కొత్త అడుగులు – 16

బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి

– శిలాలోలిత

ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో వుంటున్న ‘ఇందిరాభైరీ’ – సాహిత్య జీవితాన్ని ఓసారి చూద్దాం. కొత్తగూడెంలో బాల్యం గడిచిపోయి, ఇల్లెందులో స్థిరపడిన టీచర్ ఇందిర. మాటెంత సున్నితమో మనసంత భావుకత నిండిపోయి వుంటుంది. మొత్తం 6 పుస్తకాలను ప్రచురించింది ఇప్పటికి. ఈమె కవిత్వంలో కనిపించే ప్రధాన గుణం తక్షణ ప్రేరణ. రైతుల ఆత్మహత్యో, నిర్భయ లాంటి జీవితాలు వినగానే, చూడగానే భావోద్వేగానికి లోనై కవిత్వం వస్తుంది. ఒక్కొక్కసారి చాలా బలమైన కవితలుగా రూపుదాల్చుకోవడంతో పాటు అక్కడక్కడా బలహీనపడటానికీ కూడా అవకాశంవుంది. 9వ తరగతి చదువుతున్నప్పుడే ఆమె రాసిన మొదటి కవతి ‘ఉక్కుపిడికిళ్ళు’ –  ఈ 6 పుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా వేస్తోంది. త్వరలో రాబోతోంది. కరోనా వల్ల ఆలస్యమైంది. ‘మరోకప్రారంభం’ అని ఆ పుస్తకానికి పేరుపెట్టింది. ఇంటర్ చదివిన తర్వాత పెళ్ళిచేసేవారు. చదువంటే వున్న అమితాసక్తి వల్ల యాపిల్ వరకూ చేసింది. మధ్యలో గవర్నమెంట్ టీచర్ గా స్థిరపడింది. 1997 నుంచి చాలా విరివిగా కవిత్వం రాసింది. చిన్నప్పటి నుంచీ వాళ్ళ నాన్నగారు పోతన పద్యాలు పాడుతూ, కవితలు, పాటలు రాయమనేవారట. అలా నాలో సాహిత్యకాంక్షను రగిలించింది మా నాన్నగారే అంటుందొక చోట. పుష్ప విలాపం కూడా వినిపించే వారట. మాలపల్లి, గబ్బిలం వంటి పుస్తకాలను పరిచయం చేయడంతో సమకాలీన సమాజమే కవితా వస్తువైంది. ఉపాధ్యాయ ఉద్యమాలు, రాష్ట్రంలో పలు చోట్ల కవిసమ్మేళనాల్లో పాల్గొనడం, సాహిత్య సంస్థల్లో చేరిక ఖమ్మం, భద్రాచలం మొదలగు కవులతో తీసిన సంకలనాల్లో కవితలు వచ్చాయి. ఆమె రాసిన హైకూలు – మీనాలు కూడా బాగా పేరుతెచ్చాయి.

‘‘చచ్చాక ఏమయ్యేది

చూసి చచ్చిందెవరు

స్వర్గమో నరకమో

పోయి వచ్చిందెవరు’’-

అనేక అవార్డులు, రివార్డులను ఆమె ఎన్నో సాధించుకుంది.

కవిత్వంతో పాటు గజల్స్ రాయడం కూడ మొదలు పెట్టింది. 3 సంకలనాలు వేసింది. ‘తెలంగాణా గజల్ కావ్యం’ మొదటిది. ‘సవ్వడి’ లో 120 గజల్స్ వున్నాయి. 2005 లోనే వేసిన పుస్తకం అలవోకలు. పాటలంటే, హిందీ సాహిత్యమంటే ఆమెకున్న అపారమైన ఇష్టం వల్ల గజల్స్ వైపు మళ్ళుంటుంది.

రెంటల వెంకటేశ్వరరావు గారు ‘గజల్స్’ నేర్పిన గురువుగా ప్రకటించుకొంది. పెన్నా శివరామకృష్ణ, గజల్ శ్రీనివాస్, యు.డి. శ్యామల వంటి ఉద్ధండులు తనకెంతో తోడ్పడ్డారని చెప్పుకొచ్చింది. కవయిత్రులలో గజల్స్ రాసే వాళ్ళు చాలా తక్కువ. ఇందిర తన బలమైన భావవ్యక్తీకరణతో, గజల్స్ రాయడంలో చాలా కృషిచేసింది. కొన్ని అనువాదాలు సైతం చేసింది. పేరడే పాటలు రాసింది. ‘లగ్ జాగలీ’ వంటి అనేక పాటలకు తన పేరడేనీ జతచేసింది. గత 8 ఏళ్ళల్లోనే 5,6 వందల వరకూ కవిత్వమూ, గజల్స్ రాసింది. నానోలు రాసింది. పరిశోధన ఆమెకిష్టమైన విషయం.

