డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు

అత్యాధునిక తెలుగు సాహిత్యంవస్తురూప పరిణామం (2000-2020)

నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం

-డా. గడ్డం శ్యామల

అత్యాధునిక తెలుగు సాహిత్యంలో సదస్సు (సెమినార్‌) అంటే పెద్ద సాహసమే. సాహిత్య వృక్షం, కొమ్మలు, రెమ్మలు, పూవులు, కాయలు, పళ్ళతో విస్తరిస్తున్న సమయం 2000-2020. ఒక విధంగా చెప్పాంటే 1980 వరకు వచ్చిన తెలుగు సాహిత్యం ఒక ఎత్తు – 80 తరువాత వచ్చిన సాహిత్యం మరొక యెత్తు.

2000-2020 మధ్య వెలువడిన సాహిత్యం సముద్రం. అందులో రత్నాలు ఉంటాయి. రాళ్ళూ ఉంటాయి, ఉన్నాయి కూడా. అనేక ప్రక్రియు శాఖోపశాఖలుగా విస్తరిల్లి సమాజ స్థితిగతులను, మార్పులను తనలో కలుపుకుంది సాహిత్యం.

నవలా సాహిత్యం తీసుకున్నట్లయితే, అన్ని ప్రక్రియలతో పోలిస్తే, అంటే కథ, వచన కవిత్వం, పద్య కవిత్వం, చిన్న ప్రక్రియలతో చూస్తే నవలా ప్రక్రియ తన పరుగును ఆపిందనే చెప్పాలి. 1960, 70, 80 దశకాల్లో రారాజైన నవలా సాహిత్యం 2000 తరువాత మెల్లగా తన పయనం సాగించింది. ప్రపంచమే కుగ్రామమై అరచేతిలో కన్పిస్తున్న సమయంలో బస్సులో ప్రయాణిస్తూనో, వేరే పని చేసుకుంటూనో, సాహిత్యాన్ని చదివే ఈ వేగవంతమైన కాలం నవలకు పరీక్షా కాలం.

అయినా ఇప్పటికీ మంచి నవలలు రాసే రచయితలు, రచయిత్రులు ఎంతో మంది ఉన్నారు. వారపత్రికలు జోరు కూడా తగ్గినా అంతర్జాలం మాధ్యమంగా, మరికొన్ని ప్రసిద్ధ వారపత్రికలు, నవ్య, స్వాతి వంటివి నవలా సాహిత్యానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి.

అలా నవలలు రాసే రచయితలలో అత్యాధునిక నవలా రచయిత డా॥ ప్రభాకర్‌ జైనీ గారు. కేవలం నవలా రచయిత మాత్రమే కాదు, కవి, కథారచయిత, సినీదర్శకులు, డైలాగ్‌ & స్క్రీన్‌ప్లే రచయిత. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, నవ్య మొదలైన వారపత్రికలు వీరి నవలలు సీరియల్సుగా ప్రచురించాయి. వారు రాసిన అన్నింటినీ చెప్పలేను గానీ, 2018, 2019, 2020ల్లో వరుసగా సినీవాలీ, లాకర్‌ నెం.369, నిఘా, హీరో సీరియల్సుగా వచ్చి, నవలలుగా రూపుదిద్దుకున్నాయి.

తాను రాసే అన్ని విషయాలపైన అపారమైన జ్ఞానమూ, నవల నడిపించే తీరు, భాషా పరిజ్ఞానం, చదివింపచేసే నైపుణ్యం వీరి నవలల్లో పుష్కలంగా ఉన్నాయి.

