రాగో

భాగం-7

– సాధన 

దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో ఏమీ తెలియదు. తన వద్ద చెద్దరు, దుప్పటి లేవు. కప్పుకోను చీర పేగు కూడ తెచ్చుకోలేదు అని బాధపడుతున్న రాగోకు ఎవరో ఏదో అనడం వినపడింది. కానీ ఏమన్నాడో అర్థం కాలేదు.

దళం దారి విడిచి అడవిలోకి పోయి ఓ పెద్ద చెట్టుకింద ఆగింది. అందరూ కిట్లు దించుకున్నారు. ఈ అడవి మధ్యలో ఎందుకాగారో రాగోకి అంతుబట్టలేదు. అడక్కుండా ఉండలేకపోయింది.

“అక్కా! ఏమయ్యింది?” అంటూ గిరిజను అడుగుతున్న రాగో గొంతులో ఆత్రుత ధ్వనించింది.

“ఏం కాలేదు. పడుకోని తెల్లారిపోదాం. ఈ పూటకు ఈ చెట్టుకిందే మన గుడారం రాగో” అంటూ గిరిజ తన కిట్టునుండి మేన్ కప్ (వరకు) తీసి పరచింది.

‘నేనెక్కడ పడుకోవాలె? గిరిజ తప్ప ఎవరూ తనకు తెలియదే. కప్పుకోవడానికి బట్టలెట్లా? ఏమో ఎలా అవుతుందో’ అనుకుంటూ పడకలు సర్దుకోవడంలో మునిగిపోయిన దళ సభ్యులను చూస్తూ రాగో అమాయకంగా నిల్చుండిపోయింది.

“సీదో! కొత్తక్క నీ మేన్ కప్ (వరకు)లో పడుకుంటుంది.” అని అన్నల్లో నుండి ఎవరో అనడంతో అటు చూసిన రాగోకి అతడు కమాండర్ అని అర్థమై ‘దారి చూపాడురా దేవుడా’ అనుకుంది. సీదో తన కులం అమ్మాయే అని గుర్తించిన రాగోకి ఆమెతో జంట కలిపినందుకు మరింత మంచిగనిపించింది. తెలియనివి అడగడం, కావాల్సింది చెప్పడం తేలికవుతుంది కదాని మరింత సంతోషం గుంది.

సీదో పక్కకు జరిగి మేన కప్: (వరకు | పాలీన్ షీటు)లో జాగ ఇచ్చి దుప్పటి మీదకు జరిపింది. అవతల పక్క గిరిజ, మరో అక్క పడుకున్నరు. అన్నలందరూ మరో వైపు పడుకున్నరు. అక్కలు, అన్నలు ఇలా ఒకే చోట పడుకోవడం ఎరగని రాగోలో ఎన్నెన్నో ఆలోచనలు మెదలసాగాయి. కునుకురావడం లేదు. తడవకొకరు సెంట్రీ డ్యూటీకి పోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. పక్కనున్న సీదో కూడ డ్యూటీకి పోయేసరికి వరకులో రాగో ఒంటరిదై బితుకు బితుకుంటూ ముడుచుకు పడుకొంది. చీకట్లో ఏ హెడ్గ (గుడ్డెలుగు), ఏ మెకమో వస్తే ఏం చేస్తారో వీళ్ళు? హోరాండే (కామిని)లు, దయ్యాలు మీడపడితే ఏం చేస్తారో అనుకుంటూ ‘నేను కూడ పోయి సీదో దగ్గరే నిలబడతానని’ లేవబోయింది కానీ అంతలోనే సీదో వచ్చి “మిన్కో! మిన్కో” అంటూ లేపడంతో “ఈ అక్క డ్యూటీ అయిపోయిందిలే” అని ఊపిరి పీల్చుకొని పక్కకు దొర్లి పడుకుంది.

“ఏం అక్కా! నిద్రరావడం లేదా?” అంటూ సీదో నడుం వాల్చింది.

“ఇంగో” – రాగో.

“మొదటి రోజు నాకూ ఇట్లే అయ్యింది. పడుకో. గంటవుతే తెల్లారుతుంది. లేపుతారు” అంటూనే సీదో నిద్రలోకి జారుకుంది.

ఆ పక్కనున్న అన్న ఎవరో మాంచి గురక పెట్టి నిద్రపోతున్నాడు. మరెవరో అతన్తో పోటీపడుతూ ఉంటే ఆ గురకలు ‘పిల్లలు దెబ్బలాడుకున్నట్లే’ ఉందని నవ్వు వచ్చి రాగోకి వచ్చే కునుకు కాస్తా తేలిపోయింది. మిన్కో అందరిని లేపుతూంటే జాగరణ ముగించి రాగో కూడ లేచి కూచుంది.

