నిజం చెప్తున్నా

    ఒక హిజ్రా ఆత్మకథ

-అనురాధ నాదెళ్ల

 “మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో సూటిగా అడిగారు. 

ఎంతో నిజాయితీగా తను పడిన శారీరక, మానసిక అవమానాలను, బాధలను, తనలాటివారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్టు రాసిన రేవతి అభినందనీయురాలు. ఆమె పూనుకోకపోతే వారి జీవితాల్లో ఉన్నదారుణమైన హింస, దుఃఖం బయటి ప్రపంచానికి తెలిసే వీలూ లేదు. అర్థంచేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నించే అవకాశమూ చాలా తక్కువగా ఉండి ఉండేది. 

రేవతి తమిళంలో రాసిన “ఉనర్వుమ్ ఉరువమమ్” అన్నతన ఆత్మకథను ఇంగ్లీషులోకి వి.గీత అనువదించారు. వారిని, ఈ పుస్తకాన్ని తెలుగులో అతి సరళంగా అనువదించిన పి.సత్యవతి గారిని, అందుబాటులోకి తెచ్చిన పెంగ్విన్ ప్రచురణలను అభినందించాలి.   

ఈ అనువాదానికిగాను సత్యవతిగారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది.

                             సమాజపు అంచులలో బతకవలసి రావటానికి కారణం కులం, మతం, లింగం, లైంగికత, ధనం అంటూ అనేక కారణాలున్నాయి మన వ్యవస్థలో. ఇవి అనుభవించే వారికే తెలుస్తాయి. దానికంతకూ కారణం అయిన చుట్టూఉన్న సమాజానికి దానిని అర్థం చేసుకునే అవసరం, తీరికా కూడా లేవు. 

ఒక ఇంట్లో అబ్బాయో, అమ్మాయో పుట్టినప్పుడు సంబరం చేసుకుంటుంది కుటుంబమంతా. అదే బిడ్డ అబ్బాయిగానో, అమ్మాయిగానో కాక తనకే అర్థంకాని మానసిక, శారీరక ఇబ్బందులతో పెరుగుతున్న దశలో మాత్రం అమ్మా, నాన్నలుకానీ, ఇతర కుటుంబసభ్యులు కానీ ఆ ఇబ్బందేమిటని సహానుభూతితో అర్థం చేసుకుందుకు ప్రయత్నించరు. 

                        తమిళనాడులోని సేలం జిల్లాలోని నామక్కల్ తాలూకాలోని చిన్న గ్రామం మనం మాట్లాడుకోబోయే నాయికది. 

అందరిలాగే నలుగురున్న కుటుంబంలో ముగ్గురన్నలు, అక్క తర్వాత ఇంట్లో ఆఖరి అబ్బాయిగా పుట్టి గారంగా పెరిగాడు దొరైస్వామి. స్కూల్లో ఆడపిల్లలతోనే ఆటలు ఆడుకునేవాడు. ఇంట్లో అమ్మ వెనుకే ఆడవాళ్లు చేసేపనులన్నవన్నీ చేసేవాడు. బడినుంచి వచ్చి తన అక్క బట్టలు వేసుకుని, తలమీదనుంచి ఒక బట్టను వేలాడేలా పెట్టుకుని జడగా భావించి ఆడపిల్లలా నడవటం చేయటం చూసి అందరూ నవ్వుతుండేవాళ్లు. పెద్దయ్యాక తనే మానేస్తాడని అనుకుంటారు. కానీ బడిలో అబ్బాయిలు, చుట్టుపక్కల కొందరూ మాత్రం “తొమ్మిదో నంబరూ” అని పిలిచి వెక్కిరిస్తుండేవారు. వాళ్లమాటలకి నొచ్చుకున్నా తనను ఆడపిల్లగా భావిస్తున్నందుకు దొరైస్వామి లోపల సంతోషించేవాడు.

                         హైస్కూల్లో ఉండగా ఒక నాటకంలో చంద్రమతిగా స్త్రీపాత్ర వేసి అందరినీ మెప్పిస్తాడు. తనకంటే పెద్దక్లాసుల మగపిల్లలు అతనిలోని ప్రత్యేకతను గుర్తించి ఏడిపిస్తుండేవాళ్లు. కానీ మగపిల్లల పట్ల ఆకర్షణ కలుగుతున్నందుకు మనసులో అయోమయంగా ఉంటుంది. కానీ ఎవరితోనూ చెప్పుకోలేకపోతాడు. తనలాగా మగవాడై మగవాళ్లను ప్రేమించే మనుషులు ప్రపంచంలో ఉంటారా అని సంఘర్షణ పడతాడు. తను మగ శరీరంలో ఇరుక్కుపోయిన ఆడపిల్లగా భావించి, బాధ పడేవాడు. తనను అందరూ ఆడపిల్లగా గుర్తించాలని తపనపడేవాడు. దేవుడు తనని పూర్తిగా స్త్రీగానో, పూర్తిగా పురుషుడిగానో ఎందుకు పుట్టించలేదో అని, చచ్చిపోతే బావుణ్నని అనుకునేవాడు. పదోక్లాసు తప్పుతాడు. మరియమ్మ తిరణాల లో ఆడవేషంతో డాన్స్ చేస్తాడు.

