సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం

అత్యాధునిక తెలుగు సాహిత్యంవస్తు, రూప పరిణామం (2000-2020)

నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం

-రాఘవేందర్ రెడ్డి బెంకి

 1. పరిచయం:

మానవ సమాజం ఆదిమానవుని దగ్గర మొదలుకొని నేటి ఆధునిక, అత్యాధునిక యుగం వరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ పరిణామంలో ఎన్నో మార్పులను చూస్తూ వస్తుంది. ఆ మార్పులలో చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవి. వాటన్నింటినీ సాహిత్యం రికార్డు చేస్తూ, విశ్లేషిస్తూ, వర్ణిస్తూ వస్తోంది. ఈ కొనసాగింపులో సాహిత్యం సమాజంలో వస్తున్న భిన్నమైన విశేషాలను స్పృశిస్తూ వస్తువులో, రూపంలోనూ మార్పును సంతరించుకొని వివిధ ప్రక్రియల ద్వారా వెలువరిస్తుంది. ఈ సందర్భంలో మనం అటువంటి సాహిత్య ప్రక్రియల్లో వస్తున్న వస్తువు, రూపాల్లో వస్తున్న మార్పును విశ్లేషించుకొని అంచనా వేయాలి. అప్పుడే సమాజానికి అవసరమైన సాహితీ విశేషాలను అందించినవారమవుతాం. ఆ క్రమంలో ‘అత్యాధునిక తెలుగు సాహిత్యం- వస్తు, రూప పరిణామం (2000-2020)’ అనే అంశపై అంతర్జాతీయ వెబినార్ నిర్వహించడం చాలా సంతోషం. ఈ వెబినార్‌ను తెలుగు అధ్యయన శాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, యూఎస్‌ఏ వారు సంయుక్తంగా నిర్వ్వహిస్తున్నందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. పాట కవిత్వంలో భాగంగానే కనిపిస్తుంది. పాటలో కవిత్వం ఉంటుంది. కవిత్వాన్ని రాగయుక్తంగా మలిస్తే గేయరూపం సంతరించుకుంటుంది. ఈ వెబినార్‌లో కనుక కవిత్వం ఈ వెబినార్‌లో కవిత్వం అనే ఉపవిభాగంలో భాగంగా నేను ‘సుద్దాల అశోక్ తేజ పాటలు-వస్తు, రూప పరిణామం’ అనే అంశంపై పరిశోధన పత్రం రాసాను.

పాట మనిషితోపాటు పుట్టింది. పాట గురించి అధ్యయనం చేయడమంటే మనిషి సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేయడమే. మానవ సమాజంలో మొదట మౌఖిక సాహిత్యం పాట రూపంలోనే వెలువడింది. సాహిత్యానికి పాటే మూలమైంది. ఏ సమాజపు సాహిత్యాన్ని తీసుకున్నా అందులో సమకాలీన సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. పాట ప్రక్రియలో అధికంగా కన్పిస్తుంది. మాటకు గాన యోగ్యతను కల్గించి మానవ జీవితాన్ని మరింత అర్థవంతం చేయగలిగింది మొదట పాట మాత్రమే. ఇలాంటి పాట ఎప్పుడు, ఎక్కడ పుట్టింది? అనే ప్రశ్నలకు సమాధానం జానపద శాస్త్రవేత్తలు మొదలు పెట్టారు. “పనిలో నుండి పాట పుట్టిందని కొందరి వాదన. మరికొందరు మరోవిధమైన వాదనలు వినిపిస్తుంటారు. పనితోటి సంబంధమున్న శ్రామిక వర్గాలదే పాట అవుతుంది. పాట నిరంతరం ప్రవహించే ఒక నదిలాంటిది. ఆదిమకాలం నుండి మానవ నాగరికత ఆవిష్కరణ వరకు పాట మనిషిని వెంటాడుతూనే ఉంది. పుట్టిన వెంటనే పాట, అమ్మ ఒడిలో పాట, బడిలో పాట, జీవనయానంలో పాట. ఇలా పాట చితిమంటల వరకూ మనిషి వెన్నంటే ఉంది. సంపద ఉత్పాదనలో పాట ముఖ్యమైంది. శ్రమజీవులు శ్రమను మరచిపోవడానికి, వారి ఊపిరిలోనుండి పాట పుట్టింది.” (గూడ అంజయ్య-ముందుమాట. రాములు, బి.ఎస్. 2011: 8). దీన్ని బట్టి చూస్తే మానవ సమాజానికి భాష పుట్టినప్పటినుండి కూనిరాగాలు మొదలై పాటగా పరిణామం చెందిందని చెప్పవచ్చు. 

