జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-11

-వెనిగళ్ళ కోమల

రాజు ఢిల్లీ నివాసం

యూరప్ లో ఉన్నప్పుడే హిందూస్థాన్ టైమ్స్ ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు చేయాలనే తలంపుతో ఉన్నాడు. తాను పుట్టినదేశం, తనకు చదువు సంధ్యలిచ్చిన దేశం పట్ల తనకు కర్తవ్యం ఉన్నదనే భావంతోనే హిందూస్థాన్ టైమ్స్ వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. రాజు తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనుభవాలు రాజును ఢిల్లీ వచ్చేలా చేశాయి. ఇండియాలో పని చేసేటప్పుడు కొన్ని అవరోధాలు, ఇబ్బందులు, చికాకులు ఎదురవుతాయని తెలిసీ అన్నిటికీ సిద్ధపడి బ్రసెల్స్ నుంచి 2006 మే తరవాత ఢిల్లీ వచ్చాడు. Zola నెలల బేబి అప్పుడు. ఫామిలీతో ఢిల్లీకి మారింది. ఢిల్లీ పొల్యూషను ఇబ్బంది కల్గించినా ధృఢసంకల్పం అన్నీ తట్టుకునే లా చేసింది. 

రాజు రోజుకు 16 గంటలు పని చేసేవాడు. 120 మంది స్టాఫ్ ని తానే ట్రెయిన్ చేశాడు. అప్పటికే టైమ్స్ ఆఫ్ ఇండియా వారి  ఎకనామిక్ టైమ్స్  డెయిలీ ఎస్టాబ్లిష్ అయిఉన్నది. రాజు ప్రథమంగా అందులో ఒక సంవత్సరం పని చేసి ఉన్నాడు గూడా. వారి పత్రికకు పోటీ వస్తున్నాడని వారు గూడా ఇబ్బందులు సృష్టించారు. రాజు మొక్కబోని ధైర్యంతో మింట్ అనే పత్రిక ప్లాన్ చేసి అనుకున్న టైములోనే ఎస్టాబ్లిష్ చేశాడు. పేపర్ రావటమే నం. 2 గా వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ అప్పటికీ నం.1 గా నడుస్తున్నది. 

పేపరు పేరు, సైజు, విషయం అన్నీ విలక్షణంగానే తెచ్చాడు. మింట్ రాజు బ్రెయిన్ ఛైల్డ్. మ్యూజిక్, ఆర్ట్ కి కూడా కొంత స్పేస్ యిచ్చాడు. అన్నిటికంటె పెద్ద విశేషం ది వాల్ స్ట్రీట్ జర్నల్ (అమెరికా)తో పొత్తుకుదిర్చాడు. ఆ పొత్తుకుదిరిన నాడే హిందూస్థాన్ టైమ్స్ కి కోట్ల రూపాయలు షేర్స్ ద్వారా ముట్టాయి. పేపర్ ఎలీట్ మెప్పు మొదటి నుండి పొందింది. తనతో పని చేస్తున్నవారందరితో ఎంతో నిబద్ధతతో పని చేయించాడు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు వెళితే తిరిగి ఇల్లు చేరటానికి అర్ధరాత్రి అయ్యేది.  అలుపెరగని వీరుడుగా పనిసాధించాడు. డేటన్ డెయిలీ న్యూస్ లో ఉండగా కాక్స్ అవార్డ్స్ తో ప్రారంభించి తన ఆధ్వర్యంలో పేపర్లకు ఎన్నో అవార్డ్ లు సంపాదించి కీర్తి ప్రతిష్ఠల పరాకాష్ఠనందుకున్నాడు. మింట్ రాజు కీర్తి కిరీటంలో కలికితురాయి. 

పిల్లలు ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫ్రెంచి మీడియంలో చదువులు ఆరంభించారు. బ్యాలే నేర్చుకున్నారు. పెయింటింగ్ నేర్చుకున్నారు. కిమ్ కెరియర్ పక్కన పెట్టి పిల్లల సంరక్షణ ముఖ్యమని భావించి వారిని అన్ని యాక్టివిటీస్ కి తీసుకెళుతూ ఉండేది. ఒక ఆదివారం స్విమ్మింగ్ క్లాసులకే రాజు వారిని వెంటబెట్టుకొని వెళ్ళగలిగేవాడు. పని వాళ్ళ సహాయంతో కిమ్ అన్నీ మేనేజ్ చేసుకునేది. 