1966లో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళు నవల తరువాత 40 సం॥ కాలంలో సినిమాను వస్తువుగా చేసుకుని రాసిన రచయితలు ఒకరో, ఇద్దరో. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని జైనీ సినీవాలీఅద్భుతమైన నవల రాసారు. వాస్తవికత ప్రధానంగా చేసుకొని రాసిన నవల. కథతో మాత్రమే కలసిపోకుండా అవసరమైన చోట్ల వివిధ దేశాల్లో జరిగే సినీ ఉత్సవాల గురించీ, ఇంకా అనేక విషయాల గురించీ సందర్భానుసారంగా చెప్పారు. అద్భుత నవలా శిల్పంతో సినీవాలి నవలా రచన చేశారు. ప్రపంచీకరణ నేపధ్యంగా దేశ విదేశా సమాచారాన్ని తెలియచేశారు. సినీవాలీ అంటే అమావాస్యనాటి తెల్లవారుఝామున కనిపించే గోరంత వెలుగు. పార్వతీదేవి అనికూడా అర్థం ఉంది. సినిమా రంగం అనే చీకటి సామ్రాజ్యంలో కూడా శ్రమజీవికి తొలిపొద్దు కన్పిస్తుంది అని భావస్ఫోరకమైన నవలా నామం పెట్టారు జైనీ.

జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసే ప్రతిభావంతుడు జైనీ.

ఇప్పుడు నేను చర్చించబోయే నవలా (నాయికలు) స్త్రీపాత్రలు.

నవలపేరు హీరో’ (21వ శతాబ్దపు పాకుడురాళ్ళు) ఇది రచయిత నవలకు పెట్టిన పేరు. రావూరివారు పాకుడురాళ్ళు నవ రాసి దాదాపు 55 సం॥లు అయింది. ఆ నవలలోనే నవలా నాయిక మంజరి సినీమాయా జగత్తులో ఎన్ని ఉత్థానపతనాలు చూసిందో, చివరికి ఆమె జీవితం ఎలా విషాదాంతమయిందో చెప్తాడు.

ఇక్కడ జైనీ హీరో నవలలో అదే సినీమాయా జగత్తులో, అలుపెరుగని పయనంతో నింగినంటే కీర్తినెలా సంపాదించాలో, నిజాయితీగా ఉంటూ, తన మార్గాన్ని గెలుపు తీరాలకు ఎలా చేర్చాలో చెప్పే నవల ఇది.

పట్టుదల, కృషి, నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెట్టుబడిగా పెట్టి ఆ రంగంలో కూడా ఎలా విజయం సాధించవచ్చో చెప్పే నవల ఇది.

హీరో చందు పుట్టుక హీనమైనా, తన వ్యక్తిత్వంతో, పరిశ్రమతో, సినీపరిశ్రమలో ఎలా ఎదిగి నెం.1 స్థాయికి చేరుకుని హీరోగా ఛాండి పేరుతో ఎలా చలామణి అయ్యాడో తెలియచేస్తుందీ నవల.

అసలు విషయానికి వస్తే ఏ నవలలో అయినా జైనీ సృష్టించే స్త్రీపాత్రలు ఔచిత్యవంతంగా ఉంటాయి. ఈ నవలలో కూడా ఐదు బలమైన స్త్రీపాత్రలు ఉంటాయి. 1. హీరో తల్లి, 2. జలజ, 3. కుసుమ, 4. రవళి, 5. పుష్పాకిరణ్‌.

60, 70ల్లో వచ్చిన నవలల్లో స్త్రీపాత్రలతో పోలిస్తే, ఈ నాటి నవలల్లో, ముఖ్యంగా జైనీ నవలల్లో స్త్రీ ఒకపక్క ఎన్ని ఇబ్బందుకు గురవుతున్నా, మరోపక్క అన్ని రంగాలలో నిరూపించుకుంటూనే ఉన్నది. లక్ష్యం దిశగా సాగిపోతున్నది. వస్తువు ఒకటిగా అనిపించినా ప్రపంచీకరణ నేపధ్యంలో రూపాన్ని మార్చుకుని విదేశాల్లో చదువుతో పాటు ఉద్యోగాలను చేస్తూ, వివిధ రంగాలో తమ ప్రతిభను తెలియచేస్తున్నారు.

