ఒక భార్గవి – కొన్ని రాగాలు -12

హంసానంది-ఒక అనుభూతి

-భార్గవి

హంసానంది ఒక రాగం కాదు,ఒక అనుభూతి,ఒక వేదన, ఒక విన్నపం, ఒక వేడికోలు ,ఒక నిర్వచించలేని భాషకందని భావన

చల్లని సాయం సమయంలో గాలిలో  తేలివచ్చే హంసానంది రాగాలాపన మనసుని వేరే లోకాలలోకి తీసుకువెళ్లి ఒక తియ్యని బాధకి గురి చేస్తుందనడంలో సందేహం లేదు .తీవ్రమైన ఉద్వేగాన్ని రేకెత్తించే రాగం. ఊరికే రాగం ఆలపిస్తే చాలు,ఈ రాగపు అలల కుచ్చిళ్ల పై సొక్కి సోలిపోతారెవరైనా.

అంతరాంతరాలలో సుడితిరిగే చిక్కని ఆలోచనల చీకటి వలయాలలోకి మనసుని  మోసుకు పోయే రాగం,ఈ రాగం యెప్పుడు విన్నా ఆ ఫీలింగ్ తట్టుకోలేక నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

ఇది 53 వ మేళకర్త అయిన గమనశ్రమ అనే రాగం నుండీ జన్యము.సాయం సమయాలలో పాడదగిన రాగంగా పరిగణిస్తారు ,పంచమం వర్జితము అంటే “ప” వుండదీరాగంలో ,ఇంకా ప్రతిమధ్యమ ప్రధానమైన రాగం అంటే ఇందులో వినపడే మధ్యమాన్ని ప్రతి మధ్యమం అంటారు.ఈ రాగానికి చెందిన ఆరోహణ అవరోహణల్లో ఆరు స్వరాలుంటాయి అందుకే షాడవ షాడవ రాగం అంటారు.

ఆరోహణ —సరిగ మదనిస

 అవరోహణ—-సనిద మగరిస

హిందుస్థానీ సంగీతంలో దీనికి సమానమైన రాగం  మార్వా థాట్ కి చెందిన రాగ్ “సోహినీ”

హంసానంది రాగంలో స్వాతితిరునాళ్ చేసిన “పాహి జగజ్జననీ” కీర్తన బాగా పేరొందినది.

పాపనాశం శివన్ ఈ రాగంలో”శ్రీనివాస తిరువేంకట ముడయాయ్ “అనే  కృతి చేశారు ,ఈ రెండింటిలో భక్తి,ఆర్తి కలగలిసి వుంటాయి.

పురందర దాస కీర్తన “ఈ పరియ సొబగు”చాలా సొగసుగా వుంటుంది.ఇంకా లలితా దాసర్ “పావనగురు పవనపురాధీశ మాశ్రయేత్ “చాలా చక్కని కీర్తన ,ఒక తమిళ సినిమాలో చిత్ర చాలాహాయిగా పాడారు.

“నీదు మహిమ పొగడ నా తరమా” అనే ముత్తయ్య భాగవతార్ థిల్లానా,”మీనాక్షీ జయదా వరదా”అనే బాలమురళీ కృతి కూడా వున్నదీ రాగంలోనే

హైద్రాబాద్ బ్రదర్స్ ఈ రాగంలో పాడిన “క్షణ మథునా నారాయణా” అన్న జయదేవ అష్టపది అద్భుతంగా వుంటుంది.

ఇక మంచి ఫీలింగ్ ని కలగ జేసే ఫిలిమ్ గీతాలు ఈ రాగంలో మరీ యెక్కువగా కాకపోయినా  వెతికితే బాగానే దొరుకుతాయి తమిళ ,తెలుగు సినిమాలలో.

తెలుగులోనూ ,తమిళం లోనూ, హిందీలోనూ ఒకే ట్యూన్ తో  పాట  చేస్తే ,అది ఆ మూడు భాషలలోనూ అత్యంత విజయవంతమవ్వడం,కాలానికి నిలిచి యెవర్ గ్రీన్ సూపర్ హిట్ గా మిగలడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా!

