జీవితం ఒకవరం

-తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

మెడ లోని నగలు సవరించు కుంటూ, కొంగుకు ఉన్న జరీ పూవులు బాగా కనబడే లాగా పమిట చెంగును ముందుకు తెచ్చి నడుము దగ్గర దోపుకుంటూ హడావిడిగా కళ్యాణ వేదిక వైపు కదులు తున్న ముత్తైదువులను చూస్తూ చిన్నగా నిట్టూర్చింది నీరజ.
               ఒంటి మీద ఉన్న పట్టు చీర, మెడలోని హారం బరువుగా తోస్తున్నాయి. సాదాగా వుండే చీర కట్టు కుంటూ వుంటే , కూతురు శశి వచ్చి ” పెళ్ళికి మంచిది కట్టుకో” అంటూ అడ్డుకుంది. కాదనలేక శశి చెప్పినట్టే తయారయింది.
“ఎన్నాళ్లు వుంటుందో తెలియని ఈ దేహానికి ఇంకా అలంకారాలెందుకు.” అనుకుంటూ నిరాసక్తంగా వెనక్కి జారగిలబడి కూర్చుంది నీరజ.
                 అసలు ఈ పెళ్ళికి రావడం ఇష్టం  లేదు ఆమెకు. ఈ పెళ్ళికే కాదు ఎక్కడికీ వెళ్ళాలని లేదు. ఎవ్వరినీ కలవాలని లేదు. కానీ శశి అమ్మ మాట ఒప్పుకో లేదు. 
       ” నీ ఆలోచన తప్పు అమ్మా! నువ్వలా తలుపులు బిగించుకుని లోపల కూర్చుంటే సమస్య తీరిపోదు. ఒంటరిగా వుంటే కుంగుబాటుకు లోనవుతారు అంటారు. మనిషి అన్న తరువాత రోగాలు రావా? ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి అయ్యావు. బయటికి వచ్చి నలుగురితో కలవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.” అంటూ నచ్చచెప్పి తీసుకు వచ్చింది.
              ” అమ్మా! ఇంకా ఇక్కడే కూర్చున్నావా. పద అక్కడ ఎదురుకోలు మొదలవుతూ వుంది. “అన్నది అప్పుడే అక్కడకు వచ్చిన శశి.
                  అక్కడ జరుగు తున్నది తన బావగారి మనవడి  పెళ్లి. నిజానికి తాను ముందు వుండి  ఉత్సాహంగా పాలు పంచు కోవాలి. ఇంకా దేనికి ఈ బంధాలు , బాంధవ్యాలు అన్న వైరాగ్యం                   నీరజ మనసు నిండా. ఈ నడుమ గురువు గారి మాటలను మననం  చేసుకుంటూ ఉంటుంది” ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు.” అని.                                                           శంకరులు నిర్వాణ షటకం లో చెప్పిన వేదాంత సారాంశాన్ని సద్గురు సామాన్యుల  కోసం రెండు వాక్యాలలో చెప్పి నట్టున్నారు.         
శంకరాచార్యుల వారు తన ఎనిమిదవ ఏట   తగిన గురువు కోసం వెదుకుతూ హిమాలయాల లో వెడుతుంటే స్వామి గోవిందపాద ఆచార్య ఎదురై “నీవెవరు? “ అని ప్రశ్నించారట.  సమాధానంగా శంకరులు నిర్వాణ షటకము జవాబుగా చెప్పారుట.     
  ‘మనసు, బుద్ధి, అహంకారము, చిత్తముఇవేవీ నేను కాదు. పంచఇన్ద్రియాలు నేను కాదు. పంచ భూతములు నేను కాదు. చిదానంద రూపుడైన శివుడిని నేను” అంటూ ఆత్మ స్వరూపాన్ని వివరించారట.