హీరోతల్లి : ఈమె అమాయకురాలు. కానీ గుప్పెడంత మనసులో కొండంత ప్రేమ కొడుకుపైనే కాదు, తనతో అనుబంధమున్న ప్రతి ఒక్కరిపైన ప్రేమజల్లు కురిపిస్తుంటుంది. అందుకే హీరో చందూ అనుకుంటుంటాడు ‘‘అమ్మ నాకెప్పుడూ అద్భుతంగా తోస్తుంది’’ అని. చందూ తన జీవన యానంలో ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి తన సంపూర్ణ మద్దతునిస్తుంది. తన కొడుకు వ్యక్తిత్వంపై తనకున్న నమ్మకం అది. తక్కువగా మాట్లాడినా, మాట్లాడిన ప్రతిమాటా విచక్షణగా, ఉత్సాహం నింపేదిగా ఉంటుంది. ‘‘నువ్వు పోరాట యోధుడివిరా!… ఈ సినిమా రంగపు కుళ్ళు నుంచే జన్మించి ఈ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగావు’’ అంటూ శ్రీశ్రీ కవితను కూడా కోట్‌ చేయడంతో అమ్మలో తనకు తెలియని కొత్తకోణాన్ని చూస్తాడు హీరో అంటూ నవలా ప్రారంభంలోనే సినీరంగంలో నెం.1 గా ఉన్న తన కొడుకు రాజకీయ రంగప్రవేశం చేస్తానన్నప్పుడు అతన్ని ఉత్సాహపరుస్తుంది. ఆమె గత జీవితం చేదు మాత్రల్లే దగాపడ్డ జీవితం, అవమానాల గాయాలు ఆమె మనసులో పిల్లనగ్రోవిలో రంధ్రాల్లా ఉన్నా, చివరి జీవితం తన కొడుకు వలన, తనను ఆదరించిన సనీరంగంలోనే ఉన్న మంచి మనుషుల వలన మోహనరాగంగా పరిమళించింది. అయినా అప్పుడప్పుడూ ఆమె నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంటుంది. మామూలు మహిళ, అమాయకురాలు అనుకున్న హీరో తల్లి అపరకాళీ అవుతుంది.

దేవికారెడ్డి అనే BBC News Channel జర్నలిస్టు. ఆమెకి చందూ తన గతాన్ని చెప్పే సమయంలో తాను కూడా తెలియని చీకటి నీడు అమ్మ జీవితంలో ఎలా కమ్ముకున్నాయో తనంతట తానుగా దేవికతో చెప్తున్నప్పుడు విన్నాడు. ఇలాంటి చరిత్రలు రాబోయే తరానికి పాఠాలు కావాలి. మనం నడచిన దారులు, అపసవ్యమైనా, సాహస ప్రయాణానికి దైవానుగ్రహం తోడై ఎలా విజయాన్ని సాధించామో చెప్పాల్సిన అవసరముంటుంది. అదే ఈ పాత్రద్వారా సమాజానికి తెలియచేసిన సందేశం.

ఆమె పుట్టగానే మహలక్ష్మి పుట్టిందని ఊరు ఊరంతా విందుసందడి చేసిన గొప్ప ఆస్తిపరుల కుటుంబం వారిది. విధి వక్రించి, తండ్రిని పోగొట్టుకొని, అమాయకురాలైన అమ్మను మోసగించి బంధువులే ఆస్తి దోచేసారు. ఈమెకు 10 సం॥ వయసుకి అమ్మ కూడా చనిపోయి అనాథగా మిగిలింది (అన్నదమ్మున్నా స్వార్థపరుయ్యారు). సమాజంలో విలువలు నశించాయి. చదువులేని ఆమె సినిమాల్లో నటించడానికి తనంతట తానుగా ఒక అడ్రస్‌ పట్టుకొని హైద్రాబాదు నగరంలో దిగింది. ఒక పోలీసు సాయంతో ఆ అడ్రస్‌ ఉన్న అతని ఇంటివద్ద దిగింది. అక్కడినుండి కిషన్‌ ద్వారా ఆమె అందం ఆమెకు శాపంగా మారి ఒక హీరో వశమైంది. ఆ తరువాత దగాపడిన జీవితమై గర్భవతిగా మారి అనాథగా మారి రోడ్డుపైన ఉంటే, దయగల దంపతులు తీసుకువెళ్ళి ఆమెని కాపాడి, హాస్పిటల్‌లో చేర్చగా, డాక్టర్‌ ‘‘పుట్టబోయే వాడు ప్రపంచాన్ని ఏలతాడు’’ అన్న మాట విని బ్రతుకుపై ఆశ చిగిర్చి ఆ పుణ్యదంపతుల నీడన తను, కొడుకు బ్రతికారు. తన గతాన్ని చెప్తున్నప్పుడు ఆవేశం, బాధ కలిసిన నిర్వేదం కలిగిన ఆమెని చూసి దేవిక, చందూ సజలనేత్రుయ్యారు. అందుకే ఆమెకు సమాజంపై, సినీ పరిశ్రమపై ఒక రకమైన కసి. కానీ, తన కొడుకే ప్రపంచాన్ని శాసించే స్థాయికి రావడం, తనపై అత్యంత ప్రేమాభిమాన, గౌరవాలు కలిగి ఉండడం ఆమెను సంతృప్తి పరిచింది. ఈ విజయానికి సాయపడిన రెడ్డిగారిని అతని భార్యను, చందూకి సాయం చేసిన జలజను, చందూకి సెక్రెటరీగా పనిచేసిన కుసుమను వీరందరిపై కృతజ్ఞతాభావంతో, ప్రేమతో ఉంటుంది. నవల మొత్తంమీద హీరోతల్లి ఎవరిపట్లా కోపాన్ని ప్రదర్శించలేదు. తనలో తానే అగ్నిగోళమయింది. ఎవరినీ పల్లెత్తు కఠినమైన మాట అనలేదు. అమాయకురాలు, సున్నిత హృదయురాలు, కృతజ్ఞతాభావం కలది.

