ను ఇవేళ డిశ్చార్జి చేసేస్తాం” అంది తాపీగా.  

తన్మయి గుండెల్లో ఒక్కసారిగా మొదలైన భయం శరీరమంతా పాకి కాళ్లు ఒణక సాగేయి. “బాబుకి కామెర్లా?! భగవంతుడా! నన్నెందుకు ఇన్ని విధాలుగా పరీక్షిస్తున్నావు? లేదు. నా బాబుకి ఏవీ కాదు. అంత కష్టమైన కాన్పు నించే బతికి బయట పడ్డాడు. మృత్యుంజయుడు వీడు. వీడికెప్పుడూ ఏవీ కానివ్వను.” కన్నీళ్ళు తుడుచుకుంది తన్మయి.  

డాక్టరు అలా వెళ్లగానే పిల్లాడిని గుడ్డల్లో చుట్టి, డాక్టరిచ్చిన కాగితం పట్టుకుని  ఒక్క ఉదుటున బయటకు వచ్చింది. వెనకే జ్యోతి గట్టిగా పిలుస్తూన్నా వినిపించుకోలేదు.

తడబడే అడుగులతో, తడి ఆరని కుట్ల బాధని అదిమి పెట్టి, హవాయి చెప్పుల్ని ఈడ్చుకుంటూ  రెండు వీథులు ఎలా దాటిందో తెలియలేదు.

తన్మయి మనస్సులో ఒకటే ఆలోచన. “బాబుకు ఏవీ కాకూడదు. వీలయ్యినంత త్వరగా వైద్యం చేయించాలి.” 

జ్యోతి కూతురి బాధ చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కూడా నడిచింది. “సమయానికి మీ నాన్న కూడా ఏదో పనున్నట్టు పొద్దున్నే బయటికెళ్లి పోయేరు చూడు. ఇక మీ ఆయన ఎటు పోయేడో ఏమో. తండ్రీ, ఏడుకొండల వాడా..” అంటూ.  

ఎండలో నడిచొచ్చినందుకో, విపరీతమైన ఆదుర్దాకో తన్మయి ఒళ్ళంతా చెమటలు ధారాపాతంగా కారసాగేయి.  ఈ ఆసుపత్రి కొంచెం పెద్దది. ముందు డెస్కు., చుట్టూ బోల్డు మంది పేషంట్లని చూడగానే  నీరసం వచ్చింది తన్మయికి. అయినా అటుగా కనబడ్డ నర్సుకి పిల్లాడిని చూపించింది. అదృష్టం కొలదీ పిల్లాడిని చూడడానికి డాక్టరు దగ్గిరికి వెంటనే లోపలికి పంపించేరు.   

డాక్టరు బాబుని చూస్తూనే “అర్జంటుగా అడ్మిట్ చెయ్యండి. బాబుకి అల్ట్రా వయొలెట్ లైట్ ట్రీట్ మెంట్ మొదలెడతాం.” అన్నాడు.

“ఖర్చు గురించిన దిగులు పడకమ్మా. నా దగ్గిర ఉన్న దాంతో అడ్వాన్సు కడతాను. నాన్నగారు వచ్చేక మిగతాది ఆలోచిద్దాం.” అంది జ్యోతి తల నిమురుతూ.

తల్లి మాటలకి కన్నీళ్లు ఆగలేదు తన్మయికి. కావలించుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది. “ఊరుకోమ్మా, ఊరుకో. బాలింతవు, ఇలా ఏడవకూడదు.” అంది జ్యోతి. 

పిల్లాడి చేతికి సూది గుచ్చి మందులిస్తూంటే గుండె  విలవిల్లాడసాగింది తన్మయికి. అసలే ముందు రోజే టీకా వేసారు. కిళ్లు పెట్టి ఏడుస్తున్న పిల్లాడిని చూస్తూంటే తన్మయికి  కళ్లనీళ్లు ఆగడం లేదు. ఆగకుండా వస్తున్న కన్నీళ్లని ఒత్తుకుంటూ కూచుంది. 