                         పధ్నాలుగు, పదిహేనేళ్ల వయసులోఒకసారి తమ ఊరి సమీపంలో ఉన్న కొండ పైనున్నకోటను చూసేందుకు వెళ్లి అక్కడ తనలాటి వాళ్లను యాధృచ్ఛికంగా కలుసుకుంటాడు. వాళ్లమధ్య ఉన్నప్పుడు తనకి దొరికిన ఓదార్పు, ధైర్యం అతనిని ఊరడిస్తాయి. వాళ్లద్వారా దిండిగల్ వెళ్లి అక్కడ తనలాటివారికి సాయం చేసే అమ్మని (గురువు) కలుస్తాడు. తనను శిష్యురాలిగా తీసుకుందుకు గురువు అంగీకరిస్తుంది. గురువు చెప్పిన పనులన్నీ చెయ్యాలని, ఆమెకు సేవచేసి డబు సంపాదించిపెడితే తనను పూర్తి స్త్రీగా మారేలా నిర్వాణం చేయిస్తానని చెబుతుంది. నిర్వాణం అంటే పురుషాంగాన్ని తొలగించుకునే ఆపరేషన్ చేయించటం. గురువు దిల్లీ వెళ్తూ దొరైస్వామిని ఈరోడ్ లోని అమ్మమ్మ (గురువుకి గురువు (నానీ)) దగ్గరకు వెళ్లమని చెబుతుంది. అలా అక్కడున్న కొందరితో కలిసి ఈరోడ్ లో నానీ దగ్గరకి వెళ్తాడు. వాళ్ల నృత్యబృందంలో చేరి చక్కగా నాట్యం నేర్చుకుంటాడు. దేవాలయాల్లో నాట్యం చేసేప్పుడు ప్రేక్షకులు తమ గురించి చేసే వ్యాఖ్యలు విని బాధపడతాడు. నెలరోజులపాటు అక్కడే వారితో ఉండిపోతాడు. తల్లిదండ్రులని చూడాలనుకుంటాడు. అదీకాక అక్క పెళ్లి ఉందని ఇంటికి వెళ్లాలనుకుంటాడు. వెళ్తే దెబ్బలు తప్పవని భయపడుతూనే వెళ్తాడు. అతను అనుకున్నట్టుగానే అన్నలు కొడతారు. తల్లి ఏడుస్తుంది ఇన్నళ్లూ ఏమైపోయావంటూ.

                               అన్నలు నడిపే లారీలో క్లీనర్ గా ఉంటూ వాళ్లు శారీరకంగా పెట్టే బాధలు, తాను మానసికంగా పడుతున్న బాధలు భరించలేక తనకు దిండిగల్ లో పరిచయమైన గురువు దగ్గరకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె దిల్లీ వెళ్తున్నట్టు చెప్పటం గుర్తొచ్చి అక్కడికి ప్రయాణమవుతాడు. తల్లి చెవిపోగుని పోపులడబ్బాలోంచి తీసుకుని తన స్నేహితుడి సాయంతో డబ్బుగా మార్చి, టికెట్టు కొనుక్కుని దిల్లీ చేరతాడు. అంతపెద్ద నగరాన్ని చూసి ఆశ్చర్యపడతాడు. కేవలం గురువు దగ్గర విన్న జ్ఞాపకంతో దిల్లీలో వజీర్పురా చేరి ఆమెను కలుస్తాడు. ఒక మగపిల్లవాడుగా వచ్చినందువల్ల చూసినవారు అతనిని హిజ్రాగా మార్చేస్తోందన్న చెడ్డపేరును గురువుకు ఆపాదించకూడదని అతడిని కొన్నాళ్లపాటు నానీ ఇంటికి పంపుతుంది. అక్కడ దొరైస్వామి ఆడపిల్ల వేషంలో ఉండచ్చు. నెమ్మదిగా అక్కడనుంచి తన దగ్గరకు తీసుకువస్తానని గురువు చెబుతుంది. ఆపరేషన్ అయి పూర్తిగా ఆడపిల్లగా మారేవరకు మాత్రం జాగ్రత్తగా ప్రవర్తించాలని చెబుతుంది.

                                        అక్కడ హిజ్రాల జీవితాన్ని, వాళ్ల సంస్కృతిని అవగాహన చేసుకుంటాడు. దిల్లీలాటి చోట కేవలం దుకాణాలకి వెళ్లి అడుక్కుని సంపాదించుకోవాలని తెలిసి వేరే పని చేసుకోవచ్చుకదా అని అడుగుతాడు. పూర్వం రాజుల కాలంలో హిజ్రాలు వారి కొలువులో ఉంటూ రాణులకు సేవ చేసేవారు. ప్రస్తుతం రాజులు లేరు, ప్రభుత్వం ఎలాటి పనీ కల్పించటం లేదు కనుక అదే ఆధారమని నానీ చెబుతుంది. దుకాణాదారులు మనల్ని దేవతల్లా భావించి, మనం పలికే మాట శక్తివంతమైనదిగా నమ్ముతారని  నాని చెబుతుంది. వాళ్లు డబ్బులిచ్చినప్పుడు వాళ్లని ఆశీర్వదించాలి అని కూడా చెబుతుంది నాని. అలా ఎందుకు భావిస్తారు అని అడిగితే దానికి అనేక కథలు ఆధారంగా ఉన్నాయని, అందులో ఒక కథను చెబుతుంది. 

                          దానిప్రకారం, రాముడు పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరినపుడు ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు చాలామంది జనం అడవి పొలిమేరల వరకూ వస్తారు. ఇంకా ఇంకా తనతో వస్తున్న స్త్రీలు, పురుషులు, పిల్లలూ అందరినీ వెనక్కి వెళ్లిపొమ్మని రాముడు చెబుతాడు. కానీ ఆ అడవి పొలిమేరల్లో ఆ పధ్నాలుగేళ్లూ నిరీక్షిస్తూ కొందరు ఉండిపోతారు. రాముడు వెనక్కి వచ్చినప్పుడు వారిని అడుగుతాడు, ఎందుకు వెనక్కి వెళ్లలేదని. అప్పుడు వారు, “స్వామీ ఆనాడు మీరు స్త్రీ, పురుషులను వెనక్కి వెళ్లమన్నారు. మేము స్త్రీలమూ కాము, పురుషులమూ కాము. అందుకే వెనక్కి వెళ్లలేదు” అని చెబుతారు. రాముడు వారి మాటలకి చలించిపోయి వారికొక వరమిచ్చాడు, “మీ పలుకు ఎల్లప్పుడూ సత్యమౌగాక” అని. అందువల్ల వారి మాటకు ప్రజల్లో అంత విలువ ఉందని నాని చెబుతుంది. దుకాణదారులు మనతో అసభ్యంగా ప్రవర్తించకూడదనీ, మనం కూడా వారితో అట్లా ప్రవర్తించకూడదని నానీ చెబుతుంది.

                           అలాగే “బదాయి” పేరుతో జరిగే విషయాన్ని చెబుతుంది. పెళ్లిళ్లప్పుడూ, పిల్లలు పుట్టినప్పుడూ ధోలక్ వాయిస్తూ హిజ్రాలు నాట్యం చేస్తారని, వారిని దీవించి వారు ఇచ్చిన కానుకలు తీసుకోవాలని చెబుతుంది. మగపిల్లవాడు పుట్టినప్పుడు మరింత ఎక్కువ కానుకలు అడిగి పుచ్చుకుంటారని చెబుతుంది. 

