అంతర్జాల పత్రికలు

(నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) 

-మణి కోపల్లె

నేడు ఇంటర్నెట్ అతి వేగంగా దూసుకుపోతూ  సెల్ ఫోన్ లలోనూ ఇంటర్నెట్ లభ్యమవ్వటంతో ప్రింట్ మీడియాలో వచ్చే అన్ని  పత్రికలు  నేడు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి . 

అంతర్జాలం ఆవిర్భవించిన తొలినాళ్లలో  అంటే  1999 కి ముందు వున్న నెట్ ని (రీడ్ ఓన్లీ)వెబ్ 1.0 గా వర్ణించారు.  ఆ సమయంలో ప్రముఖ పత్రికలు వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే ఖతులను వాడేవారు. ఏ వార్తకి ఆ వార్త ఇమేజ్ రూపంలో వుండేవి.

  అంతర్జాలంలో విస్తృతమైన మార్పులు వచ్చి వెబ్ 2.0 (2జి) రీడ్ అండ్ రైట్ 2000 లో వచ్చింది.  పేజ్  కంపోసింగ్ కోసం ‘పేజ్ మేకర్’ అనే సాఫ్ట్ వేర్ తో మీడియాలో కొత్త వరవడి  మొదలయింది.  ఫేస్ బుక్, ట్విట్టర్ , బ్లాగర్ వంటివి మొదలయ్యాయి. ఆ తరువాత  వెబ్ 3.0, వెబ్ 4.0,  వచ్చి ప్రస్తుతం కొన్ని చోట్ల 5.0 వెబ్ వెర్షన్ వచ్చింది. 

  అంతర్జాలంలో వచ్చిన మార్పుల వల్ల కంప్యూటర్ ద్వారానే రచయితలు తమ రచనలను సరి చూసుకుని ఈ-మెయిల్ ద్వారా పత్రికా యాజమాన్యానికి అందజేస్తున్నారు. పాత కాలపు టైప్ సెట్టింగ్ లు మాయమయ్యాయి.  

అంతర్జాతీయ పత్రికల ఆవిర్భావం: 1780 లో ప్రారంభమైన బెంగాల్ గెజెట్ పత్రిక నుంచి నేడు అంతర్జాలంలో వెలువడే పత్రికల వరకూ పత్రికల రూపు రేఖలు, నలుపు తెలుపు నుంచి కలర్ పత్రికలు, కలర్ ఫోటోలు అందిస్తూ ఆకర్షణీయంగా రూపుదిద్దు కుంటున్నాయి. ఒక పత్రిక వెలువడాలంటే కొన్ని పద్దతులు, నియమాలు వుంటాయి. అన్ని  ప్రధాన పత్రికలు వార్తలను, ప్రధానంగా PTI (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) నుండి స్వీకరించే వారు. ఒక ప్రణాళిక ప్రకారం వెలువడేవి. తెలుగు దిన  పత్రికలు  తెలుగు  సాహిత్యానికి పేజీలు కేటాయిస్తాయి. కానీ అవి పరిమితంగానే వుండేవి. 

2000 సంవత్సరం తరువాత  ప్రపంచ విపణిలో నెట్ సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రావటంతో తెలుగు సాహిత్యానికి  సంబంధించి ఎన్నో నెట్ పత్రికలు వెలువడుతున్నాయి.  కాల క్రమంలో నేటి వరకూ వచ్చిన కొన్ని 

ప్రముఖ అంతర్జాల పత్రికలు ….  

“ఈమాట”:  ఈమాట తొలి అంతర్జాల సాహిత్య పత్రిక అనవచ్చు. ఆ పత్రిక ముందు మాటలో  “1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే!” అని అంటారు ఆ పత్రికా సంపాదకులు.  ఈ-మాట లోనే చాలా సంవత్సరాల నుండి “శబ్ద తరంగాలు” శీర్షిక ద్వారా ఆడియో ఫైల్స్ ను ప్రవేశ పెట్టింది. ఆపాత మధురాలు అవి. ప్రముఖుల స్వరాలు, ఆలిండియా రేడియో పాటలు, లలిత సంగీతాలు, నాటకాలు, పరిచయాలు, ఇంకా ఎన్నో మధురమైన స్వరాల గని . 

