గిన్నిస్ రికార్డు సాధించిన సరోజిని వీరమాచినేని

-ఎన్.ఇన్నయ్య

ఆమె హైస్కూలు విద్యకు మించి చదవలేదు. పట్టుదలతో అందరు స్త్రీలతో చిన్నారి పాపలు సినిమా తీసింది. మినహాయింపు లేకుండా కళాకారులు, నేపథ్యంలో పనిచేసినవారు, అంతా స్త్రీలే. ప్రొడ్యూసర్ గా తాను నడిపిస్తూ, సావిత్రి డైరెక్టర్ గా చిత్రించిన సినిమా తొలిసారి తెలుగు రంగంలో గిన్నిస్ రికార్డు సాధించింది! 

ఆమె భర్త వీరమాచినేని మధుసూదనరావు విక్టరీ డైరెక్టర్ గా పేరొంది నూరు సినిమాలు తీసి అన్నీ విజయవంతం చేశాడు. 

 సరోజిని స్కూలు విద్యార్ధినిగా విజయవాడలో అచ్చమాంబ కమ్యూనిస్టు స్కూలులో శిక్షణ పొందింది. కార్యకర్తగా కృష్ణాజిల్లా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నది. నాజర్ కు దీటుగా అల్లూరి సీతారామరాజు బుర్రకథను ఇద్దరు స్త్రీల వంతతో వూరూరా చెప్పి, భేష్ అనిపించింది. ఇది 1940 ప్రాంతాలలో మాట

సరోజినికి వాణి, వీణ అనే యిరువురు సంతానం. విజయవాడ, మద్రాసు జీవితం అనంతపురం హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో స్థిరపడింది. అప్పుడే మాకు పరిచయం కాగా 1994 ప్రాంతాలలో రోజూ ఎదురుగా వున్న మా యింటికి వచ్చి, తన అనుభవాలు నా భార్య కోమలతో పంచుకునేది.

ఒకసారి మా మనవడు రోహిత్ 3 ఏళ్ళ ప్రాయంలో అమెరికా నుండి వచ్చి, పుట్టినరోజు జరుపుకుంటుండగా, సరోజిని వచ్చి, ఆసువుగా ఆకర్షణీయ గేయం అల్లి పాడింది. తెలుగు రాని రోహిత్ ఆమె పాట వింటూ మంచం మీద ఆనందంగా చప్పట్లు కొడుతూ గంతులు వేశాడు. అందరం ఆశ్చర్యపోయాం. ఆమె పాట, ఇంగ్లీషు తప్ప మరో భాష రాని రోహిత్ ఆకట్టుకోవడం, సరోజిని పాడిన తీరు, ఆకర్షించిన వైనం ఆశ్చర్యకరం.

ఒకరోజు పొద్దున్నే నేను రాసిననరహంతకులు అనే పుస్తకం పట్టుకొచ్చి, అందులో లెనిన్ గురించి రాశావు, అది నిజం కాకుంటే కమ్యూనిస్టులు నిన్ను హత మార్చే వారే అంటూ వ్యాఖ్యానించింది, ఆమె అప్పటికి పార్టీని పట్టించుకోకుండా రిటైర్ అయిపోయింది.

జీవితాంతం సరోజిని తన యిష్ట స్నేహితురాలుగా సావిత్రిని మెచ్చుకుని, మద్రాసులో ఆమె పొరుగున నివసించిన రోజులలో జ్ఞాపకాలు చెప్పేది. సావిత్రితో నటనలో పోల్చదగినవారు తెలుగు సినీ రంగంలో నాటికీ నేటికీ ఎవరూ లేరనేది.

ఆమె 1999 ప్రాంతాలలో చనిపోయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. సరోజిని జీవితంలో కృషి ఆదర్శప్రాయం.

                                                                       *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.