ఇక్కడొక విషయం చెప్పాలి. మా పాప పుట్టిన కొత్తలో ముంబై ట్రాన్స్ఫరై వెళ్లినప్పుడు అక్కడ చెంబూర్ లో ఉండేవాళ్లం. ఒకరోజు హిజ్రాలు ఇంటికొచ్చారు. నేను విషయం తెలియక అయోమయంగా చూస్తుంటే, పక్కింటి సింధీ ఆంటీ పాపాయిని ఆశీర్వదించేందుకు వాళ్లు వచ్చారని చెప్పి, నాతో కానుక ఇప్పించారు. వాళ్లు చాలా సౌమ్యంగా ప్రవర్తించటం నాకు స్పష్టంగా జ్ఞాపకముంది.  

దొరైస్వామి దుకాణాలకు వెళ్లినప్పుడు కొందరు దుకాణాదారుల పట్ల ఆకర్షితుడయ్యేవాడు కానీ ఆ విషయం బయటపెట్టకూడదన్న నిబంధన తెలుసు కనుక అలాటివాటికి ఆశపడకూడదని అనుకుంటాడు. ఒకసారి దుకాణాలకు వెళ్లినప్పుడు తన ఊరు నామక్కల్ నుంచి వచ్చిన ఒక లారీడ్రైవర్, తమ కుటుంబానికి తెలిసినవాడు కనిపించి పలకరించబోతే తప్పించుకుని వచ్చేస్తాడు. తన కుటుంబం గుర్తొచ్చి కనీసం ఉత్తరం రాయాలనుకుంటాడు. ఉత్తరం రాసాక, జవాబొస్తుందని ఎదురుచూస్తుంటే తల్లికి బావులేదని టెలిగ్రాం వస్తుంది. గురువు ఊరు వెళ్ళే ఏర్పాటు చేస్తుంది. తీరా ఇల్లు చేరాక తల్లి కులాసాగానే ఉంది. అన్నలు బాగా కొడ్తారు. గుడికి తీసుకెళ్లి దొరైస్వామి పెంచుకున్న జుట్టును తీయించివేస్తారు. మళ్లీ లారీమీద పనికి వెళ్లాల్సివస్తుంది. తోటివాళ్లంతా తనను ఏడిపించటంతో తిరిగి దిల్లీ వెళ్లిపోవాలని నిర్ణయించుకుని కాస్త జుట్టు పెరిగాక దిల్లీ బయలుదేరతాడు. 

ఈసారి ముంబై పంపిస్తుంది గురువు. అక్కడ గురువు తల్లి దగ్గర ఉండి అన్ని పనులూ నేర్చుకుంటాడు. ఇక్కడ నానీ ఇల్లు ఖరీదైనది, సౌకర్యవంతమైనది. ఆమె పర్యవేక్షణలో దాదాపు ఐదు వందల మంది హిజ్రాలుంటారు. దుకాణాలకు వెళ్లి డబ్బు అడుక్కోవటం, బదాయికి పోవటం, సెక్స్ వర్క్ చెయ్యటం హిజ్రాలు చేస్తుంటారు. హిజ్రాలందరి మంచీ చెడులను నిర్ణయించే వేదిక జమాత్. వారి హక్కుల గురించి చెప్పి, వారికి కొంత సాంత్వన ఇచ్చే వేదిక జమాత్. హిజ్రాలకు వారివైన సంస్కృతీసంప్రదయాలున్నాయి. హిజ్రాలకు కుల, మత, వర్గ వివక్ష లేదు. అన్నికులాల నుంచీ, ధనిక పేద వర్గాల నుంచీ వచ్చిన హిజ్రాలున్నారు. కుల, మత వర్గాలు లేకపోయినా హిజ్రాలలో ఏడు తెగలున్నాయి. ఒక్కో తెగకూ ఒక్కో పేరుంటుంది. 

పెద్దల్ని గౌరవించాలని, వాళ్లు చెప్పిన పనులు చెయ్యాలని, పెద్దలు ఎదురైనపుడు “కాళ్లు మొక్కుతా” అనాలని, వారికి తన బట్టలు తగలనీయరాదని, వాళ్ళడిగినపుడు మంచినీళ్లు అందించాలని, ఎప్పుడూ చెవిపోగులు, కాళ్లకి కడియాలు, ముక్కుపుడక, గాజులు ధరించాలని, జుట్టు కత్తిరించుకోరాదని, మొహం మీద మొలిచే వెండ్రుకలని కత్తిరించకుండా వాటిని పీకేసుకోవాలని దొరైస్వామికి చెబుతారు. ఇంకా తన సంపాదనను గురువుతోనూ, నానీతోనూ పంచుకోవాలని, ప్రతిఫలంగా వాళ్లు తనను బాగా చూసుకుంటారని చెబుతారు.

దొరైస్వామికి ఆపరేషన్ చేయించేందుకు నిశ్చయించి ఒకచోటకి పంపుతారు. ఆపరేషన్ జరిగినపుడు, ఆ తర్వాత నొప్పిని తట్టుకుంటూ దొరైస్వామి తను స్త్రీలా జీవించాలనుకుంటున్నందున ఎంత బాధైనా సహించాలని నిర్ణయించుకుంటాడు. ఆపరేషన్ ముందు హిజ్రాల దేవత పోతిరాజు మాత కు పూజ చేస్తారు. సినీతార రేవతిలా అందంగా ఉన్నందున గురువు తనకు పెట్టిన పేరు రేవతిగానే తానిక చలామణీ అవబోతున్నందుకు సంతోషిస్తాడు.  