                        అయినా శరీరం మీద మమకారం అంత సులభంగా నశించి పోతుందా? ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది .
”  అమ్మా!    అలా ఎక్కడో వెనకాల ఉండి పోతావేమిటి. ముందుకురా.” శశి వచ్చి చేయి పట్టుకుని ముందుకు తీసుకు పోయింది.
నిరాసక్తం గానే కూతురు వెంట నడిచింది.
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేతిలో పూల హారాలతో చెరి ఒక వైపునుండి వస్తుంటే వాళ్ళ వెంట ఇరుపక్షాల బంధువులు వధూ వరులను ఆట పట్టిస్తూ నెమ్మదిగా ముందుకు కదులు తున్నారు.   
                   పెళ్లికుమార్తె పక్కనే నడుస్తున్న ఒక పెద్దావిడ “అంత తొందర పడితే ఎలా పిల్లా? కాస్త బెట్టుగా ఉంటేనే మొగుడిని కొంగుకు కట్టేసుకో గలవు . వాళ్ళు నాలుగు అడుగులు ముందుకు వేస్తే నువ్వు ఒక్క అడుగు వేయాలి తెలిసిందా ? అంటూ నోటి నిండా నవ్వుతోంది.
                    ఆమె వయసు ఎనభై ఏళ్లు ఉండవచ్చు.  చామన ఛాయలో, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నెరిసిన జుట్టు, జరీ అంచు ఉన్న నేత చీరలో కుదిమట్టంగా వుంది. మెడలో నల్ల పూసల దండ, చేతికి మట్టి గాజులు.  అంతలోనే ఆమె పాటఅందుకుంది.” అడుగు అడుగునా అత్తరులు జల్లరే ఆది దేవునికి” అంటూ. ఆ గొంతులో కొంచెం వణుకు తెలుస్తున్నా ఆమె ఉత్సాహం దాన్ని అధిగమించింది .   
                 అడుగులు తడబడే ఆ వయసులో ఆవిడ చూపిస్తున్న చొరవ, ఉత్సాహం అందరిలో కొత్త ఆనందాన్ని నింపింది. అత్తరు, బుక్కా చల్లి నవ్వులు  పువ్వులు కురిపించారు.
ఈ తతంగం ఎప్పుడు అయిపోతుందా వెళ్ళి ఒక పక్కన కూర్చుందామా అని విసుగ్గా ఎదురు చూస్తోంది నీరజ.       
వధూవరులు ఒకరికి ఒకరు పూల దండలు వేసుకోవడంతో ఆ తంతు ముగిసింది. 
     ఆ తరువాత జరిగిన గౌరీ పూజ, కాశీ యాత్ర , ముహూర్తం సమయం లోను ” రామ చక్కని సీతకు అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకు ఇంకెవరు మొగుడంట , ఎడమ చేతినా శివుని విల్లు  ఎత్తిన రాముడే ,ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళ ” అంటూ ఆ  ముసలావిడ ఆలపించినా,” ఆనంద మానంద మాయెనే మా సీతమ్మ పెళ్లి కూతురాయెనే మా రాముడు  పెళ్ళికొడుకాయనే  పచ్చ పచ్చని పందిళ్ల లోన హెచ్చైన రాములవారు వచ్చి కూర్చున్నారు” అని అందుకున్నా  “,సీతా కళ్యాణ వైభొగమే,రామ కళ్యాణ వైభొగమే, మూడు దోసిళ్ళ  ముత్యాలు ముంచి శ్రీరామ సీతపై తలంబ్రాలు వుంచే, మాలలు మార్చిరి మహీపతులు చూడ ,బాల లందరు కూడి చాల పాటలు పాడి”అని అందుకున్నా చుట్టూ వున్న ముత్తైదువులు ఉత్సాహంగా గొంతు కలపడం గమనిస్తూ ఒక పక్కగా కూర్చున్న నీరజ ” ఈ వయసు లోను ఇంత ఆనందం గా ఉన్న ఈవిడ ఎంత అదృష్ట వంతురాలు” అనుకుంటూ చిన్నగా నిట్టూర్చింది .