“రాగో వస్తవా” – అంటూ రాత్రి ఊళ్ళోనుండి తెచ్చుకున్న బుర్రకాయల్లో మిగిలిన నీళ్ళు పట్టుకొని గిరిజ పిలిచింది. సీదో, మిన్కోలప్పటికే బయల్దేరారు.

“ఇంగో” అంటూ రాగో కూడ నడిచింది.

ఎవరూ ఆకులు తెంపుకోకపోవడంతో రాగోకు ఏం చేయాలో తోచలేదు. గిరిజ కాకపోయినా సీదో, మిన్కోలు కూడ ఆకులు తెంపకపోయేసరికి ఇరకాటంలో పడ్డ రాగో అలాగే నిల్చుండిపోయింది.

“హన్వినా అక్కా” (పోవా అక్కా) అంటూ మిన్కో రాగోను హెచ్చరించింది.

“ఏరు మంత బారామో” (నీళ్ళున్నవి. ఏం గాదు) అంటూ మౌనంగా నిల్చున్న రాగోని సీదో కదిలించింది.

నీళ్ళు వాడకం తెలియని రాగో తర్వాత విడిగా పోవచ్చులే అనుకుంటూ ‘రావడం లేదు’ అంటూ దాటవేసింది.

తిరిగి వచ్చేసరికి అన్నలు కిట్లు వేసుకుంటున్నారు. అక్కలు కూడ కిట్లెత్తుకున్నారు. మూర అదనంగా వేసుకున్న జబ్బసంచిని రాగోకు అందిస్తూ “పట్టుకో అక్కా” అంటూ నడవసాగాడు.

దళం తన ప్రోగ్రాం ప్రకారం ‘ బర్రెంకతోగు’ చేరుకుంది. కిట్లు దించడమే ఆలస్యంగా అందరూ నిక్కర్లు వేసుకున్నారు. రాగో వింతగా చూస్తూ కూచుంది. సీదో-మిన్కోలు కూడ నిక్కర్లు, బనీనులతో మగాళ్ళతోపాటు లైన్లో నిలబడేసరికి రాగో ముసి ముసిగా నవ్వుకుంది.

ఎక్సర్ సైజు చేస్తున్న వారిని తదేకంగా చూస్తున్న రాగోను ఉద్దేశించి గిరిజ “రేపటి నుండి నువు కూడ చేయలక్కా” అంటూ ప్రోత్సహిస్తుండగా “కిస్సు మాసబాయి” (నిప్పు రాజేయక్కా) అన్నాడు గాండో.

ఎక్సర్ సైజు ముగిసిందంటేనే చెమటలు కక్కుతున్నా సరే వేడిమీదే ‘మండే కడుపుకి కాలే ఛాయ్’ కావాలంటాడు గాండో.

‘అగ్గిపెట్టె నా కిట్లో ఉందక్కా” అంటూ సీదో రాగోను ఇక కదలమంది.

దళ సభ్యులందరూ పొయ్యి చుట్టు చేరేసరికి రాగో పక్కకి తప్పుకుంది. గాండో చాయ్ పనిలోకి దిగాడు. అందరూ కూని రాగాలు తీస్తున్నారు. కమాండర్ రుషి దూరంగా వరకలో కూచుండి రేడియో వింటున్నాడు.

తనకంటూ తువ్వాల, ఓ చర్, ఓ జబ్బసంచి కూడ ఏర్పడ్డాయి. ముగ్గురక్కలు ఉండి అంతా కలుపుగోలుగా ఉండడంతో మారు చీరకి, బొట్టు, అద్దం, దువ్వెనకి కూడ వెతుక్కోవలసిన పని లేకుండాపోయింది. దళంలో కొందరి పేర్లయినా ఇపుడు గుర్తుంటున్నయి. నాలుగైదు రోజులుగా మనుషులు పరిచయమై, అందరూ చనువుగా అక్కా, అక్కా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే మొదటి నాటి బెరుకు కొంత తీరింది.

ఆ రోజు ఎప్పటిలాగే అందరితో పాటు పొయ్యి చుట్టు కూచున్నపుడు తనకి టీ గ్లాసు అందిస్తూ ఒక కామ్రేడ్ “ఈ కొత్తక్కకు ఏం పేరు పెడదాం” అంటూ దూరంగా ఉన్న కమాండర్‌ను కేకేసి అడిగిండు. .

“అపుడే ఏం తొందర కామ్రేడ్? రేపు డ్రెస్సు, తుపాకి ఇచ్చినపుడు అక్కనే అడుగుదాం” అంటూ రుషి కూడ పొయ్యివద్దకు చేరుకున్నాడు.

