వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు

అత్యాధునిక తెలుగు సాహిత్యంవస్తురూప పరిణామం (2000-2020)

నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం

-డా. కరిమిండ్ల లావణ్య

మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైనదశ. ఈ దశపైనే వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుంది. అందుకు గేయ సాహిత్యం తోడ్పడుతుంది. దీనివల్ల బాలల్లో మానవ  విలువల పరిరక్షణ పెరుగుతుంది. సృజనాత్మకత పెంపొందించబడుతుంది. భావ పరిపక్వత, మనోవికాసం కలుగుతుంది. మానవత్వ వికాసమే సాహిత్యపు ప్రధాన కర్తవ్యం. గేయ సాహిత్యం సామాజిక, సాంస్కృతిక వికాసంతో పాటు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ గేయాల్లో బాలసాహిత్యానికి దగ్గరగా ఉండే పాటలు అనాది నుండే మౌఖికంగా ఒక పరంపర రూపంలో ప్రచారంలో ఉన్నాయి.

అన్ని భాషా సాహిత్యాల్లోనూ గేయానికి ప్రధాన భూమిక ఉంటుంది.గేయాన్ని అందరూ ఇష్టపడుతారు. గేయాన్ని ఇట్లా నిర్వచించవచ్చు. గతిననుసరించి లయబద్ధంగా పాడుకోవడం గేయమవుతుంది. దానికి రాగతాళాలను జోడించి పాడుకోవడం పాట అవుతుందని ప్రముఖ పరిశోధకులు డా.చెన్నకేశవరెడ్డి ఉద్ఘాటించారు. అయితే గేయం ఎపుడు పుట్టింది? ఎక్కడ పుట్టిందన్న ప్రశ్నలకు జవాబులున్నాయి. మానవ సమాజం మొదలైనప్పటి నుండీ గేయాలుఉన్నాయని జానపద సాహిత్యం చెబుతుంది. మానవుడు ఆనందోద్వేగాలకు గురైనపుడు సహజంగా మాట పాట రూపంలో రూపొందుతుంది. అందులో బాల్యదశ నుండి వ్యక్తి ఎదుగుతాడు కాబట్టి బాలల కోసం పాడే పాటలే మొదటి గేయాలుగా చెప్పవచ్చు. వీటిని ఎవరు సృష్టించారు? సృజించారు? అనే ప్రశ్నలకు జవాబుగా పసిబిడ్డల హృదయభాష తెలిసిన మాతృమూర్తులే. ఆ తల్లి మనసు పసిగట్టినవారే చిన్నారులు. వీళ్ళిద్దరూ బాల గేయాలకు ప్రత్యక్ష పరోక్ష కర్తలని చెప్పడంలో నూరు శాతం నిజం ఉంది.

ప్రపంచంలో ఏ దేశపు వాఙ్మయాన్ని పరిశీలించినా మొదట పదములు – పాటలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఇవే వాఙ్మయవాహినిని పోషించే సెలయేళ్ళని ప్రసిద్ధ జానపద వాఙ్మయ పరిశోధకులు టేకుమళ్ళ అచ్యుతరావు విశ్లేషించి చూపారు. బిడ్డల ఆలనా పాలనా ఆనాటి గేయ కవితా వస్తువులు.వినోద సందర్భాలు, పండుగలు, పబ్బాలు, జాతరలు తదితర ఘటనలు, ఆచారాల వర్ణనలు, ప్రకృతి సౌందర్య చిత్రణ, పశుపక్ష్యాదుల వర్ణనలు ఆనాటి సాహిత్యానికి ప్రేరణ ఇచ్చాయి. నాటి కవిత్వంలో మనం వాడుకునే ”తీయని తెలుగు” పాలు ఎక్కువ. రస హృదయుల నుండి, మహిళల నుండి వెలువడిన ఆశు సాహిత్యం సెలయేరులా గలగలా జాలువారింది.ఇది మృదుమధురంగా, నిసర్గంగా, మనోహరంగా ఉంటుంది. ఆనందమే ప్రధానంగా వినోదమే అందుకు ప్రాతిపదికగా వెలుగొందుతుంది. బాలసాహిత్యంలో తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పశుపక్ష్యాదులు ఇవీ ప్రధాన పాత్రలవుతాయని అర్థం చేసుకోవచ్చు. ఈ గేయతరహా పాత్రలను ప్రధానంగా తీసుకొని ఆచార్య కొలకలూరి ఇనాక్​గారు ”అమ్మ” శీర్షికతో ఎనిమిది సంగీతనృత్యరూపకాలను రూపొందించారు.

”అమ్మ”లోని బాలగేయాలన్నీ నీతి బోధతో కూడినవే. ఇందులో దానధర్మాలు, నీతి నిజాయితీ, అపాయం – ఉపాయం, మంచీ చెడు, ఆత్మరక్షణ, ప్రేమ, త్యాగం, ఐకమత్యం, సత్యం, దానధర్మం తదితర అంశాలు వస్తువులు. వీటిద్వారా పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా కల్గుతుంది.ఆనందాన్ని మానసిక సంతృప్తిని కల్గిస్తాయి. ఈ పాటలు లయబద్ధంగా మాత్రాబద్ధంగా ఉండడంవల్ల పిల్లల హృదయాలకు సూటిగా హత్తుకుంటాయి. ఇందులో సందేశాన్నిచ్చే గేయాలున్నాయి. ఇవి బాలబాలికల్లో ఆత్మస్థైర్యాన్ని, వ్యక్తిత్వ స్థాయిని పెంపొందిస్తాయి.

బాల వైద్యం ఎంత సున్నితమైందో – బాల సాహిత్య సేద్యం కూడా అంతే అపురూపమైంది. పెద్దల సాహిత్యంలో వాడే కఠోర శబ్దాలు, నిఘంటువులకు అందని మాటలు ఇందులో అస్సలు పనికిరావు. విద్యార్థుల మేథో వికాసాన్ని వేగవంతం చేసేందుకు, వారి హృదయోల్లాసానికి, వారికి సత్కాలక్షేపం కలిగించేందుకు తోడ్పడే రీతిలో బాలగేయాల్ని తీర్చిదిద్దాలి. బాలగేయ కవిత్వ రచనలో మేధస్సుకంటే హృదయం గొప్పది. ఈ వాస్తవం ఆచార్య ఇనాక్​గారికి తెలుసు. ఆయన సహృదయుడు, అందువల్లనే ఇంత చక్కని బాలగేయాల్ని రాయగలిగారు.