                        తిరిగి ముంబై వెళ్లేందుకు ప్రయాణమంతా తగని అగచాట్లు పడతారు రేవతి, ఆమెతో పాటు ఆపరేషన్ చేయించుకుందుకొచ్చిన మరొకామె. ముంబై రైలు కోసం ఎదురుచూస్తూ చెన్నై రైల్వే స్టేషన్ లో రేవతి పడిన బాధలు వర్ణనాతీతం. స్టేషన్ లో కనిపించిన మరో నలుగుర్ హిజ్రాలు వారికి రైలెక్కేందుకు సాయం చేసి, తమతో పాటు తెచ్చుకున్న భోజనం పెడతారు. హిజ్రాలకు నిర్వాణం (ఆపరేషన్) అనేది పునర్జన్మ లాటిది. ఐతే నిర్వాణం అయిన తర్వాత తమ సమూహంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. పూర్తిగా స్త్రీలా జీవించాలంటే నిర్వాణంతోనే సాధ్యం. ఆ ప్రయాణంలో రేవతి అనుకుంటుంది, తమకు ఏమున్నా లేకపోయినా తోటి హిజ్రాల సహచర్యం ఉంటే చాలు అని. ముంబై దాదర్ లోనూ, చెన్నై సెంట్రల్ లోనూ స్త్రీ పురుషులు తమని వింతగా చూడటం, నవ్వుకోవటం రేవతికి చాలా బాధ కలిగిస్తుంది. అంగవైకల్యం ఉన్నవారిని, గుడ్డివారిని చూసి జాలిపడి సాయం చేస్తారు. శారీరకంగా గాయపడితే కుటుంబం, బయటివాళ్లూ కూడా సాయం చేస్తారు. కానీ తమని మనుషుల కింద లెక్కచెయ్యరు అని ఆవేదనకు గురవుతుంది.

                         ఆపరేషన్ అయి వచ్చాక కర్పూర హారతితో స్వాగతం ఇస్తుంది నానీ. గాయాలు మానేందుకు ఆరోగ్యకరమైన భోజనాన్ని పెడతారు. పన్నెండవరోజు, ఇరవయ్యో రోజు ఇరుగుపొరుగు హిజ్రాలొచ్చి హారతిచ్చి, పంచదార తినిపించి, బహుమతులిస్తారు. నలభయ్యో రోజు వచ్చేసరికి స్త్రీ లక్షణాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మొహంలో, కాళ్లల్లో, చేతుల్లో. నలభయ్యో రోజు హల్దీ మెహందీ ఉత్సవం చేస్తారు. ఒక ఆడపిల్ల పెద్దమనిషి అయినప్పుడూ చేసే పేరంటం లాటిది. అప్పటినుంచి ఇల్లు దాటి బయటకుపోయేందుకు అనుమతిస్తారు. ఖరీదైన రంగురంగుల చీరెల్లో చిన్నపెద్దా చాలామంది హిజ్రాలు వచ్చి, ఆ ఉత్సవంలో పెద్ద యెత్తున నాట్యం చేస్తారు. స్త్రీలాగా జీవించమనీ, పెళ్లిచేసుకుని భర్తను అంటగట్టుకోవద్దని చెబుతారు.

హిజ్రాలు వాడే బంధుత్వపు పదాలు బడుదాదీ (ముత్తాతమ్మ గురువు), గురువు (అమ్మ), గురుబాయ్ (సోదరి), చేలా (కూతురు) వంటి అనేక పదాలను తెలుసుకుంటుంది రేవతి. 

                           గురువు దగ్గర ఆరునెలలు శిష్యరికం చేసేసరికి రేవతికి నిర్వాణం (లింగమార్పిడి ఆపరేషన్) అయిపోయింది. కారణం రేవతి మంచి విశ్వాసపాత్రమైన శిష్యురాలిగా ఉండటమే అని చెబుతారు. అలా కాక మూడేళ్లు దాటినా కొందరు నిర్వాణానికి అర్హులు కారు. ఇంటిపనులు, దుకాణాలకు వెళ్లటం వంటివి చేస్తుంది రేవతి. షాపులకు వెళ్లినప్పుడు రేవతిని “ఇంత అందంగా ఉన్నావేమిటి” అని ఆమెను పక్కన కూచోబెట్టుకుని కబుర్లు చెప్పి పంపేవారు దుకాణదారులు.

రేవతికి తన తల్లిలా, అక్కలా పెళ్లిచేసుకుని జీవితంలో స్థిరపడాలని కోరికగా ఉండేది. కానీ హిజ్రాను ఎవరు పెళ్లి చెసుకుంటారు? అని బాధ పడుతుంది. కానీ పెళ్లై బాధలు పడే హిజ్రాలను, సుఖంగా ఉన్నవారినీ కూడా చూస్తుంది. ఇరవై ఏళ్లొచ్చాక రేవతికి శారీరక వాంఛలు వేధిస్తుంటాయి. పెళ్ళి చేసుకుంటే నానీ అంగీకరించదు. సెక్స్ వర్క్ చేసేచోట ఉంటే కోరికలు తీర్చుకోవచ్చు అని ఆలోచించుకుని, ఎవరితోనూ చెప్పకుండా మాహిమ్ వెళ్లి అక్కడ హిజ్రాలతో కలిసి ఉండటం ప్రారంభిస్తుంది. రేవతి అందంగా ఉందని తోటివారికి అసూయ.                   లైంగికపరమైన ఆనందాన్ని కోరుకుని వచ్చిన రేవతికి అక్కడ దాన్ని వృత్తి గా చెయ్యవలసిరావటం నచ్చదు. అదీకాక రౌడీలు రావటం, సరైన ఇంటివసతి లేక రోడ్డుమీద పడుకోవలసి రావటం, శృంగారమైనా, భోజనమైనా చిన్నదీపపు వెలుగులోనే జరుపుకోవటం నచ్చవు. ఇంకా అసహజమైన శృంగారానుభవాలు ఆమెను భయపెడతాయి. రేవతి దాచుకున్న డబ్బును లాక్కేళ్లిపోయే రౌడీలనుంచి రక్షణ దొరికేది కాదు.తనలో తలెత్తిన లైంగిక వాంఛలనుతట్టుకోలేక వచ్చినా ఇక్కడి హింసనూ, ఘోరాన్నీ సహించలేక తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లాలని నిర్ణయించుకుని బయలుదేరుతుంది. 

                              కుటుంబం తనను స్వీకరిస్తుందో లేదో తెలియని సందిగ్ధంలోనే ఊరు చేరుతుంది. తల్లి ఏడుస్తుంది. అన్నలు కొట్టబోతే తానిప్పుడు స్త్రీననీ, కొడితే పోలీసులకు రిపోర్ట్ చేస్తానని చెబుతుంది. తల్లి తరఫు బంధువులు శుభకార్యాలకు రేవతిని కూడా రమ్మని పిలుస్తుంటారు. తండ్రి వైపువారు మాత్రం కేవలం సానుభూతిని చూబించటమే కానీ ఎప్పుడూ ఆహ్వానించరు. 