“కౌముది”: సాహితీ మాస పత్రిక కిరణ్ ప్రభ గారి నిర్వహణలో జనవరి 2007 లో ప్రారంభమయింది. ”కౌముది” మీ ముంగిట్లో సాహితీ చంద్రిక అనే లోగో తో వుంటుంది. కళాకారులతో వేసిన చిత్రాలతో పాటు కవితలు తో నిండిన ముఖ్య చిత్రం ఈ పత్రికకి హైలెట్. కధలు, నవలలూ, ముఖాముఖీలు, వ్యాసాలు,   కాలమ్స్ వంటి విభిన్న సాహిత్య పరమైన అంశాలు వున్న అంతర్జాల పత్రిక ఇది. సమాజాన్ని ప్రతిబింబించే రచనలతో పాటు, ఆనాటి రచయితల రచనలతో పాటు ఆనాటి రచయితల జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు, జీవిత చరిత్రలు కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  ‘కౌముది ఆడియో వెబ్ పత్రిక’ కూడా వుంది. కిరణ్ ప్రభగారి స్వరం లోఇదివరలో  రేడియోలలో వచ్చిన  వివిధ అంశాలపై వచ్చిన ఆడియోల సమాహారం ఈ ఆడియో పత్రిక . సాహితీ లోకంలో నిత్య నూతన చైతన్య కిరణం కౌముది అంతర్జాల పత్రిక.  

“సుజన రంజని”: ఈ అంతర్జాల మాస పత్రిక సుజన రంజని సిలికానాంధ్ర వారిది. 2004 జనవరి లో తాటిపాముల మృత్యుంజయుడు గారి సంపాదకత్వంలో ప్రారంభమయింది. ఈ పత్రిక ఆరోజునుంచీ రూపు రేఖలు మార్చుకుని మరింత ఆకర్షణీయంగా రూపు దిద్దుకుంటోంది. ఎన్నో శీర్షికలు ఆరంభించింది. రచనల రూపంలో తెలుగు సంస్కృతిని వెల్లడించడానికి ఎంతగానో కృషి చేస్తోంది. తెలుగు సాహిత్య పత్రిక ఇది. ఈ పత్రిక కూడా చాలా కాలం నుంచి వస్తుంది.  

“ప్రజా కళ”:  ఈ – పత్రిక 2006 అక్టోబరు లో మొదలైంది.  ఇందులో సాహితీ అంశాలున్నాయి.

“భూమిక” : స్త్రీవాద సాహితీ పత్రిక ఇది. 1993 లో తొలి ముద్రణా సంచిక కొండవీటి సత్యవతి గారి సారధ్యంలో ప్రారంభమైనా  2006 నుంచి అంతర్జాల పత్రికగా మారింది. స్త్రీలు సృజనాత్మకమైన తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునే విధంగా భూమిక కృషి చేస్తుంది. ఈ పత్రికకి  కూడా ఎంతోమంది రచయితలె కాదు పాఠకులు వున్నారు. భూమిక హెల్ప్ లైన్ ఎందరో మహిళలకు దిక్సూచి వంటిది.  

“కొత్తపల్లి”: మరో అంతర్జాల పత్రిక నారాయణ సంపాదకత్వంలో కొత్తపల్లి మండలం, అనంతపురం జిల్లా కేంద్రంగా పిల్లలమనోవికాసం  కోసం ఏప్రిల్ 2008 లో ప్రారంభమైంది.  (అంతర్జాలంలో ఈ చివరి పత్రిక ఫిబ్రవరి 2020) అని చూపిస్తోంది. 