 1. అమ్మ – పేరులోని గొప్పతనం:

మాతృప్రేమ అనిర్వచనీయం. ఇది అమృతం.అమూర్తం.భారతీయ జీవన విధానం మాతృమూర్తికే అగ్ర తాంబూలాన్ని అందించింది. శిశు వికాసానికి, విలాసానికి, చైతన్యానికి, జాగృతికి, పురోగతికి తల్లే కారణమని మానసికవేత్తలు ఏనాడో తేల్చి చెప్పారు. తల్లి తత్వానికి సుదర్శనమైన నిదర్శనం శాలివాహన గాధాసప్తశతిలో ఓ గాధాకారుడు చిత్రించిన గాథ ఇది. ”చూఱు నుండి వాన నీరు గాఱగఁదల / యడ్డు వెట్టి కొడుకునాదుకొనెడు / కాని – పాథ గృహిణి కన్నీట వానిని / తానె తడుపు చుంటఁ గానదకట.”(గాథా-465). ఒక రోజు వర్షం బాగా కురుస్తోంది. ఆ సమయంలో ఒక పూరి గుడిసెలో నున్న ఒక తల్లి, బిడ్డ తడుస్తున్నారు. భర్త ఊర్లో లేడు.గుడిసె కారుతూనే ఉంది. బిడ్డ వర్షంలో తడవకుండా చూడాలి. అలా నీరు కారుతుంటే, తన ఒళ్ళో పసిపాపని పెట్టుకొని, తన కుటుంబ స్థితి, తన గుడిసె స్థితి, కురుస్తున్న వాన పరిస్థితి – ఇవన్నీ ఆమెను కలచివేసాయి. అందువల్ల ఆమె కళ్ళలో నీళ్ళు ఉబికాయి. ఆ కన్నీళ్ళతో ఆ పసివాడు తడిసిపోతున్నాడు. వాన నీటితో వాడు తడవకుండా చూడగలిగింది. కాని, కన్నీటితో ఆ పసివాడు తడిసిపోయాడన్న సంగతి ఆమెకు తెలియదు. అమ్మనూ, ఆ దృశ్యాన్ని చిత్రీకరించిన గాథాకారుడు 2000 సంవత్సరాల క్రితం వాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ప్రేమ మాత్రం అనిర్వచనీయం.

”అమ్మ” రూపకాల్లో ఉన్న ఆవు పులికి ఆహారంగా వెళ్ళాలి. తాను చనిపోతున్నానని తెలుసు. కాని, దూడకు చివరిసారిగా పాలిచ్చి, బతికే విధానం చెప్తుంది. ఇంక తాను రానని ధైర్యంగా ఉండమని, నాలాగ ఒంటరిగా మేతకు వెళ్ళి చావు కోరితెచ్చుకోవద్దని చెబుతుంది. అపుడు దూడ అమ్మతో ఇలా అంటుంది. ”అమ్మా పోతావా / నన్నొదిలి పోతావా / తప్పు చేసే బ్రతుకు కన్నా / మాట నిలుపుకొనుటె మిన్న” అని దూడ అమ్మకే నీతులు చెబుతుంది. తల్లీబిడ్డల మధ్య సంబంధం మానవుల్లోనే కాదు జంతువుల్లో కూడ దృఢంగా ఉంటుందని చెప్పడానికి మంచి ఉదాహరణ.

”మంచీ – చెడు” రూపకంలో చిలుకకు రెండు పిల్లలుంటాయి. తల్లి చిలుక మేతకు వెళ్తూ గూటి నుండి బయటికి రావద్దని చెప్తుంది. కాని, కొంగ మాయ మాటలకు పిల్ల చిలుకలు గూటి నుండి బయటికి వస్తాయి. వెంటనే కొంగ నోటికి కరుచుకొని ఎగిరిపోతుంది. మేత నుండి తిరిగి వచ్చిన తల్లి చిలుక పిల్లలు కనిపించకపోయేసరికి ”అటెగిరిందీ ఇటెగిరిందీ / చుట్టు ప్రక్కల చూచి అరిచింది / పట్టరాని దుఃఖమొచ్చీ” / నిట్టనిలువున కూలిపోయింది. పిల్ల చిలుకలు కూడ తల్లిలేని మమ్మల్ని ఆదరించండి అని మునిని, కొంగను వేడుకుంటాయి. ప్రపంచంలో తల్లీ, పిల్లల సంబంధం అన్ని ప్రాణులకు ఒకే విధంగా ఉంటుంది. రూపం, ప్రాంతం, భాష, వేషం, వేరు వేరు. కాని, అమ్మ, బిడ్డల అర్థం ఒక్కటే. మాధుర్యం ఒకటే… ఈ సత్యం దేశకాల జాతి భేదాలకు అందనిది. మూగజీవులు కూడ అమ్మ ప్రేమలోని తీయదనాన్ని మనసారా ఆస్వాదిస్తాయి. ఆ ఆనందం నుండే ఎదుగుతాయి. ఆ అనుభూతులను మాటల్లో చెప్పేవాడు మనిషి మాత్రమే. ఆ మనిషి హృదయం కవిత్వమైతే ”అమ్మ”లాగా కావ్యంగా మారుతుంది.