“టప టప టప టప చెమటబొట్లు తాళాలై పదుతుంటే

కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే

పాట పనితోపాటే పుట్టింది

పనీ పాటతోటే జతకట్టింది…” (అశోక్‌తేజ, సుద్దాల. 2013: 6)

పై పాట ద్వారా పాట పనితోటే పుట్టిందని తెలుస్తుంది. కష్టజీవి శ్రమ చేసే సమయంలో రాలిన చెమటచుక్కలే తాళాలుగా మారినపుడు, అతని కండరాల నరాలే స్వరాలు మీటుతుంటే పాట పుట్టిందని అత్యంత కవితాత్మకంగా వివరించాడు రచయిత.

“ఆదిమ కాలం నందు ఆ నది తీరాలందు

గూడులు నిర్మించి జనులు గుంపు గూడి బ్రతుకునపుడు

ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలో

అలమట చెందే ఊపిరి హా హా హా

అలసటయే మొదటి పాట” (అశోక్‌తేజ, సుద్దాల. 2013: 6)

ఆదిమానవుని ఆకలి మంటల్లో ఉప్పొంగి ఎగసిన ఊపిరివల్ల కలిగిన అలసట నుండి పాట పుట్టిందని చెప్పడం, పాట పుట్టిన విధానాన్ని వివరంగా చెప్పాడు రచయిత. తన ఆకలి పోరాటంలో భాగంగానే శ్రమ చేసేవాడు. ఆ శ్రమతోటే పాట పుట్టిందని శాస్త్రీయంగా వివరించాడు రచయిత.

 1. రచయిత పరిచయం:

సుద్దాల అశోక్ తేజగారు 1960, మే 16న నల్గొండ (ఉమ్మడి) జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రజాకవి. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వీరి ఇంటిపేరు సుద్దాల కాబట్టి ఈయనను అందరు సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. అదే ఇంటిపేరు అందరికీ వస్తూ ఉంది. అశోక్ తేజగారి నాన్న ప్రజాకవి, ఉద్యమకారుడు కాబట్టి, అదేవిధంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు కావడంవల్ల అశోక్‌గారు చిన్నప్పటి నుండే పాటలు రాయడం నేర్చుకున్నాడు. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు కావడంవల్ల కూడా తెలుగు సాహిత్యాభిమానం మెండుగా ఉండేది. అశోక్‌గారు ప్రముఖ సినీగేయ రచయిత. ఇప్పటివరకు దాదాపుగా 2 వేలకు పైగా పాటలు రాసారు. అశోక్ గారికి ఠాగూర్ చిత్రంలోని “నేను సైతం” అనే పాటకు జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు వచ్చింది. ఇలా ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. పత్ర పరిమితి దృష్ట్యా ప్రస్తుతం ఆయన అనేక పాటలు రాసినా, మూడు పుస్తకాలను పుస్తకాలను ప్రచురించారు. అవి 2000 సంవత్సరం తర్వాతనే ప్రచురించబడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ పరిశోధన పత్రాన్ని రాస్తున్నాను. ఈయన రచనలపై “సుద్దాల అశోక్ తేజ సాహిత్యం: సమగ్ర పరిశీలన” అనే అంశంతో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన కొనసాగిస్తున్నాను.

 1. ప్రకృతి:

ప్రకృతి మానవ జీవనానికి ఏ విధంగా దోహదపడుతుందో ‘అడివమ్మ’ అనే పాట ద్వారా చక్కగా వివరించారు రచయిత. ప్రకృతికి-మానవునికి సంబంధాన్ని ఈ పాటలో చూడవచ్చు.

“అడివమ్మ మా అమ్మ

అతి పేదదిరా

ఆ అమ్మకున్నది ఒకటే చీర“అడివమ్మ”

ఆ చీర రంగేమో ఆకుపచ్చనిది

ఆ తల్లి మనసేమో రామసక్కనిది. “అడివమ్మ”

భుజముల మీదేమో రాళ్ళగుట్టలు కొన్ని

పాదముల పక్కనే పాము పుట్టలు కొన్ని

అడిగడుగున ముళ్ళకంప

అయినా అడివంటేనే పళ్ళగంప

పల్లెగుండెలు నింపె వాన చుక్కడవి

ప్రాణాలు కాపాడే పసరు మొక్కడివి

ఆకలైతే చెట్టు అమ్మవుతది

అయుధాలడిగితె జమ్మిచెట్టవుతది”

(అశోక్ తేజ, సుద్దాల. 2013: 18)

అడవి ఆకుపచ్చగానే ఉంటుందని చెప్తూ, ఆమెకు ఒకటే చీర, ఆమె మనసు రామచక్కనిదని స్తుతించాడు రచయిత. రాళ్ళగుట్టలు, పాము పుట్టలు, అడుగడుగున ముళ్ళకంపను భరిస్తూనే మనకు పళ్ళను అందిస్తుంది. అదేవిధంగా వాన పడటానికి, ప్రాణాలు కాపాడటానికి పసరు మెక్కలను, ఆకలైతే పళ్ళను అందిస్తుంది అడవి. అడవి వలన ఉపయోగాలను జానపద గేయంద్వారా భవిష్యత్తు తరాలకు తెలియజేస్తున్నాడు రచయిత. అదేవిధంగా రూపపరంగా సుద్దాలగారి శైలి కూడా జానపదులకు సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఆకుపచ్చనిది- రామసక్కనిది, రాళ్ళ గుట్టలు-పాము పుట్టలు, పళ్ళగంప-ముళ్ళకంప, అమ్మవుతది-చెట్టవుతది అని మొదలైన ప్రాసలు వాడి పాటను రక్తి కట్టించాడు.