ఆ  అద్భుతాన్ని సాధించిన సంగీత దర్శకుడు మరెవరో కాదు మన తెలుగాయనే పి.ఆదినారాయణ రావు. తెలుగు,తమిళాల్లో యేక కాలంలో నటి అంజలీ దేవి,ఆదినారాయణరావులు నిర్మించిన సినిమా” సువర్ణ సుందరి”(తెలుగు),”మనాలనే మాంగియిన్ బాగ్యం” (తమిళ్ )తర్వాత కొన్నాళ్లకి మళ్లీ హిందీలో “సువర్ణ సుందరి” పేరుతో రీ మేక్ చేశారు.పాటలన్నింటికీ అవే ట్యూన్లు

తెలుగులో  “సువర్ణ సుందరి ” లోని—“హాయి హాయిగా ఆమని సాగె”  అనే పాట—-తెలుగు సినిమాలో జిక్కి ,ఘంటసాల పాడారు,తమిళ్ లో పి.సుశీల,ఘంటసాల పాడారు,అదే పాట హిందీలో మహ్మద్ రఫీ,లతా మంగేష్కర్ పాడారు.

—ఇది రాగ మాలిక ,పల్లవీ మొదటి చరణమూ “హంసానంది ” రాగంలో వుంటాయి మిగతా చరణాలు వేరే రాగాలలో వుంటాయి.హిందీలో తమిళ్ లో కూడా అదే వరుస క్రమం లో వుంటుందీ పాట

తమిళ్ లో “మనాలనే మాంగియిన్ బాగ్యం” అనే సినిమా లో “తీసులావుదే తేన్ మరలాలి”అని వస్తుంది,పి.సుశీల  ఘంటసాల పాడారని చెప్పుకున్నాం కదా ,ఘంటసాల తమిళ్ లో యెక్కువ పాటలు పాడలేదు.ఆయన  చాలా యేళ్లు అరవ దేశంలో వున్నా ఆ భాష పెద్దగా నేర్చుకోలేదు కూడా, కానీ ఈ పాట ఆయన పాడింది అరవం లో కూడా పెద్ద హిట్టు.ఇంకో విశేషం  యేమంటే తెలుగు తమిళాల్లో ఒకే సారి తయారయిన ఈ సినిమాకి తెలుగులో జిక్కి పాడితే,తమిళ్ లో పి.సుశీల పాడడం విచిత్రం,కారణమేమో తెలీదు.

ఇక హిందీలో “కుహూ కుహూ బోలే కోయలియా “అనే పాట రఫీ,లతా కాంబినేషన్లో సోహినీ రాగ స్వరాలతో అద్భుతంగా మొదలవుతుంది.

ఆదినారాయణ రావు తర్వాత ఈ రాగ స్వరాలని పరుగులు పెట్టించి మన మనసులని ఆకట్టుకున్న దర్శకులు చాలా మందే వుండొచ్చు కానీ ముఖ్యంగా చెప్పుకోవాలిసినవి రెండు పేర్లు ,అవి ఇళయ రాజా ,యంయం కీరవాణి.

ఇళయ రాజా తమిళంలోనూ తెలుగు లోనూ కూడా చాలా పాటలు ఈ రాగంలో చేశారు,అందులో ముఖ్యంగా”సాగర సంగమం “లోని “వేదం అణువణువున నాదం”అనే పాట అత్యుత్తమ మైనది,కేవలం ఆరాగంలోని స్వరాలను ఆలపిస్తూనే అలవోకగా  వేరే లోకాలకు తీసుకు పోతుందీ పాట,అంతే కాదు సినిమాకు క్లైమాక్స్ అయిన ఆ సన్ని వేశాన్ని పరిపుష్టం చేస్తుంది,వినే శ్రోతల అణువణువునా ఆనందం నింపుతుంది.ఈ పాటకు చెందిన ఘనతలో  గాయనీ గాయకులైన బాలుకీ,శైలజ కీ కూడా భాగముంది.