విద్యార్ధులను మనసుకు హత్తుకుని పాఠాన్ని రకరకాలుగా బోధించడమే కాక, మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దడంలో తృప్తిపడింది. ఇటీవల కాలంలోనే రిటైరై ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటోంది.

ఇందిర కవిత్వం ఎంత అలవోకగా వుంటందో ఓ కవిత చూడండి.

         నేను పోయినప్పుడు

         వస్త్రానికి బదులు

         ఓ కాగితాన్ని కప్పండి

         కవిత రాసుకుంటాను

         సిరాబుడ్డినీ, పెన్ను నొకదాన్ని

         బ్యాగులో వుంచండి

         మనసులో ముల్లు గుచ్చుకున్నపటి ఫోటో

         గాయపడిన గజలో

         గుండె లోయల నుండి జాలువారొచ్చు

         సెల్ మర్చిపోయారు

         బోర్ కొట్టి వస్తాను.

         పసుపూ కుంకుమ పులిమి

         భయానికంగా మార్చకండి

         నన్నందరూ గుర్తుపట్టాలి మరి!

         దండలతో మూసెయ్యకండి

         నాకు ఎలర్జీ ! !

         ఆ రేకులతో ఏదార్నైనా

         మెత్తగా పరవండి.

         పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని

         పేర్లు పెట్టకండి

         నచ్చదు

         సామాన్లేవే పారేయొద్దు

         అడిగిన వాళ్ళకిచ్చేయండి

         బ్యాండ్ వాళ్ళను

         ఓల్డ్ మెలోడీస్ వాయించమనండి

         డాన్స్ లాడి లేట్ చెయ్యకండి

         టైమంటే టైమే ! !

         మంగళవారమో ! అమంగళవారమో ! !

         పాడెకు కోడిపల్లను కట్టి హింసించకండి

         బడికి కబురుపెట్టండి

         నే బతికిన క్షణాలు తలుచుకుని

         వాళ్ళు సెలవిచ్చుకుంటారు

         దింపుడు కళ్ళందగ్గర

         చెవులు గిల్లుమనేలా పిలవకండి

         తలచుకునే వారెవరో నాకు తెలుసు

         డబ్బుకు ఇబ్బందక్కరలేదు

         పక్కవాళ్ళ కొట్టో ఖాతావుంది

         అన్నిరోజులూ ఇక్కడే వుండండి

         మళ్ళీ మళ్ళీ చస్తానా ఏంటీ !

         మట్టిలో కప్పెట్టకండి

         పురుగూ పుట్రా భయం

         కాస్త చూసి తగలబెట్టండీ…

         చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!

         గంధపు చెక్కలతో కాలడంకంటే

         జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువనాకు

         పనిలోపని!

         నా నవ్వులూ కన్నీళ్ళు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర

         కవి సమ్మేళనం పెట్టండి

         నేనూ ఉన్నట్టుంటుంది

         తనివితీరా ఉన్నట్లుంటుంది

ఈ కవిత చదువుతున్నంతసేపు మనము ఇందిరతో కలసి ప్రయానిస్తున్నట్లే వుంటంది. అంత సహజంగా రాయడం ఆమె ప్రత్యేకత. ఈ కవిత చదువుతుంటే ‘అయ్యప్పఫణిక్కర్’ రాసిన ‘వీడియో’ కవిత గుర్తొచ్చింది. భారంగా మనసు అయింది. ఇలాంటివి చాలా రాసింది. సినారె ఒకచోట అంటాడు – తనగురించి.

‘రాస్తూ రాస్తూ పోతాను

సిరా ఇంకే వరకూ

పోతూ పోతూ రాస్తాను

‘వపువు’ వాడే వరకు – అని.

రోజుకో సభ లేందే సినారేకు ఎలా తోచదో, ఇందిరకు రోజుకో రచన చేయందే రోజు నిండదు –

‘అలవోకలు’ 2005 లో, తొలిపుస్తకం. హైకూలు, మినీలతో 2007 లో ‘అభిమతం’ – కవితా సంకలనం, 2016 లో ‘తెలంగాణ గజల్ కావ్యం’, 2018 లో ‘సవ్వడి’ – గజళ్ళు, 2019 లో ‘మనకవులు’ – గజల్ గీతాలు, 2019 లో ఘనచరితలు, గేయకవిత్వం ప్రచురించింది. 9849173560 – ఇది ఆమెనెంబర్, తన కవిత్వ పుస్తకాలను చదవాలనే ఉత్సకత ఎవరికన్నా కలిగుంటే, ఆ నంబర్ తో మాట్లాడండి.

ఒక మంచి వ్యక్తిత్వమున్న మహిళగా, జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తాననుకున్న, కలగన్నఅన్నింటినీ సాధించుకున్న ఆమె ఎందరికో స్ఫూర్తి దాయకం. గొప్ప తాత్విక నేపథ్యం వున్న కవయిత్రి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.