నిశ్శబ్దంగా ఉన్న గదిలో ట్యూబ్ లైట్లు బిగించినట్లున్న  బల్ల మీద బట్టల్లేకుండా పడుకోబెట్టిన బాబుని  చూస్తూంటే, ఒక పక్క నించి తగ్గుతుందో లేదో అన్న భయం, పైకి చెప్పడం రాని వాడికి ఒంట్లో ఎలా ఉందో తెలీనితనం చుట్టుముట్టి అయోమయంగా కూచుంది తన్మయి ఎదురుగా బల్ల మీద.

జ్యోతి బయటికి వెళ్లి ఫోన్లు చేసింది అందరికీ.

మరో గంట తర్వాత పరుగులాంటి నడకతో దేవి వచ్చింది.”అదేమమ్మా, మమ్మల్నెవరినీ పిలవకుండా, అసలు ప్రసూతి ఆసుపత్రి నించి డిశ్చార్జి అవ్వకుండా ఇలా ఉన్న పళాన వచ్చెయ్యడమేనా? డాక్టరు నాకు ఫోను చేసి తల మొయ్యా చీవాట్లు పెట్టింది. పిల్లకి తెలియక పోతే నీకైనా తెలియొద్దా ఒదినా” అంటూ. 

తన్మయి ఇవేవీ పట్టనట్లు  కన్నార్పకుండా బాబు వైపే  చూస్తూంది.  ఏదో లోకంలో ఉన్నట్లు హాయిగా నిద్రపోతూ, నిద్దట్లో ప్రశాంతంగా నవ్వుతున్న బాబు ముఖాన్ని చూస్తూ  “పసిపిల్లలంత హాయిగా అంతా ఉండరెందుకు?” అనుకుంది. 

పిల్లాడి ముఖమ్మీద, తెల్లని ఒళ్ళంతా అలుముకున్న పచ్చదనం దగ్గిరికెళ్లి చూసేక, “పోనీలే. మంచి పని చేసేరు. అన్నట్లు శేఖర్  రాత్రంతా ఇక్కడే ఉన్నాడా? పొద్దనగా వచ్చి నిద్రపోతున్నాడు. ఇంకా వాడికి చెప్పలేదు. నేనింటికి వెళ్లి శేఖర్తో కేరేజీ పంపిస్తాను. అన్నట్లు పిల్లలకి కామెర్లు ఉన్నపుడు తల్లి కటిక పత్యం చేయాలి. నీకు పాలన్నం పంపుతాను. వాడికి తగ్గే వరకూ అలానే తినడం మంచిది.” అంది.

తన్మయి తలాడించింది.

నిజానికి తన్మయికి చిన్నతనం నించీ పాల వాసన పడదు. ఏదైనా పౌడరు కలుపుకుంటే గానీ తాగలేదు.  

పిల్లాడికి తగ్గుతుందంటే “ఏదైనా చేస్తాను.” దృఢంగా  అనుకుంది.

శేఖర్ కేరేజీ పట్టుకొచ్చి ముభావంగా పిల్లాడి దగ్గిర కూచున్నాడు. 

ఏవీ కలపని చప్పటి పాలన్నం మొదటి ముద్ద బయటికి రాబోయింది తన్మయికి. కానీ పిల్లాడికి పాలివ్వాలి అంటే తను తినాలి. కళ్ళు మూసుకుని గబగబా గొంతులో పోసుకుంది. 

ఎవరి ముఖ కవళికలూ పట్టించుకునే స్థితిలో లేదు తన్మయి. అసలు ఎవరూ మాట్లాడకుండా ఉంటే బావుణ్ణని ఉంది. పొద్దుట్నించీ యోగినిలా కూచుని ఉంది. నర్సు వచ్చి పాలు ఇమ్మన్నపుడల్లా బాబుని ఎత్తుకుని పక్క గదిలోకి వెళ్లడం, మళ్లీ వచ్చి కూచోవడం. అంతే.  ఒక్కటే ధ్యేయం. “బాబుని సురక్షితంగా ఇక్కడి నించి బయటకు తీసుకెళ్లాలి. ఏ కష్టమూ రాకుండా ఈ బిడ్డని కాపాడాలి.”