తమ తదనంతరం రేవతిని ఎవరు చూసుకుంటార్ని తల్లిదండ్రులు బాధ పడతారు. తల్లిదండ్రులపైన ఆధారపడి జీవిస్తున్నందుకు రేవతి కించపడుతుంది. తను ఏదైనా పని చేసుకుందామంటే పదవక్లాసు కూడా పాస్ కాలేదు. తిరిగి తనలాటి వాళ్లదగ్గరకి వెళ్లి వాళ్లలాగే సంపాదించుకుని జీవిస్తానని ముంబై ప్రయాణమౌతుంది. అక్కడ నానీని కలిసి తను చెప్పకుండా వెళ్లిపోయినందుకు క్షమించమని అడుగుతుంది. ఆమె ద్వారా క్రేన్ రోడ్డులో ఉన్న “దందా కంత్రా” కి చేరుతుంది. సెక్స్ వర్క్ ని దందా అని, అది జరిగే ఇంటిని దందా కంత్రా అని అంటారు. పల్లెలోలా చీరలు కాక జీన్స్, స్కర్ట్ లు, మిడ్డీలు వేసుకుంటేనే క్లయింట్లు దొరుకుతారని చెబుతారు. క్లయింట్ల విషయంలో తోటివారితో పోట్లాటలు జరుగుతుంటాయి. మిగిలిన వారిలా గడుసుదనంగా బ్రతకతం తెలియక శారీరకంగా, మానసికంగా బాధలు పడుతూ తాగుడుకి అలవాటుపడుతుంది రేవతి.  

అక్కడుండగా తాను సంతోషంగా ఉన్న సందర్భాలు కొన్ని ఉండేవని చెబుతుంది. ఉదయం పదకొండుకి నిద్రలేచి మేకప్ చేసుకుని క్లయింట్ల కోసం నిలబడటం, రాత్రి షిఫ్టులో దందాకు సిధ్ధమయ్యేలోగా కేరళ టీ కొట్టుకి వెళ్లి అక్కడ జూక్ బాక్స్ లో ఇష్టమైన పాట వేయించుకుందుకు దుకాణాదారుకు యాభై పైసలివ్వటం, నిమ్మకాయ వేసిన బ్లాక్ టీ తాగటం (సులేమాన్ టీ) గురించి చెబుతూ తాను ఎక్కువగా “రిం ఝిం” పాటను వినేదాన్నని చెబుతుంది.

                         హిజ్రాలకి మతవివక్ష లేదని చెబుతూ, తాను గురువారం హాజీ ఆలీ దర్గాకీ, శుక్రవారాలు మహలక్ష్మి దేవాలయానికి వెళ్లేదాన్నని చెబుతుంది. మాహిమ్ లో ఉండగానే పూర్తి స్త్రీనన్న స్పృహతో లోకల్ రైళ్లలో ప్రయాణించినపుడు టికెట్టు కొనుక్కుని ఆత్మ విశ్వాసంతో ఆడవాళ్ల పెట్టెలో కూర్చునేదాన్నని చెబుతుంది. నిజాయితీగా తాను సంపాదించిన సొమ్ములో నానీకి వాటా తీసుకెళ్లి ఇవ్వటం, అక్కడ తనను ఇదివరకులా కాక గౌరవంగా చూడటం గమనిస్తుంది. ఈ ప్రపంచంలో డబ్బుంటే గౌరవం దానంతట అదే వస్తుంది అనుకుంటుంది. మాతుంగాలోనూ, బైకుల్లాలోనూ ఉన్న గురుబాయ్ లను చూసి రావటం చేస్తుంటుంది. సినిమాలకు, షాపింగ్ లకూ, దేవాలయాలకూ స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం అక్కడ జీవితం తనకి కల్పించిందని చెబుతుంది.

                     ఒక ఆదివారం మధ్యాహ్నం బారుకి వెళ్లి బీరు తాగే సమయంలో మరొక గురుబాయ్ తో తన ప్రమేయం లేకుండానే గొడవ జరుగుతుంది. ఆ గొడవలో రేవతికి న్యాయం జరపలేదు తన యజమానురాలు. అక్కడనుంచి సెక్స్ వర్క్ చేసే వారిని పర్యవేక్షించమని బైకుల్లాకి పంపేస్తుంది. కానీ అక్కడ సెక్స్ వర్క్ కోసం వచ్చిన స్త్రీలు పడుతున్న బాధలు చూసి వాళ్లకోసం క్లయింట్లను పిలవటం తన చేతకాదనుకుంటుంది. ఒకరోజు తన స్వంత ఊరు నామక్కల్ నుంచి కొందరు లారీ డ్రైవర్లు వచ్చి గుర్తుపడతారు. అక్కడ కూడా తన గురువు, తోటివారి చేతిలో శారీరకంగా చాలా కష్టపడుతుంది. ఇంటికి వెళ్లాలనుకుంటే గురువు పంపదు. దానితో రహస్యంగా సెక్స్ వర్క్ చేసి ఐదువందలు కూడబెట్టి తిరిగి తన ఊరు వెళ్తుంది. బస్సు ప్రయాణంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. ఊళ్లో చాలామంది రేవతి అనిపిలిచినా, పెద్దవాళ్లు దొరైస్వామి అనే పిలుస్తారు. 

ఆస్తి పంపకాల కోసం అన్నదమ్ములు తండ్రితో పోట్లాడుతూ రేవతికి ఆస్తి మీద ఎలాటి హక్కు లేదని, తాము చెప్పినట్టు వినమని బెదిరించి ముగ్గురన్నలూ కలిపి లక్షా ఐదువేలు మాత్రం రేవతి చేతిలో పెడతారు. తల్లిదండ్రులతో ఉండవద్దని అన్నలు చెప్పటంతో విడిగా అద్దెకు ఇల్ల్లు తీసుకుంటుంది రేవతి. ఆ ఏర్పాట్లతో తనచేతిలో కేవలం తొంభైవేలు మిగులుతాయి. ఎక్కడైనా దుకాణంలో పనిచేద్దామని ప్రయత్నించినా అవమానమే కానీ పని దొరకదు. 