ఆవు-పులి కథ ఇనాక్​గేయ నాటికల్లో ఒకటి. సత్యవాక్కు పరిపాలనలోని పవిత్రతను ఎంతో ఉన్నతంగా ఆవిష్కరించిన మౌలిక గాథ ఇది. దాదాపు ఐదారు వందల సంవత్సరాల నాడు అనంతామాత్యుడనే కవి గోవ్యాఘ్ర సంవాద ఘట్టాన్ని రాశాడు. అది పద్యరూపంలో ఉంది. అందుకని పిల్లలకు అర్థం కావడం అసాధ్యం. ఆ భాగాన్ని తనదైన శైలిలో సృజన ప్రతిభగా బాలగేయాలుగా ఆచార్య ఇనాక్​తీర్చిదిద్దారు.

 1. ఇతివృత్త సంక్షిప్తీకరణ :

2.0 మనిషి విలువ : ఒక ధనవంతుడైన పిసినారి ఎవరికీ దానం చేయకుండా, పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ధనాన్ని కూడబెడతాడు. ధనవంతునిలో కూడా దానగుణముందని తెలియజెప్పడానికి ప్రయోక్త సన్యాసిని ప్రవేశపెడ్తాడు. సన్యాసి ఒక చిన్న సూదిని ధనవంతునికి ఇచ్చి, వచ్చే జన్మలో ఇవ్వమని చెబుతాడు. ధనవంతుడు ఇలా అంటాడు ”ఏమిటేమిటేమిటేమిటీ?/ ఈ జన్మలో తీసుకొని / ఆ జన్మలో ఇవ్వాలా? / ఇదేం మాట స్వామీజీ! / ఇదేం కోర్కె స్వామీజీ!” ఇవ్వడం కుదరదు. ఇంత చిన్న సూదినే ఈ జన్మలో వదలి వెళ్తున్నావు. అంత ఆస్తిని నీ వెంట తీసుకొని వెళ్తావా అని సన్యాసి అడుగుతాడు. ”ధనవంతుడి తల లోపల / నూత్న కాంతి కళ్ళు తెరిచి / మనిషి విలువ ఎక్కడుందో / కళ్ళ ముందు కదలసాగె” ధనవంతుడిలో చిన్న సూదిద్వారా పరివర్తన కల్గిస్తాడు సన్యాసి. చివరకు ధనవంతుడు తన దగ్గరున్న ఆస్తినంతా దానం చేస్తాడు.

2.1 మాట తప్పని కుందేలు : ఒక వనంలో జంతువులన్నింటితో పాటే కుందేలు జీవనం సాగిస్తుంది. ఉషారైన కుందేలుతో కొంగ, కోతి, నక్క స్నేహంగా ఉంటుంటాయి. జంతువులన్నీ ఒక సంవత్సరం శివరాత్రికి జాగరణ చేద్దామని నిర్ణయించుకుంటాయి. కానీ, కొంగ చేపలను, కోతి టెంకాయను రహస్యంగా దాచి తింటాయి. మోసాలు వేషాలు తెలియని కుందేలు జాగరణ చేస్తుంది. చందమామ ముసలితాత వేషంలో కుందేలును పరీక్షించడానికి ఆహారం కావాలని వస్తుంది. కుందేలు అతిథి వచ్చిండని మురిసిపోయి అగ్గిగీసి నిప్పు చేసింది. ఆ మంటలో దూకింది. ముసలి తాత నీకు ఆహారం నేనే. నన్ను తిను. నూరేళ్లు హాయిగా బ్రతుకు అని ముసలితాతను కోరింది. కాని కుందేలు కాలలేదు. ఆ మంట చల్లని చందమామ మంట. ”మంటయితే వెలిగింది / అది ముసలితాత మంట / నిప్పయితే లేచింది / అది చందమామ నిప్పు / కుందేలేమో దూకింది / మంటల్లో మంటల్లో / ఆ మంటలు కాల లేదు / వేడి ఏమి తగల లేదు / అగ్ని కూడ ఆరలేదు / అది చందమామ నిప్పు / మరి చందమామ మంట / ముసలి తాత మాయమాయె / చందమామ ఎదుట నిలిచె. ” చందమామ పెట్టిన పరీక్షలో కుందేలు నెగ్గింది. కుందేలు నీతి, ధర్మం త్యాగగుణం ద్వారా మనుషుల్లో కూడ మార్పు రావాలి. బాలలు ఈ నీతిని నేర్చుకోవాలి.

2.2 ఆవు – పులి : ఆవు పులి కథ అందరికీ తెలిసిందే. కాని బాల బాలికలకు తెలియదు కదా!  ఆవు – పులి కథ ఇనాక్​గేయనాటికల్లో ఒకటి. సత్యవాక్కు పరిపాలనలోని పవిత్రతను ఎంతో ఉన్నతంగా ఆవిష్కరించిన మౌలిక గాథ ఇది. దాదాపు ఐదారు వందల సంవత్సరాలనాడు అనంతామాత్యుడనే కవి గోవ్యాఘ్ర సంవాద ఘట్టాన్ని రాశాడు. అయితే అది పద్యాల్లో ఉంది. అందుకని పిల్లలకు అర్థం కావడం అసాధ్యం. ఆ భాగాన్ని తనదైన శైలిలో సృజన ప్రతిభగా బాలగేయాలుగా ఆచార్య ఇనాక్​తీర్చిదిద్దారు. ఉదాహరణ పరిశీలిద్దాం. ”అవును అవును పులిగారూ / ఆగాలి మీరాగాలి / ఇంటికాడ చంటిబిడ్డ / కూడు తినడు, నీళ్ళు అనడు / పాలు మాత్రమే / నా పాలు మాత్రమే తాగి బతికే / పసివాడు చినవాడు నాకన్నవాడు / ఇంట వున్నవాడు / వాడికి కడుపునిండ పాలు / తాగనిచ్చి తిరిగివచ్చి / నీ కడుపు నింపుతాను / నీకు అన్నమవ్వుతాను / పులిగారూ! పులిగారూ / బిడ్డకు పాలిచ్చి వచ్చి / నీకు బువ్వనవుతాను. ” తల్లి తన బిడ్డకోసం తల్లడిల్లిన సందర్భమిది.