ఇంత ప్రధానమైన పాత్రకి రచయిత పేరుపెట్టలేదు. అగస్త్యభ్రాతగా, నిగమశర్మ అక్కలా ఈమె అనామికగానే ఉండిపోయింది. తెనాలి నిగమశర్మ అక్కపాత్ర ఎంత ముఖ్యమో, అలాగే ఈ పాత్రకూడా. స్త్రీపాత్ర నిర్వహణలో జైనీది అందెవేసిన చేయి. 20, 25 పేజీ వరకూ హీరోతల్లి పాత్ర నవలనల్లుకుని ఉంటుంది. ఆమె లేకపోతే హీరో ఛాండీ లేడు.

కళామతల్లిగా కీర్తించబడుతున్న సినీపరిశ్రమ గంగానది వంటిదైనా అందులో పేరుకుపోయిన చెత్తలా మట్టిలా మురికి కూపం కూడా ఉంటుందనే వాస్తవాలు ఈ పాత్రద్వారా చెప్పారు. నేటి సమాజం దిగజారుడు విలువలను బట్టబయలు చేశారు.

జలజ : ఈమె చందూకి దేవుడిచ్చిన అక్క. నిజంగా స్వచ్ఛమైన నీటిలో నుండి పుట్టిన తామర వంటిదే. స్వచ్ఛమైన మనస్సు. ఏ ప్రతిఫలమూ ఆశించకుండా చందూకి ఆర్థిక సహాయం చేసి, అతని జీవితాన్ని నిబెట్టిన వ్యక్తి. దానికి చందూ మాట్లాడిన మాటలే సాక్ష్యాలు – ‘‘ఈనాటి ఈ స్థితి నువ్వు పెట్టిన భిక్షే కదా! మనవాళ్ళను నేను ఎలా మర్చిపోతాను.’’ అంటాడు చందూ. కష్టసమయంలో ఒకరి దగ్గరినుండి సాయం తీసుకున్నా, బాగా పేరు తెచ్చుకున్నాక సాయం చేసిన వ్యక్తిని మర్చిపోవడం నేటి సమాజ నీతి. కానీ చందూ అలా కాకుండా ఎప్పటికీ జలజను అక్కగా గౌరవిస్తాడు. ‘‘ఏకాకిగా ఉన్నప్పుడు, నిరాధారంగా ఉన్నప్పుడు చేసిన సాయానికి విలువ కట్టలేను’’ అంటాడు. చందూ నెం.1గా ఎదిగినతర్వాత కూడా తనను మర్చిపోకుండా, గృహప్రవేశంలో కూడా ఇంటి ఆడపడుచులా గౌరవించాడంటే జలజ మనోనైర్మల్యం, సుహృద్భావం, ఆపదలో ఎవరినైనా ఆదుకునే గుణం కన్పిస్తాయి.

