చిత్రం-23

-గణేశ్వరరావు 

ఇది బృందావన్ ‘క్వారంటైన్’ ఫోటో, వితంతువుల క్వారంటైన్. ‘అసుంటా’ ‘అస్పృశ్యత’ మడి-ఆచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆటవిక దశనుంచే ఉన్నాయి.ఎవడిని తాకితే ఏమౌతుందో, దేన్నీ తాకితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆటవిక మానవుడు భయంతో తల్లడిల్లి పోయేవాడు. ఆటవికులు చచ్చిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళతో పాతేసే వాళ్ళు. మన మతాచారాలు ఆటవికుల భయం నుంచే పుట్టాయని అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా భయంతో మనం పాటిస్తున్న నియమాలను భవిష్యత్తులో చరిత్రకారులు ఎలా తీసుకుంటారో ఊహించగలమా?
ఈ ఫోటోలో గేటుకు అనుకుని ఉన్న ఆమె పామెలా సింగ్ చాయాగ్రాహకురాలు. 1994 లో ఆమె బృందావన్(యు.పి) వెళ్ళారు. ‘బృందావనమది అందరిదీ, గోవిందుడు అందరి వాడేలే’ అనే పాట అయితే వుంది, ఇక్కడ గోవిందుడు ఉన్నాడో లేడో కాని, ఈ ‘వితంతువుల నగరం’ అయస్కాంతంలా అనాధలని ఆకర్షిస్తూనే ఉంటుంది. అప్పుడు పదిహేను వందల అనాథ స్త్రీలు ఉండేవారట. ప్రతీ సంవత్సరం కొన్ని వందల మంది వచ్చి చేరుతూ ఉంటారు. కృష్ణుడు బాల్యం ఇక్కడ గడిపాడని అంటారు, యాత్రీకులు ఇక్కడి దేవాలయ సందర్శనానికి తరచూ వచ్చి పోతుంటారు.
ఫోటోలో మీరు చూస్తున్నది ఒక ప్రశాంతమైన చోటు .. మధ్యలో మీకు ఒక మూట కనిపిస్తోంది కదా – అదే ఒంటిగా చీర కప్పుకొని పడుక్కున్న ముదుసలి. పామెలా నీళ్ళ బాటిల్ తో ఆమె దగ్గరికి వెళ్ళింది, కొంచెం దూరంలో ఆడుకుంటున్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు (ఫోటో వాళ్ళు ఉన్నప్పుడు తీసింది కాదు), వాళ్ళు చెప్పినదాని బట్టి, ముసలి వితంతువులు అలా ఎండలో పడుక్కుని తమ చావు కోసం ఎదురు చూస్తుంటారు. బౌద్ధ బిక్షువులు టిబెట్ లోని కైలాస పర్వతం చేరుకొని అక్కడి చలికి మంచుకీ తట్టుకోలేక ప్రాణాలు విడుస్తూ ఉన్నట్టు బృందావనంలో వితంతువులు వేసవి ఎండల్లో ప్రాణాలు త్యాగం చేస్తూ ఉంటారు.. పామెలా ఆమెను లేపడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. అప్పటికే ఆమె పోయింది.
ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్ లో పదేళ్ళు రాకుండానే బాలికలను తమ కన్నా ఎన్నో ఏళ్ళు వయసులో పెద్దయిన వారికి ఇచ్చి పెళ్ళిళ్ళు జరపడం కద్దు, సహజంగానే అనేక మంది వితంతువులు అవుతుంటారు. కొన్ని ఆశ్రమాలు వాళ్ళని చేర్చుకుంటే, మరి కొంత మంది అనాధలుగా మిగిలి పోయి, అడుక్కుంటూ పొట్ట పోసుకుంటూ ఉంటారు. నున్నగా గుండు చేయించుకుని, కేవలం తెల్ల బట్టలే ధరిస్తూ ఉంటారు వాళ్ళు. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఉంటారు. పామెలా ఆ వితంతువుల దీనావస్థలకు ఎంతో చలించిపోయింది, తను చేయగలిగిందల్లా – ఆ విషాద దృశ్యాన్ని కెమరా లో బంధించి వార్త కథనాన్ని అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురింప జేసి, అందరి దృష్టిలోకి తీసుకొని రావడమే!
నేను ఆగ్రా, మధురా, బృందావన్ లను చూసి చాలా కాలమైంది. ఇప్పుడు కూడా – వితంతువులు ఈ అతి హీన స్థానాన్ని ఆక్రమించటానికి అంగీకరిస్తున్నారా లేదా, బృందావన్ లో ఇది ఇంకా కొనసాగుతోందా లేదా అన్నది ఇటీవల ఈ ప్రాంతాలను పర్యటించిన వారే చెప్పాలి.
ఈ దుష్ట సాంఘికాచారాలను చీల్చి చెందాడటానికి మన తెలుగు జాతి పురోభివృద్ధికి అప్పుడు ప్రతిరూపంగా నిలచిన కందుకూరి వీరేశలింగం అటువంటి చోట మళ్ళీ పుట్టాలి.
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.