 1. ప్రకితి-నేల-రైతు: అనుబంధాలు:

రైతుకే కాదు, సమస్త ప్రజానికానికి భూమి కల్పతరువు, జీవనాధారం. భూమి లేకుండా మానవ జాతే లేదు. అటువంటి భూమిని రైతు ఏ విధంగా హత్తుకుని, తన అవసరాలు తీర్చుకుని, తను క్షీనిస్తూ, సమస్త మానవాళికి బుక్కెడు బువ్వ (అన్నం) పెట్టే దైవ సంభూతుడు రైతు. అటువంటి రైతు సంబంధిత పాటలు కొన్ని చూద్దాం.

“నేలమ్మ నేలమ్మ నేలమ్మా – నీకు

వేల వేల వందనాలమ్మా

సాలేటి వానకె తుళ్ళింత – ఇంక

సాలు సాలుకు నువ్వు బాలెంత

గాలినే వుయ్యాలగా

నీళ్ళనే చనుబాలుగా

పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల – నువు

సక్కంగ మోసేవు మొక్కల్ల” 

“మాతల్లి నీ మట్టి బంగారం – అది

మానవాళి నుదుట సిందూరం

అమ్మా నీ అనురాగము

కమ్మనీ సమభావము

గొప్పలు తప్పులు చూడక – నువు

ఎప్పుడు మమ్మెడబాయక

జన్మించినా రారాజులై

పేరొందినా నిరుపేదలై

నీ ఒంటిపై సుతుల చితులు కాల్చుకున్న

నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు”

(అశోక్‌తేజ, సుద్దాల. 2013: 1)

          సుద్దాలగారు వస్తువు ఎన్నుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. వీరు సినీ గేయ రంగప్రవేశం చేయక మునుపు బాల్యంలో తండ్రి హన్మంతుగారిని చూస్తూ పెరిగాడు. తర్వాత ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూ, రైతులతో, ప్రకృతితో సహవాసం చేస్తుండేవాడు. కనుక ఆయన ఎన్నుకునే వస్తువు అలానే ఉంటుంది. అందుకే నేలతల్లి-రైతుకు ఉన్న సంబంధాన్ని పాట ద్వారా అద్భుతంగా చిత్రించారు. నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా అంటూ సరిపోయేంత వానకు నీవు సంతోషిస్తావు, సాలుకు సాలుకు నీవు బాలెంత అంటే వాన పడగానే భూమిని దున్నినపుడు పచ్చిపచ్చిగా నొప్పిగా బాలెంత ఎంతటి నొప్పితో ఉంటుందో అదే విధంగా భూమి ఉంటుందని చెప్పాడు. గొప్పవారైనా, పేదవారైనా నీ మీద ఉంటారు. నీవంటి తల్లి ఎక్కడా లేదు, దేవుల్లకు సైతం లేదని చెప్తూ భవిష్యత్తు తరాలకు గుర్తుచేస్తున్నాడు. ఆయన శైలి వినసొంపుగా ప్రాసలతో అర్థాలు చెడకుండా చాలా చక్కగా వర్ణిస్తాడు. గుండెలకు హత్తుకునేలా ఉంటుంది ఆయన పాట రూపం.

సుద్దాలగారి మరో పాటను చూసినట్టైతే రైతు ఆకుపచ్చని చందమామతో పోల్చుతూ చాలా చక్కగా, అద్భుతంగా రాసారు.

“ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే! 

నీకు మచ్చ లేడ లేనే లేవులే లేవులే!

మిన్నునున్న మామయ్య చేతిలో

మహిమ ఏమున్నది! 

మన్నుల నుండి అన్నం తీసే

మహిమ నీకున్నది

మింటి చుక్కలల్లో వాడు

చెమట చుక్కలల్లో నువు

వానకాలమొస్తె మబ్బుకప్పుకొని

మరుగాయె జాబిల్లి నవ్వు

వానల్లో వరదల్లో బురద చిల్లి ఉన్న

మసక జాబిల్లి నువ్వు

మేఘాల సొగసు వాడు!