“విహంగ” : మరో అంతర్జాల మహిళా మాస పత్రిక ఇది. జనవరి 2011 లో  కీ. శే. పుట్ల హేమలత సంపాదకత్వంలో మొదలయింది ఈ పత్రిక. ప్రముఖ రచయిత్రులు దీనికి గౌరవ సంపాదక వర్గంగా వున్నారు. 

“సంచిక”: మరో అంతర్జాతీయ పత్రిక. పాఠకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తనదైన శైలిలో, కొత్తదనంతో విభిన్నమైన అంశాలతో ఈ సాహిత్య పత్రిక అందమైన అక్షరాల లోగలతో, భిన్నమైన సాహిత్య అంశాల  ఆడియోలు,  ప్రాంతీయ చిత్ర కధనాలు, పజిల్స్, ఇంకా అనేక శీర్షికలతో వెలువడుతున్న పత్రిక ఇది. 

“నెచ్చెలి” : అంతర్జాల వనితా మాస పత్రిక  జులై 2019 న ప్రారంభ మయిన పత్రిక డా.  కె. గీత గారి  సంపాదకత్వంలో మహిళలకు సంబంధించిన అనేక అంశాలను పరిచయం చేస్తున్నది. ఇందులో ప్రపంచంలోని ఏ భాష నుంచైనా వచ్చిన రచనలను తెలుగు, ఆంగ్లంలలో అనువాదం చేసి ప్రచురిస్తారు. ముఖ్యంగా వనితల అభ్యున్నతిని, మహిళలు సాధించిన ప్రగతిని, స్ఫూర్తి వంతమైన మహిళలు, మహిళల్లో దాగివున్న కళలు  వంటి అంశాలతో  పాటు మహిళా  సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది.  నెచ్చెలి మహిళా పత్రికలో కొత్త రచయిత్రులు, సీనియర్ రచయిత్రులే కాక, మహిళలపై రాసిన పురుషుల రచనలను కూడా ఆహ్వానిస్తుంది. ఈ సాహితీ పత్రికలో కధలు, కవితలు, ఇంటర్వ్యూలు, సీరియల్స్, కాలమ్స్, పుస్తక సమీక్షలు ఇలా ఎన్నో అంశాలపై ప్రచురిస్తుంది. వెబ్ పత్రికలో చరిత్రలోనే తొలిసారి ఆడియోలతో బాటూ వీడియోలను కూడా “ఆడియో-వీడియో”  శీర్షిక ద్వారా ప్రచురించడం  నెచ్చెలికే చెల్లింది.  నెచ్చెలి కేవలం స్త్రీలకు సంబంధించిన అంశాలకే  కాకుండా, సమకాలీన సామాజిక అంశాలకు, అనేక పరిశోధనాత్మక అంశాలకు అద్దం పడుతోంది.  ఇటీవల అభిమానులను, చదువరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ-సాహిత్య పత్రిక ఇది. 

2000-2020 సంవత్సరాల కాలంలో వచ్చిన వాకిలి, ప్రాణహిత, గోదావరి, తెలుగువన్.కామ్, మాలిక, తెలుగుతల్లి, ప్రతి లిపి.కామ్, సుకధ.కామ్, గోతెలుగు.కామ్, కధాకేళి, తూలిక, మధురవాణి. కామ్, సారంగ,  చైతన్య వారధి, మన్యసీమ  వంటి అనేక వెబ్ పత్రికలు  సాహిత్య సేవను అందిస్తున్నాయి. అంతర్జాలంలో దూసుకు పోతున్నాయి.

 

అంతర్జాల పత్రికలు తెలుగు సాహిత్యం  విస్తరణ:

   నేడు ప్రపంచాన్ని అల్ల కల్లోలం చేస్తున్న కరోనా నేపధ్యంలో లాక్  డౌన్ లతో దాదాపు అన్నీ ప్రముఖ పత్రికలు   పేజీలను,   సిబ్బంది సంఖ్యను  తగ్గించటం లేదా  పత్రిక ప్రింటింగ్ ను నిలిపి వేయటం చేశాయి.  నాటి ప్రముఖ ముద్రణ పత్రికలన్నీ నేడు అంతర్జాలం వేదికగా వెలువడు తున్నాయి.  కొనుక్కుంటే కానీ లభ్యమవని పత్రికలు సైతం అంతర్జాలంలో లభిస్తున్నాయి. 