పాలిస్తూ కన్నీళ్లతో తడుస్తున్న చెంపల్ని ఒత్తుకుంటూన్న  కూతుర్ని చూసి “నీకే ఎన్ని కష్టాలు వచ్చాయే తల్లీ” అని తల నిమరసాగింది తల్లి.

శేఖర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే సాయంత్రం వరకూ ఉండి బయటకు వెళ్లిపోయేడు.

——–

మూడు రోజులు గడిచాయి. బాబుకి రోజుక్కొంత నయమవుతూ వస్తూంది. శేఖర్ “పనిలోసెలవు లేదని మళ్లీ డిశ్చార్జి సమయానికి వస్తానని” వెళ్లేడు. 

ఆ రోజు దీపావళి. బయటంతా పెద్ద చప్పుళ్లు. తన్మయికి దీపావళంటే అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా శబ్ద కాలుష్యాన్ని తను అస్సలు భరించలేదు.

చిన్నప్పుడు దీపావళికి చెవుల్లో దూదులు పెట్టించుకుని వంటింట్లో బెల్లమో, చింతపండో జాడీల పక్కన కూచునేది.

శేఖర్ కి దీపావళంటే చాలా ఇష్టం. తనతో బాటూ తన్మయిని బయటకు లాగి బాగా ఏడిపించాడు కిందటి ఏడాది.

జ్యోతి అలా బయట నిలబడి చూసొస్తానని వెళ్లింది.

తలుపులు మూసుకుని ఉన్న ఏ. సీ గదిలో లైటు కింద బాబు దగ్గిర కూచుని కబుర్లు చెప్ప సాగింది తన్మయి.

“నాన్నా! బయట శబ్దాలకి భయపడకూ! అమ్మని ఇక్కడే ఉన్నానుగా నీకేమీ కాదు. నువ్వు తొందరగా నయం చేసేసుకో. ఇంటికి వెళ్ళిపోదాం. బయట ప్రపంచం అంతా సంబరాలు చేసుకుంటున్నారు. మనిద్దరమేమో ఇలా. మనమూ పండగ చేసుకుందాం. నీకు అన్నీ తినడం రాగానే నీకు నచ్చినవన్నీ వండి పెడతాను. సరేనా!” 

బాబుకి ఏం పేరు పెట్టాలో అని సంభాషణలు అందరి నోటి వెంటా వస్తున్నాయి.

అట్నించీ, ఇట్నించీ మొదటి మనవడు కావడం వల్ల తాతగార్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదనలు ఎక్కువయ్యాయి.

“నీకేం పేరు కావాలి నాన్నా? అమ్మాయిగా పుడతావేమోనని నేను బోల్డు పేర్లు సిద్ధం చేసుకున్నాను. కానీ అబ్బాయివి అయిపోయేవు. నీ పాల బుగ్గలంత మృదువైన మంచి పేరు పెట్టాలని ఉంది నీకు. అమ్మని పెట్టమంటావా? వద్దా?” అంది సాలోచనగా.

అమ్మనే పెట్టమన్నట్లు చిర్నవ్వు నవ్వాడు పసివాడు.

“ఊ…ఏం పేరు పెట్టుకుందాం? బుచ్చిబాబు, చలం, తిలక్…. ఊ..  వద్దులే కవులూ, రచయితలూ వద్దు. ఎవరికీ ఉండని పేర్లేవైనా….. అంటే…. అజ్ఞాత్ లాంటివి… బాలేవు కదూ….

నీ పాల బుగ్గల్లాంటి మృదువైన పేరేదీ………. ఆ…”మృదుల్” … బావుందా?  మరి ముద్దు పేరు?  బుజ్జి, కన్నా, చిన్నా, చంటీ….పోనీ “నాన్నారూ”. 

“తనకంతా సమ్మతమే అన్నట్లు ఇంకాస్త ప్రశాంతంగా నవ్వేడు.”