మాగాణి తేజస్సు నువ్వు!” (అశోక్ తేజ, సుద్దాల. 2013:3)

ఆకుపచ్చని పంట పండించే ఓ రైతు నేస్తం, ఆకాశంలో ఉన్న చందమామలో మహిమ ఏమీ లేదు. మట్టినుండి అన్నం తీసే నేర్పు (మహిమ) నీకున్నది. ఆకాశంలోని చుక్కలలో చందమామ, చెమట చుక్కలలో నీవు అని చెప్తున్నాడు రచయిత. వానకాలమొస్తె, కనిపించడకుండా పోతాడు చందమామ, మరి నీవు వాన బురద చిల్లిన మసక జాబిల్లివి. మేఘాల సొగస్సు చందమామ, మాగాణి (భూమి) తేజస్సు నీవు అని చెప్తున్నాడు. నింగి వెన్నపూస చందమామ, నేల వెన్నుపూస నీవు అంటూ రైతు గొప్పతనాన్ని, కష్టపడే విధానాన్ని చెప్తూ భావితరాలకు రైతును స్పూర్తిగా నిలుపుతున్నాడు రచయిత. ఈ పాట రూపం మనం రైతును చూసినప్పుడల్లా కళ్లకు కట్టినట్టు కన్పిస్తుంది.

ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వృత్తులు ఎలా కుదేలయి జనాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాలో ‘రాయి-సలాక’ పాటలో వివరించారు రచయిత. ముఖ్యంగా ఉప్పరివారి గురించి ఇందులో చెప్పబడింది.

“రాయి-సలాక

ఇసుక-ఇటుక

సిమెంటు-చెమట

గోడమీద గోడ-మేడమీద మేడ

కట్టిపోర కూలోడా పట్టణాలలో మేడ

కాళ్ళు జాగర్త-వేళ్ళు జాగర్త

నడుం-జాగర్త

పగలంత బంగులాల

రాతిరంత గుడిసెల్ల

చలిబువ్వ కారమురో

చాలకుంటె నీళ్ళున్నయిరో

అమ్మికరాదు అనియేడ్చి

యిపాల్లేని నానమ్మ

రొమ్ములు గుడిసే చంటోళ్ళు” 

(అశోక్‌తేజ, సుద్దాల. 2013: 8)

          ఉప్పరి మేస్త్రీలు రాళ్ళు, సలాక, ఇసుక, ఇటుక, తాపీ, తట్ట, సిమెంటు-చెమట మొదలైన వాటితో ఎన్నో అంతస్తుల మేడలను కడుతుంటారు. కానీ పేరుకు పగలంతా బంగులాల్లో పనిచేసినా, రాత్రి ఏ పూరిగుడెసెలోనో ఉండాలె తప్ప వారికి మంచి ఇళ్ళు ఉండవు. చలిఅన్నం, కారంతో పూట గడపాలి. అదీ లేకుంటే నీళ్ళు తాగి కడుపు నింపుకోవాలి. చంటిపిల్లలకు పాలివ్వడానికి తల్లులు ఇంటికి రాలేని పరిస్థితి. అపుడు ఆ చంటిపిల్లలు నాయినమ్మ స్థన్యాలకు ఎగబడి కుతి తీర్చుకుంటారని ఎంత హృద్యంగా చెప్పాడు రచయిత. ఈ విధంగా ఈ పాటలో జానపద గేయం ద్వారా వలస బతుకులు ఎలా ఉంటాయో భావితరాలకు తెలుస్తుంది.

 1. స్త్రీవాద పాటలు:

స్త్రీల బాధలను గురించి సుద్దాలగారు పాటల రూపంలో వివరించారు. “స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులూ, దంపతులూ కావాలంటే ఇద్దరికి సంపూర్ణమైన స్వేచ్ఛ వుండాలి. ప్రేమ బంధమే కానీ అధికార బంధం వుండకూడదు.” (చలం. స్త్రీ. 1993: 103)

‘ఆలు నీకు దండమే’ పాటను సుద్దాలగారు ‘దళం’ సినిమాకు రాసారు. భార్య కష్టాలు పడి తన కుటుంబాన్ని ఎలా నడుపుతుందో తెలిపేదే ఈ పాట.

“తల్లిదండ్రుల నొదిలిసి అన్నదమ్ముల విడిచిపెట్టి

తాళికట్టినవాని చిటికెన వేలుతోనె నడచివచ్చి

అత్తమామకు ఆడపడుచుకు అందరికి నువ్వు వండిపెట్టి

గిన్నెలున్నది పూడ్చివేసి ఉన్నదే తిన్నట్టుచేసి

నిండని నీ కడుపు సగము నీళ్ళతోనె నింపుతావు” (అశోక్, సుద్దాల. 2012: 141)