2.3 అపాయం – ఉపాయం : ఒక అడవిలో పావురాలు ప్రేమతో, స్నేహంగా, సుఖంగా, హాయిగా కలిసి మెలిసి నివసిస్తుంటాయి. అవి నివసించే అడవిలోనే వేటగాడు వల పన్ని పావురాలను పట్టుకెళ్లాలనుకుంటాడు. ఈ విషయం గ్రహించని పావురాలు వేటగాడు పోసిన గింజలు తింటాయి. వలలో చిక్కుకుంటాయి. తప్పించుకునే ఉపాయం ఆలోచించిన పావురాలు, ఒక్కసారిగా బలంతో వలతో సహా ఎగిరిపోతాయి. పావురాల్లోని పెద్దపావురం మోసం గురించి ముందే చెబుతుంది. కాని పావురాలు వినవు. వినకుండా ఈ విధంగా ఆలోచిస్తాయి. ”ముసలివాళ్ళు ఎప్పుడింతె / మంచి చోటు వద్దనటం / చెడ్డచోటు పొమ్మనటం / ముసలివాళ్ళు ఎప్పుడింతె / కళ్ళుసరిగ కనిపించవు / బుద్దిసరిగ పనిచేయదు / నసుగుడు మూల్గుడు సణుగుడు / పోదాం పోదాం పోదాం / గింజలు ఏరుకు తిందాం.” కాని చివరకు పెద్దపావురం చెప్పిన మాటలే నిజమవుతాయి.

2.4 సింహం – ఎలుక : ఒక అడవిలో సింహం, ఎలుక నివసిస్తుంటాయి. ఒకనాడు సింహం చెట్టుకింద పడుకొంటుంది. అది చూసిన ఎలుక సింహం మీద ఎక్కి ఎగిరింది. సింహంకు నిద్రాభంగమయి ఎలుకను గోళ్ళమధ్య పట్టుకొంది. ఊహించని పరిణామానికి ఎలుక ”మృగరాజా మృగరాజా / మూర్ఖత్వం క్షమించు / ఓ రాజా ఓ రాజా నా తప్పులను మన్నించూ / ప్రాణభిక్ష ప్రసాదించు / భవితవ్యం అనుగ్రహించు”మని వేడుకొంది. సింహం వదిలేసింది. అందుకు ప్రతిఫలంగా సింహం వేటగాడి వలలో చిక్కుకున్నపుడు ఎలుక వల తాళ్ళను కొరికి రక్షిస్తుంది. అల్పప్రాణులని భావించే వారితో కూడ మేలు జరుగుతుందని, ఎవరినీ ఎగతాళిగా చూడొద్దని ఈ రూపకం ద్వారా ఆచార్య ఇనాక్​గారు ఉద్ఘాటిస్తున్నారు.

2.5 మంచీ – చెడు : దట్టమైన అడవిలో అందమైన చిలుక, దాని పిల్లలు మిగతా జంతువులతో పాటు నివసిస్తుంటాయి.  ఒకరోజు తల్లి చిలుక మేతకు వెళ్తూ జాగ్రత్తగా ఉండండి.మీరు లేకుంటే గుండె పగిలి చస్తాను. గూటి నుండి బయటికి రావద్దని చెబుతుంది. తల్లి చిలుక లేదని గ్రహించిన కొంగ మాయమాటలు చెప్పి చిలుక పిల్లలు గూటి నుండి బయటికి వచ్చేవిధంగా చేస్తుంది. పిల్ల చిలుకలు తలలు బయటికి పెట్టగానే కొంగ తన కాళ్ళతో పట్టుకొని ఎగిరిపోతుంది. కొంగ కాలి పట్టు తప్పి ఒక చిలుక జారిపోతుంది. అది ముని ఆశ్రమంలో పడుతుంది. అక్కడే క్రమశిక్షణతో పెరుగుతుంది. మరో చిలుక కొంగ దగ్గర పెరుగుతుంది. కొంగ దొంగ బుద్దులన్నీ నేర్చుకుంటుంది. ఒకరోజు రాజు అడవికి వేటకు వెళ్తాడు. వేటలో భాగంగా జింకను రక్షిస్తాడు – రాజును చూసిన కొంగ దగ్గరి చిలుక ”దొంగబాబు దొంగబాబు / దొర ఎవరో వస్తున్నారు / దోచుకోండి దోచుకోండి” అంటుంది. దొంగగా మారిన చిలుక ఈ మాటలు అంటుంది. ముని ఆశ్రమంలో పెరిగిన చిలుక రాజుకు సపర్యలు చేసి రాజు అలసట తీరుస్త్తుంది. ఒక్క తల్లి పిల్లలు ”జాతి” ఒక్కటే అయినా ఆయా చిలుకలు పెరిగిన వాతావరణాన్ని బట్టి గుణగణాల్లో మార్పులొచ్చాయి.

2.6 తోడేలు – మేక పిల్ల : ఒక అడవిలో తన ఇష్టారాజ్యంగా తిరిగే తోడేలు నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు దాహంతో ఉన్న మేకపిల్ల నీళ్ళు తాగడానికి ఏటి దగ్గరకొస్తుంది. మేకపిల్లను చూసిన తోడేలు చంపి తిందామనుకుంటుంది. ఏటిలో నీళ్ళు నీవు తాగడం వల్లనే మురికివైనాయని నేరం మోపుతుంది. ”ఏరు మురికి ఔట నిజం / నీళ్ళు ఎంగిలౌట నిజం / నిజం నిజం – ఇన్ని నాళ్ళు / నీ ఎంగిలి తాగినాను / ఈ మురికిని గ్రోలినాను అని తోడేలు మేకపిల్ల వాగ్వివాదం చేస్తుంది. జవాబుగా మేకపిల్ల ఇలా చెబుతుంది. లేదు లేదు చేయలేదు / అసలు నిజం ఏమంటే / ఆరు నెలల క్రితం నేను పుట్టనైన పుట్టలేదు. ”ఈ మాటలను విన్న తోడేలు ఎదురుతిరుగుతున్నావనే వంకతో మేకపిల్ల మీదికి దూకి చంపి తింటుంది. క్రూరత్వానికి అమాయకత్వం బలైన విధానం ఈ కథలో ఆచార్య ఇనాక్​కనులకు కట్టినట్లుగా చిత్రీకరించారు.