                        ఆ సమయంలోనే ఒక వ్యక్తితో అకర్షణలో పడి తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అతను వచ్చినప్పుడు ఆమె ఒక భర్తకి సేవ చేస్తున్నట్టూ చేస్తోందని ఇంటామె, చుట్టుప్రక్కలవారూ అంటారు. అతను రోజూ వచ్చివెళ్లటం అన్నలకి తెలిసి ఇంటికొచ్చి అల్లరి చేస్తారు. దానితో ఆవ్యక్తిని ఇకపై రావద్దని ప్రత్యేకించి చెప్పకపోయినా అతను ఇకరాడని అర్థమవుతుంది. అన్నలు తనను అన్న మాటలకి విపరీతంగా బాధపడుతుంది. సమాజం ఛీకొడితే కుటుంబం ఆదుకుంటుంది. కానీ కుటుంబమే ఛీ కొడితే ఎవర్ని ఆశ్రయించాలి? 

భగవంతుడు తనను అచ్చంగా స్త్రీలాగానో, పురుషుడి లాగానో ఎందుకు పుట్టించలేదని ఏడుస్తుంది. తన మానసిక ఉద్వేగాలను ఎవరు అర్థం చేసుకోరని అనుకుంటుంది. డబ్బుండి, ఆధునికంగా కనపడితే అందరూ గౌరవిస్తారు. తనలాగా బీద హిజ్రాగా ఉంటే అందరూ అవహేళన, అవమానాలకు గురి చేస్తారని తనలాటివారితోనే కలిసి ఉండాలన్న ఆలోచనలో ఉండగా, ముంబై లో ఉండగా తాను విన్న హమామ్ విషయం గుర్తొస్తుంది. బెంగుళూరులో హిజ్రాలు నడిపే ఒక హమామ్ (స్నానశాల) కి వెళ్లి ఉండాలని నిర్ణయించుకుంటుంది. తానున్న ఊళ్ళోనూ, ఇంట్లోనూ గౌరవం లేదు, బతుకుతెరువు లేదు అని తల్లిదండ్రులకి చెప్పి వెళ్తుంది. బెంగుళూరులో దిగిన తరువాత ఆటో డ్రైవర్ సాయంతో హమామ్ చేరుతుంది. 

                         అక్కడ గురువు ఆమెను ఆశీర్వదించి ఎప్పుడూ ఒక భర్తను ఎంచుకోవద్దనీ, ఒక పురుషునితో సహజీవనం చెయ్యొద్దనీ, బతుకుతెరువును స్వయంగా సంపాదించుకొమ్మనీ చెబుతుంది. సెక్స్ వర్క్ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెబుతుంది. రేవతి సెక్స్ వర్క్ చేసి సంపాదించుకోవాలనుకుంటుంది.  క్రమంగా తన తోటివాళ్లని గమనించి ఎక్కడికి వెళ్లాలో క్లయింట్లను ఎలా పిలుచుకోవాలో, ఎలా మాట్లాడాలో అన్నీ నేర్చుకుంటుంది. బెంగుళూరు రోడ్లపైన ఆమె చూసిన జీవితం చాలా కఠినమైనది. రోడ్డు మీద క్లయింట్లకోసం నిలబడినప్పుడు ఎందరో రౌడీలు క్లయింట్లలాగా నటించి ఆమె దగ్గరున్నది లాక్కుని వదిలి వెళ్లిపోతారు. ఇక పోలీసులు ఆమెను నిర్బంధించి శారీరకంగా హింసించి, ఆమె దగ్గరున్న డబ్బును లాక్కుంటారు. నెలాఖరులో కేసులు చూపించుకుందుకు పోలీసులు ఆమెను తనకోసం వచ్చే క్లయింట్లను పట్టించమని హింసిస్తారు. ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్త్తం లేకుండా ఆపని కూడా చేయించి ఆమె సమీపంలోకొచ్చిన మగవారినందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. 

ఆ బాధలు పడలేక తిరిగి తన ఊరు వెళ్తుంది. రేవతి చేస్తున్న వృత్తి ఏమిటో తెలియని తల్లిదండ్రులు ఆమె డబ్బు పంపడాన్ని హర్షిస్తారు. అన్నల మీద ప్రేమను వదులుకోలేకపోతుంది. వారి పిల్లలకోసం తను సంపాదించిన డబ్బుతో బహుమతులు తీసుకెళ్తుంది. 

                          ఒక ఉద్యోగంలో ఉంటే ఎన్ని సమస్యలున్నా తోటివారికి చెప్పుకోవచ్చు. కానీ తాను చేస్తున్న చట్టవిరుధ్ధమైన పని గురించి, దానిలోని సమస్యల గురించి ఎవరికీ చెప్పుకోలేదు. అదీకాక తను మగవాడిగా పుట్టి ఆడదానిగా మారిన వ్యక్తి కనుక మరిన్ని సమస్యలు. మామూలు మనుషులకు బతకటం ఒక పోరాటం అయితే తనలాటివాళ్లకి ఒక యుధ్ధం అని అనుకుంటుంది. ఈ సమాజం, ఇక్కడి చట్టాలు తనని బలవంతంగా సెక్స్ వర్క్ లోకి వెళ్లేలా చేసాయని చెబుతుంది. చట్టాలు తాము తప్పు చేస్తున్నాయంటాయి, కానీ ఎలాటి పనీ ఇవ్వవు. 

రేవతి తానొక స్త్రీలాగా జీవించాలని, గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకోవాలని, ఒక మగవాడితో కలిసి బతకాలని కోరుకుంటుంది. కానీ ఎవరికీ ఆమె భావాలు, అవసరాలు పట్టవు.

                              కైనెటిక్ హోండా కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా లైసెన్స్ విషయంలో చాలా పోరాటం చేసి గెలుస్తుంది. బెంగుళూరులో రేవతిని ముగ్గురు పురుషులు కలిసి తాము కూడా ఆమెలాటి వారమేననీ, తమకు సాయం చెయ్యమని అడుగుతారు. రేవతికి వాళ్లద్వారా ఒక స్వచ్ఛంద సంస్థతో పరిచయం అవుతుంది. అది సంగమ. 1999 సంవత్సరంలో అక్కడ సమావేశాలకు వెళ్లటం మొదలయ్యాక హిజ్రాల హక్కుల గురించి, మరెన్నో కొత్త విషయాలను తెలుసుకుంటుంది. క్రమంగా అక్కడ ఒక ఉద్యోగి అవుతుంది. అయితే జీతం మాత్రం తక్కువే. హిజ్రా ఔట్ రీచ్ కోఆర్డినేటర్ గా పని చేస్తూ హమామ్ నుంచి బయటికొచ్చి అద్దె ఇంట్లో ఉంటుంది. తను చూసిన అనేక అనుభవాలుఅక్కడివారితో పంచుకుంటుంది. 