డా॥ జైనీ ఈ నవలలో ఒక్కొక్క స్త్రీపాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దారు.

ఈమెను నవల మధ్యలో పరిచయం చేస్తారు రచయిత. పేరు ఎంత విలక్షణంగా ఉందో మనిషి కూడా అంతే విలక్షణమైనది. నోరెత్తనివ్వని చాతుర్యం, అన్నింటికంటే మానవతా విలువలున్న వ్యక్తి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఇంటి బాధ్యతలన్నీ తానే స్వయంగా చూసుకునే సాధారణ గృహిణిలాగే ఉండే ఆమె ప్రవర్తన స్త్రీల హక్కుల కోసం పోరాడే ఫెమినిస్టు అని పేరు జలజకు. అయినా గృహిణిగా సకల బాధ్యతలను ఆనందంగా స్వీకరించే ఆమెని చూసి ఆనందపడతాడు చందూ. ఫెమినిస్టు అనగానే భర్తనీ, పిల్లల్నీ వదిలేసి రోడ్లమీద తిరుగుతూ, హక్కులకోసం పోరాటం చేసే వ్యక్తిగా సమాజంలోని వ్యక్తుల అభిప్రాయం. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ ఇంటిని చూసుకుంటూ, ఉద్యోగం చేస్తున్న జలజలాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఈ అభిప్రాయాలను సమాజంలోకి పంపించాలని డా॥ జైనీగారు జలజ పాత్ర ద్వారా చెప్పిస్తారు.  ఇలా మొదటినుండి చివరివరకూ జలజ పాత్ర సాధారణ గృహిణిగా, సహాయం చేసే వ్యక్తిగా, చైతన్యవంతమైన పాత్రగా మన ముందు నిలబెడతారు రచయిత.

కుసుమ : నవలలో మరొక ప్రధాన స్త్రీపాత్ర కుసుమ. నవల ఆద్యంతమూ దాదాపు ఈ పాత్ర కలిగిన సన్నివేశాలు, పాత్ర ప్రాధాన్యమూ ఉంటాయి. బాగా ఆస్తిపరులే కుసుమా వాళ్ళు. ISB లో చదివి చందూ దగ్గర పి.ఏగా పనిచేస్తుంది. చాలా తెలివి కలది. సినీ ఇండస్త్రీలో ఎవరిని ఎలా మేనేజ్‌ చెయ్యాలో తెలుసు. నిరంతరం హీరో కనుసన్నల్లో మెలుగుతూ, పేమెంట్‌ విషయాలు, లావాదేవీలు అన్నీ చూసుకుంటుంది. ఒక విధంగా చందూకి కుడి భుజం. కుసుమ ISB లో ఉన్నప్పుడే ప్రసన్న అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎంత తెలివితేటలున్న అమ్మాయైనా తనవరకు కష్టం వచ్చినప్పుడు విలవిల్లాడుతుంది. హీరో చందూ సినీ పరిశ్రమలో ఎదగడం ఓర్వలేని మనుషలు చందూకోసం బొంబాయిలో ఉన్న కుసుమ ఫియాన్సీని కిడ్నాప్‌ చేస్తారు దుండగులు. కుసుమ గుండె కన్నీరైపోతుంది. వెంటనే చందూకి చెప్పగా దేనికోసం ప్రసన్నను కిడ్నాప్‌ చేసారో తెలియని చందూ పుష్పాకిరణ్‌ IPS సహాయంతో ఆ రహస్యాన్ని ఛేదించి, ప్రసన్నని విడిపించి, కుసుమకు అప్పగిస్తాడు. ఇంతా జరిగింది తనగురించేనని తెలిసి చాలా బాధపడతాడు.

చందు ఛాండీగా మారి హీరోగా నెం.1 స్థానాన్ని పొందిన తరువాత, తనకంటూ ఒక ఇల్లు ఉండాని ఒక పెద్ద మహల్‌ లాంటి ఇంటిని కట్టిస్తాడు. ఆ సందర్భంలో కూడా కుసుమ ఎంతో శ్రమకోర్చి, తన పనితోపాటు ఇంటిపనులు కూడా చూసుకుని, దానికి తగిన ఆర్థిక విషయాలను బేరీజు వేసుకునే సహనశీలిగా ఉంటుంది కుసుమ.