మర్నాడు రాగోకి డ్రెస్సు, తుపాకి, చెప్పులు, టోపి వచ్చాయి. కమాండర్ గిరిజ చేతికి డ్రెస్సు, బెల్ట్ ఇస్తూ “రాగోకు ఎక్కించండక్కా” అనడంతో ముగ్గురక్కలు రాగోను లాక్కుపోయారు.

ఆ హడావిడిలో చీర కొయ్యకి తట్టుకొని రాగో కిందపడింది. సీదో కిసుక్కున నవ్వుతుంటే గిరిజ – మిన్కోలు రాగోని లేపారు. కొయ్య తట్టి చీరా, లంగ చిరిగాయి తప్ప దెబ్బేమి తగల్లేదు.

“హాయిగా డ్రెస్సు ఎక్కిస్తే ఈ పాట్లుండవు” అంటూ సీదో హుషారు చేసింది. నవ్వినందుకు తనే నొచ్చుకుంటున్నట్టు.

చిరిగిన చీర విడిచేస్తున్న రాగోకు పెళ్ళయ్యాక పెద్దలు చేసే “టీకా” గుర్తుకొచ్చింది. బలవంతంగా బట్టలు తీసేసి, అందవిహీనంగా, అర్థనగ్నంగా తయారు చేసి జానెడు టవల్ కిందకీ, బెత్తడు టవల్ మీదికీ కట్టబెట్టే ఊరి శేడోలు కళ్ళల్లో మెదిలారు. ‘మన్నీ, మన్నీ’ (వద్దు, వద్దు) అంటూ మొత్తుకున్నా, ఏడ్చినా, కిందపడి దొర్లినా వినిపించుకోని “పెద్ద మనుషుల” మొండి వాలకాలు, వాళ్ళ తిట్లు, దెబ్బలు చెవుల్లో గింగురుమన్నాయి. గాజులు పగులగొట్టి, మట్టెలూడదీసి, బొట్టు చెరిపేసి మానంతీసే రీతి రివాజులు గుర్తుకొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది.

“చెడ్డీ వేసుకో అక్కా” అంటూ చెడ్డీ అందిస్తున్న గిరిజ పిలుపుతో రాగో ఈ లోకంలోకి వచ్చింది.

“నన్న బోరో” (ఆం! ఏమో పో) అంటూ గునుస్తున్నట్లు బుంగమూతి పెట్టింది రాగో.

“బారామో” (ఏంగాదు) అంటూ ప్రోత్సహిస్తూ కొత్త బనియన్ మడత విప్పి చేతిలో పట్టుకొని సీదో ముందుకొచ్చింది.

క్షణంలో రాగో వేషం మారిపోయింది. డ్రెస్సు ఎక్కించి, టోపి పెట్టుకొని చెప్పులేసుకుంది. ఆ ముగ్గరక్కల్లాగే రాగో ఠంచన్ గా తయారైంది.

గిరిజ ఒక్కసారిగా కావలించుకుంది. సీదో, మిస్కోలు మాడియక్కల ఆచారం ప్రకారం మట్టలు ముద్దెట్టుకున్నరు.

రాగోకు ఇంతటి ఆప్యాయత ఎన్నడూ దొరకలేదు. తోబుట్టువులు లేక రాగో దేనికీ నోచుకోలేదు. అయినా ఏ మాడియా స్త్రీ కూడ ఇంత ఆదరం పొందగా తానెన్నడూ చూడలేదు ఊహాలోకాల్లో తేలిపోతోంది రాగో.

పెళ్ళైన మాడియక్కల రూపాలు మనసులో మెదలుతున్నాయి. మైని గుర్తొచ్చింది. మొలకు చుట్టుకొని, మోకాళ్ళు దిగని మూరెడు తువ్వాలతో అత్తమామలు, మొగని మధ్య పడి ఉండే మైని కళ్ళల్లో మెదిలింది. తండ్రి తిట్టినా, కొట్టినా, మెచ్చుకున్నా, ప్రేమించినా అలా చాలీచాలని గుడ్డలతోనే రీతి రివాజుల చాటున జీవితమంతా ఈడుస్తూ కాపురం చేసే తల్లి గుర్తుకొచ్చి మనసంతా కలకబారింది. ఊళ్ళోని తేడోల ఆకారాలు గుర్తుకు రాసాగాయి. ‘చచ్చినా ఇక ఆ నరకంలోకి పోను’ అనుకుంటూ షర్టు కాలర్ జేబులు, నడుంకున్న బెల్టు పుణికి చూచుకుంటూ పరవశించిపోతున్న రాగో కమాండర్ పిలుపుతో ఉలిక్కిపడింది.

“తుపాకీ అక్కా” – రుషి.