రాజు యంగ్ గ్లోబల్ లీడరుగా 2007 నుండి 2009 వరకూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ కి ఆహ్వానింపబడ్డారు. 2008 చైనా ఒలింపిక్స్ కి స్టేట్ గెస్ట్ – టార్చి బేరర్ గా అటెండయ్యాడు. వరల్డ్ ఎడిటర్స్ ఫోరం ఎక్జిక్యూటివ్ మెంబరు అయ్యాడు.  సౌత్ ఏషియన్ జర్నలిజమ్ అసోసియేషన్ (న్యూయార్క్) లైఫ్ మెంబరు. రొమాంటిక్ రియలిస్ట్ బ్లాగ్ ఢిల్లీ నుండి నడిపాడు. తాననుకున్నది ఢిల్లీలో నాలుగేళ్ళు ఉండవలసివస్తుందేమో అని. మూడేళ్ళకే సాధించగలిగాడు. బెంగుళూరు, బొంబాయి ఎడిషన్స్ గూడా ప్రారంభమయ్యాయి. ఇక తానక్కడ ఉండి చేయగలిగింది పెద్దగా లేదని భావించి తిరిగి అమెరికా వెళ్ళాడు. 

నేను, ఇన్నయ్య ఎక్కువగా ఢిల్లీలో రాజు కుటుంబంతో గడిపాము ఆ మూడేళ్ళు. లేల, Zola అందువల్లనే బాగా చేరువయ్యారు. తాత వాళ్ళతో కలిసి ఎక్కువ టైము గడపగలిగాడు. స్కూలుకు దించటానికి కారులో వాళ్ళతో వెళ్ళటం, ఆర్ట్స్, డాన్స్ క్లాసులకు దించిరావటం, వారితో ఆడటం అన్నీ తనకు సంతోషాన్నిచ్చాయి. తాతంటే పిల్లలు బాగా అభిమానం పెంచుకున్నారు. ఢిల్లీ కాలుష్య వాతావరణం Zolaకు ఆరోగ్య సమస్య కలిగించేది. డాక్టర్ పర్యవేక్షణలో కిమ్ అన్ని జాగ్రత్తలూ తీసుకునేది. చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని కన్ సల్ట్ చేసి పిల్లలకు సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేసేది. కొంతమంది ఇండియన్స్ తో బాగా స్నేహాలు చేసింది. పిల్లల కథల పుస్తకాలు (పిక్చర్స్ తో) పబ్లిష్ చేసింది. పేపర్ కి వచ్చిన ఆర్టికల్స్ చూసి ఎడిట్ చేసేది. ఢిల్లీలో వారి జీవితం సంతోషంగానే గడిచింది. 

ఇప్పుడు మింట్ అనేక ఎడిషన్లు వచ్చాయి. ఏషియా ఎడిషన్ కూడా తెచ్చారు. ఫౌండర్ ఎడిటర్ గా రాజు పేరు మింట్లో చిరస్థాయిగా ఉంటుంది. 

మరల అమెరికా జీవితం

2009లో రాజు ది వాషింగ్టన్ పోస్ట్ – ది నేషనల్ పేపరు – వాషింగ్టన్ డి.సి.లో మేనేజింగ్ ఎడిటర్ గా చేరాడు. అక్కడ గూడా కొత్త శీర్షికలు ప్రారంభించి పేపరు అభివృద్ధికి తోడ్పడ్డాడు. రాజు సూచనల ప్రకారం నడిపి పేపరును ఆర్ధిక మాంద్యం నుండి కాపాడారు. డిజిటల్ మీడియాని పెంపొందించాడు.  రెండేళ్ళు అక్కడ పనిచేసాడు. మేమూ 2010లో అమెరికా వెళ్ళి నవీన దగ్గరే ఉండటంవలన వారాంతాలలో రాజు వాళ్ళను కలిసే వీలయింది. 

ఇంతలో రాజుకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నుండి ఆహ్వానం అందింది. కొత్త యాజమాన్యం రాజు వారితో పనిచేయాలని కోరారు. అప్పటికే రాజు డిజిటల్ మీడియాలో గొప్ప పేరు పొంది ఉన్నాడు. ఇండియా ఎబ్రాడ్ పేపరు రాజును జార్ (zar) ఆఫ్ ది ఆఫ్ ది డిజిటల్ మీడియాగా కొనియాడారు. లోగడ ఆ పేపరు వారు రాజును మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసి సన్మానించి అవార్డు ఇచ్చారు. 