2.7 ఎద్దులు – సింహం : ఒక అడవిలో నాలుగు ఎద్దులు కలిసి మెలిసి ఒకే దగ్గర మేస్తూ ఉన్నాయి. ఎక్కడికైనా కలిసి వెళ్ళి ఆనందంగా బతుకుతున్నాయి. ఒకనాడు ఒక సింహం ఎద్దులను చూసింది. మేత లభించిందని సంతోషపడింది. సింహం రావడం గమనించిన ఎద్దులు కలిసికట్టుగా సింహంపై పడగానే సింహం పారిపోతుంది. కొంతకాలం తరువాత ఎద్దులు తమలో తాము పోట్లాడుకొని విడిపోయి, వేరు వేరు ప్రాంతాల్లో మేత మేస్తున్నాయి. ఈ విషయం గమనించిన సింహం ఒక్కొక్క ఎద్దును విడివిడిగా చంపి తిన్నది. సింహం ఎద్దులను తింటూ ఎంత ఆనందించిందో చూద్దాం.’ఇదే పండుగ ఇదే వేడుక / ఇదే పాడగ ఇదే ఆడగ / ఇదే సమయం ఇదే విజయం / ఇదే ఆకలి తీరు న్యాయం”.

 1. పాత్రల వ్యక్తిత్వం – ప్రయోక్త పరిచయం : ”మనిషి విలువ” సంగీత నృత్య రూపకంలో రచయితే ప్రయోక్త రూపంలో ధనవంతుని లక్షణాలను చెప్తాడు. కోట్లకు పడగలెత్తిన ధనవంతుడు పైసా దానం చేయకుండా సంపాదించిన తీరు ఈ నృత్యరూపకంలో తెలుస్తుంది. కేవలం మూడు పాత్రల ద్వారానే మనిషిలో పరివర్తన కలిగించే విధంగా సాగుతుందీ రూపకం. ”మాట తప్పని కుందేలు” రూపకంలో వ్యాఖ్యాత కవే. అన్న మాట తప్పని కుందేలు ఉపవాసం చేస్తుంది.మంటల్లో దూకుతుంది. ఈ ఇతివృత్తంలో ప్రధాన పాత్ర వ్యాఖ్యాత రూపంలో నడుస్తుంది. ”ఆడి తప్పని వాళ్ళు / అవనిలోన గొప్పవాళ్ళు / ఆడి తప్పని కుందేలు / చందమామలోన ఉంచి / సత్యమెంత సుందరమో / ధర్మమంత నిత్యశివం” అని ఆచార్య ఇనాక్​గారే ప్రధాన పాత్ర పోషిస్తారు. ”ఆవు – పులి” కథలో కథకురాలిని పరిచయం చేస్తాడు కవి. ఈ పుస్తక శీర్షిక ”అమ్మ” కాబట్టి ఈ ఎనిమిది రూపకాల్లో అమ్మ ప్రధాన పాత్ర పోషించే రూపకం ఇది. అమ్మ బాధ్యతలను గుర్తుచేస్తూ రాసినదీ రూపకం. అందుకే కథకురాలి వ్యాఖ్యానం ఈ రూపకంలో ఉంది. ఈ కథకురాలు కొలకలూరి భగీరథిగారు. కథ పాతదే. బాలల కోసం వెలువడింది. ఇందులో ఆవు మాటలను పరిశీలిస్తే ఆవు ఒక తల్లిగా తన బాధ్యతను నెరవేర్చిన విధానం అర్థం చేసుకోవచ్చు. ”పులిగారూ! పులిగారూ / నేనావును నీ ఆవును / నా బిడ్డకు పాలిచ్చి / నీ మేతగా వచ్చినాను / నేను అన్నమాట వల్ల / ఇదిగో తిరిగి వచ్చినాను / నన్ను కడుపునిండ తిని / నీ ఆకలి తీర్చుకో” అన్నపుడు క్రూరమృగమైన పులికి కూడ ఆవు మీద జాలి కలుగుతుంది. పులి ఆవు యొక్క నీతి, నిజాయితీకి ఆవును వదిలివేస్తుంది. ”అపాయం – ఉపాయం” రూపకంలో వ్యాఖ్యాత అడవి తీరుతెన్నులు వివరిస్తాడు. ప్రధానంగా పావురాలు, వేటగాడు పాత్ర పోషిస్తారు. పావురాల అమాయకత్వం, వేటగాని మోసం, పెద్ద పావురం గుర్తించి ఉపాయంలో పావురాలను రక్షిస్తుంది. నీతిని బోధించే పాత్ర పెద్ద పావురం రూపంలో చెప్పబడే ఇనాక్​గారిది.

”సింహం – ఎలుక” రూపంలో వ్యాఖ్యాత ఈ పాత్రల్లో ఉండే లక్షణాలను చెబుతాడు. సింహం అడవికే రాజు – ఆ రాజును చిన్న ఎలుక రక్షించిన విధానం ఆచార్య ఇనాక్​గారే ప్రయోక్త రూపంలో చెప్పాడు. ”మంచీ – చెడు రూపకంలో ఒక్కోపాత్ర ఔన్నత్యం ఒక్కోరకంగా కనబడుతుంది. చిలుక పిల్లలు చిన్నవే అయినా కూడ అమ్మ మాట జవదాటక గూటి నుండి బయటికి రాకుండా ఉన్నాయి. ప్రయోక్త మునీశ్వరుని రూపంలో కనిపిస్తాడు.”జాతి ఒకటి అయినంతనె / నీతి ఒకటి అవుతుందా?/ పుట్టుకొకటి కాగానే / బుద్దులొకటి అవుతాయా / కావుకావు అలా కావు” అంటూ మునీశ్వరుడు రాజుతో చెప్తాడు. ప్రయోక్త చెప్పిన మాటల్లో అలంకారికత కన్పిస్తుంది. మంచీ – చెడు రూపకంలో మర్రి చెట్టుపై చిలుకలు ఉండడం వల్ల ”మర్రి చెట్టుకు అందం పెరిగి మర్రి చెట్టు పచ్చలు పొదిగిన పతకంలాగాఉంద”ని రూపకాలంకార ప్రయోగం కన్పిస్తుంది.