           “ అమ్మా పద భోజనం చేద్దువు ఆలస్యమైతే నీరస పడతావు .” అని చేయి పట్టుకుని లేవదీసాడు కొడుకు.
” అవును నానమ్మా. నీ పక్కనే నేను కూర్చుంటాను సరేనా?” ముద్దుగా అంటూ మరో చేయి పట్టుకుంది పదేళ్ళ మనవరాలు.
               భోజనం ముగించి వచ్చేస్తుండగా ఆ పాటలు పాడిన పెద్దావిడ( ఆమె పేరు లలితమ్మ అని కూతురు చెప్పింది )  భోజన శాల  వెనకాల, అందరు చేతులు కడుక్కునే చోట ఒక పని మనిషితో మాట్లాడుతూ కనబడింది.
            ఆమె ఎంగిలి ఆకులుఎత్తి బల్లలు తుడుస్తుంటే దెబ్బ తగిలి ఏడ్చుకుంటూ వచ్చాడట కొడుకు. మూతి పగిలి రక్తం కారుతుంటే పని వదిలేసి వాడిని కొళాయి  దగ్గరికి తీసుకు వెళ్ళి కడిగి ఒక పక్కన కూర్చో బెట్టి మళ్లీ పనిలోకి దిగిందట. అందుకని వంట మాస్టారు బాగా తిట్టాడుట.
           ఏడుస్తూ చెప్తున్న ఆమె   భుజం మీద  చేయి వేసి ఓదారుస్తోంది లలితమ్మ. ” ఆయన ఏదో పని తొందరలో కోప్పడి ఉంటాడు. మరో బంతికి వడ్డన ఆలస్యమైతే జవాబు తానే చెప్పాలి కదా! పిల్ల వాడికి దెబ్బ తగిలిన సంగతి తెలిస్తే అతను అర్థం చేసుకుంటాడు. “అని.                               
                నీరజ ముందుకు నడుస్తూ కొడుకుతో “నాకు అలసటగా ఉంది. ఈ గలాభాకు దూరంగా కాసేపు విశ్రాంతి తీసు కోవాలనిపిస్తోంది. ” అన్నది.
” మనకు ఇచ్చిన గదికి వెళ్ళి పడుకోండి అత్తయ్యా .” అంది కోడలు. తన మేనకోడలినే కోడలిగా తెచ్చుకుంది నీరజ.
“ఇక్కడ మనకు ఇచ్చిన గదిలో పడుకున్నా అందరూ వచ్చి మాటలు మొదలు పెడతారు ” ఆరోగ్యం ఎలా వుంది? అంటూ. విసుగ్గా అంది నీరజ.
పక్కనే నడుస్తున్న లలితమ్మ ” మా ఇల్లు నాలుగు అడుగుల్లో ఉంది. నాతో రండి . కాసేపు పడుకుని  మళ్లీ రావచ్చు.” అంది చొరవగా.
                 పక్కనే ఉన్న శశి ” అవునమ్మా! నువ్వు పెద్దమ్మ గారితో వెళ్లు. నాన్నగారికి నేను చెప్తాను” అంది దూరంగా వస్తున్న వాళ్ళ నాన్నను చూస్తూ. 
“దగ్గరే అయితే నడిచే పోవచ్చు” అంటూ ఆమెను  అనుసరించింది నీరజ.                                 
           పెళ్లి జరిగిన సత్రం వెనకాలే వుందిలలితమ్మ గారి ఇల్లు. తలుపు తీసుకుని లోపలికి అడుగు పెడుతుండగానే కుయ్ కుయ్ అంటూ ఆమె కాళ్ళకు అడ్డం పడింది చిన్న కుక్క పిల్ల.
” కాలు నొప్పి తగ్గిందా బుజ్జి కొండా! నిన్నటి రోజంతా అల్లాడి పోయావు” అంటూ దాని మెడ నిమిరింది లలితమ్మ. 
                ” నిన్న ఎవరో దుడుకు కుర్రాడు సైకిలు మీద పోతూ దీని కాలికి కొట్టి పోయాడు. నొప్పికి ఇది ఒకటే అరుపు. ఇంట్లోకి తీసుకు వచ్చి  ఏదో మందు పూసి, నాలుగు మెతుకులు పెట్టాను. అంతే ఇల్లు విడిచి పోవడం లేదు.” నవ్వు ముఖం తో చెప్పింది  నీరజకు.
