కనక నారాయణీయం -21

పుట్టపర్తి నాగపద్మిని

అసలు మేఘం ద్వారా సందేశం పంపే ఆలోచనకు ఆధారాలేమిటి?? అని ఆలోచిస్తే, ఋగ్వేదం కనిపిస్తుంది. సరమా – పణి, ఇంద్రుడు – ఇంద్రాణి, యమ – యమీ ఇటువంటి సందేశాత్మక కథలున్నాయి. భారతీయ సాహిత్యంలో ఋగ్వేదమే మొట్టమొదటి లభ్య రచన.

  బృహస్పతి గోవులను ఒక జాతివారు అపహరించి తీసుకు వెళ్ళి ఒక గుహలో బంధించి వుంచుతారు. ఆ ఆవులను అన్వేషించేందుకు, ‘సరమ’  అనే శునకాన్ని పంపుతాడు బృహస్పతి. ఆ సరమ, ఆ శత్రు రాజైన అసురబలుని నగరం ‘బలపురం’ లోకి వెళ్తుంది. అక్కడ గోవులను దాచిపెట్టిన చోటును కనిపెడుతుంది. కానీ శతృ సమూహం, సరమ ను తమ సమూహంలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. తరువాతి కథ  అనేక మలుపులు తిరిగి,     సుఖాంతమౌతుంది. (ఋగ్వేదం 10/7/108)

        యమ – యమీ వృత్తాంతం కూడా ఋగ్వేదం లోనిదే ( 10/10/14)

        ఈ ఆధారాలవల్ల దూతకావ్యాలకు ఆధారం ఋగ్వేదమనే చెప్పవచ్చు.  

        ఆచార్య శౌనకుడు వ్రాసిన ‘బుద్ధ దేవుడు ‘ (బుద్ధ దేవతా ) అన్న రచనలో శ్వావాశ్వ రాజు,  రథవీతి రాజు కుమార్తెకు తన ప్రేమ సందేశాన్ని రాత్రి ద్వారా పంపుతాడట!!

      వాల్మీకి రామాయణంలో సీతావిరహంలో రాముడు, విభిన్న వృక్షాలూ, పక్షులూ, పర్వతాలతో మాట్లాడటం కూడ, దూతకావ్యాలకు స్ఫూర్తిగానే కనిపిస్తుంది.   ఆ తరువాత, హనుమత్సందేశం, సుప్రసిద్ధం కదా!!

       మహా భారతంలో కృష్ణ రాయబారం ఉండనే ఉన్న్నది!!

      నలదమయంతోపాఖ్యానం హంస సందేశం మీదే ఆధారపడి ఉన్నది.

      శ్రీమద్భాగవతం కూడా సందేశా కావ్యాలకు నిధి వంటిదే!! కృష్ణ విరహంలో, గోపికలు, ఆమ్ర, మల్లికా, తులసీ, అశ్వత్థము – ఇలా అన్ని వృక్షాలతో తమ విరహ బాధను పంచుకుంటారు.

       ఉద్ధవ గీత, రుక్మిణీ రాయబారము కూడా భాగవత సందేశ ప్రసంగాలే!!

     బౌద్ధ జాతకాలలో,ఒక కథలో, ఒక శ్రేష్టి, కలండుకుడు అనే తన సేవకుణ్ణి వెదికేందుకు, తన ఒక పెంపుడు చిలుకను పంపగా, అది, అతని జాడ వెదికి పట్టుకుని, తన యజమానికి చెబుతుంది. (కలుండక జాతకం – 127)    ఒక వాయసం ద్వారా తన భార్యకు వేదనా సందేశం అంపుతాడు శూలీదండము పొందిన వ్యక్తి!!

   మరో కథ చాలా కొత్తగా ఉంది. పాంచాల రాజులకు, విదేహ రాజులకూ మధ్య శత్రుత్వం ఉంది. పాంచాల రాజు తన శత్రువు విదేహ రాజును అవమానించాలనుకున్నాడు. దానికి అతడు వేసిన పధకమిది. తన కుమార్తె, ‘పాంచాల చండి’  అందాలను పొగడుతూ ఎంతోమంది కవులచేత అనేక రచనలు చేయించాడు. గొప్ప సంగీత కళాకారులతో వాటికి రాగాలు కూర్చాడు. కొన్ని పక్షులను మచ్చిక చేసుకుని, వాటికీ, యీ పాటలను చక్కగా పాడేందుకు శిక్షణనిప్పించాడు. అప్పుడిక ఆ పక్షులను విదేహ రాజు ఉన్న చోటికి పంపాడు. ఆ పక్షులు విదేహ రాజు దగ్గర తాము నేర్చిన పాటలన్నీ శ్రావ్యంగా పాడుతున్నాయి. ఆ పాటలనిండా, పాంచాల చండి సౌందర్య వర్ణనమే కదా ఉన్నది!! ఆ పాటలను విన్న విదేహ రాజు, ఆ పాంచాల రాజకుమారి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అతనికి తెలియదు, ఆమె తన శత్రురాజు కుమార్తె అని!! ఇక తరువాతి కథేమిటి?? ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు!!

