యుద్ధం ఒక గుండె కోత-5

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

మనిషికీ మనిషికీ మధ్య

మతం కత్తులవంతెన నిర్మిస్తోంది

ఆత్మీయంగా హృదయాల్ని పెనవేసుకునే

స్నేహాలింగనాల్ని మర్చిపోతున్నాం

మనసును మైమరిపింపజేయాల్సిన

వెన్నెల రాత్రులలో సైతం

యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది

ఇకపై జీవన యానమంతా

ఎర్రని క్రోధాగ్నులతో కాలే

ఎడారి భూములు మీదనేనేమో

మనసు తెరచి అభిప్రాయ ప్రకటన చేయటానికి

అనుమానం బురఖాలో

ముఖాన్ని దాచుకోవాల్సిన పరిస్థితి!

జనాలమధ్య అంతరం

అగాధంగా మారిపోతున్న దుస్థితి!

ప్రశాంత సాగరాన్ని కల్లోలపరుస్తోన్న

మరిగే బడబానలం ప్రతి గుండెలో –

కడుపులో ఆందోళనా వాయుగుండాలు –

కనుకొలకుల్లోంచి భావప్రకంపనలు

ఎక్కడ కన్నీరై జారిపోతాయోనని

అందరం ఒకే మాదిరి నల్లద్దాలు ధరించేస్తాం

నిజానికి

అందరం రాజకీయ పరిస్థితుల్ని

కాలక్షేపం బఠాణీల్ని చేసి

నోట్లోనుండి చెవుల్లోకి ఎగరేస్తూనే ఉంటాం

చెప్తున్న మాటలకి

గుండెలో అభిప్రాయ ప్రతిబింబం ఉండదు

కెలిడోస్కోపులోలాగ మాటలు గింగిరాలు తిరుగుతూ

చిత్రవిచిత్ర రూపాల్ని సంతరించుకుంటూనే ఉంటాయ్‌

మాటలో భయం ప్రకంపిస్తూ ఉంటుంది

మనం మనలాగ బతకటం మర్చిపోతుంటాం

మతంవైపు ముఖం తిప్పాలో

ఆధిపత్యానికి చెయ్యి అందించాలో

అర్థంకాని అయోమయంలో మునిగిపోతూ ఉంటాం

గుండె మానవత్వాన్ని కొట్టుకుంటూ

మనసులోకి లాక్కొస్తూనే ఉంటుంది

మాటమాత్రం పంటికింద నలిగి

నాలుక అడుగున దాగిపోతుంది

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత)”

  1. యుద్ధం గురించి చక్కని దీర్ఘ కవిత రాసారు.. మనం మనలాగా బ్రతకడం మర్చిపోతువుంటాం… మతం మనుషుల మధ్య కత్తుల వంతెన కడుతుంది…అంత రంగ యుద్ధం….. మనసే యుధ్ధ క్షేత్రం

Leave a Reply

Your email address will not be published.