ఆడవారికి ఈ అనుభవాలు నిత్యం ఉండేవే. బాల్యంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లతో గడిపి, యవ్వనంలో ఏమాత్రం పరిచయం లేని కొత్త కుటుంబమైన అత్తగారింట్లో అడుగుపెట్టి సేవలు చేస్తూ, బతుకుయానం చేస్తుంది. తెల్లవారుజామున లేచి నడుము విరిగేదాక ఇంటిపనులు చేసి, బిడ్డలను బడికి పంపి, పగలంతా పొలం పనులు చేసి, రాత్రి పక్కలో భర్తకు సుఖాన్నిస్తుంది. అత్తమామ, ఆడపడుచులకు నీవు వండిపెట్టి అంతా వూడ్చిపెట్టి, మిగిలింది ఉంటే తిన్నట్టుచేసి, సగము నీళ్ళుతాగే కడుపు నింపుకుంటావు. ఇంట్లో ఏ వంట సరిగ్గా లేకపోయినా ఆడవాళ్ళనే అంటారు. ఐనా అన్నింటికి ఓర్చుకొని ముందుకు సాగుతూ కష్టాల కడలిలో ఊయలలూగుతుంటారు. అటువంటి ఆడవాళ్ళ సేవలను గుర్తించి గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెబుతున్నాడు రచయిత. ఏ జాముకో నిద్రపోయి చుక్కపొద్దుకే లేచే ఆడవాళ్ళకు దండం పెట్టాల్సిందే, అర్ధాంగికి దండం పెట్టాల్సిందే.

రాములమ్మ పాటలో స్త్రీవాదంతోపాటు, దొరల అరాచకాలు కూడా కన్పిస్తాయి. భూస్వాములు అహంకారంతో ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకొని, అందులో ముఖ్యంగా స్త్రీలను చెరిచిన విధానం ఈ పాట మనకు కళ్ళకు కడుతుంది. ఈ పాట తండ్రి కూతురు మధ్య జరిగే సంభాషణగా సాగుతుంది. బిడ్డకు జన్మనిచ్చే తల్లి పురిటి బాధను తనే అనుభవించినట్టుగా భావించి సృజించిన ఈ పాట తెలుగు నాట ప్రతి చోట ఉనికిని చాటింది. ఒక సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాట ఇది. తనకు ఏమి జరుగుతుందో కూడా తెలియని ఒక బాలిక ఆక్రందన ఇది. దొరల గడీల్లో జరిగే అత్యాచారాలకు బలైన అమాయక పిల్లను ఊరడించే పాట ఇది. ఆదరించిన వారు మంచివారు అనుకొంది కానీ కాటు వేసేదాకా తెలుసుకోలేకపోయింది. హృదయ విదారకంగా అనిపిస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఒంటరిగా ఊరికి దూరంగా చీకట్లో దీనంగా కూర్చుటుంది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా కోసం సందర్భసహితంగా ఈ పాట సుద్దాల అశోక్‌గారు తండ్రి కూతురును వెతుకుతూ వచ్చి చీకట్లో ఆమెను వెతికి ప్రశ్నిస్తే, జవాబులు చెప్పిన తీరుతో మన కండ్లు దుఃఖంతో నీటి ధారలు కడతాయి.

“రామచక్కని తల్లి రాములమ్మో రాములమ్మో

రాయోలె కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మో

తాచుపాములు కరిచె ఇటువంటి తావుల్ల

దయ్యాలు భూతాలు తిరిగేటి ఘడియల్ల

ఎండిన చెట్టుకు రాలిన ఆకోలె

ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మో

వెక్కెక్కి ఏడ్చేవు ఎందుకమ్మో ఎందుకమ్మో (అశోక్, సుద్దాల. 2013:40)

తండ్రి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇలా చెబుతుంది. ఏమని చెప్పను నాబాధను నానోటితో, ఏమని చెప్పను నాగోడును, దయ్యాలు ముట్టిన ఫలమైనను, కన్నతల్లికి బరువైనాను, నలుగురిలో మీకు చెడ్డపేరు తెచిన ఆడపోరిగా వున్నాను. అందుకని నాముఖం మీకు చూపలేకపోతున్నానని ఈ అడవిలో కలిసిపోతానని బాధతో అంటుంది. ఈ పాట రూప పరంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కటి పదాలను ఏరుకొని కుప్పపోసినట్లుగా అలవోకగా సాగేటట్టు సుద్దాలగారు పాటను రచించారు.

నేటి సమాజంలో అనగా అత్యాధునిక యుగం అని చెప్పుకుంటున్న ఈ 21వ శతాబ్దంలో కూడా స్త్రీలను అత్యాచారాలు, మానభంగాలు చేసి మగమృగాలు ఎలా హింసిస్తున్నారో ఈ ‘నిర్భయ పాట ద్వారా మనం చూడవచ్చు. చక్కటి సమకాలీన వస్తువును తీసుకొని ఎలా సుద్దాలగారు రాశారో మనం చూడవచ్చు.