“ఫేస్ బుక్” లలో  తమ  అకౌంట్ లు తెరిచి తమ తమ  భావాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రతివారూ ‘రాజులే’ భావ వ్యక్తీకరణల్ల. ముఖ్యంగా రచయితలు వివిధ సాహిత్య గ్రూపులలో కవితలు, కధలు, పద్యాలు, పుస్తక సమీక్షలు  వంటి సాహితీ రూపాలను రచిస్తూ అందరికీ తమ టాలెంట్ ను నిరూపించు కుంటున్నారు. అన్ని పత్రికల వాళ్ళూ కూడా ఈ ఫేస్బుక్, ట్విటర్, వాట్స్ అప్ వంటి మాధ్యమాలలో తమ ఖాతాలు తెరిచి, అందరికీ . ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి.

  ఆనాడు ప్రతి ఇంటా వుండే రామాయణ భాగవతాలు సైతం కొన్ని అంతర్జాల పత్రికలు, వాట్స్అప్ గ్రూపులు, ఫేస్  బుక్ లు అందిస్తున్నాయి.  ముఖాముఖీల వీడియోలు, కధల వీడియోలు అందుబాటులోకి వచ్చాయి. తమకు అభిప్రాయాలను అప్పటికప్పుడే తెలియ చేసే కామెంట్స్ బాక్స్ వల్ల పాఠకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం జరుగుతోంది.  కొన్ని వెబ్ పత్రికలు  ప్రతిష్టాత్మక మైన సాహిత్య సమావేశాలు, అవధానాలు, అభిప్రాయాలు, పద్య ప్రహేళికలు ఏర్పాటు చేస్తూ తెలుగు సాహిత్య విస్తరణకు దోహద పడుతున్నాయి….కొన్ని పత్రికలు స్త్రీలకు ఇష్టమైన వంటలు సైతం వీడియోలలో  పెడుతున్నాయి. సాహిత్య పోటీలు నిర్వహించటం వల్ల 

కూడా రచయితల సంఖ్య పెరుగుతోంది. 

   కంప్యూటర్ లో, సెల్ ఫోన్ లలో  అక్షరాలు   జూమ్ చేయగలిగే అవకాశం వుండటంతో పెద్ద వారు సైతం చదువుతున్నారు.  వెబ్ పత్రికలు ఎక్కువయి రాయాలనే ఆసక్తి గల వారికి తమలోని భావాలను వచన, పద్య కవితలు, నానీలు వంటి వివిధ సాహిత్య ప్రక్రియల రూపంలో మెయిల్ ద్వారా పంపటంతో వెబ్ పత్రికలు కూడా అతి తక్కువ వ్యవధిలో వాటిని ఆమోదించి తమ వెబ్ పత్రికలలో పెడుతున్నాయి. వీరిలో ప్రసిద్ధి చెందిన రచయితలే కాక వర్ధమాన రచయితలు సైతం తమ రచన సామర్ధ్యాన్ని పెంచు కుంటున్నారు. సాహిత్యాభిలాషులందరికీ అంతర్జాల పత్రికలు సంపూర్ణ మానసిక ఆనందాన్నిస్తున్నాయి. 

   లోపాలు:   అంతర్జాల తెలుగు సాహిత్యంలో వచ్చే కొన్ని కొన్ని రచనలల్లో, కొన్ని పత్రికలలో అచ్చు తప్పులు  కనిపిస్తున్నాయి. సుశిక్షితులైన పత్రికా సంపాదకులు లేకపోవటం, కొన్ని సార్లు సరిదిద్దే సిబ్బంది  లేకపోవటం,  ప్రతి వ్యక్తీ చుట్టూ వున్న సమాజం లో జరిగే సంఘటనలు ఫోటోలు తీసి పత్రికలకి పంపే జర్నలిస్ట్ లు ,  తాము రాసే అంశాలు, భాషలో తప్పులు, వచ్చిన అంశాలు అలాగే అప్ లోడ్ చేసి సైట్ లో పెట్టటం వల్ల కూడా మంచి  సాహిత్యం లోపించే అవకాశం వుంది. 