స్త్రీలు శారీరకంగా పురుషుకంటే కొంత బలహీనులేమో గానీ, తెలివి, ధైర్యం, సహనం వీటన్నింటిలో వారికంటే బలవంతునే విషయాలను డా॥ జైనీ కుసుమ పాత్ర ద్వారా, మిగిలిన స్త్రీపాత్రల ద్వారా తెలియచేస్తారు.

రవళి : అందమైన కుసుమకోమమైన నాయిక రవళి. ఛాండీ కలలరాణి. మొదటిసారిగా ఛాండీ నటించే సినిమాలో పాట పాడడానికి వచ్చినప్పుడు దర్శకుడు ఛాండీతోపాటు రవళిని పాడమని చెప్పాడు. మొదటిసారిగా రవళిని చూసి, తన మనసునర్పించుకున్నాడు హీరో. హీరోగా ఎన్నో వందల మంది స్త్రీలను చూసిన, తాకిన అనుభవమున్న హీరోకు ఈమె దేవకన్యలాగా కనబడింది. అంతకుముందు గాయత్రి అనే హీరోయిన్‌ని ఆరాధించినా, ఆమె ప్రవర్తనకు ఆమెకు దూరంగా ఉన్నాడు. కుసుమను చెల్లలి లాగా, జలజను అక్కలాగా భావిస్తాడు.

రవళి కూడా కష్టా కడలిని దాటి వచ్చిన స్త్రీ అని గ్రహిస్తాడు. చందూ వాళ్ళ అమ్మలాగే రవళి తల్లి కూడా సినిమావాళ్ళచే మోసగింపబడి, వేధించబడింది. ఇంటి ఓనరు ఇబ్బంది పెడుతున్న సమయంలో అనుకోకుండా వారి ఫ్లాట్‌కి హీరో వెళ్ళడంతో, వారి కష్టాలను తెలుసుకుని వేరే ఇంటికి వారిని మారుస్తాడు. రవళి ఈ చనువును చూసి మొదట్లో భయపడినా, తరువాత అతని మంచితనానికి తల ఒగ్గి అతన్ని ఇష్టపడుతుంది.

కుటుంబాలు దగ్గరయినా, వివాహం చేసుకోవాలని అనుకున్నాకానీ రవళికి తనకి తానుగా ఒక పేరుప్రఖ్యాతులు సంపాదించాలని, ప్రత్యేక వ్యక్తిత్వంతో ఉండాలనీ, అనుకుని 5 సం॥రాలు సమయం తీసుకుంటుంది. అలాగే హీరో కూడా సినిమా రంగంలో శిఖరస్థాయికి చేసుకున్నాడు. అది వదిలి రాజకీయ రంగంలో అడుగు పెట్టి సామాన్య ప్రజలకి సేవ చెయ్యాలనుకుంటాడు.

రవళి తానుగా ఒక పాడే ట్రూప్‌ ఏర్పాటు చేసుకొని, అన్ని డీలింగ్స్‌ తానే చేసుకుని, దేశ విదేశాల్లో కాన్సర్ట్ లు ఇవ్వడం మొదలు పెడుతుంది.

ఛాండీ గృహప్రవేశానికి మాత్రం విదేశాలనుండి ఇండియాకు వస్తుంది రవళి. ఆమెకు హీరో అమ్మగారు కోడలికి తీసుకున్నట్లుగా నగలు, పట్టుచీరలు తీసుకోమంటుంది. అలాగే జలజకు, కుసుమకు కూడా. గృహప్రవేశంలో ఆనందంగా గడుపుతుంది. మళ్ళీ తన కాన్సర్ట్‌ కి అమెరికా వెళ్ళగా, అక్కడ కరోనాతో ఆమె కాన్సర్ట్‌ కాన్సిల్‌ అయి ఇబ్బందుల్లో పడుతుంది. ఆ సమయానికి చికాగోలో కుటుంబ సమేతంగా ఉన్న ఛాండీ ఆ సమస్యను తీర్చి, ఇండియా తిరుగు ప్రయాణం చేద్దామనుకోగానే తమ ప్రైవేట్‌ జెట్‌ని ఏర్పాటు చేసుకున్న ఛాండీకి కూడా ఎయిర్‌పోర్టులో అనుమతి ముందే తీసుకోవడం వలన ప్రయాణం సులువైంది.

