రెక్కల పిల్ల

-పి.జ్యోతి

జీవితంలోని ప్రతి మలుపులో, స్థితిలో అనుభవాలు, అనుభూతులు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. వాటికి స్పందించే పరిపక్వత అందరిలో ఒకేలా ఉండదు. ఒకొక్క మనిషి జీవితం మరొకరితో పోల్చితే అస్సలు ఒకేలా ఉండదు. కొందరి బాల్యం అనుభవాల మయం అయితే మరికొందరికే బాల్యంలో అంతగా గుర్తించుకోవలసిన సంఘటనలు ఎక్కువగా ఉండవు. వారి మనసు అవి రికార్డు చేసుకోదు. జీవితం గడిచిపోతుంది అంతే. అంత మాత్రం చేత వారి జీవితంలో సుఖం లేదని కాదు వారికి అనుభూతులు లేవనీ కాదు. ఒకొక్కరి జీవితంలో గుర్తుంచుకునే సంఘటనలు భిన్నమైనవిగా ఉంటాయి. ఒక్కరి జీవితాలు ఒకేలా ఉండవు.

శ్రీ సుధ మోదుగు వ్రాసినరెక్కల పిల్లఅనే కథా సంకలనంలో ఒక మూడవ తరగతి చదివే చిన్న అమ్మాయి జీవితం, ఆమే అనుభవాలు, అనుభూతులు కనిపిస్తాయి. తన వయిసుకు మించి పరిపక్వత కనపరుస్తూ అమ్మాయి అద్భుతమైన పరిశిలనా దృష్టితో తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. అంతటి స్వేచ్చనిచ్చే తల్లితండ్రులను పొందడం తన అదృష్టమయితే అంతటి ఆనందాన్ని అనుభవించే అవకాశం తనకు అందుబాటైన ఆహ్లాదకరమైన వాతావరణానిది. వీటికి తోడు ఆమెలో తెలుసుకోవాలనే జిజ్ఞాస, భయం అన్నది తెలీని జీవితం ఆమెకు లభించిన వరాలు. అందుకే ఆమె ఆశలకు, కోరికలకు రెక్కలొచ్చి జీవితాన్ని తన అందమైన లోకంలో రంగులమయం చేసుకోగలుగుతుంది

పుస్తకంలో ప్రతి కథలో అమాయకమైన మలినంకాని ప్రేమ, బాల్యం, ప్రతి విషయంలో మంచిని చూడగలిగే నమ్మకం, అన్నీ నావే, నేనే అన్నీ అనే ఒక బలమైన విశ్వాసం కనిపిస్తాయి. సుధ పాత్ర చాలా అద్భుతమైన జీవితం గడిపినట్లు అనిపిస్తుంది. కాని నిజానికి ఆమె జీవితం ఒక సాధారణమైన ఊరిలో ఎన్నో మనస్థత్వాల మధ్య, సమస్యల మధ్యే గడుస్తుంది. పాస్టర్ల చేతుల్లో నలిగిపోయే చిన్ని అసహాయ అమ్మాయిలు, చదువుకునే అవకాశం లేని పేద స్నేహితులు, బాల్య వివాహంలో బంధింపబడిన పసి మొగ్గలు కనిపిస్తాయి. కాని మనం సుధ కళ్ళతో ప్రపంచం చూస్తాం. కళ్ళకు చేడు తెలీదు, మనిషి పై విశ్వాసం తెంచుకోవలసిన అవసరం లేదు, ప్రపంచంలోని దుర్మార్గం అంటదు. అందుకే తమ్ముడైనా, బిచ్చగాని పిల్లలయినా, పనివాడు ఏసుదనం అయినా, తామరపూలు ఇచ్చే రంగా, గెనిసిగెడ్డలు అమ్ముకునె వారి పిల్ల అన్నపూర్ణ అయినా, సైకిల్ తొక్కడం నేర్పిన బుడ్డ పూజారి అయినా, బర్రెలు కాసుకునే పోలి అయినా అందరూ తన స్నేహితులే తనకు కావలసిన వారే. అందుకే తను బర్రెలు కాచె వాళ్ళతోనూ , అడుక్కునే వాళ్ళతోనూ,ఆడుకోగలిగింది, మూడుముక్కలాట వారితో డబ్బు పెట్టి పందెం వేయగలిగింది, శవాలపై డబ్బులేరుకోగలిగింది, దీపావళి రోజు ఎదురింటీ మామ్మ కాళ్ళూ కాలేలా రాకెట్టు విసిరి మళ్ళి అవ్వ బాగు కోసం తాపత్రయపడగలిగింది, మసీదులో నమాజుకి వెళ్లగలిగింది, సున్తీ జరిగిన ఇంట్లో విందుకు పిలవకుండానే వెళ్ళగలిగింది, ఇంటిలోకి ఎవ్వరినీా రానీయని ముసలమ్మ ఇంటిలో దూరి ఆమె వడియాలు దొంగతనం చేసి ఇంట పూలు ఏరుకుని ఆనందించగలిగింది. మిత్రుని కులం కారణంగా గౌరవం ఇవ్వని ఇంట వారి విందు వద్దని కులం కారణంగా దూరంగా నెట్టివేయబడిన మిత్రుడి ఇంటనే సమయం గడిపి కుల అహంకారానికి బదులు ఇవ్వగలిగింది. రాగి రేకు నుండి ఆకాశంలోని నక్షత్రాల దాకా అన్నిటినీ ఒకే స్థాయిలో ఆనందించగలిగింది