రాజు 2011 మొదటి నుండి ది జర్నల్ వారికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజీ, డెప్యూటీ హెడ్ ఆఫ్ న్యూస్ కార్ప్ గా న్యూయార్క్ లో పని ప్రారంభించాడు. చాలా ఇంటర్నేషన్ ప్రయాణాలు ఎల్లప్పుడూ చాలా బిజీ అయింది రాజు దినచర్య. అంత బిజీగా పనిచేయటం రాజుకి ఇష్టం అలవాటు కూడా. ఏమూడు నాలుగు నెలలకొకసారి పిల్లలతో వచ్చి కుటుంబాన్ని, మమ్మల్ని చూసి వెళ్ళగల్గుతున్నాడు. ఏ పని చేసినా నీతి, నియమాలు ధ్యేయంగా పెట్టుకుంటాడు. నిబద్ధతతో పనిచేసి విజయం పొందగలుగుతున్నాడు. 

ది వాల్ స్ట్రీట్ జర్నల్ కి మళ్ళీ రాజు వెళ్ళటం తన సొంత యింటికి తిరిగి వెళ్లినట్లయింది. బ్రూక్ లీన్ లో ఉంటున్నారు. పిల్లలు అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. మాకు ఎంతో గర్వకారణంగా ఉంటున్నారు. 

రాజు సూక్ష్మగ్రాహ్యత, చురుకైన ఆలోచనలు, ముందు చూపు, సునిశిత హాస్యం ఏ పని చేపట్టినా పర్ ఫెక్టగా చేయాలనే పట్టుదల, ఎథిక్స్ పాటించటం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పు – అన్నీ రాజు విజయానికి ప్రోది చేస్తున్నాయి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తల్లిగా నేనెప్పుడూ కోరుకుంటాను. 

ఇన్నయ్య ద్వారా పరిచయమై స్నేహ సౌరభాన్ని అందించినవారు

ఇన్నయ్యకు విద్యాధికులు, సాహిత్యప్రియులు, రాజకీయరంగంలోని వారు, జర్నలిస్టులు, తాత్త్వికులు చాలా మందితో సాన్నిహిత్యం ఉన్నది. అలా నాకు పరిచయమైనవారు – 

ఆలపాటి రవీంద్రనాథ్, ఇన్నయ్య చిరకాల మిత్రులలో ఒకరు. చక్కని వ్యక్తి, సాహిత్య ప్రియుడు, స్నేహశీలి, బిజినెస్ చూసుకుంటూనే ఎన్నో మాగజైన్లు నడిపిన ఖ్యాతిగలవాడాయన. మిసిమి మేగజైన్ స్థాపించి ఉన్నత ప్రమాణాలతో నడిపారు. ఎందరిలోనో రచనా శక్తిని వెలికి తీశారు. ఆయన వల్లనే నాకు టైమ్ మేగజైన్ పరిచయమయింది. ఇప్పటికీ చదువుతున్నాను. విక్రమ్ సేథ్ రాసిన ఎ సూటబుల్ బోయ్ తెచ్చి ఇచ్చి నన్ను సమీక్ష రాయమన్నారు. నేను రాసినదినచ్చి మిసిమిలో ప్రచురించారు.

సంజీవదేవ్ రచయిత, చిత్రకారుడు, తాత్త్వికుడు బహుభాషా కోవిదుడు అన్నిటికి మించి మంచి మనిషి, ఉదాత్తుడు. తాను నివసించిన తుమ్మపూడికే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి. మా పిల్లలకు కూడా చిన్న చిన్న వాటర్ కలర్ చిత్రాలు గీసి బహూకరించేవారు.

యలవర్తి రోశయ్య బహువిధ పండితుడు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద సాహిత్యం మీద మంచి పట్టు గలిగినవాడు. మేథమేటిక్స్ లో, మ్యూజిక్ లో నిష్ణాతుడు. ఒక్కపూట మాతో గడిపి మాకు సంతోషం పంచారు. ఇన్నయ్యకు ఆయన కాలేజీలో గురువు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11”

  1. మా ఎదురుగా కూర్చుని ముచ్చట్లు కళ్ళకు కట్టినట్లు ఎంతచక్కగా మీ జ్ఞాపకాలను వివరిస్తున్నారండి,

Leave a Reply

Your email address will not be published.