“అమ్మలు, నాన్నలు, కన్నలు, బుజ్జులు, బంగారాలు … అన్నీ నువ్వే కదమ్మా…” బాబుతో పాటూ హాయిగా తనూ నవ్వేసింది. 

“మనం తొందరగా ఇక్కణ్ణించి ఇంటికి వెళ్లిపోదాం. హాయిగా పాలు తాగి తొందరగా పెద్దాడివయ్యిపోయి రోజూ ఆడుకుందాం…” ఏవేవో కబుర్లు చెప్తూన్న కూతురి వైపు అప్పుడే వచ్చిన జ్యోతి మురిపెంగా చూసింది. “నిన్నా మొన్నటి పసిపిల్లకి అప్పుడే కొడుకు” అంటూ మురిసిపోయింది.

——–

డెలివరీ అయిన పదిహేనో రోజున బాబుకి అంతా నయమయ్యిందని డిశ్చార్జి చేస్తామని చెప్పేరు. తన్మయి ముఖంలో ఇన్ని రోజులుగా తప్పిన కళ మళ్లీ తిరిగొచ్చింది.

డెలివరీ భయంకరమైన అనుభవంగా మిగిలింది. అందులోంచి తేరుకోకముందే బాబు విషయంలో ఖంగారు వల్ల గాభరా పడడం తప్ప ఏవీ సంతోషం లేదిన్నాళ్లూ.

తన్మయికి ఎక్కడ కూచుంటే అక్కడ కళ్లు తిరగడం మొదలయ్యాయి. “బహుశా: మానసికంగా బాగా ఓపిక లేకుండా అయిపోయినందువల్ల” అంది డాక్టరు.

కుట్లు విప్పినప్పటి కంటే అధికమైన బాధ అనుభవించింది ఇన్నాళ్లూ పిల్లాణ్ని చూస్తూ. శేఖర్ దగ్గర ఉండి  కాస్త ఓదార్పు గా ఉంటే ఎంతో బావుండేది. వచ్చి గొడవపడి వెళ్లిపోయాడు. అదొక మానసిక వ్యథ తయారైంది తన్మయికి. ఇలాంటి తండ్రితో ఈ పిల్లవాడి జీవితం ఎలా తయారవుతుందో అని ఆలోచించసాగింది అస్తమాటూ. ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా కొన్ని సార్లు ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టి దిగులు తప్పడం లేదు.

“మొదటి కాన్పు కి అంతా అమ్మగారే పెట్టాలి.” అంది దేవి ముందు రోజు.

“అసలే అందరం పిల్లోడికిలా అయ్యిందని బాధతో కుంగిపోతన్నాం. డెలివరీ అంటే మా పిల్లకి డెలివరీ ఆసుపత్రిలో అయిన ఖర్చు, ఇక్కడ చంటి పిల్లోణ్ణి జాయిన్ చేసేం. ఈ ఖర్చంతా కూడా మమ్మల్నే పెట్టు కోమంటే ఎలా?” అంది జ్యోతి.

“పిల్లలన్నాక ఎన్నో వస్తాయి. కాన్పుకి వచ్చిన పిల్లకి, బిడ్డకి ఏదొచ్చినా ఖర్చు మీది కాకపోతే మాదా?” అంది అంతే గట్టిగా దేవి. 

తన్మయికి గుండె దడ హెచ్చసాగింది. అసలే శేఖర్ ఇప్పటికే అలిగి వెళ్లిపోయేడు. ఇక ఇప్పుడు ఈవిడ కూడా అలిగితే మొత్తం తెంచుకున్నట్లు అవుతుంది.

“అమ్మా! నువ్వు కాస్త ఓపిక పడతావా? నాన్నగారొచ్చేక మాట్లాడి చూడొచ్చు కదా?” అంది తన్మయి హీనమైన గొంతుతో.

“అలా చెప్పమ్మా మీ అమ్మకి. నేను మళ్లీ రేపు వస్తాను.” అంది దేవి విసవిసా బయటికి నడుస్తూ.

జ్యోతి తోక తొక్కిన తాచులా గయ్యిమంది. సమయానికి భానుమూర్తి రాబట్టి  ఆ సంభాషణ మళ్లీ ఒక యుద్ధానికి దారి తీయకుండా ఆగింది.