“సిగ్గుపడాలి

పాలకులు సిగ్గుపడాలి

ప్రభుత్వాలు సిగ్గుపడాలి

వనితలంటె పురుష కామకేంద్రాలుగా భావించే

స్త్రీలంటే మన కోర్కెలు తీర్చే బొమ్మలుగా తలనెంచె

విద్యార్థులు ఉద్యోగులు

ఎమ్‌ఎల్‌ఏలు ఎమ్ పిలు

పార్లమెంటు సిగ్గుపడాలి

అసెంబ్లీలు సిగ్గుపడాలి

జరిగే వస్త్రహరణం ద్రౌపదికి నాటి హస్తినలో

జరిగె శీల హననం నిర్భయకు నేతి హస్తినలో

నాటి ఘోరకలి

భీష్ముడు ద్రోణుడు కర్ణుడు విదురుడు

ఆ పాండవ పతులున్న కౌరవ సభ మధ్యన

నేటి ఘోరబలి”(అశోక్‌తేజ, సుద్దాల. 2017: 58)

          మానవ సమాజంలో నైతిక విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి అని చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. మనకు జన్మనిచ్చిన స్త్రీ సమాజం పట్ల మనం ఎలా గౌరవంగా ఉండాలో నేర్చుకోవాలి. లేకపోతే ఈ పాటలో వ్యక్తం అయిన నిజ సంఘటనలు మరెన్నో జరిగుతాయి. జరిగాయి కూడా. అందుకే మనకి మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలు అత్యాధునిక సమాజంలో కూడా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారు. 2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కాండను గురించి సుద్దాలగారు ఈ పాటలో పొందుపర్చారు. సమాజం సిగ్గుపడాలి సమస్త మానవాళి సిగ్గుపడాలి అంటున్నారు రచయిత. నాటి హస్తినలో ద్రౌపదికి వస్త్రపహరణం జరిగితే నేతి హస్తినలో నిర్భయ దమనకాండ జరిగిందని, అమ్మగా పవిత్రంగా భావించే స్త్రీమూర్తిపై ఇలాంటి ధారుణాలు జరగడం మన నైతిక విలువల పతనానికి కారణమంటున్నారు రచయిత. నాటి ద్రౌపది, నేటి నిర్భయతో పోలుస్తూ ఎంతో హృద్యంగా చిత్రించారు సుద్దాలగారు.  

 1. ఉమ్యమ పాటలు:

తూటా చేయలేని పని ఒక మాట చేస్తుంది. మాట చేయలేని పని ఒక గేయం చేస్తుంది. పాట వేలాదిమందిని కదిలిస్తుంది. ఉద్యమాలను నాయకులు నడిపిస్తారు. నాయకులను రాజ్యం బంధిస్తే ప్రజలు రాజ్యానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తారు. ఠాగూర్ సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఠాగూర్‌ను  పోలీసులు అరెస్టు చేస్తారు. ఆగ్రహంతో ప్రజల హృదయాలు రగిలిపోయాయి. ఆ జ్వాలలు పాటలో వ్యక్తం కావాలని సన్నివేశాన్ని వివరించి, మహాకవి శ్రీశ్రీ రచించిన ‘నేను సైతం’ పల్లవితో గేయం వుండాలని కథానాయకుడైన మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక. కవిగా తన సత్తా చాటుకునే అవకాశం వచ్చింది అశోక్‌తేజకు. శ్రీశ్రీ వీరాభిమాని అయిన సుద్దాలగారు ఆ పాటను అలవోకగా రాసి , ‘జాతీయ స్థాయి ఉత్తమ గేయ రచయిత అవార్డు’ను సొంతం చేసుకొని తెలంగాణ తేజంగా సినీగేయ సాహిత్యంలో జయకేతనం ఎగురవేశారు అశోక్‌తేజగారు.

“నేను సైతం ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వవృష్టికి

అశ్రువొక్కటి ధారవోశాను

నేను సైతం భువనఘోషకు

వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను” (అశోక్‌తేజ, సుద్దాల. 2012: 148)

నేను సైతం అంటూ పాటను మొదలుపెట్టిన సుద్దాలగారు కఠిన పదాలు వాడారు. ఆ కఠిన పదాల గురించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషన్ డాక్టర్ సి. నారాయణరెడ్డిగారు మాట్లాడుతూ “ముందు కవిత్వం రాసి ఆ తర్వాతే సినీ గీతాలు రాసిన దేవులపల్లి, శ్రీ శ్రీ, ఆరుద్ర, దాశరథి నాలాంటి వాళ్ళ ఒరవడిలో సుద్దాల అశోక్‌తేజ ముందుగా కవి ఆ తర్వాత సినీ గేయ రచయిత. శ్రీశ్రీ కవితను తీసుకోవడం ఒక గండం ఆ గండం నుండి ఈ ఉద్దండ పిండం” (రవీందర్, గోపగాని. 2012: 111) అన్నారు నేను సైతం పాట గూర్చి.

“అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా

లంచగొండుల నిదురించు సింహం నీవురా

ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా

కనులు కప్పిన న్యాయదేవత కంటిచూపై నావురా

సత్యమేవ జయతికి నిలువెత్తు సాక్ష్యం నువ్వురా

లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా” (అశోక్‌తేజ, సుద్దాల. 2013: 56)

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకున్ని ఉత్తేజపరుస్తూ ప్రజలు పాడుకునే ఈ గేయం విశిష్టమైంది. మంచి ఆదరణ పొందిన పాట ఇది. నేటి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఊపునిస్తున్న గేయమిది. శ్రీశ్రీ ‘జయభేరి కవిత యొక్క పంక్తులు వాడుకొని, సమర్థవంతంగా ఆయన కవితా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

మరో ఉద్యమ స్పూర్తి పాటను గమనిస్తే రాములమ్మ పాట కనిపిస్తుంది. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అస్తిత్వ పోరాటాలకు దర్పణం రాములమ్మ పాట. రాజ్యహింసకు బలైన వీరవనిత రాములమ్మ. ప్రజాపోరాటాలను ముందుండి నడిపిస్తున్న నాయకురాలు రాములమ్మ. కల్పిత కథలకు వాస్తవాలను జోడించి సామాజిక సమస్యల మీద నిర్మించిన చిత్రాలు విజయవంతం అవుతాయి. దొరల పెత్తనాన్ని ఎదురించిన ఒక వీరురాలి పోరాట కథ ‘ఒసేయ్ రాములమ్మా’ సినిమా. ఈ సినిమాను ప్రజల వారి వారికి ఆత్మీయ బంధువుగా ఊహించుకొని ఆహ్వానించారు.

శ్రీశ్రీ ‘మరోప్రస్థానం’లో రాసిన వాక్యాలతో ఈ గేయం మొదలవుతుంది. రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకులను స్మరిస్తూ సాగుతుంది. ఆ వాక్యాలను నేపథ్యంగా తీసుకొని రాములమ్మ పాట సాగుతుంది.

“తెల్లవాడునిన్నునాడుభగత్సింగుఅన్నాడు

నల్లవాడునిన్నునేడునక్సలైటువన్నాడు

ఎల్లవారురేపుమనవేగుచుక్కలంటారు

రాములమ్మఓరాములమ్మ

ఓహోరాముమ్మా

గుండెనెత్తురుపోరుబాటలో

కంటనీరులేనింపకమ్మా” (అశోక్, సుద్దాల. 2013: 42)

ప్రజాస్వామిక ఉద్యమాల చైతన్యాన్ని పోరు గేయాల్లో రాయాలనుకున్నప్పుడు పాటించే కొన్ని మెలకువలను ప్రాణహిత ఇంటర్వూలో ఇలా చెబుతూ ఈ గేయాన్ని గూర్చి కూడా ఇలా చెప్పారు. “సినిమాల్లో అంతకు ముందు ఉద్రేకభరితమైన పాటల్ని రాసేవారు. ఆ ఉద్రేకం సృష్టించడానికి సంస్కృత సమాసాలు వేసేవారు. ఉదాహరణకు మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జన రణ హుంకారం ప్రళయ కాల దిగ్గజ ఘీంకారం”(ప్రాణహిత ఇంటర్వూ-2) అని అంటూ రాసారు. సుద్దాల గారు రాములమ్మ సినిమా డైరెక్టర్‌కి శ్రీశీ లాగా కాకుండసులభమైన పదాలతో పాట రాస్తానని చెప్పాడు.

 1. దళితులు-రాజ్యాధికారం:

అనగారిన వర్గాలు మొదలైనవారికోసం రిజర్వేషన్‌లు సాధించి పెట్టిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిపెట్టి మనగుండెల్లో పదిలంగా నిలిచారు. వారి ఆశయమొక్కటే అణగారిన వర్గాలవారు రాజ్యాధికారం చేపడితేనే మనుగడ సాధ్యమవుతుందని చెప్పిన అంబేద్కర్ గురించి పాట రాశారు సుద్దాల గారు.

“ధగద్ధగన్మేధోజ్వల

జ్వాల శిఖాచ్ఛటాగ్ని రూపొందె మానవాకృతీ

అంబేద్కర్

భరత్ స్ఫురత్ జగత్తులో

అధో జగత్‌క్షుధార్తులై తపించు జాతి జాగృతీ

అంబేద్కర్

మహా మహి మహోన్నత సమున్నతోన్నతోన్నత మనీష శిఖర

శిబిర జనిత శీతల వాచస్పతీ చదువూ పోరాడూ

భారత ఖండాన అగ్రవర్ణఖడ్గ ఖండితులై

ప్రతి ఊరికి దూరాన వున్న శిథిల

జీవచ్ఛవాల పాలి నీవఖండజ్యోతి

శరణం గచ్ఛామీ

శరణం గచ్ఛామీ అంబేద్కర్ మానవతా

సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామీ”

(అశోక్‌తేజ, సుద్దాల. 2017: 100)