కమల హాసన్ సొంత సినిమా “అమావాస్య చంద్రుడు”లోని “సుందరమో సుమధురమో “అనే పాటంటే నాకు భలే పిచ్చి ,”ఆనందాలే రాగాలైతే” అనే చరణం పూర్తిగా హంసానంది లోనే వుంది ,మిగతా పాటలో అన్య రాగఛాయలుండి వుండవచ్చు  ,ఇది కూడా మాస్ట్రో ఇళయ రాజా చేసిందే ,అంత అందమైన పదబంధాలు గుచ్చింది మాత్రం వేటూరి.పాడిన వారు బాలూ,జానకీ అని వేరే చెప్పక్కరలేదుగా

అలాగే మణిరత్నం తెలుగులోకి డబ్ చేసిన “ఘర్షణ” సినిమా లో సాగే “నీవే అమర స్వరమే” అనే పాటకు కూడా హంసానంది ఆధారం కొంతవరకూ అనిపిస్తుంది.

దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి హంసానంది రాగమంటే ఇష్టమట ,ఆయన సినిమాల్లో తప్పకుండా ఒకటో రెండో ఆ రాగానికి సంబంధించిన పాటలు వినిపిస్తాయి,కీరవాణి గారి నిర్దేశకత్వంలో అవి మరింత మధురంగా అనిపిస్తాయి.

అలాంటి వే “ముద్దిమ్మంది ఓ చామంతి”—-అల్లరి మొగుడు.

“అందమా నీ పేరేమిటి అందమా”—-అల్లరి ప్రియుడు

“కిలకిలకిల పడుచుకోకిల”—-పెళ్లి సందడి

 ఇంకో  పాట “అన్నమయ్య” లో “తెలుగు పదానికి జన్మదినం” అంటూ సాగే అన్నమయ్య జననం పాట హృదయాన్ని ఆనంద డోలికల్లో తేలుస్తుంది,నిజానికిది రాగమాలిక అయితేనేం హంసానందిని ఉపయోగించుకున్న తీరు మెచ్చదగినది.

నటుడు రాజశేఖర్ నటించిన సినిమా “రాజసింహం” ,ఇందులో కూడా రాఘవేంద్ర రావు గారు తన అభిరుచి ప్రకారం “దాయి దాయి దాక్షాయణి” అనే పాట సంగీత దర్శకులు రాజ్ -కోటి  చేత ట్యూన్ కట్టించు కోవడం విశేషం.

దర్శకుడు వంశీ కి కూడా తన సినిమాల్లో   ఈ రాగాన్ని అక్కడక్కడా ఇళయ రాజా ద్వారా వినిపింప జేయడమే కాదు “అనుమానాస్పదం” అనే సినిమాలో కథానాయకికి హంసానందిని అని పేరు  కూడా పెట్టారు.

“మల్లెల్లో ఇల్లేసెయ్ చందమామ”—-హరిహరన్ ,సాధనా సర్గమ్ –“అనుమానాస్పదం” —-ఇళయ రాజా

“ఏదో మౌనరాగం”—-నినుచూడక నేనుండలేను(తెలుగు సినిమా)–ఇళయరాజా —రచన –కులశేఖర్ -డైరెక్టర్ ఆర్ .శ్రీనివాస్ 

ఇంకా యెన్నో పాటలు ఇళయరాజా తమిళ్ లో చేసినవి వున్నాయి.

హిందీ లో ఈ రాగానికి దగ్గరగా వుండే రాగం సోహిని అని చెప్పుకున్నాం కదా మచ్చుకి సోహినీ లో ఒక పాట —బడే గులామ్ ఆలీఖాన్ సినిమాలో పాడటం అరుదైన విషయం,ఆ విషయాన్ని సాధించింది  సంగీత దర్శకుడు నౌషాద్ ,చిత్రం “మొఘలే ఆజం” .”ప్రేమ జోగన్ బన్ కే”  అనే ఈ పాట వింటుంటే మనసు మధువుతో నిండిన పద్మం చుట్టూ తిరిగే తుమ్మెద రీతి అవుతుంది.

అదీ సంగతి ఈ పాటికి హంసానంది రాగంలో తేలి హంస ల్లాగా మీరందరూ ఆనందాన్ని గ్రోలి వుంటారని  భావిస్తూ……


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.