     సంసృత కావ్యాలలో మేఘ సందేశం కాళిదాసు రచన ఎందరెందరో విదేశీ విద్వాంసులను కూడా ముగ్ధులను చేసింది.

     మరి పుట్టపర్తి మేఘ దూతంలోని విశేషాలూ, వారు వేసుకున్న చక్కటి ప్రణాళిక వల్ల, పైగా సందేశ కావ్యాల గురించిన పలు  విశేషాలు అప్పుడప్పుడూ, తమ కావ్య పఠన సమయంలో వారు వివరిస్తూ కూడా ఉండటం వల్ల కూడా ఆ రచన బహుజనాదరణను పొందింది.

      పైగా యీ  మేఘ దూతం కావ్యంలోని సామాజిక స్పృహ సాధారణ ప్రజానీకానికి పుట్టపర్తిని చాలా చేరువ చేసింది కూడా!!

                            తనవంటి మానవుల దైన్యమే సుఖ శయ్య

                            గా, వారి నిట్టూర్పు గాడుపులె చామరలు

                            గా – వారి కన్నీట గరగు దినముల పైని

                            నిలిచి – మేమూ మానవులమంచు  గొంతెత్తి

                           యార్చు ధనికుల జూచి యసురులని అన్నాదు

                                                          వాడు మానవుడూ!!

     ఇలా మేఘ దూత కావ్యారంభం జరిగింది. కుటిల కారాగార క్రకచ దళితుడైన పుట్టపర్తి కథానాయకుడి అపరాధమేమిటని చీకటులు ప్రశ్నించాయి. చుక్కలు అడిగాయి. పవనములు ఆశ్చర్య చకితములయ్యాయి. కొండకోనలతోడా గుసగుసగా అతని గురించి వాకబు చేశాయి కూడా!! కానీ యేమి లాభం?? పాలకులు తిని చివికి పారవేసిన మామిడి ముట్టెవలె అతని తనువు కారాగారంలో ధూళి ధూసరితంగా నేల వాలిపోయింది.

    దానిమ్మ పూవంటి తళుకు బెళుకుల తన చిన్నదాని పరిస్థితి ఇప్పుడెలా ఉందో అని, అతని మనసును తొలిచేస్తున్నది – బాధ!! తానేనాడూ ఒక్క పండుగకైనా చీర తెచ్చి ఇచ్చింది లేదు. ముద్దులాడింది లేదు!! ఐనా నాపై తనకెంత ప్రేమో!! ఆభరణములు లేకపోవటం కూడా ఆమె అందానికి వింత సొబగుగా అదికిపోయిందే!! మల్లె పూవు వలె నవ్వటమొక్కటే తెలిసిన నా ఆడుది, యేకాంత దు:ఖ సంధ్యాకాంత వోలె – ఏకాంతమును బోలె ఉన్నదేమో ఇపుడు!!’

  ఇటువంటి ఊహలలో నిదుర పట్టక కుమిలిపోతున్న ఖైదీ తలయెత్తి చూచాడు. ఆకాశంలో ఒక జలధరం, అందంగా నడిచి వస్తున్నది. తన మనసులోని వ్యధ ఆ జలదానికి చెప్పుకోవాలనిపించింది. ‘ఓహో, శుభతేజా!! జలద రాజా!! నేను మనుజులను కోరుకోలేను – నా వేదన వినమని!! ఎందుకంటే, జీసస్సునూ, సోక్రటీసునూ, ఫిరదౌసినీ క్రూరంగా చంపి కసి తీర్చుకున్న జాతి ఇది!! నాగోడు విని న్యాయం చేస్తుందనుకోను!! స్వారథ పూరిత మర్త్య జాతివలె మీ జాతిలో స్వార్థం పెరగలేదనే అనిపిస్తున్నది. నాకున్న  ఒక్కగానొక్క ప్రియురాలి గురించీ, నేనిక్కడ  చెరసాలలో మగ్గిపోతున్న విధమూ, ధనిక వాదం ఆడుతున్న నిష్టుర క్రీడగురించీ కాస్త చెబుతాను. విని నా బాధను నా ఆడుదానికెరిగింపవా!!; అని దీనంగా అడిగుతుంటే, ఆ జలదానికి మది కరిగిందేమో, కాలు ముందుకు కదపకుండా, మధుర మధురంగా గర్జించిందట, తనకు సమ్మతమే అన్నట్టు!! ఇంకేం?? ఖైదీ మొదలెట్టాడు.