“దేవుడి దయ వల్ల మనవడికి అంతా సర్దుకుంది. నేనేదొక రకంగా డబ్బు ఏర్పాటు చేస్తాలే. ఇప్పటికిప్పుడు  ఇలాంటి ఖర్చులొస్తాయని వాళ్లు మాత్రం కలగన్నారా ఏంటి? అల్లుడి ప్రయోజకత్వం చూసేవుగా. ఇంకా ఎందుకు వాళ్లనడగడం? ” అని కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడేడు.

తన్మయి తండ్రి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.

ఆ సాయంత్రానికి శేఖర్  వచ్చేడు. 

వస్తూనే ఏ కళనున్నాడో ఏమో తన్మయి చేతిలో అయిదు వందలు పెట్టాడు. “ఖర్చులకు ఉంచుకో “. అంటూ.

తన్మయి బాధ తీరిందానిలా ఆ డబ్బులు తల్లి చేతిలో పెట్టబోయింది. “వద్దులేమ్మా ఉంచుకో. ఇంత చేసీ మళ్లీ మిమ్మల్నడిగి కట్టేమన్న పేరు మాకెందుకు?” అంది.

ఉన్నంత సేపూ కొడుకు దగ్గరే బల్ల దగ్గర కూచుని ఉన్నాడు శేఖర్.

జ్యోతి బయటకు వెళ్లగానే తన్మయి దగ్గరికి వచ్చేడు. “చూడు, నువ్వు రేపు మీ ఇంటికి వెళ్లి  నెల రోజుల్లో తిరిగి వచ్చేయి. నేను మళ్లీ వచ్చే నెలలో  వస్తాను. మా ఇంటి దగ్గిరే బాబుకి నామకరణం చెయ్యాలన్నారు నాన్నగారు. అవన్నీ అయ్యేక వైజాగుకి వెళ్లిపోదాం. నాకూ ఇబ్బందిగా ఉంది అక్కడ వొండుకు తినడం. అందుకే ఇల్లు ఖాళీ చేసి సామాన్లు  తాతగారింట్లో అవుటు హౌసు తీసి కొత్తగా కట్టిన షెడ్లో పెట్టేను. నువ్వొచ్చేక మళ్లీ ఇల్లు తీసుకుందామని.” అన్నాడు.

“అదేవిటి? ఇప్పటి వరకూ ఊరుకుని ఇప్పుడెందుకు ఖాళీ చేయడం?” అంది తన్మయి. తన కళ్లకెదురుగా  గోనె సంచుల్లో చిందర వందరగా ఉన్న సామాన్లు, కొత్తగా కొన్న మంచం కోళ్ళు. పరుపు దుమ్ము పట్టి కనబడసాగేయి. “వచ్చే నెలలో వెళ్తే మళ్లీ ఇల్లు సర్దుకోవడానికే సరిపోతుందన్న మాట.”  అనుకుంది. 

“ముందు నేనూ, మా తమ్ముడూ ఉన్నాం కదా, అని ఇల్లు ఉంచేను. ఇప్పుడు వాడికి కూడా మా కంపెనీలోనే ఒరిస్సాలో ఉద్యోగం కుదిరింది. నెలలో ఇరవై రోజులు ఒరిస్సాలో ఉండే మాకు  వైజాగులో ఇల్లెందుకు?” అన్నాడు. 

“మరి మనకు పోస్టులవీ వస్తేనో?” అంది.

“నాకెవడూ ఉత్తరం రాయడు. మరి నీకు ఉత్తరాలు రాసేవాళ్లున్నారేమో నాకు తెలీదు.” అన్నాడు వ్యంగ్యంగా. 

అతనితో యూనివర్శిటీ సంగతి చెప్పాలంటే భయంగా ఉంది. అయినా పర్మినెంట్ అడ్రసుగా ఇక్కడి అడ్రసు ఇచ్చింది కాబట్టి ఇక్కడికే పంపుతారేమో  రిజల్టు. అయినా ఎందుకైనా మంచిది వీధి చివర STD అబ్బాయికి ఫోను చేసి, లక్ష్మిని పిలవమంటే పిలుస్తాడు. ఇంటికి వెళ్లేక ఒక సారి మాట్లాడాలి అనుకుంది.