                            ఈ ప్రపంచం తన హక్కులు నిరాకరించి, ఒక జీవితాన్ని కల్పించేందుకు ఎలా అడ్డుపడిందో, పైగా అడుక్కోవటం, సెక్స్ వర్క్ తప్ప మరోపని లేకుండా చేసి ఎంత అవమానం, హింసా ప్రదర్శించిందో సంగమలో పని ప్రారంభించాకే తనకి ఎరుక కలిగిందని చెబుతుంది. లైంగికంగా సాధారణేతర స్వభావాలున్న కొద్దిమంది పై జరిగే అన్యాయాన్ని ప్రశ్నించటం, లైంగిక హింసపై పోరాటం తన ధ్యేయంగా చేసుకుంది రేవతి. స్వలింగ సంపర్కులైన స్త్రీ, పురుషుల హక్కులకోసం, దళిత స్త్రీలు, బాలకార్మికులు, వరకట్న బాధితులు, మతపరమైన హింస ఇలా అనేక విషయాలకోసం పనిచేసేవారితో కలిసి పనిచేస్తుంది. తోటి హిజ్రాలు రేవతి చేసే పనిని ముందు నిరసించినా, ఆమె చేస్తున్న సేవను అర్థం చేసుకుంటారు. అనేక మంది హిజ్రాలు తమపై పెట్టిన అబధ్ధపు కేసుల నుంచి సంగమ తప్పించగలదన్న నమ్మకాన్ని పెంచుకున్నారు. 

                        భయంతో బతకకూడదని, జనం హిజ్రాల గురించి సరిగా అర్థం చేసుకునేలా చెయ్యాలని, హిజ్రాల మీద జరిగే హింసను ఆపుజెయ్యాలని , దానికోసం పనిచెయ్యాలన్న దృఢనిశ్చయంతో పని చెయ్యటం మొదలెడుతుంది. హిజ్రాలు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. వారికి ఆస్తి, రేషన్ కార్డ్, పాస్ పోర్ట్, ఉద్యోగం, పెళ్ళి చేసుకునే హక్కు, బిడ్డను దతత తీసుకునే హక్కు లాటివి సంపాదించుకోవాలని తోటి హిజ్రాలకు చెప్పేది.

                   రేవతి తనకు వచ్చే జీతం తన ఖర్చులకు మాత్రం సరిపోతుండటంతో తల్లిదండ్రులకి ఏమీ పంపలేని స్థితిలో ఉంటుంది. సంగమ కార్యకర్తగా జీవితం మొదలయ్యాక తండ్రిని కూడా ప్రశ్నించే ధైర్యం వస్తుంది. కుటుంబ ఆస్తి విషయంలో అన్నలతో గొడవలు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు కూడా తనను సమర్థించ కపోవటంతో నిరాశతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. విరక్తితో తిరిగి బెంగుళూరులో ఉద్యోగానికి వెళ్లిపోతుంది. మానసికంగా కృగిపోతుంది. శారీరక వాంఛలు తీరేందుకు తనకొక సహచరుడు లేడని దుఃఖపడుతుంది. 

                   తమిళనాడులోని విళుపురం జిల్లాలో ఉన్న కూవగంలో కూతాండవర్ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమరోజు వేలాది మంది పురుషులు, హిజ్రాలు వచ్చి ఉత్సవంలో పాల్గొంటారు. హిజ్రాలు గుడిలో అరవాన్ తో తాళి కట్టించుకుని, మర్నాడు దేవుని ఊరేగింపు ముగిసిన తర్వాత తమ గాజులు తామే పగలకొట్టుకుని తాళి తెంపుకుంటారు. ఈ ఉత్సవం మూలాలు మహాభారతంలో ఉన్నాయంటారు. మహాభారత యుధ్ధంలో విజయం దక్కాలంటే పాండవులు అన్ని విద్యలలో పరిణతి చెందిన ఒక యువకుడిని బలి ఇవ్వాలి. అలాటివారు ముగ్గురే ఉన్నారు. కృష్ణుడు, అర్జునుడు, అర్జునునికీ నాగరాణికీ పుట్టిన అరవాన్. కృష్ణుడు, అర్జునుడు యుధ్ధంలో ముఖ్యులు కనుక అరవాన్ ని బలి ఇవ్వాలనుకుంటారు. బలిపీఠం ఎక్కబోతూ అరవాన్ ఒక స్త్రీని పెళ్లిచేసుకుని క్షణమైనా దాంపత్య సుఖం అనుభవించి చనిపోవాలని ఉందంటాడు. అప్పుడు ఏ స్త్రీ అతనిని చేసుకుందుకు ముందుకురాదు. కృష్ణుడే స్త్రీ వేషంలో పెళ్లిచేసుకుని, అరవాన్ ని బలి ఇచ్చిన తరువాత వితంతువు దుస్తులు ధరించి విలపిస్తాడు. 

ఈ ఉత్సవంలో పాల్గొనేందుకొచ్చిన హిజ్రాలకు అనేక రకాల పోటీలు జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని చిత్రీకరించేందుకు పత్రికా ప్రతినిధులు, రిపోర్టర్లు, విదేశాల నుంచి పరిశోధకులు కూడా రావటం రేవతికి గర్వంగా అనిపిస్తుంది. అక్కడ జరిగిన పోటీల్లో రేవతి ఒక ప్రసంగం చేసి బహుమతి గెలుచుకుంది. ఆమె అక్కడ చదివిన కవిత,

“ప్రేమవనంలో

హుందాతనం విత్తు నాటాను!

మంచితనం నీళ్లు పోశాను, ఒక మొక్క మొలిచింది!

మృదువైన ఒక పువ్వు పూసింది!

అది పవిత్ర స్థలాలకూ, ప్రార్థన మందిరాలకూ పనికిరాని పువ్వు!”

ఆమె ప్రసంగంలో తామంతా సంఘటితమై పోరాడాలని చెబుతుంది. తామంతా వవ్యవస్థీకృతమై ప్రభుత్వం తమ కోరికలను పట్టించుకునేలా చెయ్యాలని చెబుతుంది. 