              దగ్గరగా వేసి ఉన్న తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టింది” రండి” అంటూ. 
కొంచెం చీకటిగా ఉన్న ముందు గదిలో ఒక పక్కగా ఉన్న మంచం మీద ఆమె భర్త కాబోలు పండు ముసలాయన పడుకుని ఉన్నాడు. 
     అటువైపు బల్ల మీద ఉన్న టీవీ చిన్నగా మోగుతోంది. వాళ్ళు లోపలికి రాగానే ఆయన లేచి కూర్చున్నాడు. భార్య ను చూసి ఆయన ముఖంలోకి వెలుగు వచ్చింది.   
          ” మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి.”  అంటూ నీరజను  పడక గదిలోకి పిల్చుకుని వెళ్ళింది. ఉతికిన దుప్పటి పరచిఉంది మంచం మీద. 
        ” మీరు పడుకోండి. నేను ఆయనకు అన్నం పెట్టి వస్తాను. ఆయనసాయం లేకుండా ఏ పనీ చేసుకోలేరు. ” అని చేతిలోని కారియరు చూపిస్తూ చెప్పింది. 
    ” పోనీలెండి మీరు ఆరోగ్యంగా వుంటే ఆయనను చూసుకోవచ్చు..” అంది నీరజ.
“ఇది సక్రమంగా పని చేసినంత వరకు బండి నడుస్తుంది. ” తన గుండె మీద తట్టి చూపుతూ అంది ఆమె. ” పేస్ మేకర్ పెట్టి పదేళ్ళు అయ్యింది. ” నిబ్బరంగా చెప్పింది లలితమ్మ .
    “అయ్యో! అలాగా! “అంది నీరజ!
“ఈ దేహంలో ఆ పరమాతుడు ఉన్నంత వరకు దీనికి పూజలు తప్పవు కదా ! “అని నవ్వి తలుపు దగ్గరగా వేసి బయటకు వెళ్ళింది.
          పరుపు మీద వాలింది నీరజ. మెత్తగా ,హాయిగా వుంది. లూయీ హేమాటలు గుర్తుకు వచ్చాయి నీరజకు. ” మీ చుట్టూ ప్రేమను నింపండి. మీరు పడుకునే పరుపుకు, వండుకునే స్టవ్ కు కృతజ్ఞతలు చెప్పండి” అంటుంది ఆమె. 
“ప్రతీ రోజు ఒక కొత్త ప్రారంభమే. ఒక కొత్త అనుభవమే. మీ ప్రతి ఆలోచన మీ భవిష్యత్ ను తీర్చిదిద్దు తుంది. మంచి ఆలోచనలు చేయండి. మీ శరీరం లోని ప్రతి కణము మీ ఆలోచనలను వింటుంది. ” అంటుంది ఆమె పాజిటివ్ అసర్షన్  గురించి చెప్పుతూ.   
ఎన్ని చదివినా , విన్నా, తనదాకా వస్తే , శరీరము ‘నేను అశాశ్వతమైనదాన్ని   ‘అని గుర్తు చేస్తే నిర్వేదానికి  లోను కావడం తప్పదేమో ” ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది నీరజ.   
              సాయంకాలం ఆరు గంటల దాకా గాఢ నిద్ర పోయింది నీరజ. లేచి ముందు గదిలోకి రాగానే ఫ్లాస్క్ లోని టీ గ్లాసు లోకి పోసి అందించింది లలితమ్మ. 
టీ తాగుతూ ” మీ పిల్లలు? ” అని గోడ మీద ఫొటోల కోసం చూసింది నీరజ.
               ” నాకు ఆయన, ఆయనకు నేను పిల్లలం అన్నది ఆమె. ” దేవుడు ఆయుర్దాయం ఇచ్చాడు. ఏ పెద్దలొ దీవించిన ”    పశ్చామ శరదశ్శతం  ,జీవామ శరదశ్శతం, నందామ  శరదశ్శతం, మోదామ శరదశ్శతం  దీవెన కాబోలు. పంచేంద్రియాల స్వాధీనంలో వుండగానే దాటుకుంటే చాలు.” అంది నవ్వుతూ.