యూనివర్శిటీ  గురించిన ఆలోచన రాగానే ఇక శేఖర్ చెప్పిననవన్నీ ఏదో ఆలోచిస్తూనే “ఊ” కొట్టింది.

“తల్లీ, బిడ్డా క్షేమంగా ఇంటికి వచ్చేరు. చంటోడికి నీ పేరు పెట్టుకుంటాం వెంకన్న తండ్రీ” అంది జ్యోతి  మర్నాడు ఇంటికి రాగానే.

చుట్టుపక్కల వాళ్లందరూ సాయంత్రం వరకూ ఒక్కొకరుగా పలకరించడానికి వస్తూనే ఉన్నారు.

పిల్లాడికి దిష్టి తగులుతుందని కాటుక బొట్లు కాళ్లకీ, ముక్కుకి, గడ్డానికీ పెట్టింది జ్యోతి.

“ముందే చెప్తున్నాను నా కొడుక్కి ఆంజనేయ స్వామి పేరు పెడతానని మొక్కుకున్నాను.” అన్న శేఖర్ మాటలు చెవిలో గిర్రున తిరిగాయి తన్మయికి.

“తననుకున్న పేరు అసలు వీళ్లెవరైనా పెట్టనిస్తారో లేదో?” అనుకుంది.

ఇరవై ఒకటో రోజు ఉదయానే  తల్లీ బిడ్డల స్నానానికి చుట్టాలలో పెద్దావిడని  పిలిపించేరు.

అన్నాళ్లూ నలుగంటే తెలియని చంటి పిల్లాడు ఆవిడ గట్టిగా రుద్దుతూంటే కిళ్ళు పెట్టి ఏడ్వ సాగేడు.

బాబు ఏడుపుకి తన్మయి కళ్లల్లో నీళ్ళు తిరగ సాగేయి. చుట్టూ ఉన్న వాళ్లంతా అది చూసి నవ్వులు మొదలు పెట్టేరు. “ఇదేమి సుకుమారమమ్మా” అంటూ. “రేపట్నించీ నేనే స్నానం చేయిస్తాను.” అంది తల్లితో తన్మయి.

ఉదయానే పసుపు కలిపిన నలుగు పెట్టించుకుని, తలారా కుంకుడుకాయలతో స్నానం చేసేసరికి తన్మయికి అన్ని రోజుల అలసట తీరినట్లయ్యినా, చాలా నీరసం వచ్చింది. 

సాంబ్రాణి వాసనతో నిండిన ఇల్లు మధ్యాహ్నానికల్లా బంధువులూ, స్నేహితులతో నిండిపోయింది.

దేవి ఒక్కతే వచ్చింది. వస్తూనే మనవణ్ణి ఒళ్లో వేసుకుని “మా మనవడు అచ్చు నా కొడుకుపోలికే. ఒరేయ్ నాన్నా, మీ నాన్న  అచ్చు నీ లాగే ఉండేవాడురా ఈ వయసులో.” అని మురిసిపోయింది.

వచ్చే నెల ఇదే రోజున బాబుకి నామకరణం మా ఇంట్లో జరిపిస్తాం. అంతకు నాల్రోజుల ముందే మంచిరోజు చూసుకుని పంపించెయ్యండి. అక్కణ్ణించి మూడో నెల పడ్డాక వైజాగు వెళ్తారు. మా అబ్బాయికి వండుకోవడం కష్టంగా ఉంది. అన్నట్లు శేఖర్కి ఏదో పనిబడిందని రాలేదు.” అంది దేవి. 

శేఖర్ రాడన్న సంగతి రూఢిగా ముందే తెలుసు కాబట్టి తన్మయి శేఖర్ కోసం ఎదురుచూడలేదు.