           వెనుకబడిన వర్గాల వారికోసం అనునిత్యం శ్రమించిన ధన్యజీవి అంబేద్కర్. అంతేకాదు దేశానికే దిక్చూచిగా నిలిచే అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసిపెట్టి, దేశ సమగ్రాభివృద్దికి బాటలు వేశాడు అంబేద్కర్. అటువంటి వారి గురించి సుద్దాల అశోక్ తేజగారు పాట కట్టారు. ఆయన గురించే కాదు మరెందరి గురించో పాటలు రాశారు సుద్దాలగారు. అణగారిన వర్గాలను చైతన్యం చేసే దిశగా అడుగులు వేసిన అంబేద్కర్ గురించి, వెనుకబడ్డ జాతులు రాజ్యాధికారం దిశగా నడిస్తేనే ఆయన రాసిన రాజ్యాంగానికి, ఆయన కాంక్షించిన ఆశయాలెన్నింటికో సమాధానం అని సుద్దాల గారు ఈ పాట ద్వారా చెప్పారు. సులభంగా అర్థమయ్యే రీతిలో పాట సాగుతుంది. అది ఆయన శైలి గొప్పతనం అని చెప్పవచ్చు.

        8.ముగింపు:

          అత్యాధునిక యుగం అని చెప్పుకుంటున్న 21వ శతాబ్దంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులను సాహిత్యం ప్రతిబింబింపజేసింది. అటువంటి సాహిత్యాన్ని సృజించినవారిలో సుద్దాల అశోక్ తేజగారు ఒకరు. ఆయన బాల్యం నుంచే ఎన్నో జానపద గీతాలను రాశారు. సినీగీతాలు మాత్రం 21 శతాబంలోనే అధికంగా చేశారు. అందులో ప్రకృతి, రైతు, ఉద్యమం, అనుబంధాలు, స్త్రీవాదం, దళితులు మొదలైన వాటన్నింటిని వస్తువుగా స్వీకరించి పాటలను రచిస్తున్నారు. ఆయన పాటకు వస్తువుగా స్వీకరించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. భిన్నమైన వస్తువును తీసుకోవడం, సులభమైన శైలిలో రాయడం ఆయన సహజ లక్షణం. అటువంటి సుద్దాలగారి పాటలను పరిమితిగల ఈ పరిశోధన పత్రంలో చర్చించడం అంటే సాహసమే. ఈ పత్రం తెలుగు సాహితీ లోకానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను.

 1. ఆధార గ్రంథాలు:
 2. అశోక్‌తేజ, సుద్దాల. 2012. నెమలి కన్నోడ- సుద్దాల అశోక్‌తేజ సినిమా పాటలు. హైదరాబాదు: విశాల పబ్లిషింగ్ హౌస్.
 3. అశోక్‌తేజ, సుద్దాల. 2013. నేలమ్మా నేలమ్మా-గేయరూప కవిత్వం. హైదరాబాదు: విశాల పబ్లిషింగ్ హౌస్.
 4. అశోక్‌తేజ, సుద్దాల. 2017. నా పాటలు. హైదరాబాదు: భూమి బుక్ ట్రస్ట్.
 5. కందికొండ. 2017. తెలంగాణ సినీగేయ వైభవం. హౌదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమి.
 6. చలం. 1993. స్త్రీ. హైదరాబాదు: స్వీట్ హోం పబ్లికేషన్స్.
 7. రవీందర్, గోపగాని. 2012. సుద్దాల అశోక్‌తేజ నేలమ్మా నేలమ్మా గేయరూప కవిత్వం పరిశీలన.
 8. రాములు, బి.ఎస్. 2011. పాట పుట్టుక-పాటల అలంకార శాస్త్రం. హైదరాబాదు: విశాల సాహిత్య అకాడమి.

*****

వ్యాస రచయిత పరిచయం:

నా చిన్నతనంలో కంటిచూపు కోల్పోయాను. ప్రాధమిక విద్య నుండి హైస్కూలు స్థాయి వరకు అంధుల ప్రత్యేక పాఠశాలలో చదివాను. తర్వాత గట్టి సంకల్పంతో బిఇ.డి., ఎం. తెలుగు పూర్తి చేసుకున్నాను. సెట్, నెట్, జెఆర్‌ఎఫ్ అర్హత కూడా సాధించాను. అదే స్పూర్తితో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం-సమకాలీన సినీగేయకవులు’ అనే అంశంపై డా. ఎస్. రఘుగారి పర్యవేక్షణలో పరిశోధన కొనసాగిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు చేసాను. ఈ పత్రం  అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), (బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు, నెచ్చెలి అంతర్జాతీయ వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ వారు సంయుక్తంగా) అనే అంశంపై నిర్వహించిన అంతర్జాల అంతర్జాతీయ వెబినార్‌లో సమర్పించాను.  వివిధ గ్రంథాల్లో పరిశోధన పత్రాలు కూడా ముద్రితమయ్యాయి.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.