పాఠకుల ఆదరణ లేక, నిర్వహించే సామర్ధ్యం లేక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని అంతర్జాల పత్రికలు మాయమవుతున్నాయి.. ఉదాహరణకి hamaaraashehar.com, webprapancham.com, appallround.com, computervignanam.Com మొదలయినవి. ఇవన్నీ  ప్రారంభంలో ఉన్నతంగా వెలిగిన కొన్ని వెబ్ పత్రికలు. 

ముగింపు: అంతర్జాల పత్రికలు వస్తు, రూప నిర్మాణాల్లో ఎంతో ప్రగతిని సాధించినా ఇక్కడ కొన్ని పత్రికలను మాత్రమే పేర్కొనటం జరిగింది.   అన్నిటి గురించి వర్ణించటం సాధ్యం కాదు కనుక కొన్నిటిని మాత్రమే పేర్కొనటం జరిగింది. దేని ప్రత్యేకత దానిదే! అన్ని  పత్రికలూ  సాహిత్యానికి పెద్దపీట వేసినవే!  సాహిత్య కృషి చేస్తున్నవే!

Source :

అంతర్జాలంలో…. వికీపీడియా తెలుగు పత్రికలు.                                                        

నమస్తే తెలంగాణా, నెచ్చెలి, ఈమాట, కౌముది వంటి అంతర్జాల పత్రికలు, సుజన రంజని మొదలైన పత్రికలు 

***

నా అనుభవాలు:-

ఒక ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ గా 1997 నుండి కంప్యూటర్‌ వాడుతున్నాను.  టైపింగ్‌ ఫాంట్స్‌ ఇప్పటిలా యూనికోడ్‌ ఫాంట్స్‌ లేవు. ఐలిపి,  స్వర్ణాంధ్ర ఫాంట్స్‌, శ్రీలిపి ఇత్యాది ఫాంట్స్  ప్రాక్టీస్‌ చేసేదాన్ని.   రాసిన ఆర్టికల్స్‌ , ఇంటర్యూలను  చేత్తో రాసినవి కానీ, ప్రింట్‌ కాగితాలు కానీ పత్రికలకి సబ్మిట్  అందించటంతో ఇబ్బందు ఎదురయ్యేవి. ఆ పత్రిక ఆఫీసుకి వెళ్ళి సమయం లోపల ఇవ్వటం మాత్రమే కాకుండా,  అవి ప్రింటులో వచ్చాయా లేదో తెలియదు, ఫోన్‌ చేసి, పేపర్‌ కొనుక్కుని చూసుకుంటే కాని తెలియదు. ఇక కొన్ని పత్రికలు మాత్రమే రెమ్యునరేషన్ పే చేసేవి. అదికూడా అతి తక్కువ. ప్రస్తుతం నెట్‌ అభివృద్ధి పొందడం వల్ల  ఇంటి నుండే పంపగలగు తున్నాము. నేడు అందరికీ  సులభమైన ఫోనెటిక్‌ ఫాంట్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.

*****

Please follow and like us:

One thought on “అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)”

  1. అంతర్జాల పత్రికల చరిత్ర సూక్ష్మంగా వివరించేరు బాగుంది మణిగారూ. అంతర్జాలపత్రికలలో తప్పులు రావడానికి కారణం సుశిక్షితులైన సంపాదకులు లేకపోవడం కాదనుకుంటాను. చాలా కారణాలున్నాయి. నాబ్లాగు తెలుగు తూలికలో ఒక వ్యాసం రాసేను.

Leave a Reply

Your email address will not be published.