రాగో

భాగం-10

– సాధన 

ఇలాటి మూర దళంలోకి వచ్చాడు. ఇంటివద్ద అతడి పోషణ కాక ‘గిన్సు’ చేసేవాడు. జ్ఞానం తెల్సిన ఆదివాసీ పిల్లల్ని పెంచటానికి పెద్దలు పడాల్సిన శ్రమ ఏముండదు. పిల్లలు సైతం ఏదో పనిచేస్తూనే ఉంటారు. అడవిలో చదువు సంధ్యల ప్రసక్తి లేనేలేదు. ఎవరైనాసరే, పసులు కాయడానికో, కూలి పనులకో, ఎవరి దగ్గరో జీతానికో, అడవిలో ఉసిరికాయలో, కరక్కాయలో, ఇప్పపూలో ఏరుకొచ్చి షావుకారికి కొలవడానికో నిత్యం అడవిపట్టుక తిరగాల్సిందే. ఏదీ దొరక్కపోతే చేపలకో, కొక్కులకో, పిట్టల వేటకో ‘ఉదర నిమిత్తం బహుకృతం వేషం’ అన్నట్టు పిల్లలూ పెద్దలూ కూడ తిరక్కతప్పదు. మూరడలాగే పెరిగాడు. అలా పెరుగుతున్న మూరని ఊళ్ళోకి సంఘం వచ్చింది.

ఆలనా పాలనా లేకుండా పెరిగిన మూరకి ఆకుల సీజన్ వస్తే ఆ పని తప్ప మరో ధ్యాస ఉండేదేగాదు. అయితే ఆకుల కట్టలు తీసుకోవడం అయినా, తీసుకున్న వాటికి డబ్బు ఇవ్వడం అయినా కళ్ళేదారు దయాదాక్షిణ్యమే. కాని అన్నలొచ్చి సంఘాలు పెట్టాక అదంతా తారుమారైంది. వెట్టికట్టలు బందు పెట్టడం దగ్గరినుండి కరాఖండిగా రేటు వసూలు చేయడం వరకు అన్ని పనులకు సంఘం యువకులతో పాటు మూర ఎపుడూ ముందే ఉండేవాడు. పాటలు పాడుతూ, ప్రచారం చేస్తూ రోజుల తరబడి ఊళ్ళు పట్టుక తిరిగినా, చివరకు మొండికేసే టేకేదార్ల పొగరు అణచి దారికి తేవడానికి కళ్ళాలు కాలబెట్టడానికి రాత్రిళ్లు అడిగేవాళ్ళు, అదుపు చేసేవాళ్ళు లేకపోయారు. కానీ, ఏ పని చెప్పినా కాదనకుండా నెత్తిన వేసుకొని చేసే మూరడు సంఘం పెద్దలకే కాక ఊరందరికి కూడ తలలో నాలుకలా తయారయ్యాడు. అలా సంఘం పనులతో తల్లి తండ్రి లేని మూరడు ఊరందరికి పిల్లడు అయ్యాడు.

వెదురు కూపుల్లో పనులు, ఫారెస్టు పనులు, ఇతరత్రా కూలిపనుల్లో రేట్లు పెంచుకోవడానికి జరిగిన అన్ని పోరాటాల్లో కూడ తాను అందరితో పాటు చురుగ్గానే పని చేశాడు. భూస్వాములు, షావుకార్ల నుండి వడ్లు వసూలు చేసినపుడు తనకొక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టే అనిపించింది. ఊరి సంఘం వారే కాకుండా రేంజి సంఘం పెద్దలు, అన్నలు కూడ మెచ్చుకోవడంతో మూరకు తనపై తనకు నమ్మకం పెరిగింది.    

అలాగే ‘వర్క్ డే’లు క్యాంపెయిన్లు, రేంజి యువకుల్లో ఆటల పోటీలు వగైరా అన్నింటిలో హుషారుగా పనిచేసిన మూరకి చిన్నప్పటి నుండి ఇంట్లో పెంచుకున్న కాక, కూచీల కంటే చేరదీసి పనులు చెప్పుతూ, బుద్ధులు నేర్పుతున్న సంఘం వాళ్ళు, అన్నలే దగ్గరివాళ్ళనిపించింది. గాలికి పెరుగుతున్న తను దళంలోనికి ఎదిగివచ్చిన తీరు తెన్నులు తలచుకుంటే మూరకు ఆనందం, ఆశ్చర్యం ఉక్కిరి బిక్కిరి చేసేయి.

ఒక్కసారిగా వర్షం మోత పెరిగింది. సెంట్రీ పాలీన్ ను దగ్గరికి మడచుకొని తడవకుండా జాగ్రత్త పడుతున్నాడు. పడుకున్న వారు కూడ ఎవరి ప్లాను ప్రకారం వారు తడవకుండా చూసుకుంటున్నారు. ఇందులో ఎవరి అనుభవం వారిదే. దళాల్లో చేరిన మొదటి రోజుల్లో పార్టీన్ కవరు కప్పుకోరాక ఎన్ని తంటాలు పడేవారో! తుపాకులు, తూటాలు నానిపోయేవి. సరిగా ఆరని టువల్ బోర్ తూటాలు ఉబ్బి చాంబర్లో కూచోడానికి మొరాయించేవి. ఎవరి తూటాలు వారు తడుపుకోకుండా భద్రంగా చూసుకోకపోతే, ‘పోలీస్ లెదురవుతే మన పని గంగే’ అని గాండో ఎపుడూ హెచ్చరిస్తుండేవాడు. ఎపుడూ టెక్ విషయాలు గుర్తు చేసే గాండో అంటే దళంలో అందరికి గురే.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.