       బడుగు జాతుల వారి కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించే క్రమంలో, బాల కార్మికుల దయనీయత, మత దురహంకారపు విలయ తాండవం, పాశ్చాత్య విద్య పట్ల ప్రభావితమై మన భాష మాధుర్యానికి దూరమైపోతున్న చిన్నారుల భవిత గురించి బాధ, ఖడ్గ తిక్కన, రుద్రమ్మ వంటి ధీర చరితల ప్రస్తావన పుట్టపర్తి గొంతులో దయార్ద్రంగా పలికి, హృదయాలను ద్రవింపజేసేవి.

  జలదానికి మార్గాయాసం తెలియకుండా ఉండేందుకు, పుట్టపర్తి  ఖైదీ రసికత ఉట్టిపడే విధంగా, కోటప్పకొండలోని నీటుగత్తెల సొగసులను, నెల్లూరు నెరజాణల సోయగాలను కూడా వర్ణిస్తుంటే, శ్రోతల మనసుల్లో గిలిగింతలు రేగేవి కూడా!!

        అంతేకాదు, మార్గ మధ్యంలో కనుపించే పుణ్య క్షేత్రాల వర్ణనలూ, చారిత్రక ప్రదేశాల నేపథ్యాలూ కూడా, ఆయా రంగాల అభిమానులను ఆకర్షించేవి.

        ఈ విషయాలన్నీ, తేట తేట తెనుగులో, చక్కని పలుకుబడుల గుభాళింపులతో, జాతీయాలు,సామెతల

పోహళింపుతో నిండి ఉండటం వల్ల, అటు భాషాభిమానులను కూడా పూర్తిహా సంతృప్తి పరచింది – పుట్టపర్తి మేఘ

దూతం!!!

       ఈ కావ్య రచన సమయంలోనే రాయలనాటి కవితా జీవనము – వ్యాసం ( పరిశోధన _ ఏప్రిల్ 1954) అల్లసానివారి

అల్లిక జిగిబిగి – వ్యాసం (పరిశోధన జూన్ 1954) వర్ణనా సంవిధానంలో పెద్దన సమ్యమనం – వ్యాసం (పరిశోధన

ఆగస్ట్,సెప్టెంబర్ 1954) పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన్న నేర్పు, రామభద్రుని శయ్యలో ఒయ్యారం  – వ్యాసం

(పరిశోధన అక్టోబర్, నవంబర్ 1954) శ్రీమదాంధ్ర మహాభాగవతము -మహాకవి పోతన రాయల్ అండ్ కో వారి ప్రచురణకు

పీఠిక – ఇటువంటి వ్యాసాలన్నీ ప్రచురితమవటం చూస్తే, పుట్టపర్తి రచనా  స్రవంతికి అసలు విశ్రాంతే

లేదేమోననిపిస్తుంది కదా!!

ఇదే సమయంలో మరోసారి పుట్టపర్తి జీవితం,  ఊహించని మలుపు తిరిగింది!!    

(సశేషం)

****

Please follow and like us:

2 thoughts on “కనక నారాయణీయం-21”

  1. నాగ పద్మిని గారు నమస్కారములు. తల్లి,తండ్రుల యశస్సు నిలిపే మీ రచన చదవటం చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

    1. చాలా సంతోషం ఉదయ లక్ష్మి గారూ..!! ధన్యవాదాలు.ఈ ధారావాహికను ప్రచురిస్తున్న మన నెచ్చెలి గీతా మాధవీ కళ గారికి చాలా ధన్యవాదాలు.

Leave a Reply to ఉదయ లక్ష్మి ముప్పలనేని Cancel reply

Your email address will not be published.