కథలలో సుధ పాత్ర, ఆమె బాల్యం, ఆమె అందమైన జ్తీవితం, దాన్ని పొందగలిగిన ఆమె అదృష్టం ఇవన్నీ మన మనసును దోచెస్తాయి. వాన కోసం తపస్సు చెసే చిన్నారుల అమాయకత్వం, తమ ఆనందం తమ సొంతం అనుకునే వారి ధీమా, జంతువు లే కాదు ప్రకృతి లోని ప్రతి అణువుపై వారి ప్రేమ, కోతి జేబులో చాక్లెట్టు తీసుకుని వదిలి వెళ్ళీన తాజా ఎర్రటి గన్నేరు పువ్వు గుభాలింపు అందమైన వీరి బాల్యం మనల్ని అమాయకమైన పిల్లల వైపు ఆకర్షించేలా చేస్తాయి. మత్తు బాగుంటుంది అంటే అయితే నేను కూడా త్తాగుతా అనే బాల్య ధైర్యం, పెద్దయ్యాక నేనూ తాతలా జైలు కెల్తా అనే నిర్ణయం తీసుకోగలిగే తెగింపు, మూడొ క్లాసులో ఉన్నా అని కొంచెం పెద్ద పిల్లలతో చెప్పవలసి వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇయర్ నాలుగుకెళ్తా అని చెప్పి వారి సరసన ఆటకోసం చేరే చిన్ని లౌక్యం, “ఇంట్లో గొడవలు పోలీసులకి చెప్పకూడదుఅన్న పోలీసుని చూసిన తరువాత నాకెందుకో ఎదీ నచ్చలేదు అని విసుక్కునే బుజ్జి స్త్రీ వాదం, “నేను దొరసానిని కాదుఅనే మనవతావాదం, దెయ్యం ముందు వస్తే పద్మ వాళ్ళింటికి వస్తుంది అని ఇంటి మీద గుర్తు చెరిపేసి అది ఎందుకు చెరపవలసి వచ్చిందో చెప్పలేన్ని బహు బుజ్జి అతి తెలివి, “అబద్దాలు చెప్పే వాళ్ళకి కూడా చెప్పులు కావాలి కదాఅని ఆలోచించగలిగే దాతృత్వం, “పిచ్చివాడని నవ్వినా పర్లే నవ్వ న్లీలే, అందరూ నవ్వుతుంటే నాకు సంతోషమేస్తదిఅనే పిచ్చి స్నేహితుడిలోని గొప్పతనాన్ని చూడగలిగే దైవత్వం, ఇద్దరి స్నేహితులని కలిపి వారి గొడవకు నిదర్శనంగాుా నిలిచే పేడలోని రాళ్ళను తరువాత చూడలేదు అనగలిగే అద్భుతమైన పరిశిలనా దృష్టి, వెళ్ళాలనుకుంటే స్మశానం, గుడి, బడి, ఆసుపత్రి, చర్చి, కొలిమి, పిండి మర, నూజీళ్ళూ తయారీ చేసే కొట్టూ, ఎవైనా అడ్డు కాని పరిస్థితి, కోపం వస్తే ఎవ్వరినయినా పడేసి మట్టిలో పొర్లించి కొట్టగలిగే స్వాతంత్రం ఇవన్ని ఇచ్చిన వీరి బాల్య స్మృతుల సమాహారం రెక్కల పిల్ల“. అందమైన బాల్యానికి అందమైన రికార్డు కథలు. ఇల్లేరమ్మ (సోమరాజు సుశిల గారి ఇళ్ళేరమ్మ కథలు) తరువాత సుధ మనకు చాలా నచ్చే పాత్ర అవుతుంది. చేయవద్దంటె పని చేసి అది నా హక్కు అని డాంబికంగా పలకగల స్వేచ్చాజీవిని ఆమెలోని చైతన్యాన్ని అస్వాదించడం ఒక గొప్ప అనుభూతి. అనుభూతిని మనకు పంచినందుకు రచయిత్రికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరి.

*****

Please follow and like us:

One thought on “రెక్కల పిల్ల (పుస్తక సమీక్ష)”

  1. జ్యోతి గారూ! రెక్కల పిల్ల కథాసంపుటిపై మీ సమీక్ష చాలా బాగుంది. కథల నాడి పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.