       “ఆయనకు వచ్చే పింఛను మా ఇద్దరికి చాలు. ఈ చిన్న ఇల్లే మాకు రాజ ప్రాసాదం. ఇంకేమి కావాలి? ” అంది మళ్లీ తనే.
           నీరజ  ముఖం కడుక్కుని వచ్చేసరికి ఆమె ఇంటి ముందు వున్న చెట్లకు నీళ్ళు పోస్తున్నది. 
ఆకు సంపెంగ చెట్టు దగ్గరకు రాగానే గాఢంగా వాసన పీల్చి ” పువ్వు విచ్చినట్టు వుంది ” అంటూ కొమ్మ వంచి వెదక సాగింది. 
“ పొద్దున్న నుండి నా తలలో వున్న జాజి పూల వాసన నేను ఆస్వాదించనే లేదు” అనుకుంది నీరజ .
ఆకులో ఆకుగా దాక్కున్న పువ్వుని జాగ్రత్తగా కోసి అందించింది లలితమ్మ. ” మన మనసులో ఏది అనుకుంటే ఆ వాసన వస్తుందిట. అందుకే మనోరంజితం అని అంటారేమో” ” అంది అపురూపంగా దాన్ని చూస్తూ . 
      ”    ఈ సంపెంగ, ఆ మల్లి, మందార చెట్లు నా స్నేహితులు. వాళ్ళతో మాట్లాడటం కాలక్షేపం .” మురిపంగా  చెట్లను చూస్తూ చెప్పింది.
” రాత్రికి వధూవరులకు  బువ్వంబంతి కదా! వియ్యాలవారి భోజనాలకు అరటి ఆకుల ముందు  ముగ్గులు వేయాలి . మనం బయలు దేరుదామా ” అంటూ లోపలికి వెళ్ళి పెద్దాయనకు జాగ్రత్తలు చెప్పి వచ్చింది. 
           ఇద్దరూ మెల్లిగా నడుస్తూ సత్రం దగ్గరకు వచ్చారు    గేటు ముందు ఒక పదహారు ఏళ్ల అబ్బాయి ఆమెను ఆపాడు.
      “ అవ్వా రేపు నాకు మీ ఇంట్లో వారం ” సంకోచంగా  గుర్తు చేశాడు.
” తప్పక రా నాయనా ” ఆప్యాయంగా చెప్పింది లలితమ్మ. 
” పేదవాడు. తండ్రి లేడు.   బాగా చదువుతాడు. మాకున్నదానిలో వాడికి ఒక పూట భోజనం పెడతాము. ఆయన టీచరు గా చేసి రిటైర్ అయ్యారు.” వివరించింది ఆమె.
                 నీరజ ఆలోచనలో పడింది. ” ఆమె చాలా అదృష్ట వంతురాలు, వడ్డించిన విస్తరి వంటి జీవితం అనుకుంది తాను. కానీ వాత్సవం వేరుగా వుంది. చిన్న ఇల్లు, పిల్లలు లేని ఒంటరి జీవితం, చాలీ చాలని పింఛను .   ఇవి చాలనట్టు గుండె జబ్బు.     అయినా ఆమె తోటి మనిషి దుఖాన్ని పంచుకుంది. జంతువును కూడా కరుణతో చేరదీసి ఆదరించింది. తనకు ఉన్న దానిలో బీద పిల్లవాడికి అన్నం పెడుతోంది. పూల సువాసనలు, వెన్నెల వెలుగులు ఆస్వాదిస్తున్నది. ఈ రోజు నాది అని జీవిస్తున్నది “ .
               మౌనంగా ఆమెతో కలిసి కళ్యాణ మండపం లోపలికి నడిచింది .
          బువ్వంబంతి సమయంలో అరిటాకుల ముందు ముగ్గులు వేసి , రంగులు నింపింది లలితమ్మ. .వయసులో ఉన్న వారితో పోటీ పడుతూ  ప్రమిదలలో దీపాలు వెలిగించి ఆకుల ముందు వుంచింది . సమయానుకూలం గా ” మీనాక్షి సుందరేశ కళ్యాణ మండపం లో భోజనం చేయ రారండి .”  అని పాట అందుకుంది .

