రాగో

భాగం-11

– సాధన 

పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. అయినా చలనం లేదు. వర్షాల్లో ఇంతే అన్నట్టున్నవి వారి వాలకాలు. వీరిని తలచుకుంటే మూరనిలో తన మొదటి అనుభవం మెదలింది.

తనకు కేటాయించిన పార్టీన్ కవరు కట్టుకోకుండా అలానే బాగుంటుందనీ, వర్షం రాగానే అందులో దూరి రెండు పక్కల మల్చుకుంటే ఏ చీకు ఉండదని మురిసిపోయాడు. కోలాటంలా కుట్టుకున్న వారిని చూచి అదో పెద్ద అవస్థ అని వెక్కిరించాడు కూడ. పడుకున్న కొద్దిసేపటికే కుండపోత వర్షం షురువ్ కాగానే పాలీన్ సంచిలో దూరి రెండు పక్కలా బిగించుకొని పదిహేను నిముషాలు హాయిగా పడుకున్నాడు. అంతే, ఇంకేం రెండు వైపులా సీల్ చేసినట్టు ఆ చివర తల కింద, ఈ చివర కాళ్ళకింద ఇరికించుకోని నెర్రతన్ని పడుకునేసరికి గాలిరాక, ఊపిరాడక జీవన్మరణ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ నిద్రలో ఏం చేయడమో తోచలేదు. బలంగా పిడికిలితో గుద్ది ఆ పాలీన్ షీటుకు రంధ్రం చేస్తేగానీ ఊపిరాడలేదు. బ్రతుకు జీవుడా అన్నట్టు తన తెలివితక్కువ పనికి తానే నవ్వుకుంటూ తెల్లవార్లు ఆ చినిగిన వరకులో జాగరణ చేశాడు. తెల్లారి లేచి తన అవస్థ చెప్పగా “బాధపడితేగాని బోధపడదులే” అని అందరూ పడి పడి నవ్వారు. వర్షం వచ్చిన ప్రతిసారి అది గుర్తిస్తూనే ఉంటుంది.

తన ఊహల్లో తాను పడిపోయిన మూరన్ని కిమ్ఁ కిమ్ఁ అంటూ అలారం ఇచ్చిన గడియారం ఈ లోకంలోనికి తెచ్చింది. తన డ్యూటీ గంట ముగిసిందన్నట్టు తెలిసింది. అందరినీ లేపడానికి కదిలాడు. ఈ కొత్త గడియారం వచ్చినప్పటి నుండి టైం చూడడం రాని వారందరికి ఓ బాధ తప్పినట్టయ్యింది. గంటకో తడవ రెండు సార్లు అలారం ఇచ్చి టైం గుర్తు చేస్తుంది. ‘నీ డ్యూటీ అయిపోయింది. మరొకరిని లేపు’ అని హెచ్చరించినట్టే చేస్తుంది.

ఆఖరి డ్యూటీ అయిన మూర అందరినీ లేపడానికి రావడం చూసిన జైని లేసి కూచుంది. ఇలాంటి వర్షంలో కొంచెమయినా తడవకుండా హాయిగా నిద్రపోవడం తానింకా నేర్చుకోవాలనుకుంటూనే తోటివారిని లేపడంతో మూరకి సహాయ పడింది.

“కామ్రేడ్స్! ఈ వర్షంలో తడవకొకరు దొడ్డికి పోతే ఈ బరువైన కిట్లతో దారిలో నిలబడలేక మేం ఆరిపోతం. అందుకే దయచేసి పోయేవాళ్ళు అందరు పోయిరండి!” అంటూ ఎలాగు తను నిన్ననే పోయాడు గాబట్టి మరో మూడ్రోజులు దొడ్డికెళ్ళే ప్రసక్తే లేదన్న ధీమాతో గాండో పదే పదే కాషన్ ఇస్తున్నాడు. అదేమో గాని గాండోకు దళంలోనికి వచ్చినప్పటి నుండి ఈ పద్దతే నడుస్తుంది. ఇచ్చిన మాత్రలు ఇచ్చినట్టు మింగుతున్నా ఆ మాయదారి జబ్బు ఓ పట్టాన కుదుటపడిన లక్షణాలు కానరావడం లేదు.

“ఏమో! ఏం దొడ్డికి పోవడమో ఈ వర్షంలో” అంటూ గుణిగాడు కర్బ. కర్ప దొడ్డికి చాలా నిదానంగా పోతాడు. నిదానమే ప్రధానం అన్నది తాను దళంలోకి వచ్చాక నేర్చుకున్న నినాదం. ‘రోజుకు నాలుగుసార్లు పోయి నలభై నిముషాలు పాడు చేసే వారికన్నా ఏకంగా ఒకేసారి అరగంట పోయినా ఇంకా పదినిముషాలు ఆదాయే కదా!’ అన్నదే అతని వాదన. నోట్లో వేసుకున్న పొగాకు రసమంతా తలకెక్కి ఉత్తుత్తి పిప్పి ఉమ్మేశాక గానీ అక్కడ నుండి కదలడు. అందులో పాదాల దాక పాలీన్ కప్పుకొని దొడ్డికి పోవాలంటే మహా చిరాకు. కప్పుకున్న పార్టీన్ చెడిపోతే కడుక్కోలేక చావాలి మరి!

‘హా లక్ష్మణా! ఏమి ఈ నిరీక్షణా! దొడ్ల కార్యక్రమం ముగిసేదాక లేపకుండా ఉంటే మరో అరగంట నిద్రపోయేదానిని నేను’ అనుకుంటూ ఆలస్యం పాటించే వారిని మనసులో అభినందిస్తూ ‘లేపగానే లేవాలి’ అని తొందరచేసే గాండోను తదేకంగా చూసింది గిరిజ.

మసక మసక చీకట్లోనే లేవడం దళం అలవాటు. అదో క్రమశిక్షణగా అందరూ అలవాటు చేసుకోవలసిందే. తెలతెలవారే సమయమే శతృదాడికి అనుకూలమైనదనీ, గతంలో అనేక దాడులు అలాంటి వేళల్లోనే జరిగి భారీ నష్టాలెదుర్కొన్నామని రుషి పదే పదే గుర్తు చేస్తుంటాడు. ఈ మాటలు విన్నపుడల్లా తనలో ఏదో తప్పు ఫీలింగ్ వచ్చి కూచుంటుంది బద్దకంగా లేచే గిరిజకి. –

దళం సింగల్ లైను ఫార్మేషన్లో నిల్చుంది. ఎవరి వెనుకాల ఎవరు నడవాలో చేసుకున్న నిర్ణయం ప్రకారం నిలబడ్డారు. కప్పుకున్న పార్టీన్ కవర్లు గాలికి రెపరెపలాడకుండా, వర్షపు జల్లులకు ఒళ్ళు తడవకుండా బందోబస్తుగా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఫ్రంటు పైలట్స్ డుంగ-కర్పలు మాత్రం తలమీద కప్పుకోకుండా చెవులు రిక్కించి ఎలర్ట్ గా ఉన్నారు.

కామ్రేడ్స్ మనం ఇక్కడి నుండి అరగంటలో ‘ధీకొండ’ చేరుకోవాలి” అనగానే దళం నడక మొదలెట్టింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.