“కిట్టు రెడి దాదా” అంటూ టుగె బెల్టులు సవరించిన కిట్టుతెచ్చి కమాండరు అందించాడు.

“ఇదిగో పోచ్. 25 తూటాలున్నయి” అంటూ ముక్తసరిగా చెప్పి ఉల్లై ఇచ్చాడు.

“తుపాకీ గుడ్డలక్కా, రోజు తుడుచుకోని తుపాకి శుభ్రంగా ఉంచుకోవాలి” అంటూ సీదో చేతిలో పెట్టిన గుడ్డలు చూస్తూ రాగో విస్తుపోయింది. అవి తను అప్పుడే విడిచిన చింకి చీరలోవే. అటు చూసేసరికి గిరిజ ఆ చీర నుండే కాస్తా పెద్ద పేగులు రెండు చింపి తన కిట్టులో పెట్టుకొంది. మరో రెండు తెచ్చి తనకిచ్చి.

“రాగో! ఇవి ఉండనీ! అక్కరొస్తయి” అంటూ పోచ్ తీసి నడుంకు చుట్టింది.

“అక్కా! ఇటురా. తుపాకి ఎలా కొట్టాలో చెప్పుతాను” అంటూ రుషి ముఖాంకు దూరంగా దారి తీశాడు.

“పద రాగో” అంటూ గిరిజ తోడొచ్చింది.

కమాండర్ స్టాండింగ్, సీలింగ్, లైయింగ్ పొజిషన్స్ మూడు చెప్పి తుపాకి ఎలా ఫైర్ చేయాలో చెప్పాడు. రాగో కమాండర్ చెప్పినట్టే ఫైర్ చేసింది. కానీ, ట్రిగ్గర్ గుంజుతునే, కళ్ళు మూసేయడంతో గురి తప్పింది. అయితే తూటా పేలింది.

“మొదటిసారి ఎవరికైనా ఇలాగే ఉంటుందక్కా” అంటూ రుషి ధైర్యం చెప్పాడు.

“అక్కా ఏం పేరు పెట్టుకుంటావ్” అంటూ మూర ఆత్రుతగా అడిగాడు.

“నువ్వు పేరు మార్చుకోలేదుగా మరి” అంటూ రుషి ఎదురు ప్రశ్న వేశాడు.

“మీరే మార్చలేదు దాదా-” మూర.

“నీకు ఆ పేరు బాగనే ఉంది కామ్రేడ్. అయినా నిన్ను ఇక్కడ ఎవరూ గుర్తుపట్టడం లేదుగా. అదే అసలు పేరు అన్నా ఎవరూ నమ్మరు” – రుషి పేరెందుకు మార్చుకుంటారో వివరించాడు.

“ఏం పేరు పెట్టుకుంటవు అక్కా?” అంటూ మిన్కో మళ్ళీ చర్చను ఇటు తిప్పింది.

“ఇదే బేషమంత” (ఇదే బాగుంది) – రాగో..

పేరు మార్చుకోవడమే మంచిదంటూ కారణాలతో సహా గిరిజ మరోసారి వివరించింది. అయితే మీరే చెప్పండని రాగో అనడమే తడవుగా “జైని” అని అరిచింది సీదో. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

తుపాకి, కిట్టు, డ్రెస్సు, టోపీతో ఠీవిగా నడుస్తున్న జైనికి దళం ఫార్మేషన్లో పదో స్థానం ఇచ్చారు. అంకెలు తెలియని జైనికి తికమక లేకుండా “టుగై వెనుక నడవాలక్కా” అని కమాండర్ అతన్ని చూపగా పేరు గుర్తుందో లేదోనని ‘బళ్లు దాదా’ అని ముద్రవేసి గుర్తు పెట్టుకుంది. ఆ దళంలో టుగెదె అందరికన్నా బక్కగున్నందున జైని ఆ పేరుతోనే గుర్తు పెట్టుకుంది.

పెట్టిన దళానికి లాలలాంలు మొదలైనయి. రాం, రాం అనేవాళ్ళు రాం రాం అంటుంటే లాల్ సలాంను ఎలా పలకగలిగే వాళ్ళు అలా పలుకుతున్నారు. ఆడ మగ భేదం లేకుండా ఆ ఊరి అన్నలు అక్కలొచ్చి దళం వారితో చేయి కలుపుతున్నారు. జైని మాత్రం స్పష్టంగా ‘లాల్ సలాం’ అనడం నేర్చుకుంది. ప్రేమగా చేయి కలుపుతుంది.

“బాయి పూనా నిమ్మె” (అక్కా నువ్వు కొత్తనా) అంటూ ఓ ముసలమ్మ జైనిని నిలబెట్టి పరామర్శించింది.

“ఇంగో, కొత్తనే” – జైని కదలబోయింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.