అంపకాల సమయంలో ” సీతమ్మ మీ యత్తా వారింటికి వెళ్ళి భూతల మందున ఖ్యాతి చెందవమ్మా” అని పాట అందుకుంది లలితమ్మ. 
కొత్త దంపతులను శోభనం గదిలోకి పంపి ఇంటికి బయలు దేరింది. వెళ్లే ముందు ప్రత్యేకంగా నీరజ కు వెళ్లివస్తానని చెప్పింది.     చేతిలో ఆడపెళ్లి వారు పెట్టిన చీర, ధోవతుల పేకెట్ వుంది.  ఆమెతోబాటు గేటు దాకా వచ్చింది నీరజ. 
” రేపు పౌర్ణమి. అప్పుడే చంద్రుడు చూడండి నిండుగా మెరిసి పోతున్నాడు. పున్నమి నాడు శ్రీ లలితాదేవి చంద్రుడిలో  వుంటుందిట. అందుకే ఆరోజున సంధ్య వేళ లలిత సహస్రనామ స్తోత్రం చదివితే అమ్మవారికి ప్రీతి అంటారు.” ముఖం లో భక్తి భావము, సంతోషం చిందుతుండగా అంది లలితమ్మ.
మళ్లీ ఆమే అంది” సహస్ర చంద్ర దర్శనం అయిపోయింది మా దంపతులిద్దరికి . నాకు బుద్ధి తెలిసిన నాటి నుండి చూస్తున్నాను పున్నమి చంద్రుడిని. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు అనే కాబోలు  శతమానం భవతి ” అని దీవిస్తారు .  అని.   
             ఆమె వెళ్ళి పోయాక కూడా అక్కడే నిలబడి ఆకాశం లో కాంతులు వెదజల్లు తున్న   చందమామను చూస్తూ నిలబడింది నీరజ. 
‘ తాను పెద్ద చదువు చదివింది. బాంకు మ్యానేజర్ గా మంచి పేరు తెచ్చుకున్నది. బుద్ధిగా చదువుకుని పైకి వచ్చిన పిల్లలు, ప్రేమగా చూసుకునే భర్త. డబ్బుకు కొదవ లేదు. రిటైర్ అయిన  వెంటనే జబ్బు పడింది. ఉద్యోగ విరమణ తరువాత ఎన్నో చేయాలి అనుకుంది. చూడాలని అనుకున్న ప్రదేశాలు దర్శించాలని ,  తనకు ఇష్టం అయిన సంగీతం మళ్లీ సాధన చేయాలని .. ఎన్నో …  . ప్రస్థుతానికి కోలుకుంది. ఇక దేనికి ఈ నిర్వేదం?’  ఆలోచనలో పడింది నీరజ. 
           సద్గురుబోధన మనసులో మెదిలింది. ‘ జీవించడం అంటే పొద్దున్న ఉపాహారం,మధ్యాహ్నం భోజనం, రాత్రి ఫలాహారం కాదు. చుట్టూ వున్న ప్రకృతి తో మమేకం కావడం.  అనుభూతి చెందడం ,ఎరుక కలిగి జీవించడం  .ఉదయించే సూర్యుడిని, వికసించే పువ్వుని చూస్తున్నారా’ .  అని..అడుగుతారు ఆయన .
            “భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం” అన్న సామాన్యుని పదాలను ” శరత్చంద్ర చంద్రికా ధవళమ్ దధి ” అని చేర్చి కాళిదాసుకవిత్వం గా మార్చినట్టు, ఎరుకతో బ్రతికినప్పుడు జీవించడం ఒక కళగా మారుతుందేమో! అప్పుడు జీవితం ఒకవరం అవుతుంది.
మన పెద్దలు దీవించే “శతమానం భవతి” అనే దీవెన లోని అంతరార్థం ఈ ఎరుక కలిగి జీవించమనే కాబోలు. 
     ” ప్రయాణం లో ఇది ఒక చిన్న కుదుపు అమ్మా! ముందుకు పోవడమే జీవితం” అని ఎంతచక్కగా చెప్పింది కూతురు.
” నిజమే నాకు ఈ జన్మనిచ్చి, ఇన్ని వరాలు ఇచ్చిన పరమాత్మకు, పరమాణు రూపుడికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? ”  అనుకున్న  నీరజ మనసు నిండా ప్రశాంతత అలముకుంది.
               ”   అమ్మా! ఏమిటి ఏదో ఆలోచనలో పడి అలా నిలబడి పోయావు?” నీరజను వెతుకుతూ వచ్చిన కూతురు అంది.
” రేపు ఆ లలితమ్మగారిని అడిగి ఆవిడ పాడిన పెళ్లి పాటలు రాసుకోవాలి” ఆలోచనల నుండి బయటకు వచ్చి అన్నది నీరజ.
” ఎందుకోసం అమ్మా ? ” ఆశ్చర్యంగా అడిగింది శశి.
” నా మనమరాలి పెళ్ళికి నేను పాడొద్దూ” అని నవ్వింది నీరజ.
      “ అన్నట్టు పేద విద్యార్థులకు బాంక్ పరీక్షలకు వుచితంగా కోచింగ్ క్లాసులు తీసుకుంటారా అని అడిగిన  సరస్వతి సెంటర్ వాళ్ళకు ఫోన్ చేసి నేను ఒకటోతారీఖు నుండి వస్తానని చెప్పాలి.” సాలోచనగా అంటూ అడుగు ముందుకు వేసింది నీరజ.   
        ” ఎలా వచ్చింది ఈ మార్పు?”అన్నట్టు అమ్మ వైపు ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది శశి .

******

Please follow and like us:

8 thoughts on “జీవితం ఒకవరం (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)”

  1. Chaala ardhavanthagaa alochinchelaa baaga raasaru. Jeevithanni sadviniyogaparachatam oka pedda art. Manchi inspiration ichharu. Thank you

  2. చిదానంద రూపం శివొహం శివొహం! What a wonderfully inspiring shatakam to draw into your story! A very poignant story with insightful peeks into some slices of a పండిన life of a wise woman. You continue to be the gifted storyteller with incisive insights into the cosiest corners of life.

  3. Very well written Meera, let us keep our lives productive in a positive manner, as long as we live !

Leave a Reply

Your email address will not be published.