”తోడేలు – మేకపిల్ల” రూపకంలో ఈ పాత్రలతో పాటు కథ చెప్పే ప్రయోక్త కూడ ఉన్నాడు. ఈ వ్యాఖ్యాతనే తన అమాయకపు మాటలతో మేకపిల్ల తోడేలు చేత మోసపోయిన విధానం చెప్తాడు. ”ఎద్దులు – సింహం” రూపకంలో మృగరాజైన సింహం పాత్రను కవే నిర్వహిస్తాడు. ఎడ్లలో ఐకమత్యం లోపించినపుడు సింహంకు వాటిని తినే అవకాశం దొరుకుతుంది. అపుడు మాత్రమే దర్పసారం అని సింహాన్ని సంబోధిస్తూ ”ఇదే పండుగ ఇదే వేడుక / ఇదే పాడగ ఇదే ఆడగ / ఇదే సమయం ఇదే విజయం / ఇదే ఆకలి తీరు న్యాయం” అని చెప్తారు ఆచార్య ఇనాక్​గారు. ఈ ”అమ్మ”ను పరిశీలించినపుడు ఏ రూపకానికారూపకంలోని పాత్రలు వేరు వేరుగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతీ పాత్ర ఒక వైవిధ్యభరితమైన ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తుంది. బాలలు పాత్రలకనుగుణంగా అభినయం చేస్తుంటే పాత కథలే అయినా మరొక్కసారి కనువిప్పు కలిగేలా ఉన్నాయి.

 1. వినూత్న పదాలు : వినూత్నపదాలు, పదబంధాలు, జాతీయాలు ”అమ్మ” సంగీత నృత్య రూపకాల్లో ఉన్నాయి. కవి కలం నుండి జాలువారిన వినూత్న పదాలు వైవిధ్యభరితంగా ఉన్నాయి. అద్భుతమైన పదసంపద ఈ కవిత్వంలో వచ్చి చేరింది. ఆ వినూత్న పదాలు కొన్ని: జాగర్తగ, తెలిగ, చద్దునమ్మ, పురాపుణ్యం, తొరగ తొరగ, వృకం, మకురు చూపు, భయం గియం, అమ్మలంత, గొంత, నసుగుడు, కాడ, మూల్గుడు, సణుగుడు, చంపట, చిటిపొటి, పుటుకు పుటుకు, తనిచ్చన, చలచల్ల, కరకర, చకచక, గట్టురట్టు, ఆవజీవాలు, చలికాగుత, ఇంటికాడ, కిటుకు పుటుకు, పుటుకు పుటుకు, ఇనుం, కుయ్యోకుయ్యో, మునుపటి, చుప్పనాతి, దర్పసారం, తెలితో, మాకలు, నడ. ఈ వినూత్న పదాలకు తోడు అక్కడక్కడ ”ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు” వంటి తెలుగు నుడికారాలున్నాయి.
 2. కవిత్వంలో లయాత్మకత – విశిష్టత : ఏ భాషలోనైన గేయమే ముందు పుట్టింది. ఆ తరువాతే పద్యం. ప్రజలు ఆనంద సమయాల్లో, కష్టనష్టాల్లో పాడిన పదం గేయమైంది. పాత వస్తువును కూడ అతినవ్యమని అనిపించగలిగే సత్తా పాటలోని వైవిధ్యం ద్వారా వస్తుంది. సందర్భోచితమైన పదప్రయోగం, శ్రోతల్ని / ప్రేక్షకుల్ని అలరించే లయాత్మకత ఆయా నాటికల్ని చిరస్మరణీయంగా నిలుపుతాయి. డాక్టర్​సి.నారాయణరెడ్డి, ఎస్వీ.భుజంగరాయశర్మ వంటి ఆధునిక కవుల గేయనాటికలు అత్యంత ప్రసిద్ధిని పొందడానికి కాలానుగుణమైన లయ గుణం ప్రధాన కారణం.

ఆధునిక గేయాలు ఎక్కువగా గతి ప్రధానమైనవి. అందుకే ఛందస్సులోని నాలుగు గతుల్లో ఏదో ఒక గతిననుసరించే గేయాలు సాగుతాయి. ఆచార్య ఇనాక్​గారి సంగీత నృత్యరూపకాలైన ”అమ్మ”లో చతురస్రాది గతులున్నాయి. చతురస్రాది గతులు కూడ కొద్ది భేదంతోనే ఏర్పడ్డాయి. ఆధునిక ఛందస్సు వాడుకునే కవులంతా గతులను అనుసరించి గేయాలు రాస్తున్నాయి. కాని, ఖచ్చితంగా ఈ రగడలోనే రాయాలనే ప్రాచీన కాలపు నియమాన్ని పాటించడంలేదు. గేయంలో గతులు, పాదాలు, మాత్రలు తప్పకుండా ఉంటున్నాయి. భావవ్యక్తీకరణను బట్టి నడకలో ఒక విధమైన వేగాన్ని పాటించడం గేయాల్లో సహజంగా జరుగుతుంది.

ఆధునిక కవిత్వంలోని ఛందస్సును పరిశీలించినపుడు గురజాడ అప్పారావుది ముత్యాలసరం. రాయప్రోలు సుబ్బారావు వాడిన ఛందస్సు రగడలు. అలాగే సినారె గేయాల్లోనూ రగడలు వైవిధ్యభరితంగా కనిపిస్తాయి. ఇట్లా దాశరథి, కాళోజీ నారాయణరావు, బోయిభీమన్న, విద్వాన్​విశ్వం, శ్రీశ్రీ, తిరుమల శ్రీనివాసాచార్య తదితర మహామహులెందరో ‘గేయకవిత్వం రాసిన ప్రముఖులుగా తెలుగు సాహితీరంగంలో ఉన్నారు. అలాగే బాలగేయ సాహిత్యమూ వెలువడింది. ప్రత్యేకించి గేయరచన న్యాపతి రాఘవరావు, బి.వి.నరసింహరావు, మిరియాల, డా. గంగప్ప, మాల్యశ్రీ రాసారు.ఆచార్య ఇనాక్​గారు కూడ ”అమ్మ” సంగీత నృత్యరూపకాలను సందర్భోచిత గతులతో నడిపించారు.”మనిషి విలువ” రూపకంలో ఆచార్య ఇనాక్​గారే ప్రయోక్త రూపంలో పిసినారి ధనవంతుని ప్రవర్తనలో మార్పు తెస్తాడు. ఆ సందర్భంలోని గేయాన్ని పరిశీలిద్దాం. ఇందులో మాత్ర గణ విభజన సూచించడం జరిగింది.