మార్చి 2020 నాటికి కరోనా తీవ్రతరం అయ్యే సమయానికి, అదృష్టవశాత్తూ రవళి తన ట్రూప్‌తో ఛాండీతో ఇండియాలో అడుగు పెడుతుంది. ఇద్దరి ఆశయాలకు ఇంకా 2 సం॥ సమయం ఉండగానే పరిస్థితుల దృష్ట్యా రవళి ఛాండీని వివాహం చేసుకుంటుంది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యజనులకు, వలస కార్మికులకు ఆహార పదార్థాలను అందజేయడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు వారిద్దరూ!

ఛాండీ, రవళి, కుసుమ, ప్రసన్న వివాహాలతో నవల శుభం కార్డు చూపిస్తుంది.

అతి సాధారణమైన అమ్మాయి రవళి. ఛాండీ అంత పెద్ద హీరో తనను ఇష్టపడినప్పటికీ, తన వృత్తి, ప్రవృత్తి అయిన సంగీతంలో తనదంటూ ప్రత్యేక ముద్రకోసం ఆరాటపడింది. తనతోపాటు మరికొంత మందికి జీవనాధారాన్ని చూపింది. సంపద తనను వరించి వచ్చినా, అతిశయం చూపక సాధారణ స్త్రీలాగే ఉండేట్లుగా పాత్రను చిత్రించారు డా॥జైనీ.

పుష్పాకిరణ్‌ : స్త్రీ మేథాశక్తికి ప్రతీక. సాహసవంతురాలు, న్యాయంవైపు నడిచే ఐ.పి.యస్‌.ఆఫీసర్‌ డా॥జైనీ నవలల్లో అన్నింటిలోనూ ఈ పేరు కన్పిస్తుంది. పోలీసాఫీసరుగానే కన్పిస్తుంది. చందూకి మంచి పరిచయం కలిగిన పుష్పాకిరణ్‌, చందూ మంచితనాన్ని, నిజాయితీని, ప్రవర్తననూ, వ్యక్తిత్వాన్ని ఇష్టపడింది. అందుకే అతనికి అవసరమైన సమయాల్లో సాయం చేసింది. ముఖ్యంగా ప్రసన్న కిడ్నాప్‌ ఉదంతంలో బొంబాయి గ్యాంగ్‌ కూపీ లాగి, ఆ కిడ్నాప్‌ ఎందువల్ల జరిగిందో తెలుసుకుని వివరాలందిండిచి, చందూకి సహాయపడింది. మరో ఆపద సమయంలో కూడా చందూకి సాయపడింది.

డా॥ జైనీ నవలల్లో, ముఖ్యంగా హీరో ` (21వ శతాబ్దపు పాకుడురాళ్ళు) నవలలో స్త్రీపాత్రల ఆధారంతోనే హీరో నెం.1 స్థాయికి రాగలిగాడు అనే ఒక సందేశాన్ని, సంకేతంగా పాఠకులకు పంపుతారు.

సమాజంలో స్త్రీకి రక్షణ లేదు. స్త్రీ యేమీ చెయ్యలేదు. సినిమా రంగంలో స్త్రీ శారీరకంగా, మానసికంగా కూడా వేదనను భరిస్తున్నది. అన్ని రంగాలలో విజయం సాధించడానికి స్త్రీ తెలివితేటలు కానీ, శక్తి సామర్థ్యాలు కానీ సరిపోవు అనే ఒక అభిప్రాయం ఉంది.

గతం ఎలాంటిదైనా ఆత్మవిశ్వాసంతో గెలుపు పునాదులను నిర్మించుకోవచ్చనీ, దానికి కావలసింది పట్టుదల, నమ్మకం (మనుషులపై) సహనం అని ప్రతి సంఘటనలో రుజువు చేస్తారు.