                      ఆసంస్థలో పనిచేసే పై అధికారి పట్ల ఆరాధన కలుగుతుంది. ఆయన కూడా రేవతి పట్ల అభిమానం, ప్రేమ ప్రకటిస్తాడు. వారిద్దరూ కలిసి ఉండేందుకు నిశ్చయించుకుని ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు. కలిసి ఉండటం ప్రారంభించాక మూడు నెలల తర్వాత అతనంతట అతనే ఒకరోజు పెళ్లిచేసుకుందాం అని అడుగుతాడు. హమామ్ పక్కనున్న ఎల్లమ్మన్ గుడిలో గురువు, గురుబాయ్ ల సమక్షంలో దండల మార్పిడి పెళ్ళి చేసుకుంటారు. సమాజం, కుటుంబం రేవతి పెళ్లిని ఆమోదిస్తారు.  అతనికోసం వండి పెట్టటం, బట్తలు ఉతకటం, అతను వచ్చేవరకూ ఎదురుచూసి ఒక భార్యలాగా అతనికి సేవలు చేస్తూ, తాను కలలు కన్న గృహిణి జీవితాన్ని రేవతి ఆస్వాదిస్తుంది.

                   అతని తల్లిదండ్రులు వచ్చినప్పుడు అతను రేవతిని సహోద్యోగిగా మాత్రమే చెబుతాడు. క్రమక్రమంగా అతను రేవతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవటం గమనించి తనను దగ్గరకు తీసుకొమ్మని, ప్రేమించమని అతనిని అడుగుతుంది. కానీ అతను చిరాకు పడతాడు. ఒకసారి ముంబైలో జరిగిన “ప్రపంచ సోషల్ ఫోరమ్” సభలకు వక్తగా వెళ్లిన రేవతి తాను చిన్నప్పటినుంచి తల్లిదండ్రులతోనూ, పోలీసులతోనూ, రౌడీలతోనూ పడిన కష్టాలను అక్కడ సమావేశంలో ఉన్న మూడు వేలమంది ముందు చెబుతుంది. ఇంకా తన వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను కూడా చెబుతుంది. దానికి అతను నిలదీస్తాడు. 

సమాధానంగా, ప్రపంచం తనతో ప్రవర్తించిన తీరును చెప్పాననీ, అలా తన అనుభవాలని తోటివారితో చెప్పమంటూ సంగమ లో మొదటినుంచి అతనే ప్రోత్సహించాడన్నది రేవతి గుర్తుచేస్తుంది. అతను తామిద్దరికి ఇక సంబంధం లేదని చెప్పి వెళ్లిపోతాడు. రేవతి అతనిని మనసావాచా ప్రేమించింది, అతను లేని జీవితాన్ని భరించలేక తాగుడుకి మరింత అలవాటు పడుతుంది. మనిషి బాగా కృంగిపోతుంది. సంగమలో ఉద్యోగం కూడా చెయ్యలేనని చెప్పేస్తుంది. కానీ ఆమె ఆఫీసుకు రానక్కరలేదని, బదులుగా ఆమెలాటి వారిని దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేసి ఒక పుస్తకాన్ని రాయమని సంగమ కోరుతుంది. ఆపని మీద ఆమె తమిళనాడులో తిరుగుతూ తన పుస్తకంకోసం పని మొదలు పెడుతుంది.

                    రేవతి బెంగుళూరు వదలి వెళ్లిన సమయంలో తన కూతురుగా భావించి చేరదీసిన ఫమిలా చనిపోతుంది. ఆ సంఘటన తర్వాత ఆమె గురువు కూడా చనిపోతుంది. హిజ్రా సంప్రదాయం ప్రకారం గురువు చనిపోతే చేలాలు వితంతువులవుతారు. రేవతి కూడా గురువు మరణంతో వితంతువుగా మారి కాలి మెట్టెలు, మట్టిగాజులు వేసుకోవటం మానేస్తుంది. 

                    ఇంత దుఃఖంలోనూ “ఉనర్వుమ్ ఉరువమమ్” పుస్తకం రాయటం పూర్తిచేస్తుంది. అది అయ్యాక తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఉండాలనుకుంటుంది. కానీ తన దగ్గర డబ్బు లేదు. తండ్రి మీద ఆధార పడటం ఇష్టం లేదు. ఇంతలో తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. 

మళ్లీ రేవతిని పేదరికం చుట్టుకుంటుంది. ఇదివరకులా సెక్స్ వర్క్ చేసేందుకు మనస్కరించదు. హిజ్రా సమాజానికి దూరంగా ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుని తిరిగి సంగమ లో పని చేసేందుకు వెళ్తుంది.

 రేవతి రాసిన ఈ ఆత్మకథ హిజ్రా సమాజం గురించి ఇంగ్లీష్ లో వచ్చిన మొదటి పుస్తకం. నిత్యం మన జీవితాల్లో ఎదురయ్యే హిజ్రాల జీవితాలను మెరుగుచెయ్యవలసిన బాధ్యత మొత్తం వ్యవస్థ మీద ఉంది. ప్రభుత్వాలు వారి విద్యకు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత నిచ్చి జనజీవన స్రవంతిలో వారు కూడా హక్కుదారులన్నది స్పష్టపరచాలి. 

సమాజంలో మనమధ్యే ఉంటూ తమ ఉనికి పట్ల, తమ హక్కుల పట్ల అందరిలో అవగాహన కోసం తపిస్తున్న వీరిని మనం స్వంతం చేసుకోవలసిన సమయమిది. ఈ పుస్తకాన్ని చదవటం ఒక గొప్ప అరుదైన అనుభవం.


*****

Please follow and like us:

6 thoughts on “ఒక హిజ్రా ఆత్మ కథ (పుస్తక సమీక్ష)”

  1. Very well written review. It’s sad to read but very powerful opening our eyes to the injustice happening to them. These writings enable us, look at these individuals with a different outlook and compassion. Families should own and support them.

  2. Review is nice. Time for the society to give them equal rights and space. People mock them and look down upon them for no mistake of theirs. Even their own families feel ashamed of them and shun them. That’s truly sad!!!

  3. హిజ్రా ల జీవితం గురించి శ్రీమతి అనూరాధ గారి విశ్లేషణ చాలా బాగుంది .

    1. చదువుతున్ననంత సేపు రేవతి పడిన బతుకుపోరు కంటినీరు తెప్పించింది. వారికి విద్య ఉద్యోగం కల్పించాల్సిన
      అవసరంవుంది

Leave a Reply

Your email address will not be published.