”వచ్చిన ముని వెళ్ళినాడు / ఇచ్చిన చూపుంచినాడు / ధనవంతుడు సంతసించి / దానమంత చేసినాడు / వెంట తీసుకెళ్ళలేని / ధనం జనం సొత్తు చేసి / మంచి పేరు తెచ్చుకొన్న / ధనవంతుడు బలవంతుడు / ధనం కూడబెట్టి బాధ / తలకు చుట్టుకొన్న తాను / ధర్మమంత చేసి వేసి / సుఖం బ్రతుకు గడిపినాడు / ధనం పోగు పోసుకొన్న / మనిషికేమి విలువ లేదు / ధనం ప్రజలకిచ్చినట్టి / మనిషికెంతొ విలువ వుంది. ” ఈ గేయంలో గతి త్య్రస్రగతి. పాదానికి నాలుగు చొప్పున మూడు మాత్రల గణాలున్నాయి. రగడలో హయప్రచార రగడ కన్పిస్తుంది. ఆధునిక గేయ ఛందస్సులో యతి, ప్రాసలు అనియతములు. అందులో ప్రాస మరింత అనియతం. ఈ కారణం వల్ల పాదములు సరిసంఖ్యలో ఉండాలనే నియమం కూడా పోయింది. కొన్నిసార్లు యతి, ప్రాసలున్నాకూడ పాటించవచ్చు.పాటించకపోవచ్చు. కాని, ఆచార్య ఇనాక్​గారి కవిత్వంలో యతి, ప్రాసతో కూడిన కవిత్వమే కనిపిస్తుంది. అవి బాల బాలికలు ఆడడానికి, పాడడానికి అనుగుణంగా ఉన్నాయి. నిర్ధిష్టమైన లయబద్ధత ఈ కవిత్వంలో చూస్తాం.

”మాట తప్పని కుందేలు” రూపకంలో ముసలి తాత రూపంలో వచ్చిన చందమామ నుద్దేశించి చెప్పిన మాటలు ఇవి.

  I  I   I     U  I      I  I  I        U  I        U   I   U   I       U  I        U  I

”ముసలి తాత – ఎవరొ – కాదు – చందమామ – చంద – మామ

I  I   I       U  I      I  I  I       U  I       U  I      U  I       U  I      U  I

ముసలి – తాత – ఎవరొ – కాదు – చల్ల – నయ్య – తెల్ల – నయ్య”

త్య్రస్య గతిలో హయ ప్రచార పూర్ణ రగడ రూపంలోసాగుతుందీ గేయం.

”అపాయం – ఉపాయం” రూపకంలో వేటగాణ్ణి ఉద్దేశించి చెప్పిన గేయం”ఉరులు తగిలీ ముడులు చిక్కీ / పావురాలిటు కూలబడితే / ముట్ట బెట్టగ వలను లాగుతు / వేటగాడు వస్తున్నాడు” హరిణ గతి మిశ్ర రగడ. (3+4) (3+4) – (7) మాత్రలతో ప్రతీ పాదము సాగుతుంది.”సింహం – ఎలుక” రూపకంలో చిట్టెలుక సింహంపై ఎక్కి వీర విహారం చేస్తుంది. నిద్రాభంగమైన సింహం ఎలుకను చంపేయాలనుకుంటుంది. ఆ సమయంలో ఎలుక తనని తాను నిందించుకున్న విధానమిది. ”తెలివి – మాలి – వచ్చి – నాను / బుద్ధి – లేక – తిరిగి – నాను / తప్పు – తెలుసు – కొన్న – నాకు / తమరు – బతుకు – నీయ – లేర?” హయప్రచార పూర్ణరగడలో గేయం సాగుతుంది. సులభంగా, సరళంగా సాగుతుందీ గేయం.”మంచి – చెడు” రూపకంలో త్య్రస్రగతి, చతురస్రగతి, మిశ్రగతులున్నాయి. మచ్చుకొకటి చూద్దాం. ”అటెగిరిందీ ఇటెగిరిందీ / చుట్టు పక్కల చూచి అరచింది / పట్టరాని దుఃఖమొచ్చీ / నిట్ట నిలువున కూలిపోయింది” ఇది హరిణగతి పూర్ణరగడ. ఈ రగడ మిశ్రగతిలో నడుస్తుంది. ”తల్లి లేని పిల్ల నేను / దిక్కు లేని పక్షి నేను / అమ్మ గూటి నుంచి నేను / అన్యయమే అయ్యినాను / నన్ను పెంచి పెద్ద చేసి / పుణ్యమెంతో పొందు దేవ” ఈ గేయం త్య్రత్రగతి హయప్రచార రగడ రూపంలో ఉంది. ”తోడేలు – మేకపిల్ల” రూపకంలో త్య్రస్రగతి, చతురస్రగతి, ఖండ, మిశ్రగతులున్నాయి. ఉదాహరణ చూద్దాం. ”నీరేమో మురికాయెను / కొలనేమో పాడాయెను /నీవు పాడు చేయకుంటే / నీ అమ్మే చేసెనేమొ. ”ఇది చతురస్ర మధుర గతి, పూర్ణ రగడ.