జలజ వంటి మంచి అమ్మాయి మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది. సాఫ్ట్‌ వేర్‌లో పనిచేసి, తరువాత మీడియాలో పనిచేసి, సాహసవంతమైన కార్యక్రమాలు చేసిన మహిళగా ఉంటుంది. కుసుమ వంటి తెలివి కలిగిన పి.ఏ. ఏ అధికారికి ఉన్నా అతను ఎలా పైకి రాగడో చూపిస్తారు.

కుసుమకోమలమైన రవళి వంటి స్త్రీలు చూడ్డానికి సున్నితంగా కనిపించినా ఒక లక్ష్యం కోసం జీవించే మానసిక దృఢత్వం కలిగిన స్త్రీగా మనకు తోస్తుంది.

పోలీస్‌ రంగంలో కూడా ఆడవాళ్ళు ఎలా నెగ్గుకు రాగలరో పుష్పాకిరణ్‌ పాత్రద్వారా తెలియచేస్తారు.

కథకంతటికీ మూలమైన పాత్ర హీరో తల్లి. ఆమె గతం మురికైనా ఆమె మనోగతం స్వచ్ఛము. ఆదరించిన వారితో సహనంతో ఉంటూ అందరిపై ప్రేమాభిమానాలు కురిపించే వ్యక్తి. హీరోకి అమ్మంటే ఒక లాలన. అమ్మ కొంగంటే ఒక ఆప్యాయత. అమ్మ మాటంటే ఒక తీయని అమృతగుళిక. తనకి ఎప్పటికప్పుడు మానసిక స్థైర్యాన్నిచ్చే ఒక చేయూత. ఆమె గతం పాఠాల నుండి, పాకుడు రాళ్ళనుండి ఎన్నో తెలుసుకుని, స్థిరమైన కీర్తిశిఖరానికి నిచ్చెనమెట్లు స్వయంకృషితో ఏర్పరచుకున్నాడు హీరో ఛాండీ!

ఇలా డా॥ జైనీగారికి కలిగిన వివిధ రంగాలో విషయ పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా కథద్వారా, నవలద్వారా తెలియచేసి విజయం సాధించారు.

రావూరివారు పాకుడురాళ్ళు రాసిన సమయం వేరు. అప్పుడు ఈనాటి సమాజమంత చెడిపోలేదు నాటి సమాజం. విలువలు వలువలు దిగిపోయిన నేటి సమాజంలో ప్రపంచీకరణ వలన మాఫియా గ్యాంగ్‌ లు, రాజకీయ, సినిమా రంగాల కుళ్ళు కలిగిన సమాజంలో కూడా కష్టేఫలి, పోరాటం ఊపిరిగా, క్రమశిక్షణే ఆయుధంగా, మంచితనమే చెడుకి మారణహోమంగా సృష్టించవచ్చనీ, నేటికీ అన్నిరంగాలో నీతీ నిజాయితీలు కలిగిన వారున్నారని, సాధారణ పాఠకుల్లో ఆత్మవిశ్వాసాన్నీ, నమ్మకాన్నీ కలిగించే నవల హీరో!

 

*****

Please follow and like us:

One thought on “డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)”

  1. డాక్టర్ గడ్డం శ్యామల గారు సుమారు 567 పేజీలు ఉన్న ‘హీరో’ {21 వ శతాబ్దపు టాలీవుడ్ పాకుడురాళ్ళు}నవలను విస్తృత అధ్యయనం చేసి దాదాపుగా ఒక రీసెర్చ్ పేపరులాగా నవలలోని ఐదుగురు స్త్రీ పాత్రలను విశ్లేషించారు. ఈ నవల “నవ్య” వారపత్రికలో 37 వారాల పాటు ధారావాహికంగా ప్రచురించబడి, పత్రిక మూతపడడంతో ఆగిపోయింది. నవల పేరు ‘హీరో’ నే అయినా, కథానాయకుడిగా చేదోడు వాదోడుగా ఉండి అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది ఈ ఐదుగురు మహిళలే. వారి పాత్రల విశ్లేషణ లో శ్యామల గారు సంపూర్ణ న్యాయం చేసారు. మేడమ్ దారికి ధన్యవాదాలు! అభినందనలు!

Leave a Reply

Your email address will not be published.