జ్యోతి అప్పటికొద్దీ దేవి చూడకుండా మూతి మూడు వంకర్లు తిప్పింది. 

సాయంత్రం అంతా వెళ్లిపోగానే తల్లీ, బిడ్డలకి దిష్టి  తీసి “నిన్నా మొన్నటి వరకూ హాస్పిటల్ లో ఉండొచ్చి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు తల్లీ, బిడ్డా.” కనీసం మూడు నెలలైనా ఉండనివ్వకుండా నామకరణం వాళ్లింట్లో పెడతన్నామని తీసుకెళ్లిపోవడవేవిటి? అక్కణ్ణించటే పిల్లని దించడవేవిటి? బిడ్డ సారె తయారు చేయించొద్దూ!! అన్నీ ఇలా అఘమేఘాల మీద అయిపోవాలంటే ఎలా? నా మనవడితో  నాకూ నాల్రోజులు గడపాలని ఉండదా? వాళ్లకేనా గొప్ప ప్రేమ?! ” అని రాగం తీసింది జ్యోతి. 

ఆదమరిచి నిద్రపోతున్న కొడుకుని దగ్గరకు తీసుకుని తన్మయి కళ్లు మూసుకుంది.

“ప్రపంచంలో బాధించే మాటలనేవి లేకుండా ఉంటే ఎంత బావుణ్ణు!

ఎప్పుడూ మనుషులు  ఆనందదాయకమైన మాటలే మాట్లాడుకోగలిగితే!!” 

హఠాత్తుగా అజ్ఞాత మిత్రుడు జ్ఞాపకమొచ్చాడు. “తను ఎంతో గొప్పగా ఊహించుకున్న జీవితంలో ప్రతీ చోటా ఎడారి, చీకటి. అదృష్టం కొద్దీ చందమామ లాంటి పసివాడు తోడున్నాడు. చాలు మిత్రమా! చాలు  ఈ జీవితానికి!!” అయినా ఈ అజ్ఞాత మిత్రుడేవిటీ ఇంకా? చిన్ని మిత్రుడు తన ఒళ్ళో ఉండగా. 

తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. 

తల్లి ముఖంలో దిగులు చూసి జాలి పడాలో, వీళ్ల గొడవలు చూసి చికాకు పడాలో అర్థం కావడం లేదు తన్మయికి.

అన్నిటికీ అతీతంగా తన మనస్సుని కేంద్రీకరించడం పెళ్లయిన దగ్గర్నించీ అలవడిన విద్యే.

కరెంటు పోయింది. కిరసనాయిలు దీపం బుడ్డి వెలిగించింది జ్యోతి. మంచం పక్కన వెలుగుతున్న ఒత్తి వైపు తదేకంగా చూడసాగేడు పసి వాడు.

కిటికీ లోంచి చుక్కలు అక్కడక్కడా మిణుక్కు మిణుక్కుమని మెరుస్తూ కనిపిస్తున్నాయి. 

ఆకాశం నించి నక్షత్రం  రాలిపడి తన పక్కన చేరినట్లు,  ముచ్చటగా బాబుని దగ్గరకు తీసుకుని తన చెంపకు వాడి అరచేతిని రాసుకుంటూ,  పాల వాసనలు చిమ్ముతున్న వాడి బుగ్గల్ని ప్రేమగా నిమిరింది తన్మయి.

ప్రపంచంలో ఇంత వరకూ తనకు దొరికిన అపురూపమైన బహుమతి ఈ పసివాడే. వీణ్ణి దగ్గరకు తీసుకున్నపుడల్లా  ఎంత ప్రేమ!  మాటల్లో వర్ణించలేని ఎంత గొప్ప మాతృభావం!! 

ఇంత వరకూ ఏ పిల్లల్ని ముట్టుకున్నా కలగని భావం. ఇదేనేమో తల్లీబిడ్డల అనుబంధం అంటే.

“నువ్వూ, నేనూ ఎప్పుడూ ఒక శరీరపు భాగాలం కన్నా” గుర్తు పెట్టుకో అని చెవిలో నెమ్మదిగా స్ఫుటంగా చెప్పింది. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.