ఈ విధంగా రగడ భేదాలన్నీ భావపరంపరను అనుసరించి, సందర్భానుసారంగా, బాలలకు అనుగుణంగా ఇనాక్​గారు ఉపయోగించారు. రగడ భేదాలతో రాయబడిన తొలికావ్యం విశ్వనాథ సత్యనారాయణగారి కిన్నెరసాని పాటలు. ఇందులో రగడలు గానం చేయడానికి అనుగుణంగా రాయబడ్డవి.కావ్యానుసారంగానే రగడలున్నాయి. ఇందులో ఎనిమిది భాగాల్లోని మొదటిదైన ”కిన్నెర పుట్టుక”లో పూర్ణ హయ ప్రచార రగడ, ఆరవదైన ”కిన్నెర దుఃఖం”లో అసమ మధురగతి మిగిలిన కిన్నెర నడకలు, నృత్యం, సంగీతం, కడలిపొంగు, గోదావరీ సంగమం, కిన్నెర వైభవంతో అసమద్విరద గతులు ప్రయోగించబడ్డాయి. ఈ ప్రయోగాలను బట్టి ఆచార్య ఇనాక్​గారు విశ్వనాథ సత్యనారాయణ నడతలో వెళ్ళారని అన్పిస్తుంది. ”అమ్మ”లోని ”సింహమూ – ఎలుక’లో త్య్రస్రగతి హయప్రచార రగడ. ”మనిషి విలువ”లో హయప్రచార రగడ, మాట తప్పని కుందేలు, ఆవు – పులి, అపాయం – ఉపాయం, మంచీ – చెడు, తోడేలు మేకపిల్ల, ఎద్దులు – సింహం రూపకాల్లో త్య్రస్ర, చతురస్ర, మిశ్రగతి రగడలున్నాయి.

అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి ”కిన్నెరసాని పాటల”లోని కిన్నెర నడకలను పరిశీలిద్దాం. ”కరిగింది కరిగింది / కరిగింది కరిగింది / కరిగి కిన్నెరసారి వరదలై పారింది / తరుణి కిన్నెరసాని తరల్లు కట్టింది / పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది”. ”కరగగా కరగగా / కొంత కిన్నెరసాని / తరగ చాలు మధ్య తళతళా మెరిసింది / నురుసు పిండులతోడ బిరబిరా నడిచింది / ఇసుక నేలలపైన బుస బుసా పొంగింది”. ”వొయ్యారి నడకలతో / వచ్చు కిన్నెరసాని / వన దేవతలు పూలుపై క్రుమ్మరించారు / భూ దేవతలు ఎదురుపోయి దీవించారు / వాయుదేవతలు రమ్మని పాట పాడారు”.

కవి, విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్​గారి ”అమ్మ”లోని రగడలిలా ఉన్నాయి.’ ‘తెలివి మాలి వచ్చినాను / బుద్ధి లేక తిరిగినాను / తప్పు తెలుసుకొన్న నాకు / తమరు బతుకు నీయలేర?”. ”ఉరులు తగిలీ ముడులు చిక్కీ /  పావురాలిటు కూలబడితే /  ముట్ట బెట్టగ వలను లాగుతు / వేటగాడు వస్తున్నాడు.”

 1. గేయనాటికల సందేశం : ఏదైనా సాహిత్యరూపం కవి సృష్టించాలనుకున్నపుడు వస్తువు ఎంచుకుంటాడు. లక్షిత వర్గం ఆలోచనాస్థాయికి, అవగాహనా స్థితికి తగ్గట్టుగానే ఆ రచనను వినిర్మించాలి. ప్రస్తుత గేయ నృత్య రూపకాలు ఈ సూత్రానికి చక్కని ప్రతిబింబంగా ఉన్నాయి. బాల సాహిత్య రూప విశిష్టత ఈ రూపకాల్లో అడుగడుగునా కనబడుతోంది. నిజమే, ఇందులో సంపూర్ణమైన సందేశాత్మక వైఖరి ఉంది. స్థూలంగా చూస్తే సందేశమే వస్తువు. ఇందులోని కథలు ఆలంకారిక భాషలో చెబితే ప్రఖ్యాతాలే. అంటే అందరికీ బాగా తెలిసినవే. కాని, వాటికి నూతన రూపాన్నివ్వడంలో కవి సృజనప్రజ్ఞ ప్రస్ఫుటమవుతుంది. బాలికలకు అందించవలసిన నీతిని, అందించవలసిన రీతిని నృత్యరూపకాల్లో చూడొచ్చు. ప్రపంచీకరణ పర్యవసానంలో సామూహిక జీవన వీణల నైతిక తంత్రులు తెలియకుండానే తెగిపోతున్న నేపథ్యంలో వాటిని సరిచేసి శ్రుతి కలపాల్సిన బాధ్యత సాహిత్యంపై ఉంది. పసిప్రాయంలోనే మానవీయ వ్యక్తిత్వ మూల్యాల అంకురాల్ని చల్లవలసిన బాధ్యత సాహిత్యకారులదే. ఈ బాధ్యతను ఆచార్య ఇనాక్​వంటివారు సమర్థవంతంగా నిర్వహించారనడానికి నిదర్శనం ”అమ్మ”.

ఆధార గ్రంథాలు:

 1. చెన్నకేశవరెడ్డి జి. డా.- ఆధునికాంధ్ర గేయ కవిత్వం.
 2. మిరియాల రామకృష్ణ – గేయ కవితా ప్రస్థానం – పుట – 61 – మహతి – 1972
 3. రామరాజు బిరుదురాజు; డా. – జానపద గేయ సాహిత్యం
 4. బుద్ధ ప్రసాద్​మండలి; సం. – తెలుగు పసిడి; కృష్ణా జిల్లా రచయితల సంఘం – విజయవాడ; 2006
 5. వెంకటప్పయ్య వెలగా; సం. – పిల్లల జానపద గేయ సర్వస్వం.
 6. సంపత్కుమారాచార్య. కోవెల; డా. – తెలుగు ఛందో వికాసం – తెలుగు అకాడమి – 1990.
 7. శ్రీనివాసాచార్య తిరుమల; డా. – తెలుగులో గేయ నాటికలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.